సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మూడవ సంపుటము/గోదావరినది I

గోదావరినది - 1

గోదావరి దక్షిణ హిందూదేశములోని నదులన్నింటి కంటె చాలా పెద్దది. భారత దేశములోనెల్ల పెద్దదైన గంగానది తరువాత ఈనదియే చెప్పదగినది. గోదావరిని కూడ గంగవలెనే ప్రజలు చాల పవిత్రమైనదానినిగా ఎంచుదురు. దీనిలో స్నానముచేయుటకు ప్రజలు అనేక ప్రాంతములనుండి వచ్చుచుందురు. గంగా యమునా సరస్వతులతో పాటు గోదావరికూడ రామాయణములో అనేకచోట్ల పేర్కొనబడినది. ఈ నదీతీరమునను, తత్పరి సరపు అడవులయందును ఘటిల్లిన అనేక విశేషములు ఆ గ్రంథమున వివరింపబడినవి.

ఈనది పడమటి కనుమలలో బొంబాయికి ఈశాన్య దిశగా సుమారు 70 మైళ్ళ దూరములో త్రియంబకము అనుచోట ఒక కొండలో పుట్టి ఆగ్నేయదిశగా ప్రవహించి రాజమహేంద్ర వరమునకు తూర్పుగా 50 మైళ్ళ దూరమున బంగాళాఖాతములో కలియుచున్నది. ఇది పుట్టిన చోట నీరు ఒక శిలాప్రతిమనుండి వెలువడుచుండును. ఈ నదియొక్క పరీవాహ ప్రదేశము సుమారు 1,20,000 చ. మైళ్ళు. అనగా ఇది ఆంధ్రప్రదేశ వైశాల్యమునకంటె కొంచెము పెద్దది.

ఈ నదిపొడవు 900 మైళ్ళు, దీనికి అనేక ఉపనదులు గలవు. వాటిలో మంజీర, ప్రాణహిత, ఇంద్రావతి, శబరి అనునవి ముఖ్యమైనవి. మంజీర కుడివైపునుండియు, తక్కినవి ఎడమవైపునుండియు ఈనదిలో కలియుచున్నవి. అంతిమ ఉపనదియైన శబరి ఈనదిలో కూనవరమువద్ద పడుచున్నది. శబరి కలిసినచోటు నుండి ఈనది తూర్పు కనుమలను చీల్చుకొని అనేకములైన మెలికలతో, ఎత్తుపల్ల ములతోనిండిన ఒక ఇరుకైన లోయగుండా సుమారు 25 మైళ్లు ప్రవహించి, పోలవరమువద్ద సమతల ప్రాంతమున ప్రవేశించుచున్నది. ఈ లోయకు ఇరుప్రక్కల సుమారు 2,000 అడుగుల ఎత్తుకల్గిన కొండలు నిట్ట నిలువుగా ఉన్నవి. వీటినే పాపికొండలు అందురు. మొదటి నాలుగు మైళ్ళవరకు ఈ లోయ వెడల్పు ఒక ఫర్లాంగు మాత్రమే. వాన కాలములో ఈ ఇరుకైన లోయలో నీటి లోతు 3,000 అడుగులు ఉండును. కొండలగుండా పెక్కు మలుపులు తిరుగుచు ప్రవహించుట వలన, సుందరమైన సరస్సులు నదికి ఇరుప్రక్కలయందు ఏర్పడినవి. ఈ ఇరుకైన లోయలో నీరు అతివేగముగా ప్రవహించును. లాంచీలు, స్టీమర్లు, పడవలు ఈ లోయలో మిక్కిలి జాగ్రత్తగా వెళ్ళును. ఇరుప్రక్కల ఎత్తైన కొండలు కలిగిన ఈలోయ చూచుటకు చాల భయంకరముగా ఉండును. ఒకప్పుడు సముద్రము ఈ లోయవరకు వ్యాపించి ఉండెడి దని భూగర్భశాస్త్రజ్ఞుల అభిప్రాయమై యున్నది.

ఇంచుమించు పోలవరమువరకు ఈనది ఎగుడుదిగుడు ప్రాంతముగుండ పెక్కు వంపులు తిరుగుచు ప్రవహించి అక్కడినుండి సమతల ప్రాంతముగుండ పారుచున్నది. పోలవరమునుండి ఈ నదియొక్క వెడల్పు విస్తారముగా పెరుగుచున్నది. దీనివెడల్పు పోలవరమువద్ద ఒక మైలు, రాజమహేంద్రము వద్ద 2 మైళ్ళు, ధవళేశ్వరము వద్ద 4 మైళ్ళు.

ధవళేశ్వరమునకు దిగువున ఈనది గౌతమి, వాసిష్ఠ అను రెండు పాయలుగనై చీలినది. గౌతమి తూర్పుగా 45 మైళ్ళు ప్రవహించి వృద్ధగౌతమి, కోరింగనది అను మరి రెండు పాయలయినది. ఈరెండు పాయలు సముద్రములో కలియుచున్నవి. వాసిష్ఠ దక్షిణ దిక్కుగా 50 మైళ్ళు ప్రవహించి, నర్సాపురమువద్ద సముద్రములో కలియుచున్నది. దీనినుండి కూడ వైనతేయము అను మరియొక పాయవీడి సముద్రములో కలియుచున్నది. గౌతమి, వాసిష్ఠ అను పాయలమధ్యనున్న అమలాపురము రాజోలుతాలూకాలకు మధ్య డెల్టా అనియు, గౌతమికి తూర్పునగల కాకినాడ, రాజమహేంద్రవరము తాలూకాలకు తూర్పు డెల్టా అనియు, వాసిష్ఠకు పడమట ఇంచు మించు ఏలూరువరకు ఉన్న భూమిని పడమటి డెల్టా అనియు అందురు.

గోదావరి నదిలో ఎక్కువగ వండలిమట్టి కలదు. నది వరదలకు లోనైనప్పుడు ఈ వండలిమట్టి విస్తారముగా ఉండును. ఇది చాల సారవంతమైనట్టిది. నది విస్తరించి సమతల ప్రాంతముగుండ ప్రవహించునప్పుడు వేగము మందమై మేటవేయుట వలన అనేకములగు లంకలు ఏర్పడినవి. ఈ లంకలలో పొగాకు మొదలయినవి పండించెదరు. వీటిలో ముఖ్యమయినవి శబరిలంక, పిచుకలలంక, బొబ్బరిలంక, ఊబలంక అనునవి.

ఈ నదిపై దుమ్ముగూడెము, ధవళేశ్వరము అనుచోట్ల ఆనకట్టలును, రాజమహేంద్రమువద్ద ఒక రైల్వేబ్రిడ్జియు గలవు ధవళేశ్వరమువద్ద ఆనకట్ట 1852 సం. లో సర్ ఆర్థర్ కాటన్ అను ఇంజనీరు కట్టినాడు. ఈ ఆనకట్ట కట్టుటకు పూర్వము గండ్లుపడి, నీరు డెల్టా ప్రాంతమం దంతటను ప్రవహించెడిది. కొంతవరకు ఆ నీటిని వ్యవసాయమునకు ఉపయోగించెడివారు, నది, వరదలకు లోనైనప్పుడు భూములన్నియు మునిగిపోయెడివి. ఆనకట్ట కట్టుటవలన ఇపుడు సుమారు 112 లక్షల ఎకరముల భూమి సాగు అగుచున్నది. ఇప్పుడు నూటికి ఏడువంతులు నీరు మాత్రమే వినియోగింపబడుచున్నది. తక్కిన 93 వంతుల నీరు వృథాగా సముద్రములో కలియుచున్నది. రాజమహేంద్రవరమునకు 20 మైళ్ళ దూరములో నదికి ఎగువన పోలవరము వద్ద 'రామపాదసాగర్' అను ఒక ఆనకట్ట నిర్మింపవలెనని సుమారు 10 సంవత్సరముల క్రిందట కొంతప్రయత్నము జరిగినది. దానిక్రింద సుమారు 10 లక్షల ఎకరముల భూమి సాగుచేయబడగలదని ఇంజనీర్లు అంచనా వేసిరి. ప్రాజెక్టు నిర్మాణమునకు ముందు కొన్ని పరిశోధనలు జరుపగా 2,000 అడుగుల లోతువరకు అడుగున రాతినేల లేదని తేలినది. అంత లోతువరకు పునాదులు తీసికట్టుటకు కోట్లకొలది రూపాయలు ఖర్చుచేయ వలసి యుండునని ఈ రామపాదసాగర్ ప్రాజెక్టును కట్టు నుద్దేశము పూర్తిగా మార్చుకొనబడినది.

క్రొత్త ప్రాజెక్టు పోలవరమువద్ద కాక ఇప్పూరు అను మరియొక చోట కట్టుటకు రెండు, మూడు సంవత్సరముల నుండి కొన్ని పరిశోధనలు జరుపుచున్నారు. ఇక్కడ రాతినేల 50-60 అడుగుల లోతుననేకలదు. ఇక్కడ ఒక ఆనకట్టయును, పోలవరమువద్ద ఒక బేరేజియు కట్టవలెనని ప్రభుత్వమువారికి సంకల్పముకలదు. పోలవరము వద్ద కట్టబోవు బేరేజినుండి కాలువలు పోవును. ఈ ప్రాజెక్టు కట్టినను నూటికి ముప్పదివంతులు నీరు మాత్రమే వినియోగింప బడును.

గోదావరీ నదీద్వారమునను, దాని కాలువల ద్వారమునను, సగటున సంవత్సరమునకు 2 కోట్లరూపాయల విలువ కలిగిన సరకులును, 2 కోట్లరూపాయల విలువ కలిగిన కలపయు రవాణా అగుచున్నవి.

గోదావరీ నదియొక్క పరివాహ ప్రాంతమున బొగ్గు విస్తారముగా దొరకుచున్నది. అదికాక యీ ప్రాంత మంతయు దట్టమైన అడవులతో నిండిఉన్నది. క్రొత్తగా నిర్మింపనున్న ప్రాజెక్టులనుండి జలవిద్యుచ్ఛక్తి లభించును. ఈ విద్యుచ్ఛక్తిని ఈ ప్రాంతమున లభ్యమగు ఖనిజములను, అటవీ సంపదను వినియోగించి అనేక పరిశ్రమలు నెలకొల్పవచ్చును. మెట్టభూములను సాగుచేయుటకును, నీటిని పంపులమూలమున సరఫరా చేయుటకును ఈ విద్యుచ్ఛక్తి ఉపయోగపడును. నూటికి 93 వంతులు వృథా అగుచున్న గోదావరి నీటిని క్రొత్త ప్రాజెక్టులు కట్టి ఎంతేని వినియోగించుకొనవచ్చును.

వి. వి.

— ఆంధ్రభూభువన మధ్యమున గోదావరినదీశాఖాతీరము నంటియున్న భీమమండలీ క్షేత్రము పరమపవిత్రము, సకల దేవతానిలయము, వివిధ సస్యారామ సమృద్ధమునగు దేశము. భీమమండల మనగా దక్షారామ భీమేశ్వరుడు నెలకొనియున్న తావునుండి చుట్టును ఇరువదినాలుగు మైళ్ళ దూరమునందున్న ప్రదేశము. ఈ మండలమునకు తూర్పున భైరవపాళెపు సముద్రము, దక్షిణమున అంత ర్వేదిపుణ్య క్షేత్రము, పశ్చిమమున రాజమహేంద్రవరము, ఉత్తరమున పిఠాపురము సీమలుగా నున్నవి. రాజమహేంద్రవరమునకు రెండుకోసులు క్రిందనుండి గోదావరీనది 'గౌతమి' 'వసిష్ఠ' యను పేళ్ళతో రెండుశాఖలుగా విడి ప్రవహింపజొచ్చినది. ఈ గౌతమీ శాఖనుండియే యిటు నటు మరియైదు శాఖలు బయలుదేరినవి. ఇవియన్నియు కాకినాడకు అంతర్వేదికి నడుమ నుండెడి తూర్పుసముద్రములో కలియుచున్నవి. ఆ శాఖలు : 1. తుల్య, 2. ఆత్రేయి, 3. భారద్వాజ, 4. గౌతమి, 5. వృద్ధగౌతమి, 6. కౌశికి, 7. వసిష్ఠ యనునవి యేడు. ప్రధానశాఖలయిన గౌతమీ వసిష్ఠల నడుమ నుండెడి ప్రదేశమును ప్రాచీనకాలమున కోనమండలమనియు, రెండేర్ల నడిమి విషయమనియు వ్యవహరించిరి. ఇపుడా ప్రదేశమును 'కోనసీమ' యని వ్యవహరించు చున్నారు. గౌతమీ శాఖలలో నొకటియగు కౌశికీనదీశాఖ ప్రధానముగ నీ కోనసీమలోని ప్రతి గ్రామమును జుట్టి ప్రవహించినది. ఈ కౌశికిశాఖకు ప్రారంభము 'పలివెల' కొక క్రోసు మేర పయిన 'మందపల్లి ' యను క్షేత్రమునుండి మొదలిడినది. ఈ శాఖాతీరమున ప్రసిద్ధములైన ఈశ్వరమూర్తులు, అగస్త్యప్రతిష్ఠితులైన మందేశ్వర కొప్పులింగేశ్వరులు, వ్యాఘ్రేశ్వరుడు, ఈ నదీశాఖ సముద్రమున గలిసిన విష్ణు సంవేద్యమున రామలింగేశ్వర లక్ష్మణేశ్వరులును గలరు.

చి. పా. శా.