సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మొదటి సంపుటము/ఆంధ్రభాషా చరిత్రము

ఆంధ్రభాషా చరిత్రము :- నేటి ఆంధ్రదేశమున ఆంధ్రులు మాటాడు వ్యావహారిక భాషకు ఆంధ్రమనియు తెనుగనియు, తెలుగనియు మూడు పేళ్ళు వాడుకలో నున్నవి. ఈ భాషను మాటాడు జనసంఖ్య సుమారు మూడు కోట్ల ముప్పది లక్షలు. నేటి మన భారత దేశమున వాడుకలోనున్న భాషలలోనికెల్ల అత్యధిక సంఖ్యాకులయిన జనులు మాట్లాడునది హిందీభాష. దాని తరువాత గొప్పసంఖ్య తెలుగు మాట్లాడువారి సంఖ్యయే. ఈ భాషయందు నన్నయాది మహాకవుల రచనలు గల గొప్ప వాఙ్మయము గలదు. నవ్య నాగరికత వలన ప్రపంచమున బయలుదేరిన అనేక క్రొత్త వాఙ్మయ ప్రక్రియలు, వార్తా పత్రికలు మొదలైన విజ్ఞాన దాయక రచనలు తెనుగునను గలవు. ఇట్టి విశాలభాషా ప్రపంచము యొక్క చరిత్రమును అనగా భూత భవిష్యద్వర్తమాన స్వరూపములను సంగ్రహముగానైన నెరుగవలయును. పాశ్చాత్య దేశమునుండి మనకు వ్యవహారములోనికి వచ్చిన క్రీస్తు శకముయొక్క ప్రారంభ దశనుండి నేటివరకును అనగా సుమారు రెండువేల సంవత్సరముల వరకు నుండిన ఆంధ్ర భాష యొక్క చరిత్రమును తెలివిడి కొరకు కొన్ని యుగములుగా అప్పుడప్పుడు కలిగిన పరిణామ విశేషములనుబట్టి విభజింపనగును. మన తెనుగు భాషలో మొట్టమొదట బయలుదేరిన గ్రంథము నన్నయ కృతమయిన మహాభారతము. ఇంతకంటే ప్రాచీనములయిన గ్రంథములు ఉన్న వాలేవా అను వివాద మొకటి చాల కాలమువరకు నడచినదిగాని అట్టి గ్రంథములున్నట్లు నిర్ణాయకము లైన సాక్ష్యము గాని, వాటి స్వరూపముగాని లభింపలేదు. తెనుగు సారస్వతమున నన్నయ ఆదికవి యనియు, ఆతడు చేసిన భాషా నియమములనే నేటికిని ప్రామాణికులు అవలంబించుచున్నారనుటయు ఎల్ల రెరిగినది. నన్నయ వ్రాసిన భాషను ఎల్ల విధములను పోలియున్న భాషనే మనము వ్రాయుచున్నామనుట ఒప్పుకొన వీలులేదుగాని, ఆనాటి భాషయందలి జీవము, స్వభావము, చాల వరకును నేటి భాషయందును నిలిచియే యున్నవి. ముప్పదియేండ్ల వయసున మనమొక పురుషుని చూచి ఆ తరువాత మరి ముప్పదియేండ్లకు అనగా పష్టిపూర్తియైన తరువాత నాతనిని తిరుగ చూచినచో నాతని బహిరంగ స్వరూపమునను, వైజ్ఞానిక స్వరూపమైన మానసిక వృత్తియందును గొంతమార్పు కనుపట్టక తప్పదు కాని అతనిని వేరువుషునిగాగాని, యాతని ఆత్మవేరనిగాని భావింపము. కాలగతిని పూరుష స్వరూపాదికమున మార్పు కలిగినట్లే భాషయందును మార్పు గలుగుచునే యుండును. ఆతని వయస్సు నంతటిని బాల్య యౌవనాదిగా నెట్లు విభజించు చున్నామో అట్లే తెనుగు స్థితినిగూడ విభజింప వచ్చును.

భారతము బయలుదేరిన కాలము పదునొకండవ శతాబ్దము. ఆనాటినుండి నేటివరకును ఒక భాగముగాను దానికి పూర్వ కాలమును వేరు భాగముగాను విభజింప వచ్చును. ఈ రెండు భాగములనే మరల అప్పటి విశేషములనుబట్టి విభజింపగా ఐదు యుగము లగుచున్నవి.

I క్రీస్తు పూర్వము II క్రీ. శ. 1 నుండి 7వ శతాబ్ది వరకును, III 7 వ శతాబ్దినుండి 11 వ శతాబ్ది వరకును, IV 11 వ శతాబ్దినుండి 19 వ శతాబ్ది వరకును V 19 వ శతాబ్దినుండి నేటి వరకును, పై రీతిని విభజింపబడిన అయిదు యుగములలో మొదటి మూడును వాఙ్మయోత్పత్తికి పూర్వ స్వరూపమును నిరూపించును. తరువాతి రెండును తదనంతర స్వరూపమును నిరూపించును.

పై వాటిలో మూడవయుగమయిన 7 మొదలు 11 వ శతాబ్దము వరకునుగల కాలములో తెనుగులో వ్రాయబడిన గద్యమయ శాసనములును, కొన్ని దేశీయ ఛందస్సులతో అనగా సీసము, తరువోజ, అక్కర అనునట్టి పద్య బంధములతోకూడిన శాసనములును లభించుచున్నవి. ఈ శాసనములు రాజాజ్ఞ ననుసరించి దేవాలయములకును, బ్రాహ్మణులకును, రాజ సేవచేసిన మరికొందరకును ఇయ్యబడిన భూములు, వాటి హక్కులు, ఎల్లలు మొదలైన వివరములతో గూడినవి. అంతియేగాని భారతమువలె ఉదాత్తమైన నీతులు, కథలు, కల్పనలు గలిగిన కావ్యములుగాని, రచనలుగాని లభింప లేదు. ఈ కాలమున ఏవైన దీర్ఘములైన కావ్యములును, సంస్కృత ఛందస్సులైన ఉత్పలమాల, శార్దూలము మొదలైన వాటివంటి పద్యబంధములును ఉండియుండవచ్చునుగాని అవి నశించి పోయియే యుండనగునని కొందరు ఊహించు చున్నారు. దీనికి ప్రమాణముగాని బలమయిన యువపత్తిగాని కనుపింపదు. ఈ యుగమునందలి శాసనస్థభాషను బట్టి ఆనాటి తెలుగు యొక్క స్వరూపస్వభావములను, వ్యాకరణమును మనము తెలిసికొనవచ్చును. ఇంకొక విశేషమే మనగా ఈ కాలమున తెనుగునకు రాజాదరణమేర్పడి శాసనములయందు వాడబడుటకు తగిన యధికారము, గౌరవము ఆ రాజులవలననే గలిగినదనుటయే. ఇట్లు తెనుగును గౌరవించిన రాజులు తూర్పు చాళుక్యవంశపు రాజులు. ఈవంశమునకు మూలపురుషుడయిన కుబ్జవిష్ణు వర్ధనుడు క్రీ.శ. 615_633 వరకు పరిపాలించెను. ఈ వంశములో 27 వ పురుషుడైన రాజనరేంద్రుడే తెనుగునకు వాఙ్మయస్థితిని కల్పించి యుగప్రవర్తకుడయ్యెను.

దీనికి పూర్వయుగమయిన రెండవయుగము (క్రీ. శ. 1-600) నందు తెనుగుభాషాశాసనములు లేవనియే చెప్పవచ్చును. ఏవేని కొన్ని సందిగ్ధములయిన శాసనములు ఉన్నను అవి ఈ రెండవయుగము తుది భాగమునాటివి, ఈయుగమునందలి శాసనములన్నియు సంస్కృత ప్రాకృత భాషలలోనే యుండుటచేత ఆనాటి తెలుగుస్వరూప మెట్లున్నదో మనకు చక్కగా తెలియబడదు. తెనుగు ఉండెనా లేదాయని సందేహించువారును నుండిన నుండ వచ్చును. కాని అంత విశాలమయిన తెలుగునాట నొక్కమారుగా నీభాషయంతయు పుట్టియుండె ననుట అసంభవము. ఈ భాష యొక్క పూర్వరూపము వాడుకలో నుండియుండకతప్పదు. కాని అది రాజాదరణములేక శాసనముల కెక్కియుండక పోవచ్చును.

ఈ రెండవ యుగమునందలి శాసనములను పరిశీలించినచో మీది విషయమే సత్యమని తెలియగలదు. అప్పటి సంస్కృత ప్రాకృత శాసనములలో తెనుగునాట నాడుండిన గ్రామనామములు పేర్కొనబడినవి. అవి చాలవరకు తెనుగు పేళ్ళే. 'విరిపఱ', 'చిల్లరెక', 'తాంటి కొంట', 'వేంగీ', 'టెందులూర', 'ఒంగోడు' అను పేళ్ళు ఆనాటి శాసనములలోనివి నేటి 'విప్పర్తి' 'చిల్లరిగె', 'తాటికొండ' 'వేంగి', 'దెందులూరు', 'ఒంగోలు' అను పేళ్ళకు పూర్వరూపములు. ఈ పేళ్ళయందలి మార్పు కాలక్రమమున సంభవించినది.

క్రీస్తునకు పూర్వముననుండిన మొదటియుగమునందలి తెనుగు భాషాస్వరూపము నూహించుట కీమాత్రపు టాధారముగూడ గనుపట్టదు. ఆనాటి శాసనములు లేవు. కొన్ని యున్ననుగూడ వాటివలన తెనుగు ఉనికి ఊహింపవీలులేదు. కాని క్రీస్తు శ. ప్రథమ శతాబ్దినుండియు నుండియున్నదని పై ఆధారములవలన మనము కనుగొనిన తెనుగుబాస యొక్క పూర్వరూపము ఆనాడును నుండి యుండవలెను, తెనుగు, అరవము, కన్నడము, మలయాళము అనబడెడు ద్రావిడ భాష లన్నియును ప్రాచీన కాలమున అనగా క్రీస్తు శకమునకు పూర్వము కొన్ని శతాబ్దముల క్రింద ఈ షద్వైషమ్యముతో నొక్క రూపముననే యొక్క భాషగనేయుండి కాలక్రమమున వేరుపడి యీరీతి విభిన్న రూపముల నందియుండిన వను సిద్ధాంత మెల్లరచేతను అంగీకరింపబడినది. ఈ సిద్ధాంతము ననుసరించి నాటి తెలుగు ప్రాచీన తమిళ కర్ణాటాది భాషలతో సమానరూపము గలిగియుండి యుండవలె నని యూహించుట సులభము.

క్రీ. శ. ఏడవశతాబ్ది వరకును తెనుగు దేశమున సంస్కృత ప్రాకృతములకే ప్రాధాన్యమేర్పడియుండుట చేతను, తెనుగు భాషకు ఉన్నతప్రయోజనము లేకుండుట చేతను ఆభాష యొక్క స్వరూప మంతగా మనకు తెలియక పోయినది. ఆంధ్రరాజులు అనబడెడి శాతకర్ణి రాజులు తెనుగుదేశమును క్రీ. పూ. 234 మొదలు క్రీ. శ. 207 వరకు అనగా 4 శతాబ్దులు పాలించిరి. ఈ రాజులకు ప్రాకృత భాషమీదనే అభిమానము ఉండెను. వారి శాసనములు, వారి గ్రంథములు, వారి దైనిక వ్యవహారము ప్రాకృత భాషయందే జరుగుచుండెను. వారు తెనుగు నాదరింప లేదు. వారితరువాత సుమారు ఏడవశతాబ్దివరకు తెనుగు నాటిని వేరువేరు వంశముల రాజులు కొంతకొంత కాలము పొలించిరిగాని ఆనాటి వివాదము సంస్కృత ప్రాకృతముల ప్రాముఖ్యమును గురించియేగాని, తెనుగును గూర్చినది గాదు. ఈ శతాబ్దినాటికి ఆరంభమయిన చాళుక్యుల పాలనమునుండి తెనుగునకు రాజాదరణ మేర్పడినది. మరినాలుగు శతాబ్దులకు వాఙ్మయావస్థయు రాజా దరణము వలననే వచ్చినది. ప్రాకృతము యొక్క ప్రాముఖ్యము పూర్తిగా నశించిపోయెను. సంస్కృత భాష కేవలము పండితులకేగాని, సామాన్యులకు సాధ్యము గాకపోయెను. కావుననే తెనుగు ముందునకు రాగలిగినది.

ఇక నాల్గవ యుగము క్రీ. శ. 1000-1800. ఈ యుగమును నన్నయ యుగము అనవచ్చును. తనకు పూర్వము అవ్యవస్థితముగా (కాసట, బీసటగా నున్నదని యొక ప్రాచీనకవి) నున్న తెనుగుభాషను సంస్కరించి భారతమును తెనుగున వ్రాయుటకు నన్నయ ప్రారంభించెను. ఇందులకు వలసిన పదములను సంస్కృతమునుండి సేకరించెను. తెనుగునందలి వాక్యరచనా పద్ధతి, విభక్తి విధానము మొదలగునవి చాల సంకుచితముగా నుండగా వాటిని సంస్కృతము యొక్కయు, నాటి కర్ణాట వాఙ్మయము యొక్కయు మార్గముల ననుసరించి పెంచి క్రొంగ్రో త్తదారులను నన్నయ కల్పిం చెను. ఒకసారి ఆతడు ఆ మార్గమును కనిపెట్టగా దానినే ఇతరు లయిన తరువాతి మహాకవులును అనుసరించి పరి పూర్ణతను పొందించిరి. ఇందలి ముఖ్య లక్షణములు సంస్కృతము ననుసరించుట, అందలి వాఙ్మయమును అనువదించుట అనునవియే. నన్నయ సూచించిన వ్యాకరణ విధానమునుగూడ తరువాతివారు అనుసరించి దానిని విశాల మొనరించిరి. 19 వ శతాబ్దితో ఈ భాష కొక క్రొత్తమార్గ మేర్పడు పరిస్థితి సంభవించెను.

ఆంగ్ల పరిపాలనము దేశములో స్థిరపడుట, ఆంగ్లేయ విద్వాంసులు కొందరు మనభాష నాదరించుట, మన దేశములోని బుద్ధిమంతు లందరును ఆంగ్లమునే చదువు చుండుట భారతదేశమునందలి భిన్న దేశభాషలను మాటాడువారి కందరికిని సంబంధము మరలమరల కలుగుటకు అనువుగా దేశమునందు రైలు ప్రయాణములకు సౌకర్యము లేర్పడుట, విద్యా ప్రణాళిక ననుసరించి ఐహిక విద్య నెల్లరును విరివిగా నేర్చుట, అచ్చుపుస్తకములు బయలు వెడలుట, వార్తాపత్రికలు ప్రచారములోనికి వచ్చుట, ప్రజాసాహిత్యము, ప్రజాభిప్రాయము అను వాటికి ప్రాముఖ్యము గలుగుట మొదలగునవి తక్కిన భారతీయ భాషలనువలెనే తెనుగుభాషనుగూడ మార్చినవి.

క్రీ. శ. 1817-55 వరకును సివిలు సర్వీసులో నుండిన సి. పి. బ్రౌను మచిలీ బందరులో స్థిరపడి తమ ధనమును, బుద్ధిని ఆంధ్రభాషా సంరక్షణకును, అభివృద్ధికిని మిక్కిలిగా వినియోగించెను. ఆతడు ఆనాడు దొరకిన తాటాకు వ్రాత ప్రతులు నన్నిటిని సంపాదించి సంరంక్షించెను. తెనుగులోని మహాకావ్యములను భిన్నమార్గములలో నుండిన వ్రాత ప్రతులనుండి ఉద్ధరించి, ప్రామాణికమైన ప్రతులను సిద్ధపరచి అచ్చువేయించుపద్ధతి నతడు తెనుగున నెలకొల్పెను. తెనుగున కొక నూత్న మార్గమున నేటి అకారాది కోశమువంటి దాని నొకటి తయారుచేయించెను. వాఙ్మయ చరిత్ర, కవుల కాలమును కనుగొను పద్ధతి మొదలగువాటి నేర్పరచెను. నేటి తెలుగు వ్యాకరణ రచనా పద్ధతికి దారిచూపెను.

1800 సంవత్సరమునుండియు మనభాష ఆంగ్లభాషా వాఙ్మయ సాహచర్యమువ పెరుగ దొడగెను. దానివలన ఆంగ్ల పదములు, ఆంగ్ల వాక్యరచన, ఆంగ్ల వ్యాకరణ విధానము, ఆంగ్ల శాస్త్రమర్యాదలు, ఆంగ్ల వాఙ్మయ ప్రక్రియలు తెనుగున జొచ్చి విశాలముగా వ్యాపించెను. ఈ మార్గమును స్థాపించి ప్రచురించుటలో శ్రీ కందుకూరి వీరేశలింగముగారు ప్రధారులు. ఇతనిని ఈ యుగ ప్రవర్తకునిగా పేర్కొనవచ్చును. ఈ యుగమున తెనుగు భాషా వికాసమునకు సంస్కృతభాషా సాహాయ్యము మాత్రమేగాక, ఆంగ్లభాషా సాహాయ్యమును, ఇతర భారతదేశ భాషల విషయములును ఉపకరించెను.

భాషాపరిణామ విషయమున ప్రబలమైన సహాయము వ్యాకరణము. నన్నయనాటి వ్యాకరణ విభజనము కేవలము సంస్కృతము ననుసరించియే జరిగినది. తెనుగు భాష యొక్క స్వభావము సంస్కృతము కంటె చాల భిన్నము, అది మిక్కిలి సరళము, తిన్న నైనది. సులభమయిన మార్గముతో కూడినది. విశాలమై పెరిగిన పద్ధతులతో గూడిన సంస్కృత వ్యాకరణ మర్యాదలను తెనుగున కతికించుచు నన్నయమార్గము 19 వ శతాబ్దివరకును నడచినది. ఆ తరువాత ఆంగ్లవ్యాకరణ మర్యాద ఆనాటి వ్యాకరణ రచనకు అంటుకట్టుటచేత నేటి తెనుగు వ్యాకరణములు చాలవరకు ఆంగ్లవ్యాకరణ మర్యాదను గూడ ననుసరించుచున్నవి. వ్యాకరణ విషయమున నుండవలసిన ప్రధాన భావములు అనేకములు మారిపోయినవి.

తెలుగునందలి పదజాలము చాలవరకు మార్పు నొందినది. నన్నయ తన భారతమును రచియించుటకు ముందు తెలుగు చాల నల్పసంఖ్యాకములయిన పదములతో గూడియుండెను ఈ పదములు ద్రావిడములు అనగా తెనుగునకు స్వాభావికములై మొదటినుండియు నందు ఉత్పన్నములయినవియే. ఈ పదములన్నియు నేటి తమిళ, కర్ణాట, మలయాళ భాషలలోని ఆదిమ పదజాలముతో అభిన్నములు. ఒక్క పదమే అన్ని భాషలలోను నేడును ఒక్క రూపముననే, ఒక్క యర్థముననే వాడబడుచున్నది. కొన్ని కొంచెము మాత్రము మారి పూర్వ కాలమున ఈ రూపము లన్నియు ఒక్క దానినుండి ఏర్పడిన వేయని తెలియదగినట్లు కనుపట్టుచుండును. మొదట తెనుగులో నుండిన పదజాలమంతయు నిట్టిదే. నన్నయ తన భారత రచనకు తగిన పదములు తెనుగున లేకుండుటచేత ఆనాటి వాడుక ననుసరించి సంస్కృతపదములనే తెనుగు విభక్తులను చేర్చి సంస్కృతమునందలి యర్థముననే వాడెను. ఏవేని కొన్ని పదములు అర్థమునను, రూపము నను మారియున్న యెడల వాటినిగూడ స్వీకరించెను. ఈ పద్ధతినే తరువాతి వారును పందొమ్మిదవ శతాబ్దము వరకును, నేడును గూడ ననుసరించుచున్నారు. కాని మన దేశమును పదమూడవ శతాబ్ది నుండియు మహమ్మదీయులు పరిపాలించు చుండుటచే హిందూస్థానీ, అరబ్బీ, పారసీక భాషలలోని పదములు అనేకములు వ్యవహార వశమున ప్రవేశించెను. ఆ తరువాత కన్నడ, తమిళ, మలయాళ భాపలనుండియు కొన్నిపదములు వచ్చి ప్రవేశించెను. 18 వ శతాబ్దినుండి మనకు పాశ్చాత్యుల సంపర్కము కలుగుట చేత కొన్ని ఫ్రెంచిపదములు, పోర్చుగీసు పదములు, ఒలాందుల పదములుకూడ తెనుగున ప్రవేశించెను. ఆ పదములు కొన్ని నేటికి తెలుగున వాడుచునే యున్నారు. కాని యవి మిక్కిలి యెక్కువగా లేవు. ఆంగ్లపదములుమాత్ర మట్లుగాక, యాంగ్లేయ విజ్ఞాన ప్రభావమునను, వారి పరిపాలనమునను విశేషముగా ప్రవేశించినవి. చాల పదములు మారుపడి తెనుగులో స్థిరపడినవి. తత్సమములుగా కొన్ని వేల పదములు మనవారందరును దినదినమును వాడుకలో నుపయోగించుచునే యున్నారు అవి వాడుకలో నున్నంత విరివిగా గ్రంథములలోనికి మాత్రము ఎక్కలేదు. సంస్కృత పదముల నన్నిటిని మనము తెనుగు రచనకు తెచ్చుకొని వాడుకొను నాచారము ఏర్పడినట్లు ఆంగ్లేయపదములు తెచ్చుకొని తెనుగున చేయుట లేదు. అనగా సంస్కృతము తెనుగులో నొక భాగమయిపోయినది. కాని యాంగ్ల భాష మాత్ర మట్టిస్థితిని పొంద లేదు.

తెనుగు భాషావికాస చరిత్రను తెలిసికొనుటలో మిక్కిలి యుపకరించునది మూడవయుగములోని భాష. ఇది కేవల శాసనస్థము మాత్రమే. విరివియందు కొంచెము. కాని ఒక ప్రక్కన తెనుగున కితర ద్రావిడభాషలతోగల సంబంధమును, నేటి తెనుగుయొక్క రూపమేర్పడిన విధమును జక్కగా వివరించుట కుపయోగించును. నేటి తెనుగు ప్రత్యయములయిన డు, ము, వు, లు, మొదలయినవాటి పూర్వరూపములు స్పష్టముగా భిన్నములయిన పరిణామములతో నందు గనుపట్టుచుండును. కావున తెనుగు చరిత్రము నెరుగదలచిన పండితులకిది యుపకరించును.

తెనుగుభాషా వికాస చరిత్రమును జూచినచో అది క్రీ. శ. మొదటి యేడు శతాబ్దులలో దాని యునికియే తెలియనంతటి అప్రధానావస్థయందు సంస్కృత ప్రాకృతముల ఛాయనుబడి యుండినట్లు స్పష్టపడుచున్నది. కాలక్రమమున సంస్కృత ప్రాకృతములు మూలబడిపోగా తెనుగునకు చాళుక్య రాజావలంబనమున ప్రాముఖ్యము ఏర్పడకలిగినది. గొప్ప వాఙ్మయమును నిర్మించుకొన గలిగెను. తెనుగు సంస్కృత ప్రాకృతములనుండి అనేక విషయములను స్వీకరించెను. ఆ తరువాత ఆంగ్లభాషా సాహచర్యమువలన కొంత విస్తృతినిపొంది అది నేడు ఆంధ్రజాతికంతటికిని విజ్ఞాన దాయకమైన ముఖ్యసాధనముగా వెలయనున్నది. భాషాప్రయుక్తమైన రాష్ట్ర విభజనమునకు తెలుగే మొదటి మెట్టు వేసినది.

ఇక నేటిపరిస్థితిని, భావిని కొంచెము పరిశీలింపవలసి యున్నది. మనము పుస్తకములలో వ్రాయు భాషకును, దైనిక వ్యవహారమున ఎల్లరును మాటాడు భాషకును గొంతభేదము కన్పట్టుచున్నది. పుస్తకములలోని భాష విశేషము మార్పులేక అఖిలాంధ్రదేశమున నొక్కరూపముననే యుండును. దీని స్వరూపము వ్యాకరణము, కోశము, కవిప్రయోగము, శిష్టభాషలోని పలుకుబడి అను వాటి నన్నిటి నాధారముగా చేసికొనియున్నది. దీనినే ప్రామాణిక భాషయందుము. ఈ ప్రామాణిక భాష యొక్క స్వరూపముగూడ కాలముననుసరించి కొంచెము కొంచెముగా మారుచునే యుండును. నన్నయ తన భారతమున వ్రాసిన వాడుకలు కొన్ని మన రచనలలో కనిపింపవు. ప్రతిదినము వాడుకలో ససలేలేవు. ఇట్లు నన్నయ నాటి భాష మనభాషకంటే కొంత భిన్నముగానున్నను మనకర్థము కానంతగా అది మారలేదు. నన్నయకు ముందు భాష పండితులకుగూడ బోధపడనంత అస్తవ్యస్తముగా మాత్రముండెను. నేటివ్రాతలో ' చేయుచున్నాడు, చేసినాడు' అను రూపములవంటివాటిని మనము వాడుదుము. మాటాడునప్పుడు మాత్రము చేస్తున్నాడు. చే స్తండు ; చేశాడు, చేసిండు' అనునట్లు వివిధములయిన రూపములను ప్రదేశమునుబట్టియు, మాటాడువారి సంఘమునుబట్టియు వెలయించు చుందుము. ఇట్టి భేదము వ్రాతకును, నోటి మాటకును, అరవము, కన్నడము మొదలయిన యెల్ల భాషలయందును నుండునదియే, కాని మనము మాటాడునట్లే వ్రాయవలయు ననియు, గ్రంథములలో నుండునట్లు వ్రాయరాదనియు కొంతమంది పలుకుచున్నారు. అట్లు వ్రాయుచున్న వారును గలరు. ఇట్లు చేసినచో భాష నేర్చుకొనుటయందు కొంత సౌలభ్యము కలుగవచ్చును. కాని దేశమున కంతటికిని ఒక రూపమయిన ప్రామాణిక భాష యుండవలయు నను పట్టుదల పోయినచో దేశమున భేదము భాషావిషయమున నేర్పడి తెలుగువారి ఐక్యమునకు భంగముకలుగవచ్చును. మన ప్రాచీనుల వాఙ్మయమునకు మనము మరికొంత దూరమయినవారము కావలసివచ్చును. క్రొత్త ప్రామాణిక భాషను సృజించుకొనినచో క్రొత్తవాఙ్మయమును సృజించుకొనవలయును. ఇట్టిది ఒకనాడు సంభవముకాదు. జాతియంతయు ఏకముఖముగా ప్రయత్నముచేసి ప్రామాణీకరూపములను నిరూపించు కొనిన తరువాత కొన్ని తరములవరకు మేధావులయిన మహాకవులు వాఙ్మయ సృష్టికి నిరంతరకృషి చేయవలయును. ఉన్న ప్రామాణిక భాషనే గ్రహించి యం దేవైన అలంతి మార్పు లేర్పడినచో వాటి నంగీకరించి ఆరూపమును నిలువబెట్టుకొనుట గూడ నొకమార్గమే. ఇది భావిని జరుగవలసినది.

ఇకముందీ భాషలో నవ్యప్రపంచ విజ్ఞానమంతయు వెలయించి మన తెలుగువారిని విద్యావంతులుగా చేయవలసిన బాధ్యతయు తెలుగువారిపై గలదు. ఇట్టి బాధ్యతయే నన్నయపై బడగా నానాటి తెనుగున తగిన శబ్ద జాలము లేకుండుట చేత సంస్కృతపదముల నన్నిటిని తెచ్చి తెనుగున చేర్చేను. నేటి పాశ్చాత్య శాస్త్రములలోని విజ్ఞానమునంతటిని తెనుగునకు తేవలసినచో పదము లెచ్చటినుండి రావలెను. ఇది యొక సమస్య. తెనుగులో పదములు కల్పింప వీలు లేదు. సంస్కృతమున పదములు కల్పించి తెనుగులోని పూర్వపద్ధతినే ప్రయోగింపవలెనా లేక ఆంగ్ల భాషనుండి వేలకొలది సాంకేతిక పదములను తెచ్చి చేర్చుకొనవలెనా అను నదియు నొక సమస్య. ఇంకొక విషయ మేమనగా, ఈ సాంకేతిక పదములు ఏభాష కాభాషలోనే భిన్నముగా నేర్పడవలెనా లేక భారతదేశములోని ఎల్ల భాషలకును ఒక్క రూపముననే యుండవలెనా యనునదియు నొక సమస్యయే. ఈ సమస్య లన్నియు ముందుముందు పరిష్కరింప బడవలయును. వీటి పరిష్కారముకొరకు పండితులును ప్రభుత్వమును ప్రయత్నించుచునే యున్నారు. మార్గములును ఏర్పడుచున్నవి. మనదేశమున నింక హిందీభాష కొక నవ్యప్రాముఖ్య మేర్పడుచున్నది. ఆ భాష యొక్క పెరుగుదలగాని, ప్రాముఖ్యము గాని తెలుగును, ఇతర దేశ భాషలను ఎట్లు మార్చును అనునదియు భావిని తేలవలసినదియే.

మొత్తముమీద ఆంధ్ర భాష నవ్యవిజ్ఞానము నంతటిని తనలో నిముడ్చుకొని ఈ భాషను మాటాడు వారి కందరికిని ఆ జ్ఞానము సులభముగా నలవడునట్లును, తెనుగు దేశమునం దంతటను ఈ భాషకుగల ఏకస్వరూపమును, ఐక్యమును నిలువబెట్టుకొనునట్లును, వాడుక భాషకును రచనలలోని భాషకును గల దూరము వీలయినంతవరకు తగ్గునట్లును, ఇతర భారతీయ భాషలతో పోల్చిచూచినచొ సాధ్యమయినంతవరకు సమాన పదజాలము ఉండునట్లును పెరుగవలసి యున్నది.

ఇట్లు భూతభవిష్య ద్వర్తమాన స్వరూపములను వివరించినతరువాత తెనుగుభాషకు నేటి వాడుకలోని పేళ్ళెట్లు వచ్చినవి అని వివరింపవలెను. నేడు వాడుకలో నున్నవి మూడు పేళ్ళు, 1. ఆంధ్రము, 2. తెనుగు, 3. తెలుగు. ఈ మూడింటి యందును మొదటిది సంస్కృత పదము, తక్కిన రెండును తెలుగుపదములే. ఈ ఆంధ్రము అను పదము ఒకజాతి జనసంఘమునకు వాచకముగా ఐతరేయ బ్రాహ్మణమునందు పేర్కొనబడినది. అంతియేగాక ఈ ఆంధ్రరాజులనుగూర్చి పురాణములును, భారతదేశమునకు ప్రాచీన కాలమున వచ్చిన కొందరు చరిత్రకారులును పేర్కొనిరి. దీనినిబట్టి ఈ పేరు మొదట జనులు పేరుగా నుండుట నిశ్చయము, వీరితరువాత ఈ ప్రదేశమునకు ఆంధ్రపథమనియు, ఆంధ్రదేశమనియు వ్యవహారము శాసనములలో గనుపట్టుచున్నది. ఇది క్రీ. శ. మూడు నాలుగు శతాబ్దులనుండి యుండిన విషయము. అంతకుముందీదేశ భాగమునకు దక్షిణాపథమనియే వ్యవహారము. తరువాత 'దేశమునుండి "ఆంధ్ర"పదము భాషకు వాచకమయినది. నన్నయ తాను వ్రాసిన శాసనములలో ఆంధ్ర భాషను పేర్కొనెను. తన భారతమున దీనినే 'తెనుగు' అని వ్యవహరించెను. 'తెలుగు' అను పేరును తరువాతి గ్రంథములలో గనుపట్టుచున్నది. నేటి తెనుగుదేశములో సుప్రసిద్ధములయిన దక్షారామము, శ్రీశైలము, కాళహస్తి అను మూడు క్షేత్రములలో మూడు శివలింగము లుండుటవలన ఈ దేశమునకు 'త్రిలింగములు కలది' అను నర్థమున “త్రిలింగ దేశము" అను వ్యవహారము కలదని ప్రతాపరుద్రీయము (క్రీ. శ. 1300) మొదలగు గ్రంథములలో చెప్పబడినది. ఈ త్రిలింగమనుశబ్దము వాడుకలో మారుపడి ' తెలుగు' అను రూపమును పొందినదని సిద్ధాంతము. దీనికి బలము శాసనములలో 'తిలింగ, తెలుంగ, తేలుంగ, తెలింగ' అను పేళ్ళు ఈ దేశమును గూర్చి వాడబడినవి కనుపట్టుటయే. కాబట్టి వాడుకలో తిలింగ పదము మారి యుండవచ్చుననునది దృఢమగుచున్నది. ఈ తెలుగులోని 'ల' కారము ఉచ్చారణమున మారి 'న'కారమయి తెనుగు అనురూప మేర్పడినదని కొందరి యూహ. కాని తెనుగు అను శబ్దము స్వతంత్రముగా తెలుగు శబ్దము కంటె ముందుగనే వాడియుండినట్లు నిదర్శనములు గలవు. 'తెనుగు' అను శబ్దమునకు ద్రావిడభాషలలో 'దక్షిణము' అని యర్థము. ఈ దేశభాగమునకు దక్షిణా పథమనియు 'దక్కన్ ' అనియు పేరుండుటవలన ఆ దక్షిణ శబ్దమునకు 'తెనుగు' అను పదము అనువాదముగా వాడబడుటవలన ఈ దేశమునకును, భాషకును తెనుగు అను పదము వాచకమయి కాలక్రమమున ఆంధ్రపదమువలెనే వాడుకలో స్థిరపడెను. ఈ మూడును తెనుగు పేళ్ళుగా ప్రసిద్ధములు.

గం. జో.

[[వర్గం:]]