సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మొదటి సంపుటము/ఆంధ్రప్రదేశము : I
ఆంధ్రప్రదేశము : I ఆంధ్ర : ఆంధ్ర దేశము 14° మొదలు 20° డిగ్రీలు ఉత్తర అక్షాంశములమధ్యను, 77° మొదలు 85° డిగ్రీలు తూర్పు రేఖాంశములమధ్యను వ్యాపించి ఉన్నది. ఇంతకుపూర్వము మదరాసు రాష్ట్రములో ఉండి, 1953 లో ప్రత్యేక ఆంధ్రరాష్ట్రముగా ఏర్పాటు కాబడిన నూతనాంధ్ర దేశము 63,417 చ. మైళ్ల వైశాల్యముతోను, 20,507,801 జనాభాతోను నిండి ఉన్నవి. వైదామ్ కొలత ననుసరించి ఇది మధ్యరకపు వైశాల్యముగల భూభాగము అగును.
ఉనికి, సహజస్థితి, భూ విభాగము : ఆంధ్ర దేశము హిందూస్థానము యొక్క దక్షిణ ప్రాంతము యొక్క మధ్య భాగములో తూర్పుతీరానికి ఆనుకొని ఉన్నది. పశ్చిమాన ఈ భూఖండము దక్కను పీఠభూమిలోనికి చొచ్చుకొని ఉండి, తూర్పు కనుమల నేడు విచ్ఛిన్న పర్వత శ్రేణుల కాలవాలమై ఉన్నది. స్థూలదృష్టిలో ఈ దేశము (i) తీరప్రాంత మైదానము, (ii) తూర్పుకనుమల సమోన్నత మైదానము (iii) దక్కను పీఠభూమికి సంబంధించిన ఉన్నతప్రదేశము అను మూడు ప్రాంతాలుగా ఉన్నప్పటికి భూగోళ శాస్త్రజ్ఞులు వారి దశసూత్ర విభాగము ననుసరించి ఆంధ్రదేశమును ఈ క్రింద నుదహరించిన ఆరు సహజ భౌతిక ప్రాంతాలుగా నిర్ణయించుచున్నారు. (1) కృష్ణా - గోదావరి డెల్టా ప్రాంతము. (2) తీరప్రాంత మైదానము. (3) తూర్పుకనుమల ఉత్తరప్రాంతము. ఇది గోదావరి - వంశధారానదులమధ్య నున్నది. (4) తూర్పు కనుమల - దక్షిణప్రాంతము ఇందులో నల్లమలల నెడు కొండలు - వెలికొండ, పాలకొండ పర్వతాలు ఉన్నవి. (5) పశ్చిమ పీఠభూమి. (6) నూగూరు- భద్రాచల ప్రాంతము అను ఈ ఆరు భాగాలు ఈ రాష్ట్రముయొక్క భౌతికస్థితిని తెలుపుచున్నవి. ఆంధ్రదేశములో కృష్ణా గోదావరీనదులు ప్రజలకు జీవనాధారము లనుటలో నతిశయోక్తి లేదు. వీటి రెంటినీ కలుపుచు కొల్లేరుసరస్సు ఉన్నది, ఈ సరస్సు తమ్మిలేరు మొదలైన జలవాహినుల నుండి జలముస్వీకరించి ఉప్పుటేరుద్వారా సముద్రము లోనికి వ్యాపించి ఉన్నది. ఈ రెండు నదుల యొక్క సంపూర్ణాభివృద్ధి మీదనే ఆంధ్రదేశము యొక్క భవిష్యత్తు ఆధారపడి ఉన్నది. తూర్పుకనుమల కొండలు ఎత్తు తక్కువ, మధ్యమధ్య మైదానాలున్నవి. నిమగిరి కొండలు 5,000 అడుగుల ఎత్తువరకు ఉన్నవి. దేవగిరి, మహేంద్రగిరి శిఖరాలు, దక్షిణములో నల్లమల, ఎర్రమల కొండలు, మంటికొండ, భైరవికొండ శిఖరాలు ముఖ్యమైనవి. పీఠభూమి ప్రాంతము సముద్రమునకు 1,500 మొదలు 1800 అడుగులవరకు ఎత్తున ఉన్నది.
వర్షపాతము : శీతోష్ణస్థితి : ఆంధ్రదేశములోని శీతోష్ణస్థితి, వర్షపాతము బంగాళాఖాతములోని ఋతుపవనముల ప్రభావముననుసరించి మారుచుండును. తీరప్రాంతము ఉభయ మాన్ సూనులనుండి వర్షమును పొందుచున్నను, ఎండకాలపు నైరృతి పవనాలనుండి అత్యధిక వర్షమును పొందుచున్నది. డెల్టా ప్రదేశాలయందు వర్షము ఎక్కువ. పశ్చిమానికి వెళ్ళిన కొద్ది వర్షము తగ్గిపోవుచుండును. దక్కను పీఠభూమిలో ఉన్న రాయలసీమ ప్రాంతము పశ్చిమ కనుమల యొక్క వర్షచ్ఛాయలో (Rain shadow) ఉండుటవల్ల క్షామానికి గురి అవుచున్నది. మేనెలలో ఎండకాలము ఉచ్ఛదశ నందుకొనును. డిశంబరులో చలి ముదురును. విశాఖలో 92°, నెల్లూరులో 104.6°, కడపలో 105.9°, గుంటూరులో 115°, విజయవాడలో 120°, భద్రాచలములో 125° వరకు ఉష్ణోగ్రత పోవును. జనవరిలో అల్పఉష్ణము విశాఖలో 68°, నెల్లూరులో 67°, కడపలో 65.2° ఉండును. వరి పండుటకు వీలైన ఉష్ణోగ్రత జూన్, జులై మాసాలలో కోస్తా ప్రాంతము అంతటను ఉండుటవల్ల అచట వరిపంట ఎక్కువగా ఉన్నది. వర్షము దక్షిణములో 35", నైరృతిలో 20" నుండి బయలుదేరి ఉత్తరములో 40" వరకును, ఈశాన్యములో 55" వరకును పెరుగును. నెల్లూరులో నవంబరులో 11-7" లును, కాకినాడలో జులై లో 6.4" లును, అక్టోబరులో 8.6" లును, విశాఖపట్టణములో అక్టోబరులో 8.9" లును వర్షము పడుచున్నది. దక్షిణ పీఠభూమిలో బళ్లారిలో సెప్టెంబరులో 4.8 " లును, కర్నూలులో 6.0" పడుచున్నది. దక్కను పీఠభూమిలో మొత్తముమీద 20″ వర్షముకన్న ఎక్కువ పడదు. దేశములో ఎక్కువభాగములో 25" మొదలు 30" వర్షము పడుటవలన తీరభాగములో పల్లపు వ్యవసాయమును, మధ్యభాగములో మెట్టవ్యవసాయమును ముఖ్య స్థానమును ఆక్రమించియున్నవి. భూసారము : వృక్షసంపద : ఆంధ్ర దేశములో భూములు మొత్తముమీద చాల సారవంతమయినవి. తూర్పున కృష్ణా, గోదావరి డెల్టాలలో నల్లటి ఒండ్రుమట్టి నేలలు అత్యధిక సారవంతమయినవి. సామాన్యపు నల్లమట్టి మొదలు చిక్కటి రేగడలవరకు నేల సారవంతముగాను, నీళ్ళు ఇంకునదిగాను ఉండును. ఇందులో కొన్ని బురద నేలలుకూడ ఉన్నవి. పర్వతప్రాంతము తగిలినప్పుడు ఎర్రటి నేలలు విస్తారముగా కనబడుచుండును. వాటిలొ మామిడితోపులు విస్తారముగా నుండును. తూర్పుతీరపు ఇసుక నేలలలో కొబ్బరిచెట్లు వాటి అంతట అవే పెరుగును, కొన్ని నెలలు పీఠభూమిమీద గోధుమరంగుతో నుండు చుండును. పశ్చిమమునకు పోయినకొద్ది నేల యొక్క సారము తగ్గుచున్నట్లు కనుపించినను అక్కడకూడ నీరు తగిలినప్పుడు భూమి అన్ని పంటలు పండగల శక్తిని చూపించినది. చెరువులక్రింద సాగయ్యెడు మాగాణి భూములను, తోటలను, చిన్న చిన్న మడులను చూచి నప్పుడు ఈ సంగతి స్పష్టమగును.పీఠభూమి యావత్తు ప్రత్తి పండించుట కనువయిన పాతకాలపు నల్ల నేల లున్నవి. కొండ నేలలలో అనేక ఖనిజ మిశ్రితములయిన నేలలు పంటలకు వీలుగా ఉండి, అనేక రకాలుగా వృక్ష సంపదకు తోడ్పడుచున్నవి. చక్కని నేల, సామాన్య వర్షముగల అన్ని దేశాలలో ప్రకృతిసిద్ధమయిన వృక్ష సంపద పెరిగియుండును. ఆంధ్రదేశములో అడవిమొదలు తుప్పవరకు వృక్షలతా సంబంధమయిన చెట్లు పెరుగు చుండుట కనబడును. దక్కను వర్షచ్ఛాయలో 15 మొదలు 20 అంగుళముల వర్షము ఉండుటవలనను, నేల మంచిది యగుటవలనను, ఆ ప్రాంతము యావత్తు అడవితో నిండియున్నది. ఇక్కడ మేలుజాతి కర్ర లేకపోయినను అనేకరకాల చెట్లు ఈ అడవులలో ప్రసిద్ధముగా ఉండియున్నవి. తూర్పుతీరములోని అడవులను కొట్టివేసి భూమిని వ్యవసాయమునకు ఉపయోగించుచున్నారు. ఇంకా విశాఖ, తూర్పుగోదావరి జిల్లాలలో నర్సీపట్నం భద్రాచలము ప్రాంతములు అటవీమయముగా ఉన్నవి. పశ్చిమమునకు వెళ్ళినకొద్ది అడవి పలుచబడి, బీడుభూములుగా మారును. బీ డనగా, అక్కడక్కడ చిన్న చిన్న చెట్లతో విశాలమై రాతినేలలతో కూడి ఉండే విశాల ప్రదేశము. ఇది హైదరాబాదు రాష్ట్రమునం దంతటను నిండి ఉన్నది. ఇటువంటి ప్రదేశాలే నీటివసతిపొంది ఆధునిక యంత్రవ్యవసాయమునకు అనుగుణమయిన భూములుగా మారుచున్నవి. మిగతా చెట్లు వంటచెరకుకు పనికివచ్చే సన్నరకపు చెట్లు. ఆంధ్రదేశములో నాలుగవవంతుగాని, అయిదవవంతు గాని అడవుల పెంపకానికి కేటాయించాలని కేంద్ర సంస్థ సూచించినది. ప్రస్తుతము అడవులు 16.5 వంతులు మాత్రమే ఉండి నూటికి ఆరు వంతులు తోటలుగా ఉన్నవి. వ్యవసాయ క్షేత్రము నూటికి 18.2 వంతులు. ఏ విధముగాను ఉపయోగింపబడకుండ ఉన్న భూమి 15.4 వంతులుండును. వ్యవసాయముచేసే భూమి తలకు ఒక యెకరము మాత్రము వచ్చును. ఈ భూము లన్నియు వృద్ధిచెందుటకు నీటి వసతి అత్యవసరముగా ఉన్నది.
నీటిపారుదల - ప్రణాళికలు : ఋతుపవనముల యొక్క వర్షము అనేకవిధాల మానవాభివృద్ధికి వ్యతిరేకమైన పంథాలో ఉన్నది. ఒక సంవత్సరము ఎక్కువగాను, ఇంకొక సంవత్సరము తక్కువగాను కురియుచుండును. ఈ అతివృష్టి, అనావృష్టి దోషము అలా ఉండగా, కురిసిన నీరు నదులుగా ఏర్పడి, వేగము ఎక్కువగా లేని పీఠభూముల మీద ప్రవహించి, వరదలకు కారణము అవు చున్నది. కొన్ని సమయాలలో వర్షము కురిసే చోటనే పంటలకు పనికిరాని కొండప్రదేశము ఉండుటవల్ల అక్కడ ఉపయోగపడదు. ఈ యిబ్బందులను అన్నిటిని సర్దుబాటు చేయవలెనన్న పెద్దఎత్తున నీటి పారుదల ప్రణాళికలను ఏర్పాటుచేయవలసిఉండును. ప్రస్తుతము దేశములో ఈ క్రింది నీటిపారుదల సౌకర్యాదులున్నవి. (1) గోదావరి డెల్టా కాలువలు—సుమారు 10 లక్షల ఎకరాలు సాగు చేయుచున్నవి. (2) కృష్ణాడెల్టా కాలువలు.. 8.4 లక్షల ఎకరాలు. (3) కృష్ణా తూర్పుతీరపు కాలువ పులిగడ్డ వంతెనతో సహా 61,000 ఎకరాలు. (4) పోలవరం లంక – 13,000 ఎకరాలు. (5) నాగావళి- తోటపల్లి ప్రాంతములో 27,000 ఎకరాలు భూమి సాగగుచున్నవి. (6) పశ్చిమాంధ్రములో కర్నూలు - కడప కాలువ 80,000 ఎకరాలకు నీరు అందించుచున్నది. సర్ ఆర్ధరు కాటను అను సుప్రసిద్ధ ఇంజనీరు యొక్క కృషిఫలిత ముగా ఈ డెల్టా ప్రణాళికలు ఫలవంతము అయినవి. ఈ కాలువలలో ప్రయాణసౌకర్యాలు కూడ కలిసివచ్చును. సంవత్సరములో 10 నెలల పాటు వీటిమీద స్వల్ప ధరగల సరకుల రవాణా సాధ్యమగుచున్నది. ఇటువంటి ప్రయాణ ప్రాముఖ్యముగల కాలువలలో బకింగ్ హాంకాలువ ఒకటి చాల ముఖ్యమైనది. దీని మొత్తము పొడవు 258 మైళ్లు. తూర్పు తీరములో రైలుమార్గానికి దగ్గరగా పోవుచుండును. దీనిమీద 134 లక్షల రూపాయలు విలువగల వస్తువులు ప్రయాణము చేయుచున్నవి. ఇవిగాక పశ్చిమాంధ్రములో తుంగభద్రాప్రాజెక్టు చాల ఉపయోగముచేసే ప్రణాళిక. ఇందులో 2,94,000 ఎకరాలు సాగుకావలయును. గోదావరికి కట్టదలచిన రామపాదసాగరము 24 లక్షల ఎకరాలకు నీరు అందించును. నాగార్జునసాగరము అనే నందికొండప్రాజెక్టు మధ్యాంధ్రములోని గుంటూరు, నెల్లూరు, జిల్లాలలో నీటిపారుదలను కలిగించును. ఇవిగాక, పులిచింతల, వంశధార మొదలైన చిన్న చిన్న ప్రణాళికలున్నవి. దక్కను పీఠభూమి అంతటను బావులు, చెరువులు ప్రసిద్ధికెక్కిన వ్యవసాయ కేంద్రాలు.
వ్యవసాయము : ఆంధ్రదేశములోని 404.9 లక్షల ఎకరాలలో 153.1 లక్షల ఎకరాలు సాగుబడి క్రింద ఉన్నవి. 34.4 లక్షల ఎకరాలు సాగుక్రిందికి రావలసి ఉన్నవి. ఇందులో 45 లక్షల ఎకరాలకు నీటివసతి ఉన్నది. ఆంధ్రదేశములో ఆహారధాన్యాల ఉత్పత్తికి నూటికి 80 వంతులుపైగా భూమిని ఉపయోగించెదరు. అందులో ధాన్యానికి 42,87,146 ఎకరాలు అత్యధిక స్థానమును పొందిఉన్నవి. 1951 లో వ్యవసాయము క్రిందనున్న భూమి ఉత్పత్తి ఈ క్రింది విధముగా ఉన్నది.
పంట పేరు | ఎకరాలు | ఉత్పత్తి(టన్నులు) | |
---|---|---|---|
1. | వరి | 42,87,146 | 27,63,850 |
2. | చోళము | 25,76,324 | 5,22,360 |
3. | వేరుసెనగ | 22,85,436 | 8,58,810 |
4. | కొర్ర | 10,23,136 | 1,30,610 |
5. | కుంబు | 8,94,086 | 2,00,960 |
6. | పప్పుదినుసులు | 8,26,752 | 58,303 |
7. | రాగి | 5,92,767 | 2,31,057 |
8. | ప్రత్తి | 5,85,812 | 72,387 |
9. | ఇతరధాన్యములు | 4,40,,200 | 73,012 |
10. | పొగాకు | 3,35,240 | 1,10,337 |
11. | పెసలు | 3,55,546 | 34,360 |
12. | మిరప కాయలు | 2,69,265 | 1,06,550 |
వరి చాల ముఖ్యమైన పంట. ఇది కృష్ణా గోదావరి డెల్టాలలో ప్రధానముగా పండింపబడుచున్నది. కాని దేశము అంతటను కొద్దిగానో, గొప్పగానో పండించు చున్నారు. ఎకరమునకు 1800 పౌనుల పంట పండును. వరిగాక సజ్జ, లేక గంటి, చోడి లేక రాగి ముఖ్యమయినవి. ఇవిగాక అరికెలు, సామలు, వరిగెలు, ఉండలు అనే తిండిగింజలు ఉన్నవి. తరువాత పప్పుదినుసులు. ఇందులో కందులు, పెసలు, సెనగలు, మినుములు, జనుములు ఉన్నవి. అనుములు, అలచందలు, మిటికెలు ఈ జాతిలోవే. నూనెగింజలలో వేరుసెనగకు ఎక్కువ స్థానము ఉన్నది. నువ్వులు, అవిసెలు, ప్రత్తిగింజలు నూనెకు మాత్రమేగాకుండ క్రొత్తగా ఏర్పడిన డాల్డా పరిశ్రమకు దోహదము ఇచ్చుచున్నవి. ప్రత్తి పీఠభూమి మీదను, మధ్యాంధ్రములోను వ్యాపించియున్నది. పొగాకు వ్యాపారపు పంటలలో చాల ముఖ్యమయినది. గుంటూరు, కృష్ణా జిల్లాలలో ఇది విశేషముగా పండింపబడి విదేశాలకు ఎగుమతి అగుచుండును. పంచదార, చెరకు ఆంధ్రదేశము అంతటను వ్యాపించియున్నది. చిత్తూరు, గుంటూరు, కృష్ణా జిల్లాలలో దీనికి ప్రత్యేకస్థానము ఉన్నది.
పశుసంపద : ఆంధ్రదేశములో పశుసంపద విస్తారముగా ఉన్నది. ఎద్దులు 25 లక్షలు, ఆవులు 20 లక్షలు, దున్నపోతులు 7 లక్షలు, బర్రెలు 17 లక్షలు, గొర్రెలు 48 లక్షలు, మేకలు 25 లక్షలు ఉన్నవి. మధ్యాంధ్ర దేశములో ఉన్న గడ్డిప్రాంతాలు ఈ పశువుల గ్రాసమునకు అవకాశము ఏర్పాటుచేయబడినది. సరియైన ఆహార పుష్టి లేక పశువులు బలహీనముగా ఉన్నవి. ఒక కోటి పది లక్షల ఎకరాల భూమి పశువులకు గడ్డిభూములుగా ఉన్నవి. ఆంధ్రదేశములో ఒంగోలుజాతి పశువులు ప్రసిద్ధి కెక్కినవి. పాలకు, వ్యవసాయమునకు పేరుపడ్డవి. 2500 పౌనుల పాలు ఇచ్చుచున్నవి. పశువులు ప్రతి వ్యవసాయదారునికి అవసరముగా ఉండుచున్నవి. ఖనిజసంపద : ఆంధ్రదేశములోని ఖనిజసంపద కొన్నిటిలో ఉత్తమముగా ఉన్నది. మాంగనీసు 3276 టన్నులు బంగారము 361 ఔన్సులు, క్రోమైట్ 500 టన్నులు, మైకా 11,670 హండ్రడుపై టులు; స్టీయప్ టైట్ 209 టన్నులు, లై మురాయి 3740 టన్నులు, రాయి 18,822 టన్నులు, ఆస్ బెస్టాస్ 1150 టన్నులు, బారైట్సు 1800 టన్నులు 1944 సం. లో ఉత్పత్తి అయినవి. ఖనిజాలలో మాంగనీసు, మైకా ఆంధ్రదేశములో ముఖ్యస్థానమును ఆక్రమించినవి. రాయలసీమలో ఖనిజములు ఎక్కువ. మాంగనీసు, విశాఖపట్నం, కర్నూలు, బళ్ళారి జిల్లాలలోను, మైకా నెల్లూరు జిల్లాలోను, బారైట్స్ కడపజిల్లాలోను ఉన్నవి. సమగ్ర పరిశోధనలు జరిగినయెడల ఆంధ్రదేశములోను, ఖనిజములు చాల ఉన్నవని తేలగలదు. ఇనుము ఇంకను దొరకవలసియున్నది.
పరిశ్రమలు : ఆంధ్రదేశము పరిశ్రమల విషయములో వెనుకబడి ఉన్నది. తూర్పు ఆంధ్రములో కొన్ని పరిశ్రమ లకు ప్రారంభము జరిగినదిగాని, పశ్చిమాంధ్రములో పరిశ్రమలు ప్రారంభముకూడ కాలేదు. అయితే, విశాఖపట్నమువద్ద నౌకానిర్మాణశాఖ స్థాపింపబడుట గొప్ప విశేషము, మాచ్ ఖండ్ విద్యుచ్ఛక్తి నిర్మాణము పూర్తి అయిన తరువాత, దేశములో పరిశ్రమ అవకాశాలు లభింపగలవు. మద్రాసులో నుండిన ఆంధ్రుల పరిశ్రమలు కొన్ని పరిశిష్ట మద్రాసు రాష్ట్రమునకు చెందిపోయినవి. పెద్ద పరిశ్రమలలో బెజవాడలో సిమెంటు పరిశ్రమ, గూడూరులో మైకా పరిశ్రమ, గుంటూరులో పొగాకు పరిశ్రమ ఎన్నదగినవి. చిన్నపరిశ్రమలలో బియ్యపుమరలు ఇంజనీరింగ్ వర్కుషాపులు, డాల్డా ఫ్యాక్టరీలు, గూడూరులోని పింగాణీ పరిశ్రమ, బెజవాడలో రైల్వేపని, చెప్పదగినవి. ఇవిగాక కుటీర పరిశ్రమలని చెప్పదగినవి నరసాపురములో, కుట్టుపని, పెద్దాపురములో, పాలకొల్లులో పట్టుపరిశ్రమ; నెల్లూరు, గుంటూరు, గోదావరి, విశాఖ జిల్లాలలోని చేనేత పరిశ్రమ, నర్సారావు పేటలోని కుర్చీలపరిశ్రమ, విశాఖలోని చందనపు బొమ్మల పరిశ్రమ, కొండపల్లి బొమ్మలపరిశ్రమ, పెదవలసలోని వేముపనులు బెజవాడలో తోళ్ళపరిశ్రమ, పలకల పరిశ్రమ మొదలయినవి ఎన్నో ఉన్నవి.
రాకపోకల సౌకర్యాలు : ప్రయాణసౌకర్యాల రీత్యా గూడ ఆంధ్రదేశము వెనుకబడియున్నది. రోడ్లు తక్కువ. రైలుమార్గాలు కూడ ఇప్పుడిప్పుడే ఆలోచింపబడుచున్నవి. ఆంధ్రదేశములో హుబ్లీ- మచిలీపట్నానికి మీటరు గేజి మార్గమును, మదరాసు - కలకత్తా, మదరాసు-ఢిల్లీ, మదరాసు.బొంబాయి మార్గాలు బ్రాడ్ గేజి లయిను ఆంధ్రదేశము గుండా వెళ్ళుచున్నవి. రోడ్లుకూడ ఇదే మార్గాలను అనుసరించి ఉన్నవి. ఇతర రాష్ట్రాలతో పోల్చిన యెడల, ఆంధ్రలో రైలుమార్గములు తక్కువ. కాలువలు, నదులు చెప్పదగినంతగా ప్రయాణాలకు ఉపకరించవు.
వర్తక వ్యాపారాలు : అంతరంగికముగు వ్యాపారము ఎగుమతులు, దిగుమతులు ఆంధ్రదేశములో నలుమూలలకు వ్యాపించుట గాక, ఇతర రాష్ట్రాలతో కూడ వ్యాపారమున్నది. పప్పులు, ధాన్యము, బొగ్గు, వేరుసెనగ, నూనెగింజలు, మాంగనీసు, ఉప్పు, పంచదార రైల్వే రవాణా సౌకర్యాలమీద ఆధారపడి ఉన్నవి. ముడి ప్రత్తి, గుడ్డలు, దినుసులు మొదలైనవాటితో కూడ వ్యాపారము సాగింపబడుచున్నది. కొబ్బరి, కొయ్య సామాను, మందులు, కాగితము కూడ చెప్పదగిన వ్యాపారము కలవే. ఇవికాక బొంబాయి, మదరాసు రేవుల నుండి వచ్చు దిగుమతులకు ఆంధ్రదేశములో తగిన స్థాన మున్నది. 1939-40 లో 10 కోట్ల 40 లక్షల మణుగుల వ్యాపారము ఆంధ్ర జిల్లాల. ద్వార జరిగినదని అంచనా వేయబడినది.
రేవు పట్టణములు : ఆంధ్రదేశమునకు తీర భూమి ఉండుటవల్ల రేవుల అభివృద్ధి ముఖ్యముగా జరుగవలసి యున్నది. 1946 లో ఆర్మ్ స్ట్రాంగు కమిటీవారి నివేదిక ననుసరించి విశాఖపట్నము యొక్క అభివృద్ధి జరిగినది. కాకినాడ, బందరు, కొత్తపట్టణము మొదలైన చిన్న రేవులు కూడ ముఖ్యమైన వ్యాపారము చేయుచున్నవి.
జనసంఖ్య : ఆంధ్రదేశములో తూర్పు జిల్లాలలో జన సంఖ్య ఎక్కువగానున్నది. కాలువలున్న జిల్లాలలో 900 మొదలు 1200 వరకును చదరపు మైలుకు జనాభా ఒత్తిడి ఉన్నది. విజయవాడ, గుంటూరు, విశాఖపట్టణము, చీరాల, కాకినాడ, రాజమండ్రి, కర్నూలు ఆంధ్రదేశములో ముఖ్యమైన పట్టణములు. రాజకీయ పరిస్థితులు: ఆంధ్రదేశములో రాజకీయ వాతావరణము ఎక్కువ, కాంగ్రెసు, కమ్యూనిస్టు, ప్రజాపార్టీలకు ఆదరణము ఉన్నది. విశాఖపట్టణము, తిరుపతులలో విశ్వవిద్యాలయాలు ఏర్పడ్డవి.
డి. వి. కె.
[[వర్గం:]]