సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మూడవ సంపుటము/గౌతమీ గ్రంథాలయము

గౌతమీ గ్రంథాలయము :

గ్రంథాలయములన నెట్టివో జనసామాన్య మెరుగని కాలమది. 1898 వ సంవత్సరమున రాజమహేంద్రవరమున శ్రీ నాళము కృష్ణారావు అను ఒక సంపన్న యువకునకు గ్రంథాలయ స్థాపనోద్దేశము కలిగినది. అతడు కొన్నివందల పుస్తకములతో ఆతని కుటుంబమువారిచే కట్టింపబడిన “నాళమువారిసత్రము”న ఒక గ్రంథాలయమును నెలకొల్పెను. ఆతడును ఆతని ఈడువారును దాని అభివృద్ధికై కృషిచేయదొడగిరి. అప్పటికి దానికెట్టి పేరు పెట్టబడి యుండలేదు. తరువాత కొన్ని నెలలకు దానిని మరియొక ఇంటికి మార్చిరి. శ్రీ కృష్ణారావునకు అప్పటికి ఇరువదియేండ్ల వయస్సు. అతడు శ్రీ కందుకూరి వీరేశలింగము పంతులుగారికి ముఖ్యులయిన అనుచరులలో ఒకడు. పంతులుగారి ఎడల గల గౌరవము కారణముగా ఆ గ్రంథాలయమునకు 'శ్రీ వీరేశలింగ పుస్తక భాండాగారము' అని పేరు పెట్టబడెను. కొంతకాలమునకు ఆ గ్రంథాలయము శ్రీ పంతులుగారిచే స్థాపింపబడిన పురమందిరములోనికి మార్చబడినది. తరువాత 1914 వ సంవత్సరము నుండి గ్రంథాలయము “సర్వజన పుస్తక భాండాగారము" అనుపేరున వ్యవహరింపబడదొడగెను. అది పిదప పురమందిరమునుండి వేరొక ఇంటికి మార్చ బడెను. అప్పటికే మిక్కిలి ఉపయోగకారిగ నున్న ఆ పుస్తక భాండాగారము విద్యాధికులయిన యువకుల నాకర్షించినది. తదాదిగ యువకుల కృషివలన అది మిక్కిలి అభివృద్ధి నొంది తెలుగునాట ఉత్తమ గ్రంథాలయముగా పేరుగొన్నది.

అప్పటికే, ఆ భవనమునందే 'శ్రీ సూక్తిసుధానిధి వడ్డాది సుబ్బారాయకవి ' గారిపేర “వసురాయగ్రంథాలయము" అనుపేరుతో శ్రీ అద్దంకి సత్యనారాయణశర్మ గారిచే 1911 వ సంవత్సరమున స్థాపింపబడి వేరొక గ్రంథాలయము నడుపబడుచుండెను. ఈ రెండు గ్రంథాలయములకు పాలకవర్గమునకు సభ్యులు ఎక్కువమంది ఒక్క రే అయియుండుట వలన వారందరు, ఆ రెండుగ్రంథాలయములను కలిపి యొక పెద్దగ్రంథాలయ మొనర్చినచో, అది తప్పక ప్రజాదరమును ప్రభుత్వాదరమును పొందగలదని తలచిరి. ఆ రెండింటిని సమ్మేళన మొనర్చిరి. దానికి 'గౌతమీ గ్రంథాలయము' అను నామకరణ మిడి 1920వ సంవత్సరములో రెజిస్టరు చేసిరి.

అంతట ఆ గ్రంథాలయమున కొక నూతన గృహ నిర్మాణముచేయు తలంపు కార్యనిర్వాహకులకు కలిగెను. కొంతకాలమునకు వారి యత్నము సఫలమయ్యెను. వారు 1923 వ సం. రమున పట్టణమునకు మధ్యభాగమున నున్న ఒక విశాలభవనమును సంపాదించిరి. దాని యందు ఆ గ్రంథాలయము అభివృద్ధి చెందుచు వచ్చెను. ఇట్లుండ ఆ పట్టణముననే మరియొక దిక్కున శ్రీ కొక్కొండ వేంకటరత్నకవిగారిపేర కొందరిచే ఒక గ్రంథాలయము నడుపబడుచుండెను. గౌతమీగ్రంథాలయములో నొక కార్యకర్తయగు శ్రీ బోడపాటి సత్యనారాయణగారి కృషివలన ఈ 'రత్నకవి' గ్రంథాలయము ఈ గౌతమీ గ్రంథాలయమున విలీనము గావింపబడెను. ప్రజలవలనను, ప్రభుత్వమువలనను, సహాయసంపత్తి నొందుచు ఇది దిన దినాభివృద్ధి నొందసాగెను.

ఈ గౌతమీ గ్రంథాలయమున ప్రస్తుతము లిఖితతాళపత్ర గ్రంథములును, తదితరములయిన వ్రాతప్రతులును, సంస్కృతము, ఆంధ్రము, ఆంగ్లము, హిందీ, ఓడ్రము, కన్నడము, అరవము, అను భాషలలో ముద్రితములయిన గ్రంథములును కలిసి ఇప్పటికి సుమారు 50,000 గ్రంథము లున్నవి. ఇందు చరిత్రకు సంబంధించిన పుస్తకములు చాల కలవు. ఋగ్వేదమునకు తెలుగుపద్యరచనము (అముద్రితము) కలదు. కైఫీయతులును గలవు. ఇది పరిశోధన గ్రంథాలయముగ విశ్వవిద్యాలయములచే గుర్తింపబడినది.

ఇందలి గ్రంథము లిట్లు విభజింపబడినవి : (1) ఆర్ష గ్రంథములు - శ్రుతులు, ఉపనిషత్తులు, స్మృతులు, ధర్మ శాస్త్రములు, పురాణములు, ఇతిహాసములు, మాహాత్మ్యములు, వ్రతములు, స్తోత్రములు, మతము, వేదాంతము, కులపురాణములు, వంశచరిత్రలు.

(2) పద్యములు - పద్యకావ్యములు (ప్రాచీనములు, ఆధునిక ములు), నీతిపద్యములు, శతకములు, దండకములు, అవధానములు, చాటువులు.

(3) నాటకములు, ప్రహసనములు;

(4) నవలలు.

(5) గద్యము : వచన కావ్యములు, కథలు, వినోదములు; పౌరాణిక కథలు ;

(8) చరిత్రము : దేశ చరిత్రములు, జీవిత చరిత్రములు,

(7) ఉపన్యాసములు (నై తిక సాంఘిక ములు) ;

(8) శాస్త్రములు : ఆర్థిక, పారిశ్రామిక, కృషి, గాన, భరతశాస్త్రములు, జ్యోతిశ్శాస్త్రము, న్యాయశాస్త్రము, పాకశాస్త్రము, ప్రకృతి శాస్త్రము, జీవశాస్త్రము, భూగోళశాస్త్రము, రాజ్యాంగశాస్త్రము, సివిక్సు, వాస్తుశాస్త్రము, వైద్యశాస్త్రము, శరీర - ఆరోగ్య శాస్త్రము, వివిధ శాస్త్రములు.

(9) భాషా గ్రంథములు: నిఘంటువులు, లోకోక్తులు, వ్యాకరణము, అలంకారము, లక్షణ గ్రంథములు, విమర్శనములు, కవుల చరిత్రలు.

10. పదములు, కీర్తనలు, హరికథలు, యక్షగానములు, పదములు, పాటలు.

11. వాచకములు.

12. వార్షికచర్యలు, నిబంధనలు, పట్టికలు.

13. పత్రికలు.

14. సంస్కృతగ్రంథములు, కావ్యములు, నాటకములు, లక్షణగ్రంథములు.

15. హిందీ గ్రంథములు. 16. కన్నడగ్రంథములు.

17. ఓఢ్రగ్రంథములు.

18. సంపుటములు.

19. తాళపత్ర గ్రంథములు, తెలుగు, సంస్కృతము వ్రాతప్రతులు కలవు.

ఇంతేకాక ఇండియాకును, ప్రపంచమునకును సంబంధించిన చరిత్రకును, సారస్వతమునకును, వివిధశాఖలకును చెందిన ఆంగ్ల గ్రంథములును, పత్రికలును ఈ గ్రంథాలయమున గలవు.

ఇట్లు వివిధ అమూల్యగ్రంథములు గల ఈ గ్రంథాలయము నేడు సాహితీపరుల దృష్టిని విశేషముగ ఆకర్షించి యున్నది. ముందుతరములవారికి గూడ ఉపయోగకారిగ నుండగలదు. ఈ గ్రంథాలయమునకు విశాలమైన ఆవరణము గలదు. ఇందు గ్రంథాలయ ముఖ్య కార్యకర్తలలో నొకరగు శ్రీకంచుమర్తి వేంకట సీతారామచంద్రరావు గారు తమ కూతురి స్మారకచిహ్నముగ 'శ్రీ కంచుమర్తి బాబాయమ్మ మెమోరియల్ హాలు' అను పేరున పెద్ద హాలుగల మేడను నిర్మింపించి ఇచ్చియున్నారు. ఈ హాలు సాహిత్యసభలు, సమా వేశములు, సంగీత కచ్చేరీలు, హరికథలు, భరతనాట్యములు మొదలగు ప్రజాహిత కార్యక్రమములకు మిక్కిలి ఉపయోగపడుచున్నది.

బో. శి.


గౌతమీపుత్త్రశాతకర్ణి :

దాదాపు నాల్గున్నర శతాబ్దముల కాలము దక్షిణా పథమునందు ఏకచ్ఛత్రాధిపత్యము నెరపి, ఆంధ్రులకు గర్వకారణమై యొప్పిన వంశము శాతవాహన వంశము. ఇట్టి మహావంశమునందు ఉద్భవించిన విజేతలలో, మేధావులలో, గౌతమీపుత్ర శాతకర్ణి మిక్కిలి కొనియాడ దగినవాడు. ఇతడు చిరస్మరణీయమైన గౌతమీబాలశ్రీ కుమారుడు. శివస్వాతి మహారాజు ఈతని తండ్రియని కొందరు తెల్పుచున్నారు. కాని ఈ యంశము వివాదాస్పదము. శివస్వాతి తరువాత ఆంధ్ర సామ్రాజ్యలక్ష్మిని వరించి పట్టము కట్టుకొనిన మహావీరుడు గౌతమీపుత్త్రశాతకర్ణి.

గౌతమీపుత్త్ర శాతకర్ణికి పూర్వము శాతవాహన సామ్రాజ్య పరిస్థితులు మిక్కిలి క్లిష్టముగను, సందిగ్ధముగను ఉండెను. ఉత్తర హిందూస్థానమునందలి కుషాణుల విజృంభణము వలనను, హాలశాతవాహనుని తరువాత వచ్చిన పాలకులు సమర్థులు కాక పోవుట వలనను, క్షహరాటులును, ఉజ్జయినీ క్షాత్రపులును శాతవాహన సామ్రాజ్యముయొక్క పశ్చిమ భాగమును, పశ్చిమోత్తర దేశమును ఆక్రమించుకొని పరిపాలనము సాగించుచుండిరి. పాటలీపుత్త్రముపై ఆంధ్రుల ఆధిపత్యము అంతరించి యుండెను. శకులు దేశమున బహుభాగముల నాక్రమించి స్వతంత్రరాజ్యముల నెలకొల్పిరి. ఇట్లు అరాజకము ప్రబలుటయే గాక నాటి హిందూసంఘమునందు గూడ కల్లోలము లేర్పడినట్లు గోచరించును. నహపాణుడు మున్నగు క్షహరాటులును, రుద్రదాముడు మున్నగు ఉజ్జయినీ క్షత్రపులును విదేశీయులయ్యు, హిందూమతము నవలంబించి క్షత్రియోచితములగు రాజ, మహరాజ బిరుదములను వహించిరి. ఇతర ప్రాంతములందు కొందరు యవనులు హిందూ మతావలంబకులైరి. ఇట్టి సంక్షుభిత వాతావరణమున గౌతమీపుత్రుడు క్రీ. శ. 78 ప్రాంతమున సింహాసనము నధిష్ఠించి క్షీణదశలో నున్న శాతవాహనవంశ కీర్తి ప్రాభవములను సముద్ధరించుటయేగాక గొప్ప విజేత యయ్యెను.

ఆత్మరక్షణము, వంశగౌరవ పాలనము ఇతనిని విజయ యాత్రోన్ముఖుని జేసినవి. వైజయంతీ సైన్యముయొక్క విజయస్కంధావారమునుండి చేయబడినదాన శాసనమును బట్టియు, గౌతమీబాలశ్రీ వేయించిన నాసిక శాసనమును బట్టియు ఇతడు రెండు విజయయాత్రలను చేసినట్లు తెలియుచున్నది. ఇతడు మొదట పశ్చిమ దిగ్విజయము చేసి యుండును. దీనిని ఫలితముగనే ఇతనికి అసిక, అసక, ముళక, సురఠ, కుకుర, అపరాంత, అనూప, విదర్భ, అక రావంతి అను రాజ్యములు లభించెను. ఇతని పశ్చిమ దిగ్విజయము ప్రాగాంధ్రము నుండి ప్రారంభింపబడి మహోత్సాహముతో వరుసగ, ముళక, అసిక, అకరా వంతి, విదర్భ, సౌరాష్ట్రముల విజయముతో పూర్తి గావింపబడెను. పశ్చిమ దిగ్విజయమును ముగించుకొని, ఈ రాజు దక్షిణ దిగ్విజయమునకు బయలుదేరెను. నాడు ఆంధ్ర ద్రవిడదేశముల మధ్యభాగమున అరువలారును, నాగులును ప్రబలురుగ నుండిరి. శాతకర్ణిమహారాజు