సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మూడవ సంపుటము/గోదావరి జిల్లా (పశ్చిమ)
గోదావరిజిల్లా (పశ్చిమ) :
ఉనికి : పశ్చిమ గోదావరిజిల్లా 16° - 15' - 17° - 30' ఉత్తర అక్షాంశరేఖల మధ్యను, 80° 51' 81° 55' తూర్పు రేఖాంశముల మధ్యను ఉన్నది. ఇది ఆంధ్రప్రదేశమునందలి తీరప్రాంతపు జిల్లాలలో నొకటియైయున్నది. 1925 వ సంవత్సరమున ఈ జిల్లా పూర్వపు కృష్ణాజిల్లా నుండి వేరుపరుప బడినది. ఏజెన్సీ తాలూకా యగు పోలవరము 1942 లో తూర్పుగోదావరి జిల్లానుండి దీనిలోనికి చేర్చబడినది. దీనికి బంగాళాఖాతమును, కృష్ణాజిల్లా భాగ మును దక్షిణపు సరిహద్దు. కృష్ణాజిల్లాయొక్క మరికొంత భాగమే పశ్చిమపు హద్దగు చున్నది. ఉత్తరపుటెల్ల ఖమ్మం మెట్టుజిల్లా. తూర్పున తూర్పుగోదావరి జిల్లాయు, బంగాళాఖాతమును సరిహద్దులై యున్నవి.
ఈ జిల్లాకు చెందిన వివరము లీ విధముగా నున్నవి. (1951). జిల్లామొత్తము విస్తీర్ణము 3,015 చ మై; గ్రామములు 789, పురములు 20; జనాభా 16,97,727; గ్రామవాసులు 13,66,458; పురవాసులు 3,31,269; పురుషులు 8,48,990; స్త్రీలు 8,48,737 ; జనసాంద్రత 563. ఈజిల్లాలో ఎనిమిది తాలూకాలు నాలుగు రెవెన్యూ డివిజనులలో చేర్చబడియున్నవి. ఏలూరు, చింతలపూడి తాలూకాలు ఏలూరు డివిజనులోను; కొవ్వూరు, పోలవరము తాలూకాలు కొవ్వూరు డివిజనులోను; భీమవరము, తాడేపల్లిగూడెము తాలూకాలు భీమవరం డివిజనులోను; నర్సాపురము, తణుకు తాలూకాలు నర్సాపురము డివిజనులోను చేరి యున్నవి.
1. పోలవరము తాలూకా : విస్తీర్ణము 551 చ. మై గ్రామములు 128; జనాభా 97,245; పురుషులు 48,830; స్త్రీలు 48,415; గ్రామవాసులు 97,245; జనసాంద్రత 176.
2. చింతలపూడితాలూకా : విస్తీర్ణము 418 చ. మై; గ్రామములు 84; జనాభా 1,00,187; పురుషులు 51,137; స్త్రీలు 49,056; గ్రామవాసులు 1,00,187: జనసాంద్రత 240.
3. కొవ్వూరుతాలూకా : విస్తీర్ణము 391 చ. మై; గ్రామములు 92; పురములు 2 (కొవ్వూరు, నిడదవోలు); జనాభా 2,14,522 ; గ్రామవాసులు 1,90,587; పురవాసులు 23,935; పురుషులు 1,08,390: స్త్రీలు 1,06,132; జనసాంద్రత 549.
4. ఏలూరుతాలూకా : విస్తీర్ణము 510 చ.మై; గ్రామములు 126; పురము 1 (ఏలూరు); జనాభా 2,60,599 గ్రామవాసులు 1,73,386; పట్టణ వాసులు 87,213; పురుషులు 1,30,090; స్త్రీలు 1,30,509; జనసాంద్రత 511.
చిత్రము - 120
5. తాడేపల్లి గూడెము తాలూకా : విస్తీర్ణము 360 చ. మై; గ్రామములు 98; పురములు 2 (తాడేపల్లిగూడెము, పెంటపాడు) ; జనాభా 2,17,123; గ్రామవాసులు 1,95,046 పట్టణవాసులు 22,077; పురుషులు 1,09,105; స్త్రీలు 1,08,018; జన సాంద్రత 603.
6. భీమవరము తాలూకా: విస్తీర్ణము 292 చ. మై; గ్రామములు 85; పురములు 4 (భీమవరం, వీరవాసరము, ఆకివీడు, (ఉండి); జనాభా 2,36,092 గ్రామవాసులు 1,78,834; పట్టణవాసులు 57,258; పురుషులు 1,18.462; స్త్రీలు 1.17,630; జనసాంద్రత 808.
7. తణుకుతాలూకా : విస్తీర్ణము 214 చ. మై. గ్రామములు 91 ; పట్టణములు 7 (తణుకు, పెనుగొండ, వేల్పూరు, అత్తిలి, రేలంగి, మారుటేరు, పెనుమంట్ర); జనాభా 2,78,186; గ్రామవాసులు 2,03,987; పట్టణవాసులు 74,199; పురుషులు 1,37, 119; స్త్రీలు 1,41,067; జనసాంద్రత 1300.
8. నరసాపురం తాలూకా : విస్తీర్ణము 279 చ.మై; గ్రామములు 85; పురములు 4 (పాలకొల్లు, నర్సాపురం, మొగల్తూరు, ఆచంట) ; జనాభా 2,93,773; గ్రామవాసులు 2,27,186; పురవాసులు 66,587; పురుషులు 1,45,863; స్త్రీలు 1,47,910; జనసాంద్రత 1053.
నేలలు : ఈ జిల్లాలో సహజసిద్ధముగా మూడు విభాగము లున్నవని చెప్పవచ్చును. అవి యేవనగా సారవంతమై ఉత్తమశ్రేణికి చెందిన వండుమట్టి నేలలు నల్ల రేగడి నేలలు ఎఱ్ఱగరప నేలలు అనునవి. చింతలపూడి, పోలవరము తాలూకాలలో కాక మిగిలిన అన్ని తాలూకాల యందును సారవంతమైన వండుమట్టి నేలయే అధికము. 1. వండుమట్టి నేలలు విస్తృతముగా భీమవరము, తణుకు నరసాపురం తాలూకాలలో గలవు 2. పశ్చిమముననున్న ఏలూరు, భీమవరము తాలూకాలలో విశేష విస్తీర్ణము గలిగిన నల్ల రేగడి నేలలు గలవు. 3. ఉత్తరమునందలి పోలవరము, చింతలపూడి, కొవ్వూరు, తాడేపల్లిగూడెము తాలూకాలయందు విశేషించి ఎఱ్ఱమట్టి నేలలు కలవు.
పర్వతములు : కాన్‌స్లూరు గుట్టలు, ఆదకొండ గుట్టలు ఇంచుమించు జిల్లాకు ఉత్తరముగ 200 మైళ్ళ నిడివిగలిగి యున్నవి. ఈ గుట్టలు పోలవరము తాలూకా యంతయువ్యాప్తమయి యున్నవి.
పోలవరము తాలూకాలో తూర్పు కనుమలు వ్యాపించి యున్నవి. చింతలపూడి తాలూకా పూర్తిగను, తాడేపల్లి గూడెము, కొవ్వూరు, ఏలూరు తాలూకాల ఉత్తరభాగములు మెట్ట ప్రదేశములు ; మిగిలిన భాగము అంతయు పల్లపుభూమి.
నదులు : కృష్ణా, గోదావరీనదుల కాలువలద్వారా ఈ జిల్లాయందలి భూమి అధికభాగము సాగుబడికి తేబడుచున్నది. వ్యవసాయోప యుక్తములగు చెరువులకు వివిధములగు కాల్వలు జలసమృద్ధి నొనగూర్చు చున్నవి. గోదావరీ నదీజలముచే తాడేపల్లిగూడెము, తణుకు, భీమవరము, నరసాపురం తాలూకాలు అధికలాభము నొందుచున్నవి. ఎఱ్ఱకాలువ, బైనేరుకాల్వ, కొవ్వాడకాల్వ, జల్లేరునది, గుండేరునది మొదలగు వాగులు చెరువులను నింపుచు వ్యవసాయమున కుపయోగించు చున్నవి. చింతలపూడి ఏలూరుతాలూకా భాగములలో తమ్మిలేరును, కొవ్వూరు తాలూకాలో ఎఱ్ఱకాలువయు పోవుచున్నవి. పోలవరము తాలూకాలో బైనేరునదియు, జల్లేరునదియు, కొవ్వాడ కాలువయు ప్రవహించుచున్నవి. ఏలూరు తాలూకాలో గుండేరును, కొవ్వూరు తాలూకాలో రాళ్ళమడుగును పోవుచు ఆ ప్రాంతములను సస్య శ్యామల మొనర్చు చున్నవి. కొల్లేరుసరస్సు ముంపులు ఏలూరు తాలూకా యందు ప్రసిద్ధములు. ఏలూరు తాలూకా దక్షిణము నందు ఈకొల్లేరు సరస్సుగలదు. ఈ సరస్సు గోదావరీ నదియొక్క డెల్టాల చుట్టును ఎత్తుభాగములగుటచే నేర్పడినది. ఆ డెల్టా భాగములనుండియే అధికమగు మురుగునీరు ఈ సరస్సునకుఁ జేరును. ఉప్పుటేరుద్వారా కొంతనీరు సముద్రమునకు చేరుచుండును.
అడవులు : ఈ జిల్లాయందు 384.30 చదరపుమైళ్ళ ప్రాంతము అరణ్యావృతమై యున్నది. పోలవరము తాలూకా యందలి సురక్షితారణ్యములందు వెదుళ్లు. వంటచెఱకు, కలప, సమృద్ధిగా కలదు. భీమవరము తాలూకా అడవులందు రావిచెట్లు అధికము.
శీతోష్ణము; వర్షపాతము : ఈ జిల్లాయందలి శీతోష్ణస్థితి మొత్తముపై అనుకూలముగ నుండును. సెప్టెంబరు, జనవరి నెలలయందు మాత్రము కొండప్రాంతమగు పోలవరము తాలూకాయందు డెల్టాభాగందుకన్న చలి అధికముగా నుండును. ఈజిల్లాకు గలుగు అధికమగు వర్షపాతము జూన్, సెప్టెంబగు నెలలయందు నైరృతీ ఋతుపవనముల వలనను; అక్టోబరు, నవంబరులయందు ఈశాన్య ఋతుపవనముల వలనను కలుగుచుండును. వర్షపాతము, సగటున 37" నుండి 45" వరకు ఉండును.
నీటి పారుదల : తణుకు, భీమవరము, నర్సాపురము, తాడేపల్లిగూడెము, ఏలూరు తాలూకాలు డెల్టాలచే నేర్పరుపబడిన వగుటచే సారవంతమైనవి. గోదావరి, కృష్ణా కాలువలవలన ఈభూమి సాగుబడి యగుచున్నది. చెఱువులచే కొన్ని ప్రాంతములందు వ్యవసాయము నడుప బడును. అందు కొన్ని సహజ ప్రవాహములచే నిండునవి. నూతుల సహాయమున తోటలను పెంచుదురు. తాత్కాలికముగ తీయబడుదొరువులు సముద్రతీర ప్రాంతములం దధికములు. ఇంకను అధికమగు నీటివనరులు కల్పింప బడవలసి యున్నవి. పోలవరము తాలూకా బైనేరుకొండ వాగుచేతను, వర్షాధారితమగు చెరువులచేతను నీటిపారు దలను పొందుచున్నది. చింతలపూడి తాలూకాయందు తమ్మిలేరు, ఎఱ్ఱకాల్వ, జల్లేరనెడి ముఖ్యమగు కొండ వాగులు కలవు. వాని కడ్డకట్టలు లేని కారణమున అధిక ప్రయోజనము నీయజాలకున్నవి. తమ్మిలేరుపై అడ్డకట్ట నిర్మింప బడుచున్నది. కొవ్వూరు తాలూకా యందు రాళ్ళమడుగు కాల్వ వ్యవసాయోపయోగి. గుండేరు, కొల్లేరు సరసు ఏలూరు తాలూకా భూముల కుపయోగ పడుచున్నవి. యనమదుర్రు, ఉప్పుటేరు కాల్వలు భీమవరము తాలూకాయందు ప్రధానమగునవి నరసాపురం కాల్వ, గోస్తనీ నది, వేలూరుకాల్వ, అత్తిలి బ్యాంకు కాలువలు ముఖ్యములు. కానూరు లంక కాల్వ ప్రణాళికను ప్రభుత్వము అమలుచేయుచున్నది.
ఈ జిల్లాలో 976 చిన్న రకపు నీటి వనరులు కలవు. వీటిక్రింద 38,899.69 ఎకరముల ఆయకట్టు గలదు. పెద్ద రకపు నీటి వసతులక్రింద మొత్తము 7,45,883 ఎకరముల ఆయకట్టు గలదు.
పంటలు: నరసాపూరు తాలూకా యందలి పాలకొల్లును, చింతలపూడి తాలూకాయు నారింజపండ్ల (Batavian Oranges) తోటలకు ప్రసిద్ధములు. తణుకు, నరసాపూరు తాలూకాలయందు కొబ్బరి తోట లధికము. ఈ జిల్లాయందు వరి ధాన్యము ముఖ్యమగు ఆహారపు పంట. చోళులు, కంబు, రాగి, కొర్ర, వరుగు, సమాయి (Samai), జొన్నలు కూడ పండుచుండును. మెరప, చెఱకు, వేరుశెనగ, పొగాకు ఇక్కడ పండు వ్యాపారపు పంటలు. బియ్యము ఈ జిల్లానుండి ఇతర ప్రాంతములకు విరివిగా ఎగుమతి చేయబడును.
రహదారులు: ఈ జిల్లానుండి రహదారిబాటలు, కృష్ణాజిల్లా యందలి విజయవాడ, గుడివాడలకు వ్యాపించు చున్నవి. రోడ్ల నిడివి 1,172 మైళ్లు. ఇందు 40 మైళ్లు జాతీయ రహదారి మార్గములు. 47 మైళ్లు రాష్ట్రీయ మార్గములు; 515 మైళ్లు జిల్లా పెద్దబాటలు; 110 మైళ్లు ఇతర జిల్లా రోడ్లు; 348 మైళ్లు గ్రామ మార్గములు; 17 మైళ్లు పబ్లిక్ వర్క్సు మార్గము (Public Works), 95 మైళ్లు మునిసిపల్ మార్గములుకలవు. కొవ్వూరుతాలూకా యందు తప్ప మిగిలిన తాలూకాల యందలి రహదారి మార్గము లుత్తమ స్థితియం దున్నవి.
రైలు మార్గములు : ఈ జిల్లాయందు 1073/4 మైళ్లు పెద్ద రైలు మార్గము ; 133/4 మైళ్లు చిన్న రైలు మార్గము కలవు. మద్రాసు నుండి కలకత్తా పోవు పెద్ద రైలుమార్గముఏలూరు, తాడేపల్లిగూడెము, కొవ్వూరుతాలూకాల గుండా పోవును. నిడదవోలు నుండి నర్సాపురము వరకు ఒక బ్రాడ్ గేజ్ శాఖా రైలు మార్గము కలదు. దానిలోని భీమవరము నుండి ఒక మీటర్ గేజ్ రైలుమార్గము గుడివాడమీదుగా విజయవాడవరకు పోవును. పోలవరము, చింతలపూడి తాలూకాలు తక్క మిగిలిన తాలూకాలు రైలు మార్గములచే కలుపబడి యున్నవి.
తంతి - తపాలా ఆఫీసులు : ఈ జిల్లా యందు 288 బ్రాంచి పోస్టాఫీసులును, 17 పోష్టు-టెలెగ్రాఫు ఆఫీసులును, 19 సబ్ -తపాలా ఆఫీసులు (Non-combined Sub-post Offices) ను గలవు.
వైద్యము : ఈ జిల్లాలో 8 పెద్ద హాస్పిటలులు గలవు. 21 చిన్న వైద్యశాలలు గలవు. తణుకునందు కుష్ఠరోగ నివారణాలయము గలదు. హెడ్ క్వార్టర్సు అగు ఏలూరు నందున్న హాస్పిటలులో ఎక్సురే విభాగమును, కండ్ల విభాగమును గలవు. మరియు ఇది మంత్రసానుల (Maternity Assistants) ను తయారుచేయు శిక్షణాలయముగ గూడ పనిచేయుచున్నది. నరసాపురమునందలి మిషను హాస్పిటలు అన్నిటికన్న పెద్దది. ఇందు 160 మంచములు గలవు. పంపులద్వారా నీరు ఏలూరు, పాలకొల్లు, నరసాపురములకు పంపించబడుచున్నది. 362 బావులు నిర్మింప బడినవి.
జాతరలు : ఈ జిల్లాలో 10 యాత్రాస్థలములు గలవు. పాలకొల్లు, ఆచంట, ద్వారకాతిరుపతి, పట్టి సంగ్రామములు చెప్పదగిన యాత్రాస్థలములు. 4 సంతలు గలవు. పాలకొల్లు సంతయందు లక్షలకొలది వ్యాపారము జరుగుచుండును. విలక్షణమైన చరిత్రగలిగిన "పేరంటాలు" తిరుణాలు చింతలపూడి తాలూకా లింగపాలెము గ్రామములో జరుగుచుండును.
విద్య : ఈ జిల్లాయందు మొత్తము 1,717 సంస్థల ద్వారా విద్యాప్రచారము జరుగుచున్నది. వీటియందు విద్య నేర్చెడివారు బాలురు 1,07,838 మంది, బాలికలు 68,352 మంది గలరు. విద్యాసంస్థలలో కళాశాలలు 4; హైస్కూళ్లు 42 ; బేసిక్ ట్రైనింగ్ పాఠశాలలు 3 ; వికలాంగుల బడి 1; బాలుర మిడిల్ స్కూళ్ళు 6; ఎలిమెంటరీ పాఠశాలలు 1,576; బేసిక్ పాఠశాలలు 52; వయోజన విద్యాలయములు 33 కలవు. కుష్ఠరోగుల కొరకై ఒక విద్యాలయము నరసాపూరు నందు కలదు.
భారీపరిశ్రమలు : ఈ జిల్లాలో బియ్యపు మిల్లులు ప్రధానమై యున్నవి. మొత్తము 97 మిల్లులు కలవు. ఒక గోనెసంచుల మిల్లు ; 11 తోళ్ళ కార్ఖానాలు; 9 పొగాకు బేరనులు ; 9 ఉక్కు పెట్టెలుచేయు కార్ఖానాలు గలవు. వీటిలో మొత్తము 9,492 మంది కార్మికులు పనిచేయుచుండిరి.
కుటీరపరిశ్రమలు : నరసాపూరు, చింతలపూడి తాలూకాలయందు భారీ పరిశ్రమలు లేవు. మిగిలిన తాలూకాల యందు 127 ఫ్యాక్టరీలు గలవు. నూలునేత, నూలు అద్దకము, ఉన్ని వడకుట, నేయుట, పట్టునేత, త్రాళ్ళను పేనుట, నూనె గానుగలు, పొగాకుతో బీడీలు మొదలగు వస్తువులను తయారొనర్చుట, కుండలు జేయుట, తట్ట లల్లుట, పాడి చేయుట, బెల్లము వండుట, జరీ అల్లికలు అల్లుట - ఈ జిల్లాలోని ముఖ్యమగు కుటీర పరిశ్రమలు.
మతము : హిందువులు 15,64,551; క్రైస్తవులు 99,005; ముస్లిములు 34,147 ; జైనులు 4; ఇతరులు 20 మంది. మొత్తము 16,97,727 మంది జనాభా గలదు.
భాషలు : మాట్లాడువారి సంఖ్య : (1) తెలుగు 16,47,308 ; (2) ఉరుదు 22,979; కోయభాష 19,812; తమిళము 1,908 ; హిందీ 1,320; హిందుస్థానీ 1,022; ఒరియా 786 ; లంబాడీ 610; కన్నడము 589 ; మళయాళము 490 ; బెంగాలీ 287 ; మరాఠీ 250 ; కొరవ 220 ; గుజరాతీ, అరబిక్, ఇంగ్లీషు మాట్లాడువారు బహు అల్ప సంఖ్యాకులుగ నున్నారు.
చరిత్ర : పశ్చిమగోదావరి జిల్లా వేంగి దేశములోని భాగమైయుండెను. గోదావరినది వేంగీదేశమును కళింగ దేశమునుండి వేరుచేయుచుండెను. క్రీ. పూ. మూడవ శతాబ్దమునుండి సుమారు నాలుగున్నర శతాబ్దములు ఈ ప్రాంతమంతయు శాతవాహన సామ్రాజ్యములో చేరియుండెను. ఆనాడు గోదావరీ ముఖద్వారమువద్ద ప్రాలూరను రేవుపట్టణముప్రసిద్ధిచెంది యుండెనని “టాలెమీ” అను భూగోళ శాస్త్రజ్ఞుని వ్రాతలనుబట్టి తెలియుచున్నది. ఈ జిల్లాలోని గుంటుపల్లి అను గ్రామములో నొక బౌద్ధ సంఘారామము ఆకాలమందుండి యున్నట్లును, ఆసంఘారామములో “సూయజ్ఞ నాథుడ”ను శ్రమణకుడు బౌద్ధమతాన్ని బోధించినట్లును, అక్కడ దొఱకిన శాసనాలను బట్టి తెలియుచున్నది. శాతవాహనుల తరువాత ఇక్ష్వాకులు ఈ ప్రాంతమునకు పాలకులైరి. వీరు మొదట శాతవాహనులకు సామంతులుగా ఉండిరి. వారు బలహీనులైన సమయములో స్వతంత్రులైరి. తరువాత కృష్ణా, గోదావరీనదుల మధ్యప్రాంతమును బృహత్ఫలాయనులు పరిపాలించిరి. క్రీ. శ. నాలుగవ శతాబ్దములో శాలంకాయనులు వేంగీదేశమున కధిపతులయిరి. వీరికాలముననే వేంగీనగరము రాజధానిగా నిర్మించుకొనబడెను. తరువాత 500 సంవత్సరములవరకు వేంగీనగరము ఆంధ్రపాలకులకు ముఖ్యనగరమై యుండెను. తూర్పు చాళుక్యరాజైన మొదటి అమ్మరాజు రాజధానిని వేంగి నుండి రాజమహేంద్రవరమునకు మార్చెను (క్రీ. శ. 10వ శతాబ్దములో). శాలంకాయనుల తర్వాత విష్ణుకుండినులు అధికారమునకు వచ్చిరి. వీరి రాజధాని ఏలూరునకు సమీపమందున్న దెందులూరు. ఈ వంశపు రాజైన మూడవ మాధవవర్మకు, చాళుక్యరాజైన రెండవ పులకేశికి కొల్లేటి చెరువుదగ్గర పెద్దయుద్ధము జరిగెను. ఆ చాళుక్యులే తరువాత వేంగీచాళుక్యులై ఆంధ్రను పాలించిరి. వీరినే తూర్పుచాళుక్యు లందురు. వీరి తర్వాత 14వ శతాబ్దములో వెలనాటి చోడులు పశ్చిమ గోదావరీ ప్రాంతమును ఏలిరి. 13వ శతాబ్దములో కాకతీయులు ఇతర తీరపుజిల్లాలతోపాటు, వేంగీప్రాంతమును కూడ లోబరచుకొనిరి. కాకతీయులు ఢిల్లీ సుల్తానులచే ఓడింప బడగా, కాకతీయసామ్రాజ్యము ఢిల్లీ చక్రవర్తుల వశమయ్యెను. మహమ్మదీయులను ధిక్కరించి, కొండవీటి రాజులు ఆంధ్రను ఏలిరి. రాజమహేంద్రవరపు రెడ్డి రాజులకు, కొండవీటి రెడ్డిరాజులకు అనేక యుద్ధములు జరుగుచూ వచ్చెను. 1424 లో కొండవీటిరాజ్యము పతనమయ్యెను. ఏలూరుకోట కొండవీటిరాజులు నిర్మించినదే. తరువాత విజయనగర చక్రవర్తులు మిగతా ఆంధ్రప్రదేశముతోపాటు దీనినిగూడ వశపరచుకొనిరి. తళ్ళికోట యుద్ధములో (1565 లో) గోలగొండ సుల్తానులు విజయనగరాధిపతుల నోడించి ఆంధ్రదేశమును లోబరచుకొనిరి. 1628 లో గోలకొండ నవాబుల అనుమతితో డచ్చివారు నరసాపురములో ఇనుప ఫ్యాక్టరీని నిర్మించుకొనిరి. దానికి సమీపములోనున్న మాధవాయిపాలెంలో ఆంగ్లేయులు 1677 లో ఒక ఫ్యాక్టరీని నిర్మించుకొనిరి. నిజాం ఉల్ ముల్కు మరణానంతరము సలాబత్‌జంగును గోలకొండ సింహాసనము ఎక్కించినందుకు వానిచేకోస్తాజిల్లాలు ఫ్రెంచివారి కీయబడెను. తరువాత విజయనగరంరాజు సహాయముతో ఇంగ్లీషు సేనానియగు కల్నల్ ఫోర్డు ఫ్రెంచివారి నోడించి సలాబత్ జంగునుండి కోస్తాజిల్లాలను ఇంగ్లీషువారికి సంక్రమింపజేసెను.
1925 వరకు పశ్చిమ గోదావరిజిల్లా వేరుగా లేకుండెను. ఈ భాగమంతయు కొంత కృష్ణాజిల్లాలోను, కొంత తూర్పు గోదావరిజిల్లాలోను చేరియుండెను. 1925 ఏప్రిల్ 15 వ తేదీన తూర్పుగోదావరి జిల్లానుండి పోలవరం తాలూకాను, కృష్ణాజిల్లా నుండి మిగిలిన తాలూకాలను వేరుచేసి పశ్చిమ గోదావరి యను జిల్లా నేర్పాటుచేసిరి.
చ. హ.
II
చారిత్రక ప్రాముఖ్యముగల స్థలములు :
1. ఏలూరు : ఇది పూర్వము కొంతకాలము రెడ్డి రాజులకు ముఖ్యపట్టణముగ నుండెను. ఇపుడు మ్యునిసిపల్ పాఠశాల, తాలూకా కార్యాలయములున్న తావున రెడ్డిరాజులు కట్టించిన కోటయుండెడిది. అది ఇపుడు శిథిలమైనది. 1480 (క్రీ.శ.) వరకు ఉత్తరమునుండి ఒరిస్సా రాజు సైన్యములును, వాయువ్యమునుండి ముసల్మాను సైన్యములును, పడమటినుండి విజయనగర సైన్యములును ఏలూరు పరిసరప్రాంతమును వశపరచుకొనుటకు యుద్ధములు చేయుచుండెడివి. 16వ శతాబ్దమున ఏలూరు గోలకొండ నవాబులకు స్వాధీనమయినది. ఆతరువాత మొగల్ రాజ్యమునకు దక్కన్ సుబేదారుగా నున్న నిజామునకు లోబడి క్రమముగా బ్రిటిష్ పరిపాలనకు వచ్చినది. బ్రిటిష్ ప్రభుత్వ మేర్పడిన తరువాత ఏలూరు మచిలీపట్నము జిల్లాలో నుండెడిది. 1859 లో దీనిని గోదావరి జిల్లాలో చేర్చిరి. 1925 లో పశ్చిమ గోదావరిజిల్లా ప్రత్యేకముగా నేర్పడిన తరువాత నిది దానికి ముఖ్యస్థానమైనది .
2. పెదవేంగి : ఇది ఏలూరు సమీపమున నున్నది. తూర్పు చాళుక్య రాజ్యమునకు మూలపురుషుడయిన కుబ్జవిష్ణువర్ధనుడు ఇచటనే తూర్పు చాళుక్యరాజ్యమును స్థాపించెను. అతని కాలమునుండి అనగా క్రీ.శ. 642 నుండి 935 సం॥ వరకు నిది ఆ రాజ్యమునకు రాజధానిగా నుండెను. ఇతఃపూర్వము గోదావరి మండలమును పాలించిన సాలంకాయన రాజులకుగూడ వేంగి రాజధానిగా నున్నట్లు తెలియుచున్నది. సాలంకాయనులచే నిర్మితమైన సూర్యదేవాలయ మిచ్చట శిథిలావస్థయందున్నది. ఈ వంశపురాజగు విజయనందివర్మ సూర్యవిష్ణు భక్తుడనియు, ఇచటి విష్ణ్వాలయమున కనేక దానములుచేసి నాడనియు పెదవేంగి శాశనమువలన తెలియుచున్నది. వేంగీనగర మా ప్రాంతమున నుండుటచేతనే ఆంధ్రతీర ప్రదేశమునకు వేంగిమండలమని పేరువచ్చినది.
3. దెందులూరు : ఇది వేంగి సమీపమున నున్నది: విష్ణుకుండినరాజులకు ముఖ్యపట్టణముగా కొంతకాలము గౌరవము పొందినది.
4. నరసాపురము : ఇచట క్రీ. శ. 1665వ సం॥లో డచ్చివారు ఇనుపకార్ఖానాను నిర్మించినారు. 1677 సం॥న నరసాపురమునకు ఉత్తర భాగముననున్న మాధవాయ పాలెమను గ్రామమును, ఆంగ్లేయు లాక్రమించి ఒక ఫ్యాక్టరీ స్థాపించిరి. 1658 లో పరాసువారుకూడ ఒక కర్మాగారమును ఇచట నెలకొల్పిరి.
5. ప్రాలూరు ఓడరేవు : క్రీ. పూ. 3 శతాబ్దము మొదలుకొని సుమారు నాలుగున్నర శతాబ్దములవరకు శాతవాహనరాజులచే పరిపాలింపబడిన ఆంధ్రభూభాగమున పశ్చిమ గోదావరి జిల్లాకూడ ఉండెను. వీరికాలమున గోదావరీ ముఖమునందు ప్రాలూరు అను రేవుపట్టణము ఉండెడిదని టాలెమీ యను గ్రీకు భూగోళశాస్త్రజ్ఞుని వ్రాతలను బట్టి తెలియుచున్నది. కాని ఈ రేవుపట్టణ మిపుడు కనిపించదు. బహుశః ఇది సముద్రగర్భమున కలిసియుండవచ్చును.
6. గుంటుపల్లి బౌద్ధారామము : ఏలూరు తాలూకా గుంటుపల్లిలో శాతవాహనుల బౌద్ధసంఘారామ మొకటి యున్నది. ఇది క్రీ. పూ. మూడవ శతాబ్దమున నిర్మితమైనదని చారిత్రకుల అభిప్రాయము. క్రీ.పూ. రెండవ శతాబ్దమున నీ సంఘారామమున సుయజ్ఞ నాథుడను శ్రమణకుడు బౌద్ధమత ప్రచారము గావించెనని ఇచటి శాసనములనుబట్టి తెలియుచున్నది. ఇపు డిచట ఏకశిలా నిర్మితమైన స్తూపమున్నది. స్తూపముపై నర్ధచంద్రాకారమున నొక హార్మిక, దానిపై ఛత్రాకారమున నొకకప్పు నుండెడివట. అవి ఇపుడు శిథిలమైనవి. బౌద్ధభిక్షువుల నివాసార్థము పరిసరములందు ఆరామములున్నవి. ఈ బౌద్ధ క్షేత్రము హీనయాన బౌద్ధమునకు చెందినదని చరిత్రకారుల యూహ.
7. నిడుదవోలు దుర్గము : వేంగినగరమును రాజధానిగా జేసికొని, తెలుగుదేశమును పాలించిన పూర్వ చాళుక్యరాజుల కాలమున నిడుదవోలు ఒక దుర్గముగా నుండెడిది. క్రీ. శ. 918 వ సంవత్సరమున రాష్ట్రకూటులు ఆంధ్రదేశముపై దండెత్తగా, ఆంధ్రభూపతి చాళుక్య భీముడు నిడుదవోలు దుర్గము నాధారముగా జేసికొని, రాష్ట్రకూటులను పారద్రోలెను. ఇదియే నిరవద్య పురమను నామముతో శాసనములలో కానవచ్చుచున్నది.
పుణ్య క్షేత్రములు : 1. ద్వారకా తిరుమల : ఇది ఏలూరు తాలూకాలో నున్నది. ఇచట కొండమీద వెంకటేశ్వ రాలయము కలదు. దీనికి చిన తిరుపతి యని పేరు.
2. పెనుగొండ : తణుకు తాలూకాలో నున్నది. వైశ్యులకు గొప్ప పుణ్య క్షేత్రము. వైశ్యులకు దేవతయగు కన్యకాపరమేశ్వరి పూర్వము తన్ను తా నిచటనే యగ్నికి యర్పించికొన్నట్లు ఐతిహ్యము గలదు. ఇచట కన్యకాపరమేశ్వరీ ఆలయమున్నది.
3. తడికలపూడి : ఏలూరునకు ఈశాన్యమున 14 మైళ్ల దూరమున నీ గ్రామము గలదు. ఇచ్చట ప్రాచీనకాలపు గంగేశ్వరాలయమున్నది. భీష్ముడు దీనిని నిర్మించెనని వాడుక
ఇవిగాక బలివె, కొండగనిజెర్ల, తేతలి, తీపర్రు, దువ్వ, నత్తారామేశ్వరము, ఆచంట మొదలగు పుణ్యక్షేత్రము లిచట గలవు. ఈ క్షేత్రములందు సంవత్సరమున కొకటి రెండు పర్యాయములు ఉత్సవములు జరుగుచుండును.
ఎం. కు.