సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మూడవ సంపుటము/గొట్టపు బావులు

గొట్టపు బావులు :

పశుపక్ష్యాది సమస్త జీవకోటికిని నీరు అత్యవసర మయిన పదార్థము. మానవుడు తన దైనందిన జీవనమునకై నీటిని ఉపయోగించుటతో పాటుగ, పారిశ్రామిక తదితర వ్యాసంగములయందు గూడ దానిని వాడుచున్నాడు. అన్ని పరిశ్రమలందుకంటె వ్యావసాయక రంగమందు పంటలు పండించుటకై నీరు ప్రాణాధారముగ భావింపబడుచున్నది.

నీరు నదులనుండియు, కాలువలనుండియు, చెరువుల యందు నిలువచేయుటవలనను లభ్యమగుచున్నది. పెక్కు దేశములందు ఈ విధమయిన నీటి వనరులనుండి ప్రత్యక్షముగ జలము లభించుటలేదు. ఈ కారణమున బావులు త్రవ్వుట అవసర మగుచున్నది.

అయితే నీరు పుష్కలముగా ఎక్కడ లభించునో తెలిసికొనకుండ గ్రుడ్డిగా బావులు త్రవ్వుచు పోయిన, వృథా శ్రమగా పరిణమించు నవకాశము గలదు. కావున “బోరింగు" (గొట్టములు దింపు) విధానము నుపయోగించి నీరున్న చోటును కనిపెట్టెదరు. ఈ బోరింగు విధానమువలన మూడు ప్రయోజనములు కలవు:

1. పెద్ద బావులు త్రవ్వుటకై స్థలనిర్ణయము చేయుట.

2. అదివరకే త్రవ్వబడియున్న బావులలో నీటి ఉత్పత్తిని అధికము చేయుట.

3. గొట్టపు బావులను నిర్మించుట.

వ్యవసాయదారుడు తాను బావి త్రవ్వుటకు పూర్వము త్రవ్వకము పూర్తి అగువరకు, మంచినీరు పుష్కలముగ లభ్యమగునో, కాదో అను విషయమును నమ్మకముగా చెప్పలేడు. త్రవ్వకము పూర్తియై నీరు పుష్కలముగా పడనియెడల తాను వ్యయపరచిన వందల రూపాయల వ్యయమంతయు వృథాయగును. అందుచే ఒకేసారి పెద్దబావి త్రవ్వబూనుట ప్రమాదముతో కూడిన సాహసకార్యము. ఇట్టి ప్రమాదములోపడి పెద్ద బావి త్రవ్వకమునకై ధనము వృథాచేయకయే, గొట్టపుబావులు దించుట శ్రేయస్కరము. పెద్దబావులవలె ఈ గొట్టపు బావులు వ్యయశీలమైనవి కావు. గొట్టపుబావులవలన వ్యవసాయదారుడు పుష్కలమయిన మంచినీరు నిర్ణీత మయిన స్థలమందు లభింపగలదో, లేదో నమ్మకముగా తెలిసికొనగలడు. పెద్దబావులు త్రవ్వుట మిగులఖర్చుతో కూడినపని. అందుచే రయితు 30 అడుగులకంటె ఎక్కువ లోతుగల బావిని త్రవ్వించలేడు. కాని అంతకంటె ఎక్కువ లోతు తెగిన బావులలో లభించునీరు ఆరోగ్యకరముగను, రుచికరముగను, పుష్కలముగను ఉండును. అందుచే బోరింగు పరికరములచే లోతు ప్రదేశములందలి నీటిని సాధింప సాధ్యమగును.

బోరింగు లేక గొట్టపు నూతులవలననే స్వచ్ఛమగు జలము సాధించుట ఉత్తమమార్గముగ భావింపబడు చున్నది. ఇట్టినీరు ఎట్టి జాడ్యములవలనను, అంటురోగముల వలనను మలినముకాక, శుద్ధముగా నుండును. లోతుగా తెగని బావులలోని నీటిని, భూమ్యుపరితలముమీది జలాశయములందలి నీటిని పరీక్షించినచో, రోగములు సంక్రమించుటకు గల కారణములు బోధపడగలవు. గొట్టపు నూతులవలన ఈ ప్రమాదము తప్పగలదు. భూగర్భములోని లోతుపొరనుండి ఇట్టినీరు లభించుటచే అందు మలిన పదార్థము లెవ్వియును ప్రవేశింపనేరవు.

బోరింగు చేయు విషయమున గూడ కొంత పరిశీలన మవసరము. ఏ ప్రాంతమందు గ్రానైటు (granite), నీస్ (gneiss) ఇసుకరాయి మొదలయిన స్ఫటిక లక్షణములు కల రాయి విశేష ప్రదేశములలో వ్యాపించియుండునో, ఆ ప్రాంతపు భూగర్భపు లోతులలో ఆ రాయి విశేషముగా చివికియుండును. అట్టి భూగర్భము నందలి ఇసుక రాతిపొరల నుండి నీరు ఊరును; మంచినీరు లభించు అవకాశమును గలదు. ఇక భూమ్యుపరితలమునకు క్రింద కొంత లోతువరకు అభేద్యమయిన 'బసాల్టు' (Basalt=చట్టురాయి) అను ఒకరకపు రాయి వ్యాపించియున్నచో, అచ్చట మంచినీరు లభించుట దుస్తరము. ఉదా : తెలంగాణము మొదటితరగతికి చెందిన ప్రాంతము. మరాట్వాడా రెండవ తరగతికి చెందిన ప్రాంతము. మరాట్వాడాలోకంటె తెలంగాణములో తక్కువలోతున నీరు లభింపగలదు.

బోరింగు విధానములు : బోరింగు యంత్రములన్నియు రెండు విధానములపై పనిచేయును. (1) పెర్కషన్ విధానము ; (2) రోటరీ విధానము.

పెర్కషన్ విధానము (Percussion system) : ఇది సులభతమమును అతి పురాతనమునైన విధానము. ఈ విధానమును బట్టి అడుగుభాగమున ఉలి అమర్పబడిన ఒక యంత్ర పరికర సముదాయము (set of tools) తాడు సహాయముతో భూమిలోనికి దించబడును. ఈ పరికరము యంత్ర శక్తిచే క్రిందికి దిగుచు, మరల పైకి లేచుచు, భూమి యందు ఒక సొరంగమును తయారుచేయును. అవసరమయినంత మేరకు భూమిని తొలుచుచు, సొరంగము తయారయినంతనే పరికరము సొరంగము నుండి ఇసుక లేక మట్టి పంపు (sand or mud pump) సాయమున బయటికి తీయబడును. ఈ కార్యక్రమము ముగిసిన అనంతరము మరల బోరింగు విధానము ఆరంభింపబడి చాలినంత నీరు సొరంగము నుండి లభ్యమగువరకు బోరింగు కొనసాగింపబడు చుండును. ఈ బోరింగువిధాన మందు ముస్టోబోరింగు (Musto Boring), ఆరమ్‌స్ట్రాంగ్ (Armstrong), కిస్టోన్ (Keystone) సైక్లోన్ డ్రిల్ (Cyclone Drill) మొదలుగా గల పెక్కుయంత్రములు వ్యవహారమం దున్నవి.

రోటరీ విధానము (Rotary System): ఈ విధానము ప్రకారము భూమిని తొలిచెడి వలయాకారము గల ఒక పరికరము (cutter) ఉక్కు గొట్టములకు అమర్పబడును. ఈ గొట్టములు వలయాకారములో త్రిప్ప బడును. అదే సమయములో పరికరము తయారుచేసి యున్న సొరంగములోనికి ఉక్కు గొట్టముల ద్వారమున నీరు ప్రవేశపెట్టబడును. ఈపరికరము గుండ్రముగా తిరుగుచు దాని అడుగు భాగమున నున్న భూమిని వలయా కృతిలో కోయుచు పోవుచుండును. అట్టియెడ కోయబడిన సొరంగమునుండి బోలుగానున్న యంత్రపరికరముపై గల ఉక్కుగొట్టములోనికి తొలుచబడిన రంధ్రమునుండి రాతిపొడి ప్రవేశించును. ఇట్లు కొంత పరిమాణము గల రాతిపొడి గొట్టములో చేరినపుడు, ఒక సాంకేతిక సాధనముచే గొట్టమునుండి రాతిపొడి ఖాళీ చేయబడును. అంతట సొరంగమునుండి పరికరము తీసి వేయబడి గొట్టములు శుభ్రము చేయబడును. మరల పై జెప్పిన పరికరములు భూమిలోనికి దించబడి యథాప్రకారముగా బోరింగు కార్యక్రమము కొనసాగించబడును. ఈ బోరింగ్ విధానముమీద పనిచేయు 'కాలిక్స్' (calyx) ఐస్లర్ (Isler), సాలమన్ (Solomon) మొదలయిన యంత్రములు నేడు వ్యవహారమం దున్నవి.

భూమి మెత్తగానుండి సొరంగము చేయవలసిన లోతు స్వల్పముగా నున్నప్పుడు సామాన్యమైన సాధనముతో చేతిసాయముననే భూమిని తొలిచెదరు. రాతిమయముగా నున్న ప్రాంతమందుగాని లేక లోతుగా సొరంగము త్రవ్వవలసినప్పుడుగాని, విద్యుత్తు సాయమున బోరింగు చేయుట అవసరమగును. ఆంధ్రప్రదేశమందు వ్యవసాయశాఖవారు ఎక్కువగా పెర్కషన్ విధానమును అనుసరించుచున్నారు. ఆంధ్రప్రభుత్వమువా రీక్రింది బోరింగు యంత్రములను ప్రయోగించుచున్నారు.

(1) రస్టస్ – బుసినస్ బోరింగు యంత్రములు (Ruston Bucynus Well-Drilling machines.)

(2) యమ్-3 కాలిక్స్ (M-3 calyx)

(3) నేషనల్ కాలిక్స్ (National calyx).

(4) ముస్టో యంత్రములు (Musto Plants).

(5) ఎడికో యంత్రములు (Edico Plants.)

బోరింగ్ కార్యక్రమాభివృద్ధి : బోరింగు కార్యక్రమాభివృద్ధి భూగర్భమునందలి వివిధములయిన రాతిపొరలను బట్టి కొనసాగుచుండును. భూమి మృదువుగా నున్నచో పని చురుకుగా సాగును. కఠినముగ నున్నచో మందముగా మాత్రమే జరుగును. భూమి మృదువుగాను ఇసుక మయముగాను ఉన్నపుడు, బోరింగుతోపోటు ప్రక్కప్రక్కన లైనింగుగొట్టములు గూడ అమర్చబడును. కాని రాతి భూములలో ఇట్టి గొట్టములు అమర్చ నవసరముండదు.

ఆంధ్ర తెలంగాణా ప్రాంతములందు సగటున రోజునకు బోరింగు చేయు కొలతప్రమాణము ఈ క్రింద ఉదాహరింపబడినది :

ప్రాంతము భూమియొక్క లక్షణము రోజుకు సగటున బోరింగుచేయు ప్రమాణము
తెలంగాణము మన్ను 15 నుండి 20 అడుగులు
" మురమ్ 8 నుండి 10 అడుగులు
" రాయి 1/2 నుండి 1 అడుగు
ఆంధ్రప్రాంతం ఒండుమన్ను 10 అడుగులు
" కఠినమైనరాయి 2-3 అడుగులు

1958-59 సంవత్సరములోను 1959-60 సంవత్సరములోను ఆంధ్ర తెలంగాణ ప్రాంతములందు నిర్వహించిన గొట్టపు బావులయొక్కయు, ఫలప్రదములైన బావుల యొక్కయు పట్టిక ఈ క్రింద ఉదాహరింపబడినది :

ఆంధ్రప్రాంతము———

" 1958-59 1959-60
జిల్లాలు గొట్టపు బావులు - ఫలప్రదమైన బావులు గొట్టపు బావులు - ఫలప్రదమైన బావులు
శ్రీకాకుళం 20 ------------------ 10 20 ----------------- 14
విశాఖపట్టణము 69 _____________ 42 80 ________________55
తూర్పుగోదావరి 120 _____________ 64 87 __________________53
పశ్చిమగోదావరి 24 _______________ 23 50 ________________42
కృష్ణా 114 _______________ 88 126 _______________ 81
గుంటూరు 22 ____________ 11 44 ____________ 26
నెల్లూరు 67 _______________ 19 195 ______________ 60
చిత్తూరు 19 _______________ 8 16 _______________ 10
కడప 27 ______________ 13 57 ________________ 29
కర్నూలు 26 ____________ 19 56 _____________ 50
అనంతపురం 105 _________ 84 39 ____________35
మొత్తము 613 ___________ 381 770 _________ 445
" (62%) (59%)

తెలంగాణా ప్రాంతము -

" 1958-59 1959-60
జిల్లాలు అడుగులలో త్రవ్వకము - బోరింగులుచేసిన సంఖ్య అడుగులలో త్రవ్వకము - బోరింగులుచేసిన సంఖ్య
" అ. అం. అ. అం.
వరంగల్లు 146-9 ___________ 3 204-6 ____________ 4
మెదక్ 378-6 _____________7 178-6 _____________ 5
హైదరాబాదు 937-7 __________ 21 690-0 ___________ 25
మహబూబ్ నగర్ 337-0 __________ 8 424-2 ___________ 8
నల్లగొండ 407-6 _____________ 12 172-6 ____________ 3
కరీంనగర్ 41-6 ____________ 1 85-0 _______________ 3
నిజామాబాద్ - __________ - 19-0 ______________ 1
ఖమ్మం - ______________ - 90-0 ____________ 1
మొత్తం 2248-10 _________ 52 1863-8 ____________ 50

తెలంగాణములో ఆంధ్రప్రదేశ వ్యవసాయశాఖవారు నిర్వహించిన గొట్టపుబావుల కార్యక్రమములో అధిక భాగమును విజయవంతముగా కొనసాగించిరి.

ముగింపు: దుష్టగుణ విరహితము, పరిశుద్ధము అగు పానీయజలము లభించుటకును, విశాలప్రాంతమును సాగుచేయుటకును, వలయు జలసమృద్ధిని సంపాదించుటకును బోరింగు చేయబడిన గొట్టపుబావులే అత్యుత్తమమైనవి. భారీఎత్తున బావులు త్రవ్వుటకు ముందుగా భూమిలోనికి బోరింగు దించినచో పుష్కలముగ జలము లభింపగలదను ధైర్యము వ్యవసాయదారునకు కలుగును, అట్టి ధైర్యముతో ఆతడు బావి త్రవ్వించుటకు ఉపక్రమింపగలడు. ఈ విధముగా అతడు అనవసరమయిన వ్యయమును తగ్గించుకొనగలడు.

బి. ఆర్. బి.