సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మొదటి సంపుటము/ఆంధ్రదేశ చరిత్రము V

ఆంధ్రదేశ చరిత్రము V (క్రీ. శ. 1900 నుండి నేటివరకు) :- క్రీ. శ. 1900 సంవత్సరము నాటికి ఆసేతు హిమాచలపర్యంతముగల భరతఖండము నందలి భూభాగమెల్ల బ్రిటిషు సామ్రాజ్యములో చేరి, హెచ్చు భాగము ఇంగ్లీషువారిచేత స్వయముగాను, మరికొంత భాగము వారికి లోబడిన సంస్థానాధీశులచేతను పాలింప బడుచుండెను. ఇంగ్లీషురాణియగు విక్టోరియా మహారాజ్ఞి పేరున పార్లమెంటువా రంపిన రాజప్రతినిధి యగు గవర్నరు జనరలు క్రింద వివిధ రాష్ట్రములందలి గవర్నరులు. కేంద్ర రాష్ట్రీయప్రభుత్వ కార్యాలయ కార్యదర్శులును, వారిక్రింద వివిధ జిల్లాలలోని కలెక్టరులు, ఇతర ఆంగ్లేయోద్యోగులు కలసి క్రమముతప్పని ఒక మహాయంత్రము వలె పరిపాలించుచుండిరి. సంస్థానాధీశులు రాజప్రతినిధి మాటను జవదాటక వారి క్రింది యధికారులగు రెసిడెంట్ల కనుసన్నల మెలగుచుండిరి.

పూర్వ మొకప్పుడు ఆంధ్ర చక్రవర్తులచే పరిపాలింపబడి ఆంధ్రమహా సామ్రాజ్యములో చేరిన భూభాగములలో కొన్ని ఇంగ్లీషువారి దొరతనము రాకమునుపే మొగలాయి సామ్రాజ్యమున కలుపుకొనబడి వారిక్రింద దక్కను సుబేదారుగ నుండిన హైదరాబాదు నిజాము క్రిందను, కొన్ని భాగములు కర్నాటక నవాబు రాజ్యములోను, కొన్ని భాగములు మైసూరు రాజ్యములోను, మరి కొన్ని భాగములు ఓడ్ర రాజులైన గజపతుల రాజ్యములోను కలుపుకొనబడెను. అందుచే తెలుగు ప్రజల యావాసములు కొన్ని తెలంగాణములోను, కొన్ని రాయలసీమలోను, కొన్ని ఉత్తరసర్కారులందును, కొన్ని బస్తరు మొదలైన మన్యప్రదేశములలోను చెల్లాచెదరై యుండెను. అంతియేగాక ఒకప్పుడు ఆసేతు వింధ్యాచలమును గల దక్షిణాపథమునందు వ్యాపించి, అక్కడక్కడ నెలకొన్న తెలుగుప్రజలు అరవదేశము మధ్య మధుర, తంజావూరు, సేలము, కోయంబత్తూరు జిల్లాలలోను, కన్నడ దేశము మధ్య బెంగుళూరు, కోలారు జిల్లాలలోను, మహారాష్ట్ర దేశ మధ్యమునను, ఉత్కళ రాష్ట్ర మధ్యమునను, మారుమూల ప్రదేశములలోను చిక్కుకొని పోయిరి. ఆంధ్రులు తమ రాజ్యమును, అధికారమును పలుకుబడిని కోల్పోయి విజాతీయరాజులకును, నవాబులకును, తుదకు ఫ్రెంచి ఇంగ్లీషు వర్తక కంపెనీ ప్రభుత్వముల వారికిని లోబడి తమ స్వాతంత్య్రమును ఆత్మగౌరవమును కోల్పోయి ఎక్కడివారక్కడ లేవలేక పడియుండిరి. ఒకప్పుడు దక్షిణాపథమునందు విజ్ఞాన వికాసములకు, సంస్కృతికి మేలుబంతిగనుండి ఆంధ్రత్వము, ఆంధ్ర భాషాభ్యాసము తపఃఫలమునగాని లభింపవనిపించుకొన్న మన తెలుగుదనము, తెలుగుభాష దుస్థితిలో పడినవి.

1900 సంవత్సరమునాటికి తెలుగువారి ప్రధాన ఆవాసములు హైదరాబాదు నైజాము పరిపాలనములో చేరిన తెలంగాణపు జిల్లాలలోను, మదరాసు రాజధాని నేలు గవర్నరు పరిపాలనములో చేరిన రాయలసీమ, ఉత్తర సర్కారు జిల్లాలలోను ఇమిడియుండి ఆయా జిల్లా కలెక్టరుల పాలనముక్రింద నుండెను. మద్రాసు రాజధానిలోని భాగములన్నియు పైనుండి దొరతనము వారు జారీచేయు ఉత్తరువుల ప్రకారము ఆయా జిల్లా అధికారులచే పరిపాలింబడు చుండెనే కాని ఆయా ప్రాంతముల ప్రజల కందు పలుకుబడిలేదు. గవర్నరుల చెప్పు చేతలలో నుండువారిని కొందరిని శాసనసభలందు నియమించుచు ప్రభుత్వము వారు వారిని కీలుబొమ్మలవలె చూచుచుండిరి. జిల్లాలలోని రహదారులు, ప్రాథమిక విద్య, ఆరోగ్యము, మొదలైన వానికి సంబంధించిన వ్యవహారములను చక్క బెట్టుటకు కలెక్టరులు నియమించిన సభ్యులు గల జిల్లాబోర్డు సంఘములను, పట్టణమందలి పారిశుద్ధ్యము ఆరోగ్యము, ప్రాథమిక విద్య మొదలైన పనులు చక్క బెట్టుటకు కూడ కలెక్టరులు నియామకముచేయు పురపాలక సంఘములను ప్రభుత్వమువారు ఏర్పాటు చేసిరి. వానికి నిజమైన అధికారము లెవ్వియులేవు. అన్ని పనులను సర్కారు ఉద్యోగులే నిర్వహించుచుండిరి.

ఇంగ్లీషువా రేపని చేసినను తమ క్షేమ లాభములను, గౌరవమును ఆలోచించుకొనియే చేయుచుండిరి. వారి యధికారము క్రింద సంస్థానములను పరిపాలించు దేశీయ రాజులను, నవాబులను కనిపెట్టి యుండుటకై రెసిడెంట్లను నియమించిరి. తమ దొరతనమును బలపరచుకొనుటకై సైన్యములను దేశములో నలుమూలలను గల కంటోన్మెంటులను దండు ప్రదేశములలో నెలకొల్పి యుంచిరి. తమ సైన్యముల రాకపోకల కొరకును, తమ సరకుల రాకపోకల కొరకును, అవసరములైన రహదారులను నిర్మించిరి. బందిపోటులు మొదలైనవి లేకుండ చేయుటకును, దేశములో కల్లోలము గాని అశాంతిగాని ప్రబలకుండ నుండుటకును పోలీసుబలమును చేర్చియుంచిరి. తమ తాబేదారులైన జిల్లా కలెక్టరులకే నేరమును మోపు నధికారమును, వాటిని విచారించు నధికారమును ఇచ్చిరి. ఈ దేశమున ఇంగ్లీషు విద్యా విధానము నెలకొల్పు విషయములో కూడ వారవలంబించిన పద్దతి చిత్రమైనది. మొదట వారింగ్లీషు విద్యను ప్రోత్సహించలేదు. మొదట 1812లో తెల్ల దొరలకై మద్రాసు సెంటు జార్జికోటలో నొక కాలేజీని స్థాపించి, అందులో అరవము, తెలుగు పండితులను నియమించిరి. వారు రచించిన గ్రంథములు కొన్ని ఇప్పటికిని గలవు. తరువాత తమకు కావలసినట్లు ప్రభు భక్తిగల గుమాస్తాలను, చిన్న ఉద్యోగులను తయారుచేయుటకు గావలసిన ఇంగ్లీషు విద్యను బోధించుటకు 1835 లో నిశ్చయించిరి. అందుకు కావలసిన పాఠశాలలు కళాశాలలు జిల్లా ముఖ్య పట్టణములలో స్థాపించిరి. విద్యార్థులను పరీక్ష చేయుటకు విశ్వవిద్యాలయములను 1857 లో రాజధానీ నగరములందు స్థాపించిరి. ఇట్లే దేశములో శాంతి భద్రతలను క్రమ పద్ధతిని నెలకొల్పుటకు న్యాయస్థానములను నెలకొల్పి వివిధ రాజధానీ నగరములందు ఉన్నత న్యాయస్థానములను స్థాపించిరి. మన దేశములో క్రైస్తవమత ప్రచారమునకై వచ్చిన మిషనరీలు విద్యాబోధనము చేసియు, వైద్యశాలలను స్థాపించియు ప్రజల నాకర్షించి తమ మతమున కలుపుకొన బ్రయత్నించుచుండిరి.

దేశములో రైలుమార్గములను, తంతి తపాలా మార్గములను వేయుటలోకూడ ఆంగ్లేయ ప్రభువులు తమ సైన్యముల కొరకును, తమ వ్యాపారమునకును అవసరము లయినవానిని మాత్రము నిర్మించిరిగాని, దేశీయ ప్రజల యావశ్యకములను గమనింపలేదు. ఆంగ్లేయ ప్రభుత్వము వచ్చిన తరువాత పూర్వమువలె అరాజకము లేకుండ, రాచబాటలలో దోపిళ్ళు లేకుండ శాంతిభద్రతలు, కలిగినమాట నిజము ; ఈ ప్రభుత్వమున తెల్ల వారికిని, దేశీయులకును వివాదములు జరిగినప్పుడు తప్ప న్యాయ పరిపాలనము చక్కగా జరిపినమాట నిజము; గోదావరీ, కృష్ణానదులకు 1846-55 ల మధ్య అనకట్టలు నిర్మించియు, మరికొన్నిచోట్ల నీటివసతులను కల్పించియు, పల్లపు సాగు వ్యవసాయము నభివృద్ధిచేసినమాట నిజము. కాని వా రవ లంబించిన అత్యధిక మయిన పన్నులను విధించు పద్దతివలన రైతులకు చాల బాధ కలుగుచుండెను. యంత్ర పరిశ్రమల నభివృద్ధి చేయనందున దేశప్రజలు ఆర్థికముగా వెనుకపడి ఇంగ్లీషువ ర్తకుల పోటీకి నిలువలేకుండిరి. దేశము దారిద్య్రమున మునిగియుండెను. ఇంగ్లీషువారు తమపట్ల భ క్తి విశ్వాసములుగల వ్యక్తులను తయారుచేయుటకు వారికి కొన్ని బిరుదముల నిచ్చియు, నిజమైన అధికారము లేని కొన్ని ప్రజాప్రతినిధి సంఘములందు వారిని సభ్యులుగ నియమించియు, భారతీయ ప్రభుభక్తుల వర్గమును నిర్మించుటకును ప్రయత్నించుచుండిరి. ఇంగ్లీషు రాణి జన్మదిన సందర్భమునను, ప్రతి సంవత్సరాది (జనవరి 1 వ తేదీ) నాడును బిరుదులు పట్టికలు ప్రచురించి తాము బిరుదు లిచ్చిన వారిని దర్బారులకు రావించి గౌరవించు చుండిరి. రాణీగారి జన్మదినోత్సవ దర్బారులు మొదలైన సభలేగాక, ఆంగ్ల రాజభక్తి యుపన్యాసము లిచ్చుటకు వీలయిన సందర్భము లనేకములు కల్పింపబడుచుండెను. క్రొత్త పాఠశాలలు, కళాశాలలు, వైద్యశాలలు, జిల్లా బోర్డులు మొదలయిన వాటి స్థావనోత్సవములు, వాటి వార్షికోత్సవములు, ఉద్యాన కృషి సంఘముల వార్షి కోత్సవములు, రెడ్ క్రాస్ వార్షికోత్సవములు, బాల భట సంఘసభలు మొదలయిన సభలయందీ ప్రభుభక్తి ప్రదర్శనము జరుపబడుచుండెను. వాని ఆహ్వాన సంఘముల కార్యదర్శుల ఉపన్యాసములు, ఆ సభ కధ్యక్షత వహించు గవర్నరులు, ప్రభుత్వ కార్యదర్శులు, కలెక్టరులు మొదలయినవారి ఉపన్యాసములు, ఆ సభలందు ప్రదర్శింప బడు ఇంగ్లీషు పతాకములు, ఇంగ్లీషు అలంకరణములు, ఆ సభలకు వచ్చు వారి వేషభాషలు ఆంగ్లేయ దొరతనము యొక్క గొప్పతనమును ప్రదర్శించి రాజభక్తిని ప్రోత్సహించుచుండెను. 1897 వ సంవత్సరము నాటికి బ్రిటిష్ సామ్రాజ్యము నేలు ఇంగ్లీషు రాణియైన విక్టోరియా సింహాసన మధిష్ఠించి అరువది సంవత్సరములు నిండినవి. అంతట భారతదేశమునగల ఇంగ్లీషు ఉద్యోగులు, ప్రభుభక్తి పరాయణులు దేశమంతట వత్రోత్సవ సభల నేర్పాటు గావించిరి. అందు ఒకరినిమించి యొకరు విక్టోరియా రాణి యొక్క గుణగణములను, ఆంగ్లేయదొరతనమువలన భారత దేశమునకు గలిగిన లాభములను వివరించుచు ఉపన్యాసము లిచ్చి, పద్యములు, పాటలు వ్రాసి చదివిరి. రాజభక్తిని బోధించు నాటకములు ప్రదర్శింపబడెను. హరికథలు, సంగీత సాహిత్యసభలు ఏర్పాటు గావింపబడెను. ఆంధ్రదేశములోని ప్రముఖులగు కవులు, పండితులు ఈ ప్రదర్శనములందు పాల్గొని తమ శక్తి వంచన లేకుండ రాజభక్తిని ప్రదర్శించిరి.

తానొకటి తలచిన దైవమొకటి తలచును. ఆంగ్లేయులీ దేశమున నిర్మించిన ప్రభుత్వ యంత్రమునందలి కట్టు దిట్టములు, నిబంధనములు, వీరు స్థాపించిన ప్రభుత్వ సంస్థలును భారతీయ ప్రజల కొక విధమయిన శిక్షణము నిచ్చినవి. ఆంగ్లేయ పరిపాలనా విధానములందు దేశీయులు శిక్షణముపొంది, ఆరితేరి రాజకీయ పరిజ్ఞానమును సంపాదింపసాగిరి. ఇంగ్లీషువారి విధ్యా విధానము నందు స్వాతంత్య్ర భావములతో నిండిన ఇంగ్లీషు సాహిత్యగ్రంథములను చదువుటవలన భారతీయులలో స్వరాజ్యవాంఛ కలిగెను. చదువుకొన్న వారి మూలమున ఈ స్వాతంత్య్ర భావములు జనసామాన్యమునందు వ్యాపింపసా గేను.

ఆంగ్లేయ పరిపాలనమున ఆంధ్రులు మద్రాసు రాజధానిలో చేరియుండిరి. చెన్న పట్టణ స్థాపనమునందు దాని అభివృద్ధి యందు తెలుగువారు భాగస్వాములుగ నుండిరి. చదువుకొరకు, న్యాయ విచారణముల కొరకు, ప్రభుత్వ వ్యవహారముల కొరకు, తెలుగుజిల్లాలలోని వారు తరచుగా రాజధానీ ముఖ్యపట్టణమైన చెన్నపట్టణమునకు పోవుచుండిరి. మొదట విశాఖపట్టణము, కాకినాడ, బందరు రేవులనుండి పొగయోడలలోను, బెజవాడ నుండి బకింగ్ హామ్ కాలువద్వారా పడవలలోను, చెన్న పట్టణమునకు పోవలసి వచ్చుచుండెను. కొన్ని సంవత్సరముల తరువాత రైలుమీద పోవ వీలయ్యెను. 1900 సంత్సరమున గోదావరిపయిన రైలు వంతెన తయారు కాగా ఆ అక్టోబరు నుండి సరాసరి రైలు నడువ సాగెను. తెలుగు జిల్లాలలోని నలుప్రక్కలకు రాకపోకలు సులభములై ఆంధ్రులు సంఘీభావముతో తమ అభివృద్ధికొరకు కృషి చేయ వీలయ్యెను. చెన్నపట్టణమునకు ప్రయాణ సౌకర్యము లభివృద్ధి చెందుటతో తెలుగువారి జనసంఖ్య అచట ఇంకను హెచ్చు అయ్యెను. రైలుమార్గములు ఏర్పాటగుటవలన భారతదేశమునందు ఆంధ్రులకన్న ఎక్కువరాజకీయ పరిజ్ఞానము, సాహిత్యాభివృద్ధిగాంచిన వంగ రాష్ట్రీయులతోను, మహారాష్ట్ర ప్రజలతోను, ఇతర భారతీయులతోను కలసి పరస్పర క్షేమలాభములనుగూర్చి యోచించుటకు వీలయ్యెను. 1885 లో స్థాపించబడిన కాంగ్రెసు మహాసభకు శాఖలుగా తెలుగుదేశమందు వివిధ మండలసభలు జరుపుచు కాంగ్రెసు సందేశమును వ్యాప్తిచేయ వీలయ్యెను.

రాజధానీనగరములో రాజకీయ, ఆర్థిక, సాంఘిక, విద్యావిషయములను పలువురతో కలిసి చర్చించుటకును, అక్కడ ప్రకటింపబడు దేశీయ ఇంగ్లీషు వార్తాపత్రిక లందు తమ కష్టసుఖములనుగూర్చి ప్రకటించుటకును, ప్రభుత్వమునకు చెప్పుకొనుటకును, తమ క్షేమలాభములకు అవసరమయిన కృషి చేయుటకును ప్రజలకు అవకాశము కలిగెను. శాసనసభ లేర్పడిన తరువాత అందలి చర్చ లందు తెలుగు ప్రతినిధులు పాల్గొని రాజకీయ పరిజ్ఞానమును సంపాదించి ప్రజాప్రతినిధి ప్రభుత్వపద్ధతులు, ప్రజాభిప్రాయ ప్రకటనరీతులను అలవరుచుకొన కలిగిరి. రాజధానీనగరమందు స్థాపింపబడిన మద్రాసు విశ్వవిద్యాలయమునందును, కళాశాలలందును, పాఠశాలలందును అరవముతోబాటు తెలుగునకు కూడ చాల ప్రాముఖ్య మొసగబడుటవలన చెన్న పట్టణమునందు గొప్ప తెలుగు పండితులు, కవులు స్థిరనివాసముల నేర్పరుచుకొనిరి. తెలుగులో అచ్చుకూటము లుండుటవలన ఉద్గ్రంథములు ప్రకటింపబడసాగెను. కొన్ని మాస పత్రికలును వెలసినవి. 1900 సంవత్సరము నాటికి ఆంధ్రదేశములో నలు ప్రక్కలనుండి పండితులు, కవులు, గాయకులు, రాజధానీ నగరమునకు వచ్చుచుండుటవలన అక్కడ తెలుగుభాషాభివృద్ధికి చాలా కృషి జరుగుచుండెను. బహుజనపల్లి సీతా రామాచార్యులుగారు, చెదలవాడ సుందరరామశాస్త్రిగారు, సీతారామశాస్త్రిగారు, పరవస్తు రంగాచార్యులు గారు, కందుకూరి వీరేశలింగముగారు, కొక్కొండ వేంకట రత్నముగారు, గురజాడ అప్పారావుగారు, వేదము వేంకట్రాయ శాస్త్రిగారు మొదలయినవారి గ్రంథములు, ఉపవ్యాసములు, వ్యాసములు ప్రకటింపబడసాగెను. అందువలన తెలుగువారిలో విజ్ఞాన వికాసములు కలిగెను. చిలకమర్తి లక్ష్మీనరసింహముగారి నాటకములును, ప్రహనవములును 1900 నాటికే ప్రకటింపబడెను. ఆనాటికే తిరుపతి వేంకటేశ్వరకవులు ఆంధ్రదేశములో నన్ని ప్రాంతములకు పోయి శతావధానములను జేయుచు, నానారాజ సందర్శనము చేయుచు ఆంధ్రసంస్కృతికి వ్యాప్తి కలిగించుచుండిరి. ఇట్లే మహాకవియు, గాయకుడును, నర్తకుడును అగు ఆదిభట్ట నారాయణదాసుగారు తమ సుప్రసిద్ధ హరికథలను దేశమంతట చెప్పుచు విజ్ఞానవికాసము కలిగించు చుండిరి. చాలమంది యువకులు ఆయన శిష్యులై దేశమంతటను ఆయన సందేశమును ప్రచారము చేయుచుండిరి. 1900 నాటికి కొన్ని సంవత్సరములకు పూర్వమే నాటక ప్రదర్శనములం దారితేరిన ధార్వాడ నాటక సమాజము వారును, పారసీ సమాజము వారును, ఆంధ్ర దేశమునకు వచ్చి హిందీనాటకము లాడినందున తెలుగు దేశములో అన్ని ముఖ్యపట్టణములందును నాటక సమాజము లేర్పడి నాటక ప్రదర్శనములు వ్యాప్తి చెందెను. అందులో కొన్ని విజ్ఞానబోధకములును, దేశభక్తి పూరితములును అయి యుండెను. ఆ కాలమునాటి కింకను మైసూరు సంస్థానమునగూడ తెలుగుభాష నాదరించు చుండిరని ఆనాడు మైసూరులోను, బెంగుళూరులోను ప్రకటింపబడిన తెలుగు లిపిలోని అసంఖ్యాకములగు సంస్కృత గ్రంథములును, ఆంధ్ర గ్రంథములును నిదర్శనముగ నున్నవి. ఇట్లే కార్వేటినగర సంస్థానమువారును, వెంకటగిరి సంస్థానమువారును, పిఠాపురము సంస్థానము వారును, ఆంధ్రభాషను. సంగీత సాహిత్యములను పోషించిరి. చిన్న సంస్థానమువా రయినను పోలవరపు జమీందారుగారైన రాజా కొచ్చెర్లకోట రామచంద్ర వేంకటకృష్ణారావుగారు “సరస్వతి" యను పత్రికను ప్రకటించుచు అందనేక పురాతన గ్రంథములను ముద్రింపించుచుండిరి. పోలవరం రాజా వారు తమ యాస్థానమున తిరుపతికవిగారి కాశ్రయ మిచ్చి ఆదరించిరి. ఏలూరులోని రాజా మంత్రిప్రగడ భుజంగ రావుగారును కవులను పోషించుచుండిరి.

విశాఖపట్టణము జిల్లాలోని విజయనగర సంస్థానాధీశులగు ఆనంద గజపతి అభినవ భోజుడని, అభినవ కృష్ణదేవరాయ అని ప్రసిద్ధి కెక్కునంతగా సంగీత సాహిత్య కళల నాదరించెను. ఆయన తరచుగా తన ఆస్థాన కవులతోను, గాయకులతోను, పండితులతోను, చెన్న పట్టణమునకు వచ్చి నివసించుచుండెను. 1897 లో ఆయన చని పోవువరక ను ఆయన ఆంధ్ర సంస్కృతి వ్యాప్తికి, విజ్ఞాన వికాసములకును, మూలకంబముగ నుండెను. ప్రపంచము నందు విఖ్యాతిగాంచిన దివ్యజ్ఞాన సమాజము యొక్క ప్రధాన కార్యాలయము 1882 లో అడయార్ లో నెలకొల్పబడుటకు ముఖ్యముగా కాకినాడ కాపురస్తులును, చెన్నపట్టణ హైకోర్టులో న్యాయవాదియు నగు తల్లాప్రగడ సుబ్బారావుగారు కారకు లని దివ్యజ్ఞాన సమాజ స్థాపకులే వ్రాసియున్నారు. అందువలన ఈ సమాజమున ఆంధ్రులనేకులు సభ్యులై విదేశముల నుండియు, భారత దేశములోని వివిధ ప్రాంతములనుండియు వచ్చిన సభ్యులతో కలిసి ప్రాచ్య పాశ్చాత్య మత ధర్మములను గూర్చియు సంస్కృతిని గూర్చియు చర్చించి జ్ఞాన సముపార్జనము గావించి దేశాభిమానులై కాంగ్రెసు మహా సభా స్థాపనమునకు తోడ్పడి దేశాభివృద్ధికి పాటుపడుట కవకాశము కలిగెను. ఇట్లే రామకృష్ణ పరమహంస శిష్యుడగు వివేకానందస్వామి చెన్న పట్టణమునకు వచ్చి రామకృష్ణుని సందేశమును ఆంధ్ర, ద్రావిడ దేశములందలి జనుల కంద జేసినాడు. ఆయన 1902 లో దివంగతుడగు నప్పటికే ఆయన బోధనములు, ఉపన్యాసములు ప్రజలలో మంచి విజ్ఞానమును దేశాభిమానమును కలిగించెను. వంగ దేశమునందు వర్థిల్లిన బ్రహ్మసమాజము యొక్క పరిశుద్ధాస్తిక మత బోధనములును. సంఘ సంస్కార భావములును క్రమక్రమముగా ఆంధ్రదేశమున వ్యాపింప సాగెను. బ్రహ్మసమాజ ప్రచారకుడైన శివనాథ శాస్త్రిగారు మొదట 1881 లో ఆంధ్రదేశమునకు వచ్చిరి. తరువాత 1890 లోను 1907 లోను కూడ మరల వచ్చిరి. తరువాత వందేమాతరోద్యమమున ఆంధ్రదేశమున రాజకీయోపన్యాసము లిచ్చిన బిపిన చంద్ర పాలు గారును మొదట బ్రహ్మసమాజ ప్రచారకుడుగనే వచ్చిరి. వీరేశలింగము పంతులుగారు బ్రహ్మసమాజ సభ్యులై స్త్రీ పునర్వివాహోద్యమము కొరకును, సంఘసంసారము కొరకును పాటుపడిరి. ఆంధ్రదేశమున రాజమహేంద్రవరము, బందరు, మొదలైనచోట్ల బ్రహ్మసమాజ శాఖలు ప్రార్థన సమాజములు స్థాపింపబడెను. ఆంధ్రదేశమునందన్ని విధములుగా విజ్ఞాన వికాసము కలిగినందు వలననే వీరేశలింగముగారి స్త్రీ పునర్వి వాహసంఘ సంస్కరణోద్యమములు కొనసాగుటకు వీలు కలిగెను. ప్రజలయందు ఉదారభావములు, విజ్ఞానమును వృద్ధిచెందుటవలననే, తరువాత వంగరాష్ట్ర సందర్భమున ప్రజ్వలించిన విదేశ వస్తు బహిష్కార స్వదేశీయోద్యమములు అతి త్వరితముగ ఆంధ్రదేశము నలము కొనెను. ఒకప్పుడు మనము అనుకొనిన సంగతులే దేశములోని మత, సంఘ విషయములందు జరిగిన మార్పులకు కారణమగుచుండును. 1900 సంవత్సరమునకు పూర్వము కొన్ని సంవత్సరముల క్రిందట ఆత్మూరి లక్ష్మీ నరసింహ సోమయాజులు గారను నొక వైశ్య శిఖామణి స్త్రీ పునర్వివాహములందు జోక్యము కలిగించుకొ నెనని ఆగ్రహించి, శ్రీ శంకరా చార్యులవా రాయనపై ఆంక్ష వేసిరి. అంత సోమయాజులుగా రాయన పైన అభియోగము చేసి హైకోర్టువరకును పోవగా శంకరాచార్యుల వారికి రు. 200 లు జరిమానా విధింపబడెను. దీని ఫలితముగా స్త్రీ పునర్వివాహము లందు పాల్గొనిన వారిని గూర్చిగాని, జాతి, మత, కుల వివక్షత లేకుండ భోజనము చేసిన వారిని గూర్చిగాని, శంకరాచార్యులవారు మొదలగు పీఠాధిపతులు చర్య తీసికొనుటకు భయపడిరి. ఇందువలన దేశములో రాజకీయ సాంఘిక విషయములందు అన్ని కులముల వారును గలిసి పనిచేయ వీలు కలిగెను.

పందొమ్మిదవ శతాబ్ది అంత్యభాగమునను, ఇరువదవ శతాబ్ది ఆరంభమునను అనేక కారణములవలన భారతదేశమునం దశాంతి చెలరేగెను. అనేక రాష్ట్రములలో కాటకములు చెలరేగి ప్రజలకు దుర్భరబాధ కలిగించెను బొంబాయి రాష్ట్రమున మహామారి వ్యాధి ప్రవేశించి అనేకులు జనులను తనపొట్టన బెట్టుకొనెను. ఈ సందర్భమున ప్రభుత్వమువారి చర్యలను తీవ్రముగా విమర్శించిన నేరమునకై దేశపు టగ్రనాయకులలో నొకరగు శ్రీ బాలగంగాధరతిలకుగారు కారాగారమున కంప బడిరి. రూపాయ మారకమునకు సంబంధించిన మార్పులు దేశమున కార్థికముగా గొప్ప నష్టమును తెచ్చిపెట్టెను. ఈ కాలమున భారత దేశమునకు రాజ ప్రతినిధిగ నేతెంచిన కర్జనుప్రభువు తన నోటి దురుసుదనమువలన భారతీయుల ననేకమారులు తిరస్కరించి, అవమానించి, వారియాగ్రహమునకు పాత్రుడయ్యెను. ఇట్టిపరిస్థితులలో వంగరాష్ట్రము విస్తీర్ణములో చాల పెద్దదిగానున్నందునను జనసంకీర్ణమై యున్నందునను ముసల్మాను జనసంఖ్య అధికముగానున్న తూర్పు భాగమునకు ఢాకా ముఖ్యపట్టణముగ జేసి, హిందువుల జనసంఖ్య అధికముగనున్న భాగమునకు కలకత్తాను రాజధానిగ చేసి రెండురాష్ట్రములుగ చేయుట బాగుండు నని అప్పటి ఆంగ్లేయ ప్రభుత్వాధి కారులకు తోచగా కర్జను దీని కంగీకరించెను. బంగాళా విభజనము 1905 వ సంవత్సరము అక్టోబరు నెల 16వ తేదీన అమలులోనికి వచ్చెను. బంగాలి మాతృభాషగాగల ప్రజల నిట్లు విడదీయవలదని ఎందరు మొర పెట్టుకొన్నను కర్జను వినలేదు. అమలులోనికి వచ్చులోపలనే కర్జను వేరొక సందర్భమువలన తనపదవికి రాజీనామా నిచ్చెను, కాని బంగాళా విభజనముమాత్రము మారలేదు. బంగాళీయులు తమకు ఘోరమయిన అన్యాయము జరిగినదని దుఃఖపడి భూమ్యాకాశములు బ్రద్దలగునంతటి ఆందోళనముచేసిరి. హిందూదేశములోని అన్ని భాగముల వారును బంగాళీల యెడల సానుభూతి కలిగి తమతమ దేశములలో గొప్ప సభలు చేసి దొరతనమువారి చర్యలు ఖండించిరి. ఈ విషయమున ఆంధ్రులు వెనుకపడలేదు. ఈ విషయములను గూర్చి చెన్నపురి రాజధానిలో రాజకీయోపన్యాసము లియదలచి బిపిన చంద్రపాలుగారు కలకత్తా నుండి బయలుదేరి బరంపురము, విశాఖపట్టణముల మీదుగా రాజమహేంద్రవరము, బెజవాడ, బందరు, నెల్లూరు మొదలయిన పట్టణములందు ఆంగ్లేయ దొరతనమువారు హిందూదేశమును పాలించుచున్న పద్ధతులను ప్రబలముగా ఖండించుచు ప్రతిదినము ఇంగ్లీషులో దీర్ఘపన్యాసము లిచ్చుచుండిరి. వాటిని ప్రతియూరను ఎవరో ప్రముఖులు తెలుగులోని కనువదింపగా వేలకొలది ప్రజలుద్రేక పూరితులు కాసాగిరి. ఆ సందర్భమున

తే. గీ. “భరతఖండము చక్కని పాడియావు,
హిందువులు లేగదూడలై యేడ్చుచుండ
తెల్లవారను గడుసరి గొల్లవారు
పితుకుచున్నారు మూతులు బిగియకట్టి."

అని చిలకమర్తి లక్ష్మీనరసింహముగారు పాలు గారి ఉపన్యాసానంతరము చదివిన పద్యమును విని రాజమహేంద్ర వరములోని సభాసదులు బ్రహ్మాండము పగులునట్లు చప్పట్లుకొట్టి పలుమారులు దానిని చదివించుకొని కంఠ పాఠము చేసిరి. అది అన్ని పత్రికలలోను ప్రకటింపబడి ఆంధ్రదేశమంతటను వ్యాపించి, ప్రతివారి నోటను విన వచ్చుచుండెను. హరికథలలోని కెక్కెను. ఆంగ్లేయ దొరతనమును గూర్చి ఆంధ్రు లెట్టి యభిప్రాయమును కలిగియుండిరో దీనివలననే విదితమయ్యెను.

బిపినచంద్రపాలు ఆంధ్రదేశ పర్యటనమువలన వందేమాతరోద్యమము తెలుగు దేశమంతటను వ్యాపించెను. ఆయన ఉపన్యాసములు విన్న వారు పరవశులై తత్ క్షణమే విదేశవస్తు బహిష్కారదీక్ష గైకొనసాగిరి. వానిని చూచి తక్కిన వారాకాలమున ధరించుచుండిన గ్లాస్కో మల్లు బట్టలను విసర్జించి స్వదేశీ నేతబట్టలను ధరింపసాగిరి.వందేమాతర మను మాట స్వరాజ్యమంత్రమై నలుప్రక్కల ప్రతిధ్వను లిచ్చుచుండెను. ఎచ్చట చూచినను దేశభక్తి పూరితములగు పాటలు, నాటకములు, హరికథలు, భజనలు ఉపన్యాసములు; ఎచ్చట చూచినను లోక మాన్యుని తిలక ధారణము; ఎక్కడ చూచినను వ్యాయామక్రీడలు: స్త్రీలు, పురుషులు కూడ నీదేశాభిమానమునందు మునిగి తేలుచుండిరి. చిన్నపిల్లలు, తుదకు గోరువంకలుకూడ “వందేమాతరమ్ మనదేరాజ్యం " అని పలుకుట పరిపాటియై పోయినది.

1907 వ సంవత్సరమున హిందూదేశములో ననేక స్థలములందు విదేశవస్తు బహిష్కారము, స్వరాజ్య సంపాదనము, జాతీయవిద్యాభివృద్ధియను విషయమును గురించి ప్రజలు తీవ్రముగా నాలోచింప సాగిరి. ఆ కాలమున రాజ మహేంద్రవరమున 'ఆంధ్రకేసరి' యను పత్రికయును, బందరులో 'కృష్ణాపత్రిక ' యు నిట్టి జాతీయభావములకు తోడ్పడు వ్యాసములను ప్రచురించుచుండెను. ఈ కృషిఫలితముగా రాజమహేంద్రవరము, బందరు మొదలయినచోట్ల జాతీయపాఠశాలలు, స్వదేశపరిశ్రమలు స్థాపింపబడెను.

1907 వ సంవత్సరము మే నెల 9 వ తేదీన పంజాబు ప్రభుత్వమువారు దేశాభిమానియు, మహాపురుషుడునైన లాలా లజపతిరాయిగారిని పట్టుకొని నిష్కారణముగ బర్మాకు కొనిపోయి మాండలే చెరసాలలో నిర్బంధించి యుంచిరి. ఈయనను కాంగ్రెసు అధ్యక్షునిగా చేయవలె నని తిలకుగారి నాయకత్వమున ఆనాటి తీవ్ర జాతీయవాదులు ప్రయత్నించిరి. ఇందుకు విరుద్ధముగ మితవాదులు కాంగ్రెసును సూరత్ లో సమావేశపరచి రసవిహారఘోషుగారిని అధ్యక్షునిగా చేసి యుండిరి. అందువలననే అక్కడ అల్లరి జరిగినది. ఆనాడు ఆంధ్ర దేశమున విద్యార్థులలో గొప్ప సంచలనము కలిగెను. వారు తిలకములు ధరించి మెడలలో వందేమాతర పతకములను ధరించి, చేతులలో వందేమాతర ధ్వజములను బూని వీధులలో నూరేగుచుండిరి. కొందరు విద్యార్థు లట్టి పతకములతో కాలేజీలకు పోవగా కళాశాలల అధికారులైన తెల్లదొరలు వారిని వెడలగొట్టి రెండేండ్లవర కేకాలేజీ లోను వారిని చేర్చుకొనరాదని శాసించిరి. వారికి ప్రభుత్వోద్యోగము లివ్వరాదని గెజెటులో ప్రకటించిరి. ఇట్లు శిక్షింపబడిన వారిలో రాజమహేంద్రవరము అర్టుకాలేజీ విద్యార్థియైన గజవల్లి రామచంద్రరావు గారును, ట్రెయినింగు కాలేజీ విద్యార్థి యగు గాడిచర్ల హరిసర్వోత్తమ రావుగారును ఉండిరి. ఇట్టి యువకులందరును దేశ సేవా పరాయణులైరి.

సూరతు కాంగ్రెసులో మితవాదులను పరాభవించిన తీవ్ర జాతీయవాదుల నాయకుడగు లోకమాన్య బాలగంగాధరతిలకుగారే భారతదేశములోని అశాంతికి కారకులని తలచి ఆయనను పట్టుకొని నిర్బంధించుటకు ఆంగ్లేయాధి కారులు కృత నిశ్చయులైరి. ఆయన ఆకాలమున “కేసరి" అను మహారాష్ట్రపత్రికలో వ్రాసిన వ్యాసము లందు రాజకీయ హత్యలను సమర్థించెనని, వారి పత్రిక కార్యాలయమున బాంబులను తయారుచేయు కాగితము దొరికెనని ఆయనపై రాజద్రోహ నేరము మోపి ఆయనను పట్టుకొని సంకెళ్ళు వేసి న్యాయస్థానమునకు తీసికొనివచ్చిరి. ఆయనకా నేరమునకు 22-7-1908 తేదీన ఆరు సంవత్సరములు ద్వీపాంతరవాస శిక్షయు వేయిరూపాయల జరిమానాయును విధించి ఆయనను బర్మాలో మాండలే చెరసాలలో బెట్టిరి. దీనివలన భారత దేశమున గొప్ప సంచలనము కలిగెను. గాడిచర్ల హరిసర్వోత్తమరావుగారు బెజవాడలో బోడి నారాయణరావుగారితో కలసి స్వరాజ్యపత్రికయను నొక తెలుగు జాతీయపత్రికను నడిపించిరి. అందులో దొరలను దూషించి ఇంగ్లీషు ప్రభుత్వముపట్ల రాజద్రోహము చేసెనని ఆయనను, నారాయణరావుగారిని ప్రభుత్వమువారు పట్టుకొని 1908 లో కఠినశిక్షను విధించిరి. ఆ కేసు హైకోర్టుకు వెళ్ళినప్పుడు ప్రభుత్వ న్యాయవ్యాది కోరిక ననుసరించి హరిసర్వోత్తమరావుగారికి విధింపబడిన శిక్ష చాలదని 14-8-1909 వ తేదీన మూడు సంవత్సరముల కారాగారవాసమునకు హెచ్చు చేసిరి.

జనసామాన్యమును భయ పెట్టవలెనని రాజకీయ నేరములకు పట్టుకొనబడినవారిని పోలీసువారు చాలా క్రూరముగ జూచుచు సంకెళ్ళతో ద్రిప్పి శిక్షితులైన వారి తలలు గొరిగించి మల్లచిప్పలందు పురుగుల అంబలి పోసి బాధింపసాగిరి. ఇట్టి కఠిన చర్యలు తీసికొనినందున ప్రజలు భయపడిపోయిరి. అంతట ఆంధ్రదేశమునందీ యుద్యమము అణగి పోయినదని ఆంగ్లేయ ప్రభుత్వము వారు అనుకొనిరిగాని, దేశాభిమానము ప్రజల హృదయమునందు గాఢముగా నాటుకొని అనేక రీతులుగా కార్యరూపము దాల్చసాగెను, ప్రజలలో విదేశ వస్తు బహిష్కారము స్వదేశ వస్త్వభిమానము స్వరాజ్యవాంఛ హెచ్చెను. దేశములో చాలచోట్ల స్వదేశవస్తువులు చేయు కార్ఖానాలు, జాతీయ పాఠశాలలు వెలయజొచ్చెను.

ఆనాడు జాతీయ పత్రికలలో నగ్రగణ్యమైన కృష్ణా పత్రికను శ్రీ ముట్నూరి కృష్ణారావుగారు ప్రకటింపసాగిరి. కోపల్లె హనుమంతరావుగారు న్యాయవాద వృత్తిని త్యజించి బందరు జాతీయ కళాశాల స్థాపనమునకు దాని అభివృద్ధికి తమ జీవితమును ధారపోయసాగిరి, డాక్టరు భోగరాజు పట్టాభి సీతారామయ్యగారును ఉద్యోగాభిలాష విడనాడి జాతీయవాదియైరి. కొండా వెంకటప్పయ్యగారును దేశభక్తులై దేశసేవా పరాయణులైరి. తరువాత ఆంధ్రాభ్యుదయమునకు తోడ్పడినవారు చాలామంది ఆనాటి యువకులే. ఇట్టి పరిస్థితులలోనే కీ. శే. కొమఱ్ఱాజు లక్ష్మణరావుగారు, వారి స్నేహితులైన మాడపొటి హనుమంతరావుగారు, రావిచెట్టు రంగారావుగారు మొదలయినవారు కలిసి 1907 లో హైదరాబాదులో విజ్ఞాన చంద్రికా మండలిని స్థాపించి, తరువాత దాని కార్యస్థానమును చెన్నపట్టణమునకు మార్చిరి. విజ్ఞాన చంద్రికామండలిలో ప్రకటింపబడిన మొదటి గ్రంథము స్వతంత్ర అమెరికా అధ్యక్షు డగు అబ్రహాము లింకను జీవిత చరిత్ర. దానిని రచించినవారు గాడిచర్ల హరి సర్వోత్తమరావుగారే. దానికి పీఠిక వ్రాయుచు లక్ష్మణరావుగారు వంగరాష్ట్రములోను, మహారాష్ట్ర దేశములోను వైజ్ఞానిక సాహిత్య విషయములందు దేశాభ్యుదయము కొరకు జరిగిన కృషిని వివరించి ఆంధ్రులుకూడ వారివలెనె కృషిచేయుట అవసరమని వక్కాణించిరి. ఆ గ్రంథమాలయందు ప్రకటించబడిన గ్రంథములెల్ల తెలుగువారిలో విజ్ఞాన వికాసము కలి గించి దేశాభిమానమును పురిగొల్పగల ఉత్తమ గ్రంథములే. అందు ముఖ్యముగా 1910 వ సంవత్సరమున ప్రకటింపబడిన "ఆంధ్రుల చరిత్ర" ఆంధ్రులలో గొప్ప దేశభక్తిని పురికొల్పిన చరిత్ర గ్రంథము. దానికి శ్రీ లక్ష్మణరావుగారు పీఠిక వ్రాయుచు “భారత ఖండాంతర్గతములైన ఒక్కొక్క దేశముయొక్క చరిత్రమును విపులముగా వ్రాయించి ప్రకటించవలెనని మండలివారు యత్నించుచున్నారు. ఆంధ్రులకు ఆంధ్రదేశ చరిత్రము అత్యంతావశ్యకముగదా. పూర్వ మొకప్పుడు రాజ్య విస్తీర్ణమునందు ఉన్నత నాగరకత యందును, బుద్ధి వైభవమునందును, ఆంధ్రులు హిందూదేశమునందలి యన్య రాష్ట్రముల వారికి దీసిపోయినవారు కారని ఈ చరిత్రవలన స్పష్టపడగలదు." అని వారు వ్రాయుటలోనే ఆంధ్రరాష్ట్ర ప్రజలు మరల పూర్వపు మహోన్నతస్థితి పొందవలెనన్న భావము ద్యోతక మగుచుం డెను. శ్రీ లక్ష్మణరావుగారి మహదాశయమే ఆనాడు ఆంధ్ర దేశాభ్యుదయము కొరకు పాటుపడిన వారందరకు నుండెననుటకు సందేహములేదు.

1910 వ సంవత్సరమున గుంటూరులోని ఆంధ్ర యువజన సాహిత్య సంఘమునందలి సభ్యులు ఆంధ్ర రాష్ట్ర నిర్మాణావశ్యకతను గూర్చి ఆలోచించి ఒక తీర్మానము గావించిరి. ఈ సభ్యులలో కీ. శే. జొన్నవిత్తుల గురునాథము, కీ. శే. చల్లా శేషగిరిరావుగార్లును, శ్రీ ఉన్నవ లక్ష్మీనారాయణగారు మొదలయినవారు ఉండిరి. అయితే దీనిని గూర్చి అప్పుడు ప్రచారముగాని కృషిగాని జరుగుట కవకాశము లేకపోయెను. ఇంతలో నాంధ్ర దేశమునందు కలిగిన విజ్ఞాన వికాసము యొక్క ఫలితముగా బయలుదేరిన అనేక గ్రంథమాలలు దేశాభ్యుదయమునకు తోడ్పడగల గ్రంథములను ప్రచురింపసాగెను, అనేక పత్రికలు వెలసెను. తరువాత అనేక అముద్రిత గ్రంథములు సేకరించి, ఆంధ్రవాఙ్మయ పరిశోధనము గావించి, మన భాషకు చాల సేవజేసిన ఆంధ్రసాహిత్య పరిషత్తు కూడా 1911 లోనే స్థాపింపబడెను. దాని మొదటి వార్షికోత్సవము 1912 లో చెన్నపట్టణమున జరిగెను. తరువాత ప్రతిసంవత్సరము నొక పట్టణములో వార్షికోత్సవము జరుపసాగిరి. ఆ సమయముననే ఆంధ్ర దేశములోని ప్రతిపట్టణమునందును పుస్తక భాండాగారములు స్థాపింపబడి, గ్రంథములను, పత్రికలను ప్రజల కందించుచు, ఉపన్యాసము లేర్పాటుచేయుచు, ప్రజల విజ్ఞాన వికాసమునకు తోడ్పడసాగేను. ప్రతి సంవత్సరమును వార్షికోత్సవములు జరుపుచు ఆంధ్ర ప్రముఖుల యధ్యక్షతక్రింద మహాసభలు జరుపుట ప్రారంభమై అది త్వరలోనే ఆంధ్రదేశ గ్రంథాలయోద్యమముగ బరిణమించెను.

1912 లో ఢిల్లీ దర్భారు జరిగెను. ఆ సందర్భమున పూర్వము దేశమును కలవరపెట్టిన బంగాళా విభజనము రద్దు చేయబడి బంగాళీ భాష మాట్లాడు ప్రాంతము లెల్ల నొకేరాష్ట్ర మయ్యెను. భారతదేశ రాజధానిని కలకత్తా నుండి ఢిల్లీకి మార్చిరి. దేశములో నన్ని ముఖ్యపట్టణము లందును ఉత్సవములు సభలు జరిగెను. ఇట్లాకాలమున వివిధసంస్థలవారు చేసిన కృషియు, వా రేర్పరచిన సభలు ఉత్సవములు, ఉపన్యాసములును ప్రజలలో విజ్ఞాన వికాసమును ఆంధ్రాభి మానమును కలిగించి కార్యదీక్షను పురి కొల్పుచుండెను.

"వంగరాష్ట్ర విభజనం సందర్భమునను, తరువాత దానిని రద్దుచేయునప్పుడును జరిగిన చర్చల వలనను, ఆ కాలమున నడచిన ప్రసంగముల వలనను, రాజప్రతినిధి మొదలగువారి రాజకీయ లేఖలవలనను, భాషాసామ్యము జాత్యైక్యత, ప్రత్యేక రాష్ట్రనిర్మాణమునకు ముఖ్య కారణములని స్పష్టీకరింపబడినవి" అని శ్రీ దేశభక్త కొండా వెంకటప్పయ్యగారే ఆంధ్రోద్యమముయొక్క పుట్టు పూర్వోత్తరములను గూర్చిన ఒక వ్యాసమున వ్రాసినారు. 1912 వ సంవత్సరమున కృష్ణాజిల్లా మహాసభ నిడదవోలులో జరిగినప్పుడు ఆంధ్రదేశమందలి ప్రముఖులు చాలమంది అచ్చట సమావేశమయిరి. జిల్లా సభలవలెనే, ఆంధ్రదేశ మంతటికిని ప్రతి సంవత్సర మొక్కొకచోట మహాసభను జరిపించుట యుక్తమను భావము వారికి తోచినది. ఆంధ్రమహాసభా సమావేశము ఆంధ్ర వ్యక్తిత్వమును దృఢపరచి సర్వతోముఖముగా ఆంధ్రజాతి నుద్ధరించుటయే ముఖ్యోద్దేశముగ గలది యగుటచే, ఒక భాష, ఒక సంస్కృతి, ఒక చారిత్రము గలిగిన ఆంధ్రు లెల్లరు నొక రాష్ట్రములో ప్రత్యేకింపబడుట అత్యంతావశ్యక మను భావము వెంటనే ఆంధ్రయువకుల హృదయములందు మొలకెత్తినది. అట్టి యువకులలో కీ. శే. జొన్నవిత్తుల గురునాథము, కీ. శే. చల్లా శేషగిరిరావుగార్లు పేర్కొనదగినవారు. ఆంధ్రరాష్ట్ర తీర్మానము పైనచెప్పిన కృష్ణాజిల్లా మహాసభలోనే ప్రవేశ పెట్టబడెను గాని అది సకాలములో తేబడనందున అధ్యక్షులు దానిని నిరాకరించిరి. అంతట నా యువకులును, వింజమూరి భావనాచార్యులుగారు, ఉన్నవ లక్ష్మీనారాయణ గారు మొదలగు పెద్దలును చేరి ఆంధ్రరాష్ట్ర నిర్మాణము విషయమును చర్చించి, దాని ఆవశ్యకతను గుర్తించి ఆంధ్రులలో ప్రబోధము కలిగించుటకు ఆంధ్రోద్యమము సాగించిరి. ఈ విషయమై ప్రచారముచేయుటకు కొండా వేంకటప్పయ్యగారు కూడ పూనుకొనిరి. ఈ సందర్భమున తమిళ ప్రాంతములనున్న తెలుగువారిలో కూడ ఆంధ్రోద్యమ ప్రచారము జరిగినది.

ఈ ప్రచారము యొక్క ఫలితముగా బాపట్లలో 1913వ సంవత్సరమున ప్రథమ ఆంధ్రమహాసభ జరుపబడినది. మద్రాసు రాష్ట్రీయ శాసనసభలో సభ్యులుగ నుండిన శ్రీ బయ్యా నరసింహేశ్వర శర్మగారు సభకు అధ్యక్షత వహించిరి. ఆంధ్రరాష్ట్ర నిర్మాణ విషయమునుగూర్చి విచారించి మరుసటి సంవత్సరము జరుగు ఆంధ్ర మహాసభకు నివేదించుటకు తీర్మానించిరి.

1914 లో ఐరోపా మహాసంగ్రామము ప్రారంభమయ్యెను. ప్రజలకు వార్తా పత్రికలయం దభిరుచి పెరిగెను. ఆదివరకు బొంబాయిలో శ్రీ కాశీనాథుని నాగేశ్వరరావుగారు నడుపుచుండిన ఆంధ్రపత్రికను చెన్న పట్టణమునుండి దినపత్రికగా ప్రకటింపసాగిరి. అది ఆంధ్రోద్యమమునుగూర్చి తీవ్రమైన ప్రచారము చేయసాగెను.1914 లో బెజవాడలో ఆంధ్రభీష్మ న్యాపతి సుబ్బారావు పంతులుగారి అధ్యక్షతక్రింద జరిగిన రెండవ ఆంధ్రమహాసభయందు ఆంధ్రరాష్ట్ర నిర్మాణము గావించుట అవసరమని తీర్మానించిరి.

1915 లో కాకినాడలో శ్రీ మోచర్ల రామచంద్రరావు పంతులుగారి అధ్యక్షతక్రింద జరిగిన మూడవ ఆంధ్రమహాసభలో ప్రత్యేకాంధ్రరాష్ట్ర నిర్మాణము చేయవలయునని తీర్మానము గావించిరి. అప్పటినుండి ప్రతి సంవత్సరము ఆంధ్రమహాసభ ఏదో యొక ముఖ్యపట్టణమున సమావేశమగుచు ఆంధ్రరాష్ట్రము నిర్మించవలెనని తీర్మానింపసాగెను. తరువాత ఆంధ్ర సాహిత్య సభలందు, గ్రంథాలయ సభలందు, ఇతర సభలందుగూడ ఈ విషయమై తీర్మానములు గావింపబడుచుండెను. జాతి, మత కుల పక్షవిభేదములను విస్మరించి రాష్ట్రమునందు ఇతర రాష్ట్రములందుగల తెలుగువారందరును ఆంధ్రో ద్యమము నభిమానించిరి, కాంగ్రెసు మహాసభకూడ భాషా ప్రయుక్త రాష్ట్ర నిర్మాణ సూత్రము నంగీకరించెను. 1918 లో ఆంధ్రరాష్ట్ర కాంగ్రెసు కమిటీ ఏర్పరుప బడినది. 1917 లో మాంటేగు- షేమ్సుఫోర్డు రాజ్యాంగ సంస్కరణముల సందర్భమున నీ విషయమై విచారణ సంఘమునకు నివేదింపబడినది. 1919 వ సంవత్సరపు రాజ్యాంగ చట్టమునందు భాషాప్రయుక్త రాష్ట్రములు ప్రజా ప్రతినిధుల యంగీకారముపైన నిర్మింపవచ్చునని నిర్ణయింపబడెను. కాని దాని విషయమై ఎట్టి చర్యయు గైకొనబడలేదు. ఆంగ్లేయ పరిపాలకులు మరల రాజ్యాంగ సంస్కరణములు చేసినప్పుడు 1935 లో సింధు, ఒరిస్సా పరగణాలను ప్రత్యేక రాష్ట్రములుగ నిర్మాణము చేసిరేగాని ఆంధ్రరాష్టమును నిర్మింప రైరి.

1917 వ సంవత్సరము నాటికే చెన్నపురి రాజధానిలో బ్రాహ్మణేతరోద్యమము ప్రబలమై జస్టిసుపార్టీ యేర్పడి కాంగ్రెసుకు వ్యతిరేకముగా పనిచేయసాగెను. ఈ యుద్యమము తలయెత్తుటకు కారకులు బ్రిటిష్ అధికారులే అని చెప్పవచ్చును. 1919 వ సంవత్సరపు రాజ్యాంగము ప్రకారము జరిగిన ఎన్నికలందు కాంగ్రెసు పాల్గొనక బహిష్కరించినప్పుడు జస్టిసు పార్టీవారు శాసనసభలందు ప్రవేశించి చెన్నపట్టణ రాజధానియందు మంత్రులుగ నేర్పడి వారి యధీనము చేయబడిన ప్రభుత్వ శాఖలను పరిపాలింప సాగిరి, 1935 వ సంవత్సరపు రాజ్యాంగ చట్టమును బట్టి 1937 లో జరిగిన ఎన్నికలలో పరాజితు లగువరకు వారే పలుకుబడి కలిగియుండిరి. జస్టిసు పార్టీ నాయకులైన పానుగంటి రామారాయణింగారును, బొబ్బిలి రాజాగారును, కూర్మా వెంకటరెడ్డి నాయుడుగారును, పాత్రోగారు మొదలైన వారును ఆంధ్రరాష్ట్ర నిర్మాణమునకు సుముఖులుగనే యుండిరి, ఆంధ్ర మహాసభలందు పాల్గొనిరికాని అధికార పదవు లందున్నప్పుడు మాత్రము వారు ఈ విషయమై గట్టి ప్రయత్నము చేయరైరి.

గాంధీ మహాత్వుని నాయకత్వమున సహాయ నిరాకరణోద్యమము శాసనోల్లంఘనోద్యమములు జరుగుచుండిన కాలమున భారత దేశమునకు పూర్ణ స్వరాజ్యము సంపాదించినచో భాషాప్రయుక్త రాష్ట్రముల సమస్య పరిష్కార మగుననియు అంతవరకు కాంగ్రెసువారిట్టి చిన్న విషయమును గూర్చి గాక భారతదేశ స్వాంత్య్రము కొరకు మాత్రమే కృషిచేయ వలయుననియు ప్రధాన కాంగ్రెసు నాయకులు తలంచినందున ఆంధ్ర కాంగ్రెసు ప్రముఖు లీ విషయమై తక్కిన పక్షముల వారితో గలిసి గట్టికృషి చేయరైరి. 1938 లో కాంగ్రెసు కార్యవర్గమువారు భాషా ప్రయుక్త రాష్ట్రములను నిర్మాణము చేయుట అవసర మేయనియు, తమచేతికి అధికారము వచ్చిన పిదప దీనిని గూర్చి చర్య గైకొందుమనియు తీర్మానించిరి. 1938లో కాంగ్రెసువారు ఎన్నికలందు విజయముపొంది వివిధ రాష్ట్రములందు ప్రభుత్వాధికారము వహించిరి. చెన్నపట్టణములో కూడ కాంగ్రెసు ప్రభుత్వాధికారము వహించెను. ఆంధ్ర శాసనసభ్యులు ఆంధ్రరాష్ట్ర నిర్మాణమును గోరిరి. కాని ముఖ్యమంత్రి యైన రాజగోపాలా చార్యుల వారికి ఆంధ్రరాష్ట్ర నిర్మాణము చేయుట కిష్టము లేకపోయెను. అందువలన మన రాష్ట్ర నిర్మాణము వెనుక బడినది. ఎట్టకేలకు భారతదేశము స్వాతంత్య్రము పొందిన సందర్భమున ఆంధ్రరాష్ట్ర నిర్మాణ సమస్య మరల ముందునకు వచ్చెను. 18-4-1947 వ తేదీన మద్రాసులోని ఉభయ శాసన సభలును భాషా ప్రయుక్త రాష్ట్రముల నిర్మాణము గావింపవలెనని రాజ్యాంగ నిర్మాణ సభకు శిఫారసు చేయుచు తీర్మానము గావించెను. అంతట నీవిషయమై విచారించి నివేదించుటకు రాజ్యాంగ (Constituent Assembly) నిర్మాణ సభవారు “థారు" కమీషను అను నొక విచారణ సంఘమును నియమించిరి. ఆ సంఘము వారు ఈ విషయమై విచారణసల్పి భారత దేశమునందు భాషాప్రయుక్త రాష్ట్రములను నిర్మాణముచేయుట యుక్తముగాదనియు, అయ్యది భారత జాతీయైక్యతకు భంగము కలిగించుననియు అభిప్రాయము నిచ్చిరి. అంతట దేశ ప్రజలలో చాల అసంతృప్తి కలిగెను. కాంగ్రెసు వారుకూడ ఆందోళనము గావించిరి. అంతట ఈ విషయమును గూర్చి పునరాలోచన చేయుటకు కాంగ్రెసు వర్కింగు కమిటీవారు జవహర్లాల్ నెహ్రూ, వల్లభాయి పటేల్, డాక్టరు పట్టాభి సీతారామయ్యగార్ల నొక ఉప సంఘముగా నియమించిరి. వారి నివేదికకు "జె. వి. పి" రిపోర్టు అని పేరు వచ్చినది. తక్కిన రాష్ట్రములమాట ఎటులున్నను, ఆంధ్రుల చిరకాల వాంఛితమైన ఆంధ్ర రాష్ట్రమును మాత్రము నిర్మాణము చేయవచ్చుననియు అయితే అట్లేర్పడు క్రొత్త రాష్ట్రమునందు మద్రాసు నగరమును చేర్చుటకు అరవవారి కభ్యంతరము కలదనియు అందువలన మద్రాసు రాజధాని లోని నిర్వివాద ప్రాంతములతోనే నూతనాంధ్రరాష్ట్రము నిర్మాణము చేయవలసి యుండుననియు ఉపసంఘమువారు అభిప్రాయపడిరి. ఈ నిర్ణయమును ఆంధ్రరాష్ట్ర సంఘమువారు 1949 సం. నవంబరు 11 వ తేదీన శిరసావహించుచు తీర్మానించిరి. భారతీయ ప్రభుత్వమువారును వీరి తీర్మానమును అంగీకరించి వెంటనే ఆంధ్రరాష్ట్రమును నిర్మింప తల పెట్టి మదరాసు ప్రభుత్వముతో నాలో చింపగా మద్రాసు మంత్రివర్గమువారు 1950 సంవత్సరము ఏప్రిల్ 1వ తేదీకిగాని క్రొత్త రాష్ట్రము నిర్మింప వీలుకాదనియు, ఈలోపుగ కొంత చర్య గైకొందు మనియు చెప్పి 1949 డిశంబరు 7 వ తేదీన ఒక విభజన సంఘమును (Partition Council) నియమించిరి. ఈ విభజనసంఘమువారు 1950 జనవరి 3 వ తేదీన తమ నివేది కను సమర్పించి నిర్వివాద ప్రాంతములతో ఆంధ్రరాష్ట్రమును నిర్మింపుడని గోరిరి. అయితే శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులుగారు మద్రాసునగర నిర్మాణాభి వృద్ధులయందు తెలుగువారి ధనమెంతో వినియోగింపబడినందున ఆంధ్రరాష్ట్రమును విడదీయుటలో మద్రాసు నగరము విషయమునను, అందులో విలువగల ఆస్తి విషయమునను ఇంకనేక విషయములందును తెలుగు వారికి కొన్నికోట్ల రూపాయలు నష్టపరిహారము రావలసియుండుననియు, అది నిర్ణయించనిది ఆంధ్రరాష్ట్రమును నిర్మింప వీలులేదనియు పట్టుబట్టిరి. ఇది న్యాయమేనని ఆంధ్రుల కందరకు తోచినందువలన ఈ విషయమున గొప్ప ఆందోళనము బయలుదేరెను. ఆంధ్రరాష్ట్రము యొక్క ముఖ్యపట్టణము ఎక్కడ నుండవలెనను విషయమున గూడ తెలుగువారిలో అభిప్రాయ భేదములు కలిగెను. ఈ విషయములను గూర్చిన వాదోపవాదములు తీవ్రముగా చెలరేగెను. ఇట్టి పరిస్థితులలో భారత ప్రభుత్వమువారు ప్రస్తుతము ఆంధ్రరాష్ట్ర నిర్మాణమును నిలుపుదల చేసినట్లు 1950 వ సంవత్సరము జనవరి 18 వ తేదీన ప్రకటించిరి. ఇట్టి పరిస్థితులలో శ్రీ పొట్టి శ్రీరాములుగారు మద్రాసుతోకలిపి ఆంధ్ర రాష్ట్రనిర్మాణము కావింపవ లెనని పట్టుబట్టి ప్రాయోపవేశమును జేసిరి. ఆయనకు ప్రాణాపాయస్థితి కలిగెను. 1952 డిసెంబరు 9 వ తేదీన మద్రాసు నగరమును మినహాయించి ఆంధ్ర రాష్ట్ర నిర్మాణము చేయుటకు అభ్యంతరము లేదని శ్రీ నెహ్రూగారు ప్రకటించియుండిరి. ఐనను శ్రీరాములు గారు తమ దీక్ష వదలక ప్రాణముల బాసిరి. దేశములో అశాంతి కలిగెను. అంతట డిశంబరు 19 వ తేదీన శ్రీ నెహ్రూగారు ఢిల్లీ లోకసభలో మద్రాసు నగరము గాక చెన్న రాష్ట్రములోని ప్రస్తుతపు తెలుగు ప్రాంతములను కలిపి ఆంధ్రరాష్ట్రముగా నిర్మించుటకు భారతదేశ ప్రభుత్వమువారు నిశ్చయించినారనియు దానినిగూర్చి అవసరమైన చర్యలు తీసికొనబడుచున్న వనియు తెలిపిరి. నూతన రాష్ట్ర నిర్మాణము చేయుటలో పరిష్కరింప వలసిన ఆర్థిక సమస్యలు మొదలైన వానిని విచారించుటకు రాజస్థాన ప్రధాన న్యాయమూర్తియగు వాంఛూ గారిని నియమించినట్లు నెహ్రూగారు ప్రకటనము చేసిరి.

అటుతరువాత ఆంధ్రరాష్ట్ర ముఖ్యపట్టణమును కర్నూలులో నెలకొల్పవలెననియు, హైకోర్టు గుంటూరులో నెలకొల్ప వలెననియు మద్రాసు శాసనసభలోని తెలుగు సభ్యులు నిర్ణయించిరి. దీని ఫలితముగా 1953 ఆక్టోబరు 1వ తేదీన ఆంధ్రరాష్ట్రము నిర్మింపబడి దానికి కర్నూలు ముఖ్యపట్టణ మయ్యెను. ఈ క్రొత్తరాష్ట్రమునకు మొదటి గవర్నరుగా శ్రీ సి. యమ్. త్రివేదిగారిని నియమించిరి. భారత దేశ స్వారాజ్యోద్యమమునందు తన సర్వస్వమును ధారపోసిన మహా త్యాగియు, దేశభక్తుడును కర్మవీరుడును, కార్యశూరుడును అగు శ్రీ టంగుటూరి ప్రకాశము పంతులుగారినే ఆంధ్ర రాష్ట్రమునకు మొదటి ముఖ్యమంత్రిగ నెన్ను కొనిరి. ఆయన ఒక సంవత్సరము పాటు ఆ పదవిలో నుండి నూతన ఆంధ్రరాష్ట్రమును సుస్థిరముగ జేసెను.

ఆంధ్రరాష్ట్ర నిర్మాణము రాష్ట్రముల పునర్విచారణ సమస్యను భాషాప్రయుక్తరాష్ట్ర నిర్మాణ సమస్యను పునరుజ్జీవింప జేసెను. భారత దేశములోని ఇంగ్లీషు వారి పరిపాలనముక్రింద నుండిన వివిధ రాజ్య భాగము లొక్కసారిగా నేర్పడినవి కావు. ఆయా ప్రాంతములు ఇంగ్లీషు వారి వశమైనప్పుడెల్ల అందు తమ పరిపాలనము నేర్పర్చుచు తరువాత వాని పరిసరప్రాంతములు తమ వశమైనప్పుడు పూర్వపు రాజ్యభాగముతో గలుపుచుండుటవలన ఒకే జాతి మతధర్మములు గలిగి ఒకే భాష మాట్లాడు వారిలో కొందరు ఒక పరగణాలోను, మరికొందరింకొక పరగణాలోను చేర్చబడుట తటస్థించెను. ఇట్లే కొందరు ఇంగ్లీషువారు స్వయముగా పరిపాలించు రాజ్య భాగములందును, మరికొంద రింగ్లీషువారికి సామంతులయిన స్వదేశ సంస్థానాధీశులు పరిపాలించు రాజ్య భాగములందును చేర్చబడిరి. ఇంగ్లీషువారు కేవలము పరిపాలనా సౌకర్యముల నాలోచించి వివిధ రాజధానుల నేర్పరచిరే కాని దేశములోని నైసర్గిక పరిస్థితులనుగాని, ప్రజల సంస్కృతిని గాని, వారు మాటలాడు భాషలుగాని ఆలోచించి అట్లు చేయలేదు. ఇట్లు అరవ, కన్నడ, మలయాళీ భాషల వారిని, తెలుగువారిని కలిపి చెన్న రాజధానిలో కలిపి పరిపాలించుచుండిరి. రాజధానులు పెద్దవైనప్పుడు వాటిని రెండుగ విభజించుట గాని అందులో కొన్ని జిల్లాలను ప్రక్క రాజధానిలో చేర్చుట కాని చేయుచుండిరేగాని ప్రజల సౌకర్యములు నాలోచించి ఈ రాజ్యభాగముల నన్నిటిని పునర్నిర్మాణము గావించుట అవసరమని ఇంగ్లీషువారు తలచలేదు. రాజ్యాంగసంస్కరణములు జరిగినప్పుడు ప్రజలు ఆంగ్లేయాధి కారులకు తమ కోర్కెలనుగూర్చి చెప్పికొనిరి గాని రాష్ట్రముల పునర్నిర్మాణ సమస్య పరిష్కరింపబడలేదు. భారతీయులు స్వాతంత్య్రముకొరకు ఆంగ్లేయులతో పెనుగులాడుచున్న కాలమున భారతదేశములోని వివిధ ప్రాంతములందు నివసించుచు ఒకేభాష, ఒకేసంస్కృతి, ఒకేచరిత్ర కలిగియున్న ప్రజలను ఏకముచేసి వారి కొక ప్రత్యే రాష్ట్రకము నిర్మించవలెనను ఆశయమును ప్రచారము చేసిన యెడల వారిలో జాతీయభావము వర్థిల్లి విజాతీయ ప్రభువులను ప్రతిఘటించుటకు తోడ్పడగలదను నుద్దేశముతో మన జాతీయనాయకులు భాషాప్రయుక్త రాష్ట్ర నిర్మాణమును గూర్చిన ఉద్యమము లేవదీసియుండిరి. ఆంధ్రోద్యమము వలన దేశాభిమానము వర్థిల్లి ఇంగ్లీషు ప్రభువులతో పోరాడుపట్ల ఆంధ్రులు గొప్ప ధైర్యసాహసములు పట్టుదల చూపినసంగతి జగద్విదితము. భారతదేశమునకు స్వాతంత్య్రము లభించిన పిమ్మట వివిధ రాష్ట్రములలోని ప్రజల క్షేమమేగాక, యావద్భారత దేశము యొక్క క్షేమ లాభములనుగూర్చియు జాతీయైక్యత నుగూర్చియు భారతదేశమునకు ప్రపంచ రాజ్యములం దుండవలసిన గౌరవ ప్రతిపత్తులను గూర్చియు ముఖ్యముగా ఆలోచించవలసిన అవసరము కలిగెను. వివిధ సంస్థానములు స్వతంత్ర భారతదేశములో లీనమైనందున భారతఖండాంతర్గతము లయిన వివిధ రాజ్యభాగములలోను, రాజధానులలోను, పరగణాలలోను వసించు ప్రజల క్షేమలాభములను, కష్టసుఖములను ఆలోచించి భారత రాజ్యభాగములను పునర్నిర్మాణము గావింపవలసిన అవసరము కలిగెను. పై సంగతు లన్నియు ఆలోచించియే కేవలము భాషాప్రయుక్త రాష్ట్రముల నిర్మాణముచేయుట మంచిది కాదని థార్ కమీషను వారు అభిప్రాయపడిరి, భారత జాతీయ నాయకులలో చాలమంది కిట్లే తోచెను. ఆంధ్రరాష్ట్రము ప్రత్యేక కారణములవలన నిర్మాణముగావింప బడినదనియు, ఇకముందు కేవలము భాషాప్రయుక్త రాష్ట్రనిర్మాణము చేయుట పొసగదనియు భారత ప్రభుత్వమువారు ప్రకటించిరి. భారత రాజ్యాంగసమితిలోని ప్రజల క్షేమలాభములను, భారతజాతియొక్క సమష్టి క్షేమలాభములకు తోడ్పడగలందులకుగాను భారతదేశములోని వివిధ రాజ్యభాగములను పున ర్నిర్మాణము చేయు విషయమునుగూర్చి నిష్పక్షపాత బుద్ధితోను, వాస్తవికదృష్టితోను పరిశీలించుటకు ఒక విచారణ సంఘమును భారతదేశ ప్రభుత్వమువారు నియమించదలచినట్లు 1953 డిశంబరు 22 వ తేదీన మన ప్రధానమంత్రి శ్రీ నెహ్రూగారు పార్ల మెంటులో చెప్పిరి. ఈ రాష్ట్రముల పునర్నిర్మాణ సమస్య యొక్క పరిస్థితులను దీనికి పునాదియైన దేశ చరిత్రను, ప్రస్తుత పరిస్థితులను దానికి సన్నిహిత సంబంధముగల అన్ని ముఖ్య విషయములను ఈ సంఘమువారు విచారించెదరనియు, ఈ పునర్నిర్మాణమును గూర్చి ఎవరే సూచనను గావించినను, దానిని విమర్శించెదరనియు రాష్ట్రముల పునర్నిర్మాణము చేయవలసిన విధానములను గూర్చిన నివేదికలను విచారణ సంఘముల వారు ప్రభుత్వము వారి ఆలోచన కొరకు పంపుదురనియు భారత ప్రభుత్వము వారు డిశంబరు 29 వ తేదీన తీర్మానించిరి.

విచారణసంఘమువారు ఫజుల్ ఆలీగారి నాయకత్వమున ఈ సమస్యను గూర్చి విచారణచేసి తమ నివేదికను 1955 సెప్టెంబరు 30 తేదీన భారతప్రభుత్వము వారి కంద జేసిరి. ఇది దేశమునందలి అన్ని పత్రిక లలోను ప్రకటింపబడి ప్రజలచేతను, రాష్ట్ర శాసనసభ్యుల చేతను చర్చింపబడెను. ప్రజాభిప్రాయమును జాగ్రత్తగా కనుగొని భారత దేశ ప్రభుత్వము వారు రాష్ట్రముల పునర్నిర్మాణము చేయుటకు ఒక చట్టము తయారుచేసి రాష్ట్ర ప్రభుత్వముల అభిప్రాయములనుగూడ మరల సేకరించి దానిని పార్లమెంటులో ప్రవేశపెట్టి తీర్మానించినారు. ఆ చట్టము ప్రకారము భారతదేశములోని ప్రస్తుత రాజ్యభాగములు 1956 నవంబరు 1వ తేదీన పునర్నిర్మాణము గావింపబడెను. ప్రభుత్వమువారు రాజ్యాంగ పునర్నిర్మాణము బిల్లులో సూచించిన ప్రకారము హైద్రాబాదు రాష్ట్రము విచ్ఛిన్నముచేయబడెను, అందలి కన్నడ మహారాష్ట్ర భాగములు నూతన కర్ణాటక, మహారాష్ట్రములతో కలిపివేయబడెను, తెలంగాణము ఆంధ్ర రాష్ట్రమునకు చేర్చబడెను. నిజాము ప్రభుత్వము అంతరించినది.

రాయలసీమలోను, ఉత్తరసర్కారులలోను, తెలంగాణములోను గల తెలుగుజిల్లాల నన్నింటిని కలిపి 1958 వ సంవత్సరము నవంబరు 1 వ తేదీన "ఆంధ్రప్రదేశ" మను పేరుతో నొక నూతన రాష్ట్రము నిర్మాణము గావింపబడెను. ఇట్లు యావదాంధ్రదేశములోని ముక్కోటి యాంధ్రులు రాజకీయముగ ఒకే రాష్ట్ర పరిపాలనలో నుండు భాగ్యము లభించినది. నూతన విశాలాంధ్ర రాష్ట్రనిర్మాణముతో ఆంధ్రుల చరిత్రయం దొక నూతన శకము ప్రారంభమగుచున్నది.

ది. వేం. ళి.

[[వర్గం:]]