సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మొదటి సంపుటము/ఆంధ్రప్రదేశము II
ఆంధ్రప్రదేశము II (తెలంగాణము): తెలంగాణములో 9 జిల్లా లున్నవి. అవి ఆదిలాబాదు (9,02,522 మంది), నిజామాబాదు (7,73,158 మంది), మెదక్ (10,27,293 మంది), కరీంనగరు (14,28,168 మంది), వరంగల్లు (13,25,984 మంది), నల్లగొండ (12,52,810 మంది), ఖమ్మం (7,00,006 మంది), హైదరాబాదు (15,11,336 మంది), మహబూబునగరు (11,86,496 మంది). తెలంగాణ వైశాల్యము 43,282 చ.మై.
తెలంగాణ ప్రాంతము దక్కను పీఠభూమిలో వ్యాపించియున్నది. సరాసరిని 1500 అ. ఎత్తు కలిగి తూర్పునకు వాలియున్న పీఠభూమి ప్రాంతము, పశ్చిమమున నున్న పర్వతములు తెలంగాణములోనికి చొచ్చుకొని వచ్చినవి. ఇవి 3000 అ. కంటే తక్కువ ఎత్తుగల చిన్న పంక్తులు. ఆదిలాబాదు జిల్లాలో సాత్మలా, నిర్మలా పంక్తులు, నిజామాబాదులో సిర్నపల్లి పంక్తులు, మహబూబునగరు జిల్లాలో షహబాదు, అమరాబాదు కొండలు, నల్లగొండ జిల్లాలో దేవరకొండ, భువనగిరి కొండలు కలవు. హైదరాబాదు జిల్లానుండి పాకాల కొండల వరకు, అక్కడినుండి ఆగ్నేయదిశగా ఖమ్మం జిల్లా మధ్యగా వ్యాపించిన గోలకొండ జలగ్రహ క్షేత్రము (Water shed) అని పిలువబడు ఎత్తైన ప్రదేశము గోదావరీ కృష్ణా జలములను వేరుచేయుచున్నది. దీని కుత్తరముననున్న భూతలము తూర్పు ఈశాన్యములకు వంగి యున్నది. దక్షిణమున నున్న భూతలము ఆగ్నేయముగా వంగియున్నది. తూర్పుననున్న గోదావరితీరము ఎత్తు 200 అ. కంటే తక్కువ. ఆదిలాబాదు, నిజామాబాదు, కరీంనగరు, మెదకు జిల్లాలు గోదావరి పరీవాహక ప్రదేశములోను, మిగిలిన అయిదు జిల్లాలు కృష్ణా పరీవాహక ప్రదేశములో నున్నవి. మంజీర, మానేరు, కడం, పెనుగంగ, ప్రాణహితనదులు గోదావరికిని; దిండి, పెద్ద వాగు, మూసి, పాలేరు, మునేరు, వైరా నదులు కృష్ణకును ముఖ్యమయిన ఉపనదులు.
శీతోష్ణస్థితి : వర్షపాతము : తెలంగాణప్రాంతము ఉత్తరార్ధగోళపు ఉష్ణమండలములో ఉండుటచే ఎక్కువ వేడిగా ఉండును. కాని ఈభూభాగము 1200 అడుగులు పైన ఎత్తుగా నుండుటచే దీని ఉష్ణోగ్రతలు కోస్తా ఆంధ్రప్రాంతముకంటె భిన్నముగా నుండును. తక్కిన ఆంధ్రదేశములో వలెనే ఇక్కడకూడ నాలుగు ఋతువులు కన్పట్టును. (1) మార్చినుండి మే నెలవరకు మిక్కిలి వేడిగా నుండు వేసవి, (2) జూను నుండి సెప్టెంబరు నెలవరకు వర్ష కాలము, (3) అక్టోబరు నవంబరు నెలలు శరదృతువు, (4) డిశంబరునుండి ఫిబ్రవరివరకు శీతకాలము,
మార్చి, ఏప్రిలు నెలలలో ఉష్ణము 100° ఫా.ప్రాంతమువరకు పెరుగును. ఏప్రిలు నెలలో, ఈశాన్యమున ముఖ్యముగా రామగుండమువద్ద, సరాసరి అధికోష్ణము 105° ఫా. ప్రాంతమున నుండును. అదేకాలములో హైద్రాబాదులో సరాసరి అల్పోష్ణోగ్రత 75° ఫా. మే నెలలో సూర్యుడు నెత్తిమీద నుండుటచే మిక్కిలి వేడిగా నుండును. ఈ నెలలో రామగుండమువద్ద సరాసరి అధికోష్ణము 111° ఫా. వరకు పెరుగును. ఖమ్మము మెట్టువద్ద వేడి 120° ఫా. వరకు కూడ ఉండును. వేసవిలో మొ త్తముమీద, దక్షిణ జిల్లాలలో 83° ఫా. ఉత్తర జిల్లాలలో 99° ఫా. కు తక్కువ ఎప్పుడును ఉండదు.
జూను నెలలో అన్ని జిల్లాలలోను ఉష్ణము తగ్గును. ఈ నెలలోనే ఋతుపవనములు ప్రారంభమగును, కాని వర్షములేక ఆకాశము నిర్మలముగానున్న రోజులలో ఉష్ణము, ఖమ్మము మెట్టువంటి పల్లపు ప్రాంతములలో 102° ఫా. వరకుకూడ ఉండును. జూలై, ఆగస్టు నెలలలో వేడి క్రమేపి తగ్గును. కాని సెప్టెంబరులో తిరిగి కొద్దిగా పెరుగును.
అక్టోబరు, నవంబరు నెలలు శరదృతువు. ఈ కాలములో ఆగ్నేయ ఋతుపవనములు వీచుట మానివేయును. అక్కడక్కడ కొద్దిగా వర్షములు పడును. ఉష్ణోగ్రత పశ్చిమప్రాంతములందు కంటే తూర్పు ప్రాంతములందు కొద్దిగా ఎక్కువగా నుండును,
డిశెంబరునుండి ఫిబ్రవరివరకు శీతకాలము. ఈ కాలములో తెలంగాణమంతయు చలిగాను, పొడిగాను ఉండును. డిశెంబరు ఆఖరిరోజులు మిక్కిలి చలిగానుండు కాలము. రాత్రిళ్ళు చలి ఎక్కువగా నున్నను పగలు మాత్రము సమశీతలముగా నుండి హాయిగా నుండును. గోదావరీ మండలములో 86° ఫా. లకును, కృష్ణా మండలములో 93° ఫా. లకును ఉష్ణము మించదు. ఫిబ్రవరి నెలనాటికి క్రమముగా వేడి ఎక్కువగును.
సముద్రమునకు దూరముగా ఖండాంతరమున నుండుటచే దైనిక ఉష్ణోగ్రతల హెచ్చుతగ్గులు ఎక్కువగా నుండును. దినములో అధిక అల్పోష్ణోగ్రతల మధ్య వ్యత్యాసము దక్షిణప్రాంతములలో 20°. ఫా. వరకును, ఈశాన్య ప్రాంతములలో 30° ఫా. వరకును ఉండును. తెలంగాణము ఉష్ణమండలములో నుండుటచే సంవత్సరమునకు 8, 9 మాసములు వేడిగానుండును. అందుచే ఈ ప్రాంతమున వాయుమండలము పల్చగానుండి ఒత్తిడి తక్కువగానుండును. శీతకాలములో నీమండలము, ఉత్తర హిందూస్థామునకంటే వెచ్చగా నుండును. అందుచే ఉత్తర హిందూస్థానములో ఎక్కువగాను, తెలంగాణములో అంతకంటె తక్కువగాను 30 అంగుళములవరకును వాయుపీడనము ఉండును. తెలంగాణములో ప్రాంతీయ పీడనము ఆగ్నేయమునుండి ఈశాన్యముదిశలో ఎక్కువగా నుండును. అందుచే గంటకు 5 మైళ్ళలోపు వేగముతో చిన్నగాలులు ఎప్పుడును ఈశాన్యమునుండియు, తూర్చు నుండియు, తెలంగాణపు ఆగ్నేయభాగమునకు వీచును. వర్ష కాలములో నీ పరిస్థితులు తలక్రిందు లగును. ఈ కాలములో గాలులు ఋతుపవనముల ప్రాబల్యమువలన బలముగా వీచును. సామాన్యముగా వీటి వేగము గంటకు 15, 20 మైళ్ళవరకు ఉండును. వేసవిలో అధిక పీడన మండలము అంతముకాగా, అల్పపీడన మండలము ప్రారంభదశలో నుండుటవలన దేశమంతటను వాయుపీడనములో వ్యత్యాసములు చాల తక్కువగా నుండి గాలులు వీచవు.
గోదావరీనదీ ప్రాంతములలో సంవత్సరమునకు 40 అం. కృష్ణానదీ ప్రాంతములలో ముఖ్యముగా మహబూబ్ నగరుజిల్లా పశ్చిమభాగమున, 20 అం. వర్షము పడును. ఎక్కువ వేడిగాను, తేమగాను ఉండుటయు, బంగాళాఖాతమునుండి వచ్చు తుఫానుగాలులు గోదావరి లోయలగుండా నీ ప్రాంతమునకు వ్యాపించుటవలన ఉత్తరమున వర్ష మెక్కువ. 30 అం. కు పైన వర్షము పడు ఉత్తరభాగములను, అంతకంటే తక్కువ వర్షము పడు దక్షిణభాగములను గోలకొండ జలగ్రహ క్షేత్రము (Water shed) వేరుచేయుచున్నది. ఉత్తరమున అధిక వర్షము జులై నెలలోను, దక్షిణమునను, పశ్చిమమున అధిక వర్షము సెప్టెంబరులోను పడును.
శీతోష్ణస్థితులనుబట్టియు, నై సర్గిక స్వరూపమును బట్టియు తెలంగాణమును రెండుగా విడదీయవచ్చునని పైన పేర్కొన్న విషయములవలన విశదమగును. (1) ఉత్తర, ఈశాన్య ప్రాంతములు ముఖ్యముగా గోదావరీనదీ పరిసరములు, (2) దక్షిణ, ఆగ్నేయ ప్రాంతములు ముఖ్యముగా కృష్ణానదీ పరిసరములు.
మొదటి విభాగములో, 40 నుండి 45 అం. వర్షము పడును. ఇక్కడ అడవులు ఎక్కువ. వరి సాగు ఎక్కువగా జరుగును. అడవులు నిర్మూలించబడుటవలనను, వర్షపాత మెక్కువగా నుండుటవలనను ఈ భాగమున నేలలో సారము చాలవరకు క్షీణించినది. ఇక్కడ ఖరీఫ్ పంట ప్రధానమయినది. రెండవ విభాగములో రబ్బీ పంట ప్రధానము.
నల్ల రేగడి నేలలు, ఎర్ర నేలలు, ఇసుక నేలలు, తెలంగాణములో కనుపించు ముఖ్యమయిన నేలలు. హైదరాబాదులో పశ్చిమజిల్లాలనుండి నదులవలన తేబడిన నల్ల రేగడి మట్టి కృష్ణా గోదావరీతీరములందు ఇరుప్రక్కలను కనుపించును. ఈ నేలలు, వృక్షజాలమునకు కావలసిన ఖనిజములను కలిగి ఎక్కువసారవంతమయినవి. ఇంతకంటె తక్కువ సారవంతమయిన నేలలు తెలంగాణము పశ్చిమ సరిహద్దులోను, ఆదిలాబాదు జిల్లా ఉత్తర సరిహద్దులలోను ఉన్నవి. నల్ల రేగడి నేలలు చాల సారవంతమగుటవలన ప్రత్తి, గోధుమ విరివిగా పండును. సాగుచేయుటకు వీలున్నచోట్ల వరి, చెరకుకూడ పండును. మిక్కిలి ఎరుపు నుండి గోధుమరంగువరకు మార్పులు గల ఎర్రనేలలు, మెదక్, నిజామాబాదు జిల్లాలలో కలవు. పండ్లతోటలకు, నూనెగింజలను, అపరాలను పండించుటకు చాల తగినవి. ఆదిలాబాదు జిల్లా దక్షిణ ప్రాంతములోను, నిజామాబాదులో చాల భాగములోను, కరీంనగరు, మెదకు, నల్లగొండ, వరంగల్లు, ఖమ్మం, హైదరాబాదు, మహబూబ్ నగరు జిల్లాలలోను ఇసుక నేలలు ఎక్కువ. ఇవి చాల తక్కువ సారవంతమైనవి.
వృక్షజాలము : తెలంగాణములో సహజముగా పెరుగునవి ఉష్ణమండల అరణ్యాలు, చిట్టడవులు, ముండ్లపొదలు గడ్డిమైదానములు. వర్షపాతము ఎక్కువగనున్న తూర్పు భాగములో అరణ్యములు కనుపించును. కాని పశ్చిమముగా పోయినకొలది, ఎత్తయి, వర్షపాతము ఎక్కువగా నున్న ప్రాంతములలో తప్పితే, ముండ్లపొదలు, గడ్డి కనిపించును. ఆదిలాబాదు, కరీంనగరు, మహబూబునగరు, వరంగల్లు, ఖమ్మం, నిజామాబాదు జిల్లాలలో అడవులు సహజముగా ఎక్కువ. గోదావరి కృష్ణాతీరములలో తుమ్మచెట్లు ఎక్కువ. వరంగల్లు జిల్లాలోని ములుగు, నరసంపేట, ఆదిలాబాదు జిల్లాలోని మహాదేవపూరు, కరీంనగర్ జిల్లాలోని మాననూరు, మహబూబ్ నగరుజిల్లాలోని అమరాబాదు తాలూకాలలో, వేసవిలో ఆకులు రాల్చు జాతిచెట్లతో నిండిన అడవులు కలవు. ఈ అరణ్యములలో చెట్లు రమారమి 50 అడుగుల ఎత్తువరకు పెరుగును. గంధపుచెట్లు, టేకు, నల్లమద్ది మొదలగు ఉపయోగకర మయిన చెట్లు ఈ అడవులలో పెరుగును. హైదరాబాదు, మహబూబునగరు, నల్లగొండ, మెదక్ జిల్లాలలో చెదరు చెదరుగా నున్న చెట్లతోను, పొదలతోను, సీతాఫలము, తాడి మొదలగువానితోను కూడిన చిట్టడవులు పెరుగును. వర్షము బాగుగా తక్కువగా నున్న చోట్లయందును కొండ వాలులలోను గడ్డి పెరుగును. దీనిలో వాసనగల గడ్డి రకములుకూడ కలవు. ఆదిలాబాదు, నిజామాబాదు జిల్లాలలో పెరిగెడు గడ్డియే కాగితములు తయారుచేయుటకు చాల తగినది. వరంగల్లు, ఆదిలాబాదు జిల్లాలలోని అడవులలో నుండి టేకు ఎక్కువగా లభించుచున్నది.
నీటిపారుదల, వ్యవసాయము : తెలంగాణమున మొత్తముమీద సంవత్సరమునకు 33 అం. వర్షము పడునని చెప్పవచ్చును. ఈ వర్షము తూర్పుప్రాంతములలో ఎక్కువగాను, పశ్చిమ ప్రాంతములలో తక్కువగాను ఉన్నది. వర్షపాతము తక్కువగుటచే పంటభూములు సాగుచేయవలసిన అవసర మున్నది. పెద్ద నూతుల, చెరువుల సహాయముతో భూములను సాగుచేయుట తెలంగాణములో గమనించవలసిన విశేషము. ఆంధ్రదేశపు తీర
ప్రాంతములతో సరిపోల్చినచో తెలంగాణములో కాలువలు లేవని చెప్పవచ్చును. 700 సంవత్సరముల పురాతనమయిన పాకాల సరస్సు చాల పెద్దది. మునేరునదికి 4000 అ. పొడవున వేసిన అడ్డకట్టవలన నిది ఏర్పడినది. దీనిలోతు 50 అ. పరిమాణము 325 కోట్ల ఘనపు టడుగులు. హైదరాబాదు సికింద్రాబాదుల మధ్యనున్న హుస్సేనుసాగరు చెరువు 400 సంవత్సముల పూర్వము నిర్మింపబడినది. దీని కట్టపొడవు 7000. అ., లోతు 75 అ. పరిమాణము 290 కోట్ల ఘనపు టడుగులు. 50 అ. లోతు కలిగిన రామప్ప చెరువు 120 కోట్ల ఘ, అ. పరిమాణము కలది. 50 అ. లోతుకలిగిన లక్నవరం చెరువుకూడ ప్రసిద్ధమయిన పురాతన తటాకము. ఈ చెరువులవలన వేలకొలది ఎకరములు సాగుచేయబడు చున్నవి.
నీటిపారుదలకు, విద్యుచ్ఛక్తికి ఉపయోగపడు నదీ ప్రాజెక్టులు తెలంగాణములో చాల కలవు.
ఉస్మాన్ సాగరు, హిమాయత్ సాగరు సరస్సులు హైదరాబాదు, సికిందరాబాదు నగరములకు నీటిని సప్లయి చేయుటకు ఉపయోగించుచున్నవి.
మంజీరనదికి కట్టబడిన ఘనపురం ఆనకట్టవలన సుమారు 25 వేల ఎకరములు సాగు అగుచున్నవి. ఆలేరు నదికి కట్టబడిన పోచవరం ఆనకట్టవలన 13 వేల ఎకరములు, మహబూబునగరు జిల్లాలోని దిండి ప్రాజెక్టు వలన 39 వేల ఎకరములు సాగుచేయబడుచున్నవి. కామా రెడ్డి పట్టణమునకు 18 మై. దూరములో మానేరు నదిపై నిర్మింపబడ్డ చెరువువలన 12 వేల ఎకరములు సాగుచేయుటకు, 1000 కిలో వాట్ల విద్యుచ్ఛక్తి తయారుచేయుటకు వీలున్నది. 15 చ. మై. వైశాల్యము, 3000 కోట్ల ఘనపు టడుగుల పరిమాణము, 100 అడుగుల లోతు కలిగిన నిజాముసాగరు చెరువు, మంజీరనదికి అడ్డముగా 2 మై. పొడవున కట్టబడిన అడ్డకట్టవలన ఏర్పడినది. దీని వలన 6 లక్షల ఎకరములు సాగు అగుచున్నవి. 3,000 నుండి 11,000 కిలోవాట్ల విద్యుచ్ఛక్తి తయారు అగును.
17 వేల ఎకరములు సాగుబడి చేయు, వరంగల్లులోని వైరా ప్రాజక్టు, సుమారు 20 వేల ఎకరములు సాగు చేయుటకు వీలగు పాలేరు ప్రాజక్టు, చెప్పదగినవి. ఇవి గాక తుంగభద్ర, నాగార్జునసాగరు ప్రాజెక్టుల వలన తెలంగాణమునకు నీరు, విద్యుచ్ఛక్తి విస్తారముగా లభించును.
తెలంగాణములో పంటక్రింద నున్న భూమి ఈ విధముగా నున్నది.
లక్షల ఎకరములు | |
---|---|
వ్యవసాయము క్రింద నున్నది. | 116.85 |
నీటిపారుదల వసతులు గలది. | 16.67 |
వ్యవసాయమునకు అనువైనను ఖాళీగా నుండిపోయినది. | 10.06 |
బంజరుభూమి | 36.44 |
సాగులోనికి తీసికొని రాతగినది. | 20.40 |
పైన చెప్పిన భూములలోని పంటలు ఈ క్రింది విధముగా నున్నవి.
లక్షల టన్నులు | |
---|---|
ధాన్యము | 11.15 |
అపరాలు | 1.57 |
చెరకు | 1.76 |
ఆముదము | 0.51 |
వేరుసెనగ | 2.42 |
మిరపకాయలు | 0.15 |
ఉల్లి | 0.37 |
పొగాకు | 8500 టన్నులు |
ప్రత్తి | 39,000 బేళ్లు |
ఖనిజసంపద :- (ఆంధ్ర దేశపు ఖనిజసంపద చూడుము).
పరిశ్రమలు :- సింగరేణి మొదలగు గోదావరిలోయ బొగ్గుగనులు కారణముగా, తెలంగాణములో పరిశ్రమలు నెమ్మదిగా నభివృద్ధి చెందినవి. ప్రాంతీయముగా కావలసిన వస్తువులు తయారుచేయు భారీపరిశ్రమలు, గృహ పరిశ్రమలు చాలకలవు. వీటిలో ముఖ్యమయినవి ఈ క్రిందివి :
హైద్రాబాదులోని డి. వి. ఆర్. మిల్లులోను, వరంగల్లులోని అజంజాహి మిల్లులోను నూలు ఉత్పత్తి యగు చున్నది. ఇది కాక వస్త్రములు కూడ నేయుమిల్లు హైద్రాబాదులో నొకటి యున్నది.
సిర్ పూర్ లో కృత్రిమపు సిల్కు తయారుచేయు ఫ్యాక్టరీ కలదు. దీనిలో రోజునకు 5 టన్నుల రయాను తయారు అగును. దీనితో రమారమి 50,000 గజముల సిల్కు దారము తీయబడును.
బోధనులోనున్న నిజాము పంచదార ప్యాక్టరీలో 2,40,000 రూపాయలు విలువగలిగిన 21,000 టన్నుల పంచదార సాలీనా తయారగుచున్నది. ఈ ఫ్యాక్టరీలో నుపయోగించగా మిగిలిన చెరకుపంట ఇతరరాష్ట్రములకు ఎగుమతి చేయబడు చున్నది. ఈ ఫ్యాక్టరీలోనే సంవత్సరమునకు 5 లక్షలగాలన్ల సారాయికూడ తయారగును.ఇది యంత్రములు నడుపుట కుపయోగించు ప్రత్యేకమైన సారాయి.
హైదరాబాదులో నున్న కోహినూర్, తాజ్ గ్లాసు ఫ్యాక్టరీలలో గాజుసామానులు తయారగును.
ఆస్బెస్టాసు తయారుచేయు హైదరాబాదు ఆస్బెస్టాసు సీమెంటు ప్రోడక్టు ఫ్యాక్టరీ హైదరాబాదులో నున్నది.
సిరుపూరులో కాగితములు తయారుచేయు ఫ్యాక్టరీ యున్నది. దీనిలో సాలీనా 6,000 టన్నుల కాగితములు తయారగును.
హైదరాబాదులోని చార్మినార్ సిగరెట్టు కంపెనీ తెలంగాణములో ముఖ్యమయినది. దీనిలో రోజుకు 40 లక్షల సిగరెట్లు తయారగును. వజీర్ సుల్తాను సిగరెట్టు కంపెనీ మరియొక ముఖ్యమైన ఫ్యాక్టరీ.
నేత పరిశ్రమ తెలంగాణములో ముఖ్యమయిన గృహ పరిశ్రమ, ఇందుకు కావలసిన ప్రత్తి, నూలు ఇతర ప్రాంతముల నుండి వచ్చినను తెలంగాణములో నేత పరిశ్రమ చాల అభివృద్ధి చెందినది.ఈ పరిశ్రమకు ముఖ్యమయిన జిల్లా లగు నిజామాబాదు, నల్లగొండ, మహబూబునగరు, వరంగల్లులలో సుప్రసిద్ధమైన ఉన్నికంబళ్ళు నేయబడును. వీటిని దేశములో నితరప్రాంతములకు ఎగుమతి చేయుదురు.
ఆటవస్తువులు, ఇతరములయిన కళాప్రాధాన్యమైన వస్తువులు తయారుచేయుటలో దేశమునందంతటను ప్రసిద్ధి గాంచినది నిర్మలపట్టణము. హైదరాబాదులో అనేకము బత్తాము ఫ్యాక్టరీలు ; బెల్లంపల్లి, ఆజమాబాదు పట్టణములలో రసాయనపదార్థములు చేయు ఫ్యాక్టరీలుక లవు . ఇవిగాక పింగాణి, తదితరవస్తువులు చేయు ఫాక్టరీలు తెలంగాణములో నున్నవి. హైద్రాబాదు ఆల్విన్ మెటల్ వర్క్సు, ప్రాగాటూల్సు కార్పొరేషనులలో ఇనువసామానులు, యంత్రపరికరములు, మొదలగునవి తయారుచేయబడు చున్నవి.
ముఖ్యమయిన పారిశ్రామికోత్పత్తి, ఈక్రింద నీయబడినది. నూలువస్త్రములు 415.20 లక్షల గజములు: నూలు 138.26 లక్షల పౌనులు (తూకము); సిల్కు గుడ్డ 9.39 లక్షల గజములు; సిల్కు దారము 25.78 లక్షల పౌనులు (తూకము), పంచదార 61 వేల టన్నులు; కాగితము 2.68 లక్షల హండ్రడు వెయిటులు; సిగరెట్లు 473.7 కోట్లు; సారాయి 3.67 లక్షల గాలన్లు. ఇవిగాక 15.28 లక్షల టన్నుల బొగ్గు, 68.3 మిలియన్ల వాట్లు విద్యుచ్ఛక్తి 39.700 టన్నుల ముడి ఇనుముకూడ ఉత్పత్తి యగుచున్నది.
జి. స.
[[వర్గం:]]