సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మూడవ సంపుటము/చలనచిత్రములు
చలనచిత్రములు :
వార్తాపత్రిక, వేదిక, రేడియో, టెలివిజన్ ఈనాటి పంచములో ప్రచండమైన ప్రచారక సాధనములుగా పేరుగాంచినవి. ఆధునిక మానవజీవితము ఈ సాధనములను ఆధారము చేసికొని తీర్పులు తీర్చిదిద్దుకొను చున్నది. ఈ నాల్గింటిలో గర్భీకృతమైయున్న మహత్తరశక్తిని పుంజుకొనిన ప్రచారక సాధనము మరియొకటి కలదు. దీనినే చలనచిత్రమందురు. తక్కిన సాధనములకంటె చలనచిత్రము ప్రజాబాహుళ్యమునకు అత్యంత సన్నిహిత మగుటయే దాని ప్రత్యేకత అని చెప్పుటలో అత్యుక్తి కానరాదు.
ఈనాడు చలనచిత్రము ఆకర్షణీయమయిన వివిధ రూపములతో అలరారుచున్నది. ప్రకృతిగర్భములో నున్న రహస్యముల నన్నిటిని చలనచిత్రము మానవప్రపంచమునకు గోచరింప జేయుచున్నది. "త్రిడైమెన్షనల్", “సినిమాస్కోప్”, “సినీరమ", "విస్టావిజన్” మున్నగు రూపములన్నియు సినిమా సాంకేతికశాస్త్ర విజ్ఞానాభివృద్ధికి వైతాళికలుగా వ్యవహరించు చున్నవి.
ఆధునిక యుగములో చలనచిత్రము ఇంతటి విశ్వరూపమును చూపింపగలుగుటకు, సుమారు మూడు వందల సంవత్సరములనుండి వైజ్ఞానిక శాస్త్రవేత్తలు గావించిన మహత్తరమైన పరిశోధనములే కారణమన్న విషయమును విస్మరింపరాదు. ఏయే పరిశోధనములు, ప్రయోగములు చలనచిత్ర కళామతల్లిని పసిడి పల్లకీలపై కూర్చుండబెట్టి ఊరేగించుటకు తోడ్పడినవో తెలిసికొందము.
వెలుగు - నీడ : ఈ రెండును చలన చిత్రకళకు జీవ తంతువులు. విశ్వమునందలి చరాచర జీవసృష్టినంతయు చలనచిత్రములో ఈ రెండింటిద్వారా మనకు ప్రత్యక్షమగును. రూపములు, ప్రతిరూపములు, బింబములు, ప్రతి బింబములు - ఇవన్నియు వెలుగు నీడలలో గోచరించి, వివిధరసముల అనుభూతులను మనకు సిద్దింప జేయగలవు.
చలనచిత్రమునకు ఛాయాగ్రహణ మొక ప్రాతిపదిక. ఈ ఛాయాగ్రహణమును ఇంగ్లీషులో 'ఫోటోగ్రఫీ' అనెదరు. క్రీ. పూ. 350 సంవత్సరముల క్రిందట గ్రీకు శాస్త్రజ్ఞుడు, తత్వవేత్త అయిన అరిస్టాటిల్ వ్రాసిన కొన్ని గ్రంథములలో ఈ ఛాయాగ్రహణమునకు సంబంధించిన యొక యంత్రము యొక్క రూపురేఖలు పొందుపరుపబడి నట్లు తెలియవచ్చుచున్నది. ఈ యంత్రము పేరు ' కెమేరా అబ్‌స్క్యూరా' అని తెలియుచున్నది. 'లెనార్టో డావిన్సీ' యను నాతడు ఈ ఛాయాగ్రహణమునకు సంబంధించిన సాహిత్యమును పురాణగ్రంథముల నుండి వెలికి తీయగల్గెను. ఆతడు తన వ్రాతలలో ఇట్లనెను:
"ఒక చిన్న గుండ్రని రంధ్రము నుండి ఒక చీకటి గది లోనికి వెలుగును స్వీకరించిన వస్తువుల యొక్క ప్రతిబింబములు ప్రవేశించినచో - రంధ్రమునకు స్వల్పదూరములో ఉంచబడిన ఒక తెల్లని కాగితముమీద ఆ గదిలో ఆ ప్రతిబింబములను గ్రహించినచో - ఆ వస్తువుల ఆకారములను, రంగులను ఆ కాగితముపైన సలక్షణముగ చూడగల్గుదుము. అయితే, ఆ బింబములు పరిమాణములో చిన్నవిగ నుండి అడ్డముతిరిగి యుండును."
చిత్రము - 185
పటము - 1
కెమెరా ఆబ్స్క్యూరా
ఈ ప్రాతిపదిక సూత్రము ననుసరించియే, గుండ్రని చిన్న రంధ్రము గల కెమేరా వ్యాప్తిలోనికి వచ్చెను. దీనినే 'పిన్‌హోల్ కెమేరా' అనెదరు.
ఛాయాగ్రహణము - ప్రయోగపరంపరలు : గ్రీకు ప్రజలు ఈ ఛాయాగ్రహణమునకు సంబంధించిన సారస్వతబీజములను కర్మక్షేత్రములో వెదజల్లగా, అందుండి మొలచిన మొక్కలకు నీరుపోసి, పైకితెచ్చి, పెంచి, పోషించిన గౌరవము జర్మను శాస్త్రవేత్తలకు దక్కెను. క్రీ. శ. 1727 సం.లో డా. జె. హెర్మన్ షుల్జ్ సిల్వర్ నైట్రేట్‌ను, సుద్దను మేళవించి ఒక రాసాయనిక పదార్ధమును సృష్టించెను. దానిమీద ఆతడొకపరిశోధనముజరిపెను. ఈ పరిశోధనలో ఆతనికి తలవని తలంపుగా ఒక సూత్రము అవగాహన మయ్యెను. ఈ సూత్రము ప్రకారము సూర్యునికిరణములు పడుటకు అవకాశముగల భాగములనే ఈ రసాయనిక పదార్థము నలుపుచేయగల్గును. ఈ సూత్రముపై డా. లూయీ అను ఆంగ్లేయుడు మరికొన్ని పరిశోధనలు జరిపెను. ఆ పరిశోధన లన్నిటిని ఆతడు గ్రంథస్థముచేసి, హఠాత్తుగా చనిపోయెను. ఆ గ్రంథము మరొక ఆంగ్లేయుడైన జోసయా వెడ్జివుడ్ యొక్క హస్తములలో పడెను. మరణించిన డా. లూయీకి సహాయకుడుగా పనిచేసిన చిస్ హోం కూడ వచ్చి వెడ్జివుడ్ యింటిలో ప్రవేశించెను.
వెడ్జివుడ్ యొక్క నాల్గవ కుమారుడైన థామస్‌కు వైజ్ఞానిక పరిశోధనలయెడల మిక్కిలి ఆసక్తి ఉండి యుండెను. డా. లూయీ ఛాయాగ్రహణము విషయములో గావించిన పరిశోధనల నన్నిటిని ఆతడు చిస్ హోం ముఖతః విని కార్యరంగములోని దూకెను. వెలుగు ప్రసరణము ద్వారా ఆతడు వస్తువుల ప్రతిబింబములను కెమేరా అబ్‌స్క్యూరా సహాయముతో 'రికార్డు' చేయ గలిగెను.
ఛాయాగ్రహణ విధానమునకు ఈ పరిశోధనలు ఎంతయో సహాయపడెనని దీనవలన మనము గ్రహింప గలము. సిల్వర్ నైట్రేట్ సొల్యూషన్లో ముంచి తీయబడిన తెల్లని కాగితములుగాని లేక తోలుముక్కలు గాని వివిధ పదార్థముల ప్రతిబింబములను 'రికార్డు' చేయుటకు ఉపయోగింపబడెను. సూర్యరశ్మి వీటిపై సూటిగా ప్రసరించినపుడు త్వరితగతిని యివి నలు పెక్కును. కొన్నిగంటలవరకు వీటిని నీడలో ఉంచినప్పుడు గూడ ఇవి నలుపురంగుకు తిరుగగల్గెను. దురదృష్టవశాత్తు కెమేరా అబ్‌స్క్యూరా ద్వారా 'రికార్డు' చేయబడిన వస్తువుల ప్రతిబింబములలో స్ఫుటత్వము లేకుండెను; అనగా ఈ ప్రతిబింబములన్నియు రేఖామాత్రముగానే గోచరించిన వన్నమాట, 'ప్రింట్ల'కు కాపీలు తయారు చేయుటకు కూడ వెడ్జివుడ్ చాల బాధపడెను. ఎన్నియో పర్యాయములు అవి నీటియందు కడుగబడి శుభ్రపరుప బడినప్పటికిని సత్ఫలితములు చేకూరకపోయెను. ఆ ప్రింట్ల మీదగల సిల్వర్ కాంపౌండు మార్పునకు గురికాక యథాప్రకారముగనే ఉండిపోవుటచే, అతడు వాటిని తీసి వేయ లేక పోయెను. ఈనాడు విరివిగా ఉపయోగింపబడెడు 'హైపో' యను రాసాయనిక పదార్థము క్రీ. శ. 1799 సం.లో కనిపెట్టబడినను, ఇతర వస్తువులుగూడ ఈ విషయములో ఉపయోగార్హతను సంపాదించినను, వెడ్జిఫుడ్ తన పరిశోధనలను విజయవంతముగా కొనసాగించ లేక పోయెను. ఆతని ఆరోగ్యము పూర్తిగా దెబ్బతిని నందున, వెడ్జివుడ్ ముప్పది అయిదేండ్ల వయస్సుకూడ ముగియక మునుపే శాశ్వతముగా కన్నుమూసెను.
ఫ్రాన్స్ దేశీయులైన జోసెఫ్ నిసిఫోర్ నివ్స్, డాగరే అను శాస్త్రజ్ఞులును, ఆంగ్లేయుడైన విలియం హెన్రీ ఫాక్స్ టాల్ బట్ అను నాతడును వెడ్జివుడ్ గావించిన పరిశోధనలను ఆధారము చేసికొని ముందునకు వెళ్ళగలిగిరి. ప్రతిబింబములను గ్రహించుటకై కాగితములకును, తోలుముక్కలకును బదులు లోహపు ముక్కలు ఉపయోగింపబడెను. ఈనాడు ఛాయాగ్రహణములో మన ముపయోగించెడి 'నెగెటివ్' లకు ప్రాణదాత ఫాక్స్ టాల్ బట్ అను నాతడు ; 'పాజిటివ్' లకు జీవముపోసిన వాడు డాగరే. వీరిద్దరి కృషివలన 'నెగెటివ్' మీద
చిత్రము - 186
పటము - 2
మొట్టమొదట స్టూడియో కెమెరా
నుంచి అవసరమైనన్ని కాపీలు తీయుటకును అవకాశము కలిగెను.
ఛాయాగ్రహణ చరిత్రలో మరొక అధ్యాయమును సృష్టించినవాడు సర్ జాన్ హెర్షెల్. సిల్వర్ క్లోరైడును గాజుకు పట్టించి, దానిపైన 'నెగెటివ్' ను సృష్టించుటకు హెర్ షెల్ కృషిసల్పెను. కాని క్లోరైడ్ గాజుకు గట్టిగా పట్టుపట్టక పోవుటచే, ఆతనికృషి అంతగా ఫలించక పోయెను. కాని కొంతకాలమునకు తరువాత నిప్సెడి సెంట్ విక్టర్ అను నాతని ప్రయత్నఫలితముగా ఈ క్లోరైడ్ విధానము విజయవంతమై, పందొమ్మిదవ శతాబ్దము మధ్యభాగమువరకు మంచి ప్రచారములోనికి వచ్చెను.
క్లోరైడ్ విధానము 'కొలోడియన్' విధానమునకు అచిర కాలములో తావిచ్చెను. ఈవిధానము (process)ను కనిపెట్టినవాడు స్కాట్ ఆర్చర్. ఆల్కహాల్, ఈథర్ కలిసిన రసాయన పదార్థమే 'కొలోడియన్' అనబడును. క్రీ. శ. 1851 లో ఈ పదార్థము కనిపెట్టబడినది. ఆధునిక యుగములో ఈ పదార్థమే ఛాయాగ్రహణములో విరివిగా వాడబడుచున్నది. కొలోడియన్‌తో పూతపూయబడిన గాజు ప్లేట్లు సిల్వర్ నైట్రేట్ సొల్యూషన్ లో ముంచి తీయబడిన తరువాత 'ఎక్స్పోజర్ 'కు (exposure) అనగా ఉపయోగమునకు - సిద్ధమగును. ఇవి తడిగా నుండుటచే ఈ విధానముసు 'వెట్‌కలోడియన్ ప్రాసెస్ ' అనియెదరు. ఈ విధానము చూపిన ప్రమాణములు ఈనాడు ఇతర విధానముల ద్వారా కాన్పించుచున్న ప్రమాణములతో దీటు రాగలవని శాస్త్రజ్ఞు లభిప్రాయ పడుచున్నారు. ఛాయాగ్రహణ కళకు ఇట్టి అద్భుతమైన సేవచేసిన స్కాట్ ఆర్చర్ అంత్యదశలో తినుటకు తిండిలేక మలమల మాడి మరణించెను.
తరువాత ఛాయాగ్రహణము విషయములో శాస్త్రీయమైన కృషి బహుళముగా జరిగెను. గెలటైన్ డ్రై ప్లేట్లు, అటు పిమ్మట సెల్యులాయిడ్ వ్యాప్తిలోనికి రాజొచ్చెను. అమెరికన్ శాస్త్రజ్ఞుడు ఈస్ట్‌మన్ సెల్యులాయిడ్ పదార్థమును బహుళ ప్రచారమునకు తీసికొని వచ్చెను. ప్రపంచమంతట విఖ్యాతినందిన 'కొడక్ ' కంపెనీకి ఈతడు అధినేత. ఫీల్ము చీకటిలో కాక, పట్టపగలే 'లోడ్' చేయబడుటయు, చీకటిగది (dark room) అవసరము లేక యే 'డెవలపింగ్' యంత్రము అమలులోనికి వచ్చుటయు ఛాయాగ్రహణరంగములో ప్రత్యేకముగా పేర్కొన దగిన విశేషములు.
చలనచిత్ర ఛాయాగ్రహణము : ఇంతవరకు చిత్రఛాయాగ్రహణమునకు సంబంధించిన వైజ్ఞానిక విశేషములను గూర్చి తెలిసికొంటిమి. ఇప్పుడు చలనచిత్ర ఛాయాగ్రహణమునకు సంబంధించిన విషయములను గ్రహించవలసి యున్నది. చలనచిత్ర ఛాయాగ్రహణమును 'సినిమెటోగ్రఫీ' అనియెదరు. ఫ్రీజ్ గ్రీన్ అనునాతడు ఈ చలనచిత్ర ఛాయాగ్రహణమునకు జనకుడని చెప్పక తప్పదు. క్రీ. శ. 1889 లో ఫ్రీజ్ గ్రీన్ గావించిన పరిశోధననుగురించి ఒక సమకాలిక పత్రిక ఇట్లు వ్రాసెను. "ఆతడు ఒకరకమైన, ఒక విచిత్రమైన కెమేరాను కనిపెట్టెను. అది ఒక చతురపుటడుగు వైశాల్యము కలది. సంచలనమునకు గురియవుచున్న జీవిని దీనికి అభిముఖముగానుంచి, దీని 'హాండిల్ ' త్రిప్పినచో, క్షణమున కెన్నియో ఫోటోగ్రాఫులు 'రికార్డు' అగును. వీటినన్నిటిని ద్రావకములో శుభ్రముగా కడిగి, వరుస క్రమములో జతచేసి, వీటికి రెండుప్రక్కల రెండు రోలర్లను అమర్చి, ఒక విచిత్రమైన లాంతరు (ఈమాజిక్ లాంటర్న్ ఫ్రీజ్ గ్రీన్ చేతనే సృష్టించబడినది) ద్వారా వెండితెరమీద ప్రొజెక్టు చేయబడినది. శబ్దము కావలసిన చోట ఫోనోగ్రాఫ్ ఉపయోగింపబడినది.
చిత్రము - 187
పటము - 3
స్టూడియో సెట్టుమీద
వచ్చెను. ఫ్రాన్సుదేశీయులైన లూమియర్ సోదరులు లండన్‌లోని రాయల్ పాలీటెక్నిక్ లో తాము తీసిన ఛాయా చిత్రములను ప్రప్రథమముగా వినోదార్థము ప్రదర్శించిరి. లూమియర్ సోదరులు ఈ ప్రదర్శనములో ఉపయోగించిన యంత్రములో కెమేరా, ప్రింటరు, ప్రొజెక్టరు కలిపియుండెను.
అనంతరము, చలనచిత్రముతో శబ్దమును జోడించుటకు పెక్కు ప్రయోగములు జరిగెను. ఈ ప్రయోగములలో ఒక ఫ్రెంచి జాతీయుడు కొంతవరకు విజయము సంపాదింపగల్గెను. ఆతడి పేరు డెమినీ. ఒక వంక మాజిక్ లాంతరు నడచుచున్న సమయములో ఆతడు కొన్ని "స్లైడ్సు"ను చూపెట్టగల్గెను. ఈ స్లైడ్సుకు అనుబంధముగా ఫోనోగ్రాఫ్‌మీద కంఠధ్వని వినపడెను.
క్రీ. శ. 1890 లో షికాగో (అమెరికా సంయుక్త రాష్ట్రములు) నగరములో జరిగిన ప్రపంచ సంతలో (World Fair) థామస్ ఆల్వా ఎడిసన్, తాను నిర్మించిన 'కినిటోస్కోవ్ 'ను ప్రదర్శించెను. ఈ యంత్రములో నుండి చూడగా, సెల్యులాయిడ్‌మీద ఒక చిన్న చలన చిత్రము కాన్పించెను. మానవునిహావ భావ సంచలనమును ఆచిత్రములో చూచినవారి ఆనందమునకు అవధులు లేకుండెను. ఆ చలన చిత్రమును దర్శించుటకు ప్రజలు నేల ఈనినట్లు వెఱ్ఱిగా విరుగబడిరి. ప్రపంచములో ప్రప్రథమముగా ప్రదర్శించబడిన చలనచరిత్ర మిదియే.
మూగచిత్రము : చలనచిత్రమును ఇతోధికముగ శాస్త్రీయమును, శ క్తిమంతమును చేయుటకు ఆనాటినుండియు ఎన్నియో పరిశోధనలు జరిగెను. మూగ చిత్రములు (silent pictures) మీద ప్రజాసామాన్యమునకు మోజు హెచ్చెను. కెమేరాలు, ప్రాజెక్టరులు శీఘ్రకాలములో తయారగుట ప్రారంభమయ్యెను. అంతకు పూర్వము ముక్కలు ముక్కలుగా నున్న ఫిల్ములు ఇప్పుడు వెయ్యి అడుగుల 'రీలు' గా తయారయ్యెను. ఆ దినములలో జరిగిన పెద్ద విందులు, వినోదములు ఈ మూగ చిత్రములలోనికి డాక్యుమెంటరీ రూపములో ఎక్కసాగెను.
చిత్రము - 188
పటము - 4
ఈనాడు ఉపయోగించుచున్న స్టూడియో కెమెరా
వేయి అడుగుల చిత్రములకు పూర్వము వచ్చిన ఏబది అడుగుల చిత్రములు ప్రేక్షకులకు యధార్థముగ విస్మయము కల్గించెను. 'లైఫ్ ఆఫ్ ఏన్ అమెరికన్ ఫైర్ - మన్', 'ట్రెయిన్ రాబరీ' మొదలగు చిత్రములు ఎడిసన్ కంపెనీవారి ఆవరణ నుండి బయటికి వచ్చి ప్రేక్షకులను ఆశ్చర్యచకితులుగా చేసివై చినవి. ఇటు చిత్రము నడచుచున్న సమయమందే, అటు వ్యాఖ్య ఫోనోగ్రాఫ్ మీద వినిపించెడిది.
క్రీ. శ. 1902 లో అమెరికాలో థామస్ టాల్ అను నాతడు 'ఎలక్ట్రిక్ థియేటరు' ను ప్రారంభించెను. అంతకు పూర్వమే ఎడిసన్ తన స్వంత స్టూడియోను నిర్మించుకొనెను. ఉద్వేగమును, ఆవేశమును కలిగించెడి వంద అడుగుల చిత్రములు ఆ స్టూడియో యందును, బహిరంగ ప్రదేశములయందును తయారు కాజొచ్చెను. సంస్కారము లోపించిన మోటునటనను కనబరచెడి కొందరు నటీనటులు ముందునకువచ్చి ఈ చలనచిత్రములలో పాల్గొనిరి. చలనచిత్రముల మీద మోజు హెచ్చిన ప్రజలు నటీనటుల హావభావములకు అంతగా ప్రాముఖ్యము నియ్యలేదు. మొత్తముపై చలనచిత్రము విశ్వమంతటను ఒక విధమైన సంచలనమును కలుగజేసెను. ఉద్వేగమును, ఆవేశమును కలిగించగల కథావస్తువులు చిత్రముల కెక్క వలసిన ఆవశ్యకత గుర్తింపబడినది. వేయిఅడుగుల చిత్రములు క్రమముగా మూడువేల అడుగుల చిత్రములుగా అభివృద్ధి కాజొచ్చెను.
ఫిల్ముస్టూడియోల అవతరణ : దీర్ఘమైన చిత్రనిర్మాణము ఆరంభమగుటతో ఆధునిక యంత్రపరికరములతో కూడుకొని యున్న ఫిల్ముస్టూడియోలుగూడ వెలిసినవి. శక్తిమంతమైన కాంతిప్రసరణము నిచ్చుటకు బృహద్రూపమున విద్యుద్దీపములుగూడ వ్యాప్తిలోనికి వచ్చినవి. వివిధ దృశ్యములను కళాత్మకముగా గోచరింపజేయుటకై అనువైన 'సెట్స్' స్టూడియోలలో నిర్మాణము చెందనారంభించెను.
చిత్రము - 189
పటము - 5
ఇండ్లలో ఉపయోగించు సినిమా
క్రీ. శ. 1906 లో యూజెనీలూస్ట్ యనునాతడు గొప్ప పరిశోధన సలిపి, చిత్రమునుతీయు ఫిల్ముమీదనే శబ్దమునుగూడ 'రికార్డు' చేయగలిగెను. కాని ఈ విధానములో స్ఫుటత్వము సరిగా సిద్ధించలేదు. క్రీ. శ. 1914 వరకు ఇంగ్లండు, ఫ్రాన్సు, ఇటలీ, అమెరికాదేశములు వినోదమున కుపయోగపడు మూగచిత్రములను నిర్మించుటలో పందెపు గుఱ్ఱములవలె ముందునకు పరుగులిడ సాగెను. ఈ మూగచిత్రములలో 'సీరియల్స్' గూడ తయారయ్యెను. అంతలోనే ప్రపంచ మహాసంగ్రామ మారంభమయ్యెను. ప్రళయ సంక్షోభముగా పరిణమించిన ఆ మహాసంగ్రామము కారణముగా సినిమా సాంకేతిక శాస్త్రాభివృద్ధికి గొప్ప అంతరాయము కలిగెను.
యుద్ధానంతరము యూరప్ ఖండమందలి పెక్కుదేశములు చలనచిత్రకళ మీద తమ దృష్టిని కేంద్రీభూత మొనర్చెను. శబ్దమును సశాస్త్రీయముగా 'రికార్డు' చేయుటకు ప్రయోగములు సాగెను. చిత్రమొక ఫిల్ము పైనను, శబ్దము వేరొక ఫిల్ము పైనను ఏక కాలములో, ఒకే వడిలో - 'రికార్డు' చేయుటకు ప్రయత్నములు జరిగెను. క్రీ. శ. 1925 లో ఈ ప్రయత్నములకు అఖండవిజయము చేకూరెను. క్రీ. శ. 1925 లో వార్నర్ బ్రదర్స్ “ది జాజ్ సింగర్”, “ది సింగింగ్ ఫూల్" అను రెండు శబ్దచిత్రములను నిర్మించిరి. ఈ చిత్రములు ప్రపంచమంతటను గొప్ప సంచలనమును కలిగించెను. చిత్రములలో మాట, పాట - అనగా సాహిత్య సంగీతములు-ఇతర ధ్వనులు రసోత్పత్తికి కారణభూతము లగునను సత్యమును చిత్రముల నిర్మాతలు, నటీనటులు, సాంకేతిక శాస్త్రజ్ఞులు గ్రహింపగలిగిరి.
శబ్దగ్రహణమున క్రొత్తపుంతలు : శబ్దగ్రహణము విషయములో శాస్త్రవేత్తలు క్రొత్తపుంతలు త్రొక్కిరి. చిత్రనిర్మాణములో సహజముగా మైక్రోఫోను ప్రధానమైన పాత్ర వహించును. స్టూడియో సెట్టు నందు షూటింగు జరుగుచున్న సమయములో నటీనటుల తలలపైన - అనగా కెమేరా 'రేంజి'లోనికి అది రాకుండ జేయుటకై - ఒక ఇనుపకడ్డీకి అది వ్రేలాడకట్టబడి యుండును. ఈ కడ్డీ 'బీమ్' అని పిలువబడును. దీనిని అవసరము ననుసరించి అన్నిదిశలకు త్రిప్పుకొనవచ్చును. వ్రేలాడదీయబడు మైక్రోఫోను నటీనటుల మాటలను, పాటలను, ఇతరధ్వనులను గ్రహించును. శబ్దము ‘యాంప్లిఫయర్' గుండా ప్రయాణించి, కాంతి తరంగముల స్వరూపమును స్వీకరించి, శబ్దమునకు సంబంధించిన ఫిల్ముమీద 'రికార్డు' కాగలదు. షూట్ చేయబడిన చిత్రము యొక్క 'నెగెటివు'ను, సౌండ్ (ధ్వని) 'నెగెటివు'ను మొదట లేబరేటరీలోను, అటుపిమ్మట ఎడిటింగు శాఖలోను సమశ్రుతిలో జోడింపబడును. దీనినే 'సింక్రొ నైజేషన్' (synchronization) అనెదరు. చిత్రము విడుదల అగువరకు చిత్రమును, సౌండ్ నెగెటివులును ఒకే పాజిటివ్ మీద 'ప్రింట్' కానేరవు. చిత్రము విడుదల యయినప్పుడు మాత్రమే ఆ రెండును కలిపి 'ప్రింట్' చేయబడును. ఈలోగా ఈ నెగెటివులకు సంబంధించిన పాజిటివ్ ప్రింట్లను ఎన్నియయినను తీసికొనవచ్చును.
నేపధ్యగానము (Play - back) : శబ్దగ్రహణ పథములో 'ప్లే బాక్' విధానము మరొక మైలురాయి వంటిది. పూర్వము చిత్రము షూటింగు జరుగుచున్నప్పుడే పాటలు గూడ 'రికార్డు' చేయబడెడివి. వర్తమానకాలమున పాటలను ప్రత్యేకముగా రికార్డుచేసి, షూటింగులో ఆ పాటలయొక్క శబ్దోచ్చారణకు అనువుగా నటీనటులచే పెదవుల సంచలనమును సరిచేయుట సంభవించుచున్నది. ఈ విధానముచే నేపథ్య గాయకీ గాయకుల ప్రాముఖ్యము హెచ్చెను.
పూర్వము శబ్దమును సరాసరి 'సౌండు ఫిల్ము' మీదనే రికార్డు చేసెడివారు. ఇప్పు డట్లుకాదు. ఆధునిక యుగమున 'మాగ్నెటిక్ రికార్డింగు' అమలులోనికి వచ్చెను. టేపుమీద పాటలను రికార్డు చేసికొని వీటిని అప్పటికప్పుడు విని అందుండి మేలైన వాటిని ఎన్నుకొనిన అనంతరము —— వాటిని సౌండ్ ఫిల్ముకు ట్రాన్స్ఫర్ చేయుట ఈనాడు జరుగుచున్న విధానము. ఈ విధానము వలన మిక్కిలి ఖరీదుగల ఫిల్మును పొదుపుగా వాడుటకు అవకాశము కల్గుచున్నది.
పొడుగు చిత్రములు; పొట్టి చిత్రములు : స్థూలదృష్టితో చూచినచో ఈనాడు నిర్మించబడుచున్న చిత్రములు రెండు రకములుగా నున్నవి. పొడుగు చిత్రములు మొదటి రకమునకు చెందినవి ; పొట్టి చిత్రములు రెండవరకమునకు చెందినవి. పొడుగు చిత్రములను 'ఫీచర్ ఫిల్ము' లనెదరు. డాక్యుమెంటరీలు, వార్తా చిత్రములు, విద్యావిషయక చిత్రములు, వైజ్ఞానిక ప్రబోధక చిత్రములు, వ్యాపార ప్రకటనలకు చెందిన చిత్రములు— ఇవన్నియు పొట్టి చిత్రముల జాబితాలోనికి రాగలవు.
ఈనాడు సర్వసాధారణంగా థియేటర్లలో వినోదార్థము మనము పొడుగు చిత్రములనే చూచుచున్నాము. ఇవి “టు డై మెన్షనల్" (Two dimensional) చిత్రములని పేర్కొనబడుచున్నవి. మనము ఒక కంటిని మూసికొని మరియొక కంటితో చూచినచో, మన సమక్షములో కొంతమేర మాత్రమే కనిపించగలదు. ఈ మేరను 'టు డై 'మెన్షనల్' అనియెదరు. రెండు కండ్లను తెరచికొని చూచినచో, సమగ్రమైన మేర మనకగపడును. ఈ విశాలమైన మేరను కనపరచు చిత్రములే “త్రిడైమెన్షనల్" (Three dimensional) చిత్రములని పిలువబడు చున్నవి. సినిమాథియేటర్లలో 'త్రిడై మెన్షనల్ ' చిత్రములు ఏక కాలమున రెండు ప్రొజెక్టర్ల ద్వారా ప్రదర్శింపబడును. దుర్నిరీక్ష్యమైన కాంతి వీటియొక్క ప్రొజెక్షనులో ఉపయోగింపబడుటచేత, ఇట్టిచిత్రమును చూచువారు- నేత్ర దృష్టి దెబ్బతినకుండుటకై, ప్రత్యేకమైన సులోచనములను ధరింపవలసి యుండును. ఈ చిత్రములలో పాత్రలు, సన్ని వేశములు, ధ్వనులు సాక్షాత్తు మన కళ్లముందు కన్పించుచున్నట్లు భ్రమ కల్గును. వీటిని స్టూడియోలో షూట్ చేయునప్పుడు గూడ శక్తిమంతమైన కెమేరా లెన్సులు ఉపయోగింపబడును.
'సినీరమ', 'విస్టావిజన్', 'సినిమాస్కోప్' మొదలైన చలనచిత్రరూపములు వివిధపాత్రల స్వరూపమును స్నిగ్దముగా చూపించుటకును, సన్ని వేశముల ప్రాముఖ్యమును స్ఫుటముగా కన్పింపజేయుటకును దోహదము చేయగలవు. బ్రహ్మాండమైన యుద్ధదృశ్యములు ఈ రూపములలో ప్రస్ఫుటముగా కాన్పించును. అయితే వీటిని స్టూడియోలో షూట్ చేయుటకు సాధారణమైన కేమెరాలు ఉపయోగింపబడినను, వాటి 'ఫ్రేమింగు' వైశాల్యమును చూపించును. థియేటరులో మనముచూచు సాధారణ చిత్రము 15'×20' వైశాల్యముగల వెండి తెరమీద ప్రొజెక్టు చేయబడును. పైన పేర్కొనబడిన చిత్రములు 20' + 40' వైశాల్యముగల వెండితెరమీదనే ప్రొజెక్టు చేయబడుటకు వీలగును.
ఈనాడు మనము సినిమాథియేటరులలో 35 మిల్లి మీటరుల ఫిల్ములను చూచుచున్నాము. 16 మిల్లీమీటరుల ఫిల్ములు, 9.5 మిల్లీమీటరుల ఫిల్ములు, 8 మిల్లిమీటరుల ఫిల్ములు గూడ ఈ కాలములో వ్యాప్తియందున్నవి. 35 మిల్లీమీటరుల ఫిల్ము సర్వసాధారణముగా వేయి అడుగులచుట్టుగాను, 16 మిల్లీమీటరుల ఫిల్ము 400 అడుగుల చుట్టుగాను తయారుచేయబడి యుండును. వెయ్యి అడుగుల ఫిల్ముచుట్టు థియేటరులో ప్రొజెక్టర్‌మీద పరుగెత్తుటకు పది నిమిషముల కాలవ్యవధి పట్టును.
చలనచిత్రప్రభావము : లెనార్డో డావిన్స్కీ, వెడ్జివుడ్, నిస్సీ, డాగరే, ఫాక్స్ టాల్బట్, ఫ్రీజ్ గ్రీన్, లాస్టీ, ఎడిసన్ మొదలైన వైజ్ఞానిక శాస్త్రవేత్తల కృషిఫలితముగా ఈనాడు సినిమా, ప్రపంచమంతటను మహత్తరమైన శక్తిగా రూపొందియున్నది. సంగీతము, సాహిత్యము, చిత్రలేఖనము, నృత్యము మున్నగు లలితకళలన్నియు చలనచిత్రములో ఈ యుగమందు గూడుకట్టుకొని యున్నవి. చలనచిత్ర మీనాడు ఒక వంక కళగాను, మరొకవంక వ్యాపారముగాను పరిణామము చెందినది.
చిత్ర నిర్మాత, దర్శకుడు, కవి, సంగీతదర్శకుడు, ఛాయాగ్రాహకుడు, శిల్పదర్శకుడు, నటీనటులు, ఆహార్యము, వేషధారణములను చూచువారు, కూర్పు దారుడు, ఇతర సాంకేతిక శాస్త్రజ్ఞులు చిత్రనిర్మాణములో భాగస్వాములై వ్యవహరించుచున్నారు. చిత్రనిర్మాణము సమష్టి కృషిఫలితము. దర్శకుడు ఈ సాంకేతిక శాస్త్రజ్ఞు లందరికిని నాయకుడు. అతని వీక్షణాశక్తిని (visualization power) అనుసరించియే చిత్రము రూపులు తీర్చి దిద్దుకొనును.
చిత్రమనగా సెల్యులాయిడ్ మహాకావ్యమన్నమాట. అధ్యాయములు, పేరాలు, ఫుల్ స్టాపులు, సెమికోలన్లు, కోలన్లు, డాష్‌లు, కామాలు - ఇవన్నియు కావ్యమందలి భాషా, భావవాహికలకు సొబగులు ఎట్లు తీర్చి దిద్దగలవో, అటులే ఈ సెల్యులాయిడ్ మహాకావ్యానికి 'సీక్వెన్సులు', 'సీనులు', 'షాటు' లు, 'ఫేడ్ ఇన్', 'పేడ్ అవుట్' లు, 'కట్'లు, 'మిక్స్'లు, 'డిసాల్వ్ ' లు, 'టర్న్ వైవ్' లు, 'వైవ్ 'లు పరిపుష్టిని చేకూర్చగలవు. ఈ సాంకేతిక పారిభాషిక పదములన్నియు చిత్రమునకు లయబద్దమైన నడకను ప్రసాదించి మన దృష్టిని బంధించును. కెమెరాలో ఉపయోగింపబడు 100, 75, 50, 40, 25, 15 లెన్సులు పాత్రల ముఖకళవళికలను, సెట్లలోని వాతావరణము యొక్క రామణీయకతను మనకు ప్రస్ఫుటముగా చూపించుటకు ఉపకరించును.
'సినాప్సిస్', 'స్టోరీ', 'ట్రీట్ మెంట్', 'సినేరియో' 'స్క్రిప్ట్', 'షూటింగ్ స్క్రిప్ట్'-ఇవన్నియు కథ వెండితెరమీద రూపు తీసికొనులోపల వచ్చు పరిణామదశలు. ఈ దశలలో కథ విశిష్టతతో కూడిన తీర్పులను తీర్చి దిద్దుకొనును. 'ఎక్స్‌పొజిషన్', 'ఎక్స్‌పౌండర్', 'ఎక్స్‌ప్లోడర్ ', 'కాన్‌ఫ్లిక్ట్', 'కాంప్లికేషన్స్', 'మోర్ కాంప్లికేషన్స్', 'సబ్ క్లైమాక్స్', 'క్లైమాక్స్', 'డినౌమెంట్ ' ఇవి ప్రతి ఇతివృత్తమునకును అవసరమగు దినుసులు. పాత్రౌచిత్యము, పాత్ర పరిపోషణ, సంఘర్షణ, చిక్కులు, రససిద్ధిని బడయు అంతిమఘట్టము- ఇవి వీటిలో మనకు ద్యోతకమగును. ఇతివృత్తము యొక్క ప్రయోజనము లేక గమ్యస్థానము 'డినౌమెంటు' లో గోచరించును.
తెరమీద కథను చెప్పుటలో షాట్ల విభజనము ప్రాధాన్యము వహించును. స్థూలరూపములో ఈ షాట్లు రెండు రకములుగా నుండును. ఒకటి 'స్టెడీ' షాట్లు ; రెండు 'ట్రాలీ' షాట్లు. కెమేరా ఒకే ఒక సెటప్ లో నున్నప్పుడు 'స్టెడీ' షాట్ తీసికొనబడును. అది ముందునకుకాని, వెనుకకు కాని, ప్రక్కకు కాని తిరుగుచున్నప్పుడు 'ట్రాలీషాట్ ' తీసుకొనబడును. సెట్టుమీద షూట్ చేయవలసిన పాత్రలలో కొన్నిటిని మినహాయించుటకు కాని, కొన్నిటిని కలుపుటకు కాని, ఒక పాత్రయొక్క శరీరములో ఏ భాగమునైనను మినహాయించుటకు గాని, కలుపుటకు గాని 'ట్రాలీషాట్' ఉపయోగింపబడును.
'డిస్టెన్స్‌షాట్', 'లాంగ్ షాట్', 'మిడ్ లాంగ్ షాట్', 'మిడ్‌షాట్', 'క్లోజ్ మీడియంషాట్' 'క్లోజ్‌షాట్' మున్నగునవి వెండితెరపైన మనకు ప్రకృతి సౌందర్యమును, పాత్రల ముఖ కళవళికలను, భావ విస్ఫూర్తిని ఆయా సందర్భముల ననుసరించి చూపించుటకు ఉపయోగపడుచుండును. రసానుభూతిని కల్గించుటకై వెండితెరమీద శరవేగముతో కొన్ని చిన్నషాట్లు చూపింపబడును. వీటిని 'మాంటేజి షాట్స్' అనియెదరు.
ఈనాడు చలనచిత్రములో తంత్ర ఛాయాగ్రహణము ప్రాధాన్యము వహించుచున్నది. కెమేరాను 'రీవర్స్'లో నడుపుటద్వారా ఒకటర్న్-ఒక పిక్చర్ ద్వారా - అనగా స్టాప్ మోషన్ విధానముద్వారా, తంత్రమునకు సంబంధించిన దృశ్యములను చూపించుటకు అవకాశము కల్గును. 'బాక్ ప్రొజెక్షన్' విధానము నటీనటులు కొన్ని పరిసర ప్రాంతములలో నుండి, అభినయించు చున్నట్లు మనకు చిత్తభ్రమమును కలుగ జేయును.
టెక్నిక్ : సాహిత్యము : సినిమాకు ప్రత్యేకమైన ఒక సాంకేతిక శాస్త్రవిధానము కలదు. ఈ విధానమునే 'టెక్నిక్ ' అనియెదరు. దీనిపై గొప్ప సాహిత్యము వెలువడినది. అంతర్జాతీయ రంగములో ఆధునిక యుగమున చలనచిత్ర రంగములో ప్రాముఖ్యము వహించుచున్నవి రెండే రెండుదేశములు-అమెరికా, సోవియట్ రష్యాలు . ఈ రెండుదేశములు తమ అభిరుచుల కనుగుణ్యముగా ఈ సాహిత్యమును తీర్చి దిద్దుకొనుచున్నవి. అమెరికా 'ఫిక్షన్' కు అనగా కల్పనకు ప్రాధాన్య మిచ్చుచుండగా, సోవియట్ రష్యా 'రియలిజం' - కు అనగా వాస్తవికతకు అత్యంత ప్రాముఖ్య మొసగుచున్నది. ప్రఖ్యాత రష్యన్ రచయిత 'పుడోవ్‌కిన్' రచించిన 'ఫిల్ముటెక్నిక్ ' అను మహత్తర గ్రంథము చలనచిత్ర సాహిత్యమునకు మకుటాయమాన మైనది. మానవజాతియొక్క సర్వతోముఖ వికాసమునకు చలనచిత్ర మెట్లు తోడ్పడగలదో ఈ గ్రంథము మనకు విప్పిచెప్పగలదు.
కమ్యూనిస్టు దేశములు ప్రచండశక్తితో కూడుకొని యున్న సినిమా రంగమును ప్రభుత్వపర మొనర్చినవి. పెట్టుబడిదారీవిధానమునకు కొద్దిగనో గొప్పగనో నివాళులర్పించుచున్న దేశములు ఈ మహత్తరశక్తిని ఇంకను వ్యక్తిగతమైన వ్యాపారస్తులహస్తములయందే ఉంచినవి.
ప్రపంచమందలి పెక్కు దేశములు సినిమా ఒక మహత్తరమైన ప్రచారక సాధనమని గుర్తించుటచే, ఏటేటా, అంతర్జాతీయ ఫిల్ము మహోత్సవములను ఏర్పాటుచేసి, ఉత్తమమైన చిత్రములకు బహుమతుల నిచ్చుచున్నవి. భారతప్రభుత్వముకూడ మనదేశములో ప్రతిసంవత్సరము తయారగుచున్న పొడుగు చిత్రములలోను, పొట్టి చిత్రములలోను ఉత్తమమైనవాటికి పారితోషికములను ప్రసాదించుచున్నది.
సినిమా సాంకేతిక శాస్త్రవిధాన మీనాడు శరవేగముతో అభివృద్ధి నొందుచున్నది. వర్ణచిత్రములు ప్రచారములోనికివచ్చి, నలుపు-తెలుపు చిత్రములను వెనుకకు నెట్టివేయుచున్నవి. ఒక వైపునుండి 'టెలివిజన్' వచ్చి ఉప్పెనవలె విరుచుకొని పడుచున్నను, సినిమాకు ఎట్టి చలనమును కలుగబోదు. టెలివిజన్ సెట్లు సామాన్య మానవులకు ఆరుఅణాల వెలకు లభించునంతవరకు, కోట్లకొలది ప్రేక్షకుల హృదయ ఫలకములమీద పడిన సినిమా ప్రభావముద్ర చెక్కు చెదరనేరదు.
మంచికికాని, చెడుకుకాని సినిమా ఒక మహత్తర శక్తిగా రూపొందినది. మానవజాతి ఈ చలనచిత్రమును ఉపయోగించుకొను విధానము ననుసరించియే, ఇది మంగళగీతములను ఆలపించుటయో, కాక, మారణ హోమమునకు సమిధలను చేకూర్చుటయో సంభవించును.
ఇం. వే.