సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మొదటి సంపుటము/ఆంధ్రదేశ చరిత్రము IV

ఆంధ్రదేశ చరిత్రము IV (1675 - 1900):- క్రీ. శ. 1675 నాటికి భారతదేశము నేలు మొగలాయి చక్రవర్తి అలంఘీరు పాదుషా లేక ఔరంగజేబు మిగుల బలవంతుడై దక్షిణాపథమునంతయు తన సామ్రాజ్యమున కలుపుకొన జూచుచుండెను. అప్పటికి గోదావరికి దక్షిణమున తూర్పు సముద్రతీరమువరకు గల విశాల దేశమును గోలకొండ సుల్తానుల పరిపాలించుచుండిరి. వీరి రాజప్రతినిధి శ్రీకాకుళము (చిక్కాకోలు)లో నుండెను. వీరి సేనాధిపతులు మద్రాసు చుట్టుపట్ల కర్ణాటకమని పిరువబడు దక్షిణమండలములనుగూడ క్రీ. శ. 1647 లో జయించి నప్పటినుండియు అక్కడి రాజులు, నాయకులు, పాళెగార్లు గోలకొండకు లోబడిరి. చెన్నపట్టణములో నొకకోట కట్టుకొని వ్యాపారము చేయుచున్న ఇంగ్లీషు వర్తక కంపెనీవారుకూడ గోలకొండ సుల్తానునకు కప్పముగట్టిరి. అనంతపుర మండలమును హండేరాజులు పరిపాలించు చుండిరి. కడప, కర్నూలు మండలములను నవాబులు పరిపాలించుచుండిరి. వీరందరును గోలకొండ రాజ్యమునకు సామంతులుగనే ఉండిరి.

క్రీ.శ. 1674 లో శివాజీ మహారాజు స్వతంత్ర మహారాష్ట్ర రాజ్యమును స్థాపనచేసి రాయగడ దుర్గమున పట్టాభి షిక్తుడై ఒక వంక బిజాపుర సుల్తాను రాజ్యమునకును ఇంకొకవంక మొగలాయి సామ్రాజ్యమునకును ప్రక్కలోని బల్లెమై విజృంభించెను.

క్రీ.శ. 1676 లో శివాజీ గోలకొండ సుల్తానుతో సంధిచేసికొని సైన్యములతో బయలు దేరి దక్షిణమున బిజాపురము వారి క్రింద జింజి మొదలగు జాగీరుల నేలుచున్న తన సవతితమ్ముడైన ఏకోజీ లేక వెంకోజీని ఓడించి అక్కడి దుర్గములను పట్టుకొని, బళ్ళారిని, కడపను కొల్లగొని, మొగలాయి సామ్రాజ్యము వారి ఒత్తిడిలేకుండ చేసెదనని, బిజాపురపు సుల్తానుతో నొక సంధిచేసికొనుటతో ఆతని రాజ్యము ఎక్కువగా బలవంత మయ్యెను. తన తండ్రి షాజహాను కాలముననే మొగలు సామ్రాజ్యమునకు లోబడి కప్పముగట్టుటకు అంగీకరించిన బిజాపూరు గోలకొండ సుల్తానులిట్లు శీవాజీతో కుట్రలు చేయుచుండుటవలన ఔరంగజేబున కాగ్రహము కలిగినను, ఆ సమయమున అతడు ఉత్తర భారతదేశమున ఆఫ్గన్

కొండజాతులను అణచుటలో నిమగ్నుడై యున్నందున దక్షిణాపథమువైపు తనదృష్టి నిమరల్పకపోయెను. శివాజీ క్రీ. శ. 1680 లో మరణించెను, ఔరంగజేబు దక్షిణాపథమునకువచ్చి అహమదు నగరమున విడిసి, క్రీ.శ. 1685 లో తన కొమారుని గోలకొండపైకి పంపగా వారొక తాత్కాలికసంధి చేసికొనిరి. ఔరంగ జేబు క్రీ. శ. 1686 లో బిజాపుర సుల్తానును, 1687 లో గోలకొండ సుల్తానును ఓడించెను. ఈ రెండు రాజ్యములు మొగలాయి రాజ్యములో కలిసిపోయినవి. అంతట ఔరంగ జేబు కృష్ణానదికి దక్షిణమునగల దేశమును గూడ జయించి తన రాజ్యమున జేర్చెను. ఆయన సేనాధిపతియగు గయాజుద్దీను కర్నూలును పట్టుకొనెను. బళ్ళారి, కడప మండలముల నేలు నవాబు, చక్రవర్తికి లోబడెను. కర్ణాటక ప్రాంతమంతయు మొగలాయి సామ్రాజ్యమున గలిసెను. ఈ దక్షిణ రాజ్యము నేలుటకు ఔరంగజేబు గయాజుద్దీను నే సుబేదారుగ నియమించెను. అప్పుడు దక్కను సుబేదారు క్రింద 22 పరగణాలుండెను. అందులో గోలకొండ ఒక రాష్ట్రము.

మొగలాయి సుబేదారుని ఫౌజుదారులను సేనాధివతులే వివిధ ప్రాంతములకు పరిపాలకులైరి, అయితే పూర్వము గోలకొండ సుల్తానుల క్రింద శిస్తులు వసూళ్ళు చేయుటకు గుత్తలు తీసికొనిన ప్రాతజమీందారులు శిస్తులియ్యక పేచీలు పెట్టుచున్నందున దేశములో కొన్ని చిల్లర యుద్ధములు చేయవలసి వచ్చుచుండెను.

ఔరంగజేబు చక్రవర్తి క్రీ. శ. 1707 లో చనిపోయెను. ఆయన కుమాళ్ళును మనుమలును అతని సింహాసనము నాక్రమించుటకు తగవులాడుకొన సాగిరి వివిధ ప్రాంతముల నేలు సుబేదారులును, సేనాధిపతులును బలవంతులై స్వతంత్రులు కాజొచ్చిరి.

క్రీ. శ. 1713 లో చక్రవర్తియైన ఫరుక్ షయ్యరు, మీర్ కమరుద్దీను ఆసఫ్ జా అను నొక మహమ్మదీయ ప్రభువునకు నిజాం ఉల్ ముల్కు అను బిరుదమునిచ్చి అతనిని దక్కను సుబేదారునిగ జేసెను. తరువాత నితడు మహమ్మదుషా చక్రవర్తి ఢిల్లీ దర్బారులో వజీరయ్యెను. కాని అక్కడి కుట్రలుచూచి క్రీ. శ. 1724 లో దక్షిణము నకు మరలివచ్చి హైదరాబాదు సుబేదారీని స్వతంత్ర రాజ్యముగ పరిపాలింపసాగెను. ఇతడు మహారాష్ట్రులకు చౌతు, సర్దేశము పన్నులు చెల్లించి వారి స్నేహముతో బలవంతుడయ్యెను. చక్రవర్తి ఇతనిని ఏమనలేకపోయెను.క్రీ. శ. 1739 లో పారశీక దళవరియైన నాదిర్షా, ఢిల్లీని కొల్లగొనగా, చక్రవర్తి మరింత దుర్బలుడై పోయెను. నిజాము, పేరునకు చక్రవర్తి యొక్క సుబేదారుడుగ నుండెనేకాని నిజమునకు స్వతంత్ర ప్రభు వయ్యెను.

గోలకొండ రాష్ట్రమున ఆర్కాటు, కర్నూలు, రాజమహేంద్రవరము, శ్రీకాకుళము నవాబులకు చెందిన నాలుగు రాజ్యభాగములుండెను. నిజాము రాజమహేంద్రవరము, శ్రీకాకుళము (చికాకోలు) పరగణాలకు అన్వరుద్దీను అను నతని నవాబుగ జేసెను. అతనిక్రింద రుస్తుంఖాను డను జిల్లాదారుడు క్రీ. శ. 1732 మొదలు ఏడు సింవత్సరములు రాజమహేంద్రవరమును, దానికి దక్షిణమనగల నాలుగు జిల్లాలను నిరంకుశముగ పాలించెను. ప్రజలను పీడించియు, భూమి శిస్తులను, మోతర్ఫాను వసూలు చేసి సర్కారుకు క్రమముగా చెల్లించని జమీందారులను పట్టి వధించియు, వారి పుట్టెలను సున్నపు రాళ్ళ స్తంభములలో పొదిగియు అతడు లోక భీకరుడ య్యెను.ఇట్టి స్తంభములను "కుల్లా మినారు" అనిరి. అట్టివాటిని ఏలూరులోను ఇతర ముఖ్య పట్టణము లందును అతడు కట్టించినాడు. అతనినిచూచి జమీందారులు గడగడలాడిరి.

నిజాముఉల్ ముల్కు ఆసఫ్ జా క్రీ. శ. 1748 జూను 1 వ తేదీన చనిపోయెను. అప్పు డతని పెద్దకుమారుడు ఢిల్లీలో నుండెను. రెండవకుమారు డయిన నాజరుజంగు తనను దక్కను సుబేదారునిగా ప్రకటించుకొని, పోటీగ నిలుచున్న మేనల్లుడు ముజఫరు జంగును ఆర్కాటులో ఖైదుచేసి యుంచెను. అంతట నిజాము సింహాసనమును గూర్చిన తగవులు బయలుదేరెను.

ఆ సమయమున ఈ దేశములో వర్తకము చేసికొనుటకు వచ్చిన పాశ్చాత్యులలో ఫ్రెంచి కంపెనీవారికి మచిలీబందరులో నొక వర్తకస్థాన ముండెను. ఇది పుదుచ్చేరిలోని ఫ్రెంచికంపెనీవారి గవర్నరుజనరలుకు లోబడిన వర్తకస్థానము. అప్పుడు ఫ్రెంచి గవర్నరు జనరలుగా నుండిన డూప్లె మిక్కిలి తెలివిగలవాడు. దక్షిణభారతదేశము నందలి రాజులు, నవాబులు, ఒండొరులతో పోరాడుకొనుచుండుటయు, వారి సైన్యములు సుక్షితములైనవి కాక అల్లరి మూకలుగనుండి సుక్షితము లయిన పాశ్చాత్య సైనికుల తుపాకి దెబ్బలకు నిలువలేనివై యుండుటయు గ్రహించిన డూ ప్లేకు వీటి నుపయోగించు నవాబుల వలనను, రాజుల వలనను రాజ్యలాభమును పొందవచ్చునని తోచెను. అతడు రాజ్యతంత్రము ప్రయోగించి చరిత్ర ప్రసిద్ధుడైనాడు.

దక్కను సువేదారికొరకు ఆసఫ్ జా రెండవ కుమారుడగు నాజరుజంగు, ఆసఫ్ జా దౌహిత్రుడయిన ముజఫరు జంగు తగవు లాడసాగిరి. నాజరుజంగు ఇంగ్లీషువారి సహాయమును పొంది ముజఫరుజంగును కారాగారమున బంధించెను. నాజరుజంగు చంపబడెను. అంత ముజఫరు జంగు ఫ్రెంచివారి సాయముతో విముక్తి చెంది సుబేదారు డయ్యెను. తనను చెరలోనుంచిన నాజరుజంగును ప్రతిఘటించి తనకు చేసిన ఉపకారమునకు ప్రతిఫలముగా ముజఫరుజంగు ఫ్రెంచివారికి మచిలీపట్టణమును, దివి సీమలను అర్పించి, వారి నాణెములు తన రాజ్యమున చెలామణి యగునట్లు శాసించి. కృష్ణానదికి దక్షిణమునగల రాజ్యమునకు డూప్లే గారిని గవర్నరునుగా నియమించెను. ముజఫరుజంగు అనంతరము ఫ్రెంచివారి సహాయముతో నిజాముల్ ముల్కు మూడవకుమారు డయిన సలాబత్ జంగు దక్కను సుబేదారు డయ్యెను. ఇతడును ఫ్రెంచి వారిపట్ల కృతజ్ఞుడై క్రీ. శ. 1752 లో మచిలీపట్టణ సర్కారున కంటియున్న కొండవీడు రాష్ట్రమును వారి కిచ్చెను. ఇట్లు కృష్ణానదికి రెండువైపులగల దేశమును, మచిలీబందరు, నిజాము పట్టణము, మోటుపల్లి రేవులును ఫ్రెంచివారి వశములైయుండెను. నిజాము దర్బారులో ఆయన దివానుకు కల గౌరవముకన్న ఫ్రెంచి సేనాధిపతియైన బుస్సీ దొరగారికే హెచ్చు గౌరవము జరుగసాగెను. ఫ్రెంచివారి సైన్యములను పోషించుటకై సలబతుజంగు వారికి కొండపల్లి, ఏలూరు, రాజమహేంద్రవరము, శ్రీకాకుళము పరగణాలను ఇచ్చెను. ఇట్లు ఫ్రెంచి వారికి సముద్రతీరమున గల 600 మైళ్ళ దేశమంతయు చేజిక్కెను. అప్పటికి భారతదేశమున వ్యాపారము చేయవచ్చిన ఏ పాశ్చాత్యులకును ఇంతరాజ్యము లేకుండెను. ఆనాటికి విశాఖపట్టణమండలములోని విజయనగరము వారి సంస్థానము మిక్కిలి గొప్పది. క్రీ. శ. 1710 మొదలు 1752 వరకు విజయనగర సంస్థానమును పరిపాలించిన పెదవిజయరామరాజుగారు తమ రాజధానిని పొట్నూరినుండి విజయనగరమునకు మార్చి, అచట ఒక కోటనుగట్టి చుట్టుప్రక్కలందు గల జమీందారులను లోబరచుకొని ఆ ప్రాంతములలో మిగుల బలవంతులుగ నుండిరి, విజయనగరము జమీందారీకి ప్రక్కగా శ్రీకాకుళములోనున్న నిజాము ఫౌజుదారు డీయన సహాయము నపేక్షించుచుండెను.

పైన పేర్కొనబడిన సందర్భములో విశాఖపట్టణము, గోదావరి మండలము మొదలుగాగల దేశభాగములను నిజాము ఫ్రెంచివారి కియ్యగా వారు వానిని స్వాధీన పరచుకొనుటలో నిజాము ఫౌజు దారుడు, ఆటంకములు కలిగించుట జూచి, బుస్సీ దొర పెద విజయరామరాజు గారికి ఆ రెండుజిల్లాలను చౌకబారు శిస్తుకు గుత్త కిచ్చెదనని చెప్పి ఆయనను తనవైపునకు త్రిప్పుకొనెను. అంతట అక్కడి జమీందారులను అణచుటకు బుస్సీ బయలుదేరి వచ్చెను.విజయరామరాజు గారు తమ విరోధులయిన బొబ్బిలి జమీందారీ నేలు వెలమ దొరలే అక్కడి జమీందారుల ధిక్కారమునకు కారణభూతులని బుస్సీ గారికి చెప్పగా, అతడు బొబ్బిలిమీదికి క్రీ. శ. 1757 లో చండయాత్రచేసి కోటను నేలమట్టము చేసెను. బుస్సీ పాత జమీందారీలను రద్దుచేసినట్లు ప్రకటించియు, ఫ్రెంచివారికి లోబడిన వారికి సన్నదుల నిచ్చి దేశాదాయములో పది యవవంతు చెల్లించుపధ్ధతితో వారికి మామూలుగా చెల్లు మర్యాదలను, రుసుములను ఉండనిచ్చెను. బొబ్బిలివారి వంశమున మిగిలిన చినరంగారావుగారిని మరల జమీందారునిగా బుస్సీగారు చేసిరి. బొబ్బిలి యుద్ధానంతరము పెద విజయ రామరాజుగారు వధింపబడిరి. వారి తరువాత ఆనంద రాజుగారు జమీందారు అయి శ్రీకాకుళము మొదలు రాజమహేంద్రమువరకు ప్రభువు అయిరి.

క్రీ. శ. 1758 లో ఫ్రెంచి గవర్నరు జనరలయిన కవుంటులాలీగారు బుస్సీగారీ ప్రాంతములం దుండుట వలన ప్రయోజనములను గుర్తింపలేక, కర్ణాటకములో తమకున్న ఫ్రెంచిస్థావరములకు కలుగుచున్న అలజడిని తప్పించి వాటిని స్థిరీకరించు నిమిత్తమై ఆయనను దక్షిణ ప్రాంతమునకు బదలాయించెను. దీనితో ఇంతవరకు మంచి అదనుకొరకు వేచియున్న ఇంగ్లీషు వర్తక కంపెనీ వారికి వీలుచిక్కెను. ఆనంద రాజుగారే వారి నాహ్వనించిరి. అంత ఇంగ్లీషువారు ఉత్తర సర్కారులలోనికి చొచ్చుకొనివచ్చి, మచిలీపట్టణమును పట్టుకొనిరి. అంత ఎనిమిది సంవత్సరములు కష్టపడి బుస్సీ నిర్మించిన ఫ్రెంచి రాజ్యము విచ్ఛిన్న మయ్యెను.

బుస్సీ ఈ ప్రాంతములందు శిస్తు నిర్ణయముచేసి, ప్రభుత్వ పద్ధతులు చక్కగా జరుగునట్లు కట్టుబాటులు చేసెను. అతనికాలమున శ్రీకాకుళము, రాజమహేంద్రవరము పరగణాలలో శిస్తులు రెట్టింపునకు పెరిగెను. జమీందారీలు దేశములో శాంతిని, భద్రతను కాపాడుటకు బాధ్యతవహించవలసి వచ్చెను. సాలునకు మూడు పంటలు ప్రభుత్వమునకును, రైతులకును మధ్య పంపిణీ చేయుటకును, మరాటీదండు మొదలయిన శత్రువుల వలన భయములేకుండ కాపాడుటకును, జమీందారులు పండ్రెండు వేల కాల్బలమును సిద్ధముగా నుంచుటకును, బుస్సీ కట్టుబాట్లు చేసెను. బుస్సీ తన అధికార గౌరవము నిలువ బెట్టుకొనుటకొరకును, తన సౌఖ్యముకొరకును, కావలసిన సొమ్ముకన్న హెచ్చుసొమ్మును తన క్రింద వినియోగించుకొనలేదు. దేశములో అక్రమములు చేయు వారికి బుస్సీ పేరు సింహ స్వప్నముగా నుండెను.

ప్రభుత్వమువారి ఆజ్ఞా ప్రకారము బుస్సీ తన ఫ్రెంచి సైన్యమును తీసికొని తరలిపోగా, నిజాము సలబతుజంగు దిక్కులేని వాడయ్యెను. ఈ యదనును గ్రహించి సలబతుజంగు తమ్ముడు నిజామలీఖాను రాజపదవి పై కన్నువైచి తత్సంపాదనాప్రయత్నములు చేయసాగెను. అందుచే జయములమీద జయములను పొందుచు. ఫ్రెంచి వారికి నిలువ నీడలేకుండ చేయుచున్న ఇంగ్లీషువారిని సలబతుజంగు ఆశ్రయించి క్రీ. శ. 1759 లో వారితో ఒక సంధిచేసికొనేను. ఆ సంధిప్రకారము నిజాము సలబతుజంగు మచిలీపట్టణముక్రింద నుండిన 80 మైళ్ళ సముద్రపు భూభాగమెల్ల ఇంగ్లీషువారికి స్వాధీనము చేసెను. మిగిలిన దేశము పేరునకు నిజాము క్రిందనున్నను, ఇంగ్లీషువారి పలుకుబడియే అక్కడ చెల్లుచుండెను. ఐతే నిజామలీఖాను ఇంగ్లీషు కంపెనీవారి సహాయముతో క్రీ. శ. 1761 లో నిజాము సలబతుజంగును రాజ్యభ్రష్టుని చేసెను.

క్రీ.శ. 1761 లో ఆసఫ్ జా నాల్గవ కుమారుడు నిజామలీఖాను దక్కనుకు సుబేదారుడై నిజాము బిరుదు వహించెను. ఇంగ్లీషు కంపెనీవారు తనకు సైనిక సహాయముచేయు పద్ధతిపై ఇతడు 1762 లో శ్రీకాకుళము, రాజమహేంద్రవరము, ఏలూరు, కొండపల్లి అను నాలుగు సర్కారులను వారికిచ్చెను. ఈరాజ్యమును వారు స్వయముగా పరిపాలించుటకు జంకి, తాము కోరినప్పుడు తమకు స్వాధీనపరచు పద్ధతిపై ఆ ప్రాంతమును నిజాము సరదారుడైన హుస్సేనల్లీ క్రిందనే యుంచిరి. ఫ్రెంచి వారెవ్వరును ఈ దేశములోనికి రాకుండ చేయుటయే ఇంగ్లీషువారు' అప్పుడు తల పెట్టిన ముఖ్య కార్యము.

బంగాళమున ప్లాసీయుద్ధములో విజయము పొందిన పిమ్మట క్లైవు బలవంతుడై ఢిల్లీ చక్రవర్తితో రాయబారములు జరుపగా ఇంగ్లీషు కంపెనీ వారిని ఢిల్లీ చక్రవర్తి బంగాళము, బీహారు, ఒరిస్సా పరగణాలకు క్రీ.శ. 1765లో దివానులుగ జేసెను. ఆ సందర్భమున క్లైవు, చక్రవర్తి వలన ఉత్తర సర్కారులకు కూడ ఒక సన్నదు సంపాదించెను. అతడు ఈ సంగతిని మచిలీబందరులో ప్రకటించి ఫ్రెంచివా రీప్రాంతములకు రాకుండ చేసెను. అయితే ఈప్రాంతములన్నింటికిని నిజముగా పరిపాలకుడు దక్కను సుబేదారుడైన హైదరాబాదు నిజామే. అందుచేత అతనితో ఇంగ్లీషు కంపెనీవారు క్రీ. శ. 1766 లోను 1768 లోను సంధి రాయబారములు జరిపి, ఆయనకు సైనికసహాయము చేయు పద్ధతిలో, ఉత్తర సర్కారులకు ధ్రువమైన కౌలు పొందిరి. కాని వానిని వెంటనే తాము స్వాధీనపరచుకొనక, తమకు ఎప్పుడు కావలసిన అప్పుడు వశపరచుకొను పద్ధతిపై హుస్సేనల్లీ అను నిజాము సర్దారు క్రిందనే ఉంచిరిగదా! ఆ ఏర్పాటు 1769 తో అంతమయ్యెను. అంతట కంపెనీవారు ఉత్తర సర్కారులను స్వయముగా పరిపాలింపసాగిరి. అంతవరకును గుంటూరు మండలము మాత్రము నిజామల్లీఖాను సోదరుడైన బసాలతుజంగు క్రింద నుండెను. దానిని కూడ కంపెనీ వారు క్రీ. శ. 1778 లో ఆయనవలన కౌలుకు తీసికొనుటతో ఈ జిల్లాలన్నియు వారి వశమయ్యెను. అంతట ఈ ప్రాంతము చెన్నపట్టణ రాజధానిలోని భాగముగా పరిపాలింపబడసాగెను.

ఇంగ్లీషువారి పరిపాలన : ఉత్తరసర్దారులు ఇంగ్లీషువారి వశమగునప్పటికి గ్రామపరిపాలనము, గ్రామపంచాయతుల ద్వారమున జరుగుచుండెను. గ్రామమునసబు, కరణము, మణేదారు, తలారి మొదలగు అధికారులును, గ్రామమునకు కావలసిన పనులు చేయు వృత్తుల వారును, ఆయకాండ్రనబడిరి. భూమిపంటలో వీరికి స్వల్ప భాగము లొసగబడు చుండెను. పంటలో సర్కారుకు చెల్లవలసిన భాగమే శిస్తు. అప్పుడప్పుడు జమీందారుల సిబ్బందులు ఇంకను సొమ్ముకావలెనని ప్రజలను బాధించుచుండెను.

జమీందారీ ప్రాంతమందలి భూమియంతయు జమీందారుల క్రింద నుండేడిది కాదు. ప్రతి జిల్లా యొక్క ముఖ్యపట్టణము చుట్టుపట్లనుండు భూములును సర్కారుభూములుగ నుండెను, వాటిని హవేలీ భూము లనిరి. వాటిమీదవచ్చు ఆదాయము మహమ్మదీయ సైనిక వ్యయముక్రిందను, ఉద్యోగుల జీతబత్తెములు క్రిందను వినియోగింప బడుచుండెను.

మహమ్మదీయుల కాలమున ఉత్తర సర్కారులలో నాలుగు న్యాయస్థానము లుండెను. ఏలూరులోను, రాజమహేంద్రవరము లోను "ఖాజీలు" క్రిమినలు నేర విచారణలు చేయుచుండిరి. పెద్ద కేసులను విచారించుటకును, మరణదండన విధించుటకును, ఫౌజుదారులు అమలుదారులు మాత్రమే అధికారము కలిగియుండిరి.

ఈ దేశము తమ వశము కాగానే ఇంగ్లీషు కంపెనీవారు తమ ఏజంటుల ద్వారమునను, దుబాషులద్వారమునను, పరిపాలన జరుపసాగిరి. వీరిపైన రాష్ట్రీయక వున్సిళ్లు అను కార్యాలోచనా సంఘములును, వానికి ఛీపు లను ముఖ్యాధ్యక్షులును ఉండిరి. వీరిపైన మద్రాసులోని గవర్నరుండెను. క్రీ. శ. 1784 లో మద్రాసు గవర్నరును కలకత్తాలోని గవర్నరు జనరలు అధికారమునకు లోబరచిరి. 1786 లో చెన్న పట్టణమున నొక రెవిన్యూ బోర్డు నేర్పాటు చేసిరి. 1794 లో అదివరకు అమలు జరుగుచున్న పరిపాలనా పద్ధతిని మార్చి ప్రతి జిల్లాకును కలెక్టర్ల నేర్పాటు చేసిరి. నేరములను విచారించుటకు మేజ స్ట్రేటులును, సివిలు తగాదాలను తీర్మానించుటకు మునసబులును, సదరమీనులును, వారిపైన అదాలతు న్యాయ స్థానములును ఏర్పాటు చేయబడెను. ఇవన్నియు కంపెనీవారి కోర్టులు. చెన్నపట్టణములో, ఇంగ్లాండు దేశ రాజ్యాధి కారము క్రింద పరమోన్నత న్యాయస్థానము 1800 లో నెలకొల్పబడినది. క్రీ. శ. 1823లో కంపెనీవారు ఉత్తర సర్కారు లపైన నిజామునకు ప్రతి ఏట చెల్లించు పేష్కషకు బదులుగా రు. 11,66,666 రూపాయలు ఒకే మొత్తముగా చెల్లించి సర్వాధికారు లయిరి. అప్పటినుండి 1859 సం.వరకును ఈ ప్రాంతము విశాఖపట్టణము, రాజమహేంద్రవరము, మచిలీపట్టణము, గుంటూరు, నెల్లూరు అను అయిదు జిల్లాలుగా విభజింపబడి చెన్న పట్టణ రాజధానిలో చేరియుండెను.

జమీందారీలు  : ఉత్తర సర్కారులు ఇంగ్లీషు కంపెనీ వారి వశము లగునాటికి గంజాముజిల్లాలోని పర్లాకిమిడియు, విశాఖపట్టణములోని విజయనగరము, జయపురము, బొబ్బిలి జమీందారీలును, గోదావరిజిల్లాలోని పెద్దాపురము, మొగలితుఱ్ఱు, పిఠాపురము, గూటాల, పోలవరము, కోటరామచంద్రపురము మొదలయిన జమీందారీలును, కృష్ణాజిల్లాలోని నూజవీడు జమీందారీలును ముఖ్యమైన విగనుండెను. నెల్లూరుజిల్లాలోని వేంకటగిరి, చిత్తూరుజిల్లాలోని కాళహస్తి, ఉత్తరా ర్కాటులోని కార్వేటినగరము జమీందారీలుకూడ తెలుగు జమీందారీలే.

ఉత్తర సర్కారులలోని జమీందారులు మట్టికోటలను గట్టుకొని రాజబిరుదములను వహించి, రాజలాంఛనములతో రాజభోగముల ననుభవించుచు, రైతులను పీడించి పుచ్చుకొనుచున్న సొమ్మును దుర్వినియోగముచేసి, తాము సర్కారుకు ఇవ్వవలసిన శిస్తులు బకాయి పెట్టి, పేచీలు పెట్టుచు అక్రమములు చేయుచుండిరి. పూర్వపు మహమ్మ దీయ నవాబుల అధికార పురుషులు హెచ్చుసొమ్ము నొనగుడని జమీందారులను బాధించుచుండిరి. దేశము తమ స్వాధీనమైన పిమ్మట, ఇంగ్లీషుకంపెనీవారు జమీందారులు తమకు చెల్లింపవలసిన శిస్తు మొత్తములను నిర్ణయించి, వానిని కఠినముగా వసూలు చేయుచుండిరి. కొన్ని జమీందారీలవలన మొత్తము ఆదాయములో మూడింట రెండువంతులు కూడ వసూలు చేయసాగిరి. క్రీ. శ. 1786 లో అతివృష్టివలన పంటలు పాడుకాగా జమీందారులు సర్కారు శిస్తులు చెల్లించలేక బాకీలుపడిరి. కొందరు మెల్లగా బాకీలను పరిష్కరించిగి, కొందరు పరిష్క రింపలేక పేచీలు పెట్టిరి. ఆ సందర్భములో కంపెనీవారు కొన్ని జమీందారీలను వశము చేసికొనిరి.

కంపెనీవారు క్రీ.శ. 1802 లో జమీందారీ గ్రామములలోని రైతులవలన జమీందారులు వసూలు చేయతగిన శిస్తులను, జమీందారులు కంపెనీవారికి చెల్లించవలసిన పేష్కషును, శాశ్వతముగా నిర్ణయముచేసిరి. దీనికే పర్మనెంటు సెటిల్మెంటు అని పేరు. ఈ ప్రకారము శాశ్వతముగా ఫైసలా చేసి జమీందారులకు సన్నదు లిచ్చిరి. జమీందారులు తరువాత అనేక ఉపాయముల నవలంబించి రైతులవలన వసూలుచేయు శిస్తులను హెచ్చించిరి. క్రొత్తరుసుము లనేకములు వసూలు చేయసాగిరి. అందువలన తగు కట్టుబాటులు చేయుచు ఇంగ్లీషు ప్రభుత్వము వారు జమీందారీల చట్టమును చేయవలసి వచ్చెను.

తెలుగుదేశములోని జమీందారీలలో నెల్ల గొప్పది విజయనగరము. ఇందు మూడువేల ఎకరముల భూమియు, 1252 గ్రామములును ఉండెను. ఈ జమీందారీ నిజమున కొక సంస్థానమువలె నుండెను. దీని విషయమునగూడ కంపెనీవారు క్రీ. శ. 1802 లో శాశ్వతమైన ఫైసలా జరిపి సన్నదు నిచ్చిరి. తరువాత ఇంగ్లీషు ప్రభుత్వము వారు క్రీ. శ. 1862 లో జమీందారుగారికి 'రాజా' అను బిరుదమును, 18 ఫిరంగులు కాల్చు గౌరవము నిచ్చిరి.

మొగలితుఱ్ఱు జమీందారీ అప్పులలోపడి శిస్తులు చెల్లించలేకపోగా కంపెనీవారు వాటిని రద్దుచేసిరి. పెద్దాపురము జమీందారీకూడ చాల గొప్పదేకాని అది కూడ ఋణగ్రస్తమై శిస్తులు చెల్లించలేక విచ్ఛిన్నమైనది. పిఠాపురము మాత్రము అభివృద్ధిచెందినది. కృష్ణామండలమున నూజవీడు జమీందారీ 1802 లో రెండుభాగము అయినది. తరువాత వ్యాజ్యములు రాగా నూజవీడు సగభాగము 1879 లో మరల ఆరుభాగము అయినది. వేంకటగిరి జమీందారులు హైదరాలీని ప్రతిఘటించి కంపెనీవారికి సహాయు అయినందువలన వారికి నమ్మిన బంటు లయిరి. ఈ జమీందారులలో కొందరు రైతులను బాధించి సొమ్మును పిండి దుర్వినియోగము చేసిరి. కొందరు పాఠశాలలు మొదలగు ప్రజోపయుక్త సంస్థలను నిర్మించి ప్రఖ్యాతిగాంచిరి. " విద్యాభివృద్ధికి విజయనగర మహారాజుగారయిన ఆనందగజపతిగారు చేసిన దాన ధర్మములు మన జిల్లాలలోనేగాక చెన్న పట్టణమునగూడ నేటికి నిలిచియున్నవి.

రాయలసీమ  : రాయలసీమలోని వివిధ మండలములు గోలకొండ సుల్తాను దండయాత్రల అనంతరము మహమ్మదీయ నవాబులకును, తరువాత మొగలు చక్రవర్తికిని లోబడెను. దేశమున రాజులు మారినను ఆయా ప్రాంతములలోని చిన్న ప్రభువులు, నాయకులు, పాళెగార్లు మారలేదు. గ్రామపరిపాలనము పండ్రెండు ఆయకాండ్ర ద్వారమునను, పంచాయతుల ద్వారమునను ఎప్పటివలెనే జరుగుచుండెను. ఔరంగజేబు చనిపోయినపిదప వచ్చిన కల్లోలములలో మహారాష్ట్రుల దండయాత్రలవలన ఈ ప్రాంతములు బాధల ననుభవించెను. అటుపిమ్మట క్రీ. శ. 1766 లో మైసూరు రాజ్యమునకు పరిపాలకుడైన హైదరాలీ క్రీ. శ. 1780 లో కడప నవాబును ఖైదుచేసి బళ్ళారి ప్రాంతముల నాక్రమించెను. హైదరాలీ అనంతరము టిప్పుసుల్తాను నిజాముతోను, కంపెనీవారితోను క్రీ. శ. 1792 లో చేసికొనిన సంధివలన కడపలోని కొంత భాగమును, బళ్ళారిలోని కొంత భాగమును నిజామున కిచ్చెను. ఈ రెండు మండలములలోని మిగిలిన భాగము, టిప్పుసుల్తాను క్రీ. శ. 1799 లో మరణింపగా. నిజాము వశమయ్యెను. అనంతపుర మండలమును పొలించు చుండిన హండేరాజులను హైదరాలీ అణచివేసి దేశాక్రమణము చేయగా, ఇదియు తక్కిన మండలములవలెనే, టిప్పు కాలమున క్రీ. శ. 1792 లో కొంత భాగము, 1799 లో తక్కిన భాగము నిజాము వశమయ్యెను. ఈ మండలముల నన్నిటిని నిజాము తాను కంపెనీవారికి సైనికవ్యయము క్రింద ఇయ్యవలసిన సొమ్ము క్రింద, క్రీ.శ.1800 సంవత్సరమున ఇచ్చివేసెను. అందువలన వీనిని దత్తమండలము లనిరి, తరువాత సర్ బిరుదమునందిన థామస్ మన్రోగారు ఈమండలములకు కలెక్టరై, ప్రజాను రంజకుడై పరిపాలించెను. 1808 లో బళ్ళారిని కడప, బళ్ళారి జిల్లాలుగా జేసిరి. 1882 లో అనంతపుర మండలములో కొంతభాగమును బళ్ళారిలో చేర్చి, మిగత భాగమును అనంతపుర మండలముగ చేసిరి.

కర్నూలుజిల్లా మొగలాయి సేనాధిపతికి జాగీరుగా నొసగబడెను. అది అప్పటినుండి మహమ్మదీయ నవాబు పరిపాలన క్రింద నుండెను. క్రీ.శ. 1755 లో కర్నూలు నవాబు హైదరాలీకి లోబడి కప్పముగట్టుట కంగీకరించెను.1799 లో టిప్పుసుల్తాను అనంతరము కప్పముగొను నధికారము నిజామున కొసగబడెను. 1823 లో కర్నూలు నవాబైన గులాం రసూలుఖాను తమపట్ల రాజద్రోహ మొనరించె నని కంపెనీవారు 1839 లో అతనిని ఖైదు చేసిరి. కర్నూలు బ్రిటిషు జిల్లాగా మారెను. చెంగల్పట్టు జిల్లా 1087 లో తక్కిన కర్ణాటక ప్రాంతముతో పాటు మొగలుసామ్రాజ్యమున భాగమై ఆర్కాటు రాజధానిగాగల కర్ణాటక నవాబుచే పరిపాలింపబడసాగెను. కర్ణాటక నవాబు ఇంగ్లీషు వారికి స్నేహితుడై అప్పులపాలై తుద కీజిల్లాను కం పెనీవారికి 1763 లో జాగీరుగానిచ్చెను. దీనిని కంపెనీవారు పరిపాలింపసాగిరి. నెల్లూరు కర్ణాటక నవాబు తమ్మునిక్రింద నుండెను. అతడు మొదట ఫ్రెంచి వారితో చేరినను తరువాత 1759లో ఇంగ్లీషువారితో కలిసెను. 1781 లో ఈ మండలముపైన శిస్తువసూలు చేయు హక్కు నవాబు కంపెనీ కిచ్చెను. 1801 లో తక్కిన కర్ణాటకముతోపాటుగా దీనిని కూడ నవాబు కంపెనీవారి కిచ్చివేసెను. ఇప్పుడు కోయంబత్తూరు అని వ్యవహరింపబడు ప్రాంతమును పూర్వము బారామహలు అనిరి. అది హైదరాలీ వశము అయ్యెను. తరువాత టిప్పుసుల్తాను ఇంగ్లీషువారితో 1793 లో చేసికొనిన సంధి షరతు ప్రకారము దానిని వారి కిచ్చెను.

హైదరాబాదు నిజామురాజ్యము  :- హైదరాబాదు నవాబు నిజామల్లీఖాను 1803 లో చనిపోగా ఆయన కుమారుడు సికిందరుజాహ నిజామయ్యెను. దక్కను సుబేదారుడుగా ఢిల్లీ చక్రవర్తి అంగీకారమునుపొందు నాటకము యథాప్రకారము జరుపబడెను. నిజాము, మునీరు ఉల్ ముల్కును ప్రధానమంత్రిగా చేసినను దివాను పేష్కారగు చందులాలుగారే అన్ని వ్యవహారములు జరిగింపసాగిరి, ఆయన ఇంగ్లీషువారికి అను కూలుడు. నిజాము సైన్యము ఇంగ్లీషు ఉద్యోగుల సహాయముతో సంస్కరింపబడెను. సికిందరుజాహ పరిపాలన కడపటి భాగమున పాడయ్యెను. రాజ్యములో వివిధ ప్రాంతములందు శిస్తు వసూలు హక్కులు గుత్తకియ్యబడి ఆ గుత్తేదారులు కావించు ప్రజాపీడనము మితిమీరెను. ప్రభుత్వము ఋణగ్రస్తమయ్యెను. ఇంగ్లీషు వారికి బాకీపడెను. దేశములో కల్లోలము కలిగెను. దారి దోపిడిదొంగలు విజృంభించిరి. ఇంగ్లీషు సైన్యములీ కల్లోలము నడచవలసి వచ్చెను. అంతట నిజాము సర్కారువారి కోరికపై జిల్లాలను వేరువేరుగా పరిపాలించుటకు ఇంగ్లీషు కలెక్టర్లు నియమింపబడిరి. ఈ సమయముననే కంపెనీవారు నిజాముకు 11,66,666 రూపాయలిచ్చి ఉత్తర సర్కారులకు సర్వాధికారు లైరి.

సికిందరుజాహ 1829 లో చనిపోయెను. నాజరుద్దౌలా నిజామయ్యెను. అతడు ఇంగ్లీషు కలెక్టర్లను తీసివేయమని కోరెను. మరల దుష్పరిపాలనము, ప్రజాపీడనము ప్రారంభమయ్యెను, అశాంతి హెచ్చెను. దౌర్జన్యములు చెలరేగెను . చందులాలు 1843లో తన పదవికి రాజీనామా నిచ్చెను. నిజాము నియమించిన మంత్రులు అసమర్థులైరి. నిజాము సైనిక వ్యయముక్రింద చాలా సొమ్ము బాకీపడి 1853 లో హైదరాబాదులోని రాయచూరు మొదలయిన కొన్ని జిల్లాలను కంపెనీవారి వశము చేసెను.

ఆకాలమున నిజాము కొలువులోనుండిన అరబ్బులు రోహిలాలు ఆయుధజీవులై కంటబడిన వారిపై నెల్ల దౌర్జన్యములు చేయుచుండిరి. వారు చేయు నేరములను వారినాయకులే విచారించవలెనుగాని సామాన్యన్యాయ స్థానములు విచారింప వీలులేదు. అందువలన వారుచేయు అక్రమములకు మితిలేకుండెను.

నాజరుద్దౌలా క్రీ. శ. 1857 లో చనిపోగా అఫ్ జుల్ ఉద్దౌలా (క్రీ. శ. 1857-69) నిజామయ్యెను. పూర్వపు మంత్రియైన సురాజ్ ఉల్ ముల్కుకు దగ్గర బందుగుడైన సాలారుజంగు ప్రధానమంత్రి యయ్యెను. ఇతడు చాల తెలివైనవాడు. దేశవ్యవహారములను చాల సమర్థతతో నిర్వహించుటయేగాక ఇంగ్లీషు ప్రభుత్వము వారికి నమ్మిన బంటుగానుండి పేరుపొందినాడు.

ఆంధ్రదేశ ఆర్థిక పరిస్థితులు : భారత దేశమునకు ఇంగ్లీషువారు వర్తకము చేసికొనుటకు వచ్చునప్పటికి ఈ దేశములో చాల సున్నితములైన రవ సెల్లాలు, జిలుగు వలువలు తయారగుచుండెను. మన పనివాండ్రు చాల నాజూకయిన వస్తువులను తయారుచేయుచుండిరి. పాశ్చాత్యూల కీ వస్తువులన్న చాల ప్రీతి. అందువలన వారు కోట్లకొలది విలువగల బంగారు తెచ్చి మనదేశములోని వస్తువులు కొని ఎగుమతి చేయసాగిరి. ఆ కాలమున మన దేశములోని సన్ననినూలురవ సెల్లాలు జగత్ప్రసిద్ధములై యుండెను. తెలంగాణమునందలి నాందేడులోను, తూర్పు కోస్తాయందలి పొందూరు మొదలగు ప్రాంతములలోను అట్టి సన్ననిబట్టయే తయారగుచుండెను. నిజాము రాజ్యములోని వరంగల్లు, నారాయణపేట మొదలగుచోట్ల టస్సరు పట్టుబట్టలును, హైదరాబాదు, గద్వాలలో నూలు, పట్టు కలిపిన మష్రూ అను అపూర్వపు నేతబట్టలును తయారగుచుండెను. తెలంగాణమున చాలచోట్లకరిగించిన ఇనుముతోను, ఉక్కుతోను అనేక వస్తువులు చేయుచుండిరి. నిర్మల, హైదరాబాదు, గద్వాల, వనపర్తి మున్నగు చోట్ల కత్తులును, తుపాకులును చేయుచుండిరి. మచిలీ బందరులో కాలికో అను బట్టలను, తూర్పుకోస్తాలో రకరకముల నూలుబట్టలను తయారుచేసి ఎగుమతి చేయు చుండిరి. ఔరంగాబాదు, వరంగల్లులలో జంపకానాలు, ఉన్ని, పట్టు తివాచీలు నేయుచుండిరి. ఇంగ్లీషువారు మన నవాబులను, రాజులను ఆశ్రయించి కొంత పలుకుబడిని సంపాదించుకొని మన పారిశ్రామికులు తమకు చౌకగా సరకుల నమ్మునట్లు నిర్బంధించుచుండిరి. ఇట్టి స్థితిలో, ఇంగ్లీషువారికి మన దేశములో రాజ్యాధికారము కలుగు సమయమునకు వారిదేశములో యంత్ర పరిశ్రమ స్థాపింపబడి, యంత్రములపైని సరకులు తయారుచేయబడుచుండెను. అంతట మనదేశమునుండి అనేక విధములుగా తీసికొని వెళ్ళిన సొమ్ముతో యంత్ర పరిశ్రమల నభివృద్ధిచేసికొని మనదేశములోని సరకులకు పోటీగా యంత్రములమీద తయారయిన సరకులను చౌకగా అమ్మి మన పరిశ్రమలను నాశనముచేసిరి. క్రీ. శ. 1825 నాటికి మనదేశములో రవసెల్లాలను ఎగుమతిచేయు వ్యాపారము పూర్తిగా ఆగిపోయినది. మధ్యభారతములో పొలిటికల్ ఏజంటుగా నుండిన కెప్టెన్ విల్కిన్సన్ గారు క్రీ. శ. 1838 లో హైదరాబాదు రెసిడెంటుగారికి వ్రాయుచు “నేతగాండ్రు బిచ్చగాండ్ర స్థితికి దిగిపోయినారు. మనము యంత్రములమీద తయారుచేసిన నూలు బట్టలను ఈ దేశములోనికి తెచ్చి ముంచెత్తివైచినందువలన ఈ నేతగాండ్రనోటి అన్నము మనము పడగొట్టినాము" అనినాడు. (Hyderabad Residency Records, Vol. 394, page 73)

ఇట్లు అనేకవిధము లయిన వస్తువులను యంత్రముల పయిన చౌకగా తయారుచేసి మన పరిశ్రమలను నాశనము చేసిరిగాని ఉత్తర భారతమునను, తెలంగాణములోను “బిద్రీ" అను పంచలోహముల పళ్ళెములు, గిన్నెలు మొదలయిన వానికి అతి సున్నితములయిన నగిషీలు చెక్కి, వెండిపూత పూసి తయారుచేయు చేతిపనిని ఇంగ్లీషువారు అనుకరింప లేకపోయినందున ఇప్పటికిని అది మిగిలి యున్నది.

రాకపోకలు రవాణాలు  : ఆకాలమున సూరతునుండి గోలకొండకును, అక్కడినుండి మచిలీపట్టణమునకును, చెన్నపట్టణమునకును, గండికోటకును వర్తకులు సరకులను తీసికొనిపోవుచుండిరి. ఆ కాలమున దేశములో అన్ని ముఖ్యపట్టణములకు రాకపోకలకు మార్గము లుండెను. కాని కంకరరోడ్లు లేవు. మనుష్యులు పల్లకీలలోను,గుఱ్ఱములపైనను ప్రయాణము చేయుచుండిరి.సరకులను బండ్లపైనగాక, రెండు ప్రక్కలకు దిగు కంట్లములు అను సంచుల జతలను మోయు వేలకొలది ఎడ్లపైనను, కంచరగాడిదల పైనను బిడారులుగా తీసికొనిపోవుచుండిరి. ఆ కాలమున దేశమునందు శాంతిభద్రతలు లేవు. దారిలో బందిపోటుదొంగలు దోచుకొనుచుండిరి. మార్గస్థులను మోసగించి గొంతుకలకు ఉరిపోసి చంపు థగ్గులు విచ్చలవిడిగా తిరుగుచుండిరి. అందువలన వర్తకులును ప్రయాణికులును ఆయుధపాణుల సహాయముతో పోవుచుండిరి.

ఈ పరిస్థితులలో పిండారీదండులు బయలుదేరి గ్రామములను కొల్లగొని, ఇండ్లను తగులబెట్టి, స్త్రీలను చెరచి ప్రజలను బాధింపసాగిరి. వీరిలో మరాఠీదండులలోనివారే గాక మొగలుల కాలములో సైనికులుగా నుండి పనిలేక తిరుగుచు దోపిడి రుచిమరిగిన మహమ్మదీయులును ఉండిరి. వీరితో స్త్రీలు కూడ బయలు దేరి క్రూరకృత్యములు చేయుచుండిరి. క్రీ. శ. 1814 నాటికి పిండారీల సైన్యమున 21,000 గుఱ్ఱపుదళము, 15,000 కాల్బలము ఉండెను. పిండారీలు తెలంగాణమును, రాయల సీమను, ఉత్తరసర్కారులను దోచుకొనసాగిరి. కంపెనీ వారు తమరాజ్యమున వీరి ఆగడము లెక్కుడయినందున వీరిపైన యుద్ధముచేసి చెదర గొట్టిరి. క్రీ.. 1831-36 మధ్య కంపెనీవారు థగ్గులను పట్టుకొని ఊపుమాపిరి.

విద్యాభివృద్ధి : ఇంగ్లీషువారీ దేశమున తమంతట తాము ఇంగ్లీషు విద్య ప్రవేశ పెట్టలేదు. ప్రజలలో విద్యాభివృద్ధి గావింపలేదు. కంపెనీ వారు మొదట సంస్కృతము, అరబ్బీ, పారశీ మొదలయిన భాషలలో పూర్వపు విద్యావిధానమునే పోషించిరి. దేశీయులు కొందరు తమంతట తాము ఇంగ్లీషు నభ్యసించి, వారి కొలువులో చేరి ఇంగ్లీషు విద్య ప్రవేశ పెట్టుడని కోరసాగిరి. ఇంగ్లీషు దొరలకు దేశ భాషలు నేర్పుట అవసరమైనందున చెన్న పట్టణమున కోటలో క్రీ. శ. 1812 లో “కాలేజి" యను పాఠశాలను కంపెనీవారు దొరలకొరకు స్థాపించిరి. అందులో తెలుగు నేర్చిన దొరలు కొందరు తెలుగు వ్యాకరణములను ఇంగ్లీషులో రచించిరి. నిఘంటువులను ప్రకటించిరి. వారిలో క్యాంబెల్, విలియం బ్రౌను, సి. పి. బ్రౌను గార్లు ప్రముఖులు.

చెన్నపట్టణమున ఆంధ్ర ప్రముఖు లయిన ఏనుగులు వీరాస్వామయ్య, కోమలేశ్వరపురం శ్రీనివాసపిళ్ళె, వెంబాకం రాఘవాచార్యులు మొదలయినవారు కలిసి 'హిందూ లిటరరీ సొసైటీ'ని స్థాపించిరి. కంపెనీ పరిపాలనను గూర్చి అందులో ప్రజలు తమకష్టము లెవరికి చెప్పుకొనవలెనో తెలుపగల రాజకీయ పరిజ్ఞానమును ప్రజలకు కలిగింపదలచి చెన్నపట్టణము సుప్రీముకోర్టులో అడ్వకేటు జనరలయిన జార్జి నార్టన్ గారిచే క్రీ. శ. 1832-33 మధ్య ఉపన్యాసము లిప్పించిరి. ఆ కాలమునవచ్చిన కరవులో వీరు చెన్నపట్టణమున బీద వారికి గంజి పోయుటకు ఏర్పాటులు చేసి ప్రజాసేవ చేసిరి. పచ్చయ్యప్ప మొదలియారుగారి దానధర్మములను బ య లు ప ర చి, హిందూబాలుర విద్యాభివృద్ధికి వాటిని వినియోగించునట్లు సుప్రీముకోర్టువారి ఉత్తరువు పొందిరి. ఈ పరిస్థితులలో తర్జనభర్జనలు జరిగిన పిమ్మట ఇంగ్లీషు వారు తమకు ఇంగ్లీషు నేర్చిన గుమాస్తాలు కావలసి యున్నందున ఎట్టకేలకు ఈ దేశమున ఇంగ్లీషుభాషను, విజ్ఞానమును బోధించు విద్యావిధానము స్థాపించుటకు క్రీ.శ. 1835 లో నిశ్చయించిరి. 1840 లో చెన్నపట్టణమున స్థాపింపబడిన ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీషు, అరవము, తెలుగు బోధించుట కేర్పాటుచేయబడెను. క్రీ.శ. 1842 లో పచ్చయప్ప పాఠశాల స్థాపింపబడి అట్టి ఏర్పాటులే చేయబడెను.

క్రైస్తవమత ప్రచారము : ఇంగ్లీషు కంపెనీవారీదేశము లోనికి చాలకాలమువరకు క్రైస్తవ మతబోధకులను రానియ్యలేదు. హిందువులు మతాచారములపట్ల కంపెనీవారు సానుభూతితో ప్రవర్తించుచు హిందువుల దేవాలయములను కొన్నిటిని తామే నిర్వహించుచుండిరి. ఇంగ్లీషు కలెక్టరులే దేవాలయములలోని అర్చకులను నియమించి నిత్యధూపదీప నైవేద్యముల కేర్పాటులు చేయుచు, దగ్గరనుండి ఉత్సవములు జరిపించుచుండిరి. దేవాదాయముల పరిపాలనను గూర్చి క్రీ. శ. 1817 లో ఒక చట్టముకూడ చేయబడెను.

ఇట్టిస్థితిలో 1813 తరువాత క్రైస్తవ మత బోధకులీ దేశమునకు వచ్చి విద్యాబోధనము ద్వారమున క్రైస్తవ మతప్రచారము చేయసాగిరి. పాఠశాలలందలి పిల్లల మనస్సులు విరిచి వారిలో విపరీతభావములు కలిగింపసాగిరి. హిందూ దేవాలయములను క్రైస్తవ పరిపొలకులు నిర్వహించుట బాగుగలేదని ఆందోళనముచేసి దానిని మాన్పించిరి. తిరుపతి మొదలగు దేవస్థానములు మహంతున కప్పగించి కంపెనీవారు తొలగిరి. క్రైస్తవ మతప్రచారకులకు కంపెనీ పరిపాలనమున పలుకుబడిహెచ్చెను. ఉద్యోగుల సహాయముతో వారు దేశీయులను క్రైస్తవమతమున గలుపుకొన ప్రయత్నించిరి. ప్రభుత్వ పాఠశాలలందు బైబిలు బోధించునట్లు చేయుటకై ప్రయత్నించిరి. కాని అది జరుగలేదు. అయినను, బైబిలునుగూర్చి ప్రశ్నలు వేసి జవాబులు చెప్పలేనివారిని పరీక్షలలో తప్పించసాగిరి. తప్పినవారికి ఉద్యోగము లొసగరయిరి. కనుక బైబిలు నేర్చుకొనుట తప్పనిసరి యయ్యెను. క్రైస్తవమతమున గలిసినవారికి కుటుంబము యొక్క ఆస్తిలో హక్కులు పోకుండ శాసనము చేయించిరి.అంతట కొంతమంది విద్యార్థులు క్రైస్తవమతమున కలియగా చెన్న పట్టణమున ప్రజలలో కల్లోలము కలిగెను. ఆ కాలమున చెన్న పట్టణమున తెలుగువర్తకులలో ప్రముఖులయిన గాజుల లక్ష్మీనర్సు శెట్టిగా రీ అన్యాయములను జూచి వీని నరికట్టుటకు క్రీ. శ. 1844 లో "చెన్నపట్టణ స్వదేశసంఘము" అను ప్రజాసంఘమును స్థాపించి, క్రెసెంటు అను పత్రికను స్థాపించి, దాని కొరకు ఇంగ్లీషు దొరను సంపాదకునిగా నేర్పరచిరి. క్రైస్తవ మతబోధకులును, కంపెనీ ఉద్యోగులును కలిసి చేయుచున్న అక్రమములను గూర్చి విమర్శించి అసమ్మతి తీర్మానములను గావించి గొప్ప ఆందోళన జరిగించిరి.

ప్రజల కష్టములు  : ఆ కాలమున దేశీయులకు పెద్ద ఉద్యోగము లియ్యకుండిరి. దొరలకు దేశ భాషలు రావు. అధికారులు లంచగొండు లయియుండిరి. న్యాయ విచారణలో సామాన్యులకు న్యాయము జరుగకుండెను. పోలీసులు అసమర్థులుగనుండి నేరములు చేయువారిని కనిపెట్టలేక నిరపరాధులను బాధించుచుండిరి. పల్లపుసాగుకు నీటి సౌకర్యములు లేవు. కాలువలు, చెరువులు మరమ్మతులు లేక పొడగుచుండెను. పన్నులు అత్యధికముగా నుండినవి. వానిని వసూలు చేయుటలో కంపెనీ అధికారులు రైతులను చిత్రహింసలకు గురిచేయుచుండిరి. దీనిని గూర్చి లక్ష్మీనర్సుగారు తమపత్రికలో విమర్శించి, చెన్నపట్టణ స్వదేశ ప్రజాసంఘములో తీర్మానములుగావించి, పై అధికారుల కంపి, సీమలో కూడ ప్రచారము చేయసాగిరి. తెలంగాణములోని పరిస్థితులు కూడ ఇట్లే యుండెను. అక్కడ శిస్తు వసూలుచేయుటకు ఇజారాలు పొందిన గుత్తేదారులును, సర్కారు నౌకరులును శిస్తులను వసూలుచేయుటలో ప్రజలను చిత్రహింసలపాలు చేయుచుండి రని క్రీ. శ. 1829 లో హైదరాబాదు రెసిడెంటుగా నున్న సర్ చార్లెసు మెట్కాఫుగారు వ్రాసినారు. ఆ రాజ్యమున నవాబుగారు మొదలుకొని చిన్న యుద్యోగివరకు కలవారికి నజరానాలిచ్చి ప్రజలు తమ పసులు చేయించుకొనవలసి యుండెను. పోలీసులు అప్రయోజకులై యుండ శాంతిభద్రతలకు భంగము వాటిల్లెను. హైదరాబాదులోను, గ్రామములలోను దొంగలు బహిరంగముగా దోపిళ్ళు చేయుచుండిరి. నిజాము రాజ్యములో పిల్లలను పెద్దలను బానిసలుగా విక్రయించుచుండిరి.

గాజుల లక్ష్మీనర్సు సెట్టిగారు చేసిన తీవ్రమైన ఆందోళనము ఫలితముగా 1852 లో డేన్ టి సేమరు అను నొక పార్లమెంటు సభ్యు డీ దేశమునకు వచ్చి శిస్తుల వసూళ్ళలో జరుగు చిత్రహింసలను జూచి వర్ణించినాడు. అంతట మద్రాసులో హింసల విచారణ సంఘము నియమింపబడెను. ఆ సంఘమువారు బయల్పరచిన అన్యాయముల ఫలితముగా ఇకముందు ఇట్టి అకృత్యములు జరుగరాదని ప్రభుత్వము వారు క్రీ. శ. 1854 లో ప్రకటించుట తటస్థించెను.

కంపెనీ పరిపాలనమున ప్రజలకుగల కష్టములనుగూర్చి దేశ ప్రజ లెంత మొర పెట్టుకొనినను లాభము లేకపోవుచుండెను. అప్పటి కేదో విచారణ చేసి తరువాత ఏమియు చర్య జరుపక ఉపేక్షించుచుండిరి. కంపెనీ ప్రభుత్వవిధానము మారినగాని ఈ అన్యాయములు తొలగవని ప్రజలు గ్రహించిరి.

సిపాయీల పితూరీ అను విప్లవము : కంపెనీవారికి రాజ్యాధికారపు పట్టాను మరల నొసగవలదని దేశములో అన్ని ప్రాంతములనున్న ప్రజాసంఘములును ఇంగ్లీషు పార్ల మెంటు వారికి మహజరు లంపుకొన్నను ప్రజల మొరలను పార్లమెంటువారు పెడచెవిని బెట్టిరి. 1853 లో మరల కంపెనీ వారికి ప్రభుత్వాధికారము లభించెను. అంతట ఈ దేశమునందు దుష్పరిపాలనమును ప్రజాపీడనమును పెచ్చు పెరిగినవి. దేశములోని రాజులను, నవాబులను కంపెనీ వా రేదో సాకుతో పదభ్రష్టులుగ జేసి రాజ్యములను కలుపుకొనసాగిరి. దేశములోని ప్రజలు తమకష్టములను చెప్పుకొనినను ఆలన పాలనలు చేయువారు లేరైరి. ప్రజలబాధలు దుర్భరము లయ్యెను. క్రీ.శ. 1857 లో ఇంగ్లీషు కంపెనీ కొలువులో నుండిన సిపాయిలు ముందుగా తిరుగుబాటు చేసిరి. అంతట దేశములోని ప్రజలు ఇంగ్లీషు పరిపాలనను ధిక్కరించి దౌర్జన్యములు జరిపిరి. ఇంగ్లీషువారు చాలమంది వధింపబడిరి, విప్లవకారులు ఇంగ్లీషువారి కోటలను స్వాధీనము చేసి, కొనిరి. దీనికి ఇంగ్లీషువారు సిపాయిల పితూరి అని పేరు పెట్టియున్నను ఇది నిజముగా నొక ప్రజావిప్లవమే. ఇంగ్లీషువా రెట్లో ఈ గండము గడచి బయటపడిరి.

హైదరాబాదులో మతావేశపరులయిన మహమ్మదీయులు కొందరును, షోరాపూరు అను బీదరు సంస్థానము నేలు వేంకటప్పనాయకుడును ఈ సందర్భమున తిరుగుబాటు చేసిరి గాని లాభము లేకపోయెను. నిజాము ప్రభుత్వ మంత్రియైన సాలారు జంగు ఇంగ్లీషువారికి సహాయుడై దేశములో శాంతిని కాపాడెను. క్రీ. శ. 1846-1855 మధ్య గోదావరి కృష్ణానదులకు ఆనకట్టలు నిర్మింపబడినందున ఈ మండలములు సుభిక్షముగా నుండి ఇందలి ప్రజలు ఇంగ్లీషు కంపెనీ వారిపట్ల కృతజ్ఞులై యుండిరి.తెలుగు జిల్లాలనుండి కంపెనీ సైన్యములో చేరిన తెలుగు సిపాయిల దళములను "తెలింగా రెజిమెంటు" అనిరి.

1857 లో సిపాయిల తిరుగుబాటులో తెలుగు సిపాయీలు చేరక పోవుటయే గాక ఆ విపత్సమయమున ఇంగ్లీషువారికి గొప్ప అండగా నుండి వారి పక్షమున శత్రు సైన్యములతో యుద్ధము చేసి జయము చేకూర్చిరి. విప్లవము అణచు సందర్భములోనేగాక తరువాత కూడ ఇంగ్లీషువారు అనుమానమున్న వారినందరిని విచక్షణ లేకుండ కాల్చి వేయసాగిరి. ఆ సందర్భమున నెంతో రక్తపాతము జరిగెను. విప్లవా నంతరము కంపెనీ పరిపాలన రద్దుచేయబడి క్రీ. శ. 1858 నవంబరు 1వ తేదీన ఇంగ్లండు రాణియైన విక్టోరియా భారత దేశ చక్రవర్తినిగా ప్రకటింపబడెను. ఇంగ్లాండు పార్లమెంటు వారి మంత్రిక్రింద భారతదేశమున గవర్నరు జనరలు పరిపాలన జరుగసాగేను.

ఆ సమయమున ఇంగ్లీషు దొరతనమును సుస్థిరముగా చేయుటకు అవసరమైన శాసనములు కట్టుబాటులు అనేకములు చేయబడినవి, ఇంగ్లీషువారు భారతదేశ ప్రభుత్వము నొక ఇనుప యంత్రముగా చేసి కఠినములైన పద్ధతులతో పరిపాలన చేయసాగిరి. ఇంగ్లీషువారు విప్లవానంతరము చేయుచుండిన కఠినచర్యలను జూచి ప్రజలు భయపడి పోయిరి, ప్రజలు తమ కష్టములనుగూర్చి చెప్పుకొనుట కయిన సాహసింపలేకుండిరి. ఆకాలమున కలకత్తాలో 'హిందూ పేట్రియటు' పత్రికాసంపాదకుడైన హరిశ్చంద్ర ముఖర్జీగారు మాత్రము ప్రజల కష్టసుఖములను గూర్చి ఆంధ్రదేశ చరిత్రము . IV . ధైర్యముగా విమర్శించుచుండిరి. ఆయన 1869 లో చని పోగా కృష్ణదాస్ పాల్ గారు సంపాదకులై పత్రిక నెప్పటి వలెనే ధైర్యముతో నడపసాగిరి. జాతీయ చైతన్యము : క్రీ.శ.1875 నాటికి భారత దేశమున అన్ని ప్రాంతములలోను కొంత జాతీయచై త న్యము కలుగసాగేను, తెలుగుదేశమున కెల్ల ముఖ్య నగ రము చెన్నపట్టణము. అక్కడ విశ్వవిద్యాలయము ఉన్నత న్యాయస్థానము ఉన్నందున ఆంగ్లవిద్యాధికులు కొందరు దేశప్రజల స్థితిగతులనుగూర్చి చర్చించుటకు ఆరంభించిరి, వారిలో ప్రముఖులు సర్ టి. మాధవరావు, దివాన్ బహద్దరు ఆర్. రఘునాథరావుగార్లు. అప్పుడక్కడనున్న తెలుగువారిలో ప్రముఖులయిన పనప్పాకం అనంతా చార్యులు, సి. రంగయ్యనాయుడు, తల్లాప్రగడ సుబ్బా రావు, న్యాపతి సుబ్బారావు మొదలయినవారు దేశాభి వృద్ధికొరకు పాటుపడుచుండిరి. దేశప్రజల అభిప్రాయ ములను ప్రకటించుటకు మాధవరావుగారు స్థాపించిన 'నేటివ్ పబ్లిక్ ఒపీనియన్' అను పత్రిక కొలది కాలము లోనే అంతరించెను. అంతట పైన చెప్పబడినవారు ఆలో చింది జి. సుబ్రహ్మణ్య అయ్యరు మొదలయిన వారి తోడ్పాటుతో క్రీ. శ. 1878 లో హిందూపత్రిక నొక వార పత్రికగా స్థాపించి దేశీయులలో రాజకీయ పరిజ్ఞానమును విజ్ఞానాభివృద్ధిని కలిగించు వ్యాసములను అందుప్రకటింప సాగిరి. వీరి కృషివలన చెన్నపట్టణములో మద్రాసుమహా జనసభ యను ప్రజాసంఘముకూడ స్థాపింపబడెను. ఆకాలమున పాశ్చాత్యులు కొందరు సంస్కృత భాష నభ్యసించి భారతీయ మతధర్మములనుగూర్చి పరిశోధనలు జరిపి, భారతీయ నాగరకతవయిన చాల గౌరవముకలిగి, మన దేశీయులలో దేశాభిమానము కలిగింపగల వ్యాసము లను, గ్రంథములను వ్రాసిరి. ప్రపంచములోని మతధర్మ ముల నన్నింటిని పరిశోధించి అందలి ప్రాశస్త్యమును ప్రచారముచేయుటకు క్రీ. శ. 1875 లో దివ్యజ్ఞాన సమా జమును అమెరికాలో స్థాపించిరి. ఆ సమాజమువారు భారతదేశ మతధర్మములపై అభిమానము కలిగి ఈ దేశములోని విద్వాంసులతోను వేదాంతులతోను ఉత్తర ప్రత్యుత్తరములు జరిపి ఇక్కడికివచ్చి దేశములో పర్యట నము చేసి ఉపవ్యాసము లొసగిరి. మన దేశములోని ప్రము 490 ఖులు పెక్కుమంది ఆ సమాజమున జేరి, దేశాభిమానులై దేశోద్ధరణకు పాటుపడసాగిరి. దివ్యజ్ఞాన సమాజ స్థాపకుల గౌరవమునకు పాత్రు లయిన వారిలో ఆ కాలమున మద్రాసులో న్యాయ వాదిగానుండి గొప్ప బ్రహ్మజ్ఞాని యని పేరుపొందిన తల్లాప్రగడ సుబ్బారావుగా రొకరు. వీరి ప్రోత్సాహము ననే ఆ సమాజ కార్యాలయము క్రీ. శ. 1882 లో అడ యారులో నెలకొల్పబడినది. ఆ సమాజ సభ్యులలో కొందరు వీరి శిష్యులయిరి. అందులో భారతదేశోద్ధరణ కొరకు పాటుపడిన ఎ. పి. సిన్నెటు, ఎ. ఓ. హ్యూము అను దొరలుకూడ ఉండిరని సమాజ గ్రంథములందు వివ రింపబడియున్నది. ఈ హ్యూముగారు భారతదేశములోని వివిధప్రాంతములందలి ప్రముఖుల నందరిని ఏకోన్ముఖు లను గావించి 1885 డిశంబరులో బొంబాయిలో కాంగ్రెసు మహాసభా సమావేశము నేర్పాటు చేసి కాంగ్రెసు స్ధాపకు లలో నొకరయిరి. శ్రీ పనప్పాకం అనంతాచార్యులు గారు, తల్లాప్రగడ సుబ్బారావుగారు మొదలయిన ఆంధ్ర ప్రముఖులు కేవలము రాజకీయ వ్యవహారములందే నిమ గ్నులు గాక ప్రజల విజ్ఞానాభివృద్ధికొరకుకూడ పాటు పడిరి. వీరి కృషివలననే సంస్కృత రామాయణము శ్రీ చదలవాడ సుందరరామశాస్త్రిగారి తెలుగు తాత్పర్య ముతో చక్కని సంపుటములుగా ప్రకటింపబడెను. ఇంక ఎన్నో సంస్కృతాంధ్ర గ్రంథములు ప్రకటింపబడినవి. ఆ కాలమున మద్రాసు రాజధాని కళాశాలలో తెలుగుపండితులుగ నుండిన చిన్నయసూరిగారును, బహు జనపల్లి సీతారామాచార్యులుగారును, కొక్కొండ వేంకటరత్నం పంతులుగారును, కందుకూరి వీరేశలింగం వంతులుగారును, తుని సంస్థాన విద్వాంసులుగానుండిన పరవస్తు రంగాచార్యులుగారును, తెలుగుభాషలో అనేక ఉద్గ్రంథములు రచించిరి. ఆంగ్లభాషా సారస్వతముల ప్రభావమువలన తెలుగులో క్రొత్తరచనలు బయలు దేరి నవి. వచన రచన అభివృద్ధి చెందినది. జీవిత చరిత్రలు దేశచరిత్రలు, పాశ్చాత్య ప్రకృతి విజ్ఞానశాస్త్రములు, వ్యాసములు, ప్రహసనములు, కథలు, నవలలు బయలు దేరినవి. వీరేళలింగంగారి రాజ శేఖర చరిత్ర. క్రీ.శ. 1878 లో ప్రకటింపబడినది. అంతకుముందు కొక్కొండ వేంకట రత్నం పంతులుగారును, సరహరిసెట్టి గోపాలకృష్ణమ సెట్టిగారును నవలలను వ్రాసిరి. ఐనను వీరేశలింగముగారి నవలయే ఇంగ్లీషు నవలలతో సరిపోల్చ తగినదయినది.

ఆ కాలమున సంఘమునగల కొన్ని దురాచారములను రూపుమాపుటకు వీరేశలింగముగారు ప్రయత్నించిరి. అతి బాల్య వివాహములను, బోగము మేళములను, వరకట్నములను అరికట్టుటకు వారు ప్రయత్నించిరి. వితంతు స్త్రీలకు పునర్వివాహములు చేయుట శాస్త్ర సిద్ధమని నిరూపించి ఆ సంస్కారమును చేయబ్రయత్నించిరి. ఎంతచేసినను దేశము గాఢనిద్రనుండి మేల్కొన లేదని శ్రీ చిలకమర్తి లక్ష్మీనరసింహముగారు తమ స్వీయ చరిత్రలో వ్రాసినారు. క్రీ. శ. 1894 డిసెంబరు నెలలో మద్రాసులో జరిగిన కాంగ్రెసు మహాసభకు చిలకమర్తి లక్ష్మీనరసింహముగారు వెళ్ళిరి. 1895 లో కాకి నాడలో మొదటి గోదావరీమండల సభ జరిగినది. దానికి న్యాపతి సుబ్బారావుగా రధ్యములైరి. లక్ష్మీనరసింహము గారానాటి రాజకీయ పరిస్థితులను ప్రజల స్థితిని వర్ణించుచు పదునాల్గు పద్యములు రచించి చదివిరి. సభాసదులు పరవశులైరి. ఆ పద్యములందు ఇంగ్లీషు దొరతనములోని శాంతి భద్రతలు, క్రమపరిపాలనము, రాకపోకల సౌకర్యములు మొదలగు లాభములు కొన్ని ప్రజలకు కలిగినవని వివరింపబడినవి. పన్నులు అత్యధికముగనుండి రైతులు బాధపడు చున్నారని, అధికారులు లంచగొండులై యున్నారని, మునసబు కరణములు బంట్రోతులు కూడ రైతులను పీడించు చుండిరని, అప్పులలో మునిగి సాహుకారులకు హెచ్చు వడ్డీల నిచ్చుకొనవలసివచ్చి బాధపడుచున్నారని, వారికిని, వారి పశువులకును తినుటకు గడ్డియే మిగులుచున్నదని ఆ పద్యములందు చెప్పిరి. పాలింపబడు వారికిని పాలించు దొరలకును మధ్య కాంగ్రెసు ఒక సంధి సూత్రముగను ప్రభువుల లోపములను జూపు నొక నిలువుటద్దముగ ఉన్నదనియు వారుగ్గడించిరి. (చూడు. స్వీయ చరిత్ర, పుటలు 115-121)

ది. వేం. శి.

[[వర్గం:]]