సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మూడవ సంపుటము/చర్మవ్యాధులు

చర్మవ్యాధులు (Skin Diseases) :

చర్మమునందు రెండు పొరలు కలవు. అందు ప్రభాసిని (ఎపిడెర్మిస్) అనబడు బాహ్యచర్మము ఒకటి. స్థూలత్వక్కు (డెర్మిస్) అను లోపలిచర్మము మరియొకటి. ప్రభాసిని యొక్క లోతుపొరలలో లోపలిచర్మపువర్గము ఉండును.

స్థూలత్వక్కునందు ఈ క్రిందివి కలవు :

(i) చర్మపు గ్రంధులు. ఉపరి భాగమునందలి తమ గొట్టములద్వారా అవి తెరచుకొనును. అందువల్ల చెమట వెలికి వచ్చును.
(ii) వెంట్రుకల లఘురంధ్రములు.
(iii) క్రొవ్వుద్రవమును తయారుచేయు గ్రంధులు.
(iv) స్పర్శ, ఉష్ణోగ్రత, వేడి, చలి మొదలగువాటిని కనుగొను జ్ఞాననాడులు. ఈ నాడులు తుది అవయవముల యొద్ద ముగియును. వ్రేళ్ళయొక్క తుది భాగములు మొదలైనచోట్ల ఈ స్పర్శజ్ఞానము ఎక్కువగా నుండును.

చర్మముయొక్క పనులు : 1. శరీరావయవములను ఇది కాపాడును. 2. శరీరోష్ణోగ్రతను క్రమబద్ధము చేయుటలో ఇది ముఖ్యపాత్ర వహించును. శరీరమునుండి సుమారు 1000 ఘనసెంటిమీటరుల ద్రవము ఉప్పుతో శరీరము నుండి ఇగిరి పోవును. ఏ వాతావరణము నందైనను సుఖముగా నున్నామను భావన చర్మమునుండి కలుగు నదియే. బాహ్య ఉష్ణోగ్రతను, తేమను, ఒక ప్రత్యేక స్థాయిలో నుంచుటవలన అట్టిది కలుగుచున్నది. దీనినే 'ఎయిర్ కండిషనింగ్' అందురు.

చర్మములో మార్పులు కలిగించు సాధారణ వ్యాధులు : మధు మేహములో దురద పెట్టుట సామాన్యమైన విష

చిత్రము - 184

చర్మమును అడ్డముగా కోసి సూక్ష్మదర్శినితో చూచిన యెడల మనకు గోచరించు దృశ్యము

1. ప్రభాసిని, 2. స్థూలత్వక్కు, 3. వెండ్రుక కుదురు, 4. చెమటగ్రంధి, 5. నాడులకొనలు, 6. నూవెచెమర్చు గ్రంథులు

యము. ఎ. విటమిన్ కొరతవలన చర్మముపై మృదుత్వము పోయి అది గరుకుగా నగును. 'పలాగ్రా' యను వ్యాధి వచ్చినవారికి కాళ్ళు చేతుల క్రిందిభాగము నల్లబడును.

నరములకు సంబంధించిన కుష్ఠరోగమువంటి వ్యాధులలో ఇంద్రియజ్ఞానము పోవును. చర్మముపై వ్రణములు లేచును. చర్మము గాజువర్ణము పొంది పలుచగా నగును. వెండ్రుకలు రాలిపోవును. వ్రణములు లేచును.

రెండు కాళ్ళును పడిపోయినవారికి పిరుదులపై వ్రణములు లేచుట గలదు. పొంగు, మసూచి మొదలగువ్యాధులలో చర్మముపై పొక్కులు కనబడును. సవాయివలన చర్మముపై లేచు పొక్కులు ఏ చర్మవ్యాధినైనా పోలి యుండవచ్చును.

పుట్టుకతో వచ్చు లోపములు : చెమటగ్రంధులు లేక పోవచ్చును. వేసవిలోరోగి తనఉష్ణోగ్రతను పూర్తిగానింపు కొనలేక తడిబట్టలు ధరించి తిరుగవలసివచ్చును. శరీరమం దంతటను రోమములు లేకపోవుట జరుగవచ్చును. చేతులు పాదములపై అదనముగా చెమటపట్టుట కూడ కొందరికి ఉండవచ్చును. చెమటకు చాలా అరుదుగా దుర్వాసన యుండును. 'ఇక్తి జాసిస్ ' వ్యాధికలవారి చర్మము పొడిగా పొలుసులు కలిగి కొన్ని సందర్భములలో చేప యందువలె పెరుగుదల రావచ్చును. ఇది వంశపారంపర్యముగ వచ్చు అవకాశము గల వ్యాధి.

రంగులో కలుగు మార్పులు : 'ఎడిసన్సు' వ్యాధిలో నోటిలోను, చంకలలోను రంగు ముదురుట సంభవించును. బొల్లి యనగా శరీరముపై రంగుపోయి తెల్లగా నగుట. దీనికి మేలడొమీన్ అను మలామాను, అదే పేరుగల గోలీలను ఇచ్చియు, అల్ట్రావయలెట్ కిరణములతోడను చికిత్స చేయుదురు. ఇది కొన్ని ప్రత్యేక స్థానములలో కాని శరీరమం దంతటను కాని యుండవచ్చును. పుట్టుకతోడనే శరీరమం దంతటను బొల్లి యున్నచో దానిని 'ఆల్ చినిజం' అందురు. అట్టి వారు ఎండలో తిరుగరాదు. చలవ కళ్ళజోడు పెట్టుకొనవలెను.

నేవస్ అనగా పుట్టుమచ్చ; ఇది చర్మపు రక్తనాళములపైన పెరిగియుండవచ్చును.

బట్టతల : మామూలు చర్మముపై వెంట్రుకలు పోవుట వల్ల యేర్పడు సామాన్యపరిస్థితిని 'అల్ పేషియా అరీటా’ అందురు. ఇది కొన్నిమాసము లుండును. తరువాత మరల వెంట్రుకలు పెరుగును. స్పిరిటువంటి వస్తువులను అక్కడ మర్ధనచేసిన యెడల వెంట్రుకలు త్వరగా మొలచును. టైఫాయిడువంటి వ్యాధులు వచ్చినప్పుడు జుట్టు రాలిపోయినను అది మరల పెరుగును. దేలియం అను మందు తీసికొనిన యెడల వెంట్రుకలు రాలిపోవును. 'సుబ్రుసోకా', 'యిక్తోసిస్' వంటి చర్మవ్యాధులవల్ల వెంట్రుకలు రాలిపోవుట కలదు. రోగి వెంట్రుకలు లేకుండా జన్మించు పరిస్థితిని అలిపేషియా టోటాలిస్ అందురు. 40 సంవత్సరములు పై దాటినవారి కణతలపై వెంట్రుకలు రాలిపోవుట సాధారణముగా కలుగును. ఇట్టిది కొన్ని కుటుంబములలో వంశపారంపర్యముగా వచ్చును.

వెంట్రుకలు నెరయుట : వయస్సు మళ్ళుటకు ఇది ఒక తార్కాణము. మితిమీరిన పని, హటాత్తుగ దుఃఖము సంభవించుట లేక కష్టము కలుగుట వీటివల్ల కూడ ఇది సంభవింపవచ్చును. కొన్ని కుటుంబములలో చిన్నతనములోనే యిది వచ్చును. దీనికి రంగు వేసికొనుటయే మార్గము.

గజ్జికురుపులు : ఇది ఎకారస్ స్కెబియె అను సూక్ష్మజీవులవల్ల వచ్చును. గజ్జి రసివలన చర్మముపై పొక్కులు లేచి అవి ఒక వ్యక్తి నుండి మరొక వ్యక్తికి వ్యాపించును. వ్రేలికణుపులు, బొటనవ్రేళ్ళు, స్తనములు, పిరుదులపై ఇవి లేచును. పైన చెప్పబడిన సూక్ష్మజీవి చర్మములో రంధ్రములు చేసికొని దానిలో గ్రుడ్లుపెట్టును. దురదవల్ల రోగి దానిని గోకుట, అందువల్ల చీముపట్టుట సంభవించును. కుటుంబమంతటికి ఒకేసారి చికిత్స చేయుట, దుప్పట్లు మొదలగునవి ఉడక బెట్టుట అవసరము. బెంజాయిన్ బెంజివేట్ 25% లోషనును ఒంటినిండా పట్టించవలెను. పెనిసిలిన్ వంటి ఆంటిబయటిక్సును చీముపోవుటకు ఇవ్వవలెను. ఇప్పుడు సల్ఫరు ఆయింట్ మెంటు ఇచ్చుట అరుదు.

పెడీకులోసిస్ (పేలు) : ఇవి మూడు రకములు. (1) నెత్తి, (2) శరీరము, (3) కడుపుపై వెంట్రుకలపై పెరుగునవి. పదేపదే తిరుగబెట్టు జ్వరమును టైఫస్ జ్వరమును ఇవి వ్యాపింప జేయును. ఇది పరస్పర సంపర్కమువల్ల వచ్చును. తల దువ్వి గ్రుడ్లను తీసివేయ వచ్చును. బెంజాయిన్ బెంజివేట్ ఎమల్షను, బెంజీస్ హైడ్రోక్లోరీడ్ 1% సొల్యూషను (లారేక్సేన్) వల్ల వీటిని పోగొట్టవచ్చును.

పనుగుగజ్జి (ఎక్జిమా) : శరీరము యొక్క వాపు ఒకప్పుడు ప్రకోపించును. ఒకప్పుడు దీర్ఘకాలిక వ్యాధిగా నుండును. కొన్ని చెట్లవంటి బాహ్యప్రకోపకారిణులవల్ల గాని, లేక గ్రుడ్లవంటి ఆహారములులేక కొన్ని మందుల వాడకమువల్ల గాని కల్గిన యింద్రియ వికారము మూలమున ఇది సంభవించవచ్చును. దీనికి హైడ్రోకార్టిజోన్ నియోమైసిన్ మలామా వాడవలెను. పిల్లలకు ఇది సాధారణముగా బుగ్గల మీద వచ్చును. దీని నుండి రసి క్రిందికి కారును. ఇందులకు గల కారణములను కనుగొని వాటిని తొలగించుటయే ఇందులకు జరుగవలసిన చికిత్స. వ్యాధి ప్రకోపించినప్పుడు నీళ్ళు తగులకూడదు. కాలమిన్ లోషనును తరుచుగా రాయవలెను. చేనేడ్రల్ యాంటిస్టిక్ వంటి యాంటీహిస్టిమిన్ మందులు వాడవలెను. వ్యాధి వంటబట్టిన కేసులలో పాదరసము కలసిన మలామాలు (ఆయింట్ మెంట్లు) వాడవచ్చును. చర్మముపై గరుకుదనము గల మచ్చ లున్న యెడల కొద్ది మోతాదులో ఎక్సు రే చికిత్స ప్రయోజనకరముగా నుండ గలదు.

ఆర్టికేరియా : ఇది ప్రేలుడుజాతికి చెందినది. చర్మముపై వాపు, దురద ఉండును. ఇది దద్దుర్లరూపములో వచ్చును. పురుగులు కుట్టుట, నరముల బలహీనత, భావోద్రేకము ఉబ్బసమువ్యాధికి సంబంధించిన ఎల్లర్జీ పరిస్థితి, హేజ్వరము గ్రుడ్లు మొదలగు ఆహారపదార్థములు తినుట ఇందులకు గల కారణములు. ఆంటి ఇస్టమిన్ మందులవల్లను, ఎడ్రినలీన్ ఇంజక్షనులవల్లను ఇది తగ్గును. కాని ఇది పదేపదే రాకుండా చేయుట మిగుల కష్టసాధ్యము. అందులకు ఏవేని హేతువు లున్నయెడల వాటిని తొలగించవలసి యుండును.

సోరయాసిస్ : ఇది క్రమరూపములో నుండని మచ్చలుగా వచ్చును. ఇది కొంచెము పైకి యుండి దానిపై రజతవర్ణము గల పొలుసులు సమృద్ధిగా గోచరించును. వాటితో పాటు ఎట్టి స్రావము ఉండదు. అది ముఖ్యముగా మోకాళ్ళు, మోచేతులపై యుండును. నెత్తి చర్మము, శరీరములోని ఏదేని పార్శ్వము దీనికి గురికావచ్చును.

ఈ క్రింది చికిత్సలవలన లాభించును :

క్రైసరోచిన్ ఆయింట్ మెంట్ 2%
టార్ ఆయింట్ మెంట్
విటమిన్ బి 12 ఇంజెక్షనులు
కార్తిసాన్ మాత్రలు.

సెబారియా (పొలుసులవంటి పుండ్లు) : గుండ్రని లేక కోడిగ్రుడ్డు ఆకారములో ఇది శరీరము లేక తలపై గోచరించును. నూనె కారెడు పసుపుపచ్చని పొలుసు లుండును. వీటిని తరచుగా కడగవలెను. వీటికి గంధకము, ఆసిడ్ కార్బాలిక్ లోషన్ లేక ఆయింటుమెంటు వాడవలెను. రోగి ఆహారములో క్రొవ్వు పదార్థములు, కర్బన ఉదజనిదములు తగ్గించవలెను.

శిలీంధ్రపు (ఫంగన్) సంపర్క దోషములు : ఎఱ్ఱని మచ్చలు, కోడిగ్రుడ్డు ఆకృతిలోగాని, ఉంగరపు రూపములో గాని పొలుసులతో పెరిగి డోబీకురుపులు టెంకాక్రసీస్ చర్మముయొక్క హారనీ పొరలలో వచ్చును. అందువల్ల మిగుల భాధకరములైన ఎఱ్ఱని మచ్చలగును. దీనికి (1) ‘విట్‌ఫీల్డ్ ' మలామా వాడవలెను. సలిసిలిక్ ఆసిడ్‌ను, బెంజాయిక్ ఆసిడ్‌ను 2-6% వాసలీన్ లో కలిపి వాడవలెను. (2) అన్‌డిసిలినిక్ ఆసిడ్ ఆయింట్ మెంటు. (3) ఆంటీబయటక్ వర్గమునకుచెందిన గ్రీసియోఫోలిన్ మాత్రలు ప్రొద్దున రెండు, సాయంత్రము రెండు చొప్పున 8 వారములు వాడినచో మంచిగుణము కనబడుచున్నట్లు ఇటీవల తెలియుచున్నది.

టెనీయాసర్సినేటా : శరీరముపై తామర వచ్చును. ఈ కురుపులు జంతుజాతికి సంబంధించినవి. ఈ పొడలు సుస్పష్టమైన ఉంగరము ఆకృతిలో నుండును. ముఖము, చేతులు, మెడ సాధారణముగా ఇందుకు గురియగును.

పిటేరియాసిస్ వెర్సికోలార్ : హరనీలేయర్ (పొర) సాధారణముగా ఇందుకు గురియగును. శిలీంధ్రపు సూక్ష్మ జీవులే ఇందులకు హేతువులు. శరీరకాండముపై ముఖ్యముగా రొమ్ముపై యిది కనబడును. దీనికి క్రమబద్ధమైన ఆకారము ఉండదు. ఇది పొడిగా నుండి, పొలుసులుకల్గి, పసుపు గోధుమరంగు మచ్చలతో నుండును. వానిని సులభముగా గోకివేయవచ్చును.

తామర (టీనియాటాన్సురాన్సు) : తెల్లని పొలుసులు గల గుండ్రని మచ్చలు కనబడును. అందులో వెంట్రుకల ముక్కలు ఉండును. తలకు పది రోజుల కొకసారి క్షురకర్మ చేయించవలెను. వ్యాధి ఒకేచోట ఉన్న యెడల పిక్‌నిక్ ఆసిడ్ 7 పాళ్లు, కర్పూరము, శుద్ధిచేసిన స్పిరిటు, ఒక్కొక్కటి 1/2 ఔన్సు చొప్పున కలిపి రోజుకు 2 సార్లు రాచినయెడల మంచిగుణము కనబడును. మూడు వారములలో వెంట్రుకలు వదులుగా నగును. వాటిని లాగి వేయవచ్చును. నిపుణుడైన రేడియాలజిస్టుచే ఎక్సు రే ద్వారా వెంట్రుకలు రాలిపోవునట్లు చేయుట మంచిది. ఆ పిమ్మట మలామాను వాడవచ్చును.

ఫీవస్ : ఇది తల, శరీములపై వచ్చును. క్రమబద్ధముగ నుండని పసుపురంగు పెచ్చులు కప్పు ఆకారముగల పసుపు కొనలతోకనబడుట, దుర్వాసనయుండుట దీనిలక్షణములు. ట్రెకోఫైటాన్ షాన్‌లినైన్ వలన ఇదిసంభవించును. ఇది దీర్ఘ కాలవ్యాధి. దీనివలన మచ్చలు మిగులును.

ఇంపుటే గోకంటే జియోసా : ఇది ఒక బిడ్డనుండి మరొక బిడ్డకు వెనువెంటనే వ్యాపించును. ముఖము, శరీరముకూడ ఇందుకు గురియగును. స్టెప్టొకోకె, స్టెఫలోకోకై అను సూక్ష్మజీవులు ఇందుకుగల సాధారణ కారణ కారణములు. చీముపొక్కుల రూపేణాగూడ ఇది సంభవింప వచ్చును. అవి పగిలి పుండ్లగును. ఇది సాధారణముగ కొద్ది వారములలోనే పోవును. పెచ్చులను నూనెతో తీసివైచి మెర్క్యురీ ఆయింట్‌మెంట్ వాడవలెను. లేక సల్ఫతైజాల్ క్రీం 5% కాని, పెన్సిలిన్ ఆయింట్ మెంటు కాని, జన్షన్ వై లెట్ 1% గల ద్రవమునుగాని వాడవలెను. సైకొసిస్ : గడ్డముయొక్క చర్మములోపల, వెంట్రుకల కుదుళ్ళు, నూనెగ్రంధులలోను 'స్టెఫలకోకై ' అను సూక్ష్మజీవులవల్ల వచ్చును. ఇవి చీముపట్టి ఉబ్బి పగులును. జుట్టును పొట్టిగానుంచి పొక్కులను చిదపవలెను. క్వినోలరు ఆయింట్ మెంటువల్ల తరుచు గుణము కలుగును. పెన్సిలిన్ కూడ మిగుల ఉపయోగకరము. వ్యాధి తిరుగబెట్టుట సామాన్యముగ జరుగును. కొన్ని కేసులలో టీకాల మందులు (వాక్సినులు) మంచి ఫలితముల నిచ్చును. రోగి ఆహారములో చక్కెర తగ్గించవలెను. చక్కెర ఉన్నదో లేదో తెలుసు కొనుటకు మూత్రపరీక్ష చేయించవలెను.

యాక్నీవల్గారిస్ : ఇది సంపర్కదోషమువలన కలిగిన యెడల దీనిని 'చీరొఫాఫిలెస్' అందురు. ఇది ఒక దీర్ఘ కాలిక వ్యాధి. మొటిమలు గుంపులుగా లేచును. వీటినే 'ఆపిల్ సెల్సు' అందురు. ఇవి ముఖము, రొమ్ములపై లేచును. ప్రతిరోజు 'బి' విటమిన్ తీసికొనుట అవసరము. చాకొలెట్సును, క్రొవ్వుపదార్థములను విసర్జించవలెను. నంధకముగల మలామాలను వాడవలెను.

ఫింఫిగస్ : ఇది చాల అరుదైనవ్యాధి. బొబ్బలు కనబడి జ్వరము మొదలగునవి వచ్చుట దీని లక్షణములు. ఫింఫిగస్ వల్నారిస్ అనునది దీర్ఘకాలవ్యాధి. ఇందు బొబ్బలులేచి చిదికి మరల లేచును. ఇది ఒకప్పుడు మరణ హేతు వగును. కార్టిసౌన్, ఎ. సి. టి. హెచ్. వలన సత్ఫలితములు కలుగుచున్నట్లు తెలియు చున్నది.

ఫరంకిల్ : తీవ్రములు మిగుల బాధాకరములు అగు ఎఱ్ఱని మృదువైన పిండములుగల ఒక రకమైన కురుపు. వెంట్రుకల కుదుళ్ళలో ప్రారంభమగును. స్టెప్లోకోకై అను సూక్ష్మజీవులవలన కలుగును. వాపు నెమ్మదిగా తగ్గవచ్చును. లేక చీముపట్టుటకూడ జరుగవచ్చును. చర్మము పగిలి అందలి మధ్యగల చీము బయటికి వచ్చిన తర్వాత అది తగ్గిపోవును. ఆంటీ బయటిక్సు (పెన్సిలిన్) ఉపయోతురు. 'కొల్లాయిడల్' మాంగనీస్' రెండు సూదులు ఇచ్చినయెడల క్రొత్తవి పుట్టకుండా చేయును. టీకాల మందును ఉపయోగింతురు.

చర్మమునకు సంబంధించిన క్షయ :

లూపస్ వల్గారిస్ : ముఖము ఇందులకు ముఖ్యముగా గురియగును. శరీరములోని ఇతరభాగములుకూడా దీనికి గురికావచ్చును. ముందు ఒక పొక్కుగా ప్రారంభమై, దరిమిలా పుండుగా మారి ఆ పిమ్మట చాలా మెల్లగా మానును. మచ్చపడును. మెడలోని మాంసపు గ్రంధులు వాచి అందుండి చీము కారును. దీనికి క్షయకు చేసిన మాదిరి చికిత్సనే చేయవలయును.

పులిపిరి కాయలు : చర్మము పైపొర పెరిగి పులిపిరి కాయలు ఏర్పడును. ఇది ఒక్కొక్కచోట రసివలనకూడా కలుగవచ్చును. ఇది ఒక్కటిగాకాని పెక్కులుగాకాని రావచ్చును. ఇవి అంటువ్యాధులు, పులిపిరికాయలు కోసినను అవి పెరుగ నారంభించును. విద్యుత్తుతో కాల్చుట ఇందుకు ఉత్తమమార్గము. కార్బన్‌డైయాక్సయిడ్‌స్నో వాడవచ్చును.

కాయలు (కారన్సు) : తరచుగా కాళ్ళుచేతులలో ఒత్తిడియుండు స్థావరములందు పుట్టును. సరిగా పట్టని జోళ్ళవలన కాళ్ళపై లేచి నొప్పి కలిగించి నడచుట కశక్తత కలుగజేయును. మృదువైన కాయలకు 20% సాలిసైలిక్ ఆసిడ్ ను కల్లోడిన్ లో కలిపి ప్రతిరాత్రియు రాయవలెను. అట్లు చేయగా మెత్తబడిన పై భాగమును కత్తిరించవలెను. అప్పుడు ఆతొడుగు ఊడిపోయి అవి నివారణమగును. కాయలను ఎంతగా కోసివైచినను, మూలము ఊడిపోవునంతటి లోతుగా కోసివేయని యెడల ఎట్టిప్రయోజనము ఉండదు ; అవి తిరిగి పుట్టును.

ఆర్సెనికల్ డర్మటైటిస్ : ఆర్సెనిక్ పడని వారికి ఆ యింజక్షన్ ఇచ్చినయెడల వంటి చర్మమంతయు ఎఱ్ఱపడి, పొక్కులుగామారి, పొలుసులు క్రింద రాలిపోవును. దీనితో జ్వరముకూడా వచ్చును. జ్వరము ప్రకోపించిన యెడల నూమోనియావల్ల ప్రాణాపాయము కూడ కలుగవచ్చును. ఇది ఆరువారములు మొదలు రెండు నెలలవరకు ఉండును. బి. ఎ. ఎల్. ఇంజెక్షనులవల్ల ఇందులకు మంచి ఉపశమనము కల్గు అవకాశము కలదు.

వ్రణములు (పుండ్లు) : ఇవి చర్మములో ఏర్పడును. అవి పెదవుల చర్మమువంటి సున్నితమయిన చర్మమునకు వచ్చును. లేక తక్కిన శరీరముమీది దళసరి చర్మమునకు వచ్చును.

ఈ క్రింది రకములు సాధారణమైనవి :

1. తీవ్రవ్రణములు : (i) సూక్ష్మజీవులు, (ii) కాలుడు, (iii) రసాయనిక ద్రవములు, (iv) విద్యుచ్ఛక్తి షాక్, (v) దెబ్బ తగులుట; ఇందులకు కారణములు.

ఈ పుండు మొదట ఎఱ్ఱపడి, చీముకారి నొప్పిగా నుండును. తర్వాత మెల్లగా మానును.

2. ఖర వ్రణములు : సిరాజవ్రణములు, వాతరక్త వ్రణములు, పడకలో చచ్చినపుండ్లు, మానుటకు దీర్ఘకాలము పట్టును.

3. నిర్దుష్ట వ్రణములు : (ఇవి నిర్దిష్ట కారణములవల్ల వచ్చును.) (అ) క్షయ, (ఆ) సవాయి, (ఇ) టైఫాయిడ్, (ఈ) హెక్టినోమైకోసిస్. (ఉ) డెఫ్తీరియా (ఘటసర్పి), (ఊ) లీష్మేనియా (ఢిల్లీకురుపు) వీటికిగల కారణములకు చికిత్స చేసినయెడల వ్రణము మానును.

4. ప్రమాదకరమైన వ్రణములు : (i) పుట్టకురుపు (కాన్సరు) ఇది కఠినమగు కొనలను స్థానిక గ్రంధుల ద్వారా తినివేయును. (ii) ధ్వంసక వ్రణము (రోడంట్ అల్సర్). (iii) సెర్‌కోమీ.

5. ఉష్ణమండల వ్రణములు : వీటికి కారణములు తెలియవు. ఇవి దీర్ఘకాల వ్యాధులు. చాలాకాలము దురదపెట్టి మానును. ఒక్కొకప్పుడు శస్త్రచికిత్స అవసరమగును.

కాల్పులు, బొబ్బలు : శరీరపు ఉపరి భాగమునకు పొడి వేడిమి (dry heat) సోకుటవల్ల కాల్పులు సంభవించును. ఆవిరివంటి తేమగల వేడిమి శరీరమునకు తగిలిన యెడల బొబ్బలు కల్గును. ఈ క్రింది ఆరు తరతమ భేదములు గుర్తింపబడినవి.

(1) చర్మము ఎఱ్ఱపడుట,
(2) ప్రభాసిని (చర్మపు పైపొర) పైకి లేచిపోవుట, బొబ్బలు కనబడుట,
(3) ప్రభాసిని నాశనము చేయబడుట,

నరముల కొనలకు ఎట్టి పైకప్పుదల లేకపోవుటచే నొప్పి అధికముగా నుండును. షాకు వచ్చుట సాధారణముగ జరుగు విషయము. త్వరగా నయమగును.

(4) చర్మమంతయును మరియు క్రింది ధాతువులలో కొంత భాగము నాశనమగును.
(5) కండరములు కూడా నాశనమునకు గురియగు చుండును.
(6) శరీరావయవము పూర్తిగా కాలిపోవుట లేక క్రమము తప్పుట.

4, 5, 6 లలో నాడులు చివరి భాగములో నాశన మగును. కావున రోగికి నొప్పి తెలియదు. మానునప్పుడు అంగవైకల్యము కల్గును. కాలిన వెంటనే రోగికి ఆఘాతము తగిలినట్లగును. కాల్పుయొక్క తీవ్రతనుబట్టి ఆఘాతము (షాకు) వచ్చును. నొప్పి తగ్గించుటకు (1) మార్ ఫైనును పెద్ద మోతాదులలో ఇవ్వవలెను. (2) రక్తనాళములలోనికి ప్లాస్మా లేక ప్లాస్మా వంటి మందులు ఇవ్వవలెను.

మొదటి ఆఘాతమునుండి తెప్పరిల్ల చేసిన పిమ్మట రోగిని ఏదైనా చికిత్సాలయమునకు చేర్చి, మత్తుమందు నిచ్చి కాలిన భాగమున విషక్రిమి నిరోధక వస్తువులతో శుభ్రపరచవలెను.

పెన్సిలిన్ ఆయింటు మెంటుతో కట్టు కట్టుటవలన రుండవతూరి సంపర్కదోషము రాకుండా నిరోధింప బడును.

ఈ క్రిందివి ప్రత్యేకరకపు కాల్పులు :

(1) పిడుగు దెబ్బ,
(2) విద్యుచ్ఛక్తివలన వచ్చిన కాల్పులు
(3) X రే - రేడియంవలన వచ్చిన కాల్పులు.

(ఇవి కొన్ని సంవత్సరముల తర్వాత మొండిజాతి వ్రణములకు కూడ దారితీయు అవకాశము కలదు).

(4) ఆమ్లములు, క్షారముల వలన వచ్చిన కాల్పులు.
(5) పై కప్పులేనిచోట్ల విపరీతమైన చలివలన వచ్చినవి.
(6) సూర్యుని వేడిమి వలన వచ్చు కాల్పులు.

శాం. నా. మా.