సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మూడవ సంపుటము/గౌతముడు (ధర్మసూత్ర ప్రణేత)

గౌతముడు (ధర్మసూత్రప్రణేత) :

ప్రాచీన భారతచరిత్రమును నిర్మించుటకు మన చరిత్రకారుల కుపయోగించిన సాధనములలో శ్రుతి - స్మృతి - సూత్ర - ఇతిహాస - పురాణములు ముఖ్యములు. అందు 'సూత్ర' వాఙ్మయమునకును మంచిస్థాన మున్నది మన ఆర్యుల ధర్మశాస్త్రగ్రంథములలోని కెల్లను సూత్రగ్రంథములు మిక్కిలి పురాతనములయినట్లు విజ్ఞుల అభిప్రాయము. 'సూచనాత్సూత్రమిత్యాహుః' అన్నట్లు, సూత్ర గ్రంథములలో వేదత్రయవిజ్ఞానమును, త్రివర్గమును గూర్చిన పరిజ్ఞానమును పూర్ణ - లుప్త వాక్య విశేషములలో నిక్షిప్తమై యున్నది. అవి శ్రౌత-గృహ్య-ధర్మసూత్రములని వివిధరూపముల కానబడుచున్నవి. మనకిప్పుడు ప్రసక్తమైనవి 'గౌతమధర్మసూత్రములు'. వానికి కర్త గౌతమ మహర్షి ·

భారతీయవాఙ్మయమున గౌతమమహర్షులు పెక్కురు కానవచ్చుచున్నారు. ఇతిహాసములలో అహల్యాపతి గౌతముడును, శాస్త్రకర్తలలో న్యాయశాస్త్రప్రణేతయగు గౌతముడును-ఈతడు 'గోతముడు' అను శీర్షికక్రింద వర్ణితమయినాడు – సూత్రకర్తలలో ప్రకృతము మన గౌతముడును ముఖ్యులుగా కన్పింతురు. ఈ గౌతమ మహర్షినిగూర్చి తెలియవచ్చిన చరిత్రాంశములు చాల తక్కువయని చెప్పవలయును. ఇతిహాసములకంటె శాస్త్రములును, వానికంటెసూత్రములును ప్రాచీనతరములగుటచేత, ఇతర గౌతములకంటె సూత్రకర్తయగు గౌతముడు మిక్కిలి ప్రాచీను డని చెప్పవచ్చును. ఆ సూత్రవాఙ్మయమునను ఆపస్తంబుడు, బోధాయనుడు, కాత్యాయనుడు, మున్నగువారి సూత్రగ్రంథములకంటె చారిత్రకదృష్టిచేతను, పారంపర్యదృష్టిచేతను, ఈ ధర్మ సూత్రములే పురాతనములగుటచేత, వాని నిర్మాతయగు గౌతముడే ఆపస్తంబాదులకంటె పూర్వుడని చెప్పనగును.

ఆపస్తంబుడు క్రీ. పూ. 800-600 మధ్యనున్నట్లు చరిత్రకారులు నిర్ణయించినందున ఈ గౌతముడు క్రీ. పూ. 800 కు ముందున్నవాడనియో లేక ఆ ప్రాంతమువాడనియో భావింపవచ్చును. ఇతడు సుమారు మూడువేల సంవత్సరములక్రింద నున్న వాడనుటలో ఎట్టి విప్రతి పత్తియు నుండదు. యజుర్వేదులు కాపస్తంబసూత్రము అనుసరణీయములైనట్లుగా ఛాందోగ్యులకు (సామవేదులకు) గౌతమధర్మసూత్రములు అనుసరణీయములై నట్లు పెద్దలవలన వినికి. దానినిబట్టి మన గౌతముడు సామవేద శాఖకు చెందినవాడై యుండునని విద్వాంసుల అభిప్రాయము. ఈ ధర్మసూత్రములను రచించిన శక్తి సామర్థ్యములనుబట్టి గౌతమమహర్షి శ్రుతిస్మృత్యాది పరిశీలనముచే ధర్మనిర్ణయముచేయు నధికారముగల ప్రజ్ఞాశాలి యని యేర్పడుచున్నది.

గౌతమధర్మసూత్రములు 'ధర్మసూత్రము' లనబడుటచేత అవి ధర్మములను వివరించు వాక్యగ్రంథమని తెలియ గలదు. 'ధర్మ' మనగా 'ధరతిలో కానితి ధర్మః - ధ్రయతే పుణ్యపురుషై రితి ధర్మః' అని వివిధముగా వ్యుత్పత్తి చెప్పబడి యున్నది. సాధారణముగా సుఖప్రవృత్తిని దుఃఖ నివృత్తిని గోరు జీవులకు సత్కర్మలవల్ల సుఖమును దుష్కర్మలవల్ల దుఃఖమును గల్గుచున్న దని భారతీయుల సిద్ధాంతము. సత్కర్మ - దుష్కర్మల పరిజ్ఞానము ధర్మా ధర్మ వివేకముచే గల్గును. ధర్మము తెలిసినయెడల తద్భిన్నముగా అధర్మము తెలియబడవచ్చును. కావున ధర్మ ప్రబోధమునకై మన దేశమున ధర్మశాస్త్రములు, ధర్మసూత్రములు రచింపబడినవి. వానిలో గౌతమధర్మ సూత్రములు ప్రముఖస్థానమునుపొంది యున్నవి. ఈగ్రంథమును గూర్చి పాశ్చాత్యపండితులగు బూలర్ మొదలగు వారు విమర్శించి వ్రాసియున్నారు.

ఈ ధర్మసూత్ర గ్రంథము సామవేదమునకు సంబంధించిన యొకానొక గౌతమచరణమునకు సంబంధించినదిగా భావింపబడుచున్నది. అందులకు 'గౌతమ' మను పేరుతో సామవేదశాఖయొకటి యుండెడిదను సంప్రదాయము బలమొసగు చున్నది. సామవేదమునందలి వంశ బ్రాహ్మణమున సామవేదాచార్యులుగా నల్గురు గౌతమాన్వయులు కానవచ్చుచున్నారు. (1) గాతృగౌతములు, (2) సుమంత్రబాభ్రవ గౌతములు, (3) శంకరగౌతములు, (4) రాధాగౌతములు - అని. ఇప్పటి శ్రౌత - గృహ్య సూత్రములలో గౌతముని-స్థవిర గౌతముని-అభిప్రాయములుగూడ తెల్పబడినవి. అనగా ఒకప్పుడు గౌతమ శ్రౌత గృహ్యసూత్రములుగూడ వాడుకలో నుండెనని యూహింపబడు చున్నది. గౌతముడు కృచ్ఛ్రాదులను దెలుపు 26 వ అధ్యాయమును సామవేద సంబంధియగు 8 వ బ్రాహ్మణములో ఒక సామవిధానమునుండి గ్రహించుటయు, సామవేదానుసారముగ 5 వ్యాహృతులకు చెందునట్లు సూత్రములు రచింపబడుటయునుబట్టి మన గౌతముడు సామవేదియే యని చెప్పవచ్చును. మరియు ఆపస్తంబాది సూత్రములకు పూర్వపువి అగు బోధాయన వాసిష్ఠ సూత్రములలో గౌతముడు ప్రామాణికుడుగా గ్రహింపబడుటను బట్టియు, గౌతమ ధర్మమునుండి దోధాయనాదులు ఒక యధ్యాయమునే పూర్తిగ తమ సూత్రములలోనికి స్వీకరించుటనుబట్టియు, ఈ సూత్ర గ్రంథమే అన్నిటికంటె పురాతనమైనదని ఏర్పడుచున్నది. కాని కొందరు ఆధునికులు మన కనుపలబ్ధమైన మను ధర్మసూత్రము లుండెడి వనియు - అందుచే నవి గౌతమ ధర్మసూత్రములకంటె ప్రాచీనతరమైన వనియు చెప్పెదరు గాని ఆ గౌతమునికే యిష్టమైనట్లు 21.7 సూత్రమున నతడు మనువుయొక్క అభిప్రాయము నుదాహరించుట చేత తెలియుచున్నది. అయినను, ఆ సూత్రము లనుపలబ్ధములగుటచే, లభ్యమైన సూత్రవాఙ్మయమున ఈ గ్రంథ మే ప్రప్రథమ మయినట్లు భావింపదగును.

గౌతమ ధర్మసూత్రములలో 3 ప్రశ్నములలో 28 అధ్యాయములును, 1005 సూత్రములును, 1360కి పైగా విషయములును గలవు. వాని వివరము లిట్లున్నవి :

ప్ర. అ. సూ. విషయము
1. 9 380 500
2. 9 376 520
3. 10 249 340

మన గౌతమ ధర్మసూత్రములు 'వేదోధర్మమూల'మ్మని ప్రారంభించి, 'ధర్మిణాం విశేషేణ స్వర్గం లోకం ధర్మ విదాప్నోతి జ్ఞానాభినివేశాభ్యామితి ధర్మోధర్మః' అని ముగింపును పొందుచున్నవి. సర్వధర్మములకును వేదమే మూలమని ప్రతిపాదించి, అట్టి ధర్మమును గ్రుడ్డిగా నాచరించు వారికంటె తదర్ధాశయములను తెలిసికొని శ్రద్ధతో అనుష్ఠించువారే శ్రేష్ఠులని చెప్పి ఉపసంహరింపబడినది. అనగా అట్టి ఉపక్రమోపసంహారములచేత ఇట్టి ధర్మ సూత్రముల తత్త్వమును బాగుగా తెలిసికొని ఆచరింప వలయునని భావము.

ఇందు ప్రతిపాద్యమైన ధర్మము వేదనిష్ఠమగుటచేతను, వేదాధ్యయనమే ధర్మజ్ఞానమునకు మూలాధారమగుట చేతను వేదాధ్యయన రూపమైన 'విద్యావిధాన, ప్రశంసతో ఈ గ్రంథము ప్రారంభించును. చాతుర్వర్ణ్వ విశిష్టమైన ఆర్యసంఘములో త్త్రెవర్ణికులకు - బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులనబడు ద్విజాతులకు - వేదాధ్యయనము విధింప బడినది. అది ఉపనయన మూలకమగుటచే, ప్రప్రథమమున ఉపనయన ప్రశంస గావింపబడి 'ఉపనయనం బ్రాహ్మణ స్యాష్టమే (1-6 సూ)' అని విధింపబడినది. 'ఉపనయన కాలచర్చయు, బ్రహ్మచారికి తగిన వస్త్రాది విధానమును, ఆ సందర్భముననే వస్తుశుద్ధియు, శౌచప్రక్రియయు బోధింపబడినది. తరువాత బ్రహ్మచారి గురూపసదనము, పాదోపసంగ్రహాదులు చేయు విధానములు నిర్దేశింపబడినవి. నాటి విద్యావిధానమును నేటి విద్యావిధానముతో పోల్చి చూచినయెడల, ఎంతయో వ్యత్యాసము గోచరింపగలదు. విద్యార్థులు ధర్మాచరణము ప్రధానముగా విద్య నభ్యసింపవలయునను ముఖ్యసూత్రములపై నాటి విద్యాపద్దతి నిలువద్రొక్కుకొని యున్నదని చెప్పదగును. నాటి బ్రహ్మచారులు ద్వివిధముగా నున్నారు. కొంతకాలము విద్యార్జనచేసి పిదప గృహస్థులై వ్యవహరించు వారును, యావజ్జీవము బ్రహ్మచర్య పూర్వకముగా విద్యార్జనము చేయుచునుండువారు అని.

గురుకులవాసము చేసి ముగించిన పిమ్మట గృహస్థు కాగోరువారు ఆచరింపదగు ధర్మములు తరువాత వివరింపబడి యున్నవి. “విద్యాంతే గురురర్దేననిమంత్ర్యః (1-26-54 సూ.)" అని గురుదక్షిణ యొసగి ఐకాశ్రమ్యం త్వాచార్యాః (1-3-35) అని గృహస్థాశ్రమపు ప్రాధాన్యము వివక్షింపబడి, తదుపరి తదాశ్రమ ధర్మములు ప్రవంచింపబడి యున్నవి. అందు వివిధ వివాహ స్వరూపములును, అనులోమాది భేదములును, గృహస్థుని కామచర్యా నియమములును, అతిథి పూజాదికమును, అర్థార్జన రూపమగు యోగక్షేమ విధానమును విశదీకరింప బడినవి. వానినిబట్టి గుణశీలాదుల యందలి పక్షపాతమును, ధర్మాచరణమునం దభినివేశమును, సంఘమును ఏక ముఖముగా నడపించుకొని పోవుట మున్నగునవి తత్సంస్కృతి లక్షణములని చెప్పవచ్చును. బ్రహ్మచర్య ధర్మదశలో గురుకులవాస ముపదేశింపబడినట్లు గృహస్థునికి అంత ప్రయోజన మతముగా 'వృద్ధోపసేవనము' ప్రబోధింపబడినది ! ప్ర-6 అధ్యాయమున ఈ విషయమునకు సంబంధించిన చర్చలు చాల గలవు.

పిమ్మట 'ఆపత్కల్పము' ఆరంభ మగుచున్నది. అందు కేవలము విద్యావృత్తిచే లోకముల కాశ్రితుడగు బ్రాహ్మణుడు ఆపత్సమయమున క్షత్రియ - వైశ్య వృత్తులనుగూడ అవలంబించు అవకాశము గల్పింపబడి, ఎంతయో ఔదార్యము కన్పఱుపబడినది. ఇట్టి అపద్ధర్మములు సార్వత్రికములు గాకున్నను, తాత్కాలికముగా సంఘర్షణ కెంతయు నుపకరింపజాలినవై యుండును. అయినను త్రైవర్ణికులగు గృహస్థులకు విధించిన భోజన నియమములుగాని, వారి ఆచార వ్యవహారములు విధి నిషేధములుగాని పరస్పర మర్యాదలు, సంభాషణలు, ప్రయాణములు, ఇతర గృహస్థ జీవితాంశములు మున్నగువానిని గూర్చిన విషయములుగాని, ఆనాటి సంస్కృతిశిక్షణ - వినీతులను, పరలోక శ్రద్దను, సంఘపు యోగ క్షేమాభినివేశనమును, ధర్మదీక్షను, మోక్షదృష్టిపై నిలువరింపబడిన జీవిత స్వరూపమును ప్రతిబింబించుచున్నవి !

ఈ సందర్భముననే బ్రాహ్మణాదులగు నాల్గు వర్ణముల సామాన్య ధర్మవిచారమును గావించి, అందు బ్రాహ్మణుని విశిష్ట ధర్మములును అతని విద్యావృత్తి మూలకమైన ధర్మ ప్రవర్తకత్వమును ఉద్ఘాటింపబడినది. పిదప, క్షత్రియ ధర్మవిచార మను పేరిట రాజధర్మము - రాజనీతి విపులముగా ప్రస్తావింపబడినది. అర్థశాస్త్రము రాజధర్మమున కాధార మనియు, వర్ణాశ్రమ రక్షణ యతని కర్తవ్య మనియు, స్వధర్మచ్యుతులు పునఃస్థాపింప దగినవారనియు, దేశ - జాతి-కుల ధర్మాలు గూడ తత్తత్సానోచితముగా పరిగణింపవలసినవే యనియు తెల్పి దండవిధానము సాధింపబడినది. చతుర్వర్ణముల వారికిని పరస్పరాక్రోశనకు దండ పద్ధతి, పశుపీడనము, వృద్ధిపీడనము, చోరాదులు, ఉద్యానవనాది పీడనము (2-3 అ.) మొ. వాని విషయమున దండవిధానములు విపులీకరింప బడినవి. దండవిధానమునకు పూర్వము న్యాయవిచారణ మవసరము గనుక 2-4 అధ్యాయమున అది విస్తరింపబడినది. సాక్ష్యము సేకరింపవలసిన విధానము, శూద్రులకు సాక్ష్యార్హత, సాక్ష్యము చెప్పవలసిన రీతులు, సాక్షుల నడుగవలసిన రీతులు, సాక్ష్యానర్హులు, అనృత సాక్ష్యముచే వచ్చు పాపములు మొ. నంశములు చక్కగా విచారింపబడినవి. నిజముగా ఈ సందర్భపు వ్యవహారకాండ నేటికిని అవలంబనీయమే అని అనిపించును.

ఆ తర్వాత ఆశౌచ ప్రకరణము (2-5 అ.), శ్రాద్ధ ప్రకరణము (2–6 అ.) అందు భక్ష్యాభక్ష్యవస్తు విచారము (2.8 అ.) లును నిబంధింపబడినవి. వాని పరిశీలనచే ఆనాటి శాస్త్రజ్ఞు లపార లౌకిక దృష్టి శ్రద్ధలును, ఆ దృష్టిని శ్రాద్ధాదుల ఆచరణము ద్వారా పోషించుటయు, అందుపయోగ్యము లగు వస్తువివేకమును మనకు దెలియ బడుటయేగాక, గౌతమాది మహర్షులయొక్క లౌకిక ప్రజ్ఞతోబాటు పారలౌకిక ప్రజ్ఞయు మనకు మహోన్నతముగా గోచరింపగలదు. రెండవప్రశ్నము 'అస్వతంత్రా ధర్మే స్త్రీ (2-9 అధ్యా)' అని స్త్రీధర్మ విచారముతో ముగియును. ధర్మవిషయమున స్త్రీ భర్త ననుసరింపదగునని దానికర్థము. స్త్రీ ధర్మవిచారమును, ఆమెకు వలసిన వాగాది నియమములు, సంతానార్థమై ఆమె అనుసరింప దగు విధులు, భర్త దేశాంతరగతుడై జాడ తెలియనప్పుడు చేయవలసిన పద్ధతులు, కన్యల స్వయంవరణపద్ధతి మొ. అంశము లిందు చర్చింపబడి స్త్రీధర్మము నిరూపింప బడినది. ఇందు స్మృతులు, అనుశాసనములు సమన్వితము లైనవనవచ్చును.

మూడవప్రశ్నము ప్రాయశ్చిత్త విచారముతో ప్రారంభించును. విహిత కర్మత్యాగముచేతను, నిషిద్ధ కర్మాచరణము చేతను, మానవుడు పాపలిప్తుడగును గనుక, తన్నివృత్తి ప్రాయశ్చిత్తాదులచే కల్గునని సిద్ధాంతము. ప్రాయశ్చిత్త మవసరమా, కాదా యన్న మీమాంస చేయబడి, ప్రాయశ్చిత్త సాధనములో ఉపనిషత్తులు మొ. వాని పారాయణము, మేధ్యవ్రతములు, పయోవ్ర తత్వాదులు, బ్రహ్మచర్యాది తపములు, దానధర్మములు, కృచ్ఛాతికృచ్ఛా చాంద్రాయణాదులు మొ. నవి కూర్పబడి యున్నవి. మూడవప్రశ్నపు టంతిమాధ్యాయమున దాయభాగ విచారణము చక్కగా గావింపబడినది. అందు దాయవిభాగమే ధర్మవృద్ధి కారణమని సిద్ధాంతీకరింప బడినది. పుత్రసంతానము కేవల పుత్రికా సంతానము గలవారి విషయమున దాయభాగ నిర్ణయము గావింపబడినది. అట్లే స్త్రీధనము స్త్రీధనమునకు దాయభాక్కులు మొ. అంశములును, బ్రాహ్మణుని దాయము అసవర్ణా పుత్రుల విషయమున పంచబడు రీతులును, విపులముగా విచారింపబడినవి. మరియు జడక్లీబాదుల విషయమున గమనింపదగిన విధులు, ప్రతిలోమ సుతుల దాయభాగక్రమము, విభాగసందర్భమున సందేహాదులు కల్గినప్పు డనుసరింపవలసిన విధానము మొదలగునవి యెంతో హృదయంగమముగా నిర్దేశింపబడినవి. ఇట్టి ప్రశ్న త్రయాత్మకమైన ధర్మసూత్రగ్రంథ పరిశీలనచే చారిత్రకముగా నాటి ఆర్యసంఘపు ధార్మికపుమర్యాదలు, తత్సంస్కృతి విశేషములును మనకు విశదముగా తెలియగలవు!

విశేష మేమనగా శ్రుతిమంత్ర గర్భితములగు ధర్మ విషయములు స్మృతులలో శ్లోకరూపమునుధరించి వ్యాప్తిలోనికి వచ్చి, సులభగ్రాహ్యములైనవి. కాని అందలి గహనవిషయములు సులభముగా జ్ఞప్తియం దుంచుకొనుటకు వీలుగా తత్సూచనాత్మకములైన సూత్రము లావశ్యకములైనట్లు గుర్తించి - మనకు తెలిసినంతవరకు - ప్రథమతః గౌతమమహర్షి ఈ ధర్మసూత్రములు నిర్మించి తద ధ్యేతల కెంతయు నుపకారము గావించియున్నాడు! ఈ గ్రంథముద్వారా గౌతముడు తనకు పరిపూర్ణముగా గల వైదికవిజ్ఞానమును, లౌకిక పరిజ్ఞానమును, నాటి ధర్మజ్ఞుల ధర్మవిధాన సమన్వయశక్తిని సమగ్రముగా ప్రదర్శించి యున్నాడు. అట్టి గౌతమునికి భారతదేశ మెంతయు ఋణపడి యున్నదనవచ్చును.

బి. వేం. శే


గ్రంథాలయశాస్త్రము :

శాస్త్ర మనెడి పదము ప్రథమమున భౌతికధర్మములను గూర్చిన విజ్ఞానమునకు ఉపయోగించుచు వచ్చిరి. కొంతకాలమునకు జీవజాలమును గూర్చిన విజ్ఞానమును కూడ దీనిలో చేర్చిరి. నేడీ పదము చాల విశాలమై జీవితమునకు సంబంధియైన సర్వ విషయములను తనయం దిముడ్చుకొనుచున్నది. ఈ విధముగా గ్రంథాలయ విషయముకూడ నేడు శాస్త్రముగా పరిగణింపబడుచున్నది.

గ్రంథాలయ శాస్త్రము అమెరికా, బ్రిటన్ మున్నగు పాశ్చాత్యదేశములలో బాగుగా వ్యాప్తిలోనికి వచ్చినది. చాలకాలమునుండి ఆ దేశములలో దాని బోధనలకై ప్రత్యేకము పాఠశాల లేర్పడి పనిచేయుచున్నవి. అక్కడ గ్రంథాలయ శాస్త్రములో పట్టభద్రులు తయారగు చున్నారు. అమెరికా సంయుక్తరాష్ట్రములలో పదేండ్ల క్రిందనే దాదాపు 50 మంది యువకులు గ్రంథాలయ శాస్త్రములో పండితపట్టము (డాక్టరేట్ డిగ్రీ) లను కూడ సంపాదించియున్నారు. అచ్చట వెలువడిన గ్రంథాలయ వాఙ్మయపు విలువ దరిదాపు రు. 20,000 లు ఉండవచ్చునని విజ్ఞులైనవారి అంచనాయై యున్నది. దీనికి సంబంధించిన పుస్తకములతోపాటు పత్రములుకూడ అమెరికాలో అధికముగా వెలువడుచున్నవి.

బ్రిటనులోకూడ గ్రంథాలయశాస్త్ర బోధనమునకు చక్కని యేర్పాటు లున్నవి. లండన్ యూనివర్సిటీవంటి వివిధ విశ్వవిద్యాలయములతోబాటు, బ్రిటిష్ లైబ్రరీ అసోసియేషన్ వారు కూడ గ్రంథాలయశాస్త్రములో పరీక్షల నేర్పాటుచేసి, వీనిలో నెగ్గినవారికి పట్టములను ప్రసాదించుచున్నారు.

మన దేశములో కొన్ని విశ్వవిద్యాలయములును, గ్రంథాలయ సంఘములును ఈ విషయములో కొంత కృషి చేయుచున్నవి. ఢిల్లీ విశ్వవిద్యాలయమువారు గ్రంథాలయ శాస్త్రమునందు డిగ్రీకోర్సునుకూడ ఏర్పాటుచేసి నడుపుచున్నారు. మదరాసు విశ్వవిద్యాలయములో నీ విషయమున ఆచార్యపీఠము నెలకొల్పెడి విషయమై డాక్టరు యస్. ఆర్. రంగనాథన్‌గారు లక్ష రూపాయలు విరాళ మిచ్చియున్నారు.

గ్రంథాలయ నిర్వాహకులు తమ విధి నిర్వహణములో అవలంబించెడి విధానములు, దీనికై వలయు విజ్ఞానము, ఈ కార్యక్రమమునందు వారి పాత్రయు,