సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మూడవ సంపుటము/గోదావరినది II

గోదావరినది - 2:

నీటిపారుదల: విద్యుదుత్పాదక పాటవములు: భారత దేశముయొక్క భవిష్యదభివృద్ధికై అనుసంధింపవలసి యున్న నదీజలములు మనదేశములో ఇంకను పుష్కలముగా గలవు. నీటిపారుదలకు ఉపయోగపడు నదీ జలముల పరిమాణమును శాతరూపములో లెక్కించి ఉదహ

చిత్రము - 118

రించుట కష్టసాధ్యమైన విషయము. భారతదేశమందెల్ల అత్యున్నతముగా అభివృద్ధికి తేబడిన కావేరీనదీ జలములలో ఏడాదికి దాదాపు నూటికి 85 వంతుల జలము పలువిధములుగా వినియోగపడుచున్నది. ఇక గోదావరి జలములో నూటికి 6 నుండి 8 వంతులు మాత్రమే ఉపయోగపడుచున్నది. బ్రహ్మపుత్రానదీ జలముల యుపయోగము దాదాపుగా శూన్యమే. మొత్తము 13560 లక్షల ఎకరము అడుగుల (Million acre ft.) ఉపరితల జలములో దాదాపు 4500 లక్షల ఎకరము అడుగుల నీరును ప్రయోజనకరమయిన కార్యకలాపములయందు ఉపయోగించుటకు సాధ్యమగును. ప్రథమ పంచవర్ష ప్రణాళిక (1951-1956) కు పూర్వము 880 లక్షల ఎకరము అడుగుల జలము మాత్రమే ఉపయోగములోనికి తేబడినది.

గోదావరీనది - ఆరగాణి, విసర్జనము (Catchment and Yield) : పశ్చిమ కనుమలపై నుండి అవరోహించిన తరు వాత, గోదావరినది ఆగ్నేయదిశగా 766 మైళ్ళ దూరము ద్వీపకల్పము మీదుగా ప్రవహించి, తుదకు బంగాళాఖాతములో కలియుచున్నది. గోదావరి యొక్క ఆరగాణి విస్త్రీర్ణము 1,16,366 చ. మైళ్ళు అనగా, దాదాపు భారతదేశముయొక్క విస్తీర్ణములో 1/9 వ వంతు. ఈ నది ప్రవహించు వేర్వేరు రాష్ట్రములలో దానియొక్క ఆరగాణి విస్తీర్ణము, దానియొక్క పొడవు ఈక్రింద ఉదాహరింపబడినవి—

రాష్ట్రము ఆరగాణి విస్తీర్ణము (catchment area) చ. మైళ్ళలో. నదిపొడవు మైళ్ళలో.
బొంబాయి 57,252 398
ఆంధ్రప్రదేశ్ 26,066 368
మధ్యప్రదేశ్ 24,670 - ఉపనదులు
ఒరిస్సా 6,749 - కలియుట
మైసూరు 1,629 - సంభవించును
మొత్తము 1,16,366 766
గోదావరీ నదీ ప్రవాహ ప్రాంతములో ఎక్కువ భాగము నైరృతి (జూన్-సెప్టెంబరు) ఋతుపవనముల కాలములో గరిష్ఠ వర్షపాతమును, ఈశాన్య ఋతుపవనముల కాలములో కొద్ది వర్షపాతమును పొందును. తత్పర్యవసానముగ గోదావరీనది, జూన్-సెప్టెంబరు నెలలనడుమ తననీటిలో అత్యధికభాగము గ్రహింప

గలుగుచున్నది. సామాన్యముగా వరదల ఉధృతము సెప్టెంబరు మాసములోను, సకృత్తుగా అక్టోబరులోను సంభవించును. ఈశాన్య ఋతుపవనముల కాలము ముగియుట తోడనే గోదావరీనది 2,107,660 క్యూసెక్కుల (cusecs) గరిష్ఠ ప్రవాహమునుండి 5,100 క్యూసెక్కుల కనిష్ఠ ప్రవాహమువరకు క్రమముగా తగ్గుచు పోవును. (ధవళేశ్వరమువద్ద వర్షేతరకాలపు సగటు ప్రవాహమును పరిశీలింపగా తేలిన ఫలితము). గోదావరినదిలో చేరు ఉపనదుల పట్టిక ఈ దిగువన ఉదాహరింపబడినది. ఈ ఉపనదుల పేళ్ళకు ఎదురుగా వాటి అరగాణి విస్తీర్ణమును, ప్రధానమైన తల్లినదికి వాటియొక్క ఉపనదులు సేకరించిపెట్టు జలపరిమాణమును పేర్కొనబడ్డవి —

వరుస సంఖ్య ఉపనది పేరు ఆరగాణి విస్తీర్ణము చ. మైళ్ళు సేకరణ జలము
1. శివనా 1,050 -
2. పూర్ణ 6,100 -
3. ప్రవర 6,575 -
4. సింధుఫనా 1,490 -
5. మంజీర 11,700 5%
6. మానేరు 1,565 -
7. పెనుగంగ 17,300 -
8. వార్ధా మరియు ప్రాణహిత 22,800 40%
9. ఇంద్రావతి 15,700 20%
10. శబరి 7,500 10%
11. ఇతరములు 8,500 -
12. ప్రధానమైన గోదావరీనది 20,086 -

ఈ ఉపనదు లన్నిటియొక్క మూలమున గోదావరీ నది బ్రహ్మాండముగా ప్రవర్ధిల్లినది. గోదావరీ నదీజలములను ఇంతవరకు దాదాపు వినియోగింప లేదనియే చెప్పవచ్చును. ధవళేశ్వరమువద్ద నిర్మింపబడిన ఆనకట్ట మూలమున నూటికి 6 నుండి 8 వంతులవరకును, ఈ శతాబ్దారంభమున (1911 నుండి 1931 వరకు) నదికి ఎగువ భాగమున నిర్మింపబడిన ప్రాజెక్టుల మూలమున నూటికి 5 వంతుల వరకును మాత్రమే గోదావరీ జలము వినియోగములోనికి వచ్చుచున్నది. ఏడాదికి 18,500 లక్షల ఘనపు టడుగుల అమూల్య జలము ఈ లోయగుండా ప్రవహించుచు, అదుపులో లేకయు, వినియోగపడకయు, వ్యర్థముగా బంగాళాఖాతమున కలియుచున్నది.

ఈ లోయయందు ప్రస్తుతము పనిచేయుచున్న ప్రాజెక్టుల వివరములు, వాటియొక్క శక్తిపాటవములు ఈ క్రింద ఉదాహరింపబడినవి :

వరుస సంఖ్య ప్రాజెక్టు పేరు. నికరపు పెట్టుబడి వ్యయము రూపాయలలో. సాగయ్యెడి భూమి వైశాల్యము
1. వాఘా ఆనకట్ట 6,83,800 4,581
2. దార్నా ఆనకట్ట 34,27,465 60,442
3. రామ్‌తక్ ఆనకట్ట 12,62,986 14,895
4. ఖైరాబంద్ ఆనకట్ట 1,96,597 5,702
5. చందాపూర్ ఆనకట్ట 2,01,200 10,891
6. ఆసోలామెంథ్ ఆనకట్ట 6,01,211 24,500
7. జూనానయా ఆనకట్ట 2,89,695 5,858
8. ఘోర్ ఝేరి ఆనకట్ట 1,79,841 4,308
9. సారథి ఆనకట్ట 4,78,778 8,995
10. చరభోమర ఆనకట్ట 4,17,068 6,690
11. బడల్ కసా ఆనకట్ట 1,63,164 6,869
12. విల్సన్ ఆనకట్ట 84,14,188 55,934
13. రాయనపల్లి ఆనకట్ట 3,17,531 1,250
14. బోరి ఆనకట్ట 10,67,262 6,312
15. నిజాంసాగర్ ఆనకట్ట 2,18,48,000 2,75,000
16. ధవళేశ్వరము ఆనకట్ట 2,20,00,000 11,30,500
17. మానేరు ఆనకట్ట 9,77,000 17,250

ప్రప్రథమముగా, అవిభక్త మద్రాసు రాష్ట్రప్రభుత్వ కాలములో గోదావరినదిపై, ధవళేశ్వరముయొద్ద 1857 సం॥లో ఒక పెద్ద ఆనకట్ట నిర్మింపబడినది. ఈ ఆనకట్ట నిర్మాణమునకై వెచ్చించిన పెట్టుబడిఖర్చు సుమారు 2.20 కోట్లరూపాయలు. ఇదెంతో ప్రయోజనకరమయిన ప్రాజెక్టు. దీనివలన మొదటి పంటక్రింద 8,80,500 ఎకరముల భూమి సాగుచేయబడుచున్నది. రెండవ పంటక్రింద 2,50,000 ఎకరముల భూమిసాగగుచున్నది. దీనికితోడుగా గోదావరి కాలువలు ఏడాదిలో పదకొండు మాసములు ప్రవహించుచుండుటచే, సంవత్సరమునకు 27 కోట్ల రూపాయల విలువగల వ్యాపారము జరుగుటకు ఇవి రవాణా సౌకర్యములు కలిగించుచున్నవి.

గోదావరియొక్క ప్రధానమైన ఉపనదు లన్నిటిలో 'మంజీర' మిక్కిలి గొప్పది. ఈ మంజీర నదికి అడ్డముగ హైదరాబాదు ప్రభుత్వమువారు నిర్మించిన నిజాంసాగరు ప్రాజెక్టు ప్రప్రథమమైనదేగాక, ఆనకట్టలలో ఇది బ్రహ్మాండమైనదిగా నున్నది. ప్రస్తుతము నిర్మాణమందున్న ప్రాజెక్టుల యొక్కయు, నిర్మాణము చేయదలచిన ప్రాజెక్టుల యొక్కయు వివరములు ఈ క్రింద పేర్కొనబడినవి :

వరుస సంఖ్య ప్రాజెక్టు పేరు ఎకరములు లక్షల సంఖ్యలో వినియోగము వేల మిలియన్లలో
ఎ. నిర్మాణములోనున్న ప్రాజెక్టులు :
1. గంగాపూర్ ప్రాజెక్టు 0.50 7.00
2. పూర్ణా ప్రాజెక్టు 1.55 30.00
బి. నిర్మింపదలచుకొన్న ప్రాజెక్టులు:
1. మధ్యరకపు పోచంపాడు ప్రాజెక్టు 3.60 -
2. ప్రవరబేసిన్ :
(ఎ) మూలప్రాజెక్టు 1.30 27.00
(బి) హీరంగాన్ పికప్ వేర్ 0.10 2.00
3. పూర్ణాబేసిన్ 0.80 11.00
4. మంజీర (రెండుస్కీములు) 0.10 2.00
5. సింధుఫానా (5 స్కీములు) 0.70 10.00
6. శివానాబేసిన్ (5 స్కీములు) 0.30 5.00
7. గోదావరి జయకావాడి 4.50 70.00
మొత్తము 11.40

ఇవిగాక గోదావరి నదిమీద రామపాదసాగర్, ఇచ్చం పెల్లి ప్రాజెక్టులు నిర్మింపవలెనని ఇప్పటికిని ప్రభుత్వ మాలోచించుచున్నది.

పోచంపాడు ప్రాజెక్టు : ఆంధ్రదేశమున తెలంగాణము వెనుకబడిన ప్రాంతముగ నెంచబడుచున్నది. ఈప్రాంతము యొక్క అభివృద్ధి నిమిత్తమై పోచంపాడుగ్రామ సమీపముననున్న గోదావరి నదీజలములలో అధికభాగము వినియోగింపవచ్చును. ఈ ప్రాంతము, 'హైద రాబాదు - నాగపూరు నేషనల్ హైవే (జాతీయ రహదారి) మీద నది ఎగువన సోన్ బ్రిడ్జికి మూడుమైళ్లదూరములో నున్నది. ఈ స్థలమువరకుగల ఆరగాణి విస్తీర్ణము 35,425 చ. మైళ్లు. ఇచ్చట ఏడాదికి 500 వేల మిలియనుల ఘ. అడుగుల గోదావరీజలము లభ్యము కాగలదు. నిర్మాణదశయందున్న ఎగువప్రాజెక్టుల మూలమునను, నిర్మాణము చేయదలచిన ప్రాజెక్టుల మూలమునను, ప్రస్తుతము 269 వేల మిలియనుల ఘ. అడుగుల నీరుమాత్రము లభ్యము కాగలదు.

పూర్తి స్కీము : పోచంపాడు ప్రదేశమున ఆనకట్ట నిర్మించు నవకాశములను గూర్చియు నీటిపారుదలకును విద్యు దుత్పాదకమునకును ఇరుప్రక్కల కాలువలు త్రవ్వించు నవకాశములనుగూర్చియు ఇటీవలనే పరిశోధనలు జరుపబడినవి. పరిశోధకుల సూచన లీ క్రింద పొందు పరచబడినవి :

(1) పోచంపాడువద్ద నిర్ణీతమయిన స్థలములో గోదావరి నదీగర్భమున అదనపునీరు బయటికి పొర్లిపోయెడు కట్టడమును (మేసన్రీ స్పిల్ వే సెక్షన్) నిర్మించి, నదికి ఇరుప్రక్కల ఎత్తయిన మట్టికట్టలు నిర్మించుట; ఆనకట్టల సమీపమున నదికి ఇరువైపుల 60,000 కిలో వాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేయగల 'పవర్ హౌస్ 'ను నిర్మించుట.

(2) 'గోదావరి నార్త్ కెనాల్' (గోదావరి ఉత్తరపు కాలువ) అను పేరుతో ఒక ఎడమఒడ్డు కాల్వను త్రవ్వుట; ఈ కాలువ 27,000 కిలోవాట్లవిద్యుచ్ఛక్తిని 75 శాతము 'లోడ్ ఫాక్టరు' చొప్పున (at 75% load factor) ఉత్పత్తి చేయగలిగి, 21,000 ఎకరముల భూమిని సాగుచేయగల 1400 క్యూసెక్కుల నీటిని విడుదల చేయగలిగి యుండగలదు. దీనికి తోడుగా అది అంత్యభాగమున (in the tail reach) 1,03,000 ఎకరముల భూమికి నీటిపారుదలను కల్పింపగలదు. అనగా, కదమ్ రిజర్వాయరుయొక్క ఎడమపార్శ్వమునుండి త్రవ్వబడిన కాలువ నుండి 47 నుండి 79 మైళ్ళ దూరమునగల పంట భూములకు గూడ ఈ కాలువనీరు సరఫరా కాగలదు. ఇదియే కాక, ఈ రిజర్వాయరుక్రింద ఇదివరకే స్వతస్సిద్ధముగా నున్న జలముతో 65,000 ఎకరముల భూమి తడుపబడు చుండుటచేత, మొత్తముమీద నీటినిపొందు భూమి 1,89,000 ఎక రము లగుచున్నది.

(3) 'గోదావరి సౌత్ కెనాల్' (గోదావరి దక్షిణపు కాలువ) అను పేరుతో 251 మైళ్ళు నిడివిగల కుడి పార్శ్వపు కాలువను నిర్మించుటకుగూడ పథకము నిర్ణయింపబడెను. ఈ కాలువ నిజామాబాదు, వరంగల్, నల్లగొండ, ఖమ్మం జిల్లాలలోని 18,06.000 ఎకరముల పంటభూమిని సాగు చేయుటకై 17,240 క్యూసెక్కుల నీటిని విడుదల చేయునట్లు ఏర్పాటు గావింపబడెను. ఈ కాలువకు చెందిన ముఖ్యమైనశాఖలలో నొకటి కరీంనగరముజిల్లాలో విద్యుదుత్పాదకశాఖగా నుండి మొత్తము మీద 290 అడుగుల ఎత్తుగల మూడు జలపాతములు కలిగి, 20,000 కిలోవాట్ల విద్యుచ్ఛక్తిని జనింపజేయునదిగా నుండగలదు. 'మోరువంచశాఖ' అను మరియొక కాలువ, గోదావరి కృష్ణా లోయలను విడదీయు గట్టుల వరుసగుండ ప్రవహించుచు, కేవలము భూమిని సాగుచేయుటకు వలసిననీటిని మాత్రమే సరఫరా చేయును. ఈ కాలువ ద్వారా 2.68,000 ఎకరముల భూమిని సేద్యము చేయుటకు చాలిన 2473 క్యూసెక్కుల నీరు విడుదల చేయబడును. మొత్తముమీద ఈ కాలువక్రింద 7,91,450 ఎకరముల భూమి సేద్యముకాగలదు.

మధ్యరకపుప్రాజెక్టు: మూడుసంవత్సరములలో పూర్తిచేసి ఫలితములను పొందగలిగిన మధ్యరకపు ప్రాజెక్టులకు గోదావరీనదీజలము ఉపయోగపడునట్లు పథకమును నిర్ణయించుట యే ఇప్పటి సూచనల యుద్దేశము. ఈ సూచన లీ క్రిందివిధముగా నుండును :

(1) 2,500 అడుగుల నిడివిగల సిమెంటు కాంక్రీటు ఆనకట్టను (masonry weir) నదీ గర్భములో నిర్మించి, నీటి ప్రవాహమును కాలువలోనికి మరలించుటకై తెరచుటకును, మూయుటకును వీలయిన 6 అడుగుల నమూనా తలుపులను (6 ft lift-type collapsible shutters) అమర్చవలెను.

(2) 'పోచంపాడు దక్షిణపు కాలువ' అను 68 మైళ్ళ నిడివిగల కుడి పార్శ్వపు కాలువను నిర్మించి నిజామాబాదు, కరీంనగరం జిల్లాలలోని 3,60,000 ఎకరముల భూమిని సాగుచేయుటకు చాలినంతగా, 4260 క్యూసెక్కుల నీటిని విడుదల చేయవలెను.

కె. సో.