సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మొదటి సంపుటము/ఆంధ్రలిపి పరిణామము

ఆంధ్రలిపి పరిణామము  :- 'లిపి' అను పదమునకు తెనుగున వ్రాఁత అని అర్ధము. వ్రాయు ధాతువునకు కృదంతరూపమే “వ్రాఁత". వ్రాయు అనుదానికి 'వ్రా’ అనునది తొలిరూపము. ఇదివరై అను ద్రవిడధాతువు నుండి పుట్టినది. కావుననే తోడి భాషలగు తమిళమున 'వరై' అనియు, కన్నడమున 'ఐరె' యనియు, మలయాళమున 'వరె' అనియు, దీనికి రూపములుగలవు. వీటిలో కన్నడమున గల బరె అనునది తెలుగున నేటికిని వ్యవహారమున నున్నది. 'నీ కైదు బర్లు వచ్చినవా ?' అని ప్రశ్నించుట పరిపాటియై యున్నది.

'వరై' అను మూల ద్రవిడధాతువు తెలుగున వా' అయినది. దానికి రేయి ప్రభృతులవలె బహువచన ప్రత్యయము 'లు' చేర్పగా వ్రాలు అయినది. వ్రాత మూలమున భాషలోనున్న, అక్షరముల స్వరూపము మనకు గోచరమగును. కాబట్టి వ్రాలు అనగా అక్షరములు అను సంజ్ఞ యేర్పడినది.

నేటి తెలుగు భాషలోని అక్షరములన్నియు గుండ్ర దనము గలిగి అన్నియును హెచ్చుతగ్గులులేక నొకేతీరుగా నుండి వ్రాతలో ముచ్చట గూర్చుచుండును. తెలుగు లిపిని చూచుటతోడనే యొ కేరకమునకు జెందిన ముత్యము లేక సూత్రమున కూర్పబడినట్లు మనోహరముగా నుండును. తెలుగు వ్రాతను మన పూర్వులొక కళగా పరిగణించిరి. దానిని తీర్చి దిద్దుటకు వారెంతయో పరిశ్రమ చేసిరి. వారి దృష్టిలో మనోహరములైన ఊహలను దాచుటకు తెలుగక్షరములు బంగారపు బరిణెలవంటివి. కావుననే గుండ్రకత్తుగా వాటిని మలచిరి. ఈ అక్షర స్వరూపమునకు తగినట్లే తెలుగుభాషయు మాధుర్య గుణమున మన్నన కెక్కినది. అక్షరముల తీరు, భాష యొక్క తీయదనము అవినాభావసంబంధము గలిగిన వగుటచే తెనుగు తీరు తీయములు గల భాషయైనది. "తీరును తీయముంగలుగు తేట తెనుంగను” వ్రాల పూలతో తెలుగు తల్లిని కవులు పూజించిరి. తీయదనము గలిగియుండుటచే వీనులకు విందు, తీరుదనము గలిగి యుండుటచే కనులకు పండుగ. ఇట్లు శ్రోత్రేంద్రియ, నేత్రేంద్రియములకు ఏక కాలమున నానంద మొద వించునది తెనుగుభాష

మనోహరమగు తెలుగులిపినిగూర్చి ప్రాచీనకాలము నుండియు కవులు విశేషముగ ప్రశంసించియున్నారు.

ఉ. వ్రా లివిగోఁ గనుంగొనుము
       వన్నియమీఱఁగ వ్రాల కేమి నా
వ్రాలు సుధారసాలు కవి
       రాజుల కెల్ల మనోహరాలు వ

జ్రాలు సరస్వతీ విమల
       చారు కుచాగ్ర సరాలుఁ జూడఁ జి
త్రాలు మిటారి మోహన క
      రాలు నుతింపఁ దరంబె యేరికిన్. చాటువు.

సీ. ఆణిముత్తెముల సోయగము మించినవ్రాలు
       వరుసతో నిరుగేల వ్రాయనేర్చె.

జక్కన - విక్రమార్క చరిత్ర (సిద్దనమంత్రిఁ గూర్చి చెప్పినది.)

సీ. ఆణిము త్తెంబులై యపరంజి మువ్వలై
       కనుపట్టు వ్రాల చొక్కపుమెఱుంగు

(మించుపల్లి - తెలుఁగు పొలుపు.)

సీ. పట్టె వట్రువయును. ......
       వృద్ధి ప్రియంబును విశదగతియు.

గీ. గీలు కొన వ్రాయనంబులు వ్రాయ వ్రాయఁ
గొంకు కొసరులు చేతప్పు గొనకయుండు
లలిత ముక్తా ఫలాకార విలసనమున॥

పాండు 1.72.

అని రామకృష్ణకవి వేదాద్రిమంత్రి లేఖన నైపుణ్యమును ప్రస్తావించినాడు.

ఇట్టి గుండ్రమైన స్వరూపమును దాల్చిన తెలుగులిపి చరిత్రను పరిశీలించినచో నది తొలుత చతురస్రముగా అనగా నేటి దేవనాగర లిపివలె నలుచదరముగా నుండిన వ్రాతనుండి పరిణామము చెందినదని తెలియును. కాని ఈ సందర్భమున మొదట 'లిపి' 'వర్ణము' 'అక్షరము' అనువాటి రూప నిష్పత్తులను గూర్చి తెలిసికొనుట అప్రస్తుతము కాదు.

లిపి  :- “లిఖితాక్షర సంస్థానే లిపిర్లిఖి రుభేస్త్రియౌ" అని యమరము. (ద్వి. కాం. క్షత్రవర్గము 16.) దీని తెలుగు వ్యాఖ్యలో నిట్లున్నది:- ఇచ్చట లిఖితం అక్షర సంస్థానం అని విభాగించి ఈ నాలుగు శబ్దములు లిపికే పేళ్ళని కొందరు, లిఖితాక్షర విన్యాసే అనుపాఠమునందు, లిఖితా, లిపిః, లిఖిః - ఈ మూడును వ్రాత పేళ్లు. లివ్యతే౽న యాపత్రం లిపిః. లిఖిశ్చ - ఇ. సీ. లిపి, ఉపదేహే. దీని చేత పత్రము పూయబడునది గనుక లిపి, పా. లిపీ. లిబీ. ఈ.సీ. 1. 2. వ్రాయబడిన అక్షరముల యాకారము పేళ్లు (వ్రాఁత).

వర్ణము  :- వర్లో ద్విజాదౌ శుక్లాదౌ స్తుతా వర్ణంతు వాక్షరే. (తృ. కా. నా. వ. 49) వర్ణ్యతే వర్ణయతి చ వర్ణం వర్ణస్తుతౌ; కొనియాడ బడునది : ‘కొనియాడునది గనుక వర్ణము'.

“వర్ణస్తాల విశేషేస్యాద్ బ్రహ్మచర్యే విశేషణే ; విలేపనే కుథాయాంచ" ఇతి శేషః.

అక్షరము  :- “అక్షరంతు మోక్షే౽పి" (తృ. కా, నా. వ. 4183.) మోక్షమునకును, అపిశబ్దమువలన కకా రాది వర్ణములకును పరబ్రహ్మమునకును పేరు, “నక్షర తీత్యక్షరం" క్షర సంరక్షణే చెడనిది గనుక అక్షరము. “వర్ణే బ్రహ్మణ్యక్షరం స్యాత్." ఇతి శేషః.

పై వాటి వివరణము నీ క్రింద పొందుపరచుచున్నాను: ధ్వని 'క్షరము' నశించునది. లిపి అక్షరము స్థిరముగ నుండునది. ధ్వని అవర్ణము, లిపి వర్ణము, ఇట్లు లిపిని బట్టియే, లిపి వచ్చినతరువాతనే 'అక్షర' 'లిపి' శబ్దములు భాషలోనికి వచ్చినవి. ఇట్లని మొదట లిపిసూచకములు తరువాత సాహచర్యముచే ధ్వనిసూచకములు కూడనయ్యెను మొదట అవర్ణమనగా అకారపువన్నె (రంగుతో వ్రాయబడిన ప్రతిమ) యని యర్థము, తరువాత నది అకార ధ్వనిని కూడ సూచింపదొడగెను. వర్ణపదము సంస్కృత భాషయందు 'రంగు' అను నర్థముగలది. అది క్రమముగా జాతివాచకము, అక్షరవాచకము నయ్యెను. కొందరు ఎర్రగను, కొందరు నల్లగను ఉండగా వారిని వేరువేరు జాతులుగా నేర్పరచినందున 'వర్ణ' పదమునకు జాత్యర్థము సంప్రాప్తమయ్యేను. అక్షరములు నల్ల రంగుతో వ్రాయుట వలన వానికి వర్ణనామము వచ్చెను. లిపివాచకమైన వర్ణపదమునకు వేరు వ్యుత్పత్తిలేదు. మొదట వ్రాసెడు వాటికి వర్ణములనియు, చెక్కెడు వాటికి అక్షరములనియు పేర్లు ఏర్పడియుండును. క్రమముగా నవి సమానార్థకములై లిపితోపాటు ధ్వనినిగూడ బోధింపదొడగెను. లిపి పుట్టుటకు పూర్వము భాషయందు ధ్వని సూచక వర్ణము లెట్లు వ్యవహృతము లగుచుండె ననిన, స్వరములు అన్న పద మీయర్ధమున వాడబడుచుండె ననుట సమంజసము, తరువాతికాలమున నీపదము అచ్ పర్యాయమైనది. కాని సంగీతశాస్త్రమున స్వరము అను పదము కేవలము ధ్వని పరముగనే యుప యుక్తమగుచున్నది. దీనినిబట్టి వర్ణాక్షర శబ్దములు ఏనాడు భాషలోనికి వచ్చినవో ఆ నాటికి కొంతకాలమునకు పూర్వముననే ఆ భాష గలదేశమునందు లిపి యుండియుండు ననుట స్పష్టము.

లిపి చరిత్రనుబట్టి చూడగా మనదేశములో స్థూలముగా రెండువిధములగు లిపులు వెలసినవని చెప్పవచ్చును. ఒకటి- ఖరోష్టి లిపి. ఇది కుడివైపునుండి యెడమవైపునకు వ్రాయబడును. రెండవది. బ్రాహ్మీ లిపి. ఇది యెడమ వైపునుండి కుడివైపునకు వ్రాయబడును. ఈ రెండింటిలో బ్రాహ్మీలిపియే మనదేశమున బాగుగా వ్యాపించి ప్రచారములోనికి వచ్చినది. మన దేశమున ప్రప్రథమమున లభ్యమయిన శిలాశాసనములు అశోకుని కాలమునాటివి. అంతకుపూర్వమే బ్రాహ్మీ లిపియందు కొన్ని పరిణామ దశలు సంభవించియుండును. వాటి చరిత్ర పూర్తిగా తెలిసికొనుటకు సాధన సామగ్రి లభింపలేదు. నే డతి ప్రాచీనములగు మొహంజెదారో, హరప్పా మొదలగు స్థలములలో దొరకిన శిలాఫలకములందలి లిపి బ్రాహ్మీలిపి యొక్క పూర్వస్వరూపమును కొంతవరకు తెలియజేయుచున్న దని యూహించుట కవకాశ మున్నది. అయితే, ఇది ఔత్తరాహిక భాషలకు సంబంధించినది.

మన తెలుగుభాష దాక్షిణాత్య భాషావర్గమునకు సంబంధించినది. కాని ఈ భాగమును కూడ తొట్టతొలుతగా లిపి బద్ధము చేయబడిన శాసనములలో అశోకుని శాసనములే ప్రాచీనతమములు. తర్వాత వెలసిన భిన్నభిన్న ప్రాంతములలోని శాసనములందలి లిపిని పరిశీలించిచూడగా, దాక్షిణాత్యలిపులకు కూడ మాతృక అశోకుని శాసన లిపియే యని వ్యక్తమగును. దీనినే మౌర్యలిపి అనికూడ నందురు. ఈ లిపుల పరిణామము ఈ క్రింద చూపబడినది :


దాక్షిణాత్యలిపులకు అశోకలిపియే మూలాధార మనియు నిది బ్రాహ్మీలిపినుండి పుట్టినదనియు ముందు చెప్పియుంటిని. ప్రాచీన శాస్త్రములలోని కొన్ని పదములనుబట్టి తెలుగుభాషలో క్రీ.శ. 350 నాటికి లిపి యేర్పడినదని చెప్పవచ్చును. దీనిని వేంగీలిపి అని అందురు. ఆ లిపి క్రీ. శ. 900 నాటికి పూర్వ చాళుక్యలిపిగా పరిణ మించినది. క్రీ. శ. 1000 ప్రాంతమున గల లిపిని సంధి కాలపు లిపి అని యనవచ్చును. ఆ వెనుక క్రీ. శ. 1300 ప్రాంతమునాటికి ప్రాత తెలుగులిపి యేర్పడినది. అప్పటి నుండి నేటివరకు తెలుగులిపిలో మార్పు కలుగలేదు.

మన వాఙ్మయచరిత్రనుబట్టి చూచినచో రేనాటి చోళుల శాసనములు వేంగి లిపిలోను, అద్దంకి, ధర్మవరము శాసనములు పూర్వ చాళుక్యలిపిలోను, నన్నయ కాలపు శాసనములు సంధి లిపిలోను కానవచ్చుచున్నవి. తిక్కన కాలమునాడు పూర్ణపరిణతినందిన తెలుగులిపి కానవచ్చు చున్నది. తిక్కన కాలము మహాభారత రచనచే వాఙ్మయ పరిణామ దృష్టిలో మహత్తరమైనది. లిపి పరిణామదృష్టిని గూడ నిదియొక చరిత్రాత్మక ఘట్టము. ఏలయన, ఇంత వరకు తెలుగు కన్నడముల కొకేలిపి యుండెడిది. అనగా నన్నయభట్టు ఉపయోగించిన లిపియందే కన్నడకవిత్రయపు వారి రచనలును వ్రాయబడినవి. తిక్కన కాలమున తెలుగు లిపి ప్రత్యేక స్వరూపము దాల్చి కన్నడమునుండి వేరుపడి నది. కొంత కాలము తెలుగు కన్నడముల కొకేలిపి యుండిన కారణముననే నేటికికూడ కొన్ని తెలుగు తాళపత్ర ప్రతులు కన్నడలిపిలో కానవచ్చుచున్నవి. తిక్కన కాలమునాటి పాత తెలుగులిపి శ్రీనాథుని కాలమునాటికి వ్రాత పరికరముల కారణమున సర్వాంగ సుందరమై ముత్యాలచాలువలె ముచ్చట గూర్ప సాగినది.

తెలుగులిపి తొలుత నలుచదరముగ నుండెడిదనియు, ఆ వెనుక గుండ్రదనముకలిగి లిపిగా పరిణామము పొందిన దనియు, ముందు చెప్పబడినది. దీనికి కారణము మన వ్రాతసాధనములే యని చెప్పవచ్చును. మొదట మన వ్రాతసాధనము - శిల - లేక రాయి. వీటిపైని చెక్కబడిన వ్రాతలకే "శిలాశాసనములు" అని పేరు. ఇది శిలా యుగము లేక రాతియుగము యొక్క చిహ్నము. ఆపైని రాగి రేకులు ప్రచారములోనికి వచ్చి వ్రాతసాధనములై నవి. ఇది లోహయుగము లేక ఇనుపయుగ చిహ్నము అని చెప్పవచ్చును. రాగిరేకులు ప్రచారములోనున్న కాలముననే తాటియాకు ప్రధానమయిన వ్రాతసాధనముగా పరిణమించినది. అప్పుడే చతురస్రముగా నుండెడు మన లిపి గుండ్రదనము దాల్చుచు వచ్చినది.

శిలలపైని, రాగిరేకులపైని ఉలితో అక్షరములు చెక్కెడివారు. చతురస్రముగనుండు లిపిని అట్లు ఉలితో చెక్కుట సులభము - చతురస్రముగ నుండు లిపిలో అక్షరములకు తలకట్లు అడ్డుగీతవలె అనగా ನಿಟ್ಟಿ యాకారముతో నుండును. తాటియాకు ప్రచారము లోనికి రాగానే దానికి ఉలివలె చివర భాగమున నుండి కొంచెము పొడుగుగానుండు మరియొక వ్రాతసాధనము కావలసివచ్చెను. దానినే గంటము అందురు. గంటముతో తాటియాకుమీద వ్రాయునప్పుడు తలకట్లు గీతవలె వ్రాసినచో తాటియాకు చినిగిపోవును. కాబట్టి యవి గుండ్రముగా వ్రాయవలసిన యావశ్యకత యేర్పడినది. దానినిబట్టి అక్షరములకును గుండ్రదన మేర్పడినది.

మన లిపిచరిత్రను పరిశీలించినచో క్రీ. శ. 1000-1050 ప్రాంతము అనగా నన్నయభట్టారకుని కాలమునుండి ఈ గుండ్రదనము ప్రారంభమైన ట్లాతని నందమపూడి శాసనము తెలుపుచున్నది.

తిక్కన కాలమునాటికి మన తెలుగులిపి గుండ్రదనము చేత నొక విశిష్టత సంపాదించినది. దాక్షిణాత్యలిపులలో తెలుగునకు గల యీ విశేషమును, తిక్కన కాలమునాటి కవియగు మంచన కేయూరబాహు చరిత్రమున నిట్లు వ్యక్తముచేసి యున్నాడు.

కృతపతియగు గుండనామాత్యుడు “వాచకత్వము లేఖ నోచితంబును నంధ్రలిపిరితిగా సర్వ లిపులయందు, ఫణితి భాతియుఁ దీవ్రభంగియు" వ్రాయగలిగినవాడట (1-18).

శ్రీనాధుని కాలమునాటికి తెలుగులిపి, యొకకళగా పరిగణిత మైనది. కుడియెడమల రెండు చేతులతోడను వ్రాయగల వ్రాయసకాండ్రు ఉండెడివారు. జక్కన విక్రమార్క చరిత్రలో

"ఆత్మీయ లిపియట్టు లన్య దేశంబుల
లిపులను జదువంగ నిపుణుఁడయ్యె" (1-50)

శా. శ్రీ కర్ణాట మహామహీశ్వర
       సదా సేవా ప్రధానో త్తమా
నీ కస్తుత్యలిపి క్రియానిపుణ పాణి
       ద్వంద్వ పంకేరుహా.(3-137)

అని లిపినిగూర్చి తెలిపినాడు. శ్రీకృష్ణరాయని యుగమున - లిపి పరిణతి చెందినది. పాండురంగమాహాత్మ్యమున రామకృష్ణకవి —

“పట్టెవట్రువయును పరిపుష్టి తలకట్టు
     గుడిసున్న కియ్యయు సుడియు ముడియు
నైత్వంబు నేత్వంబు నందంబు మందంబు
     గిలుకయు బంతులు' నిలుపు పొలుపు
నయము నిస్సందేహతయు నొప్పు మురువును
     ద్రచ్చి వేసినయట్లు తనరుటయును
షడ్వర్గశుద్ధియు జాతియోగ్యతయును
     వృద్ధిప్రియంబును విశదగతియు...”

గలిగి తెలుగులిపి కళాసంపన్నమైనది.


రేనాటి అద్దంకి బెజవా నన్నయ నం తిక్కన పాత చోళులు - డ శాసనము దంపూడి శా వేంగి చాళుక్య లు పూర్వచా సనము - సంధి తెలుగు ళుక్య లిపి. కాలపు లిపి లిపి వ స హ

అచ్చులు

ప్రాచీనలిపి వివరణము : (అక్షరవిన్యాసము పటమును చూడుడు.)

అ ఆ  :- అకారచిహ్నము తలకట్టు. మొదట తలకట్టు గీత యిప్పటికంటె వెడలుపుగను హ్రస్వముగను ఉండెను. అక్షరముల తలకు కట్టబడినవి లేక తగిలింపబడినవి కావున వాటికి “తలకట్టు" అని పేరు వచ్చినది. ఈతలకట్టు కుడి వైపునకు పొడిగించి, కొన క్రిందికి వంచివేసిన యెడల అది అకార చిహ్నమగును. నేటి లిపిలో ఈ వంపు సున్నగా మారినది. దీనికి తలకట్టు తిరిగి తగిలించిన 'ఆ' కారమైనది.

 :- హల్లులమీద వచ్చు ఇకారమునకు 'గుడి' అని పేరు. ఈ పేరున కనుగుణముగా ప్రాచీనలిపిలో ఇకార చిహ్నము కేవల చక్రాకారముగ నుండును. పూర్వమిది యక్షరమునకు తగిలించినట్లు స్పష్టముగా నుండెడిది. నేడిది యక్షరములలో కలిసిపోయినది.

 :- ఇ చిహ్నమునకు నెడమవైపున నారంభించి గుడిచుట్టు నపుడు కొనల రెండింటిని గలుపవలసి వచ్చినపుడు, అట్లు కలపక మీదికొన కొంచెము లోపలకు వంచిన యెడల నది 'ఈ' కారమగును. దీనికి "గుడిదీర్ఘము" అని పేరు. ప్రాచీనలిపిలో 'ఇ' వలె నిదియు గుడి యాకారముగా నుండెను. ఆ వెనుక 'అ' కార చిహ్నమగు గురుతును నీవలావల చేర్చిరి. అది క్రమముగా గుడి మధ్యనుండి వ్రాయు నలవా టేర్పడెను.

 :-, ఉకార చిహ్న మునకు తెలుగులో "కొమ్ము" అని పేరు. పూర్వలిపిలో ఉకార చిహ్నము ఆవుకొమ్మును పోలియుండును. ఇప్పటి లిపిలో కొమ్ములో కుడివైపు గీటు పొడవుగాను, ఎడమవైపు గీటు పొట్టిగాను ఉండును.

 :- 'ఉ' అక్షరమునకు, ఆకారచిహ్నపు గురుతు కలుగుటచేత "ఊ" ఏర్పడినది. హ్రస్వరేఖలకు వంపులు పెట్టినచో, ప్రాచీనలిపిలో, దీర్ఘములుగా పరిగణితము లగుచుండెడివి.

ఎ, ఏ; ఒ, ఓ  :- పూర్వ లిపిలో నీ రెండింటికి హ్రస్వ దీర్ఘములలో భేదములేదు. సంస్కృత భాషలో నీరెండిం టికి దీర్ఘచ్ఛారణమేగాని హ్రస్వోచ్చారణములేదు. దీర్ఘముగా వ్రాసినను, ఉచ్చారణలో తెలుగువారు సందర్భము ననుసరించి హ్రస్వముగా పలికెడివారు. సంస్కృత భాషా వ్యాప్తి హెచ్చిన వెనుక. ఏ కారములోని కొమ్మును (దీర్ఘ చిహ్నము) తొలగించి హ్రస్వ 'ఎ' కారమును 'ఓ' కారములోని కొమ్మును తొలగించి హ్రస్వ'ఒ' కారము నేర్పరచిరి. ఈ హ్రస్వ 'ఒ' కార చిహ్నమగు '^' అనునది తరువాత హల్లులకు తగిలింపబడినది. కొ, చొ, మొదలైనవి.  :- ప్రాచీన లిపిలో దీనికి గుర్తులేదు. ఇది వ్రాయవలసి వచ్చినపుడు 'అయ్, అయి' అని వ్రాసెడివారు. యుద్ధమల్లుని బెజవాడ శిలాశాసనములోని 'ఒయ్వారల' అని యీ యక్షర స్వరూపము గలదు. అప్పకవి దీనిని చెప్పియున్నాడు.

ఋ, ఋ; ఌ,ౡ  :- ఇవి తెలుగునలేవు. ఇవి అచ్చులు గావున ఎల్లప్పుడు హల్సంయోగముతో వ్రాయబడు చుండెడివి.

నృ - తృ - క్ష  :- ఋకారమునకు 'ృ' ఇట్టి చిహ్నము ఉండుటచే దీనికి వట్రువసుడి యని పేరువచ్చినది. రెండవ దానికి ప్రచారము లేక పోవుటచే, ప్రత్యేక చిహ్న మేర్పడ లేదు.

హల్లులు

క :- తలకట్టు మొదటినుండి కలది.
ఖ:- తలకట్టు లేదు.. దీని చివరవంపు నేడు కొంచెము క్రిందికి వ్రాయబడుచున్నది.
గ:- తలకట్టులేదు. తరువాత నేర్పడినది.
ఘ:- తలకట్టులేదు. ఒత్తక్షరపు గురుతులేదు.
జ :- ఇది గ్రంథాక్షరలిపి. మొదట జ ఒకటే గీత-అది పూర్వాక్షరములోని మొదటి వంపు క్రమముగా రెండవ వంపునకు మరియొక గీత చేర్చబడినది. అప్పుడు 'జ' అయినది.
చ:- తలకట్టు మొదటినుండి కలది.
ఛ :- తలకట్టు మొదటినుండి కలది. ఒత్తక్షరపు గురుతు లేదు.
జ :-తలకట్టులేదు.
ఞ:- తలకట్టులేదు.
ట :- మొదట తలకట్టులేదు.
ఠ :- మొదట తలకట్టులేదు.
డ:- మొదట తలకట్టులేదు.
ఢ :- మొదట తలకట్టులేదు. తలకట్టు, ఒత్తు తరువాత నేర్పడినవి.
ణ : మొదట తలకట్టులేదు.
త:- తలకట్టు మొదటినుండి యున్నది.
థ :- తలకట్టులేదు.
దః - తలకట్టు మొదటినుండి యున్నది.
ధ :- తలకట్టులేదు.
న:- తలకట్టు మొదటినుండి యున్నది.
ప :- తలకట్టు మొదట లేదు.
ఫ : తలకట్టు మొదటలేదు. ఒత్తులేదు. తరువాత ఏర్పడినది.
బ :-తలకట్టు మొదటినుండిలేదు.
భ :- తలకట్టు మొదటినుండి కలది.
మ:- తలకట్టు మొదటినుండి కలది.
య:- తలకట్టు మొదట లేదు.
ర:- తలకట్టు మొదటినుండి కలది.
ల :- తలకట్టులేదు.
వ :- తలకట్టు మొదటినుండి కలది.
శ :- తలకట్టు మొదటలేదు. కన్నడ సంప్రదాయము నుండి వచ్చినది.
ష:- తలకట్టు మొదటినుండి కలది.
స :- తలకట్టు మొదటినుండి కలది.
హ:- తలకట్టు మొదటినుండి కలది.
ఱ:-తలకట్టులేదు. ఇది మొదట 'ఆ' అను నక్షరము వలె నుండెడిది. క్రమక్రమముగా మీది రెండు గుడులును పెద్ద విగా మారి వానిమధ్య అడ్డగీత గల ఆ చిహ్నము వ్రాయబడుటచేత ప్రస్తుత రూపము దాల్చినది. మొదటి రెండు గుడులును బండిచక్రములమాదిరిని '0' యుండుటచేత దీనికి "శకట రేఫము" అను పేరు గలిగినది.

పై దానిని బట్టి తలకట్టునకు గల ప్రాధాన్యము గ్రహింపవచ్చును. శరీరమునకు తలప్రధానము. “సర్వస్య గాత్రస్య శిరః ప్రధానమ్" అని సూక్తి. అక్షరశరీరమునకును తలకట్టు అట్టిదియే.

1. కొన్ని లిపిసంప్రదాయములు  :- ఆ- అనునొక వింత యక్షరము యుద్ధమల్లుని బెజవాడ శిలాశాసనమున మూడుచోట్ల నున్నది. అది బండిఱాలో కొమ్ములు కలపకుండ అడ్డుగీత 'రెండింటికి తగులునట్లు లేకుండనున్న 'ఱ' ' అను నాకారములోనున్నది. 'ఱ' స్సి (14 వ పంక్తి) అఱిపిన (21 వ పంక్తి) అఱపుట (35వ పంక్తి).దీనిని డకారముగానే మనము పలుకవలయును. ఈ శాసనముననే 28 చోట్ల 'డ' కారము వచ్చినది. కాని పై మూడుచోట్ల నున్న వానికంటే విలక్షణముగ నున్నది. కాబట్టి యిది 'డ' కారముకన్న వేరనియు నితర ద్రావిడ భాషలనుండి వచ్చినదనియు గ్రహింపదగును.

తమిళమున అఱి ధాతువునకు నాశనము చేయుట, పాడుచేయుట, ధ్వంసముచేయుట అను నర్థములు కలవు. తెలుగున వెంపఱి మొదలగువానిలో నీయఱి నిలిచియే యున్నది. కాని ప్రాచీన కాలమున, నీ అఱి ధాతువు కన్నడ భాషలో అళిగా మాఱినది. దాని ననుసరించి తెలుగున 'అడి' అయినది. అందుచేతనే తెలుగులిపిలో, సహజవర్ణమగు 'డ' కారమునకు, ఇతర భాషాపరిణామ మూలమున వచ్చిన యీ 'డ' కారమునకు లిపి భేదము కలిగినది. రేనాటి చోళుల ప్రాచీన శాసనములో చోఱ -చోడ - ఏఱు - ఏదు - అని యీ యక్షరమగుపడుచున్నది.

నన్నయ ఈ యక్షరమును వాడుక చేయలేదు.

అఱిచిన - బొడిచిన - చెడు నెప్పుడు. అని తెనుగున గల సహజ 'డ' కారముతో ప్రాసలో వ్రాసియున్నాడు. (భార. ఆది. 1.138)

నన్నయతరువాత శాసనములలో నియక్షరము లేదు. ఈ యక్షరమునకును, ఈరూపముతో నుండు ఇతరాక్షరములకు గల భేదమును ఈ క్రింద చూపుచున్నాను.

2. వలపలిగిలక  :- "ప్రాచీన లేఖనమున బ్రాహ్మీలిపిలో J అను రీతిగను నంతకంతకు అను రీతిగను రేష ముండెడిది. అది ఇతర వర్ణముతో కలిసినపుడు, వర్ణముల మీద నిల్చుటలో కాలక్రమమున J, S,O అను రీతిని పరిణమించినది. రేఫముమీద తలకట్టుపోయిన "c." అనునాకారము గిలకవలె నుండుటచే దానికి గిలక యను పేరువచ్చెను. ఉ: శ్రీ దమ్ము౯ (యుద్ధమల్లుని బెజవాడ శాసనపు తుది పంక్తి.) నాగర లిపిలో నేటికిని నిట్లే గిలకయున్నది. ॥ ఇట్టి తలమీది గిలక తలమీది యనునాసికలిపి యనుస్వారరూపమున వలపలికి దిగినట్లే కాలక్రమమున వర్ణము వలపలికి దిగి '౯' అను రూపములోనికి పరిణామము చెందినది. ఈసందర్భమున నింకొక విషయము చెప్పవలసియున్నది.

అనుస్వారము ప్రాచీన కాలమున ద్వివిధముగా వ్రాయబడెడిదిగాన, నది ద్వివిధముగా వలపలికిని, దాపలికిని దిగుట సంభవించెను. గిలకయన్ననో వలపలికే దిగినది. అర్క= అక్క౯. అను నాసికాక్షరములకు బదులుగా పరాక్షరము తలపై వ్రాయబడెడి యనుస్వారము దాపలికి దిగుచు వచ్చెను. (రాముణ్ణు = రాముడు - రాముండు) తక్కినచోటులందలి తలమీది యనుస్వారము వలపలికి దిగుచు వచ్చెను. ఉ: వశము = వంశము. రేఫము వలపలి కే దిగుటచేతనే దానికి 'వలపలిగిలక' యను పేరు వచ్చెను." (వైయాకరణ పారిజాతము, పుట 277)

ప్రాచీనులగు నన్నయాది మహాకవులును, నన్నెచోడ, పాల్కురికి సోమనాథాది శివకవులును నీ వలపలిగిలక సంప్రదాయమును చక్కగా పాటించినారు. రేఫ సంయుక్తాక్షరము లన్నియు, వలపలిగిలక సంప్రదాయముచే తొలుత ద్విత్వాక్షరములుగా వ్రాసి ఆవెనుక రేఫోచ్చారణ చిహ్నమగు వలపలిగిలక వ్రాయుదురు. ఉచ్చారణములో మనకు రేఫధ్వని వినబడుచున్నను వ్రాతలో రేఫకన్నా ద్విత్వాక్షర ధ్వనికే ప్రాధాన్యము.

ధర్మము - అని యిట్లు వ్రాసిన రకారధ్వని మనకు స్పష్టముగ తెలియును. కాని ధమ్మ౯ము అని వలపలిగిలక వ్రాసిన మకారమునకే ప్రాధాన్యము.

ఇచట ముఖ్యముగ మనము పరిశీలింపవలసిన దేమనగా, పైవ్రాతలు, ప్రాసవిషయమున సరిపోవచ్చునుగాని యతి విషయమున సరిపోవు. వలపలిగిలక సంప్రదాయము ననుసరించిన రేఫకు యతియెట్లు పొసగును ?

ఈక్రింది యుదాహరణమువలన పైవిషయము స్పష్టమగును. శ్రీ వాణీంద్రామ రేంద్రాచ్చి౯త (ద్రార్చిత) - అనిన యతిసరిపోవును. (శ్రీ...చి) గాని శ్రీ వాణింద్రామ రేంద్రార్చిత యని నవీనరీతిగా పాఠనిర్ణయదృష్టితో ముద్రించిన యతి యెట్లును సరిపోవదు. చూడుడు. పూర్వరీతిగా వ్రాసిన వైముద్రిత పాఠము. శ్రీవాణిం ద్రామరేంద్రాప్పి౯త అని వలపలిగిలకు సంప్రదాయముతో వ్రాయవలసినరీతిగా వ్రాసినచో యతి తప్పుచున్నది.

తెలుగు భాషలో యతి ప్రాసలకును, లిపి పరిణామ క్రమమునకును సన్నిహిత సంబంధము కలదని నిరూపించుటకు పై వలపలిగిలక సంప్రదాయ మొక్కటియే చాలును. ఈ నియమము తిక్కన కాలమునాటినుండి సడలినది.

3. c . అర్ధానుస్వారము లేక అరసున్న :- ప్రాచీన లిపిలో అరసున్న లేదు. మొదట వర్గపంచమాక్షరములు, ఆవెనుక బిందువులును వ్రాయబడుచుండెడివి. వర్గపంచమాక్షరములలో బిందువే తెలుగులో నియతముగా నిలుచునని యాంధ్ర లాక్షణిక సంప్రదాయము. కేతన మొదలగు ప్రాచీన వైయాకరణులు, పూర్ణబిందువులే లిఖింపబడుననియు, నవి యూది పలుకుట, తేలి పలుకుట యను నుచ్చారణ సంప్రదాయముచే రెండువిధములైన దనియు తెలిపిరి. తాళ పత్రములమీది వ్రాతయందును ఇది కానరాదు. మొట్టమొదట అచ్చుపడ్డ పుస్తకములలోను ఇది కానరాదు. ప్రాచీన గ్రంథములు నవీనరీతిని ముద్రించుకాలమున క్రీ. శ. 1840 ప్రాంతమునుండి అరసున్న సంజ్ఞ ఏర్పడి క్రీ. శ. 1858 నుండి బాల వ్యాకరణము మూలమున నేటి వ్రాతలో స్థిరత్వము సంపాదించినది. ఇది గ్రాంథిక భాషలో నియతముగా పాటింపబడుచున్నను వ్యావహారిక భాషలో పాటింపబడుట లేదు.

4. ఋ, ౠ,ఌ,ౡ . :- ఇవి రు, రి యని యిరు తెరగుల వ్రాతలలో నుండేడివి. ప్రాచీన కాలమునుండి కాలమువరకు కవులు, యతిస్థానమున, 'ఋ' కు 'రు' తోడను 'రి' తోడను యతులు వాడిరి. కొందరు లాక్షణికులు మొదటిదాని నంగీకరింపలేదు. దేశ సంప్రదాయము ననుసరించి రెండును సరియైనవియే. దీనిని గూర్చి, అప్పకవీయ పంచమ ముద్రణ పీఠికయందును భాషా పరిశోధన ప్రయోగ విశేషములు అను గ్రంథమునను విపులముగా చర్చింపబడి యున్నది.

ని.వేం

[[వర్గం:]]