సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మొదటి సంపుటము/ఆంధ్రబ్యాంకు చరిత్ర
ఆంధ్రబ్యాంకు చరిత్ర : ప్రతిదేశపు ఆర్థికవ్యవస్థ యందు అందలి బ్యాంకింగ్ సంస్థలు నిర్వహించవలసిన పాత్ర మిగుల ప్రముఖమైనది. ఆర్థికముగా ముందుకు వచ్చిన దేశముల యొక్క పరిస్థితులను గమనించిన వారు ఉత్తమమైన బ్యాంకింగ్ విధానము ఆర్థికాభ్యుదయమునకును వర్తక వాణిజ్యముల పెంపుదలకును పరమావశ్యకమను విషయమును విస్మరింపజాలరు.
ఆంధ్ర బ్యాంకు నేటి ఆంధ్రదేశపు ఆర్థిక జీవితమునను, వర్తక వాణిజ్యములందును ప్రాముఖ్యముగల సంస్థ. ఈసంస్థను స్థాపింపవలయునను సంకల్పము దీనిస్థాపకులును ఆంధ్రనాయకులును అగు డాక్టర్ పట్టాభి సీతారామయ్య గారికి 1923వ. సం॥ సెప్టెంబరులో కలిగినది. అదే సంవత్సరము నవంబరు 20 వ తేదీని బందరులో ఆంధ్రబ్యాంకు పని ప్రారంభించినది. 1929 నవంబరు నెలలో కాకినాడపట్టణమునందు మొదటి శాఖను తెరచినది. 25 సం.లు జయప్రదముగా వ్యవహరించి నిండుగర్వముతో 1948వ సంవత్సరమున రజతోత్సవము జరుపుకొన్నది. ఇది ఆంధ్రబ్యాంకు యొక్క సంక్షి ప్తగాథ.
"పెద్ద నదులు ప్రారంభములో చిన్నవిగా నుండును" అను సామెత ఈ సంస్థకును వర్తించును. అదేవిధముగా ఈ సంస్థయు కొలది పెట్టుబడితో ప్రారంభమై క్రమక్రమముగా పెద్దదై, నేడు ఆంధ్రదేశములోను వెలువలను పెక్కు శాఖలతో అలరారుచున్నది.
సంస్థాపనోద్దేశములు : "ఆంధ్రులచే నిర్వహింపబడి ఆంధ్రులకు ముఖ్యముగా ఉపయుక్తము కాగలుగుచు విపులమైన వ్యాపారమునకు నిలయమై ఉండెడు ఒక కమర్షియల్ క్రెడిట్ సంస్థను స్థాపించవలెనను ఆశయముతో నిది ఉద్భవించినట్లు ఈ బ్యాంకు సంస్థాపకులగు డాక్టర్ పట్టాభిగారు చెప్పియుండిరి. ప్రస్తుత మేనేజింగ్ డైరక్టరు అగు శ్రీ తాడేపల్లి శ్రీరాములుగారి మాటలలో ఈ సంస్థ యొక్క ఆశయములు : - (i) దేశములోని ఆర్థికబలమును సమీకరించి వాణిజ్య పరుల అవసరాలకు సహకరించుట.
(ii) వ్యవసాయదారులకు అల్పవ్యవధి ఋణములు ఒసగుట.
(ii) పరిశ్రమల అభివృద్ధికి పెట్టుబడులను ఒసగి చేయూతగా నుండుట.
నిర్వహణములో కల్గిన కష్టములు : ఈ 33 సం. ల కాలము అనగా 1923 నుండి 1956 వరకు గల కాలములో ఈ సంస్థ నిర్వహణమునందు పెక్కు చిక్కులు కల్గినవి. ఇది సాధారణ కాలము కాదు. ఆర్థిక మాంద్యము మొదలు ద్రవ్యోల్బణమువరకు వివిధ ఆర్థిక పరిస్థితులును, ఒక మహాయుద్ధము, దేశములో రాజకీయ సంక్షోభము మ్మొదలు స్వాతంత్య్ర ప్రధానమువరకు గల రాజకీయ సంఘటనములును సంభవించిన సమయము.
1923 లో ఈబ్యాంకు స్థాపింపబడునప్పటికి ఆంధ్ర దేశ పరిస్థితులు ఇందులకు అనుకూలముగా లేవు. ప్రజలు బ్యాంకింగ్ యొక్క ఉపయోగమును ప్రాముఖ్యమును గుర్తింపలేదు. డాక్టరు పట్టాభిగారు మొదట ఈ సూచన చేసినపుడు 'ఎవరుగాని తగినంత పెద్ద మొత్తములు విరాళము లిచ్చుటకు సాహసింపకపోవుటవలన కొంత నిరుత్సాహము కలిగినది. కాని వారి మిత్రులగు తాడేపల్లి సుబ్బారావుగారు, ఉదయగిరి గోపాలరత్నంగారు, మొదలగు వారిచ్చిన తోడ్పాటువలన ఈ సంస్థ 1920 వ సం. నవంబరు 20 న రిజిస్టరు కాగలిగినను, అనేక బాలారిష్టముల నెదుర్కొనవలసివచ్చినది. ఇంపీరియల్ బ్యాంకుకు అప్పుడుగల యూరోపియన్ ఏజంటు వ్యతిరేక ప్రచారము, ఆ బ్యాంకు హెడ్డాఫీసువారు ఓవర్ డ్రాఫ్టు ఇచ్చుటకు నిరాకరించుట, ఇందుల కుదాహరణములు. ఆతర్వాత 7 సంవత్సరములకే ప్రపంచము నావహించిన ఆర్థికమాంద్యము, 1935 లో ట్రావెన్కూరు నేషనల్ అండ్ క్విలన్ బ్యాంకు పతనము, 1942 లో యుద్ధ కాలమున జపానుదాడులు గూర్చిన ప్రజల భయములు, ఇవన్నియు బ్యాంకు అభివృద్ధి కార్యక్రమములపై ఒత్తిడి కలుగ జేసినవి. కాని అదృష్టవశమున ఆ దుమారములకు ఈ సంస్థ తట్టుకొనజాలినది. అనేక పర్యాయములు విస్తరణ కార్యములను వాయిదా వేయవలసివచ్చినది. ఉదాహరణకు 1934 లో రిజర్వుబ్యాంకు సంస్థాపనము నిశ్చయింపబడెను. కాని అందు షెడ్యూలు బ్యాంకుగా చేరు అర్హతయుండుటకు వసూలయిన మూలధనము విలువలు కలసి కనీసము 5 లక్షల రూపాయ లుండవలెను. మూలధనము పెంపుదలకు బ్యాంకు చేసిన ప్రయత్నము ఫలింపక ఆ ప్రయత్నమును వాయిదా వేయవలసివచ్చినది. కాని 1943 లో ఆ యాశయము నెరవేరి రిజర్వు బ్యాంకు ఆక్టు రెండవ షెడ్యూలులో ఈ బ్యాంకు పేరు నమోదు చేయబడెను. దేశములో ప్రారంభమైన ద్రవ్యోల్బణముకూడ ఈ బ్యాంకు అభివృద్ధికి తోడ్పడెను. 1944 నాటికి ఇందలి డిపాజిట్లు ఒక కోటిరూపాయలకు పెరిగెను. శాఖలు కూడ స్థిరముగ అభివృద్ధి చూపదొడగినవి. అయితే, కొన్ని మాత్రము లాభసాటిగా లేనివి మూసి వేయవలసి వచ్చెను. ఉదాహరణమునకు ఈ బ్యాంకి రెండవశాఖ హైదరాబాదులో 1930 లో తెరువబడినను, అది లాభసాటిగా లేనందున 1940 లో మూసి వేయవలసివచ్చెను.
విజయకారణములు : ఇంతవరకు ఈ సంస్థ ఆశయములను దీని నిర్వహణమునం దుద్భవించిన సమస్యలను పరిశీలించితిమి. కాని ఈ సంస్థ బాలారిష్టములను జయప్రదముగా ఎదుర్కొనుటకుగల కారణములను పేర్కొనవలసి యున్నది.
అందులకు మొదటికారణము ఈసంస్థ కేవలము కొందరి వ్యక్తులకై కాక ఆంధ్రదేశ ఆర్థిక స్వయంపోషకత్వ కార్యక్రమములో ఒక అంగముగా ఉన్న తాశయములతో నుద్భవించుట. ఐతే కేవలము ఉన్నతాశయములవల్ల ఏసంస్థయు వర్ధిల్లదు. ఉన్నతాశయములతోపాటు దూర దృష్టి, సామర్థ్యము కావలయును. ఈసంస్థకు 7 సంవత్సరములు మేనేజింగ్ డైరక్టరుగా, డైరక్టరుగా పనిచేసిన డా. పట్టాభిగారు మితవ్యయము, జాగరూకత అను విధానములకు పునాదులు వైచిరి. ఉదాహరణమునకు ప్రారంభమున సంవత్సరమునకు ఒకటికంటె ఎక్కువ శాఖలు తెరువకుండను, అదికూడ అంతకు పూర్వము తెరచినది లాభసాటిగా నడుచుచున్నట్లు తెలిసిన పిమ్మటనే మరియొకశాఖ తెరచునట్లును తగిన జాగ్రత తీసికొనబడినది. అంతేగాక ఈసంస్థ నిర్వహణబాధ్యత వహించిన శ్రీయుతులు డి. యస్. శాస్త్రి, కె. సుబ్బారావు, వారణాసి కృష్ణమూర్తి, ఇ. రామచంద్రమూర్తి మొదలగు నిపుణుల కృషికూడ ఈసంస్థ యొక్క విజయమునకు మరొక హేతువు. ఆంధ్రదేశములోని వివిధరంగములకు చెందిన ప్రముఖులు డైరక్టర్, మేనేజింగ్ డైరక్టర్, చైర్మన్ మొదలగు పదవులను అలంకరించి, ఈ సంస్థ అభివృద్ధికి దోహదము చేసిరి. ఈ సంస్థ వాటాదార్లకు ప్రతి సంవత్సరము లాభములు పంచుట, ఇందలి షేర్లు ఏ కొద్దియోతప్ప దళారీల చేతులలో లేకుండుట, ముఖ్యముగా బ్యాంకింగ్ సూత్రములు శ్రద్ధాసక్తులతో పాటింప బడుటకూడ ముదావహములైన విషయములు.
డా. ఆర్. వి. రా.
[[వర్గం:]]