సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మూడవ సంపుటము/గ్రంధి స్రుతములు

గ్రంధిస్రుతములు (హార్మోనులు):

శరీరముయొక్క కొన్ని అవయవములనుండి రక్తప్రవాహములోనికి విడుదల చేయబడు పదార్థములకు గ్రంధిస్రుతములనియు, ఇంగ్లీషులో హార్మోనులనియు పేరు. రక్తప్రవాహముద్వారా ఈ పదార్థములు మరికొన్ని అవయవములకు చేర్చబడి, అచట దేహారోగ్యమునకు సంబంధించిన కొన్ని ప్రత్యేకక్రియలకై పాటుపడును. ఈ విధముగా హార్మోనులవలన శరీరముయొక్క కొన్ని అవయవములు మరికొన్ని అవయవములపై ఒక విధమగు ప్రభావమును కలిగియున్నవి. మనకు తెలిసి యున్న హార్మోనులలో పెక్కులు నిర్వాహికలగు గ్రంధుల (Ductless glands) నుండి జనించుచున్నవని తెలియు చున్నది. ఈ గ్రంధులకు హార్మోనులను ఉత్పత్తిచేయు బాధ్యతతప్ప వేరొకపని యేదియులేదని భావింపవచ్చును. కాని, నిర్వాహికలుకాని గ్రంధులనుండి కూడ కొన్ని హార్మోనులు శరీరములో లభ్యమగుచున్నవి. వృక్యము లేక క్లోమము (pancreas) నుండి జనించు ఇన్స్యులిన్, వీర్యస్థానములనుండి (gonads) ఉద్భవించు లింగాధార హార్మోనులు (Sex hormones) ఇందుకు ఉదాహరణములు : ఒక జంతువు యొక్క శరీరమునుండి ఒక అవ యవము కోసివేయబడినపుడు, అట్టి అవయవజనితమగు పదార్థములు ఆ జంతువునకు అందజేసినచో, ఆ జంతువు తిరిగి తన ఎప్పటి ఆరోగ్యమును పొందగలిగినయెడల, అట్టి పదార్థము హార్మోనుల తరగతికి చెందిన దని చెప్పవచ్చును. ఈ హార్మోనులన్నియు జీవ రాసాయనిక పదార్థములే. కాని, వేరువేరు హార్మోనుల నిర్మాణాకృతిలో అనేకవిధములగు భేదములు కానవచ్చును. పైన తెలుపబడిన జంతు సంబంధమగు హార్మోనులవలెనే, వృక్షజాతి కూడ కొన్ని హార్మోనులను ఉత్పత్తిచేయును. ఉదా : “ఆక్సిన్” అను పదార్థము.

కొన్ని ముఖ్యమగు హార్మోనులు :

I ఎడ్రినల్ గ్రంధి హార్మోనులు : ఎడ్రినల్‌గ్రంధి, అనునది “ మెడ్యుల్లా”, “కార్టెక్సు" అను రెండు భాగములను కలిగియుండును. "మెడ్యుల్లా" నుండి స్రవించు హార్మోనునకు ఎడ్రెనలీన్ అని పేరు 'కార్టెక్సు' నుండి లభించు హార్మోనులకు ఎడ్రెనల్ కార్టెకల్ హార్మోను అని పేరు.

1. ఎడ్రెనలీన్ : ఈ హార్మోనునకు ఎపినెఫ్రిన్, సుప్రా రెనిన్ అనునవి నామాంతరములు. వధింపబడిన జంతువుల ఎడ్రెనల్ గ్రంధులనుండి ఈ హార్మోను తయారు చేయబడుచున్నది. ఈ హార్మోను మూలముగా రక్తపు పోటు, రక్తములోని చక్కెర ప్రమాణము హెచ్చును. అందువలన ఈ హార్మోను, ఇన్స్యులిన్ అను హార్మోనునకు వ్యతిరిక్తముగా పనిచేయును. శరీరమునందలి ఏభాగమైనను తెగినచో ఏర్పడు రక్తస్రావమును అరికట్టునట్టి శక్తి ఈ హార్మోనునకు కలదు. ఈ కారణముచేత ఎడ్రెనలీన్ హార్మోను శస్త్ర చికిత్సలో ఉపయోగపడుచున్నది. శరీరమునందలి సిరల (Veins) లోనికి సూదులద్వారమున హార్మోను ఎక్కించబడును. ఎడ్రెనలీన్ అనునది నత్రజనితో కూడుకొనిన క్షార సంబంధమగు ఒక జీవ రాసాయనిక పదార్థము.

2. ఎడ్రెనల్ కార్టెకల్ హార్మోనులు: ఎడ్రెనల్ గ్రంథి తొలగింపబడినచో, జంతువుల జీవితమును ఎడ్రెనల్ కార్టెక్సునుండి తీయబడిన మందుల ద్వారమున పొడిగింప వచ్చునని 1929 లో కనుగొనబడినది. దీని నాధారముగా గొని స్విట్జర్లాండులో రైచ్‌స్టైన్ అను శాస్త్రజ్ఞుడును, అమెరికాలో కెండాలును, అతని అనుయాయులును, కార్టెక్సులోగల రాసాయనిక పదార్థముల విషయమున తీవ్రమైన పరిశోధనములను సాగించిరి. ఈ పరిశోధనముల ఫలితముగా 29 క్రొత్త జీవరాసాయనిక పదార్థములు కనుగొనబడినవి. వీటిలో 7 మాత్రమే హార్మోనులుగా పనిచేయగల వని తెలియుచున్నది. కార్టెక్సోన్, ఆల్డోస్టెరోన్ అను రెండును ఈ ఏడింటిలో అత్యంత శక్తిమంతమైన హార్మోనులై యున్నవి. ఈ తరగతికి చెందిన హార్మోనులు శరీరమున తక్కువైనచో, రక్తములో నుండవలసిన నీరు, సోడియమ్, పొటాషియమ్ అనువాటియొక్క నిష్పత్తి క్రమము తప్పుటయు, క్రొవ్వుపదార్థములను, పిండిపదార్థములను శరీరము సరిగా ఇముడ్చుకొనలేక పోవుటయు సంభవించును. ఈ హార్మోనులు క్లిష్టతరమైన నిర్మాణాకృతిని కలిగియున్నవి. ఈ విషయమై రైచ్‌స్టైన్, అతని బృందము అత్యంత ముఖ్యమగు పరిశోధనములు చేసియున్నారు.

II. మాంసకృత్తు సంబంధమగు హార్మోనులు : శరీరములోని అనేక హార్మోనులు మాంసకృత్తు మయమగు క్లిష్టమైన నిర్మాణమును కలిగియున్నవి. ఈ క్రింద తెలుపబడిన నాలుగును ఇందు ముఖ్యములు.

1. థైరోగ్లాబ్యులిన్ : ఈ హార్మోను థైరాయిడ్ గ్రంధినుండి జనించును. ఇది శరీరముయొక్క క్రమమైన అభివృద్ధికి తోడ్పడును. చర్మము ఎండిపోవుటయు, బుద్ధి మాంద్యము కలుగుటయు, సంధాయక ధాతువులు (connective tissues) ఉబ్బుటయు ఈ హార్మోను లోపించుటచే కలుగు చిహ్నములు. ఈ హార్మోనును కలిగియున్న నాళములనుండి క్షారముల సహాయముతో థై రాక్సిన్ అను పదార్థమును, కెండాల్ అనునాతడు 1915 లో వేరు చేయ కలిగెను. థైరోగ్లాబ్యులిన్‌లో గల శక్తికి మూలకారణము థై రాక్సిన్ అనునదనికూడ కనుగొనబడినది. థైరోగ్లాబ్యులిన్ ను, థైరాక్సిన్ మాంసకృత్తు సంబంధమగు పదార్థముల క్లిష్టమైన కలయికగా ఎంచవచ్చును. హేరింగ్ టన్ పండితుని కృషివలన థైరాక్సిన్ యొక్క నిర్మాణాకృతి సంపూర్ణముగా తేట తెల్లమయినది. ఈ జీవరాసాయనిక పదార్థమునందు ఐయొడిన్ కూడ ఉండుట గమనింపదగిన విషయము. శరీరమున గల అయొడిన్ అంతయు ఈ విధముగా థైరాయిడ్ గ్రంథి యందే పొందుపరచబడి యున్నది. తిను ఆహారములో అయొడిన్ తగినంతగా లేనియెడల, ఈ హార్మోనుయొక్క ఉత్పత్తి కుంటువడును.

2. పేరాధార్మోను : ఇది పేరాథైరాయిడ్ గ్రంధి యందలి హార్మోను. శరీరపోషణ విషయములో కాల్షియమ్ వహించు పాత్రను కనిపెట్టుచు, సరిచూచుకొనవలసిన బాధ్యత ఇది వహించును. ఇది శరీరమున లోపించినచో నిస్సత్తువయు, రక్తములో కాల్షియము లేమియు కలుగును. పేరాధార్మోను మాంసకృత్తుయొక్క నిర్మాణమును కలిగి యున్నట్లును, నిర్మాణాకృతిలో ఇన్స్యులిన్‌ను పోలి యున్నట్లును తెలియుచున్నది.

3. ఇన్ స్యులిన్: వృక్యమునందలి గ్రంధులనుండి స్రవించు హార్మోనునకు ఇన్స్యులిన్ అనిపేరు. శరీరపోషణమునకై పిండి పదార్థములు వినియోగపడు రీతిని క్రమపరచుటకై ఇది అవసరము. శరీరమున ఇన్‌స్యులిన్ తగ్గుటవలన అతిమూత్రవ్యాధి కలుగును. ఈ వ్యాధిచే పీడితులగువారికి రక్తమున చక్కెర ఎక్కువగుటయు, మూత్రముద్వారా చక్కెర అమితముగా పోవుటయు సంభవించును. వీరికి ఇన్స్యులిన్ ఇంజెక్షను ఇచ్చినచో అది ఈ వ్యాధి నయమగుటకు తోడ్పడును. ఈ హార్మోను నిర్మాణాకృతిని గురించి తెలిసికొనుట కష్టసాధ్యమయిన పని అయ్యెను. ఇన్స్యులిన్ అణుసంపుటి (molecule) భారము సుమారు 48,000 అని తెలియుచున్నది. ఇందు గంధకముతో కూడియున్న మాంసకృత్తు పదార్థములు కలవు. ఈ హార్మోనుయొక్క నిర్మాణాకృతిని గురించి అమూల్యమగు పరిశోధనములు జరిపి, ఈ క్లిష్ట సమస్యను పరిష్కరించినందులకు 1958 లో కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయము నందలి ప్రొఫెసర్ శాంజర్ అను నతనికి రసాయన శాస్త్రమున నోబెల్ బహుమాన మీయబడినది.

4. పిట్యుటరీ హార్మోనులు : పిట్యుటరీ గ్రంధిపై తమ్మె (lobe) నుండి ఒకరకమగు హార్మోనులును, క్రింది తమ్మె నుండి వేరొకరకమగు హార్మోనులును లభ్యమగుచున్నవి. పై తమ్మెనుండి ఉత్పన్నమగు హార్మోనులు శరీరము యొక్క పెరుగుదలకు ముఖ్యమైనవి. ఈ హార్మోనులు మిగిలిన గ్రంధులనుండి జనించు హార్మోనులపైనను, వాటి బాధ్యతలపైనను అజమాయిషీని వహించును. అందుచేత వీటిని అతిముఖ్యమగు హార్మోనులుగా పరిగణింపవచ్చును. ఇవిఅన్నియు మాంసకృత్తు సంబంధమగు పదార్థములే.

క్రిందితమ్మెనుండి జనించు హార్మోనులు శరీరమునందలి ఇతరభాగములందు గాక, అవి జనించినచోటనే వాటి ప్రభావమును చూపును. వీటిలో పిటోకిన్, పిట్రెస్సన్, మెలనోఫోరిక్ అనునవి ముఖ్యములు. మొదటిది మృదువైన కండరములను సంకోచపరచుటకును, రెండవది రక్తపుపోటు వృద్ధిచేయుటకును, మూడవది జంతువులలో రంజకమును, లేక వర్ణకమును, (Pigmentation) సరి చూచుటకును ఉపయోగపడును.

III లింగాధార హార్మోనులు : వృక్యగ్రంధిలోని క్రింది తమ్మెయొక్క ప్రేరణపై వీర్యస్థానములనుండి స్రవించు హార్మోనులకు లింగాధార హార్మోనులని పేరు. లింగాధార ప్రక్రియలను సరిచూచుట, శరీరారోగ్యముయొక్క అభివృద్ధికి తోడ్పడుట ఈహార్మోనుల కర్తవ్యమై యున్నది. పురుషలింగ హార్మోనులలో ఆండ్రోస్టెరోన్, టెస్టోస్టెరోన్ అనునవియు, స్త్రీలింగ హార్మోనులలో ఆయిస్ట్రోనులు, పోజెస్టెరోన్ అనునవియు ముఖ్యములు. వీటిని గూర్చిన కష్టతరమగు పరిశోధనములు జర్మన్ శాస్త్రజ్ఞు లయిన బ్యుటనాంట్, విండాస్, వీలేండ్ అనువారిచేతను స్విస్ శాస్త్రజ్ఞుడయిన రుజీకా వంటి ఉద్దండ పండితుల చేతను సలుపబడినవి. ఈ నలుగురుకూడ నోబెల్ బహుమానమును పరిగ్రహించినవారే. స్త్రీల అండాశయము (Ovary) నుండి ఆయిస్ట్రోనులు, ప్రొజెస్టెరోనులు జనించును. గర్భిణిస్త్రీల మూత్రమునుండియు లేక గుఱ్ఱముల మూత్రము నుండియు ఈ హార్మోనులను అతి స్వల్ప ప్రమాణములో బడయవచ్చును. లింగాంగములు క్రమ ముగ పెరుగుటకును, ఆయిస్ట్రస్ (వేడిమి) రేకెత్తించుటకును ఆయిస్ట్రోనులు అవసరము. గర్భధారణమునకు ప్రోజెస్టెరోన్ అనివార్యమైనది. గర్భకోశము (uterus) నందలి ఆమత్వచము (Mucous Membrane) లో గర్భధారణకు సంబంధించిన కొన్ని ముఖ్యమయిన మార్పులను ఇది కల్పించును. పైగా గర్భము నిలుచుటకుకూడ ఈ హార్మోను సహాయపడును. టెస్టోస్టెరోన్ ముష్కముల (testicles) లో తయా రగును. ఆండ్రోస్టెరోన్ మూత్రమునుండి పొందబడును. కొన్ని లక్షల శేర్ల మూత్రమునుండి కష్టతమమగు మార్గముల ననుసరించి బ్యుటనాంట్ అనునాతడు కొన్ని మిల్లీగ్రాముల ఆండ్రోస్టెరోన్‌ను బడయగల్గెను, ఈ హార్మోనులు లోపించిన, నిర్వీర్యత కలుగును, అట్టివారికి వీటిని సూదిమందుగా అందచేసినచో ఆలోపము తొలగిపోవును. ఈ రెండింటి లోను టెస్టోస్టెరోన్ ఎక్కువ శక్తిమంతమైనది.

లింగాధార హార్మోనులన్నియు స్థూలముగా పరికించినచో ఒకేరకమగు నిర్మాణమును కలిగియున్నట్లు తెలియ గలదు. వీటి నన్నిటిని ఒకే తరగతికి చెందిన వాటిని గావించవచ్చును. ఈ సందర్భములో పైత్యరసామ్లము (Bile acids) కూడ నిర్మాణాకృతిరీత్యా ఈ తరగతికే చెందినదను విషయము గమనింపదగినది. కాని వీటి యొక్క నిర్మాణాకృతి అతిక్లిష్టమైనది. వీటి తత్వము పూర్తిగా విశదమగుటకు రాసాయనిక శాస్త్రజ్ఞులు అనేక సంవత్సరములు నిర్విరామముగా కృషి చేయవలసి వచ్చినది.

సి. వి. ర.


గ్రహణములు :

సూర్యగోశీయ వ్యాసార్ధము 4,32,000 మైళ్ళు; భూమి సూర్యునికి 9,30,00,000 మైళ్ళదూరములోనుండి సూర్యుని చుట్టు పరిభ్రమించుచున్నది. భూగోళీయ వ్యాసార్ధము 4000 మైళ్లు. భూచ్ఛాయ సూచ్యగ్ర రూపముతో (Shadow cone) భూమితోపాటు ఆకాశమున పరిభ్రమించుచుండును. ఈ భూచ్ఛాయను మన ప్రాచీన సిద్ధాంతములందు భూ ఛా అని వ్యవహరించిరి. భూ ఛా యొక్క పొడుగు రమారమి 8,70,000 మైళ్ళుండును. చంద్రుడు భూమిచుట్టు 2,40,000 మైళ్ళలో పరిభ్రమించుటచేత ఒకప్పుడు ఈ భూ ఛా ప్రవిష్టుడగును. అప్పుడు. చంద్రగ్రహణము పట్టినదందుము. చీకటియందున్నవస్తువు దృగ్గోచరముకానట్లు, చంద్రుడు దృగ్గోరము కాడన్న మాట. చీకటియందు దృగ్గోచరము కాని వస్తువు ఎటునుండి చూచినను దృగ్గోచరము కాదు. కావున చంద్ర గ్రహణము ఒక దేశమందే పట్టి మరియొక దేశమునందు పట్టకపోదు. అనగా చంద్రగ్రహణము పట్టినప్పుడు ఏ భూగోళార్ధమున కప్పుడు రాత్రికాలమో ఆ భూగోళార్ధ మందంతట చంద్ర గ్రహణము పట్టునన్నమాట. “తమస్తు రాహుః" అను అమరోక్తి ననుసరించి రాహు వనగా చీకటియనియు, చంద్రుడు చీకటిలో ప్రవేశించెననియు, మన ప్రాచీనులకు గ్రహణోపపత్తి బాగుగా తెలియును. తెలియుటయేకాక వారు గ్రహణకాల గణితమును బాగుగా తెలిసికొనిరి. రాహు కేతువులు. సర్పరూపమున నున్న రాక్షసులనియు, వారు చంద్రసూర్యులను గ్రసింతు రనియు పౌరాణిక గాథలు చెప్పుచున్నవి. కాని అది శాస్త్రపద్ధతి గాదు. గణితశాస్త్ర పద్ధతినే భారతీయ సిద్ధాంతులు పాటించియున్నారు.

సూర్యగ్రహణమనిన సూర్యుడు చీకటిలో ప్రవేశించుట కాదు. తేజోరూపుడయిన సూర్యునికి తమఃప్రవేశము అసంభవము. చంద్రమండలము సూర్యునికిని భూమికిని మధ్యగా ప్రవేశింపగా సూర్యునకును, భూమికిని కన్పడకుండ ఆచ్ఛాదించును. అప్పుడు సూర్యగ్రహణము పట్టిన దందుము. చంద్రుడు మనకు దగ్గరగానున్న ఒక చిన్న గోళము. చిన్న గోళమైనను దగ్గరగా నుండుటచేత పెద్ద గోళమగు సూర్యుని కప్పివేయ గలుగును. దాని కుదాహరణ మేమన, ఒక చిన్న మేఘము సూర్యుని ఆచ్ఛాదించినట్లే. కాని సూర్యగ్రహణమునం దున్న విశేష మేమనగా, ఏ ప్రకారముగా ఒక ప్రదేశమునందు సూర్యుడు మేఘచ్ఛన్నుడై కన్పట్టకపోయినను, మరియొక ప్రదేశమునందు కన్పట్టునో, అట్లే ఒక ప్రదేశమందు సూర్యుడు చంద్రబింబచ్ఛన్నుడై కన్పట్టకపోయినను, మరియొక ప్రదేశమునందు కన్పట్టును. అందుచేతనే సూర్యగ్రహణము అన్ని ప్రదేశము లందును పట్టదు. ముందు చూపబోవు గణితము ప్రకారము ఒక సంవత్సరమందు పట్టు చంద్రగ్రహణముల సంఖ్యకంటె, సూర్యగ్రహణముల