సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మూడవ సంపుటము/గుహావాస్తువు

గుహావాస్తువు (Cave Architecture) :

మానవుడు జీవశాస్త్రానుసారము కోతిగా, రాతియుగమునకు చెందిన ఆదిమానవుడుగా-ఇట్టి సోపానములనుండి క్రమపరిణామము చెంది భూమిపై సంచరింప మొదలిడిన పిదప, తీవ్రమయిన ఎండనుండియు, చలినుండియు, వాన నుండియు రక్షణము పొందుటకై ఆశ్రయముయొక్క అవసరమును లెస్సగా గ్రహించి యుండవచ్చును. రాత్రి యందు ఆతడు విశ్రమించునపుడు సైతము ఆ నివాస మతనికి రక్షణ మొసగవలసియుండెను. ఇట్టి ప్రయోజనముల నన్నిటిని ఆనాడు (పర్వత) గుహలు మాత్రమే చేకూర్ప గలిగెడివి. పర్వతము లుత్పన్నమగునపుడే గుహలు సహజముగ ఏర్పడియున్నవి. ఈ గుహాశ్రయములు మానవుని తినుబండారము వానవలన చెడిపోకుండ ఆతనికి తోడ్పడియుండవలెను. పిదప మానవుడు తన గుహాశ్రయమును పరులకు చేరరానిదిగాను, తనకును, తన స్నేహితులకును చేరదగినదిగాను చేయ నుద్దేశించి యుండెను. ఇట్టి ప్రయోజనముల నన్నిటిని చేకూర్పగల ఆశ్రయమే గృహ మనబడును.

ఆదిమానవుడు సాంస్కృతిక నిశ్రేణిని ఎక్కుటకు మొదలిడిన కొలది ఆతనికి ఈ సహజములయిన గుహా శ్రయముల విషయమున సంతృప్తి కలుగదయ్యెను. తన జాతి అభివృద్ధి అయినకొలది మానవుడు కొండలను త్రవ్వి గుహలను నిర్మింపసాగెను. మానవుని విశిష్టలక్షణమయిన హేతుదృష్టి ఆతనియందు కళాత్మకమయిన చైతన్యమును అవిర్భవింపజేసెను. పూర్వ చారిత్రకయుగమునకు చెందిన గుహలలోని వర్ణచిత్రములను పరిశీలించినచో వర్ణ, రేఖ, రూప, ప్రమాణ, రీతుల విశిష్ట సౌందర్యమును మానవుడు గుర్తించినట్లు తెలియగలదు. అనంతకాలమున ఆతడు ఆ చిత్రములయందు గతులను, భావజాలమును చేర్చెను. ఇట్లు మానవుడు క్రమముగా కళాప్రియుడుగా పరిణతి నొందెను.

లలితకళలలో వాస్తుశాస్త్ర మొకటియై యున్నది. వాస్తువిద్య మానవునియందలి భావప్రేరితములైన అంతఃకరణ ప్రవృత్తులను ఉద్దీపింపజేసి రసమయమొనర్చును. వాస్తుశాస్త్రము సర్వ కళానియమబద్ధమై యున్నది. ప్రేక్షకుని భావనాపటిమను హత్తుకొనిననే తప్ప గడ్డితో గాని, చెట్ల కొమ్మలతోగాని, అడుసుతోగాని, రాతితో గాని, సున్నము, సిమెంటు, కలప, ఇనుము మున్నగు వాటితోగాని ఏర్పడిన నివాసగృహము లేక, నిర్మాణము, కళాక్షేత్రముయొక్క పరిధిలో చేరజాలదు.

గృహమును నిర్మించుకొనుటయందలి ఉద్దేశము శీత వాతాతప విశేషముల బారినుండియు, చోరాది దౌర్జన్య పరులనుండియు ఆత్మరక్షణము గావించుకొనుటయే యై యున్నది. అందుచే నవి వాస్తుశాస్త్ర కళాసంపదకు చెందినవిగా నుండనేరవు. ఒకానొక కట్టడము ఉద్దిష్టము లయిన ప్రయోజన సిద్ధ్యర్థము నిర్మితమయ్యును, సౌందర్య విలసితమై, శోభా సంకలితమై, వైభవ సంపన్నమై బృహదాకార ఘటితమై 'ఓహో!' అనిపించుకొనగల కట్టడములు మాత్రమే వాస్తు కళాఖండము లనిపించు కొనును. ఐరోపాలో క్రైస్తవులు నిర్మించిన మహోన్నత దేవమందిరములును, ఉత్తరభారతమున తాజమహలును, కుతుబ్‌మీనారును, గులుంద్ దర్వాజాయును, దక్షిణభారతమునగల పెక్కుగోపురములును. కేవలము ఆశ్రయస్థానములుగా నిర్మింపబడిన కట్టడములు కావు. వీటిని నిర్మించినప్పుడు మానవుడు ఆనాడు ఉన్నతమయిన నాగరకతా దశయందున్న వాడని మాత్రము మనమంగీకరింతుము.

కేవలము గుహను నివాసముకొరకే ఏర్పరచుకొనిన ఆదిమ మానవునకు వాస్తుశిల్పదృష్టి ఎట్లుండగలదు ? ప్రాథమిక దశయందున్నప్పుడు మానవునకు గుహా వాసమే శరణ్యమయ్యెను. ఆతని ప్రకృతిలో కళాత్మక చైతన్య బీజములు సహజముగా నిమిడియుండెను. కాని అవి కళాబీజములుగా గుర్తింపదగినంత స్ఫుటముగా అంకురించి యుండలేదు. భారతదేశమునగల ప్రఖ్యాతము లయిన గుహలయొక్క చరిత్రపు జాడలను పరిశీలించినచో, వాటియందు పొడసూపు అద్భుతమయిన వాస్తుశిల్ప లాలిత్యము, మనలను ఆశ్చర్యచకితుల నొనర్చును.

భారతదేశమునందు మానవుడు ప్రాథమిక దశలను దాటి ప్రగతితో, వివేకమానవదశను పొందినప్పుడు ఆతడు భగవంతుని ధ్యానించుకొనుటకై పిచ్చిపోకడలు పోవు జనసమూహపు వ్యర్థ కలహ వాతావరణమునకు దూరముగానుండు లాగున, ప్రశాంత వాతావరణముతో కూడిన ప్రదేశమును సంపాదించుకొనుట యందు ఉత్సుకుడయ్యెను. ప్రస్తరములను, బండరాళ్ళను, పర్వతములను జీవచైతన్యవంతములుగా నుండునట్లు గుహలుగా తొలుచుటలో మరియొక యుద్దేశము కూడ కలదు. అది నిర్మాణములను దృఢమైనవిగను, బ్రహ్మాండ మయినవిగను చేయు తలంపే. అన్యమతముల స్పర్ధనుండి దూరముగ నుండగోరుట కూడ గుహ నిర్మాణపు ఉద్దేశములలో మరియొకటియై యున్నది.

అయితే స్థపతియొక్క కళాహృదయము వాటిని అత్యంత రమణీయములుగా నొనర్చెను. దీనినిబట్టి కేవలము ఆశ్రయాన్వేషణమే (ప్రధాన) లక్ష్యము కాదని తెలియగలదు. ఇట్లే పర్వత గుహలకును, వాస్తు శిల్పమునకును పరస్పర సహసంబంధము ఏర్పడెను. కొన్ని గుహలయందు విశాలములైన పడసాలలు, బ్రహ్మాండ మయిన స్తంభములు, స్తంభావళులు, వరండాలు, గ్యాలరీలు, ద్వారబంధములపైని బల్లరాళ్ళు అబాక్యూసెస్ (abacuses), తోరణములు (arches). గోడలయందలి గూళ్ళు, లోకప్పులు, మెట్లు, శిఖరములు, మూర్తి నిర్మాణములు, చిత్రపటములు, కుడ్యచిత్రములు రూపొందింప బడినవి. అవన్నియు ఆనాటి శిల్పికి గల రమ్యమయిన శిల్పకళాచాతురికి నిదర్శనములు. గుహలకు దృఢతరమయిన పునాదులు సహజముగా నుండెను. అందుచేత వాస్తుశిల్పికి దృఢతరమయిన పునాదులను గూర్చి ఆలోచింపవలసిన అవసరమే లేకుండెను.

ఈ గుహా నిర్మాణములలో గోచరించు పెక్కు వివరములను బట్టి స్థపతులు కొయ్యతో మలచబడిన నమోనాలను తమ ముందుంచుకొని వాటి ననుసరించి గుహలను నిర్మించెడివారని కొందరు కళాభిజ్ఞులు విశ్వసించుచున్నారు. బీహారులో బార్హూత్‌వద్ద నున్న లోమకఋషి గుహల యొక్కయు, బొంబాయి నగరములో భజ వద్దనున్న గుహ యొక్కయు పురోభాగములు ఈ అంశమును స్పష్టముగా సూచించుచున్నవి. ఈ గుహలను పెక్కు విధముల వర్గీకరింపవచ్చును. కాని ఆ యా స్థానములను బట్టి వాటిని వర్ణించి వర్గీకరించుటయే ఉత్తమమార్గము. బౌద్ధమత గుహలు. జైనమత గుహలు, బ్రాహ్మణమత గుహలు అనునవి వర్గీకరణమున మరికొన్ని భేదనిరూపకాంశములై యున్నవి.

కాని వాస్తు శిల్ప దృష్టిచే, ఇట్టి విభాగాంశములకు ప్రాధాన్యములేదు. సాధారణముగా మందిరనిర్మాణము అడుగుభాగము నుండి ఆరంభమయి శిఖరము (పై భాగము) వరకు కొనసాగును. కాని గుహా వాస్తువునందు నిర్మాణము అడ్డముగనో లేక కైలాస గుహలందు వలె పై నుండి అధోముఖముగనో నిర్మాణ ప్రగతి జరుగును.

బౌద్ధమతము ఉత్తర భారతమున గల మగధ నుండి బయలుదేరెను. కావున ఆదిమమైన గుహలు ఉత్తర భారతదేశమున బుద్ధభగవానుని జన్మస్థలమునకు సమీపముననే కలవు .

బార్హూత్ గుహలు 'గయ' నగరమునకు ఉత్తరముగా 16 మైళ్ల దూరమున 'ఫల్గు' నదీ తీరమునకు ఎడమ వైపున

చిత్రము - 106

పటము - 1 చంద్రయక్షిణి - బార్హూత్

నున్నవి. ఇచ్చట మొత్తము ఏడు గుహలు కలవు. ఇవన్నియు క్రీ. పూ. 250 సంవత్సరముల ప్రాంతమున, 40 సంవత్సరముల కాలము లోపలనే నిర్మింపబడినట్టివి. వీటిలో ఆరింటిపై ప్రాచీన పాళీభాషలో చెక్కబడిన శాసనములున్నవి. శాసనము చెక్కబడిన ఏడవ గుహకు 'లోమకఋషి గుహ ' అని పేరుకలదు. ఈ గుహయొక్క వెలుపలి భాగముమాత్రమే దివ్యమైన వాస్తు శిల్పము గోచరించుచున్నది. ఈ గుహా సముదాయములో నాగార్జున గుహయే మిగులపెద్దది. ఇది 46 అడుగుల పొడవును, 19 అ. 5 అం. వెడల్పును కలిగి వర్తులాకృతిగల అగ్రములతో నొప్పుచున్నది. ఆంధ్రప్రభువులైన శార్దూలావర్మ, అనంతవర్మఅనువారు 'లోమక' గుహను బ్రాహ్మణ మత గుహగా మార్చివేసి, దానిపై పూర్వము పాళీ భాషలో గల శాసనమును తుడిపించివేసి, తమ స్వంత శాసనముతో దానిని అలంకరించినట్టు లున్నది. ఈ గుహ యొక్క ముఖభాగము కళాత్మకమై తోరణముతో, జాలకముతో లోపలి తోరణ వక్రరేఖపై చెక్కబడిన ఏనుగుల చిత్రములతో శోభిల్లుచున్నది.

మగధ దేశమునకు రాజధాని యైన 'రాజగృహము' నకు సమీపమున అతిప్రాచీనమయిన రెండు గుహలు కలవు. అవి 'సోన్‌భండార్' అనుపేర బరుగుచున్నవి. వీటి నిడివి 34 అడుగులు, వెడల్పు 17 అడుగులు వీటి గోడలు 6 అడుగుల 9 అంగుళముల ఎత్తు కలిగి. కేవలము నిరాడంబరముగ నుండును. ఈ గోడల పైభాగము నుండి నడుమ శిఖాంతములైన తోరణము నిర్మితమైనది. ఈ తోరణముయొక్క మధ్యగా నేర్పడిన పైన పేర్కొనిన శిఖాంతభాగము భూమిపైనుండి 11 అ. 6 అం. ఎత్తున కలదు. 6:5 నిష్పత్తిలో ద్వారము గడప వద్ద ఎక్కువ వెడల్పుగను, ద్వారబంధములపైని బల్ల రాళ్లు (lintels) వద్ద ఎక్కువ ఇరుకుగాను ఉండును. అన్ని గుహావాస్తు శిల్పములలో ఇదియొక విశేషము. ద్వారమునకు జవాబుగా మరియొక చివర ప్రతి ముఖమున దాదాపు మూడు చతురపు టడుగుల గవాక్ష మొకటి యుండును. భారతదేశమునందలి గుహలలో ఇట్టి గవాక్షములు చాల అరుదుగా మాత్రమే కలవు. ఈ గుహలకు వరండా లుండును. వరాండాలు బల్లకూర్పుతో కప్పబడియుండును. వరాండా ఎత్తు 8 అడుగు లుండును. ఈ బల్లలు దూర్చబడిన రంధ్రము లీనాటికిని కనిపించుచున్నవి.

బౌద్ధమతగుహలు చైత్యము లనియు, విహారములనియు ద్వివిధముగ విభజింపబడియున్నవి. చైత్య మనునది ఒక పూజాస్థానము. దీనియందు సాధారణముగా దగోబాయో (ధాతుగర్భమో), బుద్ధ విగ్రహమో ఒకటి సంస్థాపితమై యుండును. ఇందు ప్రదక్షిణపథములు

చిత్రము - 107

పటము - 2

భజ—బౌద్దగుహాలయము

కూడ చూపబడినవి. విహారములనునవి వాసస్థానములు. బొంబాయిరాష్ట్రములోని భజ, బెడ్సా, కార్లీ అను తావు లందు గల గుహలలో దారుశిల్పము అధికముగా కన నగును. 'సోనీభండార్ ' అను గుహ జీర్ణావస్థలో నున్నది. దానియొక్క పైకప్పు భాగము నెఱ్ఱెలు విచ్చియున్నది. కాని బల్లలు అమర్పబడిన కంతలుమాత్రము నేటికిని కనిపించుచునే యున్నవి. ఆ గుహ పొడవు 22 అడుగులు, వెడల్పు 17 అడుగులు.

'రాజగృహ'కు ఈశాన్యదిశగా మూడుమైళ్ళ దూరమున 'గృధ్రకూటము' అను నొక కొండకలదు. అచ్చట కొన్ని గుహలు కలవు. అవి అంత నయనాకర్షకములు కావు. కాని అందు బుద్ధభగవానుడు తన సహచరుడయిన ఆనందునితో నివసించెనని తెలియుచున్నది. ఈ గుహా సముదాయములో 'సీతామర్హి' అను మరియొక మిక్కిలి

పురాతనమయిన గుహయున్నది. ఇది దీర్ఘ చతురస్రాకారమున 15 అ. 9 అం. పొడవును, 11 అ. 3 అం.

చిత్రము - 108

పటము - 3

బెడ్సా - చైత్యగుహలు

వెడల్పును కలిగియున్నది. విడివడియున్న ఒక ప్రచండ ప్రస్తరములో ఈ గుహ మలచబడియున్నది. ఈ గుహాంత ర్భాగము మిక్కిలి నునుపుగా నొనర్పబడి యున్నది. ఈ గుహాముఖము కోసుగల సాగ్రమయిన యొక తోరణాకారమున నున్నది. ఇది దీర్ఘ చతురస్రాకార ద్వారము యొక్క లోతట్టున లోతుగను, పై భాగమున ఇరుకు గను అడుగుభాగమున ఎక్కువ వెడల్పుగను ఉన్నది.

ఒరిస్సాలో కటక గుహ లనబడు మరియొక గుహా సముదాయము కలదు. భువనేశ్వరమునకు వాయవ్య దిశగా, నాలుగుమైళ్ళ దూరముననున్న 'ఉదయగిరి' 'ఖండగిరి' అను పర్వతములం దీ గుహలు కలవు. ఉదయగిరిపై దాదాపు 16 గుహలును, ఖండగిరిపై ఒక గుహయు తొలువబడి యున్నవి. వాస్తుశిల్ప దృష్ట్యా గుహలకు ప్రాముఖ్యము లేదు. వాటిపై శాసనము లున్నవి. కాని అవి చారిత్రకముగా ఏ ప్రభువు కాలములో చెక్కబడినవో గుర్తించుటకు వీలు లేకున్నది.

'రాణి కా నూర్', 'గణేశ్ గుంఫ' అనెడి గుహలను యాత్రికులు తరచుగ దర్శించుచుందురు. అవి క్రీ. పూ. 1 వ శతాబ్ది నాటివి. ఉదయగిరిపై నున్న 'బాగ్ ' అను గుహ మిక్కిలి మనోహరమైనది. అదియొక బ్రహ్మాండ మయిన ఇసుకరాతిబండ. అది పెద్దపులి తలయొక్క ఆకృతి కలిగి యుండునట్లు తొలచినారు. అతి భయంకర మయిన దంష్ట్రపంక్తితో, విరళమయిన దవుడలు కలిగి యున్నది. ఆ తెరిచియున్న దానినోరు ఒక వరండాగాను, గుహాద్వారము ఆ పులియొక్క కంఠనాళ స్థానముగాను ఏర్పరుచబడినవి. ద్వారములలో నొకదానిపై ఒక శాసన మున్నది. దీనినిబట్టి బ్రాహ్మణమతస్థులై యుండి, నూతనముగా బౌద్ధమతమును స్వీకరించిన ఒకరు దీనిని నిర్మించినట్లు కనిపించును. ద్వారపార్శ్వములు లోతట్టునకు ఏటవాలుగా నున్నవి. 'అనంతగుహ' అనునది మరి యొక మనోహరమయిన గుహ. ఇది క్రమబద్ధమయిన పథకమును అనుసరించి కట్టబడినది కాదు. లోతట్టువ దాని గరిష్ఠమయిన నిడివి 24 అ. 6 అంగుళములు . దాని ఎత్తు 7 అడుగులు మాత్రమే యున్నది. దాని వరాండా 27 అడుగుల పొడవును, 5 అడుగుల వెడల్పును కలిగియున్నది. భిత్తితక్షణ చిత్రమునందు సూచ్యగ్రాకారము గల యొక మెట్లవరుస కలదు. మెట్టుమెట్టునకు నడుమ ఒక పద్మము చెక్కబడి యున్నది. ద్వారపార్శ్వములు లోపలికి ఏటవాలుగానున్నవి.

రాణి కా నూర్ లేక రాణి మహల్ అను గుహ, వాస్తుశాస్త్ర కౌశల్యము నందుకంటె ప్రతిమాశిల్ప కౌశల్య విషయమున పేరెన్నికగన్నది. దానియందు రెండంతస్తు లున్నవి. అయితే, ఆ అంతస్తులలో ఒకదానిపై నొకటి సూటిగా లేదు. క్రింది అంతస్తునకు భారము తొలగించుటకై ఈ విధానము ప్రవేశపెట్టబడినట్లున్నది. క్రింది అంతస్తునందున్న వసారాయొక్క పొడవు 43 అడుగులు; పై అంతస్తుమీద నున్న వసారాయొక్క పొడవు 63 అడుగులు. పై అంతస్తులో ఎనిమిది ద్వారములతో క్రమ

చిత్రము - 109

పటము - 4

కార్లీ —బౌద్ధగుహాలయము

చిత్రము - 110

పటము - 5

కార్లీ - గుహాలయ స్తంభముల శిల్పచిత్రణము

రహితమయిన నాలుగు గదులు కలవు. ఈ గుహ యందు ఉబ్బెత్తుగా మలచబడిన విగ్రహముల శిల్పకళ

విస్మయావహముగ నున్నది. అందుచే వాటిని బౌద్ధ, జైన, బ్రాహ్మణ పురాణకథలకు చెందినవిగా గుర్తింప జాలము.

"గణేశ్ గుంఫ" అను గుహయందు తామర మొగ్గలను తొండములతో పట్టుకొనిన రెండు ఏనుగుల విగ్రహములు కలవు. 'గణేశ్ గుహ' లను పేరు ఈ ఏనుగులను బట్టి ఏర్పడినదే. ఇదియొక చిన్నగుహ. దీనియందు రెండు గదులున్నవి. 40 అడుగుల పొడవును, 6 అడుగుల వెడల్పును కలిగిన వసారాలోనికి ఈ గదులనుండి ప్రవేశ మార్గములు కలవు. ఈ వరండాలో 5 స్తంభములుండెను. వాటిలో ప్రస్తుతము 3 మాత్రమే మిగిలియున్నవి. ఈ స్తంభములు బ్రహ్మాండమైనవై క్రింది భాగమునందును పై భాగమునందును చతురస్రాకారమును, మధ్య భాగమున అష్టకోణాకృతిని కలిగియున్నవి. స్తంభాగ్రము లందు సాలభంజికలున్నవి. ఇవి దారునిర్మితమయిన నమూనాలను చూచి, మలచబడియుండవచ్చును. వసారాలో నుండి గదిలోనికి పోవుటకు నాలుగు ద్వారములు నిర్మింప బడియున్నవి.

విజయవాడ చెంతనున్న ఉండవల్లి గుహలకు మిక్కిలి ప్రాముఖ్యము కలదు. కృష్ణా గోదావరీనదుల ముఖద్వారముల నడుమ నొక ఉత్తమమయిన ఓడరేవుపట్టణము కలదు. బౌద్ధు లీ రేవుపట్టణముగుండా జావా, కాంబోడియా దేశములకు వలసపోయి అచ్చట నివాసము లేర్పరచుకొనిరి. తాబన్, మర్తబాన్ ల చెంతనున్న 'గోల్డెన్ చెసోనీస్' (Golden Chesonese) అను ప్రాంతముతో రాకపోకలు, ఉత్తరప్రత్యుత్తరములు నాడు జరుపబడుచుండెను. చైనా రాయబారి యగు 'హుయ్యీన్ త్సాంగ్ ' క్రీ. శ. 637 సంవత్సరములో ఈ ప్రదేశమును దర్శించి ఇచ్చటనున్న 'పూర్వశిలా సంగ్రామ్' 'అపరశిలామఠము' అను రెండు ప్రదేశములను తన గ్రంథములలో పేర్కొ నెను. మొదటి శిథిలావశేషము లింకను ఆప్రదేశమునగలవు. రెండవది స్పష్టముగా అమరావతియే అగుచున్నది. ఆ సమీపమున గల ప్రధానగుహ నారాయణుని దేవాలయమో, అనంతశయనుని దేవాలయమో యైన వైష్ణవదేవాలయము. అది మొదట బుద్ధదేవాలయమై యుండి పిదప బ్రాహ్మణమత దేవాలయముగా మార్చబడి యుండునని శంకించుచున్నారు. కాని ఈ సందేహమును సమర్థించుటకు తగిన సాక్ష్యము లేదు. వేంగి చాళుక్యరా జెవ్వడో ఈ గుహను చెక్కించి యుండునని తలపబడుచున్నది. ఈ గుహ నాలుగంతస్తులు కలిగి ఎత్తుగా నున్నది. అంతస్తులు ఒకదానిపై మరియొకటి నిర్మింపబడి యున్నవి. అడుగుభాగమున కుడిప్రక్కగా 5 వ అంతస్తు కూడ కలదు. అది పూర్తి కావింపబడి యుండ లేదు. శిఖరముననున్న అంతస్తుయొక్క ముఖభాగము సుమారు 90 అడుగుల పొడవు కలది. క్రీ. శ . 7 వ లేక 8 వ శతాబ్దిలో వేంగిలిపిలో చెక్కబడిన శాసన మొకటి ఈ గుహ ముఖభాగముమీద నున్నది. రెండవ అంతస్తు మరింత ఎక్కువ వైశాల్యము కలదిగా నున్నది. ప్రప్రథమమున ఈ అంతస్తునందు నాలుగు విభాగము లుండెను. అనంతరము మూడవ, నాలుగవ విభాగముల నడుమ

చిత్రము - 111

పటము - 6

నాలుగంతస్తుల గుహాలయము - ఉండవల్లి

ద్వారము అమర్పబడుటచే అవి కలిసిపోయినవి. దక్షిణదిశ యందు అనగా ఎడమప్రక్కనగల చావడి 191/2 చతురపు టడుగుల వైశాల్యము కలిగియున్నది. దీని పైకప్పు, ముందుభాగమున నున్న రెండు మామూలు స్తంభముల మీదను, లోపలనున్న రెండుస్తంభములమీదను ఆధారపడి యున్నది. ఈ స్తంభచూళికలపై సాలభంజికలు చెక్కబడి యున్నవి. వెనుకభాగమున పది చ. అడుగల విస్తీర్ణము గల ఒక దేవాయతనము కలదు. అందొక వేదికగలదు. ఈ చావడియొక్క ముందుభాగమును ఎక్కుటకు 101/2 అడుగుల వెడల్పుగల ఒక వేదికపైనుండి 8 మెట్లు కలవు. ఈ వేదికయొక్క ఎడమ చివరకు వెలుపలిభాగమున, 61/2 అడుగుల పొడవును, 41/2 అడుగుల వెడల్పును గల యొక గది కలదు. దానికి వెనుక భాగమున 3 అడుగుల పొడవును 2 అడుగుల వెడల్పును గల మరియొక చిన్నగది యున్నది. పై నున్న రాతిబండ మీద ఏనుగులు, సింహములు చెక్కబడిన ఒక భిత్తితక్షణ చిత్రము కలదు. చిన్నగది మీది ముఖభాగమందు బాతులు చెక్కబడిన భిత్తితక్షణ చిత్ర మొకటి యున్నది. దీని పైభాగమున చైత్యగవాక్ష మలంకారముగానున్నది. ముందునకు ఉబుకుచున్న యొకభాగము కలదు. దానిమీద ముందున కుబికియున్న 5 గ్రంధుల వరుస యొకటి గోచరించును. ఇవి గుర్తించుటకు వీలులేనంతగా వాతాహతములై యున్నవి. మరల దానిపై సమతలమున జాగ్రత్తతో చెక్కబడిన చిత్రదుకూలధారణ విధానమొకటి కనిపించును. వేదికకు ఉత్తర దిశగానున్న రాతిబండమీద శా. శ. 13 వ

శతాబ్దినాటి సుదీర్ఘ శాసన మొకటి తెలుగు భాషలో కన్పడుచున్నది. ఈ శాసన మందు దేవాలయమునకు చేయబడిన యొక ధర్మమును గూర్చి తెలుపబడినది. ఆ కాలము నందు గూడ ఈ దేవాలయము నెడ ఎట్టి అత్యున్నతమైన గౌరవప్రపత్తు లుండెడివో ఈ శాసనలిఖితము సూచించు చున్నది. దీనికి కుడివైపున 10 అడుగుల దూరమున 29 అ. 9 అం. పొడవును, 13 అ. వెడల్పును 8 అడుగుల ఎత్తును గల ఒక పెద్ద మండపమున్నది. పైకప్పు భారమును వహించుచు 16 స్తంభములు కలవు. ఈ 16 స్తంభములు ఒక్కొక వరుసలో నాలుగేసి చొప్పున సమాంతరమున నున్నవి. ఈ మండపము దాటగానే, 131/2 చ. అడుగుల వైశాల్యముగల దేవాయతనము కలదు. అందు దేవతావిగ్రహ ప్రతిష్ఠార్థము నిర్మితమై శూన్యముగనున్న ఒక వేదిక గలదు. ఈ దేవాయతన ప్రవేశద్వారముయొక్క ఉభయపార్శ్వముల యందు నిలుచుండియున్న రెండు విగ్రహములు కలవు. ఈ రెండింటిలో ఒకటి నిస్సందేహముగా నరసింహస్వామియే. ఈ విగ్రహముయొక్క శిరోభాగముపై మకరతోరణ మొకటి కలదు. అచట హిందూదేవతాగణమంతయు సర్వలక్షణసమన్వితముగ రూపొందియున్నది. విశాలమయిన చావడికి ఎడమ ప్రక్కననున్న మెట్ల పంక్తి పైమూడవ అంతస్తునకు గొంపోయి ఒక పెద్ద చావడిలోనికి చేర్చును. ఈ చావడి వరండాతోసహా 52 అ. 9 అం. పొడవును, 30 అ. 3 అం. వెడల్పు కలిగియున్నది. వసారాకు స్తంభములున్నవి. లోపలి భాగముననున్న చావడి యెత్తు 8 అడుగులు. వరుసకు 6 స్తంభముల చొప్పున, దానియందు రెండు వరుసలున్నవి. ఈ స్తంభములు స్థూలములై చతుష్కోణాకారము కలవి. స్తంభముల మధ్య భాగమున కొలదిగ అష్టముఖాకారములు కలవిగా నుండునట్లు చెక్కబడియున్నవి. ఇచ్చట గూడ హిందూ దేవతాశిల్ప రూపములు గోచరించును. దక్షిణ దిశగానున్న మెట్ల పంక్తిని ఎక్కిపోయినచో పై అంతస్తునకు చేరుకొన గలము. ఈ చివరి అంతస్తు కలశాకారములో నిర్మింప బడినది. ద్రవిడ కళాసంప్రదాయాను సారము సూచ్యగ్రస్తూపాకారములో నుండు చౌకమైన ప్రతిదేవాలయమును కలశా కారమున తీర్చి దిద్దబడినవి. ఉండవల్లి గుహాలయమును పరిశీలించినచో ఏతన్నిర్మాతలు వాస్తు, శిల్ప ఖండములను చెక్కు కౌశల్యమును బౌద్ధులనుండి అనగా ప్రాచీన హిందువులనుండి నేర్చిరని తేటపడగలదు.

సముద్రతీరమున మదరాసునకు దక్షిణముగా 35 మైళ్ల దూరముననున్న మహాబలిపురమునందు 7 దేవాలయము (పెగోడా) లున్నవి. ఇవి విశిష్ట నిర్మాణములు. గుహావాస్తు శిల్పసంపదయందు వీటినిగూడ చేర్పదగును. సాధారణముగా గుహయొక్క వెనుకభాగము ప్రతిమా ప్రలంబ శిల్పమునందువలె మూసివేయబడి యుండును. అయితే చుట్టునున్న శిల్పవిన్యాసమంతయు ఒకే శిలాఖండమునుండియే మలచబడినది. ఈ పెగోడాలు, లేక

చిత్రము - 112

పటము - 7

పంచపాండవ రథములు - మహాబలిపురము

రథములు అన్నియు పూర్తిగా రాతికొండలనుండి తొలువబడినవే. వివిధ వస్తుసంజాతముచే నిర్మితమైన దేవాలయములవలె ఈ రథములు నిలిచియుండును. ఇవన్నియు ఎల్లోరా యందలి కైలాస గుహకు ప్రతిబింబములై యున్నవి.

ఈ ఏడు రథములలో అయిదు మిక్కిలి శోభావంతములు. ఇవన్నియు మహాబలిపుర పర్వతమునకు దక్షిణమున దగ్గరదగ్గరగా కలిసియున్నవి. ఈ పర్వతమునందు కొన్ని గుహలుగూడ కలవు. మహాభారతాంతర్గత మహావీరుల నామములే ఈ దేవాలయములకు పెట్టబడినవి. స్థూలమును, విచిత్రమునైన దానికెల్ల ఒక పౌరాణిక వీరుని నామముతో సంబంధము కల్పించి వ్యవహరించుట ఒక సంప్రదాయముగ నుండెను. వాటిలో మిక్కిలి దక్షిణాగ్రముననున్న రథము 'ధర్మరాజు' అను పేర పిలువబడుచున్నది. దానికి ఆవలనున్నది 'భీమ' అనియు, దానికి ప్రక్కనున్నది 'అర్జున' అనియు, నాల్గవది 'ద్రౌపది'అనియు పిలువబడుచున్నవి. ఈ నాలుగు రథములును ఉత్తర దక్షిణములుగా సాగి 160 అడుగుల పొడవున నున్నవి. ఇవి వేరువేరుగా నున్న ప్రస్తరములనుండి తొలువబడినవో, లేక ఒకే ఎడతెగని పర్వతపంక్తినుండి తొలువ బడినవో స్పష్టీకరించుట సంశయాస్పదము. 5 వ రథము నకుల సహదేవుల నామములతో ఒప్పుచున్నది. ఇది పై నాల్గింటికి కొంచెము పశ్చిమదిశగా నున్నది. ఆరవదానికి 'గణేశ్' రథమని పేరు. ఇది కొండలవరుసకు ఉత్తర దిశాగ్రమున ఆరు ఫర్లాంగుల దూరమున కలదు . దీని చెంతనే పూర్తిగావింపబడని తక్కిన మూడు రథములును కనిపించుచున్నవి. అవి మూసివేయబడినవి.

ఈ రథములు దక్షిణ భారతదేశములోగల మిక్కిలి తొలికాలపు దేవాలయములై యున్నవి. అవి ఏ చారిత్రక పురుషుల కాలమునందు నిర్మింపబడెనో స్పష్టముగా తేల్చుట కష్టము. కాని అవి క్రీ. శ. 7 వ శతాబ్దికి పూర్వమే నిర్మింపబడియుండునని మాత్రము చెప్పవచ్చును.

'గణేశ్ ' రథమనునది చిన్నదైనను అసామాన్యమైన సౌందర్యము కలది. ఇది మిక్కిలి ప్రాచీన మైనదిగా గన్పట్టుచున్నది. దీని పొడవు 19 అడుగులు, వెడల్పు 11 అడుగుల 3 అంగుళములు; ఎత్తు 28 అడుగులు. దీనిలో మూడు అంతస్తులున్నవి. దీని గోపుర నిర్మాణము నందు సుందరమైన ద్రవిడ వాస్తు, కళాసంప్రదాయ వివరములు గోచరించు చున్నవి. పై కప్పు సూటిగా పోయి శివుని త్రిశూలాకృతిలో నున్నది. దేవాలయము నందలి స్తంభములు అతిరుచిరములుగ నున్నవి. వాటి చూళికలు ఏనుగుల ఆకారముననున్నవి. వాటి పీఠములు యాళి లేక సింహాకృతులతో శోభించుచున్నవి. ప్రవేశ ద్వారమునందు ఇద్దరు ద్వారపాలకులు గలరు. 'జయరాణ స్తంభుని' పేర్కొను శాసన మొకటి కలదు. నాల్గింటిలో 'ద్రౌపది' రథము ఉత్తరాగ్రమున కలదు. ఇది 11 చతురపు టడుగుల పరిమాణముకలిగి అన్నిటికంటె చిన్నదిగా నున్నది. దీని పైకప్పుభాగము వక్ర రేఖావృతమై 18 అడుగుల ఎత్తుననున్నది. గోపురాగ్రభాగమున చిత్రాలంకార కలశము ఉండియుండును. కాని ప్రస్తుత మది కనిపించుట లేదు. లోపలిభాగమున 6 అ. 4 అం. పొడవును, 4 అ. 6 అం. వెడల్పునుగల గది యొకటి కలదు. అందు వైష్ణవ లాంఛన భూషితయగు చతుర్భుజలక్ష్మి విగ్రహము కలదు. ఆమె పద్మాసనాసీనయై యున్నది.

దీనితర్వాత అర్జునరథము, పిదప భీమరథము కలవు. చివరనున్నది ధర్మరాజ రథము. కాని ధర్మజ, అర్జున రథములకు పోలిక కలదు.

అన్నిటికంటె భీమరథము మిక్కిలి పెద్దది. అందు రెండంతస్తులు మాత్రమే కలవు. అందలి చావడి ఒక పెద్ద ధర్మశాలవలె కన్పడును. దాని పొడవు 48 అడుగులు; ఎత్తు 25 అడుగులు; అందు కనిపించు అవశేషములనుబట్టి మధ్యభాగమునందు ఆనాడు 30 అడుగుల పొడవును, 10 అడుగుల వెడల్పును గల ఒక చిన్న చావడి తప్పక యుండవచ్చునని తోచుచున్నది. అందు కప్పుగల రెండు కుడ్యములును, కప్పులేని రెండు కుడ్యములును గలవు. దాని చుట్టును 5 అడుగుల వెడల్పుగల ఒక వసారాయున్నది. చిత్రిత కొయ్యనమూనాలను పురస్కరించుకొని స్తంభములు నిర్మింపబడినవి. అడుగు భాగమున సింహరూపములు చెక్కబడినవి. కాని పైకి పోనుపోను ఆ స్తంభముల మందము ఉద్దిష్టమైన విధమున చెక్కి తగ్గించకపోవుటచే ఆ నిర్మాణము కొంతకాలమునకు బీటలువారినట్లు కన్పించెను.

అదే శ్రేణిలో 2, 4 స్థానములయందున్న అర్జున, ధర్మరాజ రథములు వాస్తుశిల్ప దృష్ట్యా ఒకే రూపమున నున్నవి. కాని భీమ రథముకంటె రథము చిన్నది. పరిమాణమున, అర్జున రథము ద్రౌపది రథమును పోలియున్నది. . అర్జున రథము 11 అ. 6 అం. ల సమ చతురస్రాకారము కలది. అది మంటపము, వైపున 16 అడుగు లుండును: దాని ఎత్తు దాదాపు 20 అడుగులు. లోతట్టున నున్న చావడియందు 4 అ. 6 అం. పొడవును, 5 అ. వెడల్పును గల ఒక గది కలదు. ఇందుచేతనే కాబోలు పైనుండి క్రిందివరకు రథము వీగినది. శిఖర మందలి గోపుర కలశముయొక్క కొంత భాగముకూడ దొర్లిపడి యున్నది. దానికి రెండంతస్తులు కలవు, రెండంతస్తులును కృత్రిమము లయిన చిన్న గూళ్ళ వరుసలతో అలంకృతములై యున్నవి. ఇవి ద్రవిడదేశము నందలి దేవాలయములకు గల విశిష్ట లక్షణములు. గర్భాగారములో విగ్రహము లేదు. కాని మొదటి గ్యాలరి, ఒక్కొక్క దిశ యందు మూడు చొప్పున 12 విగ్రహములచే అలంకృతమై ఉన్నది.

ధర్మరాజ రథము అన్నింటికంటె మిక్కిలి సుందరమును మిక్కిలి గొప్పదియునై యున్నది. కాని అది పూర్తి గావింపబడియుండలేదు. దాని పొడవు 26 అ. 9 అంగుళములు, వెడల్పు 28 అ. 8 అంగుళములు. ఎత్తు 35 అడుగులు. ఈ రథము ఇంత పరిమాణము కలదయ్యు ఒక నమూనా మోస్తరుగానుండునే కాని ఏ విధముగను వాసయోగ్యమైన భవనముగా లేదు. అది సూచ్యగ్రస్తూపాకారములో ఒకదానిపై నొకటి నిలిచి యుండునట్లు నిర్మింపబడిన నాలుగు అంతస్తులుగల భవనము. అదియొక గోపురమును పోలియుండును. కాని గోపురములలో పై అంతస్తులు ఇటికలతో నిర్మింప బడెను. స్తంభముల యొక్క వేదికలు యాళి, లేక సింహాకారములతో సన్నగానుండును. గదులేమో అన్నట్లు భ్రాంతిగొల్పు విచిత్రాలంకారములు పై అంతస్తులలో నుండును. వీటిలో మొదటి అంతస్తునందు 16 గదులును, రెండవదానియందు 12 గదులును, మూడవదాని యందు 8 గదులును కలవు. ఈ గదులకు ముందుగల భాగము అర్ధచంద్రాకారమున మోరపాక ఆకృతిలో గవాక్షములచే అలంకరింపబడి యున్నది. ఆ గదులకు వెనుక భాగమున గోడలు సన్నని చతురస్రస్తంభములచే పొడుగైన గదులుగ విభజింపబడియున్నవి. వాటియందు దేవతా విగ్రహములు ప్రతిష్ఠింపబడియున్నవి. నిరాడంబరములయిన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల ప్రతిమలును, పెక్కు అర్ధనారీశ్వర విగ్రహములును అందు కనిపించు చున్నవి.

ఈ రథములన్నియు-ముఖ్యముగా అర్జున, ధర్మరాజ రథములు అత్యధిక సహనశీల పరిశ్రమకు ఉదాహరణములై యున్నవి. ఈ గుణమునకు భారతీయులు ప్రసిద్ధికెక్కియున్నారు. వాస్తుశిల్పదృష్ట్యా ఈ రథములు దక్షిణ భారతములోగల వేలకొలది హిందూ దేవాలయముల ఆరంభావస్థను పోలియున్నవి. అయిదవదగు సహదేవ రథము అవతలికొండకు సమీపమున నున్నది. దాని పొడవు 18 అడుగులు, వెడల్పు 11 అడుగులు, ఎత్తు 16 అడుగులు. దాని తూర్పుభాగము పూర్తిచేయబడలేదు. ఈ రథము, కొలది ప్రమాణములో, చైత్యగుహయొక్క బహిరాకారమును పోలియున్నది. పశ్చిమముననున్న గుహాసముదాయములో ఇదియొక ముఖ్యలక్షణము. కప్పుయొక్క అంతర్భాగము అర్ధవలయాకారముగ నుండును.

మహాబలిపురము వద్ద గల కొన్ని గుహలు మిక్కిలి సుందరముగ నున్నవి. కాని వాస్తుశిల్పదృష్ట్యా వాటికి ప్రత్యేక ప్రాముఖ్యములేదు. పశ్చిమ భారతదేశమందలి ఇతర గుహలయందువలె వాటియందు కల్పనౌచిత్యమును, గాంభీర్యమును కానరావు. ఈ గుహల స్తంభములు సన్నగా నుండును. వాటియందు వాస్తుశిల్పమునకు సంబంధించిన వివరములు గోచరింపవు.

ఈ పంక్తికి దక్షిణాగ్రమునందు ఇప్పటికిని చెక్కుచెదరక ఒక గుహ కనిపించుచున్నది. దానిపేరు 'ధర్మరాజ మండపము', దాని పొడవు 17 అడుగులు, వెడల్పు 121/2 అడుగులు. అందు నాలుగు స్తంభములున్నవి. స్తంభములు అడుగుభాగమునందు, అగ్రభాగమునందును చతురస్రాకారమును, మధ్యభాగమున అష్టకోణాకృతిని కలిగి యున్నవి శిల్ప విన్యాసముకల దక్షిణ ప్రస్తరము వెనుక భాగమున రెండు స్తంభములుకల ఒక గుహకలదు. ఇది పూర్తి కావింపబడినది కాదు.

మొదటిదానికి ఉత్తరమున యమపురి లేక 'మహిషాసురమర్దని' అను పేరుగల ఒక మండపమున్నది. దీని పొడవు 331/2 అడుగులు, వెడల్పు 15 అడుగులు. స్తంభాగ్రములందు దృఢమయిన చూళికలు కలవు. వాటిపై సమచతురస్రాకృతిలో పెంకు లమర్పబడి యున్నవి. శేష శాయి, నారాయణునివంటి కొన్ని ఉబ్బెత్తు చిత్రములు కలవు. చావడికి మరియొక చివరియందు దుర్గామహిషాసురుల పోరును రూపొందించు మహోద్రేక సంభరితమగు శిల్పవిన్యాసము కలదు. దీనికి పశ్చిమముగా కొండకు పశ్చిమ భాగమునందు వరాహస్వామి ఆలయమొకటి కలదు. అచటనే రాముని పూజించుచున్నట్లు ఆంజనేయుని శిల్ప విగ్రహముకూడ ఒకటి కాననగును.

దానికి సమీపమున 'రామాయణ మండప' మను మరియొక గుహ కనిపించును. దానిపొడవు 181/2 అడుగులు, వెడల్పు 10 అడుగులు. అందు సింహవిగ్రహముల శిరములపై మోపబడియున్న రెండు స్తంభములున్నవి. ఓలక్కా మేశ్వరస్వామి గుహయొకటి అచ్చట నున్నది. ఇది పూర్తి కావింప బడలేదు. ఇందు సింహవిగ్రహముల శిరములపై అమర్పబడిన నాలుగు స్తంభములు కలవు. ఉత్తరమునకు పోయినచో అచ్చటి మొట్టమొదట కనిపించునది కృష్ణధర్మశాల అనునది. ఇది అనంతరకాలమున త్రవ్వబడినట్లు కనిపించును. దీనిపై చోళశిల్పకళా సంప్రదాయ ప్రభావము ప్రసరించినది. ఇచ్చటి మండపము 48 అడుగుల పొడవును, 23 అడుగుల వెడల్పును కలిగి యున్నది. ఇందు మూడు శ్రేణులుగా 12 స్తంభ నిర్మాణములు కలవు. ఆరు స్తంభములలో మూడింటికి అడుగుభాగమున యాలీలు (yalis) లేక శార్దూలములో ఉన్నవి. స్తంభాగ్రములను కలుపు చూరుబల్లయొక్క పై భాగమున ఒండొంటిపై అమర్పబడిన రాతిపలకలచే మండపము యొక్క కప్పు ఏర్పడియున్నది. పై దానికి ఉ త్తరమున కొన్ని గజముల దూరములో పంచపానన(Panchapanana Mandapa) అను మండప మొకటి కలదు. దాని ముఖభాగముయొక్క వెడల్పు 50 అడుగులు, కుడివైపు ఎత్తు 40 అడుగులు, ఎడమ వైపు ఎత్తు 33 అడుగులు. ఈ మండపము అష్ట కోణాకృతి గల స్తంభములపై నిలిచి యున్నది. ఈ స్తంభములు పెద్దపులి ఆకృతులుగల పీఠములపై ముందుభాగమున ప్రతిష్ఠింపబడినవి. గణేశ్ గుహదగ్గర వైష్ణవగుహ ఒకటి కలదు. హిందూ దేవతాగణమునకు సంబంధించిన వరాహము, గజలక్ష్మి, వామనుడు, త్రివిక్రముడు మున్నగు పెక్కు దేవతా విగ్రహముల చెక్కడములు కలవు. పూర్తిగావింపబడనివి, గొప్ప విస్తీర్ణము కలవి మరి రెండు గుహలుకూడ ఇందు గలవు. మూడవ గుహ 'కోటి కళామండప' మై యున్నది. ఈ కళామండపము శక్తికి అంకితమై యున్నది. దీనికి మూడు మైళ్ళు ఉత్తరముగా సముద్రపు టొడ్డునగల ఇసుక తిన్నెలయందు కొన్ని రాతిబండలున్నవి. రెండింటిలో గదులు తొలువబడియున్నవి. ఈ రెండింటిలో ఒకదానికి అహిచండేశ్వర మండపమని పేరు. దీనిపై ఒక శాసన మున్నది. అందు అహిచండుడను పల్లవరా జొకడు పేర్కొనబడినాడు. ఇతడెవరో తెలియదు. రెండవగుహ ఒక చిన్న బండలో తొలువబడినది. ఈ గుహకు ముందుభాగమున, చుట్టును తొమ్మిది "యాలీల" శిరోభాగములు కలవు. ప్రతి ద్వార పార్శ్వముయొక్క ముందుభాగమునను, ఉద్రిక్తస్థితి కలవిగా మలచబడిన సింహ విగ్రహములును గలవు.

తిరునల్వేలికిని, శ్రీవిల్లిపుత్తూరునకును నడుమనున్న “కులుములు” అను ప్రదేశమున ఒక్కొకదానికి 30 మైళ్ళ దూరమున రాతిబండలలో తొలువబడిన దేవాలయములును, ఇతర శిల్పవిగ్రహములును కలవు. వీటిపై జైన శిల్పకళా సంప్రదాయముయొక్క ప్రభావము గోచరించుచున్నది. కాని వీటినిగురించిన వివరములు ఏవియు తెలియుటలేదు. ద్రావిడులు తమ కళా సంప్రదాయమునకు చెందిన వక్రరేఖావృతమైన దేవళముల వంటి కొన్ని విశిష్ట శిల్పలక్షణములు గుహావాస్తుశిల్పమున ప్రవేశపెట్టిరని ఈగుహాలయములు తెలియజేయుచున్నవి.

పశ్చిమ భారతదేశమందలి గుహవాస్తు శిల్పము బీహారు, ఒరిస్సా, మద్రాసు, ఆంధ్రప్రదేశము అను తావులందలి శిల్పములకంటె అత్యుత్తమమైనది. ఆ ప్రాంతమున గొప్ప పరిమాణముగల గుహలు త్రవ్వబడి అంతస్తులు కలవిగా నున్నవి. ఇవి దాదాపు వేయివరకు కన్పించుచున్నవి. అవి విస్తృతములై, కళ యొక్కయు సౌందర్యము యొక్కయు, గాంభీర్యముయొక్కయు దృష్టిచే విశిష్టములైనవి. పశ్చిమ కనుమలయందలి శిలాసంచయము తేమకు చొరరానిదై వాస్తుశిల్పమునకు అనువుగా మెత్తని రాళ్ళ పొరలచేతను, కఠినమైన రాళ్ళ పొరలచేతను అంతరితమై యున్నవి. ఈ వేయి గుహలలో 72 బౌద్ధమత గుహాలయములును, 160 బ్రాహ్మణ మత దేవాలయములును, 35 జైనమత దేవాలయములును గలవు. బౌద్ధ గుహాలయములు మరల హీనయాన గుహాలయము లనియు, మహాయాన గుహాలయము లనియు ద్వివిధముగా వర్గీకరింపబడవచ్చును. వీటిలో ప్రాచీన విభాగమునకు చెందిన హీనయానమువారు కేవలము నైతిక దృక్పథమును ఆధారము చేసికొనిరి. అందుచే వారు బుద్ధుని విగ్రహమును పూజింపరు. సాధారణముగా స్తూపమును, అతని పాదములను లేదా చక్రమువంటి బౌద్ధచిహ్నములను

చిత్రము - 113

పటము - 8

ధర్మచక్రము

మాత్రమే వారు పూజింతురు. బుద్ధునికి పిదప దాదాపు 500 సంవత్సరములకు నాగార్జునాచార్యుడు మహాయాన

మతశాఖను ప్రవేశపెట్టి, అందు బుద్ధ విగ్రహమునకు పూజారాధనలు కల్పించెను. నాగార్జునుని మహాయాన మతశాఖ మూలకముగా శిల్పకళాభివృద్ధికి ఎక్కువ అవకాశము కలిగినది. బౌద్ధ వాస్తుశిల్పమునందు ఈ క్రింది వివరములు కాననగును. (1) స్తూపములు (2) అలంకృతమైన ప్రాకారములు (3) చైత్యశాలలు (4) విహారములు (5) పొంధీలు అనబడు నీటి కుండములు.

కథియవాడ : కథియవాడ ప్రదేశమునందు మిశ్రమజాతి ప్రజలు నివసించుచున్నారు. అశోకుని కాలమందును, తదనంతర కాలమందును వీ రందరును బౌద్ధమత ప్రవిష్టు లైనట్లు కన్పడుచున్నది. ఈ ప్రాంతమున అశోకచక్రవర్తి వ్రాయించిన ప్రఖ్యాతశాసనములు కొన్నికలవు. గిర్నార్ పర్వత మందును, దానిపరిసర ప్రాంతము లందును ఈనాటికిని అశోకుని శాసనములయొక్క శిథిలావశేషములు కానవచ్చుచున్నవి. కథియవాడలోకూడ దాదాపు 140 గుహలున్నవి. కాని గణనీయమైన చైత్యశిల్ప మొకటియు అచ్చట కానిపించదు. 15 నుండి 20 అడుగుల లోతుగల పెక్కు ఆలయములనదగినవి కలవు. వీటియందు దాగోబాలు (ధాతుగర్భములు) కలవు. కాని స్తంభములులేవు. విహారములు కూడా స్తంభములులేని శాలలుగ నున్నవి. వరండాలకు మాత్రము స్తంభాధారములు కలవు.

జునగడ్ వద్ద, జుమ్మామసీదునకు ఉత్తరమునగల ఉపార్కోట దుర్గము దిగుడు వంపులలో రాతిలో మలచబడిన కొన్ని శాలలున్నవి. అచ్చటి శిల్పము చాలవరకు మాసిపోయి యున్నది. ఐనను, అచ్చట క్రింది అంతస్తునందున్న పడసాల యందలి ఆరుస్తంభములపై కాననగు స్థాపత్య రచనా సంపదలు నిస్తులములుగ నున్నవి. 11 చదరపు అడుగుల వైశాల్యముగల సుందరమయిన కొలనుకలదు . ఆ కొలనికి మూడుప్రక్కలయందు శిల్పవిన్యాసముకల ఒక వసారాయును అచ్చటకలదు. కొండ పైభాగమునకు ఈ కొలను నుండి గొట్టములద్వారమున నీటిని చేరవేయు గొప్ప ఏర్పాటుకలదు. ఈ కొలను పైభాగమున స్తంభములుగల సాలలును, రేఖావిన్యాసముగల ఎబాసీ (abaci)యు గలవు.

ఆర్. ఎం. జో.