సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మొదటి సంపుటము/ఆంధ్ర జానపద గేయ వాఙ్మయయము
ఆంధ్ర జానపద గేయ వాఙ్మయయము :- పద్యముకన్న పదమే ముందు పుట్టినదనియు, ఆ పదము (గేయము) కూడ నాగరకతా ప్రారంభమున మానవుడు సంతోష సమయమున చిందులు వేయుచు కూన రాగముల నాలపించుచు లయాన్వితముగా మనోభావముల వెలార్చుటచే, ఉద్భవించిన దనియు, సాహిత్య తత్త్వజ్ఞుల అభిప్రాయము. కొందరు పండితులు పనిపాటలుచేయు మానవులు తమ కష్టము కనబడకుండుటకై అప్రయత్నముగా నేవో మాటలు లయా న్వితముగా గేయరూపమున బహిర్గత మొనర్చిరని తెల్పిరి. ఇం దేది సిద్ధాంతమయినను కవిత్వము ఉల్లాసము నకును కష్ట నివారణమునకును పుట్టినదని భావింపవచ్చును. భారతదేశమున పూర్వమును, ఇప్పుడును జనపదములే కనుక ఇట్టి గేయములకు పుట్టినిండ్లును జనపదములే యగును. జానపదు లందే ప్రచారమున నుండుటచే ఇట్టి గేయములకు జానపద గేయము అని సర్వసాధారణ మగు పేరు కలిగినది. జనపద, జానపద శబ్దములు క్రమముగా దేశవిభాగము నకును అందుండు ప్రజలకును మన ప్రాచీన వాఙ్మయమున వాడబడినవి. జానపద గేయములనే పల్లెపాట లనుటకూడ కలదు. ఔ త్తరాహులు వీటిని లోకగీతము లందురు. ఇంగ్లీషులో వీటినే ఫోక్ సాంగ్సు అందురు. ఇది జర్మను భాషా జన్యము. పాశ్చాత్య దేశములందు సాహిత్యాభిమానులును, మానవ శాస్త్రవేత్తలును కడచిన రెండు శతాబ్దములనుండి ఇట్టి గేయములను, వాఙ్మయమును సేకరించి పరిశోధనములు చేయుచున్నారు. ఆయా జాతుల సంస్కృతులకును, భాషా సాహిత్యములకును ఇట్టి గేయములే మూలకందము లని వారలు అభిప్రాయపడి యున్నారు.
జానపద గేయమునకు ముఖ్యలక్షణములు 1. అజ్ఞాత కర్తృకత్వము లేదా సామూహిక కర్తృకత్వము 2. స్థిరరూప రాహిత్యము. 3. రచనా కాలము తెలియక పోవుట, 4. మౌఖిక ప్రచారము, 5. అకృతక శైలి, 6. గేయత్వము, 7. ఆశురచన, 8. పునరావృత్తి, 9. జన సామాన్య పరిచిత వస్తువు. ప్రతి గేయమునందును ఈ లక్షణము లన్నియు ఉండనవసరము లేదు. కాని ఈ లక్షణము లన్నింటికి కూడలియగు ప్రధాన తత్త్వము---అజ్ఞాత శిల్పము, సార్వజనీనత ఉన్న చాలును. కనుక ప్రాక్తనమానవుని మనోగత భావ వ్యక్తీకరణములును లయాన్వితములునగు నుడుగులును, అఖండపాండితీమండితుల జనామోదముగల పదకవితలును, జానపద గేయములే అగును. ఒక్కొక్క లక్షణమునుబట్టి ఏది జానపద గేయమో, ఏది కాదో నిర్ణయించుటకన్న సాహిత్యతత్త్వము ననుసరించి కవిత్వము నంతటిని రెండు పెద్ద విభాగములుగా చేయవచ్చును. ఒక దాని తత్త్వము జ్ఞాత శిల్పము. మరియొకదాని తత్త్వము అజ్ఞాత శిల్పము. మొదటిది భావుకుడయిన కళాకారుని ప్రయత్నమున తీర్చి దిద్దబడినది. రెండవది జానపదుని సృష్టి, మరియు అప్రయత్నముగా ఒకనోటినుండి ఇంకొక నోటి కెక్కి ఒక ప్రాంతమునుండి ఇంకొక ప్రాంతమునకు ప్రాకి తనకు తానే రూపు దిద్దుకొన్నట్టిది. 'మొదటిది ఏక కర్తృకము. రెండవది అజ్ఞాత కర్తృకము లేదా అనేకకర్తృకము, మొదటిది నాగరకతా మందార, సౌరభ్య సంవాసితము. రెండవది ప్రాకృతత్వ పృథ్వీ గంధ బంధురము. మొదటిది రెండవదాని క్రమపరిణామ వికాసరూపమని విజ్ఞుల అభిప్రాయము. ఆంధ్రకవిత్వము కూడ ఇట్టి క్రమపరిణామమునకు వెలియైనది కాదు. జానపద గేయములే దేశ కవితగా పరిణమించినట్లు మనకు అనేకాధారములున్నవి. సీసము, గీతము, రగడ, ద్విపద, మధ్యాక్కర, తరువోజ మున్నగు దేశీయచ్ఛందములు కొన్ని జానపద గేయముల నుండియే కొలది మార్పులతో ఏర్పడినట్లు భావింపనగును.
జానపద సాహిత్యమునకు నిత్యజీవితమును అలముకొను శక్తి హెచ్చు. ఈ వాఙ్మయము కేవలము ప్రజానీక మిచ్చిన కేలూతవలననే కాలు నిలద్రొక్కుకొన్నది. నిత్యజీవితమందు వాడుకొనెడు వ్యావహారిక భాష యందు సులభ శైలిలో సాధారణరీతిలో మనో భావములు వెలార్చునట్టి ఈ గేయములు జానపదులకు ప్రీతిపాత్రము లయినవి. ఇదిగాక, జానపద గేయములు ఆయా దేశము లందలి మతపరిణామములను, మనస్తత్వములను, వీరుల ఉదంతములను, పతివ్రతల కథలను, అత్యాచారములకు గురియైనవారి గాధలను, ఆచార వ్యవహారములను, విశ్వాసములను, వినోదములను, విందులను, వేడుకలను, అన్యోన్యానురాగములను, సంయోగ వియోగములను, సౌందర్య సౌభాగ్యములను, సుఖ దుఃఖములను, జాతీయతను ప్రతిబింబించుటచే ఈ జానపద గేయములు నిసర్గమనోహరములుగా నుండును. జాతీయత నింతగా పుంజికొన్నవి కనుకనే ఈ పదకవితలు దేశికవితలుగా పరిణతి నొందినవి. దేశీయులగు కవులు మార్గకవిత్వము పై తిరుగుబాటొనర్చి దేశీయేతివృత్తములను తీసికొని దేశీ చ్ఛందములందు దేశీయులకు అనువైనట్లు కవితను చెప్పిరి.
గేయసాహిత్యము చిరకాలమునుండి తెలుగునాట వృద్ధియైనదనుటకు శిష్టకవులు పేర్కొన్న సమకాలిక గేయములే గొప్పసాక్ష్యము. గేయములన్నియు మాత్రా ఛందమున నుండును. నన్నయకు పూర్వపు శాసనములందే మనకు దేశికవితారీతులు కాన్పించును. నన్నయ భట్టు స్వయముగా తరువోజ, మధ్యాక్కర, అక్కర, మధురాక్కర అను వాటిని వాడెను. అంకమాలికలు, ఊయెలపాటలు, ఆలతులు, గౌడు గీతములు, రోకటి పాటలు మున్నగునవి నన్నెచోడుడు పేర్కొనెను. ఈ గేయముల జాడ మన కధికముగా కనబడునది పాల్కురికి సోమనాథుని రచనలయందు. సోమనాథుని కవిత్వమునకు ఆధారము లానాడు ప్రజలు భక్త్యుద్రేకములతో పాడుకొన్న గేయములేనట. “ఆతత బసవపురాతన భక్త గీతార్థ సమితియే మాతృక" గాగ ఆతడు కవిత్వరచనకు కడంగెను. సోమనాథుడు రోకటిపాటలను, తుమ్మెద, ప్రభాత, పర్వత, ఆనంద, శంకర, నివాళి, వాలేశు, గొబ్బి, వెన్నెల ఇత్యాది పదములను పేర్కొనెను. ఏగంటివారి కాలజ్ఞానవచనములందు తుమ్మెదపదములు, ఏలపదములు. లెల్లెపాటలవంటివి గలవు. లక్షణకారులు ఉదాహరించిన నాచనసోముని జాజర పాట ఛందముననే ఇప్పటికిని తెలంగాణమున జాజరపాటలు కాముని పున్నమ పండుగు సందర్భమున జానపదులు పాడెదరు. కేతన దశ కుమార చరిత్రమున మూలమందు లేని పాటల ప్రసక్తి కలదు. శ్రీనాథుడు యక్షగానములను జాదుర (జాజర)లను తడవెను. మంచన శర్మ, టిట్టిభ సెట్టి యను మిత్రద్వయము ఓరుగల్లు చూడబోయి ద్విపద ప్రబంధమున వీరానీకమును పాడు వనితను, పరశురాముని కథలను పాడు బవనీల చక్రవర్తిని, కామవల్లి మహాలక్ష్మీ కైటబారుల వలపును పాడుచు వచ్చు జక్కుల పురంధ్రిని కాంచెను. పోతన్న గోవిందుమీది పాటలు వినెను. కొరవి గోపరాజు వెన్నెలగుడి పాటను పేర్కొనెను. తాళ్ళపాక అన్నమాచార్యుల వారు తమ కాలమందు వినబడుచుండిన జానపద గేయములు మాదిరుల కన్నిటికిని సరిపోవునట్లు సంకీర్తనలను రచించి పెట్టిరి. ఈయన భార్యయగు తాళ్ళపాక తిమ్మక్క యొక్క కృతి సాగినది ఈ పాట బాట యందే. చిన తిరుమలాచార్యుడు పదములు వ్రాయుటయేకాక సంకీర్తన లక్షణముగూడ రచించెను. జానపద గేయములు కాకపోయినను తాళ్ళపాకవారి రచనలు గేయస్వరూపములను, వాటి పరిణామమును మాత్రము సూచించును. సంకీర్తన లక్షణమునందు ఏలలు, గొబ్బిళ్ళు, చందమామ పదములు, అర్ధ చంద్రికలు మొదలగు గేయముల లక్షణములు వివరింపబడినవి. దిగ్విజయార్థము బయలుదేరనున్న శ్రీకృష్ణదేవరాయలకు ఒక జానపద గేయము కలిగించిన అపరిమితోత్తేజనమును గూర్చిన ఐతిహ్యముఅంద రెరిగినదే. స్వయముగా ఆ మహారాజు ప్రాత ర్వేశల "సంధు యంత్ర నతిక్పత్రోృద్గీత గేయౌమము" ల్వినెను. రుద్రకవి సుగ్రీవ విజయమను యక్ష గానమునందు వివిధములగు గేయఫణుతులు కాననగును. దామెరల వెంగళభూపాలుడు జాజరపాటలను, ధవళములను కల్యాణపు పాటలను పేర్కొనెను. కదరీపతి నాయకుడు "సువ్వాలు న్శోభనములు ధవళాలు న్మొదలయిన పాట"లే కాక ఏలపదములు, రాట్నముపాటలు, పరశురామునిపై పాటలు తడవెను. నాయక రాజుల కాలమందు రంగాజి, రామభద్రాంబ, విజయ రాఘవ నాయకుడు మొదలగువారు పదకవిత లల్లిరి. భద్రాచల రామదాసు పాడినపాటలు జానపద గేయములుగా ప్రచార మందినవి. క్షేత్రయ్య పదములు, త్యాగరాజకీర్తనలు కర్ణాటక సంగీత సరస్వతికి తలమానికములై వరలినవి. ఎలకూచి సరస్వతి, కంకంటి పాపరాజు, గోగులపాటి కూర్మనాథకవి ఆలూరి కుప్పన మున్నగు పండితకవులుకూడ పద రచనమునకు దోహద మొనర్చిరి. వీరి కవిత్వమంతయు పదకవిత్వమే యైనను ప్రౌఢమైనది. ఇది దేశిసారస్వతమున జేరును. గేయ కవితా పరిణామమును కనుగొనుటకు కూడ ఉపకరించును.
త్యాగరాజు తరువాత స్వయముగా జానపదులు రచించినవి లేదా జనపదములందు ప్రచారముగాంచిన గేయము లనేకములు మనకు దక్కిన వనుకొనవచ్చును. కొన్ని కాలగర్భమున కలిసిపోయి యుండును. ఏ వాఙ్మయమునకును ఈ విపత్తు తప్పినదికాదు. భద్రపరిచేడువారుండినచో యాగంటి లక్ష్మయ్యగారి వచనములవంటి అతి ప్రాచీన గేయములు మనకు మరికొన్ని యైనను దక్కియుండును. ప్రాత తాళపత్ర గ్రంథములందు అచ్చటచ్చట కొన్ని పాటలుమాత్రము కనబడుచున్నవి. ముద్రణ సౌకర్యములు కలిగిన తరువాత ఈ గేయ వాఙ్మయము కొంత ముద్రింపబడినది. ముద్రిత గేయము లందు అధికభాగ మాధునికమే. మౌఖిక ప్రచారమున నున్న చిన్న చిన్న గేయములు ఆధునికులఅగు ఉత్సాహ వంతులు సేకరించి ప్రకటించుచున్నను సేకరింపవలసినవి ప్రకటింపవలసినవి ఇంకను పెక్కులున్నవి. వాటిసంఖ్య లక్షల కెక్కును, వాటి చావుపుట్టుకలు, పెరుగుట విరుగుటలు జానపదుల జీహ్వాంచలములందే జరుగుచున్నవి. ఏ గీత మెప్పటిదో, ఎన్ని యెన్ని మార్పుల నందినదో తెలిసికొనజాలము.
ఇట్టి జాతీయ సంపదను గూర్చి తొలిసారిగా ఆంధ్రలోకమునకు పరిచయము కలిగించినవాడు బ్రౌను మహాశయుడు. అతని తరువాత ముప్పదేండ్లకు మరల duplicate duplicate నొక పాశ్చాత్య పండితుడు తొలిసారిగా జానపద గేయములను సేకరించెను. ఆయన జె. ఎ. బాయ్ ల్ గారు. తరువాత ఇరువదియవ శతాబ్ది ప్రారంభమున ఉత్సాహవంతులగు పండితులును, ప్రచురణ కర్తలును ఈ గేయములను సేకరించి ప్రకటించిరి.
ఇప్పటికి లభించిన ముద్రితా ముద్రిత జానపద గేయముల నన్నింటిని విమర్శన సౌలభ్యమునకై కొన్నిభాగములుగా విభజించుకొనవచ్చును.
పౌరాణిక గేయములు : జానపద గేయములుకూడ మన శిష్టసాహిత్యమువలెనే వివిధ పురాణేతివృత్తములు కలవి, బహుళ ప్రచారమందున్నవి. అనువాదములగు రామాయణ భారతాది గ్రంథములందు మూలమున లేని కథలు పెక్కులున్నవి. అట్టివి జానపద గేయములందుకూడ నుండుటచే ఇట్టి కూర్పులు సంస్కృతమునుండి ఆంధ్రానువాద మొనర్చిన శిష్టులు చేసిన తరువాత ఆ గాథలు వినిన జానపదులు వాటిని స్వీకరించిరో లేక జానపదులలో ప్రచార మందున్న ఈ మూలాతిశాయి విషయములు తమకు రుచించుటచే పండితులు చేపట్టిరో ఇదమిత్థముగా చెప్పజాలము. జానపద గేయములలో మనము శిష్ట సాహిత్యమందున్న ప్రసిద్ధ పౌరాణిక గాథలన్నియు చూడగలము. పౌరాణిక గాథలపై జానపదులకు అమితమైన భక్తి కలదు. రామాయణ భారత భాగవతాదులందలి కథలును, అష్టాదశ పురాణములందలి ప్రసిద్ధ కథలును జానపదుల చిత్తవృత్తి ననుసరించి మలచబడినవి. కూచకొండ రామాయణము, శారద రామాయణము, ధర్మపురి రామాయణము, రామాయణకథాసుధార్ణవము, మోక్షగుండ రామాయణము, సూక్ష్మ రామాయణము, సంక్షేప రామాయణము, గుత్తెనదీవి రామాయణము, చిట్టి రామాయణము, శ్రీరామదండములు, రామాయణ గొబ్బిపాట, శ్రీరామ జావిలి, అడవి, శాంత, పెండ్లి, సేతు- గోవింద నామములవంటివి రామాయణగాథా పాధః ప్రపూరములు, ఇంకను “విద్దికూచి రామాయణ మారుకాండముల నచ్యుత జాగర వేళ బాడి" నట్టి వెన్ని మృగ్యమైపోయెనో తెలియదు. ఇక రామాయణము నందలి కొన్ని కొన్ని భాగములనే తెలుపునవి శాంతా కల్యాణము, పుత్రకామేష్టి, కౌసల్య బైకలు, శ్రీరాముల ఉగ్గుపాట, రాఘవ కల్యాణము, రాములవారి అలుక, సుందర కాండపదము, ఋషులు ఆశ్రమము, సుగ్రీవ విజయము, కోవెల రాయబారము, అంగద రాయబారము, లక్ష్మణమూర్ఛ, లంకాయాగము, గుహ భరతుల అగ్నిప్రవేశము, శ్రీరామ పట్టాభిషేకము, లక్ష్మణదేవర నవ్వు, ఊర్మిళాదేవి నిద్ర, కుళలాయకము, కుశలవకుచ్చెల కథ, కుశలవ యుద్ధము, వేపూరి బ్రతుకమ్మ కుశలవ పాట, పాతాళహోమము, శతకంఠ రామాయణము వంటివి అసంఖ్యాకములు కలవు.ఒక్క నీతాదేవిని గురించియే - సీతపుట్టుక, సీతాకల్యాణము సీత నత్తవారింటి కంపుట, సీత సమర్త, సీత శుభగోష్ఠి, సీత గడియ, సీత వామనగుంటలు, సీతామ్మవారి అలుక, సీత వసంతము, సీత దాగిలిమూతలు, సీత సురటి, సీత ముద్రికలు, సీత ఆనవాలు, సీత అగ్నిప్రవేశం, సీత వేవిళ్ళు మున్నగు పాటలు ఎన్ని యో కలవు. సీతమ్మ చెర, మాయ లేడి పాట మున్నగునవి అముద్రితములుగా నున్నవి. ఈ పాటలయందలి భాష, భావము, కల్పనలు జానపద వాసనను వెలార్చుచుండును.
రామాయణగాథల తరువాత భారతగాథలు లెక్కింప దగినవి. నలచరిత్ర, దేవయాని చరిత్ర, సుభద్రా కల్యాణము, సుభద్ర సారె, ధర్మరాజు జూదము, ద్రౌపది వలువలు, పండుపాట, విరాటపర్వము, పద్మవ్యూహము, విశ్వరూపము, భగవద్గీత కథాగీతము, సావిత్రి బ్రతుకమ్మ పాట, శశిరేఖా పరిణయము, గయోపాఖ్యానము, పరాశర మత్స్యగంధి సంవాదము వంటివి జానపదుల నోళ్ళ యందు బ్రతికియున్న భారత గాథలును, విరాట, కర్ణ శల్య, పర్వములును, ఉత్తర, దక్షిణ గోగ్రహణములును పెద్ద పదములు.
ఇటులే అనేకములయిన భాగవత గాథలను కూడ జానపదులు పాడుకొందురు. భక్తి శృంగారములవలె జానపదులను శ్రీకృష్ణుని చిలిపి చేష్టలు మరింత పరవళులను చేసినవి, భాగవతమునకు సంబంధించిన కథలందు ప్రహ్లాద చరిత్ర పదము, వామన విజయము, వామన చరిత్రము, అంబరీషోపాఖ్యానము, గజేంద్ర మోక్షము, శ్రీకృష్ణ జననము, కాళింగమడుగు పాట, శ్రీకృష్ణుని చల్దులు, బాలకృష్ణ లీలలు, గుమ్మడు పాట, యశోద కొంగపాట, గోపికా స్త్రీల జలక్రీడలు, రుక్మిణీకల్యాణము, చిలుక రాయబారము, సత్యభామ సరసము, రుక్మిణీదేవి ముచ్చట, రుక్మిణీదేవి సీమంతము, పొరుజాత పల్లవి, ఉషాస్వప్నము వంటివి ముఖ్యములు. కుచేలోపాఖ్యానము, భ్రమర గీతలు మున్నగు పాటలు అముద్రితములు.
సత్య హరిశ్చంద్ర, చంద్రమతీదేవి బ్రతుకమ్మపాట, గోవు పాట, దత్తాత్రేయ జననము, దక్షయజ్ఞము, గంగా వివాహము, గంగా గౌరీ సంవాదము, సవతుల కయ్యము,ఈశ్వర భృంగి వాదము, మేనకా పార్వతీ సంవాదము, లక్ష్మీ పార్వతుల సంవాదము, త్రిపురాసుర సంహారము, సురాభాండేశ్వరము, మార్కండేయ జననము, సిరియాళ మహారాజు చరిత్రము. భల్లాణరాయ కథ, కొమిరెల్లి మల్లన్నకథ. వరదరాజు పెండ్లి పాట, అండాళ్ చరిత్రము. శ్రీరంగ మహాత్మ్యము, తిరుమంత్రము పాట, దశావతారముల పాట, లక్ష్మీదేవి సొగటాలాట, లక్ష్మీ దేవి వర్ణనము, వేంకటేశ్వరుల వేట, చెంచెత కథ, ఏకాదశీ మాహాత్మ్యము, వరహావతార చరిత్రము, నూట యెనిమిది దివ్యస్థలములు, వేంక టేశ్వర మాహాత్మ్యము వంటివి ఇతర పురాణములకును మాహాత్మ్యములకును సంబంధించిన గేయములై యున్నవి. ఇట్టి గేయములందు అంతటను మనకు కన్పించునది జానపదుల తాదాత్మ్యము. మూలకథలకును గేయములందలి కల్పనలకును గల భేద మరసి దానిని జానపదుల జీవితముతో పోల్చిచూచిన జానపదుల చిత్తవృత్తులు వారికి ఆ యా పురాణపురుషులు యెడ గల అభిమానము భక్తి ప్రేమలు తెల్లమగును.
2. చారిత్రక గేయములు :- జానపద గేయ వాఙ్మయమున చరిత్రకు సంబంధించిన గేయములకు ఒక విశిష్ట స్థానము కలదు. వస్తువునందును, శైలియందును, కథా కథన పద్ధతియందును, తక్కిన జానపద గేయములకన్న ఇవి భిన్నముగా నుండును, వీటినే వీరగీతము లందురు కూడ. చారిత్రక వీరగీతములు త త్తదుచిత వీరసంఘటన మేదియో జరిగిన వెంటనే ఉద్భవించును. ఆ సన్నివేశమును కన్నులార గాంచియో, చెవులార వినియో జానపదు డొకడు ఉద్వేగముతో గాన మొనరించును. ఆ పాట అంతటను ప్రాకిపోవును. ఇట్లు విస్తరించుటలో పాట యొక్క వస్తువు కాలక్రమమున మార్పుల నొందును. ఒక క్రొత్త పాటయందు అభివర్ణింపబడిన సంఘటనములకు ప్రాతకాలపు గాన ప్రవాహమందలి సంఘటనలు తోడై ఊహింపరాని మార్పులు కలుగును. ఎప్పుడో లిఖితమై పోయిన ఇట్టి చారిత్రక గేయములందు సిసలైన చరిత్రము లభించును. కానిచో ఇవి రానురాను మారిపోయి గుర్తించుటకు వీలుగాక అస్పష్ట చరిత్రములుగా పరిణమించి మరికొన్ని దినములకు పుక్కిటి పురాణములుగా కల్పిత కథలుగా మారిపోవును. చారిత్రక వీర గేయములకును తదితర జానపద గేయములకును ధ్యేయములు వేరు వేరు. ఉత్సాహోల్లాసములకు గాక వీరగీతములు అవబోధమునకై పాడబడును, ఆంధ్ర దేశము తొలినుండి వీరప్రసువు. తెలుగువారికి వీరాభిని వేళము మెండు. కనుకనే తెలుగునాట వీరపూజలు పాదుకొన్నవి. తదితర జానపద గేయములవలెనే తెలుగుదేశమున చారిత్రక గేయములు కూడ అసంఖ్యాకములుగా నున్నవి. "తెలంగాణ మందే మియాసాబ్, సోమనాద్రి, రామేశ్వరరావు, రాణి శంకరమ్మ, సవై వెంకట రెడ్డి, కుమారరాముడు, కర్నూలు నవాబు, మున్నగువారి కథ లున్న "వని కీ. శే. సురవరం ప్రతాపరెడ్డిగారు అనిరి. ఇవిగాకను సదాశివరెడ్డి, పర్వతాల మల్లా రెడ్డి, సర్వాయి పాపడు, బల్గూరి కొండల్రాయుడు ఇటువంటి తెలంగాణపువీరుల కథలును బహుళ ప్రచారమందిన గేయములే. చారిత్రకముగా పల్నాటి వీరుల కథలు ప్రాచీనములు. శ్రీనాథుని, బాలచంద్రుని యుద్ధ మొక్కటియే ఇప్పటికి ముద్రింపబడినది. ప్రాచ్య పుస్తక భాండాగారమున ఈ వీరుల కథలు అనేకములు మూలుగుచున్నవి. కోళ్ళ పోట్లాట గోపు యుద్ధము, రాయబారము, యుద్ధ సన్నాహము, గురజాల యుద్ధము పూర్వభాగము, కల్లు ప్రతిష్ఠ, బాలుని కథ, బాలుని యుద్ధము, కన్నమనేని యుద్ధము- గోవు సంస్కారము, కొమ్మరాజు యుద్ధము, బ్రహ్మనాయని విరుగు వంటి కథలు పాఠభేదములతో అందు కాననగును. వీటి తరువాత ప్రసిద్ధికెక్కినది కాటమరాజు కథ. ఎఱ్ఱగొల్లలు, మందుచ్ఛవారు ఈ కథలను చెప్పుదురు. శ్రీనాథుడు వ్రాసినట్లు ప్రతీతిగల కాటమరాజు కథ లభింపలేదు. 'కాని "పినయెల్ల యనువాడు ప్రియము దీపింప వలనొప్ప శ్రీనాథు వచన పద్ధతిని" యదుశాస్త్రమంతయుపాడెను. ఈ కాటమరాజు కథ, దీని కనుబంధముగా భట్టు రాయభారము, కోటపాటి తాటివృక్షము తెచ్చు కధ, ఎఱ్ఱగడ్డ పోట్లాటలు ముద్రింపబడినవి. కాటమరాజు కథకు సంబంధించిన మరికొన్ని గేయములు అముద్రితములు. గోరంత చారిత్రకాంశము కొండంత పురాణముగా పెరిగిన కథ లందు కుమారరాముని కథ అగ్రగణ్యము, "రెడ్డొచ్చే రెడ్డొచ్చె రెడ్డొచ్చె నమ్మా" అను చిన్న చారిత్రక గేయము రెడ్లనాటి యశః ప్రాభవము లను ప్రజా జీవితమును చాటునట్టిది. "కొండవీడు మనదేరా" అను గేయము శ్రీకృష్ణరాయల కాలపు ఆంధ్రుల వీరప్రతిభకు జయ పతాక. కథాస్థలము తమిళ దేశమైనను తెలుగు దేశమున ప్రాకినకథ దేశింగురాజుకధ. తెలుగువారి శౌర్యము అఖండ మని చేయెత్తి చాటునట్టిది బొబ్బిలికథ. వీర గేయములందు ఇంత సార్వజనీనతకలది మరి యొకటిలేదు. సిసలైన జానపద గేయమునకు ఉండవలసిన లక్షణము లన్నియు దీనికి గలవు. ప్రాంతీయముగా ప్రచారమందినది పెద్దాపురపు కోడి పందెములపాట. ఇరువదియవ శతాబ్ది ప్రథమ పాదమునకు చెందినది అల్లూరి సీతారామరాజు కథ. హైద్రాబాదు స్వాతంత్య్ర సమరమున ప్రాణము లొడ్డిన వీరుల చరిత్రములు ఇప్పుడిప్పుడే సముద్రతరంగములట్లు వ్యాపించుచున్నవి. బంగారు తిమ్మరాజుకథ, ఆరె మరాటీల కథ, బల్గూరి కొండల్రాయునికథ, పర్వతాల మల్లా రెడ్డికథ వంటివి అస్పష్ట చారిత్రకములు. జానపదుల దృష్టిలో శౌర్య పరాక్రమములనగా ఎట్టివో తెలిసికొనుటకు ఈ చారిత్రక వీర గేయములు తోడ్పడును.
పారమార్థిక గేయములు : భక్తి, కర్మ, జ్ఞానమార్గములు మూడింటికిని సంబంధించిన గేయములు లక్షొపలక్ష లున్నవి. భక్తి గేయములను శైవ వైష్ణవము లని విభజించుకొన వచ్చును. పూర్వ శైవుల తుమ్మెద పదములలో ఇప్పటికిని కొన్ని నిలిచియున్నవి. తాళ్ళపాకవారు, క్షేత్రయ్య, త్యాగరాజు వ్రాసిన కీర్తనలు, పరిమళరంగని పదములు, ఘట్టవల్ల ధర్మపురి, ఛత్రపురి, జావళీలును సంగీతజ్ఞుల సొమ్మైపోయినవి. అధ్యాత్మ రామాయణకీర్తనలు అటు నిటు మ్రొగ్గినవి. జానపదులందు అధికాదరణము పొందిన వారిలో భద్రాచల రామదాసు అగ్రేసరుడు, తూము నృసింహదాసు, పరాంకుశ దాసు, నిట్టల ప్రకాశదాసు, తాటంకము వేంకటదాసు వంటి భక్తుల గేయములను హరిదాసులు పాడుచు పొట్టపోసి కొనుచున్నారు. గురు పూజాకీర్తనలు, రామనామము, రామనామ మాహాత్మ్యము, భగవన్నామ సంకీర్తనలు, హరిభజన కీర్తనలు, శ్రీరామ భజనామృత సంకీర్తనలు, భజనకీ ర్తనలు, హరినామ సంకీర్తనలు, తిరునామములు, పాండురంగ బృందావన కీర్తనలు, భక్తిసార సంగ్రహ కీర్తనలు, భజన మాల, కాలేషా మస్తాన్ దేవుని కీర్తనలు, కుసుమ హరనాథ కీర్తనలు, భగవన్నామ సంకీర్తనలు, భ్రమరాంబి కాష్టకము, నూతనభజన కోలాట కీర్తనలు, రాకమచెర్ల కీర్తనలు, మున్నగు భజన కీర్తనల పుస్తకములందును స్త్రీలపాటల సంపుటము లందును, శ్రీ గంగాధరంగారి ప్రచురణము లందును, ఇట్టిభక్తి సారస్వతము ముద్రణము నొందినను, మౌఖిక ప్రచారమున ప్రాణములు నిలుపు కొనుచున్న గేయము లింకను కలవు. సంకీర్తనములు. పదములు, దరువులతోపాటు మేలుకొలుపులు, లాలి పాటలు, జోలపాటలు, కోలాటములు, మంగళ హారతులును భక్తి గేయములలో చేరిపోవును. కోలాట పాట లందు మధురభక్తి మెండు. వీటిలో సంగీత సాహిత్యములతో పాటు కొత నృత్యముండును. పాల్కురికి పేర్కొన్న ప్రభాత పదములు మేలుకొలుపులై యుండును. మేలుకొలుపులనే భూపాలము లందురు. ఇవి భూపాల రాగమున పాడబడుట సాధారణము కనుక వీటికి ఈ పేరే వచ్చినది. వేదాంత పరములగు మేలుకొలుపులుకూడ కలవు. కృష్ణపరమగు మేలుకొలుపులందు మధురభక్తి కాంచనగును. మంగళహారతులు అన్ని దేవతలకు సంబంధించినవి కలవు. ఇవి వర్ణనరూపమునను స్త్రోత్రరూపమునను, సేవారూపము నను భక్తి వేదాంత శృంగారరూపమునను ఉన్నవి.
భక్తి గేయముల వలెనే వేదాంత గేయములు కూడ పెక్కులు గలవు. తత్త్వవిషయములు కలవగుటచే ఇట్టి గేయములకు తత్త్వములను పేరుకూడ కలిగినది. ఈ తత్త్వములు అధికముగా నద్వైత వేదాంతపరములు. తత్త్వములను వ్రాసిన వారును ప్రచారము చేసిన వారును అధికముగా బ్రాహ్మణేతరులు. అద్వైతమున జీవబ్రహ్మై క్యము ప్రతిపాదితమగుటచే సంఘవ్యవస్థ యందున్న ఎక్కువతక్కువలు వేదాంత విచారమున నుండవు. కనుక అధికారులు బోధనమునకై, అనధికారులు సంతుష్టికై ఇట్టి పాటలు పాడుట యాచారమైనది. అగ్రవర్ణములవారి వర్ణాశ్రమాచార విధులు పూజా పురస్కారములు ప్రవచనములు మున్నగునవి కొన్నితత్త్వము లందు గర్హింపబడుట కాననగును. తత్త్వములందు కొంత మర్మకవిత్వముకూడ కలదు. ఏగంటివారు, పోతులూరి వీరబ్రహ్మము, వేమనయోగి, సిద్దప్ప, శేషాచలస్వామి,పరశురామపంతుల లింగమూర్తి, భోజదాసు, ఎడ్ల రామదాసు మున్నగు. అనుభవజ్ఞులైన యోగులెందరో తత్త్వములను, వేదాంత గేయములను వ్రాసియున్నారు. సీతపాట, నారాయణ శతకము, రామరామ శతకము, ఆత్మబోధామృత తత్త్వములు, కవిప్రమాణ తత్త్వ కీర్తనలు, కాలజ్ఞాన తత్త్వములు, శుద్ధనిర్గుణ తత్త్వ కందార్థ దరువులు, తారకామృతసారము, శ్రీరామగీత, గురుజ్ఞానామృతము, వేదాంత కుచ్చెలకథ, బ్రహ్మానంద కీర్తనలు ఇత్యాది ముద్రిత గ్రంథములందలి గేయములు జానపదుల నోటి కెక్కినవి. సాధారణముగా ఈ తత్త్వము లందు రాజయోగము, అచలవేదాంతము, గురుభక్తి, నీతిబోధము, సంఘసంస్కార పరాయణత్వము, వర్ణాశ్రమాచార నిరాసము, వైరాగ్య బోధనము, అహింస, సత్ప్రవర్తనము మున్నగు విషయము లుండును.
పురాణోక్తముగా నున్న కర్మకాండయు, వ్రతములు నోములు మున్నగునవి అందరి అందుబాటులో నుండుటచే అట్టి వాఙ్మయముకూడ బాగుగా ప్రచారమందినది. ఇట్టి కర్మకాండ స్త్రీలకు మిక్కిలి అభిమానపాత్ర మగుటచే స్త్రీలపాటల రూపముననే ఇట్టి వాఙ్మయము అధికముగా గలదు. నన్నయనాటినుండి మనకీ నోములు వ్రతములు ఉన్నటులు కాననగును. ఇవి స్త్రీలకును చాతుర్వర్ణ్యముల వారికిని పూజాధికారము కల్పించుటకు ఉద్దేశింపబడినవి. వీరశైవ వీరవైష్ణవ మతోజ్జృంభణ ఫలితముగా ఇట్టి సంస్కారమునకు తావులభించినదని ఊహింపనగును. మదన ద్వాదశీవ్రతము, నిత్యదానము నోము, దీపదానము నోము, మోచేటి పద్మమునోము, చాతుర్మాస్యవ్రతము, కృత్తికదీపాలనోము, పెండ్లి గుమ్మడి నోము, వరలక్ష్మీ పాట, తులసినోము, లక్షవత్తులనోము, కామేశ్వరీవ్రతము, శ్రావణ శుక్రవారపునోము, శ్రావణ మంగళవారవ్రతము మున్నగువాటికి సంబంధించిన పాటలు అధిక ప్రచార మందినవి. వీటిలో కామేశ్వరిపాట క్రీడాభిరామ కాలము నుండి వినబడుచున్నది. అగ్రవర్ణముల వారికి లక్ష్మీ గౌరీ వ్రతములు పూజలు ఉన్నటులే శూద్రులకు ఎల్లమ్మ. మైసమ్మ, పోచమ్మ, బాలమ్మ, మున్నగు క్షుద్ర దేవతల పూజలు కలవు. ఈ దేవతల కొలుపులు పల్లెటూళ్ళయందు బవనీలు మున్నగువారు చేయుదురు. ఎల్లమ్మయే రేణుకా దేవి. క్రీడాభిరామమున బవనీల చక్రవర్తి "పరశురాముని కథలెల్ల ప్రౌఢి బాడి" నట్లున్నది.
స్త్రీల పాటలు : సంసారయాత్రలో గృహలక్ష్మికే అధిక ప్రాధాన్యము కలదు. అటులే గృహజీవనమున కవిత్వము నకును స్త్రీలే అధికముగా ఆలంబనములు. ఇట్టి పాటలను స్త్రీలపాటలని పిలువవచ్చును. వీటిలో కల్పనకన్న వాస్త వికత హెచ్చు. మాతృత్వము నాధారముగ చేసికొని ఎన్నియో గేయములు పుట్టినవి. సంతానమునకై స్త్రీలు పడెడు బాధలు, నోచెడు నోములు, మ్రొక్కెడి మ్రొక్కులు, గొడ్రాండ్ర స్థితి, అట్టి పాటలందు వర్ణితములు, సంతానము కలిగినవెంటనే లాలిపాటలు, జోల పాటలు వచ్చును. ఈ పాటలందు తల్లులు తమ సంతానమును రాముడుగనో, కృష్ణుడుగనో, శంకరుడుగనో, సీతగానో, రుక్మిణిగానో, పార్వతిగనో వర్ణించుకొందురు. వివాహము నాధారముగా చేసికొని వెలసిన పెండ్లి పాటలు అనంతములు, కొట్నాల పాటలు, నలుగు పాటలు, గంధము పాటలు, కల్యాణపు పాటలు, తలుపు దగ్గర పాటలు, బంతుల పాటలు, బువ్వము పాటలు, వధూవరుల పాటలు, అలక పాటలు, ముఖముకడుగు పాటలు, కట్నాలపాటలు, మిథునవిడెముల పాటలు, అవి రేణి పాటలు, అప్పగింతల పాటలేకాక ప్రతి స్వల్ప విషయమునకు, అనగా పసుపునకు, తిలకమునకు తలంటులకు, ఊయలకు వసంతములకు పానుపులకు సంబం ధించిన పాటలుకూడ కలవు. అత్తమామల భక్తిని, పతి భక్తిని, ఆడుబిడ్డల భ క్తని, తోడి కోడండ్రతో, బావ మరదులతో, ఇరుగుపొరుగు వారలతో మెలగవలసిన రీతిని దెలుపు పాటలు కొన్ని కలవు. అత్తల ఆరండ్లు, కోడండ్ర సాధింపులు, ఆడబిడ్డల ఘాతుక చర్యలు, మున్నగువాటిని ఆశ్రయించిన గేయములును కలవు. ఇట్టి స్త్రీల పాటలందు సాంఘిక జీవనము సమగ్రముగా కాననగును.
శ్రమిక గేయములు : కవిత్వము ఉల్లాసమును కలిగించుట కేకాక కష్ట నివారణమునకు గూడ నుదయించుననుట పలువురు సాహిత్య తత్త్వజ్ఞులు అంకగీరించిన విషయము. మానవులు శ్రమించునప్పుడు కష్టము కనబడ కుండుటకై, అలసిపోకుండుటకై, అప్రయత్నముగా కూనరాగములు తీయుట లయాన్వితములగు నేవోమాట లుచ్చరించుట జరుగును. సామూహిక కర్తృత్వమున అట్టి రాగములు మాటలు జానపద గేయములుగా పరిణమించి వ్యాప్తి గాంచును. వివిధములగు పనులు చేయు వారు అయీ సందర్భములందు శ్రమాపనోదనమునకై పాటలు పాడుచుండుట కాంచనగును. కొందరిట్టి గీతములను 'పాట కజన' సారస్వత మనిరి. కొందరు కార్మిక కర్షక గీతము లనిరి. ఇట్టి శ్రమిక గీతములందు వస్తు వెద్దియైన నుండవచ్చును. వృత్తికి సంబంధించిన పాటలు, శృంగార గేయములు, స్థానిక వృత్తాంతములు, విషాద గాథలు, భక్తి గేయములు, మున్నగు తీరుతీరుల పాటలు శ్రమికులు పాడుకొందురు. శ్రమిక గేయము లన్నియు సాధారణ ముగా వారివారి కృషికి సంబంధించిన లయకు సరిపోవున ట్లుండుట గమంనింపదగిన విషయము. శ్రమికుల పాట లందు "లిబిడో" స్ఫుటముగా ధ్వనించుచుండుట మరియొక విశేషము. శరీర సుఖమునకు సంబంధించిన ఊహలు శ్రమికులకు ఉత్సాహమొసగును. కనుకనే విషయ వాంఛ ఇట్టి పాటలందు తరచుగా కాననగును. గారడి వానిపాటలందు ఆకర్షించుటకువలెనే బరువులు లాగెడు పాటలందు శ్రమాపనోదవమునకై బూతులు ప్రవేశించును. శ్రమికుల పాటలందు ఇట్టి బూతుపాట లెన్నియో కలవు. ఇట్టిపాటలు "ఘుమఘుమాపాట" ల పేరుతో కొన్ని ప్రచురింపబడినవి.
బాలగేయములు : జానపద గేయ వాఙ్మయమునందు బాల గేయములు ఒక ప్రత్యేక శాఖకు చెందినవి. ఇవి రెండు విధములు. బాలుర కొరకై పెద్దలచే రచింపబడి తరతరములనుండి వచ్చునవి ఒక విధము. బాలుర చేతనే రచించబడి ఒక తరమునుండి మరియొక తరమువారి నోటి కండనవి మరియొక విధము. పెద్దలు పిల్లల కొరకు రచించిన పాటలందుకూడ రెండువిధము లున్నవి. పిల్లలను లాలించుటకును నిద్రపుచ్చుటకును పాడెడు లాలి పాటలును జోల పాటలును ఒకతీరువి. పిల్లలనే వస్తువుగా గ్రహించియో లేక ఏవేని కథావిషయములనో, ప్రపంచమందలి మనోహరవియములనో గ్రహించి పిల్లల కానందమును గూర్చుటకై, ఆటలాడించుటకై, రచింపబడినవి ఇంకొక తీరువి. లాలిజోలపాటల భావములను పిల్లలెంతమాత్రము అనుభవింపరు. కేవలము అందలి సంగీతము మాత్రము వారిని నిద్రపుచ్చుటకో, ఊరడించుటకో ఉపకరించును.ఇక రెండవతీరు పెద్దల పాటలు పిల్లలు కూర్చుండుటకు అలవాటు పడినప్పటినుండి నిచ్చెనమెట్లవలె క్రమక్రమముగా పెరిగి పిల్లలు తాము తలిదండ్రులవలననో లేక ఇతరులగు పెద్దల వలననో విన్న పాటలు స్వయముగా పాడునంత వరకు సాగి ఆగిపోవును. ఆ పైన వారి సొంతకవిత్వ మారంభమగును. పెద్దల పాటలందు మొదట నాదము, తరువాత లయ, ఆతరువాత అభినయము పిల్లలకు అలవడు నట్లుచేయు క్రమము కనుపించును. మొదటిది ఆకర్షణమును, రెండవది ఉత్సాహమును, మూడవది వారి శరీరమునకు శక్తిని కూర్చును. నాలుగైదేండ్ల వయసువచ్చునప్పటికి పిల్లలు సొంత కవిత్వ మారంఖింతురు. ఈ గేయము లందును రెండుతీరుల పాటలున్నవి. పెద్దలను అనుకరించి వారిపాటలందు తమ కవిత్వమును చేర్చి పాడుకొనునవి కొన్ని. పూర్తిగా స్వకపోలకల్పితములు మరికొన్ని. మొదటిరకము పాటలు రానురాను అర్ధవిహీనములై పోవును. కనుకనే వీటిని Non-sense Rhymes అనుచున్నారు. పిల్లలకొరకు పెద్దలు రచించినవి Nursery Rhymes అయినచో, పిల్లలు సొంతముగా రచించిన గేయములు Non-sense Rhymes అగుచున్నవి. నాలుగేండ్ల ప్రాయమునుండి పిల్లలజీవితమంతయు ఆటపాటల మయమగును. ఈ యాటలందును, మగపిల్లల ఆటలు వేరు ఆడపిల్లల ఆటలు వేరు. కొన్ని ఇరువురును చేరి ఆడుకొను నట్టివి. ఈ క్రీడలను ఆధారముగా చేసికొని వాటికి తగిన పాటలు పెక్కులు బయలు దేరినవి. చెమ్మచెక్క, బిత్తి దిరుగుట, గుడుగుడుగుంచం, బుజబుజ రేకులు, గొబ్బిళ్ళు, చిఱ్ఱగోనే, కోతికొమ్మచ్చివంటి ఆటలతోపాటు పాటలును గలవు.
శృంగారగేయములు : జానపద వాఙ్మయమున శృంగార రస ప్రధానము లయిన పెక్కు గేయములు కలవు. ఇవి యెంత బహుళ సంఖ్యలో గలవో అంత విరళసంఖ్యలో ముద్రింపబడినవి. ఇట శృంగారము పరకీయమా, స్వకీయమా, ఉత్తమ నాయికానిష్ఠమా లేక ప్రాకృతనిష్ఠమా అను చర్చలతో పనిలేదు. జానపదుల - ప్రాకృతుల -వాఙ్మయమున శిష్టాలం కారిక వచనములు అంతటను పొసగవు. జానపదులు చిత్రించిన సీతారాములు మున్నగు ఉత్తమ నాయికా నాయకులకు సంబంధించిన శృంగారము కూడ పామరభావ సమన్వితమే. జానపదుల పేరిటనున్న వాఙ్మయమం దంతటను గోచరించునవి వారి భావములే కాని ఆయాపాత్రముల భావములు కావు. ఎట్టి గేయములందైనను జానపదుల ప్రేమకలాపములు, సాంఘిక నియమోల్లంఘనములు, పరస్పరాకర్షణము లే కాననగును. జీవితము యథాతథముగ నగ్న తేజముతో భాసించును. కావ్యధర్మమైన ఔచిత్యవిచారమును, ఔచిత్యపోషణో ద్దేశముతో పాత్రములకు మెరుగు పెట్టు పద్ధతియు జానపద గేయములందు లేవు. ఉదాత్తతయు నీచతయు, సభ్యశృంగారము, శృంగారరసాభాసము, నీచ శృంగారము, మొదలగునవి అన్నియు నొకదానితో నొకటి బుజము లొరసికొనుచు పోవుచుండును. ఐనను ధర్మా వలంబనముగల ప్రేమశృంగారములతో ఒప్పు గేయములుకూడ అనేకములు గలవు. రామాయణ గేయము లందు సీతగడియ, సీతామ్మవారి అలుక, సీతాదేవి వేవిళ్లు, ఊర్మిలా దేవినిద్ర, సీతాదేవి ఆనవాలు మున్నగు పాట లందు సభ్యశృంగారమునకు వెలికాని మనోహర భావము లున్నవి. సుందర కాండ పదమున వియోగ శృంగారము చక్కగా ప్రదర్శింపబడినది. భారతగాథలందు నలచరిత్ర, సుభద్రాకల్యాణము, శశిరేఖాపరిణయము, దేవయాని చరిత్రము శృంగార గేయములు, భాగవత కథలు అనేకములు రసతుందిలములు. చారిత్రక గేయములైన దేశింగు రాజు కథ, బొబ్బిలికథ, సదాశివ రెడ్డికథ మున్నగు వాటి యందు ఆయా వీరదంపతుల శృంగారము ఉత్తమశ్రేణికి చెందినదిగా కాననగును, లక్ష్మమ్మ, సన్యాసమ్మ, మండపేట పాపమ్మ, నల్లతంగాళ్, ఎరుకల నాంచారి, వీర రాజమ్మ — ఈ గేయములందు ధర్మస్వభావులైన జానపద దంపతుల ఉత్తమశృంగారము ధ్వనించుచున్నది. గంగా వివాహమున హరుడు దక్షిణనాయకుడు. సురాభాండేశ్వరమున పరకీయ శృంగారమున్నది. వరదరాజు పెండ్లి, ఆండాళ్ చరిత్రము, వెంకటేశ్వర్ల వేట, చెంచెత కథ ఇత్యాదులందు చక్కని శృంగారమున్నది. ఇట్టి గేయము లందు శృంగార మంగముగా నున్నది. శృంగారము ప్రధానముగాగల చిన్న చిన్న గేయములు లక్షలసంఖ్యలో నున్నవి. చల్ మోహనరంగ, వెంకయ్య చంద్రమ్మపాట, నారాయణమ్మపాట, సిరిసిరిమువ్వ, రంగం పదములవంటి కొన్ని పెద్దపాటలు అచ్చైనవి. తెలంగాణమున కాముని పున్నమ సందర్భమున పాడునట్టి పాటలన్నియు శృంగార కళా ఖండములే.
అద్భుతకథలు : జానపదులకు అద్భుతరసాఖినివేశము మెండు. సాధారణ విషయములందు అలౌకికములును, అద్భుతములు నగు కల్పనలు కూర్చి పెద్ద చేయుట వారికి వినోదముతోపాటు భక్తియో, భయమో, పెంపొందించు కొనుటకు ఉపకరించును. దుర్భరమగు సంఘటనము కలిగినప్పుడుకాని, అసాధ్యమగు విషయమును ఆకాంక్షించి అఱ్ఱులు సాచునప్పుడుకాని, మానవాతీత శక్తులుగల, దేవతలో, మంత్రదండమో, భూత అద్దమో, బీజాక్షరములో, పావుకోళ్ళో అడ్డుపడి చిక్కును మంచుతెరవలె తొలగించిన నెంతబాగుండు నను కోరిక అసాధ్యమైనను మానవసహజమే. ఇట్టి కోరికను ఆధారముగా చేసికొని ప్రాకృతులు అత్యద్భుత విషయములను అనేక కథలందు జోడించినట్లు కాననగును.. అద్భుతకథలం దన్నింటికన్న అధిక ప్రచారముగాంచినది బాలనాగమ్మ కథ. దీని కథారంగము మహబూబు నగరమందలి పానుగల్లు. ఇది ప్రాంతీయమగు రామాయణగాథ వంటిది. నమ్మరానంతటి ఆద్భుత కృత్యములతో, అలౌకిక విషయములతో, నిండిన గాథ - కమ్మవారి పణతి పనల బాలరాజుకథ - ఈ కథా జీవము వర్ణాంతర వివాహము. అద్భుత కథా గేయములందు గాంధారికథ అగ్రగణ్యము, పురాతనముగూడ. ఇటులే ధర్మాంగద పాముపాట, కాంభోజరాజుకథ, బాలరాజుకథవంటి అద్భుతకథలు జానపదులకు 'భయ భక్తులను గలిగించి సత్యధర్మములకే జయము అను నీతిని చాటి చెప్పి, వారి జీవితమును దిద్దునట్టివి.
కరుణ రసాత్మకములు : జానపదులు శృంగారము తరువాత కరుణాద్భుతములకు రెండింటికిని సమప్రాధాన్య మిచ్చిరి. నిత్యజీవితమున దుఃఖము అధికమగుటచే తత్ప్రభావమును సహజముగా జానపదులు చిత్రింపగలిగిరి. దీనియందును వారికి శిష్టులకుండు ఆదర్శ దృక్పథము, లేదా, యౌచితీ విచారము తక్కువ. ఆయావ్యక్తుల శౌర్యమునకు ఉత్సాహము, దుర్మరణమునకు జాలి అను నీ రెండు భావములును పామరులచే వారి చరిత్రములను పాడించినవి. ఉత్సాహము తరువాత జానపదులను సులువుగా ఆవరించినది జాలి. ఆంధ్ర జానపద వాఙ్మయమున కరుణ పూరితములును చిత్తధ్రుతి కారణములునునగు కథ అనేకములు కలవు. అత్త పెట్టిన ఆరడివలననో, కట్టుకొన్న భర్త యొనర్చిన అత్యాచారమువలననో, తోడికోడండ్ర అసూయచేతనో, ఇరుగుపొరుగువారి దౌష్ట్యము వలననో, దైవ దుర్విపాకమువలననో ఇడుములపాలైన స్త్రీలకథలు జానపద గేయ వాఙ్మయ సముద్రమందలి కన్నీటి కెరటములు. జరిగిన విషాద గాథలకు జానపదులు కొంత మాహాత్మ్యమునుకూడ జతపరచినారు. దేశీయేతి వృత్తములందు కరుణా రసపూరితమైన గాథ కన్యకామ్మ వారికధ. ఇది ప్రాచీన మైనది. కామమ్మ కథ పిచ్చుక కుంట్లకు కల్పవృక్షము. జరిగినకథ జరిగినట్లుగా, హృదయవిదారకముగా, కరుణ రసపూరితముగానున్న కథలందు లక్ష్మమ్మకథ అగ్రగణ్యము. ఆమె సహనము, త్యాగము, తెలుగుజాతికి గర్వకారణములు, అవిభక్త కుటుంబమున కనిష్ఠులు పడెడుబాధల సూచించునది సన్యాసమ్మకథ. గోదావరీ మండలపు పేరంటాలైన మండపేట పాపమ్మకథ మరియొకటి. కరుణరసాత్మకగాధలందు పేరంటాండ్రగాథల కొక ప్రత్యేకత కలదు, కామమ్మకథ, పాపమ్మకథ, శృంగవరపుకోట 'యెరుకమ్మకథ, సన్యాసమ్మ కథ. తిరుపతమ్మకథవంటి పేరంటాండ్రకథలు ముద్రితములైనవి. సతి ఆచారము నిషేధింపబడిన తరువాత విశేష ప్రయత్న ముతో సహగమనము చేసినట్టి వారు వీరందరును. ఇది యొక విశేషము. పేరంటాండ్రందరు మ్రొక్కులుతీర్తు రనునది ఈ కథలందలి మరియొక విశేషము. తమిళదేశమునుండి వలసవచ్చినట్టిది నల్లతంగాళ్ కధ. వీరరాజమ్మకథ పలనాటి సీమకు చెందినట్టిది. ఎరుకల నాంచారి, రాములమ్మ, సరోజిని, మూసిపొంగు కథలు తెలంగాణమున ప్రశస్తి నార్జించినవి.
హాస్యపు పాటలు : నాగరకులకు గల సుఖ దుఃఖాను భూతులు జానపదులకును గలవు. వీటి బాహ్యచిహ్నము లగు నవ్వు, ఏడ్పులునుగూడ కలవు. అట్టి నవ్వు జానపద గేయవాఙ్మయమున అచ్చటచ్చట చక్కగా ప్రదర్శింప బడినది. శాంతగోవింద నామములందు ఋష్యశృంగుడు, అడవిగోవింద నామములందు కుంభకర్ణుడు, సూక్మ రామాయణమున శూర్పణఖవంటివారు చక్కని హాస్యమునకు ఆలంబనములుగా కనిపింతురు. సీత గడియ పాటలో హాస్య శృంగారములకు మైత్రి కలదు, సీతమ్మ పరిహాసోక్తులు "వ్యాహారము" నకు ఉదాహరణముగా చెప్పుకొనవచ్చును. ఊర్మిళా దేవి నిద్రలో సీతాశాంతల సరస సంభాషణము, శ్రీరామ పట్టాభిషేకమున శంకరుని మాటలు ఉత్తమకోటికి చెందిన హాస్యముతో నిండియున్నవి. శశిరేఖా పరిణయమున ఘటనా వికృతికిచెందిన హాస్యము కలదు. పల్నాటి వీరచరిత్రమున వెశ్యమాత వర్ణనము ఆకార వికృతికి సంబంధించిన హాస్యము. వీర గేయములందలి యుద్ధభీరువుల వర్ణనమున వాక్చేష్టలకు సంబంధించిన హాస్యము గలదు. కాటమరాజు కథలో భట్ల సంవాదమునందు వ్యాజస్తుతి 'వ్యాజనింద, వక్రోక్తి' నర్మోక్తి, నీచోపమ, కాక్వాక్షి ప్తము మున్నగు నలంకారములతో అర్థ సంబంధమగు వికృతిలో వాచ్యముగను వ్యంగ్యముగను హాస్యము భాసించును. గంగా గౌరీ సంవాదము, ఈశ్వరభృంగీ సంవాదము, లక్ష్మీ పార్వతుల సంవాదము, సవతుల కయ్యము, చెంచులక్ష్మికి కృష్ణునకు జరిగిన సంవాదము. చెంచెతకు లక్ష్మికి జరిగిన సంవాదము మున్నగు వాటియందు నర్మోక్తులు, దెప్పి పొడుపులు, వ్యాజోక్తులు కలిగిన హాస్య మున్నది. లక్ష్మీ పార్వతుల సంవాదము 'మృదవము'నకును, సవతుల కయ్యము "నాళిక”కును, ఈశ్వరభృంగి సంవాదము “అవస్పందితము”నకును ఉదాహరణములు. కేవలము హాస్య పూరితము లగు గేయములు కొలదిగనే ముద్రింపబడినవి. వేడుక పెండ్లిపాట లందును, స్త్రీ జనానంద 442 నవీన కల్యాణ పాట లందును, స్త్రీల పాటల సంపుటము లందును పెండ్లికి సంబంధించిన వియ్యాలవారి హాస్యపు పాటలు కొన్ని ప్రకటింపబడినవి. హాస్యపు పాటలు అను పుస్తకములో తీరుతీరుల హాస్యపు పాటలున్నవి. తెలంగాణా జానపద గేయములందు చక్కని హాస్యపు పాటలు, వీటిలో హాస్యానుకృతులుకూడ కలవు. ఉద్ఘాత్యకమునకును, చలనమునకును చక్కని యుదాహరణములు అందు కలవు. జానపద సాహిత్యమున అధిక్షేప గేయములు మాత్రము కొలదిగనే యున్నవి. హాస్య పాత్రములు కూడ స్వల్ప సంఖ్యాకములు కలవు. జానపద గేయములందు కనిపించునది మనజాతీయ హాస్యము. ఇందు సున్నితమయిన హాస్యముతోపాటు మోటగు హాస్యముకూడ కలదు. స్త్రీల పాటలందు మృదువై, సభ్యమైన హాస్య ముండును. ఇట్టిహాస్యము జానపదుల నిత్యజీవితమును సుఖమయముగా నొనర్చుటకు దోహద మొసగును.
జానపద గేయముల వరుసలు : ప్రాఙ్నన్నయ యుగము నుండి ఈనాటివరకును వినబడుచున్న మనదేశి చ్ఛందో రీతులు పదములే. సంస్కృతమునుండి వచ్చిన అక్షరగణ బద్ధవృత్తములకు భిన్నముగా ఈదేశీయ రచనా రీతులన్నియు లయానుగుణమగు మాత్రాగణ బద్ధములు. దేశిరచనములు కొన్ని తమిళ కన్న డాంధ్రములకు సమానముగా నున్నవి కూడ. తమిళమందలి "ఒరూ ఉ మోనై " “కూరై మోనై” “తొడై" మున్నగు ఛందములకును, కన్నడమందలి భామినీ షట్పదికిని, భోగషట్పదికిని, వార్ధిక షట్పదికిని, లలితకును, మందానిలమునకును, ఛందోవతంసమునకును' సరిపోవునట్టి గేయములు ఆంధ్ర జానపద వాఙ్మయమున కలవు. మన ఛందో గ్రంథము లందున్న కొలది కొలతలచే జానపద గేయ వాఙ్మయమును కొలుచుట అసాధ్యము. ఇంతకన్న జానపద గేయములందలి కొన్ని రీతులను మాత్రమే దేశికవులు తమచేతనైన వాటిని చేపట్టి దేశి చ్ఛందములుగా మలచుకొని రచనము లొనర్చిరనియు, వాటికే విన్నకోట పెద్దననుండి అప్పకవి వరకును గల లాక్షణికులు లక్షణము లేర్పరచిరనియును భావించిన సమంజసముగా నుండును. మార్గ - దేశీ యని సంగీతమును రెండు తెగలుగా విభజించినప్పుడు భరతుడు, మతంగుడు,శార్ణదేవుడు మున్నగువారు దేశిగానమున నెన్నియో తీరుల పాటలను పేర్కొనిరి. తెలుగువారి ఏల పదము ఆ సంగీతజ్ఞుల కెంతగా నచ్చినదో కాని వారందరును ఏలపదములనుగూర్చి విశేషముగా వ్రాసిరి. మన జాజరపాటలే చర్చరీగీతములై సంస్కృత కవుల కావ్యములకు గూడ ఎక్కినట్లు తోచును. కనుక దేశికవితలకు మూలములయినట్టి జానపద గేయముల ఛందోరీతులను వేలకొలదిగా గణవిభజనము చేసి కాని, కొలదిపాటి కొలబద్దలచే కొలిచి గాని ఇతమిత్థమని తేల్చి చెప్పుట కష్టము. నిజము విచారించినచో ఆ జానపదుల ప్రాకృత హృదయములనుండి ఇన్ని తీరులు ఛందములలో అన్ని గేయములు వెడలవు. వారెన్ని పాటలు పాడినను వారెట్టి మనో భావములు వెలార్చినను, వ్రేళ్ళపై లెక్కింపదగు కొన్ని వరుసలలో మాత్రమే వెడలినవనియే భావించుటలెస్స. కవిత్వారంభ దశ, నాట్యారంభదశ, సంగీతారంభదళ, ఒక చోటనే కలదు. ఆదిమానవుడు సంతోషపారవశ్యమున చిందులు ద్రొక్కినప్పుడు ముద్రితము అయిన ఆతని పాదాంకము లందే వీటి ప్రారంభదశ కాననగును. అది గమనించినచో జానపద గేయముల రీతు లొకకొన్నియే యని మనకు స్పష్టమగును. మూడు, నాలుగు, ఐదు, ఆరు, ఏడు, ఎనిమిది మాత్రల ఆవృత్తులతో సాధారణముగా ఈ జానపద గేయములు నడచును. లేదా త్రిశ్ర, చతురశ్ర, ఖండగతి, మిశ్రగతిలో జానపద గేయము లుండునని చెప్పవచ్చును. ఈ సూత్రముతో ఎన్ని లక్షల వరుసలనైన బంధింపవచ్చును. సీత దాగిలిమూతలు, సీత ముద్రికలు, తులసీదళములు, సువ్వాలలు, మేలుకొలుపులు, వరదరాజు పెండ్లి, కామేశ్వరిపాట వంటి వన్నియును, మూడు మాత్రల ఆవృత్తులతో (త్రిశ్రగతి) నడచుపాటలు, కోలాట పాటలు, జాజరపాటలు, పిల్లలపాటలు, గొబ్బిపాటలు, బొబ్బిలికథ, దేశింగురాజుకథ, పొరుజాత పల్లవి, సీత సమర్త వంటి పాటలు . నాలుగేసి మాత్రల ఆవృత్తులతో (చతురశ్రగతి) నడచునట్టివి, సంక్షేప రామాయణము, గోవిందనామాలు, కోవెల రాయబారము, లక్ష్మణ దేవర నవ్వు, ఊర్మిళాదేవి నిద్ర, ధర్మరాజు జూదము, అవిరేణి పాటలు, వినురురాయి పాటలు, రోకటిపాటలు-- ఇటువంటి పాటలు ఐదుమాత్రల ఆవృత్తులతో (ఖండగతి) నడ చును. పలపదములు సాధారణముగా ఆరుమాత్రల ఆవృత్తులతో నడచునట్టివి. కొన్ని మేలుకొలుపులు, గుమ్మడు పాట (ముత్యాలసరములు), ఏడుమాత్రల ఆవృత్తులతో(మిశ్రగతి) నడచునట్టివి. బాలక్రీడలు, రామదాసు కీర్తనలు కొన్ని ఎనిమిది మాత్రల ఆవృత్తులతో నడచినట్టి పాటలు, కనుక ఈ చిన్న సూత్రముతో వివిధ జానపద గేయముల రీతులను సులభముగా బంధింపవచ్చును.
ఉపసంహారము : మన జానపద వాఙ్మయ సంపద ఇప్పటికే చాలభాగము లుప్తమై పోయినది. ఉన్నదానినైన భద్రపరచుకోనుట మన కర్తవ్యము. జానపద కవితారీతులను అందరికన్న రాజకీయపథముల వారు ఎక్కుడుగా వాడు కొనుచున్నారు. వీరి ఆశయము కొనియాడ తగినదే. స్వరాజ్యోద్యమమునందును, సంస్కరణోద్యమము నందును వెలువడిన గేయములు అనేకములు ప్రజల సొమ్మైపోయినవి. తాత్కాలిక ప్రయోజన మాశింపబడినను వీటి ప్రభావము మాత్రము అనంతముగా పడినదని చెప్పుకొనక తప్పదు. పండితులు విమర్శకులు జానపద గేయములందున్న సాహితీ విషయములెత్తి చూపవచ్చును. సామాజిక శాస్త్రవేత్తలు ఆ సంపదలో తమకు కావలసిన అమూల్య మణులను పొంద వచ్చును. సిద్ధహస్తులైన రచయితలు వాటియందలి వస్తువు గ్రహించి కల మందు కొన్నచో రవ్వలు రాల్చ వచ్చును. జానపద వాఙ్మయమున నుండు జాతీయములు, నానుడులు, వింతవింత పలుకుబడులు, శిష్టులు గ్రహింపవలసిన అమూల్యసంపదలు నవ్యభారత పునర్నిర్మాణమున వివిధప్రణాళికా ప్రచారమునకును, ప్రజాప్రబోధము నకును జానపద కవితారీతులు. అత్యంతము ఉపకరించునట్టివి. పాశ్చాత్యులును, ఔత్తరాహులును ఈ మార్గమున ఎంతోదూరము సాగిపోయినారు. జానపద వాఙ్మయమున తెలుగువారు అభినివేశము కలిగించుకొన్నచో ఆంధ్ర దేశమునకును, ఆంధ్ర భాషామ తల్లికిని, ఆంధ్రవిజ్ఞానమునకును ఇతోధికమగు వికాసము కలుగగలదు.
బి. రా.
[[వర్గం:]]