సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మూడవ సంపుటము/గౌతమీపుత్ర శాతకర్ణి

గౌతమీపుత్త్రశాతకర్ణి :

దాదాపు నాల్గున్నర శతాబ్దముల కాలము దక్షిణా పథమునందు ఏకచ్ఛత్రాధిపత్యము నెరపి, ఆంధ్రులకు గర్వకారణమై యొప్పిన వంశము శాతవాహన వంశము. ఇట్టి మహావంశమునందు ఉద్భవించిన విజేతలలో, మేధావులలో, గౌతమీపుత్ర శాతకర్ణి మిక్కిలి కొనియాడ దగినవాడు. ఇతడు చిరస్మరణీయమైన గౌతమీబాలశ్రీ కుమారుడు. శివస్వాతి మహారాజు ఈతని తండ్రియని కొందరు తెల్పుచున్నారు. కాని ఈ యంశము వివాదాస్పదము. శివస్వాతి తరువాత ఆంధ్ర సామ్రాజ్యలక్ష్మిని వరించి పట్టము కట్టుకొనిన మహావీరుడు గౌతమీపుత్త్రశాతకర్ణి.

గౌతమీపుత్త్ర శాతకర్ణికి పూర్వము శాతవాహన సామ్రాజ్య పరిస్థితులు మిక్కిలి క్లిష్టముగను, సందిగ్ధముగను ఉండెను. ఉత్తర హిందూస్థానమునందలి కుషాణుల విజృంభణము వలనను, హాలశాతవాహనుని తరువాత వచ్చిన పాలకులు సమర్థులు కాక పోవుట వలనను, క్షహరాటులును, ఉజ్జయినీ క్షాత్రపులును శాతవాహన సామ్రాజ్యముయొక్క పశ్చిమ భాగమును, పశ్చిమోత్తర దేశమును ఆక్రమించుకొని పరిపాలనము సాగించుచుండిరి. పాటలీపుత్త్రముపై ఆంధ్రుల ఆధిపత్యము అంతరించి యుండెను. శకులు దేశమున బహుభాగముల నాక్రమించి స్వతంత్రరాజ్యముల నెలకొల్పిరి. ఇట్లు అరాజకము ప్రబలుటయే గాక నాటి హిందూసంఘమునందు గూడ కల్లోలము లేర్పడినట్లు గోచరించును. నహపాణుడు మున్నగు క్షహరాటులును, రుద్రదాముడు మున్నగు ఉజ్జయినీ క్షత్రపులును విదేశీయులయ్యు, హిందూమతము నవలంబించి క్షత్రియోచితములగు రాజ, మహరాజ బిరుదములను వహించిరి. ఇతర ప్రాంతములందు కొందరు యవనులు హిందూ మతావలంబకులైరి. ఇట్టి సంక్షుభిత వాతావరణమున గౌతమీపుత్రుడు క్రీ. శ. 78 ప్రాంతమున సింహాసనము నధిష్ఠించి క్షీణదశలో నున్న శాతవాహనవంశ కీర్తి ప్రాభవములను సముద్ధరించుటయేగాక గొప్ప విజేత యయ్యెను.

ఆత్మరక్షణము, వంశగౌరవ పాలనము ఇతనిని విజయ యాత్రోన్ముఖుని జేసినవి. వైజయంతీ సైన్యముయొక్క విజయస్కంధావారమునుండి చేయబడినదాన శాసనమును బట్టియు, గౌతమీబాలశ్రీ వేయించిన నాసిక శాసనమును బట్టియు ఇతడు రెండు విజయయాత్రలను చేసినట్లు తెలియుచున్నది. ఇతడు మొదట పశ్చిమ దిగ్విజయము చేసి యుండును. దీనిని ఫలితముగనే ఇతనికి అసిక, అసక, ముళక, సురఠ, కుకుర, అపరాంత, అనూప, విదర్భ, అక రావంతి అను రాజ్యములు లభించెను. ఇతని పశ్చిమ దిగ్విజయము ప్రాగాంధ్రము నుండి ప్రారంభింపబడి మహోత్సాహముతో వరుసగ, ముళక, అసిక, అకరా వంతి, విదర్భ, సౌరాష్ట్రముల విజయముతో పూర్తి గావింపబడెను. పశ్చిమ దిగ్విజయమును ముగించుకొని, ఈ రాజు దక్షిణ దిగ్విజయమునకు బయలుదేరెను. నాడు ఆంధ్ర ద్రవిడదేశముల మధ్యభాగమున అరువలారును, నాగులును ప్రబలురుగ నుండిరి. శాతకర్ణిమహారాజు మొదట ఈ భాగములను జయించి, చోళ రాజ్యముపై విజయయాత్ర సాగించి దక్షిణ సముద్రమువరకు పోయి జయలక్ష్మీ సమేతుడై తిరిగివచ్చెను.

శాతకర్ణి పరాక్రమమునకు వెరచి, యవన, శక, పహ్లవాదు లనేకులు ఆతనికి వశులై రాజభక్తిని జూపుచు మ్లేచ్ఛత్వమును విడిచి పెట్టి జైన, బౌద్ధమతముల నవలంబించి సర్వవిధముల నీ మహారాజునకు తోడ్పడుచుండిరి. శాతకర్ణి తనకు సుముఖులుకాక ప్రతిఘటించిన శాత్రవులను తరుముచు వారి దేశములపై దాడి వెడలుచు, అనేక దినములు వారలతో ఘోరయుద్ధములను జేయుచు, విజయము గాంచుచుండెను. యుగాంత కాలరుద్రుడై దేరిచూడరాకయున్న ఈ శూరాగ్రణి పరాక్రమధాటి నోపలేక పలువురు శత్రువులు ఇతనిని శరణుజొచ్చిరి. కావుననే నాసికాశాసనము నందు "తన భద్రగజముపై నుండి ఆకాశమున దూకి పవన, గరుడ, సిద్ధ, యక్ష, రాక్షస, విద్యాధర, భూత, గంధర్వ, చారణ, చంద్ర, దివాకర, నక్షత్రగ్రహములతో ఢీకొనుచున్నాడో యను నట్లు, అపరిమితము, అక్షయము, అచింత్యము, అద్భుతము అగు విధమున సమరమున శత్రుసైన్యములను జయించిన వాడు" అని ఇతని యుద్ధనైపుణ్యము వర్ణింపబడినది.

ఇట్టి విజయపరంపరలకు ఫలితముగ ఈ మహారాజు సామ్రాజ్యము పశ్చిమోత్తరమున పుష్కరతీర్థము మొదలు ప్రాగ్దక్షిణమున కడలూరు వరకును, ప్రాగుత్తరమున కళింగనగరము మొదలు పశ్చిమ - దక్షిణమున వైజయంతి వరకును వ్యాపించెను. కావుననే బాలశ్రీ శాసనమునం దితడు త్రిసముద్రతోయ పీతవాహనుడని వర్ణింపబడి నాడు. నాసిక శాసనమునం దితడు రాజాధి రాజనియు, అస్మిక, అసక, మూలక సురాష్ట్ర, కుకుర, అపరాంత, అనూప, విదర్భ, అక రావంతి దేశములకు పాలకుడనియు, వింధ్యావతము, పారియాత్రము, సహ్యము, కృష్ణగిరి, మలయము, మహేంద్రము, శ్రేష్ఠగిరి, చకోరము మొదలగు పర్వతములకు అధినాథుడనియు కీర్తింపబడినాడు. ఆతని కాలమున ఆంధ్రరాజ్యము గంగాతీరము మొదలుకొని, కాంచీపురము వరకు వ్యాపించి యుండెననియు తోచుచున్నది. మహారాష్ట్రములో దొరికిన పదునాల్గువేల నహపాణుని నాణెములలో తొమ్మిదివేల నాణెములవెనుక వైపున "రాణ్ణో గోతమిపుతా ససిరి శాతకానినో" అని గోతమీపుత్త్ర శాతకర్ణి పేరు ముద్రింపబడి యుండుట ఇతని విజయపరంపరలకు చిహ్నముగా నున్నది.

ఇట్లు మహావిజేత, సమ్రాట్టు అయిన గౌతమీపుత్త్రుడు ప్రియదర్శనుడు, చారుగమనుడు అగుట ముదావహమైన విషయము. ఇత డేక బ్రాహ్మణు డనియు, ఏక ధనుర్ధరుడనియు, రామ- కేశవ-భీమార్జునులతో సమానమైన పరాక్రమము కలవాడనియు, నాభాగ - నహుష - జనమేజయ - సగర - యయాతి - రామ - అంబరీషాదులతో సమానమైన తేజస్సు కలవాడనియు, క్షత్రియ దర్పమాన మర్దనుడనియు, శకయవన - పహ్లవ-నిషూదను డనియు, అనేక సమర పరాజిత శత్రుసంఘుడు" అనియు పొగడబడి యున్నాడు. ఈతడు తల్లికి అవిపన్నమైన శుశ్రూష చేయువాడనికూడ సూచింపబడుట ఈతని వినయసంపత్తికిని, గురుజన విధేయతకును నిదర్శనముగా నున్నది. వినీతుడు కావుననే ఈతడు పూర్వ శాతవాహన చక్రవర్తులవలె గాక తన పేరునకు ముందు 'గౌతమీపుత్త్ర ' అని తల్లి పేరును చేర్చుకొనెను.

ఈతని ధర్మ చరిత మెంతయు మనోహరమైనది. శాతవాహనవంశ కీర్తి ప్రతిష్ఠాపనకరుడైన ఈ గౌతమీ పుత్త్రుడు బహుభోగముల ననుభవించినప్పటికిని మదాంధుడు కాలేదు. సర్వరాజ లోకమస్తక పరిగృహీతశాసను డయ్యు పౌరజనులతో సమానముగ తన సుఖదుఃఖములను పంచుకొనుట గౌతమీపుత్త్రుని సత్స్వభావమునకు దృష్టాంతముగ నున్నది. వర్ణ సాంకర్యము నరికట్టి, అనేక ద్విజ కుటుంబములను పోషించినవా డనియు, ఆగమ నిలయు డనియు స్తుతింపబడిన ఇతడు బుద్ధదేవునియందు అధిక భక్తి ప్రపత్తులు చూపుట ఇతని మత సామరస్యమునకును, హృదయ వైశాల్యమునకును తార్కాణము. సర్వ సద్గుణ గరిష్ఠుడైన ఇతడు ధర్మమార్గముననే పన్నులను స్వీకరించెను. "శాస్త్రీయముగా విధించిన సుంకములను గూడ గౌతమీపుత్త్ర శాతకర్ణి తీసివేసెనని" నాసికలోని శాసనము చాటుచున్నది. ఇత డనేక శత్రురాజులను జయించి వారి స్వాధీనములో నుండినట్టి భూములను సాధువుల ఉపయోగార్థము దానము చేసినాడు. ఉదా : నాసిక గుహలోని బౌద్ధాలయముయొక్క సంరక్షణకై ఇత డొనర్చిన గ్రామదానము ఆ గుహయొక్క వసారాకు ఎడమప్రక్క నున్న గోడమీద మరియొక శాసనము కలదు. ధాన్యకటకాధీశ్వరుడైన గౌతమీపుత్ర శాతకర్ణి, జయము గాంచిన తన సేనయొక్క నివేశన స్థానమున నుండి, గోవర్ధనములోని తన సైన్యాధికారియైన విష్ణుపాలితు డనువానికి తెలియజేసిన ఉత్తరువుయొక్క భావమునుబట్టి, అప్పటివరకు ఋషభదత్తుని స్వాధీనములో నుండిన రెండు నూరుల నివర్తనముల పరిమాణము గల 'అనిలకాలకి' అను పొలమును సాధువుల ఉపయోగార్థము ఇతడు దానము చేసినట్లు తెలియుచున్నది.

ఈ విధముగా ఈ మహారాజు శత్రు దుర్నిరీక్ష్యతేజుడై, వంశగౌరవ స్థాపకుడై, రాజాధిరాజై, ధర్మపరాయణుడై, ఆశ్రిత చింతామణియై, దక్షిణాపథపతి బిరుదాంచితుడై, ఆంధ్రసామ్రాజ్యమునకు అమూల్యమైన సేవచేయుచు, తన కాలమును త్రివర్గ సాధనకై చక్కగ విభజించుకొని, అజరామరమైన కీర్తిని సంపాదించు కొనెను.

పి. య. రె


గౌతమీ బాలశ్రీ :

శాతవాహన వంశము కేవలము, పరాక్రమవంతులు, ధర్మపరాయణులైన రాజులచేతనే గాక, అహింసా niరతలు, సత్యవచస్కలు, దానక్షమాన్వితులు ఐన రాణుల చేతను గూడ పవిత్ర మొనర్పబడినది. శాతవాహన వంశమును పునీతముచేసిన రాణులలో "గౌతమీ బాలశ్రీ" మిక్కిలి ఎన్నదగినది. ఈమె శివస్వాతి మహారాజుభార్య అనితెలియుచున్నది. గౌతమీపుత్ర శాతకర్ణితల్లి, వాసిష్ఠీపుత్త్ర పులోమావి పితామహి. ఈమె జన్మము పావనతమ మైనది. రాజర్షి పత్నీపదమునకు తగిన గుణ విశేషములను కలిగిన ఈ గౌతమీ బాలశ్రీ, లోకోత్తర చరితుడైన కుమారుని పొందినది. పవిత్రము, శుభకరమునై న శీలము కారణముగా ఆమె చిరస్మరణీయ అయ్యెను. శాతవాహన చక్రవర్తులలో తలమానికముగా పరిగణింపబడినట్టి 'గౌతమీపుత్ర శాతకర్ణి' తనపేరునకు ముందు 'గౌతమీ పుత్ర'యని తన మాతృశ్రీ నామధేయమును జతపరుచుటచే శాతవాహనయుగమున అతడు వినూత్నములైన గౌరవ ప్రపత్తులను తల్లికి నొసగు ఆచారమును కల్పించినవా డయ్యెను. ఇది కేవలము శాతకర్ణియొక్క మాతృభక్తి పరాయణతను సూచించుటయేగాక గౌతమీదేవియొక్క సామర్థ్యమును, ఉదాత్తతను, శుభచారిత్రమును గూడ చాటుచున్నది. ఈమె అకుంఠితమైన మాతృ శుశ్రూషా పరాయణుడగు కుమారుని పొందుటచేతనేగాక, తన గురుతరములైన దానధర్మములచేతగూడ చిరస్థాయియైన కీర్తి నార్జించినది. ఈమె, శివస్వాతిమహారాజు కాలమున ప్రసిద్ధి వహించినది. తరువాత కుమారుడును, చక్రవర్తియునగు గౌతమీపుత్ర శాతకర్ణి కాలమునను, పౌత్రుడగు పులోమావి కాలమునను వారితోగలిసి తానుకూడ దానధర్మములను జేయుచు రాజ్యతంత్రమునందు కూడ వారికి తోడ్పడినట్లు తెలియుచున్నది. గౌతమీపుత్రశాతకర్ణి నాసిక శాసనమునుబట్టి “రాజమాతయు, జీవసుతయునగు మహాదేవియొక్క మాటలుగా గోవర్ధనమునం దమాత్యుడగు శ్యామకుని ఆరోగ్యము అడుగ బడుట, తిరణ్హు పర్వతపుగుహలో నివసించు భిక్షువులకు ఉత్తమ క్షేత్రమును దానము చేయుట గౌతమీదేవియొక్క ఉదారతను సూచించును. ఈ దానశాసనము ప్రతీహారియగు 'లోటు'ని చే వ్రాయబడినది. సుజీవిచే అమలు జరుపబడినది.

శ్రీ పులోమావి రాజుయొక్క 19వ రాజ్య సంవత్సరమున గ్రీష్మఋతువు రెండవపక్షమున చేయబడిన దాన శాసనమునందు గౌతమీ బాలశ్రీ మిక్కిలి నుతియింప బడినది. గౌతమి కోరిక పైననే ఈ దానశాసనము వ్రాయించినట్లు కనబడును. అందు "... రాజ రాజును గౌతమీపుత్రుడును, శ్రీ శాతకర్ణియొక్క తల్లియు, సత్యదాన అహింసానిరతయు, తపోదమనియ మోపవాస తత్పరయు, రాజర్షిపత్నికి గల యోగ్యత పూర్తిగ కలదియు అగు మహాదేవి గౌతమీ బాలశ్రీ కైలాస పర్వతముతో సమానమగు తిరణ్హు పర్వతాగ్రమున పవిత్రమైన ధర్మముగా కైలాస సదనమువలె యీ గుహను దొలిపించెను" అని కలదు. దీనిని ఈ మహారాణీ భద్రాయ నీయు లను భిక్షువులయొక్క సంఘము ద్వారమున బుద్ధ నికాయమునకు నిచ్చెను. కేవలము కుమారుడేకాక, పౌత్రుడుకూడ పితామహియగు నీ మహారాణి ప్రియమును, సేవను కాంక్షించి “పిసాజిక పద”మను గ్రామ