సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మొదటి సంపుటము/ఆంధ్ర జాతీయ కళాశాల
ఆంధ్ర జాతీయ కళాశాల : సుమారు ఏబదిసంవత్సరముల క్రితమే ఆంధ్రజాతీయ కళాశాల అను పదము సృష్టింపబడినది. క్రమపద్ధతి లేక అసంగతముగా ఉన్న పూర్వయుగ జీవితము అప్పుడే భారతజాతీయతా సంయోగము నకు దారి తీయుచుండెను. పందొమ్మిది వందల ఏడు, నవంబరు, 17 వ తారీఖున మచిలీపట్నములో ప్రస్తుతము బియ్యపు మిల్లుగా పనిచేయుచున్న అప్పటి అయ్యంకి వారి థియేటరులో ప్రభుత్వముతో సంబంధములేని, విశ్వవిద్యాలయమునకు అనుబంధము కాని ఒక జాతీయ విద్యాసంస్థను నెలకొల్పవలెనని ఒక బహిరంగసభ జరుపబడెను. సాహిత్య, శాస్త్రీయ, సాంకేతిక విషయముల సమరస సంయోగముతోకూడిన ఒక చక్కని విస్తృత పథకమునకు అనుగుణముగా విద్యావిధానము పునర్నిర్మించుటకు ఈ సంస్థ ఉపయోగ పడవలెనని ఉద్దేశము. ఈ రోజున కూడ దేశము లోని విద్యాప్రణాళికలో వాస్తవమైన మార్పు లేదు. బెంగాలు విభజన (16-10-1905). అఖిలభారత రాజకీయాలనుండి ముస్లింజాతి తప్పుకొనుట, ప్రత్యేక ఓటింగు పద్ధతిలో మహమ్మదీయులకు ప్రాతినిధ్యము, స్త్రీలకు, బ్రాహ్మణేతరులకు, క్రైస్తవులకు ఓటింగుకు స్థానములు ప్రత్యేకించుట, మొదలగువాటిని గురించి నూత్న ఉత్సాహము ప్రదర్శింపబడినప్పటినుండికూడ విద్యావిధానములో ఏమార్పునులేదు. విద్యావిధానమున రాజకీయ శక్తులద్వారమున మన రాజకీయోద్దేశములకై .మార్పుకలిగించుటకు ప్రయత్నము చేయుచున్నారని ప్రజలపైని, కాంగ్రేసుపై ని ప్రభుత్వము నిందారోపణము చేయుచుండెడిది. కాని నిజముగా ప్రభుత్వమే రాజకీయ చర్యలద్వారా, రాజకీయోపాయముల ద్వారా, భారత జాతీయత యొక్క అభ్యుదయశక్తులు పురోగమించకుండ చేయుచుండెను. 8 కోట్ల జనసంఖ్య కలిగిన బెంగాలు, బీహారు, ఒరిస్సా రాష్ట్రములను (1) పశ్చిమ బెంగాలు (2) అస్సాముతో కూడిన తూర్పు బెంగాలు అని రెండు రాష్ట్రములుగ విభజించుటలోని ప్రభుత్వము యొక్క ఉద్దేశము, అత్యధికముగ ముస్లిం ప్రజలు కలిగిన రాష్ట్రమును భారతదేశములో సృష్టించవలెనని యే. ఎప్పుడో ఒకప్పుడు త్వరలో భారతదేశము ఒక సంయుక్త పద్ధతిని పునర్నిర్మించ బడునను సంగతి ప్రభుత్వమునకు తెలియును. సమాఖ్యలలో ఒండొంటితో కలసి ఉండు రాష్ట్రములు ఉండుటకు అవ కాశము కలదు. కావున ఒకేజాతి అన్ని రాష్ట్రములలో అధిక ప్రభావము కలిగి ఉండకూడదను భావము, భావిదృష్టియు, తెలివితేటలును గలవారికి కలుగక మానదు. అందువలననే తూర్పు బెంగాలు, అస్సాము కలిపి ముస్లిం ప్రజలు అత్యధిక సంఖ్యలో ఉండునట్లు ఒక రాష్ట్రము ఏర్పరుపబడినది.
ఇక ఉద్దేశముల క్రమవిధానమును పరిశీలింతము, విదేశీయునిదృష్టిలో రాజకీయముగ భారత దేశములో అత్యధిక సంఖ్యగల ఒకేజాతితోకూడిన రాష్ట్రములు ఉండకూడదు. అందు భావిసమాఖ్యను ఊహించి జన సంఖ్యా విభాగములను నిర్ణయించిరి. ఆవిధముగా బెంగాలు బీహారు, ఒరిస్సా రాష్ట్రములు (1) పశ్చిమ బెంగాలుగా (2) అస్సాముతో కూడిన తూర్పు బెంగాలుగా, విభజించబడెను. ఈ విభజనము విద్యలో, ఉద్యోగములో, రాజకీయ జీవితములో భారత దేశమునకు నాయకుడుగా ఉన్న బెంగాలీయుని వెన్నెముకకు పెద్ద దెబ్బ కలిగించవలెనను ఉద్దేశముతోడనే చేయబడినది. బెంగాలీయుని నాయకత్వము ఇకముందు ఉండకూడదని దాని ఉద్దేశము. అందు కనుగుణముగ ముస్లిం జనులు అత్యధికముగా ఉన్న రాష్ట్రము ఏర్పరుప బడినది. ఈ దూరదృష్టితో కూడిన ఈ కుటిలో పాయమునకు విరుగుడుగా బెంగాలీయుడు ప్రతిక్రియ చేయమొదలిడెను. అతడు భారత జాతీయతను బలహీనము చేయవలెనను బ్రిటిషు వారి పన్నుగడను నాశము చేయుటకు పూనుకొనెను. ఆంగ్లేయునికి, బెంగాలీయునకు మధ్య సిద్ధాంత సంబంధమైన పోరాటము జరిగినది. 1905 అక్టోబరు 16 వ తారీఖున ప్రారంభమయిన అ యుద్ధము వంగదేశమునందేగాక, భారతదేశమంతటను వ్యాపించినది. భారత దేశములో ప్రాథమిక, మాధ్యమిక ఉన్నతవిద్యలను ఏ విధముగా రూపొందించవలెను? భారతీయుడు ఒక సారస్వత పారిశ్రామికుడుగా మాత్రమే శిక్షణము పొందవలెనా? లేక తన కర, నేత్రముల యొక్క ప్రయోజనము అభివృద్ధి చేసికొని, ఇంద్రియములకు, శక్తులకు సరియైన శిక్షణ మొసగి సాంకేతిక విషయ శాస్త్రములు నేర్చుకొని యంత్రములను నిర్మించుట, బోయిలర్లను, ఇంజనులను, యంత్ర చక్రములను నిర్మించుట మున్నగు భారతదేశపు అవసరములను తయారుచేయుటయందును, వాటిని నడపుటయందును ప్రావీణ్యము సంపాదించు కొనవలెనా? ఈ కారణము చేతినే భారత దేశములోని విద్యావిధానము విస్తృతమై, సాహిత్య, శాస్త్రీయ, సాంకేతిక విషయ సంబంధమగు నట్లుగ సంస్కరింపవలసిన అగత్య మేర్పడినది.
ఈ ఉద్దేశముతోడనే మచిలీపట్నములోని ప్రజలు,'బిపిన్ చంద్రపాల్' చే బోధింపబడి, అరవిందఘోష్, సతీశ్ చంద్ర ముఖర్జీలచే ప్రచారము చేయబడిన బెంగాల్ ఉద్యమమును జాగ్రత్తగా పరిశీలించిరి. హైకోర్టు ఉద్యోగమునుండి విరమించిన గురుదాస్ బెనర్జీ వంటి న్యాయాధికారులు తమశక్తిని, తెలివిని, విరామకాలమును, జాతీయవిద్య స్థాపించుటకై వినియోగించి, ముఖ్యముగా తూర్పు బెంగాలులో ఇంచుమించు 24 జాతీయ ఉన్నత పాఠశాలలను స్థాపించిరి. బెంగాలులో తీవ్రముగ వ్యాపిం చిన ఈ ఉద్యమము భారత దేశమందంతటను అల్లుకొన్నది. బెనారసులో 1905 వ సంవత్సరమున కాంగ్రెసు సమా వేశమైనది. ఆ కాంగ్రెసు సభలకు శ్రీ గోపాలకృష్ణ గోఖలే అధ్యక్షత వహించెను.
ఆ సమయమున ప్రముఖపాత్ర వహించి, జాతీయ విద్యా, స్వదేశీ,సందేశములు అందించిన వాడు లాలా లజపతిరాయ్. ఇవి ఆ తరువాత సంవత్సరములో కలకత్తాలో, స్వదేశీ, స్వరాజ్యము, జాతీయవిద్య, బహిష్కరణము అనుసూత్రములతో కూడిన తీర్మానములుగ పరిణమించినవి. 1907 ఆగస్టు 7 వ తారీఖున బహిష్కరణ పతాకము ఎగుర వేయబడినప్పుడు, రాజకీయ వాతావరణ మంతయు ఉద్రిక్త విప్లవశక్తులతో నిండిపోయియుండెను. 1908 ఏప్రిల్ 30వ తారీఖున, ఖుదీరామ్ బోస్ లను 18 సంవత్సరముల యువకుడు కింగ్స్ ఫర్డు అను ముజఫర్ పూర్ జిల్లా మేజస్ట్రీటు పై బాంబు విసరెను. కెన్నెడీ కుటుంబమునకు చెందిన తల్లి, కూతురు తక్షణమే చనిపోయిరి. దేశములో విప్లవశక్తులు ఉద్భవించుచున్నవని ఈ సంఘటన ప్రభుత్వమునకు వెల్లడిచేసినది. ఒక్క బెంగాలు, బీహారులలో నేకాక, దక్షిణమున కూడ ఈ స్థితి వ్యాపించెను. తిన్నె వేలిజిల్లాలో మిస్టర్ ఆవ్, ఐ. సి. యస్. పిస్టల్ తో చంపబడెను. దేశమంతయు ఉద్రేకముతో అట్టు ఉడికినట్లుడికి పోయినది. ఒక ప్రాంతములో జరిగిన సంఘటనలకు ప్రతిఫలములు మరొక ప్రాంతములో కను పించసాగెను. ప్రజాప్రభుత్వముల నడుమ నిజముగా ఒక యుద్ధము చెల రేగెను. 13 జూలై 1908 లో లోకమాన్య బాలగంగాధర తిలకును బొంబాయిలో నిర్బంధించి, 18 తారీఖున ఆయనకు ఆరు సంవత్సరముల కఠిన కారాగార శిక్ష విధించిరి. జాతీయ కళాశాల స్థాపనకు పూనుకొన్న మచిలీపట్నములో శ్రీ కోపల్లె హనుమంతరావు, ఎం.ఏ., బి.ఎల్., సూరత్ లో జరిగిన కాంగ్రెసు సభకు హాజరయిన పిదప, 1908 జనవరిలోనే తన వకీలుపట్టా వదలివేసినట్లు ప్రకటించెను. 1908 జూలై 13 వ తారీఖున శ్రీ జి.హరిసర్వోత్తమరావు, ఎం. ఏ. ను నిర్బంధించి చాల కాలము విచారణ జరిగినపిదప 1908 నవంబరులో 6 నెలల కఠిన శిక్ష విధించిరి. దీనిపై పునర్విచారణ జరిగి ఆ శిక్షను మూడు సంవత్సరముల కఠిన కారాగార శిక్షగా పొడిగించిరి. హరిసర్వోత్తమరావుగారు కళాశాలలో పనిచేయుటకు వాగ్దానముచేసిరి. ఆయన ఉపాధ్యాయుడుగా నియమితుడయ్యెను. ఆ విధముగా కళాశాలా పథకమునకు, రాజకీయములకు సంబంధము ఏర్పడినది. ఆరోజు నుండి ప్రభుత్వమునకు విరుద్ధముగ పెద్ద పోరాటము బయలు దేరినది. శ్రీ కె. హనుమంతరావు కళాశాలకు మొట్టమొదటి ప్రిన్సిపాలు. 1901లో స్థాపించబడిన జాతీయ వారపత్రికయగు 'కృష్ణాపత్రిక'కు సంపాదకులయిన శ్రీ ఎమ్. కృష్ణారావుగారిని మచిలీపట్టణములో రాజకీయ తత్త్వవేత్తగ అప్పుడు పరిగణించుచుండిరి. కళాశాలకు ఈ రచయిత కార్యదర్శిగా ఉండెను. కళాశాలా నిర్వాహకుల వెనుక పోలీసులు ఎప్పుడును తిరుగుచుండిరి. అప్పుడు ప్రోగుచేసిన ధనములోని ప్రతి రూపాయను ఎర్ర తలపాగా పోలీసువాడు జాగరూకతా దృష్టితో పరిశీలించుచు వెన్నంటుచుండెడివాడు.
కళాశాల విశ్వవిద్యాలయమునకు అనుబంధము కాకుండుట, ప్రభుత్వముచే గుర్తింపబడకుండుట, రాజకీయ దృష్టికి అనుమానము కలిగించినవి. వివిధములైన యంత్రములతోడను, బోయిలర్ల తోడను కూడిన ఒక పెద్ద కర్మాగారమును నిర్మించుట, అందులో పోతపనులు రంధ్రములు చేయుట, కత్తిరించుట, సమము చేయుట మొదలగు పనులు జరుగుచుండుటచే ప్రభుత్వము యొక్క అనుమానము ద్విగుణితమై ఇచ్చట బాంబులు తయారుచేయు పన్నుగడలు జరుగుచుండెనని భావింపబడినది. ప్రభుత్వముతో కళాశాలా నిర్మాతల సంబంధములు ఒక మాదిరిగా ఉండెడివి. ప్రభుత్వపు కాలువలనుండి వీరు నీరు తెప్పించు కొనెడివారు. ఒక వైపున కలెక్టర్లు, గవర్నరు పాఠశాలను సందర్శించుటతోపాటు పోలీసులు కూడ రహస్యముగా కళాశాలాధికారులను అనుమానించి తనిఖీ చేయుచుండిరి అయినప్పటికి వీరు కృష్ణస్వామి అయ్యర్, సుందర్ అయ్యర్, శంకర్ నాయర్, సదాశివ అయ్యరు, గురుస్వామి అయ్యరు, శేషగిరి అయ్యరు, శ్రీనివాస అయ్యంగారు మొదలైన రాజభక్తులైన న్యాయవాదుల ఇంటికి వెళ్ళుచుండెడివారు, అనుమానము అభ్యుదయము అనువానిమధ్య జీవితము పురోగమింప సాగెను. ఈ కళాశాల క్లాసులలో హరిజనులకు ప్రవేశము ఇయ్యబడెను. వారు తోడి హిందువులతో సమానముగా చూడ బడుచున్నారని సాంఘిక, ఆర్థిక, మత రంగముల యందు నిరసన బయలుదేరినది. కర్మాగారముల నిండ వివిధ జాతుల వారు మిశ్రమముగా ఉండెడివారు. అది సంవత్సరమునకు అయిదారు వేల రూపాయల నష్టముపై నడుపబడు చుండెడిది. మొట్టమొదట ప్రజలు చూపిన ఉత్సాహము క్రమముగా తగ్గిపో సాగినది. అయినను కళాశాలలో కుటీర పరిశ్రమలు, చేనేత, కంబళీలు తయారుచేయుట, రంగులు వేయుట, ముద్రించుట మొదలగు పనులను కూడ ప్రవేశ పెట్టి పురోగమించుటకు ప్రయత్నములు సాగెను. టైపుపని, షార్టుహాండు, భూమి కొలత డ్రాయింగు, చిత్రలేఖనము, కాగితపు చేతిపరిశ్రమ మొదలగు వాటికి కూడ ప్రవేశము కలిగెను. వీటికన్నిటికి చాలాధనము కావలసి వచ్చెడిది. కార్యకర్తలు అప్పులు చేయుచు, వీలునుబట్టి తీర్చుచుండెడివారు. 1917 వ సంవత్సరములో స్వపరిపాలనోద్యమము (Home Rule movement) వీరిని కాపాడినది. జాతీయవిద్య స్వపరిపాల నోద్యమములో ముఖ్యాంశముగా మిసెస్ బీసెంటు ప్రకటించి, కళాశాలకు 20 వేల రూపాయలు సహాయము చేసెను. ఆ సొమ్ముతో అప్పులు తీర్చనయ్యెను. ఈ ఉద్యమము తీవ్రత తగ్గి పోగానే గాంధీ సిద్ధాంతములు రంగములో ప్రవేశించెను. దీనివలన కళాశాలకు మరల 25,000 రూపాయల సహాయము లభించినది. 1921 జూలైలో శ్రీహనుమంతరావు హృద్రోగముతో అస్వస్థులైరి. 1922 ఫిబ్రవరి 2 వ తారీఖున ఆయన చనిపోయిరి. అప్పుడు ఈ రచయిత ఒంటరిగానే కళాశాలను నడుపవలసి వచ్చినది. ధనము సంపాదించి, ఆ సంస్థను నిలబెట్టుటకు చాల క్లేశ కరమైన ప్రయాణములు చేయవలసి వచ్చెడిది. శ్రీ హనుమంతరావు మరణించిన పదిదినములలోనే ఉపాధ్యాయులు తమ జీతమును హెచ్చింపవలెనని ఒక పథకము ప్రతిపాదించిరి. “సంపాదించి, తీసికొమ్ము" అను సిద్ధాంతము నేను నా స్నేహితుల కందరకు నచ్చ చెప్పితిని. ఈ సిద్ధాంత సాధన చాల కష్టమయినది. ఉపాధ్యాయులకు ఇది ఒక సవాలుగా పరిణమించినది. కళాశాలనుండి రంగూనుకు వెళ్లిన ఒక నాటకబృందము చాలనష్టపడి
తిరిగివచ్చినది. ఈ నష్టమును పూర్తిచేయుట ఒక సమస్య ఆయెను, క్రమ ముగా విద్యార్థులు తగ్గిపోయిరి. ప్రభుత్వముచే గుర్తింపబడిన పరీక్షలలో కృతార్థులయి ఉద్యోగములు సంపాదించుకొనవలెనని విద్యార్థులు కాంక్షించిరి. మొట్టమొదట మూలవిద్యయందు ఉపాధ్యాయులకు ఇచ్చు శిక్షణము చాలా జనరంజకమై కనుపించెను, కాని కాలక్రమమున శిక్షణ కాలమున ఉపాధ్యాయులకు ఈయబడు వేతనము మాని వేసినప్పుడు ఆ విద్యార్థుల సంఖ్య తగ్గిపోయినది. ఆ మూలవిద్య విద్యార్థులకు ఆకర్షణము కలిగింపనందున సాంఘిక శాస్త్రములు నేర్పు తాతా స్కూలులో ఉండునట్టి ఒక సాంఘిక విద్యావిధానము ప్రవేశ పెట్టబడెను. తాతాస్కూలు ఆఫీసర్లకు, ప్రొఫెసర్లకు, ప్రజలతో కలసిమెలసి పనిచేయు స్త్రీపురుషులకు మాత్రమే శిక్షణము ఇచ్చుచుండెనని ఈ రచయిత అనుమానము. అయినను ఇటువంటి విద్యావిధానము ఆ కాలమునకు సరిపడునది కాదు. స్వాతంత్య్రము లభించిన పిదప కాని ఇటువంటి విద్యావిధానము ప్రజా ప్రశంస పొందలేదు. ఇప్పుడు మనకు స్వాతంత్య్రము లభించుటయు రెండు పంచవర్ష ప్రణాళికలు అమలులోకి వచ్చుటయు జరిగినది. కనుక, ఇటువంటి విద్యావిధానము తప్పక జనరంజక మగును.
కళాశాలాజీవితములో ఒక ఛిద్రము ఏర్పడినది. ఎటువంటి విద్యాపద్దతియైనను, తగు ప్రతిఫలము కలిగింపక, ప్రభుత్వముచే గుర్తింపబడకుండ ఉండినచో, అది ప్రజాదరమును పొందజాలదు. కళాశాలా కర్మాగారము నష్టమునకు గురియైనది. చేతితో చేయబడిన కాగితమునకు బజారులో అమ్మకము లేకపోయినది. చిత్రలేఖనము తదితర కళాత్మక విద్యలు విద్యార్థులను ఆకర్షింపలేకపోయినవి. ఒకటి తరువాత మరొకటి కారణములుగ కళాశాల విద్యార్థుల ఆకర్షణమును పోగొట్టుకొన్నది. మొత్తముమీద కళాశాలకు ఏడెనిమిది లక్షల రూపాయల విలువైన ఆస్తి ఉండినది. ఈ సొమ్ము, ఇతరమైన ఆస్తి భద్రపరుపవలసి వచ్చినది.
శ్రీ హనుమంతరావుగారు ఆ కళాశాలకు మొదటి ప్రిన్సిపాలు. కళాశాల ప్రారంభింపబడిన 1910 ఫిబ్రవరి, 21 వ తారీఖునుండి, 1922, ఫిబ్రవరి, 2 వ తారీఖున మరణించువరకు, ఆయన ప్రిన్సిపాలుగా పనిచేసిరి. తరువాత, ఉపాధ్యాయులుగా పనిచేయుచుండిన శ్రీ చిల్లరిగె శ్రీనివాసరావు కొంత కాలము పనిచేసి 1925 లోనో 1926లో నో రాజీనామా ఇచ్చిరి. తరువాత ఈ సంస్థ కొంతకాలము సరిగా పనిచేయలేదు. శ్రీ రామకోటీశ్వరరావు కొంత కాలము ఈ సంస్థను నడపిరి. కాని ఆయనకూడ త్వరలోనే రాజీనామా ఇచ్చిరి. ఆ కళాశాల యొక్క ప్రథమదశలో శ్రీ హనుమంతరావుగారు బ్రతికి ఉన్న రోజులలో అనగా 1916 వ సంవత్సర ప్రాంతమున ప్రొఫెసర్ ఛటర్జీ ఆధ్వర్యవమున చిత్రలేఖన విభాగ మొకటి ఏర్పరచబడెను. ఆయన బెంగాలీ పద్ధతికి చెందిన చిత్రలేఖనములో ఉత్తమవిద్యార్థులను పెక్కు మందిని తయారు చేసిరి. శ్రీ ఛెటర్జీ మూడు సంవత్సరములు పనిచేసిరి. ఆ తరువాత శ్రీరమేశ్ చక్రవర్తి ఆయన స్థానములో రెండు సంవత్సరములు పనిచేసిరి. శ్రీ కౌతా రామ మోహన శాస్త్రి, భారత లక్ష్మీబ్యాంకు నడపించుచున్న శ్రీ బి. వెంకటరత్నం, చిత్రలేఖన కళాశాలను స్థాపించిన శ్రీ గుర్రం మల్లయ్య, శ్రీ బెజవాడ గోపాలరెడ్డి, ఈ కళాశాలలోని విద్యార్థులే. ఈ కళాశాలతో కొంత సంబంధము కలిగి చెప్పుకోదగిన మరొకవ్యక్తి కురుగంటి సీతారామయ్య. ఈయన సంస్కృతాంధ్రభాషలలో ప్రసిద్ధ పండితుడు. ' చిట్టచివరకు రాజకీయవాతావరణము ప్రశాంతత చెందినది. కాని కళాశాల మాత్రము మూయబడినది. స్వాతంత్య్రము ప్రకటించబడినది. ఆంగ్లేయులు భారతదేశము విడిచిపోయిరి. ఒక విద్యాసంస్థను యుద్ధచిహ్నముగాగాని, యుద్ధ కేంద్రముగాగాని నడపించుటలో సమంజసత్వము లేదు. ఈ లోపుగా విద్యాభివృద్ధికై జీవితమంతయు పాటుబడిన కొందరు మిత్రులు ఈ కళాశాలను ప్రథమతరగతి కళాశాలగా నడపింతుమని అడిగిరి. ఇది ఒక్కటే కళాశాల ఆస్తిని, సొమ్మును, సంరక్షించుటకు సరియైన మార్గ మనిపించినది. ఇదైనను ఒక చిన్న కార్యముగా పరిగణింపబడరాదు. ఈ సంస్థను విశ్వవిద్యాలయము త్రొక్కు పాత బాటలోనే. ఆ పద్ధతులలోనే నడిపించుటకు ఇష్టములేనివారిలో నేను ముఖ్యుడను. కాని నేను చివరకు ఈ అభ్యంతరము మానితిని. ఇప్పుడు ఈ కళాశాల ఆంధ్ర విశ్వవిద్యాలయముతో అనుబంధము కలిగి, ప్రతి సంవత్సరము వేల విద్యార్థులకు శిక్షణము ఇచ్చుచు పురోగమించుచున్నది. భారత దేశములో చదువుకొన్న వారిసంఖ్య 16½%. వీరిలో 6% మాత్రమే శుభ్రముగా చదివి వ్రాయగలరు. అందులో 4% మాత్రమే చదువుటయందును, వ్రాయుటయందును ఉత్సాహము కలవారు. 96% జనమునకు ఉన్నత పాఠశాలలను, కళాశాలలను. పుస్తకములను, పరికరములను, ఉపాధ్యాయులను, తదితర సామగ్రిని సమకూర్పవలెను. ఈ భావి విద్యాభివృద్ధి నిర్మాణమునకు ఈ కళాశాల తగినవిధముగా ఉపకరించునని నేను భావించుచున్నాను. వీలయిన సహాయము లన్నియు కూడగట్టుకొని ఈ కళాశాల అభ్యుదయముతో ప్రయోజనకరమైన సంస్థగా మన స్వరాజ్యములో నేడు సేవ జేయుచున్నది.
భో. ప.
[[వర్గం:]]