సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మూడవ సంపుటము/గొప్ప గ్రంథాలయములు
గొప్ప గ్రంథాలయములు :
గ్రంథాలయములనగా 'అచ్చుపుస్తకముల నిలయములు' అను నర్థము నేడు వ్యాప్తికి వచ్చినది. ఇది ఒక నాగరికతాచిహ్నముగ నున్నది. కాని వ్రాతప్రతులున్న తంజావూరు సరస్వతీ పుస్తక భాండాగారమునకును ఈ నామము తగియున్నది.
పూర్వకాలమున రాజుల చరిత్రములు, వీరులకథలు, గేయరూపమున తరతరములుగా గానము చేయబడు చుండెడివి. లేఖనము ప్రచారములోనికి వచ్చినతరువాత మత, రాజకీయ సంఘటనలను లిఖించి, ఆ వ్రాతలను దేవాలయములలో భద్రము చేయుచుండిరి. ఇట్లు దేవాలయములు ప్రథమ పుస్తక భాండాగారములుగను, అర్చకులు ప్రథమ గ్రంథాలయాధిపతులుగను వర్తిలినట్లు మనమూహింపవచ్చును.
గ్రంథాలయోద్యమముయొక్క లక్ష్యము సంస్కృతి యొక్కయు, విజ్ఞానముయొక్కయు వ్యాప్తియైయున్నది.
ప్రాచీన గ్రంథాలయములు :
అస్సిరియా : ప్రప్రథమ గ్రంథాలయ నిర్మాతలు అస్సిరియా దేశస్థులు. 1850 లో 'నినవే' వద్ద త్రవ్వకముల మూలమున బయల్పడిన అషుర బనిపాలుని (క్రీ. పూ. 668-626) గ్రంథాలయమునగల 1 మొదలు 12 అం. ల చతురముతో నొప్పు మట్టిపలకలలో లిఖితములు కొన్ని విరిగినవి కనుపించినవి. ఆచ్చటగల పదివేల ఉద్గ్రంథములు చక్కనిపద్ధతిలో అమర్పబడినవి; గ్రంథసూచి యొకటి కలదు. ఆనాడు ప్రజలందరకు గ్రంథాలయమును ఉపయోగింప నవకాశములుండెను. అందలి చాలభాగము బ్రిటిష్ మ్యూజియమున ప్రదర్శింపబడియున్నది.
ఈజిప్టు : ఈజిప్టునందలి ప్రాచీన గ్రంథాలయములను గూర్చిన విషయములు అసమగ్రముగా తెలియుచున్నవి. అచటి గ్రంథాలయములలో క్రీ. పూ. 6,000 సంవత్సరముల క్రిందటి రాజుల దినచర్యలు, గృహజీవితములు, వ్యాపారవిషయములు వ్రాయబడిన గ్రంథములు కలవు. ఇంతేకాక, మతగ్రంథములు, చారిత్రక గ్రంథములు, నీతి - వేదాంత - వైద్య - శాస్త్రగ్రంథములు, కథలు, హాస్యకథలు, సామెతల గ్రంథములుకూడ నుండెడివి. ప్రతి దేవాలయమందును మత, శాస్త్రములకు సంబంధించిన గ్రంథములుండెడివి. రెండవ 'పిరమిడ్' నిర్మాత యగు కూపూయొక్క గ్రంథాలయమును గూర్చియు, నాలుగవవంశపు రాజగు కూపూ గ్రంథాలయమును గూర్చియు లిఖిత పత్రములు గలవు. 'ఎడ్ఫూ' వద్ద దేవాలయపు గదియే గ్రంథాలయముగా నున్నది. గది గోడమీద పుస్తకముల జాబితా కలదు. 'యెండెన్ వద్ద కాల్చబడిన మట్టిపలకలే గ్రంథములు (charred books) గాగల భాండాగార మొకటి కలదు. ప్రఖ్యాత ద్వితీయ రామ్‌సేస్ (క్రీ. పూ. 1383-1236) గా గుర్తింపబడిన ఒసిమాండ్యాసునిగ్రంథాలయము "ఆత్మచికిత్సాలయము" అను పేరు కలిగియున్నట్లు డైడొరస్ నికలన్ అను నాతడు వ్రాసెను. ఆ గ్రంథాలయమొక కార్యాలయమువలె నుండెడిదట. అందు రాజునకు సంబంధించిన లిఖితము లుండెడివి. గ్రంథములను పెట్టెలయందును, జాడీల యందును భద్రపరచెడివారు. వాటిని తిరిగివ్రాయుట కొక విద్యాలయ ముండెడిది. మెంఫిస్‌వద్ద నొక పెద్ద గ్రంథాలయ ముండినట్లు చెప్పబడుచున్నది. పారసీకుల దండయాత్రా సందర్భములో ఇచ్చటి గ్రంథములను విజేతలు గొంపోయిరి.
గ్రీసు : గ్రంథములను సేకరించినవారిలో పిసిస్ట్రేటస్, పాలిక్రేటస్, యూక్లిడ్, నికోక్రేటస్, యూరిపిడిస్, అరిస్టాటిల్ అను ప్రాచీనులు ప్రముఖులు. స్నైడస్ వద్దగల గ్రంథాలయములో వైద్యగ్రంథములు కలవట. ఆలస్ గెలియస్ అనునాతడు మొట్టమొదటి జనతా గ్రంథాలయమును (Public Library) స్థాపించెను. ఈ గ్రంథాలయమును జెర్‌క్సెస్ (Zerxes) అను నాతడు (క్రీ. పూ. 485 - 465) పర్షియాకు తీసికొనిపోయెను. అనంతరము సెల్యూకస్ నికటార్ తిరిగి దానిని ఏథెన్స్ నగరవాసుల కిచ్చెనట. ప్లేటోవద్ద పెక్కుగ్రంథములు ఉండెనని తెలియుచున్నది. అరిస్టాటిల్ గ్రంథాలయము ఆతని శిష్య ప్రశిష్యులకు పరంపరగా దక్కినది. పెర్గమమ్ రాజుల యొక్క గ్రంథ లుబ్ధతకు జడిసి, అరిస్టాటిల్ ప్రశిష్యు డగు నెల్యూస్ ఆ గ్రంథాలయమును పెప్సిన్ అనుచోట భూమిలో పాతి భద్రపరచెను. ఈ గ్రంథాలయమునే టాలమీ ఫిలడెల్ఫస్ అనునతడు కొనెను. 'స్ట్రాబో' అంచనా ప్రకారము గ్రంథాలయ స్థాపనకు అరిస్టాటిల్ ప్రథముడు. అతడే ఈజిప్టు ప్రభువులకు అట్టి అభిరుచిని కలిగించెను. గ్రంథ సేకరణమును ప్రారంభించుటలో టాలమీ సోటర్ ప్రథముడై యున్నను, టాలమీ ఫిలడెల్ఫసు యొక్క గ్రంథాలయములు సువ్యవస్థితములై వేర్వేరు భవనములయం దుండెను. రాజధాని యగు అలెగ్జాండ్రియాకు పండితులు, శాస్త్రజ్ఞులు ఆకర్షింపబడిరి. ఉత్తమ గ్రంథ సేకరణకై టాలమీ ఫిలడెల్ఫసు గ్రీసు, ఆసియాలలోని ప్రతి మారుమూలకును తగినవారిని పంపెను. ఆతని తరువాతివాడగు టాలమీ యూర్గటెస్ ఈజిప్టునకు వచ్చిన విదేశీయుల పుస్తకములను లాగికొని, వాటి ప్రతులను మాత్రమే తిరిగి యొసంగుచుండెనట. ఆతడు గ్రంథాలయోద్ధరణ కృషి విషయమున పాపమునకును, సాహసమునకును జంకక, ఉత్సాహమును పెంచెను. ఆనాటి పండితుల కృషివలన హీబ్రూ, ఈజిప్టు వాఙ్మయములు గ్రీకు భాషలోనికి అనువదింపబడెను.
అలెగ్జాండ్రియాలో రెండు గొప్ప గ్రంథాలయము లుండెను. అందు మొదటిదాని యందు 7 లక్షల పుస్తకములును, రెండవదానియందు 4 లక్షల పుస్తకములును ఉండెను. పుస్తకములపట్టిక తయారుచేయుపద్ధతి అప్పుడే ప్రారంభమైనది. సుఖాంత, విషాదాంత నాటకముల విభజనము జరిగినది. జూలియస్ సీజరు (క్రీ. పూ. 100-44) అలెగ్జాండ్రియాకు నిప్పు పెట్టిన సందర్భమున అచటి పెద్ద గ్రంథాలయము బూడిద అయ్యెను. అందువలననే పెర్గమమ్ నుండి ఆంటోనీ గ్రంథాలయమును సీజరు తెప్పించి క్లియోపాట్రాకు బహూకరించెనట !
పెర్గమమ్ ప్రభువులు టాలమీలతో కీర్తికై స్పర్ధించి గ్రంథాలయమును అభివృద్ధి పరిచిరి. పెర్గమమ్ గ్రంథాలయము ఈజిప్టు చేరుసరికి అందు 2 లక్షల గ్రంథములు కలవట. క్రీ. పూ. 221 లో ఘనుడగు ఆంటియోకసు ; కవియు, వ్యాకరణవేత్తయు, కాల్సిస్ నివాసియు నగు యూఫరన్ అనునాతనిని తన గ్రంథాలయాధికారిగా నుండ నాహ్వానించెను.
రోమ్ : రోమనులు సహజముగా యుద్ధప్రియులు. వారి కీగ్రంథాలయములు, యుద్ధమున చెడిపోయిన సామగ్రిగా కనిపించినవి. వారు వాటిని ధనరాసులతో పాటు రోమ్‌నగరమునకు చేర్చిరి. అచ్చటి ధనికులు వాటిని సేకరించుకొని, ధనముతోపాటు గ్రంథసంఖ్యనుకూడ పెంచుకొనిరి. సెరనస్ సమ్మోనికస్ అనునతడు 62 వేల గ్రంథములను తన శిష్యున కిచ్చి పోయెనట. రోములో జనతాగ్రంథాలయస్థాపన మనునది జూలియస్‌సీజరు పథకములలో నొకటి. పుస్తక సేకరణకు, తద్వ్యవస్థకు 'వారో' అను నతడు నియమింపబడెను. ఇతడు గ్రంథాలయముపై నొక పుస్తకము సైతము రచించెను. ఎవంటైన్ పర్వతముపై పోలియో అనునతడు మొదటి జనతా గ్రంథాలయమును స్థాపించెను. తరువాత అగస్టస్ పెక్కు జనతా గ్రంథాలయములను నెలకొల్పెను. అతడు ఆక్టేవియస్ గ్రంథాలయమును తన సోదరి గౌరవార్థము స్థాపించెను. అతడు స్థాపించిన పాలటైన్ గ్రంథాలయము అనంతరము టైటస్ కాలమున దగ్ధమాయెను. అగస్టస్ తరువాతి ప్రభువులు అతనితోసములు కాకపోయినను, గ్రంథాలయములను స్థాపించుటలోను, వాటిని సువ్యవస్థీకరించుటలోను ఆతనికి తగినవారసు లనిపించుకొనిరి. ఆతని తరువాతివాడగు టైబీరియస్ 'టైబీరియన్ ' గ్రంథాలయమును స్థాపించెను. నీరోకాలమున రోమ్‌నగరము దగ్దమైన పిదప, డొమిషియన్ అనునతడు అలెగ్జాండ్రియా నుండి ప్రతులు వ్రాయించి తెప్పించి గ్రంథాలయమును పునరుద్ధరించెను. ప్రభుత్వ గ్రంథాలయములలో ప్రసిద్ధిచెందిన ఉల్ఫియస్ గ్రంథాలయమును ఉల్ఫియస్ ట్రోజనస్ అను ప్రభువు స్థాపించెను. రోమ్‌లోనే కాక ఇటలీదేశ మంతటను 24 ప్రదేశములలో గ్రంథాలయములు స్థాపింప బడినవనుటకు ఆధారములు కలవు. గ్రంథాలయములకు తోడు పఠనాలయములుకూడ నుండెడివి. అవి అర్థచంద్రాకారమున గాని లేదా, దీర్ఘచతురస్రాకారమున గాని ఉండెడివట, పెర్గమమ్‌దేశములోని గ్రంథాలయములలో మినర్వా దేవతాశిల్పముండెడిది. అట్లే ఇటలీలోని గ్రంథాలయములలో దేవతాశిల్పములను నిల్పెడివారు. పఠనాలయములు ప్రముఖ రచయితల పటములతో అలంకరింప బడెడివి. పుస్తకములు గ్రహించుటకు వీలుగా కేటలాగు ంనదలి సంఖ్యలు వాటిపై లిఖింపబడెడివి. గ్రంథాలయాధికారుల నామములు రాజులపేళ్ళవలె జాబితాగా వ్రాయబడుచుండెను.
కాన్ట్సాంటినోపిల్ : కాన్ట్సాంటైన్ చక్రవర్తి తన సామ్రాజ్యకేంద్రమును బాస్ఫరస్ నదిపైగల యొక క్రొత్త నగరమునకు మార్చినపుడు, అచట నొక ప్రభుత్వ గ్రంథాలయమును ఆతడేర్పరచెను. అందు క్రైస్తవ వాఙ్మయమునుగూడ చేర్చియుండవచ్చును. అతని తరువాతి ప్రభువులగు జూలియన్, థియొడోసియస్ అను వారలు గ్రంథాలయ సంపుటములను 6900 నుండి ఒక లక్షవరకు పెంచిరి. జూలియన్ కాలమున కాన్ట్సాంటి నోపిల్ గ్రంథాలయాధికారిక్రింద ఏడుగురు వ్రాయసగాండ్రు ఉండెడివారట !
మధ్యయుగములో ప్రాచీనగ్రంథములు నిషేధింప బడినవి. విజ్ఞానము మతమునకు దాస్యము చేసినది. ఐరోపా యందు మోడువారిన గ్రంథాలయోద్యమ లత బ్రిటిష్ ద్వీపములందు చిగురించినది. 'టార్ససు' నివాసియగు థియొడారు రోమునుండి కాంటర్బరీకి పెక్కు పుస్తకములను తెచ్చెను (క్రీ. శ. 7 వ శతాబ్ది). ఆర్చిబిషప్ విగ్బర్టు స్థాపించిన యార్కు నగర గ్రంథాలయము కాంటర్బరీ గ్రంథాలయముకంటె గొప్పది. నాటి గ్రంథాలయాధికారి ఆల్షన్ (alcuin) తన ఆధీనమునగల గ్రంథముల కర్తల నామావళిని పద్యములలో వర్ణించెను. దీనినిబట్టి అట్టి గ్రంథాలయము 12 వ శతాబ్దినాటికైనను ఇంగ్లండు ఫ్రాన్సులయందు సహితము లేదనిన అత్యుక్తి కాదు. కాని అది 12 వ శతాబ్దమున దగ్దమాయెను. క్రీ. శ. 774లో 'ఫుల్టా' వద్ద స్థాపింపబడిన గ్రంథాలయమును చార్లిమాన్ అనునతడు అభివృద్ధిపరచెను. అది మధ్యయుగములో అసమానమైన కీర్తిని గడించెను, ఆ యుగములో అతడు సిల్వెస్టరువంటి గ్రంథసేకరణపిపాసాయుతుడు. అతడెంతో ధనమును వెచ్చించి ఇటలీ, జర్మనీ, బెల్జియమ్ దేశముల నుండి గ్రంథములను సేకరించెను. ప్రతి క్రైస్తవ ప్రార్థనాలయమున గ్రంథాలయమొకటి ఉండవలె ననునది 'బెనెడిక్టు' ఋషియొక్క ప్రధానసూత్రము. ప్లూరి, మెల్క్‌గాల్ ఈ ఋషి యొక్క పీఠస్థానములు. ఇవి స్వీయ గ్రంథాలయముల మూలమున ప్రసిద్ధికెక్కినవి.
ఇటలీలోని 'మాంటికాస్సినో' గ్రంథాలయము ఎన్నో కడగండ్లపాలై నేటికిని వర్థిల్లుచున్నది. మొదట (6 వ శ .) అది లంబార్డుల యొక్కయు, తరువాత సారసేనుల యొక్కయు ముట్టడులకు తట్టుకొన్నను, 9 వ శతాబ్దమున దగ్ధమై పునర్నిర్మింపబడెను.
ఫ్రాన్సులో ఫ్లూరి, కూని, కొర్చి అను ప్రదేశముల యందును; జర్మనీలో ఘల్డా, కార్వే, స్వన్హెమ్ అనుచోట్ల యందును ప్రప్రథమమున గ్రంథాలయములు వెలసినవి. ఇట్లే ఇంగ్లండులో కాంటర్బరీ, యార్క్, పేర్మత్‌జారో, విట్బి, గ్లాస్టన్‌బరీ, క్రాయ్‌లాండ్, పీటర్‌బరో, డర్హమ్ అను కేంద్రములందు మొట్టమొదట గ్రంథాలయములు బయలుదేరెను. నాటి ప్రార్థనాలయములు గ్రంథాలయములుగ పనిచేసి, లాటిన్ వాఙ్మయమును సంరక్షించెను.
సర్వప్రజోపయోగార్థము గ్రంథాలయములు వెలయ వలెనను సిద్దాంత బీజములు మొట్టమొదట అమెరికాలో మొలకెత్తెను. అవి సుదూర దేశములందు సైతము వ్యాపించెను. 1876 లో 103 మందితో స్థాపించబడిన అమెరికా గ్రంథాలయ సంఘముయొక్క సభ్యుల సంఖ్య 103 నుండి 12,000 లకు పెరిగినది. ఆ సంఘముయొక్క నిర్విరామ కృషి ఫలితముగా 644 గ్రంథాలయములు 6500 వరకు పెంపొందెను. 1925 లో ఒక ప్రత్యేకోద్యోగి గ్రంథాలయ పరిశీలనమునకై నియమింపబడెను. ఒక సంవత్సర తీవ్రకృషివలన ఒక నివేదిక వెలువడెను. 6 కోట్ల 40 లక్షలమంది ప్రజలు సాలునకు 24 కోట్ల పుస్తకములు చదివి రనియు, 9 కోట్ల రూపాయలు వ్యయము చేయబడె ననియు ఆ నివేదికలో పేర్కొనబడెను.
అమెరికా సంయుక్త రాష్ట్రములలో ఘనతమమైన గ్రంథాలయము "లైబ్రరీ ఆఫ్ కాంగ్రెసు" (Library of Congress) అను పేరుతో నొప్పుచున్నది. ఇది క్రీ. శ. 1900 లో స్థాపిత మయినది. ఈ గ్రంథాలయమున 98,50,000 గ్రంథములు కలవు. న్యూయార్క్ నగరములోని పబ్లిక్ లైబ్రరీలో 55,00,000 గ్రంథములు కలవు. గ్రంథాలయముల అభివృద్ధి విషయములో అమెరికా విశ్వవిద్యాలయముల కృషి అమోఘముగా పెంపొందినది. ఈ క్రింది విశ్వవిద్యాలయములలో పుస్తక సంఖ్య లిట్లున్నవి :
1. హార్వర్డు వి. వి. | 55,00,000 |
2. యేల్ వి. వి. | 40,60,000 |
3. కాలిఫోర్నియా వి. వి. | 29,00,000 |
4. కొలంబియా వి. వి. | 20,10,000 |
5. షికాగో వి. వి. | 18,60,000 |
6. స్టాంఫోర్డ్ వి. వి. | 17,50,000 |
7. మిన్నెసోటా వి. వి. | 16,00,000 |
8. కార్నెల్ వి. వి. | 15,10,000 |
9. ప్రిన్స్‌టన్ వి. వి. | 15,00,000 |
10. మిచ్చిగాన్ వి. వి. | 14,70,000 |
11. పెన్సిల్‌వేనియా వి. వి. | 12,40,000 |
12. నార్త్ వెస్టరన్ వి. వి. | 10,00,000 |
13. డ్యూక్ వి. వి. | 10,40,000 |
ఐరోపా ఖండమునగల కొన్ని దేశములలోని గొప్ప గ్రంథాలయములను, వాటి గ్రంథములసంఖ్యను ఈదిగువ నిచ్చుచున్నాము :
1. వియన్నా గ్రంథాలయము (ఆస్ట్రియా) | 14,00,000 |
2. రోమ్‌వాటికాన్ గ్రంథాలయము(ఇటలీ) | |
అచ్చుగ్రంథములు | 7,00,000 |
వ్రాత ప్రతులు | 50,000 |
3. జాతీయ కేంద్రగ్రంథాలయము, నేపిల్స్ (ఇటలీ) | 14,00,000 |
4. జాతీయ కేంద్రగ్రంథాలయము, ఫ్లారెన్స్ (ఇటలీ) | 34,00,000 |
5. జాతీయ కేంద్రగ్రంథాలయము, రోమ్ | 19,40,000 |
6. రాయల్ గ్రంథాలయము, బ్రస్సెల్స్ (బెల్జియమ్) | 20,00,000 |
7. జాతీయ గ్రంథాలయము, మాడ్రిడ్ (స్పెయిన్) | 15,00,000 |
8. యూనివర్శిటీ గ్రంథాలయము, ఆమ్స్‌టర్డమ్ (హాలెండు) | 15,00,000 |
9. రాయల్ లైబ్రరీ, స్టాక్ హోం (స్వీడన్) | 7,00,000 |
మెక్సికో : మెక్సికో పలుతరగతుల ప్రజలకు, పలు తెగల జనులకు నిలయము. కలవారికిని పేదవారికిని నడుమవారధిగా 1920 లో అచట గ్రంథాలయశాఖ యొకటి స్థాపింపబడెను. తత్ఫలితముగా 1500 జనతా గ్రంథాలయములు (Public Libraries), 1000 విద్యార్థి గ్రంథాలయములు, 800 శ్రామిక గ్రంథాలయములు, 500 జనపద గ్రంథాలయములు నెలకొల్పబడి నిర్వహింపబడుచు వచ్చెను. గ్రంథాలయ ప్రచారమున చలనచిత్ర ప్రదర్శనలు, ఉపన్యాసములు మెక్సికో మారుమూలలందుగూడ నిర్వహింపబడెను. బాలబాలికలలో అధ్యయనాభ్యాసము నెలకొల్పుటకై ప్రత్యేకాకర్షణలతో గ్రంథాలయములలోని కొన్ని గదులు వారికి ప్రత్యేకింప బడెను. 'కార్నిగీ' విరాళఫలితముగా మెక్సికోలో డాక్టరు ఎర్నెస్టు నెల్సన్ రచించిన 'గ్రంథాలయ నిర్వహణ విధానము' అను గ్రంథము వివరణములతో అచ్చొత్తించబడి అన్ని గ్ర థాలయములకును ఉచితముగా నొసగబడెను. ఇట్లు మెక్సికను లందరిలో విద్యాసక్తి పెరుగగా, విప్లవమునకు పూర్వమున గల మెక్సికోకంటె భిన్నమగు మెక్సికో అవతరించెను.
సోవియట్ రష్యా : గ్రంథాలయోద్యమములో ప్రపంచ రాజ్యములలోకెల్ల సోవియట్ రష్యా ప్రముఖస్థాన మాక్ర మించినది. సోవియట్ యూనియనులో కెల్ల గొప్ప గ్రంథాలయములు మాస్కో, లెనిన్‌గ్రాడ్ నగరములలో నున్నవి. ఈ క్రింద నుదహరించిన గ్రంథాలయములలో వాటియందు భద్రపరుపబడిన గ్రంథముల సంఖ్యగూడ పేర్కొనబడినది.
లెనిన్ స్టేట్ లైబ్రరీ, మాస్కో | 145,00,000 |
పబ్లిక్ లైబ్రరీ, లెనిన్ గ్రాడ్ | 60,00,000 |
సైన్స్ అకాడమీ గ్రంథాలయములు లెనిన్‌గ్రాడ్ | 40,00,000 |
సోవియట్ రష్యాలో మొ త్తము గ్రంథాలయముల సంఖ్య | 3,00,000 |
పై గ్రంథాలయములలో, సోవియట్ రచయితలచే రచింపబడిన గ్రంథములేకాక, ఇతర ప్రాక్పశ్చిమ దేశములందలి ప్రముఖ రచయితలయొక్క గ్రంథములును, వాటి రష్యన్ అనువాదములును పొందుపరుపబడినవి. ఇందు వివిధశాస్త్రములకు చెందిన అమూల్యములయిన ప్రాచీన, ఆధునికగ్రంథములు గలవు. అపురూపమయిన 1629 నాటి ఇటాలియను నిఘంటువును, తదితర అమూల్య సంపుటములును ఇందు చేరియున్నవి. 1814 లో స్థాపింపబడిన లెనిన్‌గ్రాడ్ గ్రంథాలయములో నిర్మింపబడిన 25 పఠనాగారములలో 2099 మంది ఒకేసారి కూర్చుండి చదువుకొను సౌకర్యము కలదు. పెక్కు విదేశసంస్థలకు మార్పిడిపద్ధతిపై ఈ గ్రంథాలయము బహుళసంఖ్యలో గ్రంథములను, సరఫరా చేయుచున్నది. బాలురకును,అంధులకును కార్మికకర్షకులకును ప్రత్యేకముగా గ్రంథాలయము లేర్పరచుట సోవియట్ రష్యా యందొక ప్రత్యేక విశిష్టత.
జర్మనీ : ప్రపంచములో ఒక్క జర్మనీలో మాత్రమే ప్రత్యేకమైన శాస్త్రగ్రంథములు పరిశోధకుల కుపయోగించునవి బహుళ సంఖ్యలో ప్రకటింపబడినవి. బెర్లిను నగరమందలి ప్రష్యను రాష్ట్రీయ గ్రంథాలయము చెప్పదగినది. దానియందుగల 20 లక్షల గ్రంథములకు తోడుగ ఏటేట 50 వేల క్రొత్త గ్రంథములు చేరుచుండును. ఇందు మాస, పక్షాదులయందు ప్రచురింపబడు పత్రికలు 20 వేలు కలవు. 2 లక్షల చ. అ. వైశాల్యము గల 13 అంతస్తులతో ఈ గ్రంథాలయ భవనము ఒప్పారు చుండును. వివిధ విజ్ఞానములకు వర్గీకృతము లయిన గ్రంథసూచికలు (కేటలాగులు) వేయి కలవు. అక్షర క్రమమున 3 వేల గ్రంథసూచికా సంపుటములు కలవు. అట్టివి 90 సంపుటములు ఏటేట అందు చేరుచుండును. అందు 320 మంది సిబ్బందియు, 76 మంది ప్రత్యేక శాస్త్ర నిపుణులును గలరు. వీ రందరును గ్రంథవర్గీకరణములోను, పాఠకులకు వలసిన గ్రంథముల నందిచ్చుటలోను సాయపడుదురు. సర్వశాస్త్రీయ గ్రంథాలయములకును కలిపి సమష్టిగ్రంథ సూచిక యొకటి ప్రకటింపబడెను. దీని మూలమున పాఠకుడు తన స్థానిక గ్రంథాలయముద్వారా ప్రష్యానుండి తనకు కావలసిన గ్రంథములను తెప్పించుకొనవచ్చును. పై నుదహరింపబడిన ప్రష్యను గ్రంథాలయము కాక, జర్మనీయందు ఈ క్రింది గ్రంథాలయములుగూడ గలవు.
గ్రంథములు | |
1. స్టేట్ లైబ్రరీ, బెర్లిన్ ( రెండవ ప్రపంచ సంగ్రామములో నశించినవి పోగా) | 15,00,000 |
2. స్టేట్ లైబ్రరీ, మ్యూనిక్ | 20,00,000 |
3. లీప్జిగ్ గ్రంథాలయము | 20,00,000 |
రెండవ ప్రపంచసంగ్రామములో జర్మనీలో మొత్తము 25,00,000 గ్రంథములు నశించినవి.
ప్రాన్సు : ఫ్రాన్సుదేశము యొక్క రాజధానీ నగరమయిన పారిసు గ్రంథాలయము ప్రపంచములో అన్నిటికంటె అద్భుతానందవహ మయినట్టిది. "బిల్లి యోధీఖ్ నేషనేల్" అని దీనికి పేరు. ఇందు దాదాపు 60,00,000 సంపుటములు, 1,50,000 వ్రాత ప్రతులు, 4,50,000 పతకములు, నాణెములు, 50,00,000 ముద్రణములు (prints), చెక్కడముల దిమ్మెలు (engravings) కలవు.
ఇంగ్లండు: ఇంగ్లండులో 1341న ఒకానొక మతగురువు ఒక గ్రంథాలయమును, బోడ్లీ అను నాతడు ఆక్స్‌ఫర్డ్ నందు మరొక గ్రంథాలయమును స్థాపించిరట. 1425 లో రిచర్టు వెల్లింగ్టన్, విలియమ్ చెరి అనువారు లండన్‌లో స్థాపించిన 'లా' గ్రంథాలయమే నేటికి నిలిచియున్న వాటిలో పురాతనమైనది. 16 వ శతాబ్దమున స్థాపింప బడిన 'ఇన్నర్ టెంపుల్ గ్రంథాలయము'లో శిలాశాస్త్ర గ్రంథములు 40 వేలు ఉన్నవట. ఈ గ్రంథాలయము ప్రజా పరిపోషితము.
ఆంగ్ల దేశమున 1850 వ సంవత్సరమున 'ఎవర్టు' గ్రంథాలయ చట్టముతో ప్రారంభమైన గ్రంథాలయోద్యమము చాలకాలము మందముగా సాగెను. 1880 - 90 మధ్య విక్టోరియారాణి జూబిలీ ఉత్సవసందర్భమున సంపాదితములయిన గ్రంథములతోను, 'కార్నిగీ' సంస్థవారి ప్రోత్సాహముతోను (1890-1899), కార్నిగీసంస్థ వారి దేశీయ గ్రంథాలయ విస్తరణ పథకముతోను (1920-27), 1927 నాటికి 50 దేశీయ గ్రంథాలయములును, 480 ఇతర గ్రంథాలయములును వెలసినవి. వీటి మూలమున గ్రంథాలయ విస్తరణోద్యమము బ్రిటనులో చక్కగా సాగినది. జనాభాలో నూటికి 96.3 వంతులు పుస్తకములను చదువగలుగుట కవకాశమేర్పడినది. గ్రామ నగర ప్రాంతములందు మొత్తముమీద 1 కోటి 30 లక్షల పుస్తకములున్నవి. సంవత్సరమునకు చదువబడిన పుస్తకములసంఖ్య 8 కోట్లు. నేడు బ్రిటనులోని గ్రంథాలయ పటిష్ఠీకరణ, సమిష్ఠీకరణములు జాతీయ దృక్పథమున నడుపబడు చున్నవి.
బ్రిటిష్ మ్యూజియం లైబ్రరీ: ఇందు వస్తు ప్రదర్శనశాలయే కాక, పుస్తకశాలకూడ కలదు. ఇందు 50 లక్షుల పుస్తకములు ముద్రితములును,అముద్రితములును కలవు. ఇచ్చట బైబిలుకు సంబంధించిన ప్రామాణిక పవిత్రగ్రంథములు ప్రాచీనకాలమునాటివి మహా నిధినిక్షేపములుగా నున్నవి. గణనాతీతమూల్యమును, చారిత్రక ప్రామాణికమును గల వ్రాతప్రతులసంపద ఇచ్చట మెండుగా గలదు. ఈ మ్యూజియంగ్రంథాలయము రెండవ ప్రపంచసంగ్రామ సమయమున బాంబులవర్షమునకు గురియైనది. సుమారు 50,000 సంపుటములు నాశనమైనవి. తరువాత చాలవరకు ఈ గ్రంథజాలము పునరుద్ధరింపబడినది. ఇందలి పుస్తకములపట్టికలతో ఒక దేశమందలి గ్రంథాలయము నిండగలదని ఒక విమర్శకుడు వాక్రుచ్చెను. 'M' అను అక్షరముతో ప్రారంభమగు కర్తల నామములు, గ్రంథముల పేళ్ళు 80 బైండు పుస్తకములలో గలవు. ఒక్క బైబిలుపైగల వ్యాఖ్యానముల పేళ్ళు 20 పుస్తకములలో గలవు. ఇంగ్లండునుగూర్చి వ్రాసిన కర్తలపేళ్ళు 20 పుస్తకములలో నిండియున్నవి. సమస్త భాషావిషయక గ్రంథములును ఇందు గలవు. హిందీ రచయితల నామములు, గ్రంథనామములు 2 పుస్తకములలో గలవు. సంస్కృత పాలీ గ్రంథములు - ముద్రితములు, అముద్రితములు - పెక్కులు కలవు. చీనా, జపాను, పార్శీ, అరబ్బీ, ఫ్రెంచి, జర్మనీ, ఇటాలియను, రష్యను మొదలుగాగల అన్ని భాషలలోను ఇచట వేలతరబడి గ్రంథములు గలవు.
ఈ మ్యూజియమ్ లైబ్రరీ పఠనమందిరముకాదు. ఇది పరిశోధనమునకు ఉద్దేశింపబడినది. కావుననే 21 సం.లో బడినవారి కిచట ప్రవేశము లేదు. ఇక్కడకు 40-50 మైళ్ళ దూరమునుండికూడ పరిశోధకపండితులు చదువు కొనుటకు వత్తురు.
దీని చుట్టును పఠనమందిరములు కలవు. మధ్యనొక చక్రాకారభవనము గలదు. అందు మేజాలు, గ్రంథ పట్టికలు, విద్యుద్దీపములు, విద్యుత్ పంఖాలు కలవు. ప్రశాంత వాతావరణ లుబ్ధులగు రచయితలు ఇచట తమ రచనలు సాగింతురు. గత శతాబ్దిలో ప్రఖ్యాతి గాంచిన గ్రంథములు ఇక్కడ రచింపబడినవే. ఇచటి నిర్వాహకులు ఆరితేరినవారు, ప్రతిభావంతులు. ఒక్కొక్క విభాగమున మహావిద్వాంసుడే అధ్యక్షుడుగ నుండును. ఇదియొక ఆదర్శ గ్రంథాలయము.
ఆస్ట్రేలియా : ఇందు 1200 గ్రంథాలయములు కలవు. స్థానికసంస్థలు, ప్రభుత్వము వీటికి సాయపడుచున్నవి. 250 సంస్థల ద్వారమున 250 వేలమంది జనులకు గ్రంథ పఠన సౌకర్యములు కలుగుచున్నవి. 6 లక్షల గ్రంథములు నిత్యము పఠితలహస్తముల నలంకరించుచుండును. 114 అడుగుల ఎత్తుగల విశాల భవనములో 300 మంది కూర్చుండుటకు వసతిగల గ్రంథాలయము ఆస్ట్రేలియా రాజధానియైన మెల్బరన్‌లో కలదు.
జపాన్ : జపానులో గ్రంథాలయోద్యమము ఆలస్యముగ ప్రారంభ మయినది. 1926-27 నాటికి అచట 4337 గ్రంథాలయములును. 76 లక్షల గ్రంథములును కలవు. జపానునందలి రెండు పెద్ద గ్రంథాలయములలో 5 లక్షల పుస్తకములు గల ఒక గ్రంథాలయము బాలురకు ప్రత్యేకింపబడి యున్నది.
చి. దా. శా