సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మొదటి సంపుటము/ఆంధ్రదేశ చరిత్రము 1

ఆంధ్రదేశ చరిత్రము 1 క్రీ. శ. 625 వరకు  :- ఆంధ్రదేశము నిర్ణయము : భరతఖండములోని దక్షిణాపథ దేశములలో ఆంధ్రదేశము సుప్రసిద్ధమైనది. ఇది 14° 29° మధ్య ఉత్తర అక్షాంశము, 20° ఉత్తర అక్షాంశముల మద్య భాగమునను 78° - 85° తూర్పు రేఖాంశముల మధ్యభాగమునను ఉన్నది. ఆంధ్ర దేశమునకు ఉత్తరమున ఉత్కళ మహారాష్ట్రదేశములు, తూర్పున బంగాళాఖాతము, దక్షిణమున ద్రావిడ కర్ణాటక దేశములు, పశ్చిమమున నూతన బొంబాయి రాష్ట్రము ఎల్లలుగానున్నవి. ఈ దేశవిస్తీర్ణము 1,10,280 చదరపు మైళ్లు. ఈ దేశమునకు 540 మైళ్ళు తీరభూమి కలదు. ఇందు 20 జిల్లాలు కలవు. హైద్రాబాదు ఆంధ్రప్రదేశపు రాజధాని, దీనిలో ఆంధ్రరాష్ట్ర ప్రాంతము, పూర్వపు హైదరాబాదు రాష్ట్రమునందలి తెలంగాణము చేరియున్నవి. ఇందలి జనసంఖ్య 322 లక్షలు.

ఆంధ్రులు - పూర్వ చరిత్ర  : ఆంధ్రులు చాల ప్రాచీన జాతివారు. ఐతరేయ బ్రాహ్మణములో శునశ్శేపుని కధ యందు వీరు పేర్కొనబడియున్నారు. ఆ బ్రాహ్మణము క్రీ. పూ. 1000 - 800 కాలము నాటిది. ఇచ్చట వీరు పుండ్ర, పుళింద, మూతిబ, శబర జాతులతో కలిపి చెప్పబడియున్నారు. ఈ జాతులవారు వింధ్యపర్వత ప్రాంత వాసులు, రామాయణ మహాభారతములలో ఆంధ్రులు చోళ, చేర, పాండ్యులతో కలిపి పేర్కొనబడిరి. భారత దేశమందలి రాజ్యములను వర్ణించు సందర్భమున పురాణములును, బౌద్ధ గ్రంథములును ఆంధ్రుల ప్రశంస చేయుచున్నవి. అగస్త్యుడను మహర్షి ఉత్తరమునుండి దక్షిణా పథమునకు వచ్చిన ఆర్యుడని, అతడు తన భార్యయగు లోపాముద్రతో తీర్థయాత్రలకొరకు బయలుదేరి వింధ్య పర్వతములను దాటి ఆర్యులకు త్రోవచూపెనని ఒక కథ యున్నది.

ఆంధ్రశబ్ద వ్యుత్పత్తిని గూర్చి అనేక అభిప్రాయములు కలవు. విశ్వామిత్ర మహర్షి యొక్క నూరుగురు కుమారులలో జ్యేష్ఠులగు సగము మంది తమ తండ్రి ఆజ్ఞ ప్రకారము శునశ్శేఫుడను వానిని అన్నగా అంగీకరింప లేదనియు, అందులకై ఆత డలిగి వారిని “మీరు ప్రజా భక్షకులు కండు" అని శపించె ననియు వారే ఆంధ్రులకు మూలపురుషు లైనట్లును ఐతిహ్యము కలదు.

ఐతరేయ బ్రాహ్మణమున 'అంధ్ర' అను పదము నీచ జాతి పరముగా ప్రయుక్తమైన దనియు, 'ఆంధ్ర' అను పదము స్వచ్ఛమైన ఆర్యజాతి పరముగా ప్రయుక్తమైన దనియు కొందరు తలచుచున్నారు. పురాణాదులందు చెప్పబడిన ఆంధ్రరాజు అను క్షత్రియ రాజుచే పరిపాలింప బడి చాతుర్వర్ణ్య వ్యవస్థతో కూడిన స్వచ్ఛమైన ఆర్యజాతి ఆంధ్రజాతి అనియు వీరి వాదము. ఆంధ్రరాజు పేరును బట్టి ఆంధ్రదేశమని పేరు వచ్చిన దనియు, ఆంధ్ర దేశమున నివసించు ఆర్యులు ఆంధ్రులని పేరు పొందిరనియు వీరు చెప్పుచున్నారు. తుషార జాతితో కలిసి ఆంధ్రులను వారు అక్షు నదీ తీరమున వసించుచున్నట్లు వాయుపురాణము చెప్పుచున్నది. అక్షునదియనగా ఆక్ససు నది. ఇది హిందూకుష్ పర్వత శ్రేణికి అవతల నున్నది. శ్రీమద్రామాయణ కథనమునుబట్టి విశ్వామిత్రుడు తన పుత్రులను శపించిన వృత్తాంతము పుష్కర క్షేత్ర సమీపమున జరిగినట్లున్నది. పుష్కర క్షేత్రము రాజపుత్ర స్థానము నందలి అజ్మీరునకు సమీపమున నున్నది. విశ్వామిత్రునిచే శప్తులైన ఆంధ్రగణములవారు తూర్పునకును, దక్షిణమునకును వ్యాపించియుందురు. వీరిలో కొందరు కరూశ దేశమునందు ప్రవేశించిరి. కంసుని పక్షమున శ్రీకృష్ణునితో మల్లయుద్ధముచేసి నిహతుడైన చాణూరుడు కరూశ దేశమువాడు. ఈత డాంధ్ర మల్లు డని హరివంశము పేర్కొనుచున్నది.

సైన్యబల చంద్రగుప్తుని ఆస్థానముననున్న గ్రీకు రాయబారి మెగా స్తనీసు ఆంధ్రుల రాజ్య విస్తీర్ణమును, సైన్యబలమును, దేశ సంపదను వర్ణించియున్నాడు. ఆంధ్ర రాజ్యమున 30 దుర్గములు, నూరువేల కాల్బలము, రెండు వేల గుఱ్ఱములు, ఒక వేయి ఏనుగులు ఉండెడివని ఆతడు వ్రాసెను. అశోకచక్రవర్తి శాసనములలో ఆంధ్రు లాతని సామ్రాజ్యమునందలి ప్రజలలో నొకరుగా పేర్కొనబడి యున్నారు. అశోక చక్రవర్తి కళింగమును జయించెను. కళింగము ఉత్కళ దేశములో ఒక భాగము, అశోకుడు ఆంధ్రులను జయించినట్లు ప్రత్యేకముగ చెప్పబడి యుండలేదు. కావున వారాతనికి మిత్ర సామంతులై యుందురు. అశోకుని తరువాత మౌర్య సామ్రాజ్యము దుర్బల మయ్యెను. ఈ అదను కనిపెట్టి ఆంధ్రులు సర్వ స్వతంత్రులైరి. ఆంధ్రదేశమునకు త్రిలింగ దేశము, వజ్రభూమి, నాగభూమి, మంజీర దేశము, వేగిదేశము మున్నగు పేర్లు ప్రాచీన వాఙ్మయములో కాన్పించుచున్నవి. శ్రీశైలము, దాక్షారామము, కాళేశ్వరము అను మూడు ప్రసిద్ధ శైవ క్షేత్రములీ దేశమునందుండుటచే దీనికి త్రిలింగ సంజ్ఞ కలిగెనని చెప్పుదురు. త్రిలింగ పదమునుండియే తెలుగు అను పదము పుట్టెనని పండితులు తెల్పుదురు. ఈ దేశమునందు వజ్రములుకల ప్రదేశము లుండుటచే వజ్రభూమి యనియు, ఇది నాగులను జాతివారి నివాసస్థాన మగుటచే నాగభూమి యనియు, ఇది మంజీరనది ప్రవహించిన ప్రాంతమగుటచే మంజీర దేశ మనియు పేర్లు వచ్చినట్లు తోచును. వేంగి నగరము ముఖ్య పట్టణముగా నున్న కాలమున దీనికి వేంగిదేశమని ప్రసిద్ధి వచ్చియుండును. ఆంధ్రదేశమునందలి భిన్నభిన్న ప్రాంతములకు పూర్వకాలమున నాడు, సీమ, ఆహారము, రాష్ట్రము మున్నగు సంజ్ఞలు చెల్లుచుండెను. వెలనాడు, కోనసీమ, కూడూరహారము, కర్మరాష్ట్రము మొదలైనవి ఆయా మండలముల పేళ్ళు.

క్రీ. పూ. 4వ శతాబ్దియందే ఆంధ్రరాజ్యము స్థాపింపబడినది. పురాణముల ప్రకారము ఆంధ్ర విష్ణువు అనెడు రాజు నిశుంభుడను దానవనాయకు నోడించి కృష్ణానదీ తీరమున శ్రీకాకుళము అను పట్టణమును రాజధానిగా చేసికొని రాజ్యమును స్థాపించేను. ఆంధ్ర విష్ణువు సుచంద్రుడను రాజుయొక్క కుమారుడు. ఆంధ్రవిష్ణువు జ్ఞాపకార్థము శ్రీకాకుళములో ఒక ఆలయము నేటికి ఉన్నది. ఇచ్చట దేవుడు ఆంధ్రనాయక దేవుడు.

అటుతరువాత రెండు శతాబ్దుల కాలము పాలించిన. రాజుల పేర్లు తెలియవు. సంతాన విహీనతచే విచారగ్రస్తుడయి యున్న దీపకర్ణి అను రాజు ఒక నాటి రాత్రి ఒకకలను గనెను. ఆ కలను అనుసరించి మరునాడు దీపకర్ణి ఆరణ్యము లోనికి పోయెను. అచ్చట ఒక సింహముపై ఒక ముద్దుబాలుడు అతనికి కనిపించెను. అంతట తన బాణముతో రాజు ఆ సింహమును కొట్టెను. అది యక్షుడుగా మారి తన పేరు సాతుడనియు, శాపమువలన తాను సింహముగా మారితిననియు, ఆ పిల్ల వానిని దీపకర్ణి మహారాజు పెంచుకొనవలె ననియు తెలియజేసెను. ఆ బాలుడే సాతవాహనుడై సాతవాహన వంశమునకు మూలపురుషుడయినట్లు ఒకకథ యున్నది. శాతవాహనునే శాలివాహను డనియు నందురు. భట్టిప్రోలు స్తూపశాసనమువలన రాజా కుబ్బీరకుడను నొక రాజు తెలియవచ్చుచున్నాడు. ఈశాసన లిపి అశోకుని శాసనలిపిని పోలియుండుటచే కుబ్బీరకుడు ప్రాచీనుడని తెలియవచ్చుచున్నది.

ఆంధ్ర శాతవాహనులు : ఆంధ్ర శాతవాహనుల చరిత్ర తెలియుటకు అనేక సాధనములు కలవు. వీనిలో వాయు, మత్స్య, బ్రహ్మాండ పురాణములు, రాజుల శిలాశాసనములు, నాణెములు, ఆ రాజుల కాలమున రచింపబడిన ప్రాకృత సంస్కృత గ్రంథములు, అప్పటి శిల్ప నిర్మాణములు, అమరావతీ స్తూపములు, నాగార్జునకొండ స్తూపములు, నాసిక, కన్హేరి, కార్లీ గుహాలయములు, విదేశీయుల వ్రాతలు. ఇతర గాథలు ముఖ్యముగా పేర్కొనిదగియున్నవి.

సుమారు నాలుగున్నర శతాబ్దములు పాలించిన ఆంధ్ర శాతవాహనులు, పురాణములలో ఆంధ్రరాజు లనియు, శాసనములలో శాతవాహను లనియు పేర్కొనబడి యున్నారు. ఈ రెండు ఆధారములలో కన్పడు రాజుల పేర్లును సరిపోవుటచేత రెండును ఒకేవంశమునకు చెందిన రాజులకథ అని భావింపబడుచున్నది. శాతవాహన అనునది రాజవంశము పేరు, ఆంధ్ర అనునది జాతి పేరు. వీరినే ఆంధ్రభృత్యులని కూడ వ్యవహరించిరి. శాతవాహనుల జన్మస్థానమును గూర్చి వివాదములు కలవు. కృష్ణా, గోదావరీ నదుల మధ్యభాగమున తూర్పు సముద్ర తీరమునుండి వీరు క్రమముగా పశ్చిమముగా నాసికవరకు జయించి, దక్షిణాపథ చక్రవర్తులు అను పేరు వహించిరని ఒక అభిప్రాయము కలదు. అట్లుకాక మొదట మహారాష్ట్ర ప్రాంతమును పాలించి క్రమముగా కృష్ణా గోదావరుల నడిమి ప్రదేశమును స్వాధీన పరచుకొని పశ్చిమభాగమున తమ ఆధిక్యము తగ్గగానే తూర్పు ప్రాంతమునే పాలించి ఆంధ్రదేశము అను నామము వారు దీని కొసగియుందురని మరియొక వాదము, అటులయిన పైఠను లేక ప్రతిష్ఠాన పురము వారి రాజధాని యగును. శాతవాహన రాజుల శాసనములు విస్తారముగా మహారాష్ట్రములోనే దొరకుటయు, తూర్పుసీమలో తక్కువగా కానవచ్చుటయు ఈ ఊహకు మూలములు. కాని బళ్లారిజిల్లాలో ఒక భాగమునకు 'సాతవాహన హారము' అని పేరున్నట్లు మ్యా కదొని శాసనము వలన తెలియుచున్నది. అందుచేత శాతవాహనుల జన్మస్థానము ఆ ప్రాంతమనియు, అచ్చటి నుండి తూర్పునకు వీరు విజృంభించిరనియు మరియొక మతము.

అశోకుని శాసనములలో రఠికులు, భోజకులు, పిటినికులు, ఆంధ్రులు, పుళిందులు మున్నగువారు అతని సామ్రాజ్య ప్రజలలో చేరియున్నట్లు వర్ణింపబడి యున్నది. వీరిలో రఠికులు మహారాష్ట్ర నివాసులనియు భోజకులు విదర్భ వాసులనియు, పిటినికులు పైఠన్ ప్రాంతీయులనియు, పుళిందులు వింధ్యాద్రి గతులనియు పండితులు చెప్పుచున్నారు. ఇక మిగిలినవారు ఆంధ్రులు. వీరు దక్షిణాపథము యొక్క ప్రాక్తీరవాసులని అంగీకరించుట సులభము. లేనిచో వీరి జన్మస్థానమైన ప్రదేశమును నిరూపించుటకే వీలుండదు. ఆంధ్రులకు ఉత్తరమున కళింగ దేశము వ్యాప్తమై యుండెను. శాతవాహనులు ఆంధ్రులలో నొక శాఖవారై దక్షిణాపథము యొక్క ప్రాక్తీరమున మొదటినుండియు నివసించి రాజ్య నిర్మాణము చేసి మౌర్యుల యనంతరము పశ్చిమముగా విజృంభించి విదర్భను మహారాష్ట్రమును జయించిరనుట విశ్వసనీయముగా తోచుచున్నది. శాతవాహన రాజుల చివరికాలములో తూర్పుదేశము పైననే వారి కాధిపత్యము ఉండెననుట స్పష్టము. అమరావతి ధాన్యకటకము, పైఠను ఆ కాలమున ప్రసిద్ధి కెక్కిన రాజనగరములు.

పురాణముల ప్రకారము ఈ వంశమునకు చెందిన 30 మంది రాజులు పాలకులై యున్నట్లు విదితమగు చున్నది. వీరిలో మొదటివాడు శ్రీముఖ శాతవాహనుడు. ఈతడు క్రీ. పూ. 225 లో స్వతంత్రుడై యుండెను. అమరావతి ఇతని రాజధాని. 23 సం. ల పరిపాలన అయిన తరువాత అతని సోదరుడు కృష్ణుడు రాజయి సాతవాహన రాజ్యమును నాసికవరకు విస్తరింప జేసెను. ఇతని కాలములో నాసికలో శ్రమణుల కొక గుహ తొలిపించబడెను. చైత్యమొకటి కట్టించబడెను. కృష్ణశాతవాహనుడు 18 సం.ల కాలము పాలించెను. తరువాత శ్రీముఖుని కుమారుడు మొదటి శాతకర్ణి చక్రవర్తి యయ్యెను. ఈయన భార్య నాయనికాదేవి. ఈమె మహా రాష్ట్రవనిత. శాతకర్ణి అను పేరు ఇతనికిని తరువాత కొందరు రాజులకును కలదు. 'శాతకర్ణి' పదమున కనేకములయిన అర్థములు చెప్పబడినవి. కుట్టబడిన చెవులుకలవాడు అనుట యుక్తము. రాజులు యజ్ఞయాగాది క్రతువులందాసక్తి కలవా రగుటచే కుండలములు ధరించెడివారు. నానేఘాట్ శాసనము ఈ రాజు చేసిన యాగములను చెప్పుచున్నది. అతనికి 'అప్రతిహత చక్రుడు' అను బిరుదు కూడ కలదు. ఈ శాసనము శాతకర్ణి మరణానంతరము రాణియగు నాయనికాదేవిచే వేయించబడినది. ఈ కాలములోనే కళింగరాజ్యమును పాలించిన చేతవంశపురాజు ఖారవేలుడు శాతకర్ణితో పోరాడినట్లు ఖారవేలుని హాతీ గుంఫశాసనము (క్రీ. శ. 158) చెప్పుచున్నది.

ఈ వంశములో తరువాత ప్రాముఖ్యము చెందిన రాజు రెండవ శాతకర్ణి. ఈతడు క్రీ.పూ. 152-96సం. నడుమ పరిపాలించెను. ఈతడు మాళవమును జయించెను. పదమూడవరాజు కుంతలశాతకర్ణి మగధపై దండెత్తి కణ్వవంశపు రాజులను జయించెను. వాత్స్యాయన కామ సూత్రములలో ఈ శాతకర్ణి పేరు వినవచ్చుచున్నది. 17వ. రాజు హాలుడు అను నాతడు ప్రాకృతవాఙ్మయమున మిక్కిలి ప్రసిద్ధి కెక్కినవాడు. ఇతడు కవులను పోషించి అనేక గ్రంథముల రచింప జేసెను. ఇతడు 'గాథా సప్తశతి' అను గ్రంథరాజమును సమకూర్చేను. ఇది మహారాష్ట్ర ప్రాకృత భాషలో 700 గాథలుగల గొప్ప కావ్యము. దీనినినే, నూనూగు మీసాల నూత్న యౌవనమున శ్రీనాథ మహాకవి తెనిగించి యున్నాడు, కాని అది నేడు ఉపలభ్యమగుటలేదు. బొదిన్స, కుల్లహ, అమరజి, కుమారిల, మకరంద సేన, శ్రీ రాజాది కవులచే వ్రాయబడిన గాథ లిందు సంకలనము చేయబడినవి. అణు లక్ష్మి, అనుపలబ్ద, రేవ, మాధవి మొదలయిన కవయిత్రులు కూడ కొన్ని గాథలను రచించిరి.ఈ గాథలలో ఆనాటి సాంఘికజీవితమును, గ్రామికుల ప్రేమ విలాసములును వర్ణింపబడినవి. శృంగారమే ప్రధానమైనను ఈ గాథలు మంచి కావ్యసరళి కలిగి యున్నవి. హాలుడు భోజరాజుతోను, శ్రీకృష్ణ దేవరాయల తోను పోల్చతగినవాడు. లీలావతి అను కావ్యముకూడ అప్పటిదే, హాలసాత వాహనుడు సింహళ రాజపుత్రి యైన లీలావతిని ప్రేమించి పెండ్లియాడుట ఈ కావ్యములోని ఇతి వృత్తము. దీనికి కార్యరంగము (సప్త) గోదావరీ తీరమున ప్రసిద్ధిచెందిన భీమేశ్వర క్షేత్రము. హాలుని కాలమున పైశాచిభాషలో కూడ కావ్యరచన సాగెను. గుణాఢ్యుని బృహత్కథా కావ్యము ఈకాలముననే వెలసె నని భావింపబడుచున్నది.

హాలుని తరువాత కొంతకాలము శాతవాహనులు ప్రతిభ తగ్గినది. క్రీ. శ. మొదటి శతాబ్ది ప్రారంభము నాటికి శకజాతి వారైన క్షహరాటులు లేక క్షాత్రపులు మాళవమును మహారాష్ట్రమును జయించిరి. శాత వాహనుల రాజ్యము తూర్పు భాగమునకే పరిమితమయ్యెను. ఇట్లుండ ఇరువదిమూడవరాజగు గౌతమీ పుత్ర శాతకర్ణి శాతవాహనుల ప్రతిభను తిరిగి ప్రతిష్ఠించెను. క్రీ. శ. 78-102 సం॥ల నడుమ ఈతడు పాలించెను. ఈతని తల్లియగు గౌతమీ బాలశ్రీ వేయించిన నాసిక శాసనము ప్రకారము ఇతడు శకులను, పహ్లవులను, యవనులను జయించెను. క్షాత్రప నహపణుని వంశమును ఉన్మూలించెను. అతని వెండి నాణెములపై తన రాజముద్రను తిరిగి ముద్రింపించెను. ఉత్తర మహారాష్ట్రమును, కొంకణ మును, నర్మదానదీ ప్రాంతమును, సౌరాష్ట్రమును, మాళవ పశ్చిమ రాజపుత్రస్థానములను గౌతమీ పుత్రుడు వశపరచుకొనెను. కళింగముకూడ ఈతని రాజ్యమున చేరి యుండవచ్చును. గౌతమీ పుత్ర శాతకర్ణికి 'శాత వాహన కులయశః ప్రతిష్ఠాపన కరూ డనియు, 'ఏక బ్రాహ్మణుడు','ఏక వీరు'డనియు, క్షత్రియ దర్పనాశకూడనియు బిరుదులు కలవు. ఇతని కాలమునుండి రాజులు తమ తల్లుల పేర్లతో చేర్చుకొనుట వాడుక అయ్యెను. అందుచే నీతడు గౌతమీ పుత్ర శాతకర్ణియని పిలువబడెను.

గౌతమీపుత్ర శ్రీ శాతకర్ణి తరువాత అతని కుమారుడు వాసిష్ఠీపుత్ర శ్రీ పులుమావి పరిపాలించెను.ఈతని రాజ్యాంతమున శకులు ఉజ్జయినీ ప్రాంతమును మరల వశవరచుకొనిరి. శకులరాజు రుద్రదాముడు శాతవాహన రాజులతో వివాహ సంబంధము చేసికొన్నను, వారి రాజ్యమునుండి ఉత్తర కొంకణమును, నర్మదానదీ ప్రాంతమును తాను వశము చేసికొనేను. అమరావతి శాసనమును బట్టియు గుడివాడలో దొరకిన నాణెములను బట్టియు, పులుమావి ఆంధ్రదేశము నంతయు పాలించినట్లు తెలియుచున్నది.

తరువాత రాజులలో ముఖ్యుడు యజ్ఞశ్రీ యను నతడు. ఈతని నాణెములు గుజరాతు, కథియవాడు, బరోడా, మాల్వా, అపరాంత, మహారాష్ట్ర ఆంధ్రదేశములలోను, మధ్య రాష్ట్రములోను దొరకినవి. వీటినిబట్టి ఈతని రాజ్యవిస్తృతిని ఊహింపదగును. కొన్ని నాణెములపై ఓడ యొక్క చిత్రముండుటచే శాతవాహన యుగమున సముద్రయానము విస్తారముగా సాగెడిదని ఊహింపనగుచున్నది. తరువాతి రాజులు అంత పేరుగన్న వారు కారు. యజ్ఞ శ్రీ అనంతరము విజయశ్రీ, చంద్రశ్రీ. పులోమావి యనువారు శాతవాహన రాజ్యాధికారమును పూనిరి. వీరు పరాక్రమవంతులైన పరిపాలకులు కాక పోవుటచే సామ్రాజ్యభాగములు వీరి హస్తములనుండి జారిపోయి తుదకు శాతవాహన సామ్రాజ్యమే క్రీ. శ. 220 ప్రాంతమున అస్తమించెను. ఆంధ్ర రాజ్యములోని సామంతులు స్వతంత్రు లయిరి. పశ్చిమమున ఆభీరులు, నైఋతిని చూటువంశమువారు, తూర్పు ప్రాంతమున ఇక్ష్వాకులు, దక్షిణమున పల్లవులు స్వతంత్ర రాజ్యములను స్థాపించుకొనిరి.

శాతవాహనుల కాలమున ఆంధ్రదేశ పరిస్థితులు : పరిపాలన కొరకు సామ్రాజ్యము హారములులేక అహారములు (భాగములు)గా విభజింపబడెను. అహారములను అమాత్యులు పాలించిరి. అహారములు గ్రామములుగా విభజింప బడెడివి. గ్రామములు గ్రామికుల పాలనలో నుండెడివి. నగరపాలన నాగరకుల క్రింద నుండెడిది. కొన్ని మండల ములు సామంతుల అధీనములో నుండెడివి. వీరు మహారథులు, మహాభోజులు అని పిలువబడుచుండిరి. మహా సేనాపతి యనునతడు సైన్యవ్యవహారములేగాక రాజకీయ వ్యవహారములు కూడ చక్కబెట్టుట కలదు. ఇతర ఉద్యోగస్థులలో మహాతారక, భాండాగారిక, మహామాత్ర, నిబంధ కార, అనబడువారుకూడ కలరు. రాజులు ధర్మ మార్గమున పరిపాలన చేసెడివారు.

సంఘజీవనములో చాతుర్వర్ణ్య వ్యవస్థ యుండెడిది. యవనులు, శకులు, వహ్లవులు మొదలైన విదేశీయులు సంఘములో కలిసిపోయి ఏదో యొక కులమువారమని చెప్పుకొనెడివారు. స్త్రీలకు సంఘములో ప్రముఖస్థాన ముండెను. స్త్రీలు తమ భర్తల బిరుదములను కూడ తమ పేళ్ళతో చేర్చుకొనెడివారు.

విదేశ వ్యాపారము, వర్తకము విరివిగా జరిగెడివి. తూర్పు తీరమున కంటకొస్సల, కొడ్డూర, అల్లోనైనె అనునవి ముఖ్యమైన రేవు పట్టణములు, పశ్చిమప్రాంతమున భరుకచ్ఛము, సొపారా, కల్యాణ అను రేవులు పేరుపొందినవి. పైఠను, తగర, ధాన్యకటకము వ్యాపార కేంద్రములుగా ప్రసిద్ధి కెక్కినవి. దేశ మధ్యమునుండి వ్యాపించుచు మహారాజ పథములు అను పెద్దబాటలు ఉండెడివి. వర్తకులు శ్రేణులుగా నేర్పడెడివారు. శ్రేణికి అధ్యక్షుడు శ్రేష్ఠి. చేనేత, కమ్మరి, కుమ్మరి, వడ్రంగి, తెలిక. మొదలయిన వివిధ వృత్తులవారు కూడ నుండెడి వారు. వివిధ వృత్తులవారికి వేర్వేరు శ్రేణు లుండెడివి. రాజులును, ధనవంతులును ఈ శ్రేణులకు తక్కువ వడ్డీతో ధనము నిలువచేయుటకు ఇచ్చుచుండిరి. ఈ ద్రవ్యము మీద వచ్చు వడ్డీతో దానధర్మములకు నిబంధనము చేయుటయు కలదు. ఇది ఈనాటి సహకార పద్దతిని ఒక విధముగా పోలియున్నది. నహపణుని అల్లుడును, ధర్మచింతన కలవాడును అగు ఋషభదత్తుని శాసనమువలన ఈ యంశములు తెలియవచ్చుచున్నవి. వ్యవసాయము ముఖ్యమైనవృత్తి. మతసంస్థలకు భూములను దానమిచ్చు నాచారము కలదు. భూములనుండి పన్నులు వసూ లగుచుండెను. ఉప్పును తయారుచేసి అమ్ముట ప్రభుత్వము వారి ప్రత్యేకమైన హక్కు.

రాజులు హిందూమతావలంబకులుగా నుండిరి. వారు యజ్ఞయాగాదులను చేసెడివారు. శాతవాహనులలో మూడవ రాజగు మొదటి శాతకర్ణి తన కుమారునికి 'వేదసిరి' అను పేరు పెట్టుకొనెను. జనులు శివునికూడ కొలిచెడివారు. సప్తశతిలో పశుపతిని, గౌరిని స్తుతించిన భాగములున్నవి. 172 వ గాథలో గౌరీ దేవాలయములు పేర్కొనబడినవి. గణేశుని గణాధిపతి యనిరి. రాజులు వైదిక మతాభిమానులైనను బౌద్ధమతవ్యాప్తి ఆకాలములో జరిగినది. భట్టిప్రోలు, అమరావతి, ఘంటసాల, గుమ్మడిదులు, గుడివాడ, గోలి మొదలగు ప్రదేశములలోని బౌద్ధస్తూపములు ఆనాటివే. బౌద్ధులు నాగరాజును కొల్చుట గలదు. నాగులు స్తూపములను చుట్టుకొని ప్రభు సందేశమును వినుచుండినట్లు శిల్పములు కలవు.

శిల్పము, చిత్రలేఖనము ఆకాలమున అభివృద్ధిగాంచినవి. బౌద్ధ స్తూపములు, చైత్యములు, విహారములు, గుహాలయములు వెలసినవి. కన్హెర్, నాసిక్, కార్లీ, భట్టిప్రోలు, అమరావతి, ఘంటసాల, గుమ్మడిదుఱ్ఱు, గుడివాడ, గోలి, కొండాపురం, గాజులబండ, ఫణిగిరి అనునవి ప్రసిద్ధమయిన బౌద్ధ క్షేత్రములు. అమరావతిస్తూపము చుట్టును పాలరాతితో నిర్మింపబడిన ప్రాకారముండెడిది. బుద్ధుని జీవిత ఘట్టములు శిల్పముగా రూపొందెను. అజంతాలోని ప్రాచీన గుహల యందలి వర్ణచిత్రములు అప్పటి చిత్రకారుల నైపుణ్యమును తెలియ జేయును.

శాతవాహనుల కాలము ప్రాకృత భాషాభివృద్ధికి ముఖ్యమయినది. హాలుని గాధా సప్తశతి మహారాష్ట్ర ప్రాకృత భాషలో నున్నది. లీలావతి మరియొక ప్రాకృత కావ్యము. గుణాఢ్యుని బృహత్కథను గురించి ఈక్రింది కథకలదు. సంస్కృతములో పాండిత్యముగల తన రాణితో సమాన ప్రతిభను సంపాదించుటకు సాతవాహనరాజు సంస్కృతమును నేర్చుకొని తన రాణిముందు తన ప్రతిష్ఠను నిలుపుకొనెనని ఈ గాధవలన తెలియుచున్నది. ఈ సందర్భముననే శర్వవర్మ, రాజునకు ఆరు నెలలలో సంస్కృతము నేర్పుటకై కాతంత్ర వ్యాకరణమును సంస్కృతమున రచించి తన ప్రతిన నెరవేర్చుకొనెను. రాజునకు ఆరు నెలలలో సంస్కృతము శర్మవర్మ బోధింప గలిగినచో తాను సంస్కృతమును, ప్రాకృతమును, దేశభాషను, వర్ణింతునని గుణాఢ్యుడు శపథము చేసెను. రాజు సంస్కృతమును ఆరునెలలలో నేర్వగల్గుటచే, గుణాఢ్యుడు సంస్కృత, ప్రాకృత, దేశభాషలను వర్ణించి బృహత్కథను పైశాచి భాషలో రచించెను. పైశాచి ఒకరకమయిన ప్రాకృత మందురు. బృహత్కథ ఇప్పుడు లభించుట లేదు. వాత్స్యాయన కామసూత్రము లీ కాలముననే రచింపబడెను. పురాణములుకూడ ఈ యుగముననే రచింపబడెను.

నాగార్జునాచార్యుడు  :- ఆంధ్రదేశమున బౌద్ధమత వ్యాప్తికి నాగార్జునుడు ముఖ్య కారకుడు. ఈతడు క్రీ.శ. 134 వ సం. న విదర్భలో ఒక బ్రాహ్మణ కుటుంబమున పుట్టెను, పిన్న వయస్సునందే వేదశాస్త్రములు ముగించి ఇతడు విద్వాంసుడు, కవి, తత్త్వవేత్త అయ్యెను. కపిమల అను 13 వ బౌద్ధ ప్రధాన గురువునుండి బౌద్ధ ధర్మమును స్వీకరించి అతని తరువాత 14 వ ప్రధాన బౌద్ధగురువయ్యెను. ఇతడు సింహళమునుండి ప్రజ్ఞాపరిమిత సూత్రములను, వై పుల్య సూత్రములను, హిమాలయములోని వృద్ధ భిక్షువునుండి మహాయాన సూత్రములను తెచ్చెను. ఇతడు పది వేలమంది బ్రాహ్మణులను బౌద్ధులనుగా మార్చెను. నాగార్జునుడు తాను నివసించుచున్న శ్రీపర్వతముపై ఒక ప్రయోగశాలను, ఒక గ్రంథాలయమును ఏర్పరచెను. ఇతడు అమరావతి స్తూపమునకు బైటి ప్రాకారమును కట్టించెను. ఇతడు టిబెట్టు, చైనా జపానులలో ప్రఖ్యాతిపొం దెను. అశ్వఘోషుని తరువాత వాఙ్మయ సేవ చేసినవారిలో ఇతడు ముఖ్యుడు. ఇతడు 24 గ్రంథములకుపైగా రచించెను. వానిలో ఈ క్రిందివి ముఖ్యమైనవి.

1. సుహృల్లేఖ :- యజ్ఞశ్రీ శాతకర్ణికి అమూల్యమైన ఉపదేశము నిచ్చుచు నాగార్జునుడు దీనిని వ్రాసెను. నీతి పథము గొప్పతనమునకు ఆధారమనియు, నిర్వాణపద్ధతులగు త్రిగుణములకతీతమగు జ్ఞానము, అష్టాంగ మార్గములు, చతుర్విధ సత్యములు ఇందుగలవు. తల్లి దండ్రులను భక్తి శ్రద్ధలతో పోషించుచుండవలెననియు ఇందుగలదు. 2. ప్రజ్ఞాప్రదీప శాస్త్ర కారిక 3. మహాప్రజ్ఞా పరిమిత సూత్రవ్యాఖ్య. ఇది శూన్యత్వమును బోధించును.

ఆది శంకరులు మాయావాదమును నాగార్జునుని శూన్యవాదము (బౌద్ధదర్శనము) నుండి గ్రహించెనందురు. ప్రపంచము నందలి జనులందరు ఆత్మ యొక్క ఉపస్థిత్యనుపస్థితులనుబట్టి ఆస్తికులో నాస్తికులో అగుచుండగా నాగార్జునుడు మాధ్యస్థ్యమును అవలంబించెను. ఆత్మఉండుట, ఉండకపోవుట అనునది దానిని చూచుట, చూడక పోవుట అను పద్ధతులపై ఆధారపడి యుండునను మాధ్యమిక వాదమును ఇతడు ఏర్పరచెను. ఇతని దృష్టిలో శూన్యత యనగా, నిర్వాణము, నిబంధనములు లేని స్థితి. దానిలో అన్ని విరుద్ధభావములు సమసిపోవును.

ఆర్యదేవుడు, భావవివేకుడు, దేవబోధిసత్త్వుడు, బుద్ధవలితుడు, జయప్రభ అనువారు నాగార్జునుని శిష్యులలో ముఖ్యులు. నాగార్జునుడు బౌద్ధమతములోని మహా యానశాఖకు ప్రవక్తకు డాయెను. ఈతడు భక్తితత్వమునుగూడ ప్రతిపాదించెను. ఈతడు శ్రీపర్వతము పైననే క్రీ. శ. 194 సం. లో సిద్ధి పొందెను. ఆతరువాత ఆసంవత్సరముననే నాగార్జునుని మన్ననచేసిన యజ్ఞశ్రీ శాతకర్ణి కూడ మరణించెను. మరణానంతరము నాగార్జునుడు బోధిసత్త్వుడుగా కీర్తింపబడెను.

క్రీ. శ. 7వ శతాబ్దమున 84 మంది సిద్ధులలో నొకడగు మరియొక నాగార్జునుడు రసాయన శాస్త్రజ్ఞుడు ఉండెనని తెలియుచున్నది. ఇతనిచే వ్రాయబడినట్లు తలపబడు రసరత్నాకరము అను రసాయనశాస్త్ర గ్రంథములో శాతవాహన రాజుతోడి సంభాషణము కనిపించు చుండుటచే దానిని బోధిసత్వ నాగార్జునుడే రచించి యుండునని కొందరందురు.

వివిధ రాజవంశములు  : శాతవాహన రాజ్యము చీలిపోయిన తరువాత ఆ స్థానమున అనేక రాజవంశములు వెలసినవి. పశ్చిమమున (మహారాష్ట్రమున) అభిరులను వారు పరిపాలించిరి. ఈశ్వర సేను డను రాజు ఈ రాజ్యమును స్థాపించేను, ఈశ్వరదత్తుడు, వీరసేనుడు అను రాజులుకూడ పాలించిరి. ఆభీరులు 67 సం. లు పాలించినట్లు పురాణములు చెప్పుచున్నవి.

చుటు వంశపు రాజులు  : శాతవాహన సామ్రాజ్యపు నైరృతి ప్రాంతము (కర్ణాటకము) చుటు వంశపువారిచే పాలింపబడెను. వీరి రాజధాని 'వనవాసి' లేక 'వైజయంతి'. హారీతీపుత్ర విష్ణుస్కంద చుటుకులానంద శాతకర్ణి, హారీతీపుత్ర శివస్కంద వర్మలు ఈ వంశములో ముఖ్యులు. వివాహసంబంధమువలన కదంబులకును, పల్లవ వంశీయుడగు వీర కూర్చుడు బంధువగుట చేత పల్లవులకును మధ్య ఈరాజ్యము కొరకు తగువు లేర్పడెను. చుటు రాజ్యముపల్లవుల వశమైనది. చుటు వంశపురాజులు శాతవాహన రాజులవలె శాతకర్ణి బిరుదును తాల్చి వారి వలెనే పాలించిరి.

ఇక్ష్వాకులు (క్రీ. శ. 220-260): ఆంధ్రదేశమును శాతవాహనుల తరువాత పాలించిన వంశములలో ఇక్ష్వాకు రాజవంశము ముఖ్యమైనది. వీరు కృష్ణానదీ తీరమునందలి విజయపురి రాజధానిగా మూడవ శతాబ్ది నడుమ 52 సంవత్సరములు పరిపాలించిరి. ఈ వంశములో నలుగురు రాజుల పేర్లు తెలియవచ్చినవి. నాగార్జున కొండ,జగ్గయ్యపేట, రామిరెడ్డిపల్లి ప్రాంతములలో లభించిన శాసనముల మూలమున ఈ వంశీయులను గూర్చి తెలియుచున్నది. నాగార్జున కొండను శ్రీపర్వతమనుట కలదు. వీరు పురాణములలోని ఇక్ష్వాకు వంశమునకు చెందిన వారనియు, దక్షిణ ప్రాంతము నకు వచ్చి స్థిరనివాస మేర్పరచుకొని రనియు, శాతవాహనులకు సామంతులై తత్సామ్రాజ్య పతనానంతరము స్వతంత్రులై రనియు చరిత్రకారుల అభిప్రాయము. నాగార్జునకొండ శిథిలములు బయల్పడిన తరువాత నాగార్జునకొండ ప్రక్కనే విజయపురి కలదని ఋజువైనది. అల్లూరు శాసనము ప్రకారము ఇక్ష్వాకులు శాతవాహనుల పాలనలో మహా తలవరులుగా నుండిరి. శాతవాహనుల పతనసమయమున వీరు స్వతంత్రులై నట్లు తెలియుచున్నది.

ఇక్ష్వాకు రాజవంశమునకు మూలపురుషుడు వాసిష్ఠీ పుత్ర శ్రీశాంతమూలుడు. (క్రీ. శ. 220-230). ఈ మహారాజు గొప్ప పరాక్రమవంతుడు. యజ్ఞ యాగాదులు చేసినవాడు. కోట్లకొలది బంగారు నాణెములను, గోశత సహస్రములను దానము చేసినవాడు. ఇతడు వేలకొలది నాగళ్ళతో భూమిని సాగుబడిలోనికి తెచ్చెను. ఇతడు వైదిక మతాభిమాని. అయినను రాజవంశపు స్త్రీలు బౌద్ధ మతాభిమానము కలిగియుండిరి. ఇతని ఇద్దరి రాణులలో నొకామె మాఠరీదేవి. సోదరీ మణులగు హమ్మసిరినిక, శాంతిశ్రీలు బౌద్ధ భిదువులకు దానము చేసిరి. వారి ప్రోత్సాహముననే విజయపురిలో పెక్కు బౌద్ధ చైత్యనములును, విహారములును వెలిసినవి.

శ్రీశాంతమూలుని కుమారుడు మాఠరీపుత్ర శ్రీ వీర పురుషదత్తుడు (క్రీ. శ. 230-250). తండ్రివలె ప్రతిభావంతుడు కాడు. ఐనను ఈతని కాలమున బౌద్ధమతమునకు విశేష ప్రాముఖ్యము కలిగినది. రాజవంశపు స్త్రీలు చెక్కించిన శాసనములు నాగార్జున కొండపై కాన వచ్చును. మహారాజు భార్యలు, మేనత్తలు మాత్రమేకాక సామాన్యస్త్రీలు సయితము బౌద్ధఖితువు లకు దానములు చేసి బౌద్ధ విహార నిర్మాణమునకు తోడ్పడిరి. బోధిశ్రీ యను నామె రేవతుడను ధనవంతుని కుమార్తె. రెండు చైత్యగృహములను, ఒక విహారమును ఆమె కట్టించెను. ఆ కాలమున పెక్కు బౌద్ధమత శాఖీయు లుండిరి. పూర్వ శైల, అపర శైల, బహుశ్రుతీయ, మహిళాసక ప్రభృతి శాఖల వారుండిరి. బౌద్ధారామములను నిర్మించిన వారిలో భదంతానందుడు ముఖ్యుడు. కృష్ణానది లోయ ప్రాంతమున బౌద్ధ శిల్పములు, కట్టడములు వెలయుటకు ఇక్ష్వాకుల పాలనమే కారణ మయినది.

వీరపురుష దత్తుని కుమారుడు, మహారాజ వాసిష్ఠీ పుత్ర బాహుబల శాంతమూలుడు. ఈతడు 11 సంవత్సరములు పాలించెను (క్రీ.శ. 250-260) రాజవంశపు స్త్రీలు ఇతనికాలమునకూడ బౌద్ధమతమునందు అభిరుచిని శ్రద్ధను చూపిరి. అతని తల్లి భట్టిదేవి 'దేవీవిహారము' అనుదానిని పూర్తి చేసెను. రాజుసోదరి కందబాలశ్రీ భిశువులను సత్కరించెను. నాగార్జునకొండ బౌద్ధ క్షేత్రములను చూచుటకు కాశ్మీర, గాంధార, చైనా దేశములనుండి పలువురు వచ్చెడివారు. అప్పటి ప్రజాజీవితమును తెలిసికొనుటకు నాగార్జునకొండ శిల్పము లెంతయు నుపకరించును. మూడవరాజగు శాంతమూలుని తర్వాత ఇక్ష్వాకుల ప్రతిభ తగ్గెను. వారు బౌద్ధమతమునకు చేసిన సేవ చరిత్రలో చిరస్థాయి అయినది. ఇక్ష్వాకుల పతనమునకు కారణమ బౌద్ధమత సంస్కృతికి విరుద్ధముగానున్న రాజవంశముల ఉద్ధతియే. పల్లవులు, బృహత్ఫలాయనులు శాలంకాయనులు, విష్ణుకుండినులు, ఆనందగోత్రులు వైదిక మతాభిమానులు.

పల్లవులు  :- ఇక్ష్వాకుల వెంటనే ఆధిపత్యము వహించినవారు పల్లవులు, క్రీ. శ. మూడవ శతాబ్దము మొదలు కొని తొమ్మిదవ శతాబ్దము వరకు కృష్ణా కావేరీ నదుల మధ్యభాగమును వీరు పాలించిరి. పల్లవులెవరో నిర్థారణచేయు విషయమున భిన్నాభిప్రాయములు గలవు. ఎట్లున్నను వీరు శక యవన పహ్లవులు అను విదేశ జాతి లోనివారనియు, ఉత్తర హిందూదేశమునుండి క్రమముగా దక్షిణమునకుసాగి ఇప్పటి గుంటూరు మండలములోని పల్నాడు ప్రాంతములో వీరు స్థిరనివాస మేర్పరచుకొనిరనియు కొందరు చెప్పుచున్నారు. ఈ అభిప్రాయము సమంజనముగా నున్నది.

పల్లవ వంశములో చారిత్రక పురుషుడుగా పరిగణింపదగినవాడు వీరకూర్చ మహారాజు. నాగవంశ్యుడును వనవాసి మహారాజును అగు విష్ణుస్కందుని కుమార్తెను ఇతడు వివాహమాడి రాజ్యమును బడసెను. ఈ మొదటి పల్లవ వంశమును గూర్చి మైదవోలు, హీరహడగల్లి, కందుకూరు ప్రాంతములలో దొరకిన ప్రాకృత శాసనముల వలన తెలియుచున్నది. తరువాత రాజులలో ముఖ్యుడయినవాడు మహారాజ శివస్కందవర్మ లేక విజయ స్కందవర్మ. ఇతని తండ్రి కంచి నగరమును రాజధానిగా జేసికొని అచటినుండి కృష్ణానదీ తీరమునుండి బళ్ళారి వరకు పాలించెను. మహారాజు శివస్కంద వర్మ అనేక యాగములు చేసెను. యువ మహారాజగు బుద్ధవర్మ యొక్క భార్య చారుదేవి నెల్లూరుమండలమున నారా యణస్వామి దేవాలయమునకు భూదానము చేసెను. పల్లవులు వైదిక మతాభిమానులు. కంచినగరము గొప్ప విద్యా కేంద్రముగా ప్రసిద్ధికెక్కెను. గుప్త చక్రవర్తి యగు సముద్రగుప్తుడు కావించిన దక్షిణ దిగ్విజయ యాత్రాకాలమున (కీ. శ. 346) విష్ణుగోపుడను పల్లవ రాజు పాలించుచుండెను. సముద్రగుప్తుని అలహాబాదు శాసనము ఇతనిని పేర్కొనినది.

తరువాత పాలించిన పల్లవరాజులను గురించి సంస్కృతములో లిఖింపబడిన శాసనములనుండి తెలియుచున్నది. కుమార విష్ణువు అనునతడు చోళులనుండి కంచి నగరమును స్వాధీనము చేసికొని పాలించెను. ఇతడు కదంబులతో పోరాడవలసివచ్చెను. క్రీ. శ. 6 వ సతాబ్ది ప్రారంభమున సింహవిష్ణువు అనునాతడు తరువాత పాలించిన పల్లవ మహారాజులకు మూలపురుషు డయ్యెను. పల్లవ చక్రవర్తులలో కొందరు శివుని, కొందరు విష్ణువును కొల్చెడివారు, యాగములు చేసెడివారు. కుమార విష్ణువు అనంతరము పాలించిన రాజులలో నందివర్మ అను రాజే త్రిలోచన పల్లవుడు అను ఒక అభిప్రాయము కలదు. ఈతనికి ముక్కంటి కాడువెట్టి అను పేరును కలదు. ఇతడు గర్భశత్రువు లగు చాళుక్యుల నెదిరించినవాడు, ఇతడు కరికాళచోళునితోకూడ యుద్ధము చేసెను. విజయాదిత్యుడను చాళుక్యుడు త్రిలోచన పల్లవునితో యుద్ధము చేసెను. ఆ యుద్ధమున విజయాదిత్యుడు చంపబడెను. అతని భార్య గర్భవతియై కడపమండలములోని ముదివేము అగ్రహారమున, విష్ణుభట్ట సోమయాజి ఇంట దాగి కొంతకాలమున కొక కుమారుని కనెను. ఇత డే విష్ణువర్ధన నామమును వహించి పల్లవుల నోడించి చాళుక్య రాజ్యము స్థాపించెనని చెప్పబడుచున్నది.

బృహత్పలాయనులు  : ఈవంశము వారు కూడూరు హారమును అనగా కృష్ణానదీ ముఖప్రాంతమును మూడవ శతాబ్దిలో పాలించినట్లు కన్పట్టును. క్రీ.శ.270 నుండి 285 వరకు వీరి కాలమని తెలియుచున్నది. కొండముది తామ్ర శాసనమువలన జయవర్మ మహారాజు 'పాంటూరు' గ్రామమును దానము చేసెనని తెలియుచున్నది. పాంటూరు వీరి రాజధాని యని కొందరి మతము. కాని కొండముది శాసనమున అట్లు లేదు. మహారాజ జయవర్మ పల్లవరాజగు మహారాజు శివస్కందవర్మకు సమకాలికుడు. ఇతడు పల్లవులబారిని పడకుండ తన రాజ్యమును కట్టుదిట్టము చేసికొనెను. ఇతడు 'మహేశ్వరపాద పరిగృహీతు' డని ఇతని శాసనము తెలుపుచున్నది. శాతవాహనుల యొక్కయు, ఇక్ష్వాకుల యొక్కయు పద్దతులనే ఇతడు అనుసరించెను.

శాలంకాయనులు  : క్రీ. శ. 4, 5 శతాబ్దములలో కృష్ణా గోదావరీనదుల నడిమి ప్రదేశమును పాలన చేసిన వారు శాలంకాయనులు. వీరినే వైంగేయకు లందురు. వేంగి రాజధానిగాగలవారగుటచే వైంగేయకులనియు, శాలంకాయన గోత్రీయులుగాన శాలంకాయనులనియు వీరు పేర్కొనబడుచున్నారు. ఏలూరు శాసనము, పెద వేగి శాసనము మొదలగు తామ్రశాసనములవలన వీరినిగూర్చి తెలియుచున్నది. దేవవర్మ అనునాతడు మనకు తెలిసిన మొదటిరాజు. ఇతడు అశ్వమేధయాగము చేసి 'అశ్వమేధయాజి' అనబడెను. ఇతడు శాసనములలో 'పరమ మాహేశ్వర', 'బప్పభట్టారక పాదభక్త' అనబడెను. ఇతని తరువాత హస్తివర్మ అను రాజు 'సమరావాపవిజయీ' అను బిరుదు పొందెను. ఇతని కాలముననే సముద్రగుప్తుడు వేంగిపై కెత్తివచ్చెను. అతడు తిరిగిపోయిన తరువాత యథాప్రకారము ఇతడు తన రాజ్యమును పాలించెను. పిదవ కృష్ణానదివరకు రాజ్యమును వ్యాపింపజేసినవాడు నందివర్మ. ఇంకను చండవర్మ, రెండవ నందివర్మ, స్కంద వర్మ, అను రాజులు తదుపరి పాలించిరి. నందివర్మ మహారాజు ' వివిధ ధర్మ ప్రధానుడు' అని ప్రశంసింపబడెను. ఈతడు వైదికమతమును బౌద్ధమతమును సమదృష్టితో చూచి ఆదరించెను.

ఈ వైంగేయకులు చిత్రరథ స్వామిని కొల్చెడువారు. వీరు ఆస్వామి దేవాలయమును వేంగిలో కట్టించిరి. జైన మతము, బౌద్ధ మతము కూడ ఈ రాజుల మత సహనమువలన ప్రోత్సాహము పొందినవి. బర్మానుండి వచ్చిన బౌద్ధ యాత్రీకులు సత్కరింపబడిరి. బుద్ధదత్తుడను పండితుడు సింహళమునుండి వేంగి ఆస్థానమునకు ఆహ్వానింపబడెను. ఈ వంశము నందలి విజయనందివర్మ పరమ భాగవతుడు. ప్రాలూరు నందలి విష్ణుగ్రహస్వామికి ఈతడు భూదానము చేసెను.

కందార వంశపు రాజులు, ఆనందగోత్రులు : బృహత్పలాయనులు పాలించుచుండిన సమయమున కందార వంశపురాజులు గుంటూరు, తెనాలి, ఒంగోలు తాలూకాల ప్రాంతమును, కందరపురమును రాజధానిగా జేసికొని పాలించిరి. చేజెర్ల, మట్టేపాడు, గోరంట్ల శాసనములవలన వీరినిగూర్చి తెలియుచున్నది. కందరుడు వంశమునకు మూలపురుషుడు. కంతేరు అనునదే కందరపురము. వీరు ఆనంద గోత్రీకులు. కాబట్టి ఆనందగోత్ర రాజు లనబడిరి. దామోదరవర్మ. అత్తివర్మ అను రాజులు ఈ వంశమున ముఖ్యులు. దామోదరవర్మ బౌద్ధమతాభిమాని. రాజులు బ్రాహ్మణులకు దానములు చేసెడివారు. శివభక్తులు. వంకేశ్వరస్వామిని కొల్చెడివారు. రాజులు పరమత సహిష్ణుతాయుతులగుటచే బౌద్ధ నిర్మాణములు ఆంధ్ర దేశమున వెలిసి క్రీ. శ. 7వ శతాబ్దమున యువాన్ చువంగు అను చీనా బౌద్ధ యాత్రికుడు ఆంధ్రదేశమున గలవానిని గూర్చి వ్రాయుటకు అవకాశమిచ్చినవి.

విష్ణుకుండినులు  :- వైంగేయకుల ఆధిపత్యము అంతరించినపిమ్మట విష్ణుకుండిన రాజులు పాలించిరి. వీరి రాజధాని వేంగికి సమీపముననున్న లెందులూరు అను ఇప్పటి దెందులూరు. చిక్కుళ్ళ, ఈపూరు, రామతీర్థము శాసనముల మూలమున వీరిని గురించి తెలియుచున్నది. వీరు శ్రీ పర్వతస్వామిని కొల్చెడివారు. క్రీ. శ. 5, 6 శతాబ్దులలో వీరు పాలించిరి. మాధవవర్మ అను రాజు యాగములు చేసెను. మొదటి మాధవవర్మ వాకాటక రాజు కుమార్తెను వివాహమాడెను. కావున ఈతడు వారి ప్రాపకముపొంది బలవంతుడయ్యెను. ఈ వంశము నందలి విక్రమేంద్రవర్మయు, గోవిందవర్మయు గొప్ప పరాక్రమో పేతులైన రాజులు. తరువాతి రాజులలో మూడవ మాధవవర్మ ముఖ్యుడు. ఇతనికి 'జనాశ్రయుడ'ను పేరు కలదు. 'జనాశ్రయ ఛందో విచ్ఛిత్తి' అను గ్రంధమును రచించిన గణస్వామిని ఇతడు ప్రోత్సహించెను. గోదావరినది దాటి ఈతడు రాజ్యము విస్తరించుకొని నట్లున్నది. ఇతడు పొలంబూరు గ్రామమును, నాలుగు నివర్తనముల భూమిని శివశర్మ అను బ్రాహ్మణునికి దానము చేసెనని ఇతని పొలమూరు శాసనము తెలుపుచున్నది. మాధవవర్మ కుమారు డయిన మంచన భట్టారకుని కాలమున చాళుక్య రాజగు రెండవ పులకేశి విష్ణుకుండినుల నోడించి వేంగీ రాష్ట్రమును స్వాధీనము చేసికొని తన తమ్ముడగు కుబ్జ విష్ణువర్ధనుని పిఠాపురములో రాజ ప్రతినిధిగా నియమించెను. ఈ కుబ్జ విష్ణువర్ధనుడే క్రీ. శ. 625 లో స్వతంత్రుడై తూర్పు చాళుక్య వంశమునకు మూలపురుషు డయ్యెను. క్రీ.శ. 638 లో ఈ చాళుక్య వంశమునకు చెందిన రాజు జయసింహుడు పొలంబూరు గ్రామమును శివశర్మ కుమారుడగు రుద్రశర్మకు దానము చేసినట్లు మరియొక పొలమూరు శాసనము చెప్పుచున్నది. విష్ణుకుండినుల అనంతరము తూర్పు చాళుక్యులు ఆంధ్రదేశమునకు అధిపతులైరి. విష్ణుకుండినుల కాలము గుహాలయములకు ప్రాముఖ్యము కాంచినది. ఉండవల్లి, సీతానగరము, విజయవాడ, మొగలు రాజపురము ప్రాంతములలోని ఏకశిలా గుహాలయ నిర్మాణములు వీరి కాలమునాటివే.

కదంబులు  :- సముద్రగుప్తుని దండయాత్ర తరువాత పల్లవుల ప్రతిభ తగ్గుటతోడనే కదంబులను వారు కర్ణాటక ప్రాంతమున స్వతంత్రులైరి. వీరు బ్రాహ్మణులు. యజ్ఞయాగాది క్రతువులు చేయువారు. ఈ వంశమున మయూరశర్మ అనునతడు కాంచీనగరముచేరి సంస్కృతా భ్యాసము చేయుచుండగా ఒక పల్లవ ఆశ్వికుడు అతనిని హేళనము చేసెనట. అంతట మయూరశర్మ క్షాత్రపథ మవలంబించి పల్లవుల నోడించి క్రీ. శ. 345 ప్రాంతమున రాజ్యము స్థాపించెను, వైజయంతి లేక వనవాసి కదంబుల రాజధాని. సుమారు 2½ శతాబ్దులు ఈ వంశపురాజులు పాలించిన తరువాత వాతాపి (బాదామి) చాళుక్యులు వారి రాజ్యమును వశపరచుకొనిరి.

వాకాటకులు : క్రీ. శ. మూడవ శతాబ్దాంతములో వాకాటకులను వారు మధ్యప్రదేశములో స్వతంత్రులైరి. ప్రస్తుత బీరారులో వారి రాజధాని యుండెడిది. రాజ్య స్థాపకుడు వింధ్యశక్తి అనువాడు. పద్మావతిని రాజధానిగా చేసికొని మధ్య భారతములో పాలించిన భార శివనాగులకు వీరు బంధువులు, వైదిక మతాభిమానులు. గుప్త చక్రవర్తులతోను, విష్ణుకుండి నులతోను, కదంబులతోను వివాహ సంబంధములు చేసికొని వీరు తమ రాజ్యమును బలపరచుకొనిరి. గుప్తులతో కలిసి శకుల నోడించిరి. వైదిక మత పునరుద్ధరణమునకు సంస్కృత భాషాభివృద్ధికి గుప్తులకు మార్గదర్శకులయిరి. ప్రవర సేనుడు అను రాజు విష్ణుభక్తుడు. ఇతడు సేతుబంధమను ప్రాకృత కావ్యమును రచించెను. అజంతా గుహాలయము లందలి చిత్రలేఖనములలో వాకాటకులు ప్రతిభయు, కళాభివృద్ధికి వారొసగిన ప్రోత్సాహమును కనబడును. తుదకు బాదామీ చాళుక్యులు వారి పతనమునకు కారకులయిరి.

కాళింగులు  : గంగా మహానదులకు మధ్యగత మయిన దేశము ఉత్కళము. అందలి జనులు ఉత్కళులు, మహానదీ గోదావరుల మధ్యదేశము కళింగదేశము. అందలి జనులు కాళింగులు. మహాభారత యుద్ధమున ఉత్కళులు పాండవులకు సాయము చేయగా కాళింగులు కౌరవులకు తోడుపడిరి. సముద్రగుప్తుని దండయాత్రానంతరము కళింగమును మాఠరవంశజులు, వాసిష్ఠీ వంశజులు, తరువాత గాంగవంశజులు పాలించిరి. కాళింగులు నేర్పరులయిన . నావికులు. వారు దూరద్వీపములందు వలస లేర్పరచి తమ వైదిక, బౌద్ధమతములను, నాగరకతను, శిల్పమును తమతో గొనిపోయి వ్యాపింప జేసిరి.

ఆంధ్రదేశమున ఆంధ్రశాతవాహన సామ్రాజ్యము క్షీణించిన తరువాత పెక్కు చిన్న చిన్న రాజ్యములు తలలెత్తినవి. అనేక రాజవంశములు పాలించినవి. మరల తూర్పు చాళుక్యుల ఆధిపత్యమున ఆంధ్రదేశమునకు ఏకత్వము, స్థిరత్వము ఏర్పడెను.

వై. వి. ఆర్.

[[వర్గం:]]