సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మూడవ సంపుటము/గోండులు

గోండులు :

అనాదిగానున్న అనాగరక జాతులలో జనసంఖ్యను బట్టియు, చరిత్రనుబట్టియు ప్రాముఖ్యము వహించిన 'గోండులు' లేక 'రాజగోండులు' అనుతెగ అతి ప్రధానమైనది, 'గోండ్వానా' అను ప్రదేశము గోండులయొక్క జన్మభూమి. దీనియందు సాత్పురా పీఠభూమి, నాగపూరు మైదానములలో కొంతభాగము, పశ్చిమ దక్షిణములందు నర్మదానదిలోయ చేరియున్నవి. వీరు మహాదేవుడే తమ మూలపురుషుడని చెప్పుకొందురు, మహాదేవుడు 'లింగో' అను తన ముఖ్య ప్రతినిధిద్వారా వీరిని వివిధశాఖలుగా విభజించెనని చెప్పుదురు. గోండులకు వెడల్పుగా గుండ్రమైన గుండెకాయవంటి ముఖము, ఎత్తైన దౌడఎముకలు, సాధారణముగా చిన్నవిగానుండు చట్టిముక్కులు, నొక్కుల జుట్టు ఉండును. శరీరము రాగివర్ణముతో కలిసిన బూడిద వర్ణముగా నుండును.

గోండులయొక్క పూర్వగాథ పూర్తిగా తెలియదు. కాని 'ఐనీ అక్కరీ' అను గ్రంథములో 'చాంద' అనునది గోండు సామంతరాజ్యముగా పేర్కొనబడినది. ఔరంగజేబు కాలములో ఈ 'చాంద', 'ది యోగర్' అను ప్రదేశములు బీరారు సుబాలో చేర్చివేయబడినవి, మొగలురాజుల కాలములో ఇంచుమించుగా స్వేచ్ఛ ననుభవించిన ఈ రాజ్య స్వాతంత్ర్యము మహారాష్ట్ర విజృంభణముతో అంతమొందినది. 1749 లో 'చాంద' పట్టణము మహారాష్ట్ర సైనికుల ముట్టడికి లొంగిపోయి వారికి స్వాధీనమయ్యెను. మరి రెండు సంవత్సరముల తరువాత ఈ రాజ్యము భోన్ల్సే రాజ్యములో కలిపివేయబడి గోండుల కడపటిరాజు ఖైదీ చేయబడెను. గోండ్వానారాజ్యము హైదరాబాదులోని ఆదిలాబాదు జిల్లాయందలి రాజూరా తాలూకావరకు వ్యాపించియున్నట్లు కనిపించుచున్నది. ఈ రాజ్యములో 'మానిక్‌గడ్' (మాణిక్యగడము) అను కోట ముఖ్యమైనది

చిత్రము - 115

పటము -1

గోండు రాజులు పర్వతాగ్రమున నిర్మించిన “మాణిక్ ఘర్ దుర్గము" (శిథిలావశేషము - అరణ్యమయము)

గోండులు పాలకజాతిగా నున్నంతవరకు వారి జీవన ప్రమాణము, భౌతికసంపద ఎంతమాత్రము తీసికట్టుగా లేనట్లు కనబడును. అనాగరికులైన గోండులు పలురకములైన ఆహారపదార్థములను సమకూర్చుకొందురు. వారు అడవులనుండి పువ్వులు, పండ్లు, ఆకులు, దుంపలు, మొదలైనవి సమృద్ధిగా సంపాదించెదరు. అట్లే వారి ఆహారమందు చిన్నవి, పెద్దవి పలురకములగు జంతువులుకూడ చేరియున్నవి. గుట్టలయందుండు గోండులు తమ వ్యవసాయమును ఒక ప్రదేశమునుండి మరియొక ప్రదేశమునకు మార్చుచు స్వల్ప పరిమాణములలో ధాన్యములను పండించుచున్నారు.

చిత్రము - 116

పటము - 2

గోండు వనిత. బరువుగల వెండినగలు ధరించుట, అందమైన రంగుచీరలను ధరించుట గోండు వనితల కెక్కువ మోజు

గోండులలో రెండు ముఖ్యమైన విభాగము లున్నవి. వాటిలో 'ధూర్వే' గోండులు ఒక తెగ. వీరిపై నాగరకతా ప్రభావము పనిచేయలేదు. వీ రింకను అడవులలోనే యున్నారు. రెండవ తెగవారైన 'రాజ' గోండులు మైదానములలో నివసించుచు వ్యవసాయ భూములను కలిగియున్నారు. వృత్తులను బట్టి గోండులు అనేక విధములగు గుంపులుగా విడివడి యున్నారు. అగరియా (కమ్మరి), ఓఝా, బైజా (సోదె చెప్పువారు), పర్ధాన్ (పురోహితులు), సోలహా (వడ్రంగులు), గౌరి (గొల్లవారు), భుంజియా, ఖైర్వారు, నాగరేటి మొదలైన గుంపులు కలవు.

పల్లెటూరిలో శయన మందిరములఏర్పాటు గోండుల సాంఘికసంస్థ లన్నిటిలో విచిత్రమగు ప్రయోజనకర సంస్థ. ఈ శయనమందిరములను 'గోతుల్' అనెదరు. బస్తర్‌కు చెందిన 'మురియ', 'మారియా' అను గోండులలో వివాహితులు కాని యువతీ యువకులకు ప్రత్యేకమైన గృహములు కట్టబడి యుండును. 'మురియా గోతుల్' అను గృహమునకు పెండ్లికాని బాల బాలికలు పోవుచుందురు. గృహేతర ప్రదేశములలో పగటి భోజనముచేసి బాలబాలికలు ఒకచోట సమావేశ మయ్యెదరు. తల్లిదండ్రు లెవ్వరు వారి పుత్త్రీపుత్రులను యీ 'గోతుల్' ను దర్శించుటకు అభ్యంతర పెట్టరు. ఆ సంస్థ జయప్రదముగా పనిచేయుటకు పెద్దల ప్రోత్సాహమును, సంఘముయొక్క అనుమతియు ముఖ్యకారణములయి యున్నవి. 'మురియా' యువతీయువకులు 'గోతుల్' ను తప్పక దర్శింపవలయును. అట్లుగాక తగినంత కారణము లేనిదే యచటికివచ్చుట మానిన యెడల అట్టివారికి, జరిమానా విధింపబడును. ఇట్లు నిరంతర సహవాసమువలనను, సాహచర్య కలిమివలనను గోతుల్ గృహంతర వర్తనులగు పడుచువారు కామ ప్రకోపితులగుట సహజముగా సంభవించును. విధాయకముగ వారు సంగమ కార్యములును జరుపుదురు. కాని ఒకే గుంపునకు చెందిన యువతీయువకులమధ్య ఇట్టి యువతీయువకుల మధ్య ఇట్టి

చిత్రము - 117

పటము - 3

దండారి అను పంట కోతలసమయములో గోండులు తెలుపు, నలుపు రంగులు పూసికొని నెమలియీకల కిరీటము ధరించి కావించు వినోదలీలావిలాస నృత్యములు.

అన్యోన్య సాంగత్యము తీవ్రముగా నిషేధింపబడుచున్నది.

యువతీ యువకులు కొన్ని సంవత్సరములవరకు పరస్పరము అతి సన్నిహితముగానుండి ఒకరిని గురించి యొకరు తెలిసికొను అవకాశము కలిగిన తరువాతనే వారిరువురకును వివాహము జరుగును. దీనివలన జీవితమునందు తగిన భాగస్వాములను ఎన్నుకొనుటకు మంచి అవకాశము లభించును. వివాహ మైనతరువాత భార్యగాని భర్తగాని గోతుల్‌లో సభ్యులుగా నుండరు. అసలు దానిని దర్శింపనే దర్శింపరు. మహాదేవుడు, నారాయణదేవుడు, దుల్హాపన్, మూరాడ్కి, బిగ్రహ, మరపన్, హొలెరాయ, బరియర్పన్, ఫర్సి పెన్ మొదలైన దేవతలను వీరు ముఖ్యముగా కొలుతురు.

సాధారణముగా మృతిచెందినవారు ఖననము చేయ బడుదురు. ఉన్నత పదవిలోనున్న వ్యక్తి మరణించిన యెడల దహనము చేయబడును. కాని ఆ వ్యక్తి ఖననముగాని, దహనముగాని చేయబడుటకు ముందు ఆతని లేక ఆమెయొక్క మృతికి కారణమును విధిగా తెలిసికొందురు. ఏవ్యక్తి అయినను మంత్రతంత్రముల మూలమున చనిపోయినయెడల అది ఆజాతికంతకు సంబంధించిన తీవ్ర సమస్యగా ఏర్పడును. ఆ మంత్రగానిని పట్టుకొని కఠినముగా శిక్షింతురు.

రా. ప్ర.