సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మూడవ సంపుటము/గ్రామవిద్యుదీకరణము
గ్రామ విద్యుదీకరణము :
ఆధునిక యుగమున ప్రతి దేశముయొక్క ఆర్థికాభి వృద్ధియందును విద్యుత్తు సరఫరా అత్యంత ప్రముఖమైన పాత్ర వహించుచున్నది. ప్రతి దేశముయొక్క అభ్యుదయము, ఆ దేశ మందలి ప్రతి వ్యక్తియు సంవత్సరమున కుపయోగించు కిలోవాట్ల విద్యుత్తుపై ఆధారపడియుండు నని సర్వత్ర ఆమోదింపబడిన సిద్ధాంతము. అనగా ప్రజా సంక్షేమమును, వినియోగ మగుచున్న విద్యుత్పరిమాణమును (కిలో వాట్ల సంఖ్యలో) బట్టి లెక్కించెదము. ఇదియే సాంకేతికముగా 'పర్ కాపిటా కన్సంప్షన్' (percapita consumption) అనబడుచున్నది.
గ్రామములయందు విద్యుచ్ఛక్తి సరఫరా యగుటచే అందలి ప్రజల ఆర్థికజీవితము అతిత్వరితముగ పరివర్తనము చెందుచున్నది. సహజముగ పేద స్థితియందుండి, జీవన ప్రమాణమును, ఉత్పత్తి పాటవమును అత్యంత హీనస్థితిలో నున్న గ్రామము, విద్యుత్ సరఫరా ఫలితముగా, ఉత్పత్తిశక్తి యందును, జీవన ప్రమాణము నందును ముందంజ వేయుచున్నది. విద్యుత్తువలన పెక్కు కార్యకలాపములలో మానవుడు తన శరీర శ్రమను తగ్గించుకొనుటయో, కాక కొన్ని రంగములలో అట్టి శ్రమతో అవసరమే లేకుండుటయో సంభవించుచున్నది.
ఎలెక్ట్రిక్ మోటారులవలన నీటిపారుదల ఈనాడు సుకర మయినది. అందుచే ప్రాచీనకాలము నుండియు ఎద్దుల సహాయముతో నీటిని తోడు విధానమునకు వ్యవసాయదారుడు స్వస్తి చెప్పగలుగుచున్నాడు. వ్యయశీల మైన అట్టి ప్రాచీన విధానము ఈనాడు క్రమముగా అంతమొందుచున్నది. విద్యుచ్ఛక్తివలన చెఱకును నలగ గొట్టుటకును, ధాన్యమును నూర్పిడిచేసి చెరగుటకును, ఇతర వ్యయసాయ కార్యక్రమములను కొనసాగించుటకును సాధనము లేర్పడినవి. అందుచే మానవుని శ్రమకు అవసరము తగ్గిపోవుచున్నది. వ్యవసాయ కలాపము లన్నియు చౌకగా, త్వరితముగా జరిగిపోవుచున్నవి. తత్ఫలితముగా, వ్యవసాయదారునకు విరామ మేర్పడుచున్నది. ఆ విరామమును వినోదములకును, ఇతర సాంఘిక కార్య క్రమములకును వినియోగించుకొన గల్గుచున్నాడు.
ఆధునికములైన పాడికేంద్రముల (Dairy Farming) యందును, కోళ్ళ పెంపకము (Poultry Farming) నందును, పాలుపితుకుట, గ్రుడ్లను పొదుగుట మున్నగు ప్రక్రియలందును విద్యుత్తు ప్రముఖమైన పాత్ర దాల్చుచున్నది. ఉద్యానకృషి రంగములో పండ్లరసమును శాస్త్రీయ పద్ధతులపై నిలువచేయగలుగుట వలన, తోట యజమాని విపణివీథిలో తన ఉత్పత్తి ఫలితముమ తన ఇష్టము వచ్చినప్పుడు ఎక్కువ లాభకరముగా అమ్ముకొనుటకు అవకాశము గల్గుచున్నది. తన ఫలములు చెడి పోవునను భయము ఆతనికి లేకపోవుచున్నది. అంతేకాక మార్కెటులో వాటిని చవుకపారుగా తెగనమ్ముకొన వలసిన దుస్థితియు తప్పుచున్నది. దీనికంతకును కారణము ఆతనికి విద్యుత్తు లభించుటయే. విద్యుత్తు వలన పండ్లరసమును నిలువచేయ గలుగుటచే తోట యజమానికి న్యాయమైన లాభము ప్రాప్తించుచున్నది. అందువలన ఆతడు క్రమబద్ధముగా తన ఉత్పత్తిని వివణి వీధికి వంప గలుగుచున్నాడు. మొన్న మొన్నటివరకు వండ్లరసమును నిలువచేయు విధానము భారతదేశములో అభివృద్ధి నొంద లేదు. కొంతకాలమునుండి గ్రామీణ ప్రాంతములలో విద్యుత్తు లభించుటచే ఈ పరిశ్రమ ఇప్పుడు అభ్యుదయ పథమున పురోగమించుచున్నది.
విద్యుత్తు సహాయమున గ్రామ ప్రజలకు కలుగు ప్రయోజనములలో కొన్నిటినిగూర్చి మాత్రమే పైన ముచ్చటింపబడినది.
పైన పేర్కొనినవాటికి తోడుగా గ్రామసీమలయందు స్థాపింపబడుచున్న లఘుపరిశ్రమలయందును, గృహ పరిశ్రమలయందును విద్యుచ్ఛక్తి అతి ప్రధానమైన పాత్ర వహించుచున్నది. ఉదాహరణమునకు, పీచు పరిశ్రమ, తాళ్ళ పరిశ్రమ, ఇత్తడి పాత్రలను పాలిష్‌చేయు పరిశ్రమ, కమ్మరి పరిశ్రమ, వడ్రంగి పరిశ్రమ. కుమ్మరి పరిశ్రమ ఇత్యాది పెక్కు లఘు పరిశ్రమలు విద్యుత్తు మూలమున పొదుపుతనమును (economy), సామర్థ్యమును, అధికోత్పత్తియును సాధింపగలవు. శతాబ్దముల నుండియు బండచాకిరిచేయ నలవాటుపడిన మానవున కీనాడు విద్యుత్తువలన విముక్తి చేకూరినది.
గ్రామ విద్యుదీకరణమునకు అవసరమైన పెట్టుబడిని గూర్చి విచారించినచో, అట్టి పెట్టుబడిని వెచ్చించుట లాభదాయకమైన విషయముకాదు. నగర ప్రాంతములతో పోల్చి చూచినచో, దూరప్రాంతములం దుండు గ్రామములకు విద్యుచ్ఛక్తిని అందించుట కష్టతరమైన విషయము. సాంకేతికమైనవి ఇందులకు కారణములు గలవు. అట్లని ఈ సమస్యపట్ల ఉపేక్షాభావము గాని, ఉదాసీనభావము గాని వహింపగూడదు. గ్రామ సీమల యొక్క ప్రత్యక్ష పరోక్ష ప్రయోజనములు దృష్ట్యా, ప్రజానీకముయొక్క సంక్షేమము దృష్ట్యా, విద్యుత్తును గ్రామసీమలకు వ్యాపింపజేయుట అభిలషణీయమైన అంశముగా గుర్తింపబడినది. అంతేకాని ఈ సమస్యను రూపాయలు, పైసల దృష్టితో విచారింపగూడదు. విద్యుదీకరణమువలన గ్రామీణులనుండి ప్రభుత్వమునకు ఎంత ఆదాయము వచ్చునా అను ఆలోచనయే కూడదు. ఈ దృక్పధము ననుసరించియే భారతప్రభుత్వమును, వివిధ రాష్ట్ర ప్రభుత్వములును గ్రామ విద్యుదీకరణ కార్యక్రమమునకు పూనుకొని వివిధ దశలలో దానిని అమలు జరుపుచున్నవి. ఈ ఆశయమును సాధించుటకై, పెట్టుబడి వ్యయమును తగ్గించు నుద్దేశ్యముతో గ్రామీణ పరిస్థితుల కనుగుణ్యమైన కొన్ని ఆర్థిక ప్రణాళికలను గూడ ఆచరణయం దుంచుచున్నవి. ఈ కార్యక్రమమును కొనసాగించుటకై వడ్డీ లేనట్టియు, వాయిదాల పద్ధతిపై వడ్డీ చెల్లించునట్టియు దీర్ఘకాలిక ఋణములు సేకరింపబడుచున్నవి.
ఆంధ్రరాష్ట్రములో విద్యుదీకరణ కార్యక్రమము ఎంతవరకు ముందడుగు వేసినదో విచారించుదము. మన రాష్ట్రములో 3 కోట్ల 59 లక్షలమంది ప్రజలు కలరు. రాష్ట్ర విస్తీర్ణము 1.06 లక్షల చ. మైళ్ళు; గ్రామములు 26,500. నూటికి దాదాపు 80 శాతము ప్రజలు గ్రామములలో నివసించుచున్నారు.
ప్రథమ పంచవర్షప్రణాళికాంతమునకు (1956 మార్చి) 700 గ్రామములు మాత్రమే విద్యుదీకరణము గావింప బడెను. కాని రెండవ ప్రణాళికదశయందు (1956 ఏప్రిల్ నుండి 1961 మార్చి వరకు) విద్యుదీకరణ కార్యక్రమము చాల చురుకుగా సాగుటచే, అదనముగా 2450 గ్రామములును, నగరములును విద్యుదీకరణము గావింపబడెను. రాష్ట్రమందలి జిల్లా, తాలూకా ముఖ్య కేంద్రములన్నియు విద్యుదీకరణము గావింపబడెను. ఇట్లు విద్యుదీకరణ మొనర్పబడిన గ్రామములసంఖ్య మొత్తము 3150 వరకు పెరిగెను. రెండవప్రణాళిక కాలములో ఒక్కగ్రామవిద్యుదీ కరణమునకై 19 కోట్ల రూప్యములు వ్యయపరుపబడెను. 1956 మార్చి నెలాఖరునకు వ్యవసాయదారులకు విద్యుత్తుతో సహా సరఫరా చేయబడిన పంపుసెట్లు (pumpsets) 4,300 మాత్రమే కాగా, 1961 ఏప్రిల్ మాసాంతమునకు దాదాపు అట్టి సెట్లు 18,000 సరఫరా చేయబడెను. రాష్ట్ర మంతటిలో 1961 మార్చి నెలాఖరునకు విద్యుత్తును వినియోగించెడి గ్రామీణులసంఖ్య 2,68,000 వరకు పెరిగెను. అదనముగా సంవత్సరమునకు 500 గ్రామములచొప్పున విద్యుచ్ఛక్తిని ప్రవేశ పెట్టుటకు అవకాశమేర్పడెను.
కాని ఇంతవరకు జరిగిన ఈ యభివృద్ధినిబట్టియైనను, రాష్ట్రములోగల 26,500 గ్రామములలో నూటికి 12 శాతముగల గ్రామములలో మాత్రమే విద్యుత్తు ప్రవేశపెట్టబడెను. 1961 మార్చి ఆఖరుకు తల ఒకటికి 15 యూనిట్ల విద్యుత్తు మాత్రమే వినియోగమయ్యెను. 3వ ప్రణాళికాంతమునకు (1968 మార్చి) 40 యూనిట్లవరకు పెరుగవచ్చునని ఊహింపబడుచున్నది. మద్రాసు కేరళ రాష్ట్రములతో పోల్చి చూచినయెడల, ఈ విషయములో మన రాష్ట్రము సాధించిన పురోగమనము అల్పమని చెప్పవచ్చును. కాని ఆంధ్రప్రదేశ్‌లో మాచ్‌ఖండ్ హైడల్ ప్రాజెక్టు 1955 లోను, తుంగభద్ర హైడల్ ప్రాజెక్టు 1957 లోను ప్రారంభమగుటతోడనే గ్రామ విద్యుదీకరణ కార్యక్రమముకూడ అమలు జరుపబడుటచే, విద్యుదీకరణ ప్రణాళికా సందర్భమున ఇంతవరకు సాధించిన అభివృద్ధి తృప్తికరమైనదనియే చెప్పనగును. మద్రాసు, కేరళ రాష్ట్రములలో యుద్ధమునకు పూర్వమే ధరవరలు తక్కువస్థాయిలో నున్నప్పుడు బ్రహ్మాండమైన హైడల్ ప్రాజెక్టులు నిర్మింపబడుటవలన, ఆ రాష్ట్రముల ప్రజలకు ఎంతయో ప్రయోజనము చేకూరినది. చాలినంత ధనసహాయము లభించినచో, మూడవ పంచవర్ష ప్రణాళికా కాలములోగూడ గ్రామీణప్రాంతములో సంవత్సరము ఒకటికి 500 గ్రామములను విద్యుదీకరణము గావించుటకు రాష్ట్రప్రభుత్వ ఎలిక్ట్రిసిటీ బోర్డువారు సంకల్పించి యున్నారు. కాని విద్యుత్ప్రణాళికా రంగమునందు వ్యయమును చాలవరకు తగ్గించివేయుటచే, 6494 లక్షల రూప్యముల మొత్తము అంచనాలో 925లక్షలుమాత్రమే 3 వ ప్రణాళికా కాలములో మన రాష్ట్రమునందు గ్రామ విద్యుదీకరణమునకు ప్రత్యేకింపబడినది. ఈ మొత్తముతో మూడవ ప్రణాళికా కాలమునందు (1961-1966) 925 అదనపు గ్రామములనుమాత్ర మే విద్యుదీకరణము గావింప సాధ్యమగును. కాని గ్రామ విద్యుదీకరణ కార్యక్రమమును జయప్రద మొనరించుటకై సంవత్సరమునకు 500 గ్రామముల చొప్పున విద్యుదీకరణ మొనరించుట కవసరమగు అదనపు ధనమును సేకరించుటకు ఆంధ్రప్రభుత్వ ఎలెక్ట్రిసిటీ బోర్డువారు కృషి సలుపవలెను.
జి. సూ.
గ్రీకుభాషా సాహిత్యములు :
యూరప్ ఖండపు సంస్కృతికి ప్రాచీన గ్రీసుదేశమే పుట్టినిల్లగుటచే, గ్రీకుభాషయు, సాహిత్యమును యూరప్ ఖండమునందలి వివిధదేశముల భాషాసాహిత్యములపై తమప్రభావమును ప్రసరింపజేసి, వాఙ్మయ ప్రపంచమునం దొక విశిష్ట స్థానమును గడించుకొన్నవి.
భాష : గ్రీకుభాష ఇండో - యూరపియన్ భాషా కుటుంబమునకు చెందినది. దానికి కెల్టిక్, ట్యుటానిక్, లాటిన్, సంస్కృత భాషలతో సంబంధము కలదు. గ్రీసు దేశమునందలి వివిధ రాష్ట్రముల నడుమనున్న పర్వతములు పూర్వము దుర్గమములై ప్రజల రాకపోకల కాటంకము కలిగించుటచేతను, గ్రీకు ప్రజలు పరిసర ద్వీపములందు సైతము చెదరియుండుట చేతను, దేశపు నైసర్గిక స్వరూప ప్రభావమున గ్రీకు భాషకు మొదట నొక సునిశ్చిత రూపమేదియులేక పెక్కు మాండలిక భేదము లేర్పడెను. వానిలో ఇయోలిక్, డోరిక్, అయోనిక్, యాటిక్ అను నాలుగు మాండలికములే ప్రధానములు. క్రీ. పూ. 4 వ శతాబ్దమునాటికి గ్రీకు రాష్ట్రము లన్నింటను ఏథెన్సు నగరమునకు రాజకీయముగ ప్రాధాన్యము హెచ్చెను. సాహితీ పరులకుకూడ నది ముఖ్య కేంద్రమయ్యెను. కనుక ఏథెన్సునగరమున ప్రచారమునం నున్న యాటిక్ మాండలిక మే నాటినుండియు సారస్వతోపాసకుల కాదరణీయమై క్రమముగ దేశమంతటను వ్యాపించి గ్రాంథిక భాషకు ప్రాతిపదిక యయ్యెను. అలెగ్జాండర్ దండయాత్రల మూలమున గ్రీకుభాష ఆసియా మైనర్, సిరియా, మెసపొటేమియా, ఈజిప్టు దేశములందు కూడ వ్యాపిం చెను.
ఈభాషకు లిపి తొలుత నెప్పుడేర్పడెనో నిశ్చయముగ తెలియదు. ఫినీషియా దేశస్థుడుగు కాడ్మస్ గ్రీకుభాషకు వర్ణమాల నేర్పరచెనని పూర్వగాథ యొకటి సూచించు చున్నది. గ్రీకు వర్ణములు ఫినీషియన్ వర్ణములనుండి యేర్పడినమాట మాత్రము సత్యమే. గ్రీకు వర్ణమాలయం దిరువదినాలుగక్షరములు కలవు. ప్రాచీన శిలాశాసనములనుండి నాటి గ్రీకులిపి స్వరూపమును తెలిసికొనుటకు వీలగుచున్నది.
నేటి గ్రీకుభాషకూడ ప్రాచీన వర్ణమాల నుపయోగించుచున్నది. కాని భాషాస్వరూపము మాత్రము చాల మారినది. ప్రాచీనభాషలోలేని విదేశీయ పదము లనేకము నేటి గ్రీకుభాషలో ప్రవేశించినవి. శబ్దాచ్చారణము నందును, వ్యాకరణమునందును పెక్కుమార్పులు కలిగినవి. ద్వివచనరూపము అంతరించి, ఏకవచన, బహువచన రూపములే నిలిచినవి. "స్వచ్ఛ" భాషా వాదులు ప్రాచీన