సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మొదటి సంపుటము/ఆంధ్ర లక్షణ గ్రంథములు

ఆంధ్ర లక్షణ గ్రంథములు  : లక్షణ మనగా “లక్ష్యతే జ్ఞాయతే అనేన" అను వ్యుత్పత్తిచేత ఒక వస్తువును లేక ఒక విషయమును గుర్తుపట్టి తెలిసికొనుటకు పనికివచ్చు సాధనమని యర్థము. ఇతర వ్యావర్తకముగా (ఒక దానికి చెప్పిన లక్షణము మరియొక దానినుండి వేరు పరచునట్లుగా) ఒక వస్తువును నిర్దేశించుట లక్షణము, లక్షణ మనగా 'గుర్తు' అని స్థూలముగా అర్థము జెప్పవచ్చును. ఏ వస్తువునకైనను ప్రత్యేకమగు లక్షణము లేనిచో దానిని చక్కగా గ్రహింపజాలము. లక్షణమును జెప్పునప్పుడు అతివ్యాప్తి, అవ్యాప్తి, అసంభవము అను దోషములు లేకుండునట్లు చెప్పవలయును. అట్టి లక్షణ

జ్ఞానమువలన లక్ష్యజ్ఞానము సులభముగా గలుగును.కనుక పూర్వులు ప్రతి శాస్త్రమునందును లక్ష్య లక్షణ సమన్వయ పద్ధతి నవలంబించి యున్నారు. ఛందో౽లంకార వ్యాకరణ శాస్త్రములను రచించుపట్టున తెలుగు లాక్షణికులు సైతము అట్టి పద్ధతినే అవలంబించిరి. ఆంధ్ర భాషయందు లక్ష్య లక్షణ సమన్వయ పద్ధతితో గత శతాబ్దులందు వెలసిన శాస్త్రములలో "వ్యాకరణ శాస్త్రము, అలంకార శాస్త్రము, చంద శ్శాస్త్రము నిఘంటువులు" అనునవి ముఖ్యములు. ఈ శాస్త్రములు నేటివరకును పెరుగుచున్నవి. కనుక వీటిని గురించిన అంశములను తెలిసికొనుట మనకు ప్రస్తుతము.

I వ్యాకరణ శాస్త్రము  :- పదములను బ్రకృతి ప్రత్యయ విభాగ పురస్సరముగా నిరూపించుటచే ఈ శాస్త్రమును 'వ్యాకరణ' మని అనుచున్నారు. “వ్యా క్రియంతే శబ్దాః సంస్క్రియంతే అనేన ఇతి వ్యాకరణమ్" అని వ్యుత్పత్తి. శబ్ద సంస్కార సాధనమని యర్ధము. ఋగ్వేద పద కారుడగు శాకల్యుడు మొదలుకొని బహు వ్యాకర్తలు సంస్కృత భాషకు వ్యాకరణమును రచించిరి అవి నామమాత్రా వశిష్టములు. ఇప్పుడు లోకవ్యవహార సాధనమైన ప్రాచీన వ్యాకరణము పాణినీయమే. పాణిని రచించిన అష్టాధ్యాయి, 3981 నూత్రములతో వైదిక, లౌకిక భాషా ప్రపంచమును సంస్కరించునట్టి ఉత్తమ వ్యాకరణము. అదియే దేశభాషా వ్యాకరణములకు మార్గదర్శకమైనది. తెలుగు వ్యాకర్తలు పాణినీయ పరిభాషనే అవలంబించిరి.

"ప్రయోగమూలం వ్యాకరణమ్"; "ప్రయోగ శరణా వైయాకరణాః" అను లోకోక్తుల వలన శిష్ట వ్యవహారము వ్యాకరణ రచనకు ఆధారమనుట స్పష్టము. ప్రాచీనాంధ్ర వైయాకరణులు కవి ప్రయోగములను, వాటిచే తెలియవచ్చు నితరాంశములను, కవిమార్గ విరుద్ధములు కానట్టి లోక వ్యవహార సిద్ధములను ఆధారముగా గోని వ్యాకరణములను రచించిరి జీవద్భాషలగు తెలుగు మున్నగు వాటియందు పూర్వకవి ప్రయుక్తములు గాకున్నను, వ్యాకరణ లక్షణమునకు దూరముగా నున్నను, తత్త త్కాలములయందలి కవులు ప్రయోగించిన శబ్దములు శిష్టవ్యవహారము అను శాణమున వన్నెలు దీరినవై యుండెనేని వాటిని స్వీకరించి, వానికొరకై వ్యాకరణమును విస్తరించుటకు అనుమతించిరి. ఇరువదవ శతాబ్ది యందు రచింపబడిన వ్యాకరణ గ్రంథములలో నిట్టి దూరదృష్టితో నుద్భవిల్లినవి కొన్ని కలవు.

శబ్దమును బ్రకృతి ప్రత్యయ విభాగ పురస్సరమైన యర్థమునందు చక్కగా నెరిగి ప్రయోగించుట వలన ఇష్టార్థము (ఉద్దేశింపబడిన యర్థమని లౌకికముగా నర్థము చెప్పుకొనవచ్చును) సిద్ధించును. సంస్కృత విద్వాంసులలో ఇట్టి యాచారమున్నది. కనుకనే వారు

" ఏకశ్శబ్దః సమ్యక్ జ్ఞాతః శాస్త్రాన్వితః
సుష్ఠుప్రయు క్తః స్వర్గేలోకే కామధుక్ భవతి "

అను దానిని సర్వదా స్మరించుచుందురు. సమ్యక్ జ్ఞాతమైన సుశబ్దమును ప్రయోగించుటవలన స్వర్గము వచ్చునని వారి విశ్వాసము. తెలుగు భాషను సయితము సంస్కృతము వలె ఉన్నతదశకు తెచ్చుటకై నన్నయభట్టారకాది వ్యాకర్తలు మార్గమును చూపియున్నారు. జీవద్భాషయైనంత మాత్రమున స్వేచ్ఛగా శబ్దమును ప్రయోగించుటకు వీలుండదు. రచయిత స్వసం కేతమాత్ర ప్రసిద్ధములయి, నేయార్థాది దోష జుష్టములయిన పద ప్రయోగములు చేసి భాషను కల్మష పరుపరాదు, శిష్టవ్యవహారము లోకాదరము - అను గీటురాళ్ళ ఒరపిడితో నిగ్గులు దేరిన శబ్దములను మాత్రమే ప్రయోగించి భాషా సరస్వతిని అలంకరించుచుండవలెను. అట్టి రచయిత యొక్క ప్రయోగములు ముందురాబోవు వ్యాకరణములందు చేరును. కనుక జీవద్భాషల విషయమున కవిత గీతవంటిదనియు, వ్యాకరణము దానిని ప్రకాశింప జేయు పందిరి వంటి దనియు కవులును, పండితులును తలపవలసియుండును. ఇక మన తెలుగు వ్యాకరణములలో కొన్నిటి చరిత్రను తెలిసి కొందము.

'ఆంధ్రశబ్ద చింతామణీ: ఇది ఆంధ్రభాషా వ్యాకరణములలో మొదటిది. 'వాగనుశాసన' బిరుదాంచితుడైన నన్నయభట్టారకుడీ గ్రంథమును రచించెను. దీనిని 'నన్నయ భట్టీయ' మనియు కొందరు వ్యవహరింతురు. ఇది సంస్కృత భాషయందు శ్లోకరూపమున (ఆర్యావృత్తములలో) వ్రాయబడినది. తరువాతి వ్యాఖ్యాతలు అందలి సూత్రములను విడివిడిగా తీసి వ్యాఖ్యానములను

రచించిరి. చింతామణి వ్యాఖ్యాతలలో ఎలకూచి బాల సరస్వతి, పారనంది రామశాస్త్రి మున్నగువారు గలరు. వఝల చిన సీతారామస్వామిశాస్త్రిగారు విమర్శాత్మకముగా 'చింతామణి విషయ పరిశోధనము'ను రచించి పెక్కు విషయములను స్పష్టపరచిరి, చింతామణి తరువాత వచ్చిన వ్యాకరణములు కొన్ని అనువాదములుగాను, కొన్ని దాని నాధారముగా జేసికొని విస్తరిల్లినవిగాను ఉన్నవి. చింతామణియందు సంజ్ఞా సంధి, అజంత, హలంత, క్రియా పరిచ్ఛేదములు గలవు. 'విశ్వశ్రేయః కావ్యమ్' అను కావ్య లక్షణముతో నీవ్యాకరణము ప్రారంభమగును. నన్నయబట్టారకుడు తెనుగు వ్యాకరణ శాస్త్రమునకు ప్రథమాచార్యుడు. ఇతడు క్రీ. శ. పదునొకండవ శతాబ్దివాడు. ఆంధ్రశబ్ద చింతామణి నన్నయ కృతము అగునా? కాదా? అను విషయమున విమర్శకులలో అభిప్రాయభేదము కలదు.

అథర్వణ కారికావళి  : ఇది నన్నయ యొక్క ఆంధ్ర వ్యాకరణమగు చింతామణి సూత్రములతో జోడించి లక్ష్య సాధనచేయుటకు పనికివచ్చు కారికలు (శ్లోకములు) గల యుత్తమ వ్యాకరణ గ్రంథము. అథర్వణాచార్యుడు కర్తయగుట చేత అథర్వణ కారికావళియని దీనికి పేరు వచ్చినది. 'వికృతి వివేక' మనియే దీని నామధేయము. పరిచ్ఛేదాంతముల యందు "ఇతి శ్రీమదథర్వణాచార్య కృతే వికృతి వివేకే" అని యున్నది.

అథర్వణాచార్యుడు నన్నయతరువాత వచ్చిన ప్రామాణికుడయిన గొప్ప వ్యాకర్త. చింతామణి సూత్రముల యొక్క గాంభీర్యమును విశదపరచుటయందును, చింతామణి దృష్ట్యా అసాధువులనుటకు వీలైన మహాకవి ప్రయోగములను సాధించుటయందును, అథర్వణ కారి కావళి మిక్కిలి తోడ్పడును. చింతామణి నన్నయకృతము కాదనియు, వికృతివివేకము అథర్వణకృతము కాదనియు, వీటిని ఎలకూచి బాలసరస్వతియు, అహోబల పండితుడును రచించిరనియు ఒక వాదము కలదు. కాని చింతామణి వికృతివివేశములు నన్నయాథర్వణ కృతము లేయని కొందరు పండితులు భావించుచున్నారు.

అథర్వణ కారికావళియందును చింతామణి యందు వలెనే సంజ్ఞా, సంధి, అజన్త, హలన్త, క్రియాపరిచ్ఛేద ములు వరుసగా కలవు. ఈ గ్రంధమునకు ద్వితింత్రిణీ సీతారామకవి 'కవిజనమండనము' అను వ్యాఖ్యను రచించెను. ఇతడు అహోబలపండితుని తరువాతివాడని విమర్శకుల అభిప్రాయము. ఈద్వితింత్రిణీ సీతారామకవి వ్రాసిన టీక బాలవ్యాకరణకర్తకు నూతన వ్యాకరణ రచనము నందు ఉపయోగించియుండునని సోదాహరణముగా వఝల చిన సీతారామస్వామిశాస్త్రి గారు నిర్ణయించిరి. వికృతి వివేకకర్తయైన అథర్వణుడు ఆంధ్రవ్యాకరణ శాస్త్ర ద్వితీయాచార్యుడు ఈతడు వ్రాసిన మరియొక గ్రంథము "త్రిలింగ శబ్దానుశాసనము" ఇది కారికావళి కన్న చిన్నదియగుటచేత దీనిని రచించిన పిమ్మట బహుళాంశములుగల కారికలను ఇతడు రచించెను. సుమారు 24 కారికలతో చింతామణి ప్రతిపాది తాంశములను 'ఉక్తానుక్త దురుక్త చింతనపురస్సరము'గా సమర్థించునట్టి అథర్వణకారికావళి, (వికృతివివేకము) ఆంధ్ర భాషా వ్యాకరణములకు తలమానికము వంటిది. అథర్వణుడు నన్నయకు సమకాలికుడని కొందరును, క్రీ. శ. 13వ శతాబ్దివాడని కొందరును నిర్ణయించిరి.

ఆంధ్రభాషాభూషణము : ఇది మూలఘటిక కేతనకవి ప్రణీతము. ఏకాశ్వాస పద్యకావ్యముగా ఇది రచింపబడినది. ఇందు 189 పద్యములు కలవు. కేతనకవి మహాకవి యగు తిక్కనకు సమకాలికుడు. కనుక పదు మూడవ శతాబ్దివాడు. ఇతనికి 'అభినవదండి' అను బిరుదముకలదు. దండి కవికృతమైన దశకుమార చరితమును ఆంధ్రీకరించుటచేత ఇతనికీ బిరుదము వచ్చెను. ఆంధ్ర వ్యాకరణమును తెనుగునందే రచించిన వారిలో ఇతడు ప్రథముడు. ప్రాచీనములైన చింతామణి వికృతివివేకములను కేతన చూచినట్టు లేదు. తానే తొలిసారిగా తెలుగువ్యాకరణమును రచించుచున్నట్లు గ్రంథాదిని తెలిపినాడు. ఇది స్వతంత్రమైన గ్రంథము. ఆంధ్రభాషాపదములు అయిదు విధములుగా ఇందు విభజింపబడినవి. 'తెనుగు' దేశ్యము, భిన్నము లని కేతన యభిప్రాయము. కాని తత్సమము తప్ప ఇతరములయిన నాలుగును కలిసి అచ్చ తెనుగుగునని అంగీకగించినాడు. నన్నయభట్టి యాదులందువలె విపులార్థ సంగ్రహముగాని, చక్కని వ్యాకరణ పరిభాషగాని ఇందు లేదు. లక్ష్యజ్ఞానము కలుగుటకుమాత్రము ఉపయోగించును. పద్య కావ్య మగుట చేత కంఠస్థము చేయుటకు అనువైన గ్రంథము.

అహోబల పండితీయము : ఈ గ్రంథమునకు "కవి శిరో భూషణము", "అహోబల పండితీయము" అని రెండు నామధేయములు కలవు. ఇది నన్నయభట్టారకుని చింతామణికి విపులమయిన (భాష్యమువంటి) సంస్కృత వ్యాఖ్యానము, నన్నయ యొక్క సూత్రములకు లొంగని కవిప్రయోగములను అథర్వణకారికలతో సమన్వయించి లక్ష్యసాధన చేయుచు, కేతనాదులను అచ్చటచ్చట ఖండించుచు, బహుళాంశములను చర్చాపూర్వకముగా ప్రతి పాదించుచు, అహోబలపతి ఈ వ్యాఖ్యానమును రచించెను. సంస్కృతమునందు పాణిన్యాచార్యుడు సూత్రములను, వరరుచి వార్తికములను, పతంజలి మహర్షి భాష్యమును రచించినట్లు, తెనుగు వ్యాకరణమును సంస్కృత భాషయందు సూత్రములుగా నన్నయభట్టారకుడును, వార్తికములుగా అథర్వణాచార్యుడును, భాష్యముగా అహోబలపండితుడును రచించిరి. కావున పాణిన్యాదుల వలె వీరును దెనుగు వ్యాకరణమునకు "మునిత్రయము" అనబడుచున్నారు.

అహోబలపండితుడు, ఎలకూచి బాలసరస్వతి, అప్ప కవి మున్నగు లాక్షణికులకున్న తరువాతివాడు. ఇందు ఆంధ్ర వ్యాకరణాంశములు సంస్కృతభాషయందు ఉదాత్తముగా చర్చింపబడినవి. ఈ గ్రంథము ఆంధ్ర భాషకు శిరోభూషణము వంటిది. ఆర్వాచీన వ్యాకర్తల కిది మిక్కిలి ఉపయోగపడినది.

ఆంధ్రకౌముది: గణపవరపు వేంకటపతికవి ప్రణీత మయిన "సర్వలక్షణ శిరోమణి"లోని వ్యాకరణాంశములను తెలుపునట్టి సీసమాలికకు “ఆంధ్రకౌముది" అని పేరు. ఆంధ్ర కౌముది ప్రత్యేక గ్రంథముగా ఆంధ్ర సాహిత్య పరిషత్తు (కాకినాడ) వారిచే ప్రకటింపబడినది. ఇది వేయి చరణములుగల సీసమాలిక ఇందు తద్భివ, తత్సమాది పదభేదములు, సంస్కృత సంజ్ఞాప్రకరణము,విభక్తి స్వరూపములు, అవ్యయ స్త్రీ ప్రత్యయ సమాస స్వరూపములు, తద్ధిశ శిజంతములు. క్విబంతములు, పూర్వ ప్రయోగములు, త్రిశూలబంధ పంచచామరము మున్నగు వంశములు గలవు. గ్రంథకర్త ప్రాచీన వ్యాకరణములను పూర్వకవి ప్రయోగములను చక్కగా నెరిగినవాడు. పదునెనిమిదవ శతాబ్ది ఆరంభముననున్న ఇతడు కూచిమంచి తిమ్మకవికి సమకాలికుడుగా తలపబడుచున్నాడు.

మండ లక్ష్మీనరసింహాచారి (1670 ప్రాంతము) కృతమయిన “ఆంధ్ర కౌముది" ఇంకొకటి కలదు. ఇది ఆంధ్రభాషకు సంస్కృతసూత్రములలో వ్రాయబడిన వ్యాకరణము. ఉదాహరణములు తెలుగునం దున్నవి.

సర్వలక్షణసార సంగ్రహము : కూచిమంచి తిమ్మకవి ఈ గ్రంథమును రచించెను. ఇతడు క్రీ. శ. 1700-1757 ప్రాంతమున జీవించియుండెను. పీఠికాపుర సంస్థానమునకు చెందిన కందరాడ అతని గ్రామము. సర్వలక్షణసార సంగ్రహమునందు తత్సమ, శుద్ధాంధ్ర వర్ణ, సంధి, విభక్తి, సమాస, క్రియావిశేషణ ప్రకరణము లనెడి విభాగములతో వ్యాకరణాంశములును, ప్రాస, విశ్రమ. ప్రకరణ నామ ధేయములతో ఛందో విషయములును, శబ్ద ప్రకరణము అను పేరుతో శబ్దముల రూపభేదములును ;రేఫ ద్వయ నిర్ణయ మను పేరుతో రేఫ, ఱ కారముల భేదమును తెలుపబడినవి. ప్రతి విభాగమునందును ప్రాచీనకవి ప్రయోగములు పుష్కలముగా నీయబడినవి. బమ్మెర పోతరాజు రేఫ, ఱ కార భేదమును పాటింప లేదని అప్పకవి మున్నగువారు చేసిన విమర్శనము సమంజసము కాదని ఇతడుచెప్పెను. తిమ్మకవి బహుగ్రంథ కర్త. "కవి సార్వభౌమ" బిరుదాంకితుడు.

బాలవ్యాకరణము  : పరవస్తు చిన్నయసూరి (క్రీ. శ. 1806.1862) ఈ గ్రంథమును రచించెను. తెలుగు వ్యాకరణ సూత్రములలో ఇంత జిగిగల రచన మరియొక దాని యందు లేదు. బాలవ్యాకరణ రచనకు నన్నయభట్టీ యాది గ్రంథము లాధారములు. ఇందు సంజ్ఞ, సంధి, తత్సమ, అచ్ఛిక, కారక, సమాస, తత్ధిత, క్రియా, కృదంత, ప్రకీర్ణక పరిచ్ఛేదములు గలవు. సూరిగారు ప్రాచీన వ్యాకరణములనేకాని అర్వాచీన కవి ప్రయోగములను పాటింపమి కొన్ని ప్రయోగములు బాల వ్యాకరణముననుసరించి అసాధువు లగుచున్నవి. కాని వ్యాఖ్యాతలు బహుళాంశములను చేర్చుటచేత సవ్యాఖ్యానమగు బాల వ్యాకరణము తెలుగు విద్యార్థులకు అత్యంతోప కారముగ ఉన్నదనుట నిస్సంశయము. బాల వ్యాకరణమునకు ప్రథమమున “గుప్తార్థ ప్రకాశిక" అను పేరితో వ్యాఖ్యానమును కల్లూరి వేంకట రామశాస్త్రిగారు రచించిరి. పిమ్మట దూసి రామమూర్తి శాస్త్రిగారు 'గ్రాంథికాంధ్ర కల్పకము', లేక 'బాల వ్యాకరణ సారస్యసర్వస్వ పేటిక' అను వ్యాఖ్యను రచించిరి. దూసివారు కల్లూరివారి నచ్చటచ్చట విమర్శించిరి. ప్రక్రియాంశములకు గుప్తార్థ ప్రకాశికయు, విశేష చర్చలకు దూసివారి వ్యాఖ్యయు, ఉపయోగించునవియై బాల వ్యాకరణమునకు వన్నె పెట్టినవి. వ్యాకరణ సూత్రములను వచన రూపమున వెలయించుట బాల వ్యాకరణ వైశిష్ట్యములలో నొకటి. చిన్నయసూరి బాల వ్యాకరణమునే కాక (1) సూత్రాంధ్ర వ్యాకరణము (2) ఆంధ్రశబ్ద శాసనము; (3) పద్యాంధ్ర వ్యాకరణము అనేడి మరి మూడు వ్యాకరణములను గూడ రచించెను, వీటిలో సూత్రాంధ్ర వ్యాకరణము సంస్కృత సూత్రములతో ఉన్నది. సూరిగారికి సమకాలికులగు శిష్టు కృష్ణ మూర్తి శాస్త్రిగారిచేత రచింపబడిన 'హరి కారికలు' అను సంస్కృత సూత్ర గ్రంథము ఈ కాలముననే వెలసినది. బాల వ్యాకరణమునకు ఈకారికలే మూలమని కొందరును, బాల వ్యాకరణమే హరికారికలకు మూలమని మరికొందరును భావించుచున్నారు.


ఆంధ్ర ధాతుమాల  :- ఇది ఆంధ్ర సాహిత్య పరిషత్తు వారిచేత ప్రకటింపబడినది. దీని కర్తను గురించి సంశయము గలదు. చిన్నయ సూరిగారు 'ధాతుమాల' అను గ్రంథమును రచించి యుండిరని మాత్రము పండితులు విశ్వసించుచున్నారు. అది ఇదియేయని చెప్పుట కాధారములు లేవు. ఈ గ్రంథమునందు గ్రామ్యధాతువులు సైతము కలవు. పరమ లాక్షణికుడైన చిన్నయసూరి ఇట్టి గ్రంథమును రచించునా ? అని సంశయము. శ్రీ కట్టి సాంబమూర్తి శాస్త్రిగారు ఈ గ్రంథమునకు పీఠికను వ్రాయుచు అందులో చిన్నయసూరి కృత ధాతుమాలతో తరువాతి వారు కొన్ని గ్రామ్యములను చేర్చియుందురని యూహించిరి, వారి ఊహ సయుక్తికముగా నున్నది, ఏమైనను కర్తృ నిర్ణయ మింతవరకు జరుగలేదు. గ్రంథ మాంధ్ర భాషా జిజ్ఞాసువులకు ఉపయోగించుననుటయం దెంత మాత్రమును సంశయములేదు. అకారాద్యనుక్రమణిక తో నిందు సుమారు రెండువేల తెనుగు ధాతువులు కూర్పబడినవి. ప్రతి ధాతువునకును సంస్కృతార్ధము, తెలుగర్థము, సకర్మక, అకర్మక నిర్దేశమును ఉండును. ఉదా:(ధా) కులుకు (సం) శృంగార చేష్టాయాం (తె) శృంగార చేష్ట చేయుట (అకర్మకము). సులభముగా ధాత్వర్థములను గ్రహించుటకు ఈ గ్రంథము మిక్కిలి తోడ్పడును.

ప్రౌఢ వ్యాకరణము  : "త్రిలింగ లక్షణ శేషము", లేక "ప్రౌఢ వ్యాకరణము” అని దీనికి పేరు. బహుజనపల్లి సీతారామాచార్యులుగారు (1827-1891) దీనిని రచించిరి. బహుగ్రంథ పరిశోధకులును, శబ్దరత్నాకరా ద్యనేక గ్రంథ రచయితలు నగు శ్రీ సీతారామాచార్యులవారు బాల వ్యాకరణము చేత సాధింపబడని అనేక కవి ప్రయోగములను సేకరించి వాటియందలి సాధుత్వము గోచరించు నట్లుగా సూత్రములను రచించిరి. గ్రంథమునకు త్రిలింగ లక్షణ శేషమని నామకరణము చేసిరి. అనగా బాల వ్యాకరణమున కిది పరిశిష్టరూపమన్న మాట. బాలవ్యాకరణమునకు ప్రతిగా 'హరికారికలు' (సంస్కృత శ్లోకములు) విలసిల్లినట్లే ప్రౌఢవ్యాకరణమునకు ప్రతిగా 'హరికారి కా శేష సర్వస్వము' అను గ్రంథము సంస్కృతమున వెలువడినది. ప్రౌఢవ్యాకరణ కర్త రచించిన ఇతర గ్రంథములు : అలఘు కౌముది (రేఫ, శకటరేఫ నిర్ణాయకము), వైకృతదీపిక (తద్భవపద వివరణాత్మకము). ప్రౌఢవ్యాకరణమునకు తాళ్ళూరు ఆర్ముగంపిళ్ళెగారు "కుమారదేవ పండితీయము" అను పేరుతో ఒక వ్యాఖ్యానమునుప్రకటించిరి.

నారాయణీయాంధ్ర వ్యాకరణము  : చర్ల నారాయణ శాస్త్రిగారు ఈగ్రంథమును పద్యరూపముగా రచించిరి. నన్నయాథర్వణ వ్యాకరణములు కిది తెలుగు చేత. చింతామణి యందలి పరిచ్ఛేదక్రమమును విడిచి సౌలభ్యము కొరకు బాలవ్యాకరణ పరిచ్ఛేదక్రమము ననుసరించిరి. వారి కుమారులైన గణపతిశాస్త్రిగారు ఆ పద్యములకు అర్థమును వ్రాయుటయేగాక విశేషాంశములను తెలుపుటకై గద్యములో సూత్రములను రచించి వాటికి వ్యాఖ్యనుకూడ రచించిరి. ఇట్లు నారాయణశాస్త్రిగారి పద్యములును, గణపతిశాస్త్రిగారి సూత్రరచనాపూర్వకమైన వ్యాఖ్యానమును కలిసి నారాయణీయాంధ్ర వ్యాకరణమైనది. ఈగ్రంథమునందు అనేకములగు పూర్వకవి ప్రయోగములు సాధింపబడినవి.

వైయాకరణ పారిజాతము  : ఇది 'కళాప్రపూర్ణ' వజ్ఝుల చిన సీతారామస్వామిశాస్త్రి విరచితము. చింతామణిని, వికృతివివేకమును జోడించి, 'నన్నయా థర్వణీయ'మని మూలమునకు పేరిడి దానికి వై యాకరణ పారిజాతము లేక సీతారామ పండితీయము అను పేరుతో వ్రాసిన వ్యాఖ్య ఇది. బాల సరస్వతీయ టీకను, అహోబలపండితీయమును, పెక్కు తాళపత్రప్రతులను శోధించి వ్రాసిన వ్యాఖ్యానము. ప్రాకృత భాషలనుండియు, తమిళ కన్నడ భాషలనుండియు పెక్కు పదములను సేకరించి. పట్టికలుగా చేర్చి తెలుగు పదముల స్వరూపనిరూపణము చేయుటయందు గ్రంథకర్త మిక్కిలి పరిశ్రమించెను.

ఆంధ్ర వ్యాకరణ సంహితా సర్వస్వము :- వజ్ఝల చిన సీతారామస్వామి శాస్త్రిగారే ఈ గ్రంథమునుకూడ రచించిరి. ఇది రెండు సంపుటములుగా వెలువడినది. బాల వ్యాకరణమునందలి సంజ్ఞా సంధ్యాది పరిచ్ఛేద క్రమము తోనే ఇది నడచినది. నన్నయాథర్వణుల సూత్రములకు 'కల్పతరువు' అను వ్యాఖ్యానమును, బాల వ్యాకరణము నకు “సంజీవని” అను వ్యాఖ్యను రచించుచు ప్రాసంగికముగా ప్రాచీన వ్యాకరణములను, వ్యాఖ్యానములను, టీకాలను విమర్శించుచు, ప్రయోగములను జూపుచు, బహుళార్థ పరిశోభితముగా గ్రంథకర్త దీనిని రచించెను. ఇది పూర్వపక్ష సిద్ధాంతములును, చర్చలునుగలిగి విపులమై ప్రామాణికమై ఉన్నది.

ఆంధ్ర భాషానుశాసనము  :- 'అభినవ వాగనుశాసన' బిరుదాంకితులైన మల్లాది సూర్యనారాయణశాస్త్రిగారు ఈ గ్రంథమును సులభమైన శైలిలో రచించినారు. ప్రాచీన వ్యాకరణ ఫక్కిని వదలి పరిచ్ఛేద కల్పనమును నూతనముగా చేసిరి. కృత్తద్ధిత క్రియాది ప్రకరణములలో అపూర్వములైన ప్రయోగముల నిచ్చి లక్ష్యజ్ఞానము సుబోధ మగునట్లు కావించినారు.

తత్సమ చంద్రిక  :- ఈ గ్రంథమును సన్ని ధానము సూర్యనారాయణ శాస్త్రిగారు రచించిరి. ప్రాచీనార్వా చీన ఆంధ్ర వ్యాకరణము అన్నియు తద్భవ దేశ్యాదులయిన పదములను గురించిన విపులాంశములను తెలుపుచు, తత్సమ పదములు తెలుగున పొందు రూపభేదములను,దిజ్మాత్రముగా సూచించినవి. తత్సమపదముల రూప నిష్పత్తి ఈ గ్రంధమునందు విపులముగా ప్రదర్శింపబడినది. మరియు ప్రక్రియావిధానము సులభము చేయబడినది.ఇందలి కృదంత ప్రకరణము ధాతువివేకమును కరతలా మలకము గావించును. ఇందు సంధి, కృదంత, ఉపసర్గ,తద్ధిత, స్త్రీ - ప్రత్యయ అవ్యయ, సమాన ప్రకరణములును, రూపభేద, లౌకిక న్యాయ ప్రకరణములును గలవు. ఆంధ్ర వాఙ్మయమునందలి సంస్కృతపద, సమాసాది జ్ఞానమును కూలంకషముగా ఇది కలిగించును.

ఇతరములు  :- గత శతాబ్ది - అంతము మొదలుకొని నేటివరకును విద్యార్థిజన సౌకర్యార్థమై చిన్న చిన్న వ్యాకరణము లెన్ని యో బయలు దేరినవి. పురాతనకాలమున రచింపబడిన వాటిలో పెక్కు గ్రంథములు మనకు లభింపలేదు. కొన్ని ముద్రితములుగాక తాళపత్రముల యందే విశ్రాంతిని చెందుచున్నవి. కనుక ఈ వ్యాకరణ శాస్త్రము కావ్యరచన ఆరంభమైన నాటినుండి నేటి వరకును సాగుచున్నదనియే మనము గ్రహింపవలయును. వెంకయ్య వ్యాకరణము, కందుకూరి వీరేశలింగము పంతులుగారి సంగ్రహ వ్యాకరణము, వావిలికొలను సుబ్బారావుగారి సులభ వ్యాకరణము మొదలుకొని పాఠశాలల ఉపయోగార్థమై ఆధునిక ఆంగ్ల సంప్రదాయానుసారముగా రచింపబడిన వ్యాకరణము లెన్ని యో కలవు. ప్రతిదానియందును గుణ విశేషము జిజ్ఞాను జనోపయోగకరమై యున్నది.

పైన పేర్కొనబడిన వేకాక ఆంగ్లభాషయందు రచింపబడిన ఆంధ్ర వ్యాకరణములు కూడ కలవు. ఆంధ్రభాషను నేర్చు కొనెడి ఆంగ్లేయుల సదుపాయముకొరకు వ్రాసిన గ్రంథము లివి. ప్రప్రథమముగా సివిలు సర్వీసు ఉద్యోగి యగు ఎ. డి. కాంబెలుదొర 1816 వ సంవత్సరమువ ఒక వ్యాకరణమును; తరువాత మామిడి వెంకయ్యగారి సాయమున విలియం బ్రౌనుదొర 1817 వ సంవత్సరమున ఇంకొక వ్యాకరణమును; సి. పి. బ్రౌనుదొర1840 లో ఒక వ్యాకరణమును, ఆర్డెనుదొర 1873 వ సంవత్సరమున మరియొక వ్యాకరణమును రచించిరి. కాంబెలు వ్యాకరణము తెలుగు వ్యాకరణముల పద్ధతిని కొంత పోలియున్నది. కాని సి. పి. బ్రౌను వ్యాకరణము క్రొత్తమార్గమును త్రొక్కినది. తెలుగు వ్యాకరణముల పద్ధతి క్రొత్తగా భాషను నేర్చుకొను పాశ్చాత్య విద్యార్థికి భయమును కలిగించుచున్న దనియు, అట్టివానికి మొదట వ్యావహారిక భాషను గూర్చిన వ్యాకరణమే ఉపయుక్త మగు ననెడి తలంపుతో బ్రౌను దీనిని రచించెను. పండితులతో కంటే సామాన్యులతో కలిసిమెలసి నివసించుట వలననే భాషా హృదయము పట్టుబడునని అతని విశ్వాసము. (ఇందు 12 భాగములు కలవు.) ఆర్డెన్ దృష్టికూడ ఇట్టిదే. తెలుగు నేర్చుకొనెడి పాశ్చాత్య విద్యార్థి ప్రారంభించుటకు, క్రమముగా వ్యావహారిక భాషను స్వాధీనము చేసికొనుటకు పిమ్మట గ్రాంధిక భాషను పరిచయము చేసికొనుటకు వీలుగా ఇతడి వ్యాకరణమును మూడు భాగములుగా రచించెను. ఈ వ్యాకరణ రచనలో ఇతనికి పై రెండు వ్యాకరణములేకాక కొన్ని ఇతర ఆంధ్ర వ్యాకరణములు కూడ సాయపడినవి.

II అలంకార శాస్త్రము  :- కావ్య లక్షణములను నిర్దేశించెడి శాస్త్రమునకు అలంకార శాస్త్రమని పేరు. సంస్కృతము నందు దీనివిషయమై అపారమైన కృషి జరిగి ఎన్నియో ఉద్గ్రంథములు వెలువడినవి. ఆంధ్రభాష యందు కూడ అలంకార శాస్త్రవిషయముపై కొన్ని గ్రంథములను ప్రాచీనులును, అర్వాచీనులునుగూడ రచించిరి. అవి వరుసగా సమీక్షింపబడుచున్నవి.

కావ్యాలంకార చూడామణి : విద్యానాథ కృతమయిన ప్రతాపరుద్రీయమును, ఆచార్య దండికృతమైన కావ్యా దర్శమును ఆధారముగా గొని స్వీయ కల్పనలతో విన్నకోట పెద్దయకవి ఈ గ్రంథమును రచించి, చాళుక్య వంశీయుడగు విశ్వేశ చక్రవర్తికి అంకిత మిచ్చెను. విశ్వేశ చక్రవర్తి క్రీ.శ.1407 ప్రాంతమువాడు. విన్నకోట పెద్దయకవి శాలివాహన శకవర్షము 1324 తరువాతనే ఈ గ్రంథమును రచించినట్లు చారిత్రికుల అభిప్రాయము. విన్నకోట పెద్దయ నియోగి బ్రాహ్మణుడు, తండ్రి గోవిందామాత్యుడు. నివాసము రాజమహేంద్రవర ప్రాంతము. విద్యానాథుడు ప్రతాపరుద్రునకు అంకితముగా ప్రతిలక్ష్యమును రచించినట్లే ఇతడు చాళుక్య విశ్వనాథునికి అంకిత మగునట్లుగా ప్రతిలక్ష్యమును రచిం చేను. కావ్యాలంకార చూడామణియందు తొమ్మిది ఉల్లాసములు కలవు. భావమును, భావభేదములను తెలుపుటతో గ్రంథ మారంభమయినది. ప్రథ మోల్లాసమున విభావాదులును, స్థాయి భావములును తెలుపబడినవి.ద్వితీయమున రసస్వరూప నిరూపణము చేయబడినది. తృతీయోల్లాసమున నాయికా నాయక లక్షణములు, సప్త విధ కవులు, అష్టాదశ వర్ణనములు వివరింపబడినవి. చతుర్దొల్లాసమున ముక్తకాది కావ్య భేదములు, ఉదాహరణ లక్షణము, విభక్తుల దేవతలు, సద్దళి మొదలయిన కావ్యములు, పాకశయ్యాదులు, కావ్యరీతులును చెప్పబడినవి. పంచమోల్లాసమున అర్థాలంకారములు వివరింపబడినవి. దండికృత కావ్యాదర్శ పద్ధతితో ఈ యలంకార క్రమ మున్నది. షష్టోల్లాసమునందు సంకరాద్య లంకారములు, శబ్దాలంకారములు, చతుర్విధ కందములు, బంధకవిత్వ లక్షణములు, పదదోషములు, వాక్యదోషములు, అర్థదోషములు మున్నగు నంశము లున్నవి. సప్తమోల్లాసము నందును, అష్టమోల్లాసము నందును ఛందస్సు చెప్పబడి నది. యతిప్రాసలక్షణములు, వృత్తలక్షణములు మున్నగు విషయములు ఇందుగలవు. నవమోల్లాసము వ్యాకరణ విషయములు కలది. తత్సమాది శబ్దస్వరూపములు క్రియా ప్రకరణము మొదలయిన విశేషము లిం దున్నవి.

ఇట్లు కావ్యాలంకార చూడామణి సర్వసాహిత్య లక్షణములును గలిగియుండుటచే దీనిని వ్యాకరణ గ్రంథ మనియు, ఛందోగ్రంథమనియు, అలంకార గ్రంథమనియు చెప్పవచ్చును.

ఆంధ్రచంద్రాలోకము  : విజయనగర రాజుల కాశ్రితుడై రామచంద్రపురము, చీపురుపల్లి అను గ్రామము లందుండిన అడిదము సూరకవి ఈగ్రంథమును రచించెను. ఇది జయ దేవకృతమైన సంస్కృత చంద్రాలోకమునకు అనువాదము. సంస్కృతకవులలో జయదేవులు కొందరు గలరు. వారిలో ప్రసన్న రాఘవ నాటకకర్తయు, చంద్రాలోక రచయితయునగు జయదేవు డొక్కడేయని విమర్శకుల యభిప్రాయము. జయదేవుని చంద్రాలోకమును ఆధారముగా జేసికొనియే అప్పయ్యదీక్షితుడు కువలయానందమును రచించెను. అప్పయ్యదీక్షితుడు గ్రహించిన పాఠభేదముల ననుసరించియే అనగా అప్పయ్యదీక్షితకృత కువలయానంద మూలము ననుసరించియే ఇది యనువదింపబడినది. అడిదము సూరకవి (క్రీ. శ. 1720-1785) గొప్ప తెలుగుపండితుడు. ఇతడు కవిసంశయ విచ్ఛేదము, ఆంధ్రనామ శేషము, కవిజనరంజనము, రామలింగేశ శతకము మున్నగు గ్రంథములను రచించెను. సూరకవి ఆంధ్రీకరణము, మూలమువలె సుబోధము గాకపోయినను, పద్యములు కంఠస్థము చేయుటకు యోగ్యముగా నున్నవి. అలంకారశాస్త్రము తెలుగున స్వతస్సిద్ధముగాక అనువాద రూపమగుటచేత మూలమువలె నుండని లోపము అన్నింటియందునువలె ఈ గ్రంధమునందును గలదు. ఉన్న వాటిలో నెల్ల చిన్నదై విద్యార్థులకు ఉపయోగకరమైనదీ గ్రంథము. ఇందు నూరలంకారములకు లక్ష్యలక్షణములు గలవు. తాడూరి లక్ష్మీనరసింహారావు, నేలనూతుల శివరామయ్యకవి, గని శేషయ్యశాస్త్రి అనువారు సైతమీ చంద్రాలోకము ననువదించిరి. ఆంధ్ర చంద్రాలోకము అక్కిరాజు ఉమాకాంతముగారి వ్యాఖ్యతో మిక్కిలి ఉపయోగకరమై యున్నది.

కావ్యాలంకార సంగ్రహము  : వసుచరిత్ర కారుడయిన రామరాజభూషణు డీగ్రంథమును రచించెను. అతడు తన నామ ధేయము నిందు “మూర్తికవి” అని పేర్కొనెను. శ్రీకృష్ణదేవరాయల అల్లు డయిన అళియరామరాజునకు అల్లుడగు తొరగంటి నరసభూపాలునకు ఈగ్రంథ మంకితము చేయబడుటచేత దీనికి “నరసభూపాలీయ" మను వ్యవహారము కలిగినది. ఈ నరసరాజు తండ్రి 'ఓబళు' డగుటచేత పెక్కుతావుల కవి, కృతిపతిని 'ఓబయ నారసింహ' 'ఓబయ నరసధీర' అని పేర్కొనెను. ఈ కృతి కర్తయు, కృతిభర్తయు క్రీ. శ. 16వ శతాబ్దివారు.రామరాజభూషణుడు యువకుడుగా నున్నప్పుడు శ్రీకృష్ణదేవరాయల ఆస్థానమునందుండి చరమవయస్సున వసు చరిత్రను అళియరామరాజు తమ్ముడగు తిరుమల దేవరాయలకు అంకిత మిచ్చెను. ఈ మధ్య కాలమున నెప్పుడో ఓబయ నరసరాజునకు అంకితముగా ఈ నరసభూపాలీయమును, రచించెను. ఐదాశ్వాసముల గ్రంథము. ప్రతి పద్యమునందును నరసరాజు పేరుండును. ఒక్క నాటక లక్షణము తప్ప తదితర కావ్యలక్షణములును, రసభావాది నిరూపణమును ఇందుగలవు. విద్యానాథుడు రచించిన సంస్కృత ప్రతాపరుద్రీయమున కిది అనువాదమే అనదగియున్నను కొన్ని యంశములు ఇతర అలంకార గ్రంథముల నుండి సంగ్రహింపబడి యున్నవి. నాటక ప్రకరణము మాత్ర మనూదితము కాలేదు. మధురమైన శైలిలో కావ్య లక్షణములుగల ఉత్తమ గ్రంథమని దీనిని పేర్కొనవచ్చును. పరంపరాయాతమగు పాఠప్రవచనాదులచే ఈ గ్రంథ మాంధ్రదేశమునం దంతటను ప్రచారములో నున్నది.

ఈ గ్రంథమునకు ప్రాచీనమైన వ్యాఖ్యానములేదు. సుమారు ముప్పది సంవత్సరములకు పూర్వము కీర్తి శేషులయిన వెల్లాల సదాశివశాస్త్రిగారు (వీరు హైదరాబాదు రాష్ట్రమునందలి జటప్రోలు సంస్థానమున నుండిన గొప్ప వైయాకరణులు) నరసభూపాలీయమునందలి నాయక రసప్రకరణములకు మాత్రము వ్యాఖ్యను రచించిరి. అందు వారు విశేషించి మూలమును విమర్శించిరి. ఇంచుమించుగా వారికి సమకాలికు లనదగిన వింజమూరి కృష్ణమాచార్యులవారును, ప్రౌఢ వ్యాకరణకర్తయగు బహుజనపల్లి సీతారామాచార్యుల వారును కలసి యొక లఘు టీకను రచించిరి. ఇవి తప్ప ప్రాచీన వ్యాఖ్యలు లేవు. ఇటీవల శిరోమణి శ్రీ సన్నిధానము సూర్యనారాయణ శాస్త్రిగారు ఈ గ్రంథమునకు విపులమై, సకల సాహిత్య లక్షణ సమ్మిళితమైన వ్యాఖ్యానమును రచించినారు. ఇందు వీరు మూలమునందలి గుణదోషములను చర్చించు టయే కాక సల్లక్షణములను, ఉచితోదాహరణములను చేర్చిరి. ప్రతిఘట్టమునందును ప్రాచీనార్వాచీన ఆలంకారిక సిద్ధాంతములను సవిమర్శగా పొందుపరచిరి. రసాలంకార ధ్వనులలో అవసరమైన విషయముల నన్నిటిని వివరించిరి.

ఆంధ్ర కావ్యాదర్శము  :- ఆచార్య దండి కృతమైన సంస్కృత కావ్యాదర్శమునకు ఇది అవ్వారి సుబ్రహ్మణ్య శాస్త్రిగారి పద్యానువాదము. సరళమైన రచన, చక్కని అన్వయ సౌలభ్యము గల ఈ గ్రంథము పఠితలకు అత్యం తోపకారియై యున్నది.

ఆంధ్రకావ్య మీమాంస  : ఇది రాజశేఖరకవి సంస్కృతమున బహుళాంళములతో కావ్య జిజ్ఞాసువుల ఉపయో గార్థమై రచించిన "కావ్య మీమాంస"కు పంచాగ్నుల ఆదినారాయణ శాస్త్రిగారు ఒనర్చిన అనువాదము. సరళ రచనా ధురీణులగు శాస్త్రిగారి గ్రంథమును చక్కగా ననువదించి యున్నారు.

లక్షణ దీపిక  :- క్రీ. శ. 15 వ శతాబ్దివాడైన గౌరన ఈ గ్రంథమును రచించెను. దీనికి ప్రబంధ దీపిక యనియు నామాంతరము గలదు. ఇందు కొన్ని అలంకారములు తదితర కావ్య లక్షణములు నున్నవి.

అలంకార మంజరి  :- ఇది మమ్మటభట్టు రచించిన కావ్య ప్రకాశమునకు వివరణముతో రచింపబడిన అనువాదము. దీనిని శ్రీ శేట్టులూరి వేంకట రాఘవ అయ్యంగారు రచించిరి.

ఔచిత్య విచారచర్చ  :- ఇది క్షేమేంద్రుని సంస్కృత రచనకు శ్రీ తిరుపతి వేంకట కవులు శిష్యులయిన వేంకట రామకృష్ణ కవులు అనువాదము. ఈ గ్రంథమున వీరు లక్ష్యముల నన్నిటిని తెలుగు ప్రబంధములనుండి చూపి చదువరులకు ఆంధ్రలక్ష్య జ్ఞానము కలుగుటకై మిక్కిలి కృషి చేసిరి. ప్రాచీనాలంకారికులు తత్తద్విషయములు (గుణాలంకార రీతి ధ్వనులు) కావ్య జీవితమని చెప్పిరి. ఔచిత్య మొక్కటియే కావ్య జీవితమని సిద్ధాంతీకరించిన క్షేమేంద్రుని మత మిందు చక్కగా తెలుపబడినది. క్షేమేంద్రుని మరియొక గ్రంథమగు కవి కంఠాభరణమును సైతము వీరు ఆంధ్రోదాహరణములతో అనువదించిరి.

రసమంజరి : సంస్కృతమున భానుదత్తకృతమయిన ఈ గ్రంథమును గణపవరపు వేంకటకవియు, 'గుడిపాటి కోదండపతియు అనువదించిరి. కాని అవి లుప్తము లయినవి. తాడూరు లక్ష్మీనరసింహారావుగారు అర్వాచీనముగా దీని నాంధ్రీకరించిరి. ప్రాచీను డని చెప్పదగిన మంచెళ్ళ వాసుదేవకవియు “గంధవహము" అను పేరుతో దీని ననువదించెను. చింతలపల్లి రామకృష్ణమూర్తి శాస్త్రిగారు అచ్చ తెలుగున దీనిని వ్రాసిరి. వేదము వేంకటరాయశాస్త్రి గారు సంస్కృత మూలమునకు ఆంధ్రవ్యాఖ్యానమును రచించియున్నారు. ఇది ముప్పదియారు భేదములతో నాయికా లక్షణములను, నాయక లక్షణములను వివరించి యున్నది. నాయికా లక్షణములను ఇంత విపులముగా చర్చించిన గ్రంథము మరియొకటి లేదు. సాహిత్య దర్పణము  : ఇది విశ్వనాథ కవిరాజు వ్రాసిన సంస్కృత సాహిత్యదర్పణమునకు వేదము వేంకటరాయ శాస్త్రిగారి అనువాదము. ఇందు వీరు లక్ష్యలక్షణములను సూత్రములుగాను, వ్యాఖ్యానముగాను తెలుగున వివరించిరి, ఇది సాహిత్య దర్పణమునకు ఆంధ్రవ్యాఖ్యానముగా నున్నది.

కావ్యాత్మ  : ఇది కావ్యాత్మను గురించిన ప్రాచీనాలం కారికుల మతములను తెలుగున విపులముగా చర్చించి తెలుపునట్టి వచన గ్రంథము. దీనిని శెట్టులూరి వీరరాఘవ అయ్యంగారు రచించిరి. ఇది డాక్టరు. సుశీలకుమారడే గారి ఆంగ్ల రచనకు అనుసరణము.

అలంకార శేఖరము  : ఇది జయదేవకవి రచించిన సంస్కృతాలంకార గ్రంథమునకు చక్కని తెలుగు సేత. శ్రీ అవధానము చంద్ర శేఖరశర్మగా రి గ్రంథమును రచించియున్నారు. మూలమునందలి లక్షణశ్లోకములకు తెలుగున సూత్రములను రచించియున్నారు. ఇవి బాలవ్యాకరణ సూత్రములవలె చక్కని శైలితో అలరారుచున్నవి. లక్ష్యములకు స్వీయపద్యములను (అనువాదములు) రచించి యున్నారు. ఈ గ్రంథము అముద్రితము,

కావ్యప్రకాశవివృతి  : ప్రొద్దుటూరు వాస్తవ్యులయిన కాండూరి నరసింహాచార్యులవా రీగ్రంథమును రచించిరి. ఇందు మమ్మటుని కావ్యప్రకాశమునందలి మొదటి నాలుగు ఉల్లాసములు మాత్రమే అనువదింపబడినవి. సంస్కృత మూలమునకుగల వివరణములు మాత్ర మనువదింపబడినవి. లక్ష్యలక్షణములు సంస్కృతమునందలివే. వివరణము వ్యాఖ్యానప్రాయముగా సులభగ్రాహ్యముగా నున్నది.

కవికల్పలత : ఇది దేవేశ్వరుని సంస్కృతకృతికి కల్లూరి వేంకటసుబ్రహ్మణ్య దీక్షితులు గారి అనువాదము. ఇందు సాహిత్య విషయములు చక్కగా చర్చింపబడినవి. ఇది కవి శిక్షాగ్రంథము.

కువలయానంద ప్రకాశము  :- అప్పయ్య దీక్షితుల వారు రచించిన కువలయానందమునకు ఇది కటికనేని రామయ కవి యొనర్చిన తెలుగుసేత. కటిక నేనివారు పద్మనాయకులలో (వెలమలు) గలరు. కవి పుట్టుపూర్వోత్తరములు అంతగా తెలియవు. ఇతనితాత గోపరాజు. తండ్రి సూర శౌరి, తల్లి బుచ్చమ్మ. ఇది మూడాశ్వాసము'ల గ్రండము. మూలగ్రంథమంతయు అనువదింపబడినది. (1893.)

కువలయానంద సారము  :- బులుసు వేంకట రమణయ్యగారు దీనిని రచించిరి. ఇదియు అప్పయ్య దీక్షితుని కువలయానందమునకు కొన్ని శాస్త్ర చర్చలు విడిచి చేయబడిన అనువాదము. ఉదాహరణములు తెలుగు ప్రబంధముల నుండి ఈయబడినవి. కొన్ని యలంకారములకు చక్కని వివరణమును వ్రాసియున్నారు. కర్నూలు జిల్లా నందికోట్కూరు తాలూకా కరివెన గ్రామ వాస్తవ్యులయిన శ్రీధర పరశురామశాస్త్రిగారు సయితము కువలయానందమును సమగ్రముగా నాంధ్రీకరించి యున్నారు. కాని ఇంకను అది ముద్రితము కాలేదు.

ఆంధ్ర దశరూపకము  :- ఇది క్రీ. శ. ఎనిమిదవ శతాబ్దివాడగు ధనంజయుడు రచించిన గ్రంథమునకును, ధనికుని వివరణమునకును, శ్రీ మల్లాది సూర్యనారాయణశాస్త్రి గారి యనువాదము. ఇందు నాటక లక్షణములును, రస భావాది నిరూపణమును గలవు. శ్రీ శాస్త్రిగారు సుమారు నలువది సంవత్సరములక్రింద ఈ గ్రంథమును రచించిరి. మూలమునందలి కారికలు సూత్రరూపమున తెనిగింపబడినవి. సంస్కృత వివరణమునందలి చర్చలను సంగ్రహించి యున్నారు.

ప్రతాప రుద్రీయము  :- ప్రాచీనుడగు గణపవరపు వేంకటకవి 'నంజరాయ యశోభూషణము' అను పేరున విద్యానాథుని కృతి ననువదించెను. కాని అది లభ్యము కాలేదు. శ్రీ చలమచర్ల రంగాచార్యులుగారు "ప్రతాప రుద్ర యశోభూషణము" అను పేరుతో దీని ననువదించిరి. మూలగ్రంథము పేరుసయిత మదియే. ఇందు వీరు లక్ష్య లక్షణములను పద్యరూపమున అనువదించి యున్నారు. పద్యరచన, వివరణము సులభగ్రాహ్యములుగా నున్నవి. శ్రీ రంగాచార్యులుగారి మరియొక గ్రంథము "అలంకార వసంతము”. ఇది ప్రధానముగా క్రీ. శ. పదునేడవ శతాబ్దివాడైన వారణాసి ధర్మసూరి సాహిత్య రత్నాకరము నాధారముగాగొని రచింపబడినది, అలంకార వసంతము "విశ్వనుతనామ గోపాలపేట రామ" అను మకుటముగల సీసపద్యమయము, ఒక్కొక పద్యములో ఒక్కొక్క అలంకారమునకు లక్ష్యమీయ బడినది. లక్షణములు గద్యమునం దీయబడినవి.శ్రీ రంగాచార్యులుగారు క్షేమేంద్రుని ఔచిత్య విచారచర్చను సైత మనువదించిరి. అది అముద్రితము.

నవరస గంగాధరము  :- శ్రీ జమ్ములమడక మాధవ రామశర్మగా రీ గ్రంథమును రచించిరి. ఇది జగన్నాథ పండిత రాయల రస గంగాధరము యొక్క ప్రథమాననమునకు ఆంధ్ర వివరణము. ఉదాహరణ శ్లోకములు మూలము నందలివే. విషయ వివరణము, చర్చ శిష్ట వ్యావహారికాంధ్రభాషలో రచింపబడినవి. శ్రీశర్మగారిదేవిధముగా విద్యానాథుని ప్రతాపరుద్రీయమును అనువదించిరి.

నాట్య శాస్త్రము :- ఇది ప్రథమ సంస్కృతాలంకార గ్రంథము. భరతముని ప్రణీతము. నాట్యోత్పత్తి, నాట్య శాల, పూర్వరంగము, తాండవము, రసములు, భావములు, ఆంగికాభినయము, వాచికాభినయము, ఛందస్సు దశరూపకములు, ముఖాధి సంధులు, ఆహార్యాభినయము, సంగీతము, వాద్యములు మొదలగు విషయములు ఇందు 36 అధ్యాయములలో విపులముగా చర్చింపబడినవి. డాక్టరు పోతుకూచి సుబ్రహ్మణ్యశాస్త్రిగారు దీనికి విపులమైన వ్యాఖ్యానమును రచించి "భారతి" యందు వరుసగా ప్రకటించి యుండిరి. శ్రీ జమ్ములమడక మాధవరామశర్మగారు నాట్యశాస్త్రమును సంగ్రహించి తెనిగించిరట. ఇది అముద్రితము. శ్రీ భాగవతుల కుటుంబ శాస్త్రి కూడ దీనిని అనునదించి త్రిలింగలో రెండు అధ్యాయములు ప్రచురించిరి. శ్రీ పోణంగి శ్రీరామ అప్పారావు సంగీతశాస్త్ర భాగమును వదలి తక్కిన 30 అధ్యాయములను తెనిగించి “సంస్కృతి"లో వరుసగా ప్రకటించుచున్నారు. వీరు భామహుని "కావ్యాలంకారము"ను గూడ తెనిగించి వ్యాఖ్యానమును రచించిరి. ఇది అముద్రితము. ఇవన్నియును గద్యానువాదములే.

ఆంధ్ర కావ్యాలంకార సూత్రవృత్తి :- ప్రాచీనాలంకారికులలో కావ్యాత్మ 'రీతి' యని సిద్ధాంతీకరించిన వామనుని కావ్యాలంకార సూత్ర వృత్తికిది అనువాదము. దీనిని వేదాల తిరువేంగళాచార్యులుగారు రచించిరి. శ్రీ ఆచార్యులుగారు సూత్రములను, వృత్తిని వచన రూపమున అనువదించినారు. సూత్రసంఖ్యలతోసహా తెలుగు సూత్రములు రచింపబడినవి. ఉదాహరణములను తెలుగు కావ్యములలో ప్రాచీనార్వాచీన రచనలనుండి సేకరించినారు.

ధ్వన్యాలోకము  :- "కావ్యాత్మధ్వని" యని స్ధాపించి లోకమున సాహిత్యాచార్య మూర్ధన్యుడుగా పరిగణింపబడిన ఆనందవర్ధనుని ధ్వన్యాలోకమును కొందరు అనువదించి యున్నారు. వారిలో పేర్కొనదగిన వారు శ్రీ వేదాల తిరు వేంగళాచార్యులుగారు. వీరు మూలమును జక్కగా ననువదించుటయేకాక ఉదాహరణములను తెలుగు ప్రబంధముల నుండియు, ఆధునిక రచనలనుండియు ఎత్తి చూపించినారు. ఇది వీరిరచనలోని వైశిష్ట్యము. ఇక నీగ్రంథము నాంధ్రీకరించిన వారిలో బొడ్డపాటి కుటుంబరాయశర్మ, పంతుల లక్ష్మీనారాయణశాస్త్రి) (విజయనగర సంస్కృత కళాశాలా పండితులు), భాగవతుల కుటుంబశాస్త్రి గారలు ప్రశంసింప దగినవారు. వారి రచనలు యథామూలముగా నున్నవి. కుటుంబ శాస్త్రిగారి అనువాదము సుబోధముగా నున్నది కాని గ్రంథము 'కొంతవరకే రచింపబడినది. ఇక నందరికన్న ముందు జెప్పదగినవారు అవ్వారి సుబ్రహ్మణ్యశాస్త్రిగారు. ధ్వన్యాలోకమునందు 'ధ్వని' యని మాత్రము పేర్కొనదగిన మూల భాగమునకు వీరి రచన పద్యాను వాదము,

రసాభరణము  :- అనంతామాత్యు డీ గ్రంథమును క్రీ.శ, 1434 లో రచించెను. భోజరాజీయము, ఛందో దర్పణము, అనునవి ఇతడు రచించిన మరి రెండు గ్రంథములు. రసాభరణము శృంగార రసమును, తత్సామగ్రిని సమగ్రముగ నిరూపించునట్టి గ్రంథము. ఇందు నాలుగాశ్వాసములు గలవు. మొదటి ఆశ్వాసమున స్థాయిభావముల యొక్కయు, విభావానుభావ సాత్త్వికభావముల యొక్కయు లక్ష్య లక్షణములును నవరసముల ఉదాహరణములును గలవు. రెండవ యాశ్వాసమున ఆలంబనోద్దీపన విభావలక్షణములును; సాత్త్విక సంచారి భావముల లక్షణోదాహరణములును గలవు. హావభావాది శృంగార చేష్టలు ఉద్దీపన విభావాంతర్గతములు అను విషయ మిందు నిరూపింపబడినది. మూడవ యాశ్వాసమునందు శృంగార భేదములును, చక్షుః ప్రీత్యాది ద్వాదశావస్థలును, నాట్యశాస్త్ర ప్రో క్తములయిన శృంగార భేదములును, భావోదయాదులును, రస సాంకర్యములును చెప్పబడినవి. నాల్గవ యాశ్వాసము నాయికా నాయక లక్షణములు గలిగియున్నది. కావ్యాలంకార చూడామణి తరువాత ఆంధ్రలక్షణ గ్రంథములలో బేర్కొనదగినది రసాభరణమే.

శృంగార రసాలవాలము  : ఇదియు ప్రాచీనమగు లక్షణ గ్రంథమే. వెణుతుర్ల వడ్డీకవి దీనిని రచించెను. ఈ కవి శుక్ల యజుశ్శాఖీయుడు. తండ్రి మంగళగిరి. తాత వెంగనార్యుడు. ఇతని నివాసముగాని, కాలముగాని తెలియదు. శృంగారరసాలవాలము మూడాశ్వాసముల గ్రంథము. ప్రథమాశ్వాసమున కావ్యలక్షణమును, రత్యాది భావస్వరూపములు మొదలయిన శృంగారసామగ్రీవర్ణనమును గలవు. ద్వితీయాశ్వాసమున నాయికా భేదములును, తృతీయాశ్వాసమును ప్రోషిత భర్తృకాది - అష్టవిధ శృంగార నాయికాది భేదములును తెలుపబడినవి. ఇతని మరియొకకృతి బాలగోపాల విలాసము.

ఆంధ్రనటప్రకాశిక  : శ్రీ పసుపర్తి యజ్ఞనారాయణ శాస్త్రి దీనిని రచించెను (1980). ఇతడు నాటకకర్త గాయకుడు, నాట్యాచార్యుడు, కవి. తన స్వీయానుభవమును పురస్కరించుకొనియు, కొంతవరకు ప్రాచీన శాస్త్రకర్తల ననుసరించియు, రూపకాభినయ గాంధర్వ విద్యాసూత్రములను నిర్దుష్టమును, శాస్త్రసిద్ధమునైన శైలిలో క్రోడీకరించెను. ఇది పది ప్రకరణములుగా విభజింపబడినది. అవి అభినయము, సంగీతము, నాయకులు,రసము, నాటకము, ప్రయోగము, రంగము, కావ్యము, నటుడు, పాత్రము అనునవి. ఇందు ఆయానటుల వేషధారణమునకు సంబంధించిన పెక్కు చిత్రములుకూడ కలవు.

శ్రీ పురాణం సూరిశాస్త్రి నాటక విమర్శనమును చేయుచు పెక్కు గ్రంథములను ప్రకటించెను. 1. నాట్యాం బుజము (తెలుగునాటక, రంగస్థలాది విమర్శనము); 2. నాట్యోత్పలము (పాశ్చాత్య నాటక విమర్శనము): 3. నాట్యాశోకము; 4. నాటకసంఘ సంస్కరణము మొదలగునవి. శ్రీ గొల్లపూడి శ్రీరామశాస్త్రిగారు ‘ఆంధ్రనాటక రంగము' అనునొక గ్రంథమును ప్రకటించిరి. శ్రీ బల్లారి రాఘవాచారిగారు 'నాటక దీపిక' అను చిన్న గ్రంథమును రచించిరి. ఇవి యన్నియును ఆంధ్ర నటప్రకాశికకు ఇంచుమించుగా సమకాలికములే.

దశరూపక సంగ్రహము  :- క్రీ.శ. 1891 ప్రాంతముల శ్రీ కొమండూరు అనంతాచార్యులు దీనిని రచించిరి. ఆంధ్రీకృత సంస్కృత నాటకములు పాఠ్య గ్రంథములుగా నుండెడివి. కాని రూపకలక్షణమును దెల్పు ఆంధ్ర గ్రంథము లేకుండెను. అందుచేత వీరు ధనంజయకృత 'దళరూపకము'ను సంగ్రహించి దశరూపక సంగ్రహమను పేర వచనములో వ్రాసినారు.

అలంకారతత్త్వ విచారము  :- దీనిని శ్రీ కురుగంటి సీతారామయ్యగారు రచించినారు (క్రీ. శ. 1915). కావ్యము, శబ్దాలంకారములు, అర్థాలంకారములు అను విషయములు ఇందు చర్చింపబడినవి. స్వతంత్ర విమర్శనమునకు దొరకొనిన ప్రథమ గ్రంథములలో నిది యొకటి. జక్కన 'విక్రమార్క చరిత్రము'ను గూర్చిన లఘువిమర్శనము కూడ ఇందు చివరను గలదు.

ఆంధ్ర కువలయానందము  :- శ్రీ కంభంపాటి సుబ్రహ్మణ్యశాస్త్రి దీనిని రచించెను. (క్రీ.శ. 1947) అప్పయ దీక్షితుని కువలయానందమున కిది యొక్కటియే సమగ్రానువాదము. అనువాదము సుబోధము కావలెనను తలంపుతో వచనమందు రచించి నలుగురును వాడుకొను పదములనే ఎక్కువగా వాడియున్నారు. ద్వితీయ ముద్రణము మరింత సుబోధకముగా నున్నది.

గీర్వాణ రూపకము  :- శ్రీ తల్లావజ్ఝల కృత్తివాస తీర్థులు దీనిని రచించిరి. కేవల నాటక లక్షణములను దెలుపు నట్టి గ్రంథముగా దీనిని పరిగణింప వచ్చును. రూపకములు, ఉపరూపకములు, వాని లక్షణములు, ఉదాహరణ గ్రంథముల నామములు ఇందు వివరింపబడినవి. ఈ గ్రంథము వచనరూపము. “ప్రాదుర్భావము, రూపక భేదములు, రూపకశబ్దము, నృత్తాదికము, రూపక భేదములు, లక్షణము, రూపక వివరణము, వ్యుత్పన్న రూపకములు, రూపక పరిణామము. ప్రేతాగృహము (Theatre), ఉపరూపకములు, కొందరు నాటక కర్తలు, పరిభాషలు అను విషయములతో సులభ గ్రాహ్యముగా ఈ గ్రంథము రచింపబడి యున్నది.

ఇట్లు లక్షణ గ్రంథముల శ్రేణియందు చేర్పదగిన మరికొన్ని చిన్న యలంకార గ్రంథములు, కందుకూరి వీరేశలింగము పంతులు మున్నగువారు రచించినవి కలవు. III ఛందశ్శాస్త్రము  :- పద్యరూపమయిన కవిత్వము ప్రాచీన కాలమునుండియు మన భాషలో కన్పట్టు చున్నది. నన్నయకు పూర్వపు శాసనములందు దేశీయ ఛందస్సులైన తరువోజ, అక్కర, సీసము, ఆట వెలది మొదలగునవి వాడబడియున్నవి. ఇవి మాత్రాగణయుతములు. తరువాత నన్నయభట్టు అక్షరగణ బద్ధములైన ఉత్పలమాలాది వృత్తములను గూడ ఉపయోగించి, ఆంధ్ర ఛందస్సామగ్రిని విస్తరింప జేసెను. నన్నయ భట్టారకుడు చింతామణియందు కొన్ని ఛందో విషయములను "ఆద్యోవళిః" మున్నగువాటిని సూచించెను. మొత్తముమీద కొన్ని తెలుగు కావ్యములు రచింపబడు వరకును ఛందో లక్షణము గ్రంథరూపమున లేకుండెనని యూహింప వచ్చును.

కవిజనాశ్రయము  :- భీమన ఛందస్సు అను ప్రసిద్ధిని బడసిన ఈ గ్రంథమే ప్రథమాంధ్ర చ్ఛందో గ్రంథము. వేములవాడ భీమకవి ఈ గ్రంథమును క్రీ. శ. 12వ శతాబ్దమున రచించెను. జైన వైశ్యుడైన మల్లియరేచన ఇందలి ప్రతి పద్యమునందును రేబా! రేచన శ్రావకా భరణాంక ! ప్రభృతి నామములతో సంబోధింపబడినాడు. కవిజనాశ్రయము భీమకవి కృతము కాదనియు రేచనయే దీనిని రచించెననియు నొక వాదము కలదు. బులుసు వేంకట రమణయ్యగారు ఇది రేచన కృతమని భావించినారు. వారి మతము ప్రకారము నైత మీ గ్రంథము క్రీ. శ. 12, 13 శతాబ్దముల నాటిదే. “వేములవాడను వెలసిన, భీమేశ్వర కరుణగల్గు భీమసుకవినేఁ, గోమటి రేచనమీదను, నీమహిఁగవులెన్న ఛంద మెలమి రచింతున్" ఇత్యాది పద్యములను ఉదాహరించియు, లోక ప్రతీతి ననుసరించియు, విమర్శయుతముగా శ్రీ జయంతి రామయ్య పంతులుగారు భీమకవి హైదరాబాదు రాష్ట్రమునందలి వెలిగందల వేములవాడయందుండి కవిజనాశ్రయమును రచించెనని నిశ్చయించియున్నారు. వారి మతమే పరంపరాగతమై బహు జనాదరమునొంది యున్నందువలన భీమకవి కవిజనాశ్రయమును రేచనకు అంకితముగా రచించె నని విశ్వసింతము.

ఇది ఛందోలక్షణములను దెలుపు గ్రంథమేయైనను ఇందు కావ్యప్రయోజనములు, కావ్య దోషములు మున్నగు మరికొన్ని విశేషములును గలవు. మొదటిది యగు సంజ్ఞాధికారమున గురులఘు వివేకము, గణస్వరూపము, యతిప్రాసముల నిర్ణయమును గలవు. రెండవది వియతి ఛందో౽ధికారము, ఇందు 26 ఛందములు, యతి రహితవృత్తములు, వాటి లక్షణములు వివరింపబడినవి. మూడవదియగు యతిఛందో౽ధి కారమున యతిని పాటింపదగిన వృత్తములు చెప్పబడినవి. నాలుగవదియగు ఉద్ధరమాలా వృత్తాధికారమునందు లయగ్రాహి, లయ విభాతి, త్రిభంగి, లయహారి, దండక అను వాని లక్షణములు చెప్పబడినవి. ఐదవది అర్థసమవృత్తాధి కారము.ఇందు నారీఫ్లుత, రతిప్రియాది వృత్తములు తెలుపబడినవి. ఆరవది విషమవృత్తాధికారము. ఏడవదియగు జాత్యధికారమునందు కందము, ఆర్య, గీతిభేదములు, సీసము, ఉత్సాహము, తరువోజ, గీదియ, అక్కరలు, ద్విపద, త్రిపద, చౌపద, షట్పద ఇత్యాదులు వివరింపబడినవి. (రగడ లక్షణము కవిజనాశ్రయమునందు లేదు. అది యర్వాచీనము, మరికొన్ని పద్యభేదములు ఆర్వాచీన లాక్షణికులచే నిరూపింపబడినవి). ఎనిమిదవ ఆధికారమున ఛందశ్శాస్త్రమునకు సంబంధించిన షట్రత్యయములును, తొమ్మిదవ అధికారమున కావ్యదోషములును తెలుపబడినవి. ఇట్లు నవాధికార పరిమితమైన ఈ ఛందోగ్రంథము మనకు లభించినవాటిలో ప్రాచీనతమమగుటచేత వ్యాకరణమునందు నన్నయవలె ఛందశ్శాస్త్ర విషయమున భీమకవి ప్రామాణికుడుగా నేటికిని ఎన్నుకొనబడు చున్నాడు.

ఛందోదర్పణము  : ‘అనంతుని ఛందస్సు' అను నామాంతరముగల ఈ గ్రంథమును రసాధరణకర్తయగు అనంతా మాత్యుడు రచించెను. ఛందోదర్పణము నాలుగా శ్వాసముల గ్రంథము. మొదటి యాశ్వాసమున సంజ్ఞ, యతి, ప్రాస, ప్రకరణములు గలవు. రెండవ యాశ్వాసమున గద్యలక్షణము, వృత్తలక్షణములును, వివరింపబడినవి. మూడవ యాశ్వాసమున జాతులు, షట్రత్యయములును చెప్పబడినవి. నాలుగవ యాశ్వాసమున దోషవివరణము, వ్యాకరణాంశము లైన సంధి సమాసం వివరణములును గలవు. ఇది కవిజనాశ్రయము నాధారముగాగొని వ్రాసిన గ్రంథము వలె నున్నది. కాని సులభగ్రాహ్యముగా నున్నది. లక్షణసార సంగ్రహము  :- చిత్రకవి పెద్దనార్యుడు దీనిని రచించెను. ఇది మూడాశ్వాసముల గ్రంథము. ఈ కవి 16 వ. శతాబ్ది మధ్యకాలమున నున్నవాడు. “పార్శంచాల" అనునది ఇతని ఇంటి పేరని గ్రంథపీఠికను బట్టి తెలియుచున్నది. కాని అది "పార్శంచాల" అయి యుండవలెను. పార్శంచాల గ్రామము కర్నూలుకు 40 మైళ్ళ దూరమున నున్నది. ఈ గ్రంథమునందు అక్షర జాత్యాది లక్షణము మొదలుకొని ఛందోలక్షణములును, పద్య లక్షణములును, రేఫ, ఱకార భేదములును, చిత్ర కవిత్వ లక్షణమును, షట్ప్రత్యయ విశేషమార్గములు మున్నగు విషయములును గలవు. ఏ తెలుగు లక్షణ గ్రంథమునందునులేని దశరూపకముల (నాటకాదుల) లక్షణము లిందు గలవు. దీనినే కొందరు పూర్వులు సర్వ లక్షణసారసంగ్రహ మనిరి. రమణకవి సాంబవిలాసము నందు "సర్వలక్షణసార సంగ్రహం బొనరించి తనరె మీతాత పెద్దన కవీంద్రు" డని వ్రాసెను. (కూచిమంచి తిమ్మకవి వ్రాసిన సర్వలక్షణసార సంగ్రహము దీనికంటె భిన్నము) ఈ లక్షణసార సంగ్రహము అప్పకవికి మార్గ దర్శకమై యుండునని విమర్శకులు తలంచుచున్నారు. ఇతర చ్ఛందోగ్రంథములందు రెండుమూడు పాదములలో గాని ఇముడని వృత్తలక్షణములు ఈ గ్రంథమున నొక్క పాదముననే ఇముడ్పబడి యుండుటచేత సులభముగా కంఠస్థము చేయుటకు అనువుగానున్నవి. చిత్రకవితా రీతులయందీ కవి మిక్కిలిచాతుర్యమును జూపియున్నాడు.

లక్షణ శిరోమణి  :- ఇది పొత్తపి వేంకటరమణ కవిచే రచింపబడినది. ఈకవి తాము నందవరమున నుండిన వార మనియు, క్రమముగా తమ ఇంటి పేరు "గ్రంథాలవారు, రాయనప్రగ్గడవారు, పొత్తపివారు, దుర్గరాజు వారు"గా మారిన దనియు తెలిపియున్నాడు. ఇది నాలుగాశ్వాసముల గ్రంథము. దీనియందు వర్ణగణ వృత్తవిశ్రమాధికారములు గలవు. వర్ణగణములను గురించి మిక్కిలి విపులముగా వ్రాసియున్నాడు. ఇతడు కేవల లక్షణస్వరూపమునే తెలుపుచు తాను వ్రాసిన లక్షణములకు సంబంధించిన ఇతర కవులు లక్షణములను సైతము తెలిపియున్నాడు. తా నెరిగిన లక్షణగ్రంథ ముల నిట్లు పేర్కొనియున్నాడు. "భీమన ఛందస్సు అనంతుని ఛందస్సు, లక్షణసారసంగ్రహము (చిత్రకవి పెద్దన), లక్షణదీపిక (వార్తాకవి రాఘవయ్య). అధర్వణ ఛందస్సు, శ్రీధర ఛందస్సు, గోకర్ణ ఛందస్సు, కవిసర్ప గారుడము, కవిరాజ గజాంకుశము, వాదాంగ చూడా మణి" మున్నగునవి. గణపవరపు వేంకటకవిచే రచింప బడిన పెద్ద లక్షణ గ్రంథమగు 'లక్షణ శిరోమణి' కంటెను ఇది భిన్నమని వ్యక్తమగుచున్నది. ఈ గ్రంథమున యతి ప్రాస విషయము మిక్కిలి విపులముగా నున్నది. పూర్ణ-అర్థబిందు ప్రాసము మొదలయిన పెక్కు నూతనాంశములు ఇందు గలవు.

లక్షణ శిరోమణి  :- ఇది గణపవరపు వేంకటకవి రచితము. ఇందు ఛందో వ్యాకరణాలం కారములను గూర్చి తెలుపునట్టి పది యుల్లాసము లుండినట్లు తెలియుచున్నది. కాని అన్నియు లభింపలేదు. అయిదుల్లాసములు మాత్రము 'ఆంధ్ర సాహిత్య పరిషత్తు" వారికి లభించినవి. ప్రథమోల్లాసమున మహాకావ్య స్వరూపమును, ద్వితీయోల్లాసమున వేంకటేశాంధ్ర నిఘంటువును, తృతీయోల్లాసమున ఆంధ్ర కౌముదియు, చతురోల్లాసమున ఛందో విషయమును, పంచమోల్లాసమున రేఫ ఱకార నిర్ణయమును గలవు. ప్రథమా శ్వాసము యొక్క చివరనున్న గద్యమందు గ్రంథకర్త పేర్కొన్న బహుళాంశములుగల ఇతర గ్రంథ భాగము దురదృష్టవశమున లభింపలేదు. ఆంధ్ర వాఙ్మయము నందలి లక్షణ గ్రంథములలో ఈ లక్షణ శిరోమణి ద్వయము ఛందోవ్యాకరణములను గురించి సమగ్రముగా తెలుపుచున్నది. ఈ గ్రంథకర్తలు క్రీ.శ. 17 వ శతాబ్దమువారు. అయినను అపూర్వములయిన ప్రాచీన గ్రంథముల నుద్ధరించిరి. ఇవి ముద్రింపబడినచో ఆంధ్ర వాఙ్మయమున నూతనాంశము లెన్ని యో భాషాసేవకులకు తెలియగలవు. పరిషత్పు స్తక భాండాగారము వారు మరికొన్ని లక్షణ గ్రంథములను పట్టికలో నిచ్చియున్నారు. వాటిలో ముద్రితములు, అముద్రితము లును గలవు. సంగ్రహవిజ్ఞానముకొరకై వాటిని గురించి తెలిసికొందము.

సకల లక్షణసారసంగ్రహము  :- ఇది కొన్ని గ్రంథముల సంపుటి. ఇందు ముఖ్యముగా రత్నాకరము గోపాల కవి ప్రణీతమైన “సకల లక్షణసార సంగ్రహము" గలదు. ఇందు రాజనరేంద్ర చరిత్రము, కమలాకర చరిత్రము అంబాల భాణము మున్నగు నపూర్వ గ్రంథములనుండి ప్రయోగములు గై కొనబడినవి. ఛందో లక్షణములు సులక్షణసారమునుండియే గ్రహింపబడినవి. ఈ కవి క్రీ.శ. 1630 తరువాతి వాడని పరిశోధకులు తలచుచున్నారు.

సుకవి కర్ణామృతము  : ఇది కౌలూరి ఆంజనేయ కవి రచితము. దీనికి 'కుకవికర్ణ కఠోరము' అను నామాంతరము గలదు. ఇందు యతిప్రాస ప్రకరణములు మాత్రమే కలవు. గురు లఘు నిర్ణయము, గణవిభజనము గ్రంథాదిని తెలుపబడినవి. లింగమగుంట తిమ్మన్నకృతమైన బాల బోధచ్ఛందస్సునుండియు, చిత్రకవి పెద్దన వ్రాసిన లక్షణ సార సంగ్రహమునుండియు లక్షణములు స్వీకరించబడినవి. ఈ కవి క్రీ. శ. 16 వ శతాబ్ది ప్రాంతము వాడని పరిశోధకు లూహించుచున్నారు.

లక్షణమంజరి  : ఇది నైషధము తిమ్మకవి ప్రణీతము. ఏకాశ్వాస గ్రంథము. ఛందోవిషయక గ్రంథమైనను కొన్ని వ్యాకరణాంశములు సైత మిందు చేరియున్నవి. లక్ష్యలక్షణములు స్వయముగా కవి రచించినవే. ఈ గ్రంథము గరళపురీశ్వరున కంకితము చేయబడుటచే దీనికి “గరళపురీచ్ఛంద" మను పేరు సైతము కలదు. ఈ గరళపురము మైసూరు రాష్ట్రమునగలదు. కవి ఆ ప్రాంతము వాడేయని విశ్వసింపబడుచున్నది.“యతులును, గణములు, ప్రాసము, లతులం బగు సంధివిధము లక్షర ఫలముల్, వితతాంధ్ర మహిమలెల్లను, జతురత వివరింతు సుకవిజాలము మెచ్చన్" అని కవిచేసిన ప్రతిజ్ఞ వలన మనకు గ్రంథస్థ విషయములు ఊహింప వీలగుచున్నవి. ఇతడు ఇతర లాక్షణికులకంటె విలక్షణముగా ఏబది యతులను బేర్కొనియున్నాడు. విషయము ఏకీభవించినను యతుల పేర్లు క్రొత్తగా నున్నవి. "శుద్ధ స్వర యతి, గూఢస్వర యతి, ఋత్వహిత యతి, ప్రకారసంధి యతి, తద్భవయతి, చిత్రయతి, శకంధు యతి, ఆదేశ యతి. సహార్ధ యతి, చతుర్థీవిభక్తి యతి, పంచమీవిభక్తి యతి. ప్రభునామ యతి. సంయుక్తోష్మ సహార్థయతి" ఈ రీతిగా ఏబదియు క్రొత్త పేర్లతోనున్నవి. ఇదియును అముద్రితమే.

కవితాలక్షణసారము  : రామయకవి దీనిని రచించెను. ఇది ఏడధ్యాయముల అముద్రిత గ్రంథము. కవిచింతా మణి మొదలగు లక్షణ గ్రంథములనుండి ఉదాహరణములు గ్రహింపబడినవి. భోగావళి, బిరుదావళి, గుణావళి, చక్రవాక, చతుర్భద్ర, చతురంతర, చౌశొత్తర, త్యాగఘోష, జయఘోష మొదలయిన రగడలక్షణములును, లక్ష్యములును సంస్కృతాంధ్రములలో రచింపబడినవి. ఈకవి హరితసగోత్రుడు. తండ్రి పేరు అనంతయా మాత్యుడు.

లక్షణదీపిక  : ఇది గౌరనవిరచితము. నవనాథ చరిత్రము మున్నగు ద్విపద కావ్యములను రచించిన గౌరనకు ఈలక్షణదీపికా కర్తయగు గౌరనకు సంబంధమేమేని గలదా అను విషయ మింకను బరిశోధకులు నిర్ణయింప వలసిన విషయముగా నున్నది. "గౌరన లక్షణదీపిక" అను పేరుతో నధికముగా చాటు ప్రబంధ లక్షణములను దెలుపునట్టి మరియొక సంస్కృతగ్రంథప్రతి యున్నట్లు పరిషత్పు స్తక భాండాగార పట్టిక తెలుపుచున్నది. ఈ లక్షణ దీపికయందు ఐదు పరిచ్ఛేదములు గలవు. అక్షరములు, వాటి శుభాశుభఫలములు, వర్ణాధిదేవతలు, రూక్ష స్నిగ్ధ వర్ణవిచారము, గణములు, గణాధిదేవతలు. వాటి శుభాశుభ ఫలములు, నక్షత్రములు, రాసులు, మాతృకార్చన మున్నగు నంశము లిందు క్రమముగా చర్చింపబడినవి. గ్రంథము పద్యములు, శ్లోకములు, సంస్కృత వాక్యములు కలిగి యున్నది.

కావ్యచింతామణి  : "కవిచింతామణి”, “కావ్యాను శాసనము" అనునవి దీనికి నామాంతరములు. వెల్లంకి తాతంభట్టు దీనిని రచించెను. తాతంభట్టు "సాహిత్య చక్రవర్తి", “అష్ట భాషా ప్రక్రియా లబ్ధవర్ణుడు" అని అతడు వ్రాసికొన్న పద్యమువలన తెలియుచున్నది. కావ్యచింతామణియందు "దోషాధికారము, ప్రాసాధికారము, భాషా లక్షణాధికారము" ఈరీతి విభాగము కలదు. పావులూరి మల్లనగణితము, భాస్కరరామాయణము, అనంతుని ఛందము మొదలయిన గ్రంథములనుండి లక్ష్యలక్షణములు గ్రహింపబడినవి. ఇదియు అముద్రితమే.

కవిసర్పగారుడము  : కాచన బసవన దీనిని రచించెను. "ఇతి శ్రీమన్నందవరకుల కలళపారావార - ఆత్రేయస గోత్ర పవిత్ర, సుజనవిధేయ, కుకవి కాద్ర వేయ వైన శ్రేయ, కాచన బసవననామధేయ ప్రోక్త శ్రీగిరి మల్లి కార్జున నామధేయాంకితంబైన కవిసర్ప గారుడంబున గణాక్షర ఫలంబన్నది ప్రథమాశ్వాసము" ఇత్యాది గద్యములచే ఈ కవిని గురించిన యంశములు తెలియుచున్నవి. ఈ గ్రంథమునందు గణాక్షర దేవతా ఫలాదివిషయములు, ఛందశ్శాస్త్రము, మంత్రశాస్త్ర మనదగినంతగా తెలుపునట్టి పూజాక్రమాదులు, వాటితోపాటు శృంగారాది రసభావములు వివరించబడినవి. యతుల ఉదాహరణములతో ఈ తాళపత్ర ప్రతి ముగిసినది.

ఆనంద రంగరాట్ఛందము : ఇది కస్తూరి రంగయ ప్రణీతము. నాలుగాశ్వాసముల గ్రంథము. “లక్షణ చూడామణి" అని దీనికి నామాంతరము. “ఇది శ్రీ మదు మామహేశ్వర కరుణాకటాక్ష లబ్ద సాహితీ విభవ ధర్మ వెచ్చకుల జలధి కుముదమిత్ర, వేంకటకృష్ణార్య పుత్ర, విద్వజ్జనమిత్ర, కుకవిజనతాలవిత్ర, ఆర్వేల కమ్మెని యోగికులీన లక్షణకవి కస్తూరి రంగయ ప్రణీతంబయిన ఆనంద రంగ చ్ఛందంబను లక్షణ చూడామణియందు సర్వంబును చతుర్థాశ్వాసము" అను గ్రంథాంత గద్యము కవిని గురించి తెలుపుచున్నది. ఇది కేవల చ్ఛందో గ్రంథమనదగి యున్నది.

సులక్షణ సారము  : ఇది లింగమకుంట తిమ్మకవి విరచితము. కాని ఈ గ్రంథము వెల్లంకి తాతంభట్టు ప్రణిత మయినట్టు ముద్రింపబడి నేటివరకును సులక్షణసార మనగానే తాతంభట్ట రచితమన్న విషయము పాఠకుల హృద యమున నాటుకొనిపోయినది. అది సత్యము కాదు. సులక్షణసారమును రచించినవాడు తిమ్మకవియే. వెల్లంకి తాతంభట్టు 'కవిచింతామణి'ని రచించిన ప్రాచీన విద్వాంసుడు. తిమ్మకవి అర్వాచీనుడు. గత సంవత్సరమున వావిళ్ళవారు సులక్షణసారమును సంస్కరించి పునర్ముద్రితము గావించినారు. దానిమీద లింగమకుంట తిమ్మకవి పేరును ముద్రించి పూర్వముద్రణమున జరిగిన పొరపాటును పీఠికలో వివరించియున్నారు. "శ్రీరామా కుచ మండలీ మిళిత. . . "ఇత్యాది పద్యములు మార్చి తాళపత్ర పరిశోధనమువలన లభించిన క్రొత్తపద్యములను గొన్నిటిని చేర్చి పూర్వ సులక్షణసారముకన్నను మంచి ప్రతినిగా సిద్ధము చేసినారు,

అప్పకవీయము  : కాకునూరి అప్పకవి ఈ గ్రంథమును రచించెను. ఇది నన్నయభట్టారక రచితమయిన 'ఆంధ్ర శబ్దచింతామణి'ని ఆధారముగా గొని బహుళాంశములను జేర్చి, కూర్చి రచించిన గ్రంథము. కవి యుద్దేశమున నిది వ్యాకరణ ప్రధానమయిన సమగ్ర లక్షణ గ్రంధమే. కాని ఛందోవిషయములు విపులముగా నుండుటయు, తదితర భాగములు తక్కువగా నుండుటయు, గ్రంథ మసంపూర్ణ మగుటయు కారణములుగా ఛందో గ్రంథముగానే దీనికి బహుళ ప్రచారము కలిగినది.

ఆంధ్రశబ్ద చింతామణి యందలి సంజ్ఞా, సంధి, తత్సమ, దేశ్య, క్రియాపరిచ్ఛేదములు అను ఐదింటిని విస్తరించి భాషా పరిచ్ఛేదము, వర్ణపరిచ్ఛేదము, వళి ప్రాస పరిచ్ఛేదము, పద్య పరిచ్ఛేదము, సంధి పరిచ్ఛేదము, తత్సమ పరిచ్ఛేదము, దేశ్య పరిచ్ఛేదము, క్రియా పరిచ్ఛేదము అను నామములతో ఎనిమిది ఆశ్వాసములుగా రచించుటకు అప్పకవి యుద్దేశించెను. కాని తత్సమ దేశ క్రియా పరిచ్ఛేదములు గ్రంథమునందులేవు. సంధి పరిచ్ఛేదము వరకే అయిదాశ్వాసములతోనే అసమగ్రముగా నిలిచిపోయినది. (పరిషత్పుస్తక భాండాగారమున నొక అప్పకవీయ తాళపత్ర ప్రతికలదు. అందు సంధి తత్సమ పరిచ్ఛేదములకు సంబంధించిన లక్ష్య లక్షణములున్నవి. ఆ భాగము నేటి ముద్రిత ప్రతులందు లేనిది. అది అప్పకవీయము యొక్క మిగిలిన భాగము కావచ్పునేమో యని యూహించుటకు వీలున్నది.) గ్రంథము పూర్తిగా రచింపకముందే అప్పకవి దివంగతుడై యుండవచ్చునని పలువురు తలచుచున్నారు. కాని పరిషత్పుస్తక భాండాగారము పేర్కొన్న తాళపత్ర ప్రతినిబట్టి యూహించినచో అప్పకవీయము పూర్తిగా మనకు లభింప లేదేమోయని చెప్పుటకు వీలున్నది. ఉన్న గ్రంథములో వళిప్రాస, పద్య పరిచ్ఛేదములుగల భాగము మిక్కిలి విస్తృతమై ఉపయోగకరముగా నుండుటచేత ఇది ఛందో గ్రంథముగా ప్రచారమును గాంచుట సమంజసముగానే యున్నది.

అప్పకవికి శాలివాహనశకము 1578 మన్మథనామ సంవత్సర శ్రావణ బహుళ అష్టమినాడు (క్రీ.శ. 1656 సం. ఆగష్టు 3వ తేదీ) కామేపల్లిలో నుండగా కల వచ్చినట్లును, చింతామణికి విపులమగు వ్యాఖ్యానము వ్రాయవలెనని స్వప్నమున కనిపించి విష్ణువు కవికి ఆజ్ఞ నిచ్చినట్లును అప్పకవీయమున గలదు. అప్పకవి పలనాటిసీమ (గుంటూరుజిల్లా) వాడని ఇంతవరకు ప్రకటించిన విమర్శలయం దన్నిటను గలదు, కాని ఇటీవల ప్రకటితమైన “వ్యాస ముక్తావళి" అను గ్రంథమునందు డాక్టరు బూర్గుల రామకృష్ణారావుగారు అప్పకవి గ్రామమును గురించి చర్చించి స్థల నిర్దేశమును చేసినారు. వారి యభిప్రాయము ప్రకారము 'కాకునూరు' హైద్రాబాదు రాష్ట్రమునందలి మహబూబు నగరము జిల్లాలో చేరుచున్నది. అంతేకాక మహబూబునగరము జిల్లా వేదుల గ్రామములో "కాకునూరు" ఇంటి పేరుగాగలవారున్నా రనియు, అప్పకవి తమ వంశీయుడైనట్లు వారు చెప్పుకొందురనియు తెలియవచ్చుచున్నది. ఈ విషయము పైవాదమును బలపరచుచున్నది.

అప్పకవి గొప్ప లక్ష్య లక్షణవేత్త. ప్రాచీనములైన లక్షణ గ్రంథముల నన్నింటిని పరిశీలించి, తత్సార భూతముగా అప్పకవీయమును రచించెను. ఆతడు తాను పరిశీలించిన పెక్కు గ్రంథములను పేర్కొనుటయేకాక ప్రథమాశ్వాస ప్రారంభమునందు లక్షణ గ్రంథములు లక్షోప లక్షలు గలవనెను. అప్పకవి పేర్కొన్న గ్రంథము లన్నియు మనకు లభింపలేదు. వ్యాకరణాంశముల యందును, యతివి స్తృతి యందును నేటి విమర్శకులు కొందరు అప్పకవి సిద్ధాంతములను విమర్శించియున్నారు. మత భేదములు, విమర్శలు, నిరవధికములు గనుక మనకున్న ఛందో గ్రంథములలో కవితాభ్యాసము చేయువారికి అప్పకవీయము కల్పతరువువంటి దనుట నిర్వివాదాంశము.

IV నిఘంటువులు  :- సంస్కృత భాషయందువలెనే తెనుగునందు పూర్వలాక్షణికులు కొందరు నిఘంటువులను రచించిరి. అవియన్నియు పద్యాత్మకములు. కంఠస్థము చేసికొన్న వారికే వాటియుపయోగము. అవసరమువచ్చి నప్పుడు చూచుకొనుట కాధునిక నిఘంటువులవలె అవి ఉపయోగింపవు.

ఆంధ్రనామ సంగ్రహము  :- ఇది పద్యాత్మకమై ఆంధ్రుల జిహ్వారంగమున తాండవించునట్టి నిఘంటువు. "తెనుగు పేళ్ళరసికూర్చి” అని చెప్పుకొనుటచేత గ్రంథకర్తయైన పైడిపాటి లక్ష్మణకవి ఈ గ్రంథమును స్వోపజ్ఞముగ రచించెనని ఊహించుటకు వీలున్నది.

ఆంధ్రనామ శేషము : అడిదము సూరకవి ఈ నిఘంటువును రచించెను. ఆంధ్రనామ సంగ్రహమునకిది పరిశిష్ట రూపము. దానియందు చెప్పబడని తెనుగుమరుగుములను కూర్చెదనని గ్రంథకర్తయే చెప్పుకొన్నాడు. సూరకవి 18వ శతాబ్దివాడు; లక్ష్మణ కవి తత్పూర్వుడు. . సాంబ నిఘంటువు  :- ఇది కస్తూరి రంగకవిచే రచింప బడినది. ఇతడీగ్రంథమును గణపవరపు వేంకటకవి ప్రణీతమైన వేంకటేశాంధ్రమును జూచి రచించి యుండునని విమర్శకుల యభిప్రాయము. ఆంధ్రనామ సంగ్రహము నందువలెనే దీనియందును దేవ, మానవ, స్థావర, తిర్యక్, నానార్థవర్గులు కలవు. కాని వేంకటేశాంధ్రమువలె ఇది ప్రౌఢముకాదు. ఆంధ్రనామ సంగ్రహము, ఆంధ్రనామ శేషము, సాంబనిఘంటువు నను నీ మూడును ఎక్కువ ప్రచారమును పొందిన నిఘంటుత్రయము. ఇవి మూడును కలిపియే ముద్రితములగుచున్నవి. పైడిపాటి లక్ష్మణకవి ఆంధ్రనామ సంగ్రహమునేకాక “ఆంధ్ర రత్నాకరము" అను మరియొక నిఘంటువును సైతము రచించినాడు. అదియు పద్యాత్మకమే. గణపవరపు వేంకటకవిచే రచింపబడిన " వేంకటేశాంధ్రము" సాంబనిఘంటువుకన్న విపులము, ప్రౌఢము, సలక్షణమునై యున్నది. ఇతడు "దేశీయాంధ్ర నిఘంటువు" అను మరియొక్క నిఘంటువును గూడ రచించెను. పూసపాటి వీరపరాజు "ఆంధ్రపదాకరము” అను నొక పద్యాత్మక నిఘంటువును రచించెను. ప్రెగడపువారి కందము లొక కాలమున నిఘంటుజ్ఞానమునకు ఉపయోగించునవియై ప్రచారమునందుండినవి. చౌడప్పసీసములు సయితము తెనుగుపదముల నెరుక పరచునవియై యొక నాడాంధ్రుల జిహ్వారంగమున తాండవించెను. నుదురుపాటి వేంకటకవి రచించిన “ఆంధ్ర భాషార్ణవము" ఉత్తమమైన ప్రాచీనాంధ్ర నిఘంటువు. దీనికి అకారాది క్రమములో పట్టిక తయారుచేసినచో ఎక్కువగా ఉపయోగపడగలదు. ఇది అమరకోళ పద్ధతిలో రచింపబడినది. మన పూర్వులు విద్యాత్మక ములుగా రచించిన నిఘంటువులలో ఇంతవరకు బేర్కొన్నవి మనకు లభించినవి. వీటిలో ముద్రితములు, అము ద్రితములును గలవు. ఇక మనకు లభింపక ఎన్ని కాల గర్భమున గలిసిపోయెనో తెలియదు. పై నిఘంటువు లన్నియును పద్యాత్మకములై, పర్యాయపదములను మాత్రమే తెలుపుచున్నవి.

ఈ కాలమున ఆంగ్లనిఘంటు పద్ధతి తెలుగునందును అనుసరింపబడుటచేత ప్రాచీనాంధ్ర నిఘంటువులను చదువు వారు బహుస్వల్ప సంఖ్యాకులు. నవీనపద్ధతికి మార్గదర్శకమైన మొట్టమొదటి తెలుగు నిఘంటువును విలియం బ్రౌను అను నతడు 1807 లో “A Vocabulary of Gentoo and Telugu" అను పేరుతో ప్రకటించెను. అకారాది వర్ణక్రమమున వెల్వడిన తెలుగు - ఇంగ్లీషు నిఘంటువులలో ఇదియే మొదటిది. ఆనాడు తెలుగుదేశములో వ్యవహారమునందున్న పెక్కు శబ్దములు అనగా తెలుగు వారు సాధారణముగా ఇంటను, బయటను వాడుక చేసెడి పదములేకాక కోర్టుకచ్చేరీలలో వ్యవహారరీతిగా వాడుకొనెడి పదములుకూడ ఇందున్నవి. మరియు ఉపయోగ సరణి ఎక్కువ స్పష్టముగా తెలియ జేయబడినది. ఇందు "అ" ఆ' లతోగల పదముల తరువాత క కారముతోగల పదములే యున్నవి. ఇ, ఈ, ఎ, ఏ లతో నుండవలసిన పదములు యీ, యీ, యె. యే లతోను; ఉ, ఊ, ఓ, ఓ లతో నుండవలసిన పదములు వు, వూ, వొ, వో లతోను; ఋకారముతో నుండవలసినవి, రుకారముతోను ఆయా స్థలములందున్నవి. ఇది వ్యవహారము నందలి ఉచ్చారణ పద్దతిని అనుసరించియున్నది.

ఈ విలియంబ్రౌను నిఘంటువు వెనువెంటనే ఎ. డి.కాంబెల్ రచించిన ఇంకొక 'తెలుగు-ఇంగ్లీషు నిఘంటువు 1810 ప్రాంతమున వెల్వడినది. ఇదికూడ అంతగా చెప్పదగిన సమగ్ర నిఘంటువు కాదు. ఇవి తెలుగు సభ్యసింపదలచిన ఆంగ్ల విద్యావంతులకుమాత్రము ఉపయోగపడును. ఇంగ్లీషు రాని తెలుగువారి కుపయోగపడునట్లుగా 'తెలుగు. తెలుగు' నిఘంటువును అకారాదిగా మొట్టమొదట రచించినవాడు మామిడి వెంకయ్య. ఇతని 'ఆంధ్రదీపిక' 1848 లో ముద్రితమయినను 1816లోనే రచింపబడినదట. శ్రీ చుండూరి రంగనాయకులు శ్రేష్ఠి రచించిన 'ఆంధ్రదీపిక' మరియొకటి గలదు. ఇది శాలివాహన శకము 1771 లో అనగా క్రీ. శ. 1849 లో ముద్రితమయినది. ఇవి రెండును భిన్నము లగునో, కావో తెలియదు.

ఈ నిఘంటువుల పిమ్మట సి.పి. బ్రౌను నిఘంటువులు ప్రకటితములయినవి (1852-54). ఈతడు పై ఇద్దరు పాశ్చాత్యుల కంటే ఎక్కువవిద్యాధికుడు, తెలుగుభాషలో అపారమయిన కృషి చేసిన పండితుడు, పెక్కురు పండితుల సాహాయ్యముతో ఆతడు 'ఇంగ్లీషు-తెలుగు', తెలుగు ఇంగ్లీషు' అను రెండు పెద్దనిఘంటువులను ప్రకటించెను. అంతేకాని తెనుగుభాషయందు వ్యవహారములోనున్న హిందూస్థానీ, ఆంగ్లము, తమిళము, మరాఠీ మొదలగు భాషలకు చెందిన పదములను కూర్చి, మిశ్ర నిఘంటువను పేర ఇంకొక నిఘంటువునుకూడ రచించెను.

తెలుగు-ఇంగ్లీషు నిఘంటువునందు తెలుగు పదములకు ఆంగ్లార్థములే కాక, తెలుగు అర్థములుకూడ ఒసగబడినవి. శబ్దార్థములను స్పష్టము చేసెడి లోకోక్తులను పూర్వకవి ప్రయోగ విశేషములను చక్కగా వివరించెను. ఇట్లు ఈ నిఘంటువును రచించి సి. పి. బ్రౌను ఆంధ్రభాషకు మహోపకార మొనర్చినాడు. ఈ నిఘంటువే తరువాతి ఆంధ్ర నిఘంటువుల కెంతేని ఉపయోగపడినదనుటలో అతిశయోక్తి లేదు. అంతేకాక బూజుపట్టి చెదలపాలగుచున్న పెక్కు ప్రాచీనాంధ్ర గ్రంథములను ప్రకటించిన ఖ్యాతియును బ్రౌనుకే దక్కినది.

చిన్నయసూరి నిఘంటువు  : పై నిఘంటువులలో లోపములను తొలగించి పండితాదరణ పాత్రమయిన సమ గ్రాంధ్ర నిఘంటువును సమర్థతతో రచించుటకు పరవస్తు చిన్నయసూరి సమకట్టెను. కాని, పదముల యొక్క పట్టి కను తయారుచేయువరకే చిన్నయసూరిజీవించియుండెను ప్రతి పదమునకును, ప్రతియర్థమునకు నిర్ధారకములయిన ప్రయోగములను మాత్రమే ఇతడు సేకరించుటకు మొదలు పెట్టెను. శబ్దస్వరూప నిర్ణయమునకుతోడ్పడని యతిప్రాసాదు లందు వాడబడిన ప్రయోగములనే సూరి గ్రహించెను. ఈ ఉత్తమ నిఘంటువు పూర్తియైయున్నచో ఆంధ్రభాషకు మహోపకారము జరిగియుండెడిది.

శబ్దరత్నాకరము  : శ్రీ బహుజనపల్లి సీతారామచార్యులుగారు దీనిని 1885లో ప్రకటించిరి. చిన్నయ సూరి నిఘంటువు యొక్క మహాప్రారంభమును గాంచి అవి పరిపూర్తి యగుటకు బహుకాలము చెల్లుననియు, పరిపూర్తి అయినను అందు తెనుగుపదములు మాత్రమే చేర్పబడియుండుట చేతను విద్యార్థుల సహాయార్థము వారి యుపయోగమునకు చాలునంతటిదిగాను, లక్ష్యా విరుద్ధము గాను ఉండునట్లు తెనుగుపదములతో గూడ తద పేక్షితము లయిన సంస్కృత పదములను జేర్చి అకారాదిగా ఈ నిఘంటువును రచించుచున్నట్లు వారే పేర్కొనిరి. ఇంతకు పూర్వమందున్న సర్వాంధ్ర నిఘంటువులును వీరికి ఉప యోగపడినవి. ప్రామాణిక మును, సంపూర్ణ మును అయిన ఆంధ్రనిఘంటువు ఇప్పటికిని ఇది యొక్కటియే.

వైకృతదీపిక : ఇదికూడ శ్రీ బహుజనపల్లి సీతారామాచార్య కృతమే. ఇది క్రీ. శ. 1900 లో మూడవ ముద్రణము పొందినది. ఇందు అకారాది క్రమములో నున్న 2,400 వికృతిపదములకు అర్థములును, ఆద్య ప్రకృతులగు సంస్కృత పదములును వ్రాయబడినవి.

శబ్దరత్నాకరముకూడ సమగ్రము కాదనియు, ఇంకను తెనుగు శబ్దములును, అవసరమైన సంస్కృత శబ్దములును మిగిలియున్న వనియు శ్రీ వీరేశలింగము పంతులు మున్నగువారు తలచిరి. ఇట్టి తలంపుతోనే శబ్దరత్నాకరము తరువాత మరికొన్ని నిఘంటువులు చిన్నవియును, పెద్దవియును బయలు దేరినవి.

ఆంధ్రవాచస్పత్యము : కొట్ర శ్యామల కామశాస్త్రిగారు ఈ నిఘంటువును రచించి ప్రకటించిరి. (1934-1940 మధ్య) పర్యాయ పదాత్మక పద్యరూప నిఘంటువులు, నానార్థ నిఘంటువులు, అకారాది శబ్దక్రమముతో రచింపబడిన ఆధునిక నిఘంటువులును ప్రత్యేక మొక్కొక్క గుణము కలవగుటచేత ఆగుణములన్నియు గలిసివచ్చునట్లును, విశేషార్థములు, వ్యుత్పత్తులు తెలియునట్లును ఇది రచింపబడినది. ఇది ఆధునిక పద్ధతిలో నున్న సమగ్ర నిఘంటువు.

సూర్యరాయాంధ్ర నిఘంటువు  : 1911 వ సంవత్సర ప్రాంతమున స్థాపితమైన ఆంధ్రసాహిత్య పరిషత్తు ఆధ్వర్య వమునను, శ్రీ పీఠికాధీశుని ఔదార్యముతోను ఈ నిఘంటు నిర్మాణము ప్రారంభమైనది. ఆంధ్రదేశమునందలి అనేక సుప్రసిద్ధ పండితుల దీర్ఘకాల విశేష పరిశ్రమకు ఫలితముగా 1936-44 మధ్య ఈ నిఘంటు సంపుటములు నాల్గు ప్రకటితములైనవి. 'అ' మొదలు 'నస్థిమాలి' అను పదము వరకును ఇది ముద్రితమైనది. ఇది పూర్తి యగుటకు ఇంకను మూడు సంపుటములు ప్రకటితములు కావలసియున్నవి.

ఇది చాల శాస్త్రీయమగు పద్ధతిలో నిర్మితమైన నిఘంటువు. వీలైనంతవరకు సమానార్ధకములగు తమిథము, కన్నడము మొదలగు భాషాపదములుకూడ నొసగబడినవి. ఒకే పదమునకుగల భిన్నార్థములను వివరించుచు ప్రయోగములు ఉదాహృతములైనవి. జయంతి రామయ్య పంతులుగారు దీనికి సంపాదకులు. పిమ్మట డాక్టరు గిడుగు సీతాపతిగారు సంపాదకత్వమును వహించిరి.

వావిళ్ళ నిఘంటువు  :- సూర్యరాయాంధ్ర నిఘంటువు పెక్కు సంపుటములలో నుండుటచేత అందరకును అందు బాటులో నుండవలెన నెడి ఉద్దేశముతో వావిళ్ళసంస్థవారు దీనిని ప్రకటించుటకు పూనుకొనిరి. ఆదిలో దీనిని రెండు సంపుటములుగా ముద్రింప దలపెట్టిరి, కాని ఇప్పటికే ఇది మూడుసంపుటములుగా ముద్రితమైనది. ఇందుకూడ 'అ' మొదలు 'నస్థిమాలి' వరకు మాత్రమే పదములుకలవు. ఇది ఇంకను రెండు సంపుటములైనను పట్టును. సూర్య రాయాంధ్ర నిఘంటు పద్ధతీయే ఇందును అనుసరింపబడినది. అందులేని కొన్ని క్రొత్తపదములుకూడ ఇందుగలవు. అకారాది “ఇంచు" వరకును ఈ నిఘంటువును శ్రీ శ్రీపాద లక్ష్మీపతిశాస్త్రిగారు రచించిరి. వారు పరమపదించుటచేత శ్రీ బులుసు వేంకటేశ్వర్లుగారు దీనిని పూర్తి చేసిరి.

లక్ష్మీనారాయణీయము  :- దీనిని శ్రీ కొట్ర లక్ష్మీనారాయణశాస్త్రిగారు రచించిరి (1907 లో ప్రకటితము). ఇది శుద్ధాంధ్రపద నిఘంటువు. ఇందు అచ్చ తెలుగు పదములకుమాత్ర మర్థములు వ్రాయబడినవి. అచ్చ తెలుగు పదముల కర్థము నెరుగ గోరువారికిని, అచ్చ తెలుగుపదము లేవియో తెలిసికొనదలచిన వారికిని ఇది యుపయోగించును. ఇదియు ఆధునిక పద్ధతి నిఘంటువే

ఆంధ్రపద పారిజాతము  : ఇది అకారాదిగా ప్రయోగ సహితముగ వ్రాయబడిన శుద్ధాంధ్రపద నిఘంటువు. దీనిని శ్రీ ఓగిరాల జగన్నాథకవి : శ్రీ గురుజాడ శ్రీరామమూర్తిగారలు రచించిరి; వారి మిత్రులగు పిడుగు సుబ్బరామయ్య, మరికొందరు పండితులు దీనిని పరిష్కరించి 1888 లో ప్రకటించిరి. శబ్దార్థ చంద్రిక  : - మహాకాళి సుబ్బారాయ రచితము (1906 ప్రాంతము). శబ్దరత్నాకరమున లేని కొన్ని శబ్దము లీ నిఘంటువున గలవు. ఇందు చక్కని యర్థము లీయబడినవి. ఇది విద్యార్థులకు మిక్కిలి ఉపయుక్తము.

శబ్దారచింతామణి  :- హైదరాబాదు రాష్ట్ర వాసియైన తాటికొండ తిమ్మా రెడ్డి దేశాయి దీనిని రచించెను. క్రీ.శ. 1906 లో ఇది ముద్రితమైనది. ప్రతిపదమునకును సులభమైన తెలుగర్థము, దానితో పాటు ఉర్దుపదము దీనియం దుండును. తెలుగుపదములకు ఉర్దుపదముల నెరుగని ఆంధ్రుల ఉపయోగార్థ మీ నిఘంటువు రచింపబడినది. ఉదాహరణము.

“అంతరాయము - విఘ్నము - ఖలల్
అందకత్తె - సౌందర్యవతి - హసీనా."

ఇట్లే గ్రంథమంతయు అకారాదిక్రమముతో నున్నది.

శంకరనారాయణ నిఘంటువు  :- ఇది ఇంగ్లీషు పదములకు తెలుగర్థములను దెలుపు నిఘంటువులలో బహుళ ప్రచారమును పొందిన ఉత్తమనిఘంటువు. తెలుగు పదములకు ఆంగ్లార్థముల నొసగెడి నిఘంటువును కూడ వీరు రచించిరి.

ఉర్దు తెలుగు నిఘంటువు  :- హైదరాబాదు వాస్తవ్యులయిన శ్రీ ఐతంరాజు కొండలరావుగారు ఈ నిఘంటువును వ్రాసిరి. ఇంగ్లీషుకు శంకరనారాయణ నిఘంటువు వలెనే, ఉర్దుపదముల అర్థము నెరుగ గోరిన ఆంధ్రుల కిది మిక్కిలి ఉపయోగకరమైన నిఘంటువు.

పారిభాషిక పదకోశములు  :- శ్రీ తిరుమల వేంకట రంగాచార్యులుగారు పదములను సేకరింపగా శ్రీ కాశీనాథుని నాగేశ్వరరావుగా రీనిఘంటువును బ్రకటించిరి. ఆంగ్లమునందలి వివిధశాస్త్రములకు సంబంధించిన ఇంగ్లీషు పదములకు తెలుగర్థము తీయబడినవి. దిగవల్లి వెంకట శివరావుగారును ఒక పారిభాషిక పద నిఘంటువును వ్రాసిరి. ఇందు వ్యవహారకోశము, శాస్త్రపరిభాష అను రెండు భాగములు కలవు.

విద్యార్థి కల్పతరువు  :- శ్రీ ముసునూరి వేంకటశాస్త్రి గారు దీనిని రచించిరి (1936 ప్రాంతమును). దీనికి వారే 'ఆంధ్రభాషా విషయ సర్వస్వము' అను పేరిడిరి. ఇది అతిశయోక్తి కాదు. ఇది ఆంధ్ర విద్యార్థిలోకమునకు అత్యంతోపకారి యగుటయేకాక పండితులకును సహాయకారి కాగలదు. శ్రీ శాస్త్రిగారు 'శబ్దార్థ దీపిక' అను మరొక తెలుగు - తెలుగు నిఘంటువును కూర్చిరి (1956). దీనిలో శబ్దముల రూపాంతరములును వివిధార్థములును, పర్యాయ పదములును, ఇయ్యబడుటయేగాక సంస్కృత న్యాయములు కూడ విశేషముగా చేర్చబడి సులభరీతిని అర్థవివరణము గావింపబడెను.

పంచభాషి  :- రెంటాల వెంకట సుబ్బారావుగారు దీనిని రచించిరి. ఒక తెలుగుపదమును గ్రహించి దానికి సరియైన కన్నడము, తమిళము, హిందూస్తానీ, ఇంగ్లీషు పదములు చేర్చబడినవి. ఐదు భాషలు ఒకేసారి నేర్చుకొను టకు ఉపయోగించునట్టి చిన్న నిఘంటువు. దీని రెండవ భాగమున ఇదేవిధముగా వాక్యములు సైత మైదుభాషలలో నీయబడినవి. ఇట్టిదే "షడ్భాషామంజరి" యును కలదు. దీనిని వెష్టువార్డు అండ్ కంపెనీవారు ప్రచురించిరి. పై ఐదు భాషలకు తోడు మరాఠీ భాషాపదములు కూడ ఇందున్నవి,

గెలిటి తెలుగు నిఘంటువు : అసిస్టెంటు కలెక్టర్లు, యువకోద్యోగులు, మిషనరీలు, వ్యాపారస్థులు మొదలగువారి ఉపయోగార్థం మిది శ్రీ ఎ. గెలిటి అను సివిలు సర్వీసు ఉద్యోగిచేత రచింపబడినది (1933). ఇందు తెలుగు పదములకు ఆంగ్లారము లియబడినవి. తెలుగువదములు రోమను లిపిలో వ్రాయబడుటయు వ్యవహారమునందు లేని పదములను విడిచి వేయుటయు ఇందలి విశేషములు.

తెలుగు సామెతలు  : దీనిని కెప్టెన్ కార్ అనునతడు రచించెను. 1185 తెలుగు సామెతలను అకారాదిగా కూర్చి, వాటిని ఆంగ్లమున వివరించియున్నాడు. తెలుగు సామెతలకు సమానార్ధకములయిన లాటిన్, రోమన్మొదలగు భాషల యందలి సామెతలనుగూడ తరచుగాపేర్కొనెను. గ్రంథాంతమున 32 సంస్కృత న్యాయములను గూడ ఆంగ్లమున వివరించియున్నాడు. సంస్కృత న్యాయములనుగూర్చి డాక్టరు చిలుకూరి నారాయణరావుగారు ఒక గ్రంథమును; కూచిభొట్ల నరసింహశాస్త్రి, మట్టి లక్ష్మీనరసింహశాస్త్రి కలిసి ఒక గ్రంథమును ప్రకటించినారు. తెలుగు సామెతలను తెలుగునందే వివరించుచు శ్రీ మారేపల్లి రామచంద్రశాస్త్రి యొక చిన్న గ్రంథమును, శ్రీ నాళం కృష్ణారావు మరియొక గ్రంథమును ప్రకటించియున్నారు.

ఆంధ్ర విజ్ఞానసర్వస్వములు :- ఇవికూడ నిఘంటువుల వంటివే అయినను విషయ విస్తృతినిబట్టి వీటిని ప్రత్యేక జాతిగా గ్రహింపవలసియున్నది. పాశ్చాత్య దేశములందలి విజ్ఞానసర్వస్వములు (Encyclopaedias) ఈజాతి గ్రంథములకు మార్గదర్శకములైనవి.

ఆంధ్రవిజ్ఞాన సర్వస్వము  :- ఆంధ్ర వాఙ్మయములో ఇది మొట్టమొదటి విజ్ఞానసర్వస్వము. శ్రీ కొమఱ్ఱాజు వేంకటలక్ష్మణరావుగారు, వారి మిత్రులును కలిసి దీనిని రచింప ప్రయత్నించిరి. ప్రథమగంపుటము 1915 లోను; ద్వితీయ, తృతీయ సంపుటములు 1916-17 లలోను ప్రకటితములైనవి. ఈమూడు సంపుటములందును 'అ' నుండి 'ఆహ్రి'వరకును అకారాదిక్రమణికలోగల పదములకు సంబంధించిన వ్యాసములుకలవు; నాల్గవసంపుటమును ఆంధ్రసంపుటముగ ప్రకటింప ప్రయత్నము చేయు చుండగా, 1923 లో లక్ష్మణరావుగారు చనిపోయిరి. అంతటితో ఈ మహత్తర కార్య మాగిపోయినది. దీనిని పునరుద్ధరింపవలెనను తలంపుతో, ప్రథమ ముద్రణ ప్రతులు శీఘ్రకాలమునకే అలభ్యములగుటచే, శ్రీ కాశీనాథుని నాగేశ్వరరావుగారు ఈమూడు సంపుటములను రెండుగా భాగించి నూతనాంశముల ననేకములచేర్చి రెండుసంపుటములుగా 1932, 1934 లలో ప్రకటించిరి. పిమ్మట నాగేశ్వరరావుగారి మరణముతో ఈ ద్వితీయ ప్రయత్నమును నిలిచిపోయినది. విశ్వవిజ్ఞానమును భారతీయ దృక్పథమునుండి సందర్శించి వివరించుటయే దీనిలక్ష్యము. ఇది అసమగ్రమైనను ఉన్నంతలో ఆంధ్రులకు కల్పవృక్షము వంటిది.

పురాణనామచంద్రిక  : దీనిని రచించిన వారు ఎనమండ్రం వేంకటరామయ్యగారు. ఇది ప్రాచీన ఆంధ్ర గ్రంథ పఠన మందు అభిరుచిగల విద్యార్థులకును, ఉపాధ్యాయులకును తోడ్పడుటకు ఉద్దిష్టమైనది. ఇందు హిందువులు దేవతలు, సిద్ధపురుషులు, రాజులు, తీర్థయాత్రాస్థలములు, షద్దర్శనములు మున్నగువాటిని గురించిన విశేషములు వివరింపబడినవి. పురాణములందలి ప్రధాన పురుషుల వంశవృక్షములుకూడ అనుబంధముగ ఇందు చేర్పబడినవి. ఇందలి విషయము సమగ్రము గాకున్నను ప్రాచీన గ్రంథములను చదువువారికి మిక్కిలి ఉపకరించునదిగా నున్నది. దేవతలు, ఋషులు, రాజులు, కవులు, దేశములు, పట్టణములు, నదులు, గ్రంథములు, మతాచార వ్యావహారిక పదములు మున్నగునవి ఇందు అకారాదిక్రమమున కాననగును. పురాణగాథలను వివరించు గ్రంధములలో ఇది మిక్కిలి ప్రాచీనమయిన దనవచ్చును (సం. క్రీ.శ.1879).

పూర్వగాథాలహరి  : దీనిని శ్రీ వేమూరి శ్రీనివాసరావుగారు రచించిరి. దీని రచన 1917 లో ప్రారంభ మయినది. ఇది 1928 నాటికి పూర్తియై ముద్రితమైనది. ప్రారంభమునుండి అంతమువరకును అనన్యసహాయులై, పదునెనిమిది పురాణములందును, రామాయణ భారతాది కావ్యేతిహాసములందును గల కథల సారాంశములను సేకరించి అకారాది క్రమములో ఆయానామములక్రింద వివరించియున్నారు. ఇది మిక్కిలి ఉపయోగకరమైన గ్రంథము.

ఆంధ్ర విజ్ఞానము  :- 'దేవిడి' జమీందారైన శ్రీ ప్రసాద భూపాలుడు దీనిని ఏడు సంపుటములుగా రచించెను. దీని ముద్రణము 1938 లో ప్రారంభమై 1941 లో పూర్తియైనది. విజ్ఞాన సర్వస్వములు సాధారణముగా పలువురు మేధావులచే రచింపబడి, ఒక వ్యక్తి చేత క్రోడీకరింపబడును. కాని ఇది శ్రీ ప్రసాదభూపాలుని ఒక్క చేతిమీదుగానే ఆదినుండి అంతమువరకును వ్రాయబడి సంపుటీకరింప బడినది. ఇట్లు విశ్వతోముఖ విజ్ఞానమయ మగు గ్రంథరాజమును ఒకవ్యక్తి రచించి పూర్తిచేయుట అత్యంత విశిష్ట విషయము. మనకున్న విజ్ఞాన సర్వస్వములలో ఇప్పటికి సంపూర్ణమైనది ఇది యొక్కటియే.

ఆంధ్రసర్వస్వము  :- దీనికి శ్రీ మాగంటి బాపినీడు గారు సంపాదకులు. ఆంధ్రదేశమునకును, ఆంధ్రులకును సంబంధించిన అన్ని విషయములను అందించుటకు చేసిన ప్రథమ ప్రయత్నమిది (1943).

తెలుగు విజ్ఞాన సర్వస్వము  :- 'తెలుగుభాషా సమితి'(మద్రాసు) వారి ఆధ్వర్యవమున ఈ తెలుగు విజ్ఞాన సర్వస్వము రచింపబడుచున్నది. ఇప్పటికి సంపుటములు- (1) చరిత్ర - రాజనీతి 1954; (2) భౌతిక రసాయనిక శాస్త్రములు (1955) అనునవి ప్రకటితములైనవి. సాధారణముగా విజ్ఞాన సర్వస్వములు అకారాది క్రమములో రచింపబడును. కాని విషయానుక్రమణికను బట్టి విజ్ఞాన సర్వస్వ రచన సాగించి, ఒకటితర్వాత ఒకటిగా పండ్రెండు సంపుటములలో ఎల్ల గ్రంథమును ఇమిడ్చి ప్రకటించుటకు సమితివారుపూనుకొన్నారు. “ప్రతిసంపుట మందును మొదటి రెండు మూడు వందల పుటలలోను ఆ సంపుటమునకు చెందిన విషయమును అమూలాగ్రము సంక్షిప్తముగా తెలియజేసి తక్కిన గ్రంథమందు ఆవిషయ మందలి అంశములను సంప్రదాయ సిద్ధమైన విజ్ఞానసర్వస్వ రచనా విధానమును అనుసరించి, నిఘంటువులోని పదములవలె అకారాది క్రమమును పొందుపరచి వివరించినారు. అందుచేత ఒక్కొక్క సంపుటి ఒక్కొక్క పెద్దవిషయమునకు సంబంధించిన విజ్ఞాన సర్వస్వముగా తయారగు చున్నది. ఈ విధానమువలన ఎవరి కేవిషయమందు అభిరుచియుండునో, వారా విషయము నకు సంబంధించిన సంపుటమును చదువుకొనుటకు సౌకర్య మేర్పడుచున్నది.

ప్రపంచదర్శిని  :- దీనినే Andhra Directory and year book అందురు. ప్రతిసంవత్సరమును సంవత్సరాదికి నూతన ముద్రణము వెలువడుచున్నది. ప్రఖ్యాత ప్రపంచ విషయములు, ముఖ్యముగా భారతదేశ విషయములు విషయానుక్రమణికలో వివరింపబడుచుండును. ఏ సంవత్సరమున కాసంవత్సరము నూత్న విశేషములిందు చేర్పబడు చుండును.

ఆంధ్రదర్శిని  :- ఆంధ్ర రాష్ట్రావతరణానంతరము ఆంధ్ర దేశమునుగూర్చిన సమగ్ర సమాచారమును ఏర్చికూర్చి ఆంధ్రప్రజల కందించుట తన కర్తవ్యముగా ఎంచి దీని ప్రచురణమునకు విశాలాంధ్ర ప్రచురణాలయము (బెజవాడ) పూనుకొన్నది. (ఏప్రిలు 1954.)

కే. న. శా.

[[వర్గం:]]