సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మూడవ సంపుటము/గోపమంత్రి – నాదిండ్ల

గోపమంత్రి – నాదిండ్ల

శ్రీకృష్ణ దేవరాయల కాలమున ప్రఖ్యాతి చెందిన మంత్రి కుటుంబములలో 'నాదిండ్ల' వారి కుటుంబ మొకటి. వీరు ఆర్వేల నియోగిశాఖా బ్రాహ్మణులు. ఆపస్తంబ సూత్రులు, కౌశికగోత్రులు, గుంటూరు మండలమున నర్సారావుపేట కెనిమిది మైళ్ళ దూరమున నున్న 'నాదిండ్ల' అను గ్రామమున నివసించుటచే నీ వంశము వారికా యూరిపేరు ఇంటిపే రయినది.

నాదిండ్ల వంశములో చిట్టి గంగనామాత్యుడను ప్రసిద్ధ రాజకీయవేత్త జనించెను. ఈ చిట్టి గంగనామాత్యుని యొద్దనే సాళ్వ తిమ్మరుసు శుశ్రూషచేసి రాజనీతి విద్యలను గరచెను. చిట్టి గంగనామాత్యుని అన్నగారి పౌత్రుడు తిమ్మనామాత్యుడు ఈ తిమ్మనమంత్రియు, మహామంత్రి తిమ్మరుసును బావమరదు లయిరి. అనగా తిమ్మన సోదరి లక్ష్మమ్మను తిమ్మరుసు వివాహ మాడెను. తిమ్మరుసు సోదరి కృష్ణమాంబను తిమ్మనమంత్రి వివాహమాడెను. కృష్ణమాంబ యొక్క ఒక కొడుకగు అప్పనమంత్రికి (మేనల్లునకు) తిమ్మరుసు తన కూతురగు తిరుమలాంబ నిచ్చి వివాహము చేసెను. మన గోపనమంత్రి కృష్ణమాంబ యొక్క మరియొక కుమారుడు; తిమ్మరుసు మేనల్లుడు. ఈ బాంధవ్యములు ప్రబోధ చంద్రోదయ వ్యాఖ్యయందు స్పష్టముగా వివరింపబడినవి. వీ రందరు మంత్రి, దండనాయకాది పదవులను వహించి ఆంధ్రదేశ చరిత్రలో ప్రసిద్ధిగన్నవారు. సంస్కృతాంధ్ర భాషలయందు నిస్తుల పాండిత్యవిలసితులు, వితరణశీలురు.

గోపమంత్రి తొలుత క్రీ. శ.1510 ప్రాంతములో నేటి అనంతపుర మండలమున గల గుత్తిదుర్గ పరిపాలకుడుగా నుండెను. శ్రీకృష్ణదేవరాయలు కొండవీటి దుర్గమును క్రీ. శ. 1515 లో జయించి అచ్చట పాలకులుగా నున్న గజపతులను తరిమివేసెను. అప్పుడు రాజకార్య సంసిద్ధికొరకు దక్షుడైన గోపమంత్రి కొండవీటి దుర్గాధిపతిగా నియమితు డయ్యెను. గోపనమంత్రి క్రీ. శ. 1520 నుండి 1533 వరకు కొండవీటిసీమను దక్షతతో పాలించెను.

మంత్రిత్వము : ఒకప్రక్క రాచకార్యములను దిద్దుకొనుచు, మరియొకప్రక్క సాహిత్య కార్యకలాపములనుగూడ గోపనమంత్రి చూచుకొనుచుండెను. రాజ్య కార్య నిర్వహణమునందు గోపప్రభునకు 'యూరదేచ యామాత్యుడను నాతడు మంత్రిగానుండెను. ఈ యూర దేచమంత్రియు సంస్కృతమున గట్టిపండితుడు. మహా విద్వాంసుడగు లొల్లలక్ష్మీధరుని శిష్యుడు. ఆంధ్రభాష యందభిమానముగల మనీషి. ఈ దేచమంత్రికే కుమార భారతియను బిరుదునందిన తెనాలి రామలింగకవి శైవుడై యున్నప్పుడు ఉద్భటారాధ్య చరిత్రమను ప్రశస్త శైవ ప్రబంధమును రచించి కృతినిచ్చెను. ఉద్భటారాధ్య చరిత్రమునందు గోపమంత్రిని తెనాలి రామలింగకవి ఎంతో మనోహరముగా స్తుతించియున్నాడు.

గ్రంథరచన : సంస్కృతమున గోపనమంత్రి కృష్ణమిశ్ర విరచితమై ప్రఖ్యాతమైన ప్రబోధ చంద్రోదయము అను వేదాంతాంతరార్ధకథా సమన్వితమైన నాటకమునకు "చంద్రికా" అను సంస్కృత వ్యాఖ్య రచించినాడు. ఈ వ్యాఖ్యానము తోడనే సంస్కృతమున నీ నాటకము ముద్రితమైనది. ప్రబోధచంద్రోదయము ఉపనిషదర్థ ప్రతిపాదితమైన గంభీరార్థముగల నాటకము. ఇందు భౌద్ధ, జైన, చార్వాక మతఖండనాదులు కలవు. వేదాంత శాస్త్రమున నిరూఢ ప్రజ్ఞగలవారికి మాత్రమే ఈ నాటకము గ్రాహ్యమగుట కవకాశము గలదు. అట్టి శబ్దశ్లేష పారిభాషిక పదబంధురమైయున్న ఆ మహానాటకమునకు గోపన చక్కని వ్యాఖ్య రచించినాడనుటచే అతనికి సంస్కృత భాషయందు, శాస్త్రవిశేషములందు ఎట్టి దండిపాండిత్యముగలదో స్పష్టమగుచున్నది. వ్యాఖ్యా నారంభమున గోపమంత్రి వ్రాసిన శ్లోకము లాతని సంస్కృతకవితాశ క్తిని ప్రదర్శించునవిగా నున్నవి.


శ్లో. అస్తి ప్రశస్తమహిమా నరసింహసూనుః
    శ్రీకృష్ణరాయనృపతి ర్నృపసార్వభౌమః
    యస్యోద్ధతా సమరసీమ్ని కృపాణవల్లీ
    దూతీ భవ త్యమరలోకవిలాసినీనామ్.

శ్లో. తస్య శ్రీకృష్ణరాయస్య ప్రాజ్యరాజ్యధురంధరః
    కులక్రమాగతో మంత్రీ సాళ్వతిమ్మచమూపతిః.

శ్లో. ఆపూర్వపశ్చిమసముద్ర మదత్తరాజ్యమ్
    ఆసేతుసింహగిరి చాత్ప్రతిమప్రతాపః
    యః కృష్ణరాయనరపాలకదండనాథః
     కౌండిన్యగోత్రతిలకః కవిపారిజాతః.

గద్య: ఇతి శ్రీమద్రాజాధిరాజపరమేశ్వర శ్రీమత్ప్రతాప శ్రీకృష్ణరాయమహాసామ్రాజ్య ధురంధరసాళ్వతిమ్మ దండనాయక భాగినేయ నాదిండ్లగోపమంత్రిశేఖర విరచితాయాం ప్రబోధచంద్రోదయ వ్యాఖ్యాయాం షష్టో౽ంకః సమాప్తః.

సంస్కృతగ్రంథములు వ్రాసిన తెలుగువారిలో గోపనకు ప్రముఖస్థానమున్నది.

నాదిండ్లవారి వంశచరిత్రము నెరుంగుటకు శాసములు గూడ మనకు తోడ్పడుచున్నవి.

1. క్రీ. శ. 1515 నాదిండ్ల అప్పమంత్రి మంగళగిరి శాసనము.

2. క్రీ. శ. 1520 నాదిండ్లగోపమంత్రి కొండవీటి శాసనము.

ఈ రెండు శాసనములును సంస్కృతభాషలో ప్రశస్తమైన కవితతో వెలయుచున్నవి. ఈ శాసనములను రచియించిన మహాకవి లొల్ల లక్ష్మీధరుడు. మహావిద్వాంసుడగు నీతడు గజపతుల యాస్థానమున నుండినవాడు. తరువాత కృష్ణదేవరాయలవారి ఆస్థానమున కలంకారభూతుడయినాడు. అప్పమంత్రి మంగళగిరిశాసనమున సాళ్వతిమ్మరుసుమంత్రి ప్రశస్తి - నాదిండ్ల సాళ్వవంశీయుల సంబంధములు తెలుపబడినవి. అప్పమంత్రి యొనర్చిన దావాదికములు, అగ్రహారములు, తటాకప్రతిష్ఠ, దేవాలయప్రతిష్ఠాపనము మున్నగునవి ఆయా కాల ప్రమాణములతో లిఖితములైనవి. ఇందు తిమ్మరుసున కల్లుడును, గోపనకు అగ్రసోదరుడును అగు నాదిండ్ల అప్పమంత్రి వినుకొండ గుత్తిసీమలకు పరిపాలకుడుగా నియమితుడైనట్లు చెప్ప బడినది.

గోపమంత్రి కొండవీటిశాసనము మంగళగిరి శాసన ప్రారంభ శ్లోకములతోడనే మొదలిడి వంశవృత్తాంతమును అట్లే వివరించుచున్నది. ఆ శ్లోకములుగూడ రెంటను సమానములే. గోపమంత్రి కొండవీటి యజ్ఞ వాటికా రఘు నాయకులకు దేవాలయశిఖరము - మండపగోపురములు - తిరుచుట్టుమాలియ కట్టించి ఆ దేవరకు లేంబల్లె, మైదవోలు అను రెండు గ్రామములు సమర్పించెనను విషయము ఈ శాసనమున నుట్టంకింపబడినది.

కృష్ణార్జున సంవాదము : గోపన తెలుగున ద్విపదకావ్య ముగా "కృష్ణార్జున సంవాదము" రచించియున్నాడు. ఇది గయోపాఖ్యాన కథ.

ప్రారంభము :


శాంత మానసునకు జానకీపతికి
నెంతయుఁ బ్రీతిగా నే రచియించు
చారు కృష్ణార్జున సంవాదమునకు
నారఁ గథా సూత్ర మది యెట్టి దానిన

గ్రంథాంతము :


భాసురకీర్తి గోపప్రధానుండు
చారు కృష్ణార్జున సంవాద మొనర
గా రచియించె సత్కవులు నుతింప.

గయోపాఖ్యాన కథ మహాభారతమున గానరాదు. శ్రీకృష్ణునికి సంబంధించిన హరివంశమునగాని, భాగవతము నందు గాని యీ కథ యెంతమాత్రము గానరాదు. ఇది రామాయణ కథయందు, అవాల్మీకములవలె భారత కథయందు క్రొత్తగా చేరినకథ. కావుననే వీనిని కల్పిత కథలుగా పరిగణింతురు. గోపన సమకాలికుడైన చరిగొండ ధర్మనకవి రచించిన "చిత్రభారతము” న ఈ కథ గలదు. కృష్ణార్జున సంవాదములోని గయుని పేరునకుబదులు చిత్ర భారతమున చతుర్ధనుడని కలదు. గయుని నోటినుండి పడిన నిష్టీవనమునకు బదులు చిత్రభారతమున చతుర్ధనుడను రాజు ఆకాశ మార్గమున బోవుచుండగా ఆ రాజు ఎక్కిన గుఱ్ఱము నోటినుండి నురుగుపడెనని కలదు. ధర్మన తానీ కథను బ్రహ్మాండ పురాణమునుండి గ్రహించినట్లు వ్రాసియున్నాడు. కాని నేటి బ్రహ్మాండపురాణ ప్రతులలో నిది గానరాదు. గోపమంత్రి తన కాలములో ప్రచారమున నున్న గయుని కథను గ్రహించి కృష్ణార్జున సంవాదముగా రచించెనని చెప్పవచ్చును. ఈ కృతి విశేషములు.

1. ఇందు వర్ణనలకంటె కథకు ప్రధానస్థానము కలదు.

2. కావ్యశైలి, సంస్కృతాంధ్రములు సమపాళము గను, నిర్దుష్టముగను ఉన్నవి.

3. వర్ణనములు సముచితములుగ కావింపబడినవి.

4. జాతీయములు, సామెతలు సందర్భానుసారముగా వాడబడినవి.


ఇలపులి దాసర్ల కిడియెద ననిన
వలనేది నమ్మి పోవచ్చునే చెపుమ

చింతింప గతజలసేతుబంధనము
నలిని క్షీరోదక న్యాయమై యుండ
గోర్చుట్టమీద రోకటిపోటు
తంగేటిజున్ను రాధా భర్త మనకు.

5. ఇందలి ద్విపదలలో 'ప్రాసయతి' ప్రయోగములు లేవు సలక్షణమైన భాష. సాధారణముగ ద్విపదపాదము లొక దానితో నొకటి కులకముగ నేర్పడక విడివడి యుండును. శృంగారవర్ణనలు మచ్చునకైన లేక వీరరస స్ఫోరకమై, నీతి బోధకమై యున్నది.

కృష్ణదేవరాయల కాలములో ప్రబంధములే గాని యితర వాఙ్మయప్రక్రియలు లేవు అను నపవాద మొకటి సారస్వత లోకమున వ్యాపించి యున్నది. కాని గోపమంత్రి ద్విపదకృతి యా యభిప్రాయమునకే యపవాదము. ఈ ద్విపదకృతియే గాక కృష్ణదేవరాయల కాలమున భద్రకవి లింగకవి సానందోపాఖ్యానము, దేవాంగ పురాణము మున్నగు ద్విపదకృతులు వెలసినవి.

గోపమంత్రి రచన వెనుక గయోపాఖ్యాన కథ యెన్ని యో రూపములు వెలసినది.

ప్రబంధములు : కృష్ణార్జున సంవాదము : (1) వెలిచేరు వెంకటరామ ప్రధాని క్రీ. శ. 1700 ప్రాంతము. అముద్రితము.

(2) కస్తూరి రంగకవి క్రీ. శ. 1750 ప్రాంతము. అముద్రితము.

యక్షగానము : గయనాటకము : ఎమ్. కాశీపతి ఆచారి. ముద్రితము.

గయోపాఖ్యానము : ధేనువుకొండ వెంకయ్య (జంగం కథ) ముద్రితము.

హరికథ : గయోపాఖ్యానము: బాలాజీదాసు. ముద్రితము.

నాటకము : గయోపాఖ్యానము : చిలకమర్తి లక్ష్మీ నరసింహము, కాశీనాథుని వీరమల్లయ, డి. సీతారామారావు, పి. సూర్యనారాయణ.

వచనము: గయోపాఖ్యానము: పి.శివరామన్న, పి. రామబ్రహ్మము, ఎస్ . వెంకటసుబ్బశాస్త్రి, మావిపెద్ది కోటయ్య.

గయోపాఖ్యానమను పేరుతో నున్న గ్రంథములు ఏ వాఙ్మయ ప్రక్రియల ననుసరించినను కథమాత్రము తూ. చ. తప్పక గోపమంత్రి కృతి ననుసరించినవేగాని వేరుగావు. గోపన సంస్కృత గ్రంథ వ్యాఖ్యాతగా, ఆంధ్రకవిగా, ప్రఖ్యాత దండనాయకుడుగా పేరొందెను.

ని. శి. సు.