సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మూడవ సంపుటము/గుఱ్ఱపు దళము

గుఱ్ఱపు దళము :

యుద్ధశాస్త్రమునకు సంబంధించిన చరిత్రను పరిశీలించినచో యుద్ధ ప్రక్రియలో మొట్టమొదటిసారిగా గుఱ్ఱపు దళమును క్రీ. పూ. 1288 లో ఈజిప్టునకును “హిట్టీస్ ’ జాతివారికిని నడుమ జరిగిన 'కోడెష్ పోరాటమందు ఉపయోగించినట్లు తెలియుచున్నది. ఈ యుద్ధమునకు చెందిన లిఖిత పత్రములనుబట్టి పదాతులుగా, రథికులుగా, విలుకాండ్రుగా, ఆశ్వికులుగా ఈజిప్టు సైనికనివహములు విభక్తములై యుండినట్లును, వారు ఆశ్వికదళ యుద్ధ పటిమను అత్యున్నతస్థాయికి కొంపోయినట్లును బోధపడుచున్నది. గ్రీకులకంటె, పర్షియనులకంటె, వేల సంవత్సరములకు పూర్వమే ఈజిప్షియనులు ఆశ్వికదళములను వాడుకలోనికి తెచ్చియున్నను, యుద్ధశాఖా పరిపాలన విధానమందును, గుఱ్ఱపు దళములను పార్శ్వ స్థానముల నుండి శత్రువులపై లంఘింపజేయు వ్యూహములందును, శత్రువును భ్రమింపజేయుటయందును, తదితర విషయములలోను గ్రీకులు ఈజిప్షియనులకంటె మిన్నగా వ్యవహరించినట్లు ధ్రువపడుచున్నది. గ్రీకులు క్రీ. పూ. 500 సం. నాటికి రథ, తురగ సమూహములను యుద్ధమునకై ఆయత్తము చేసినట్లును, అత్యున్నతమైన చలనశక్తితో, నైపుణ్యముతో, నైతికబలముతో, పర్షియను సైన్యములను పెక్కు యుద్ధములలో ఓడించినట్లును తెలియుచున్నది. కాలక్రమమున ఆశ్వికయుద్ధ విధానమును గ్రీకుల నుండి రోమనులు అభ్యసించి అనుభవము గడించిరి.

పూర్వయుగమందు ఆశ్వికులు, పదాతులు అను ఇరు తరగతుల సైనికులు మాత్రమే యుండెడివారు. అశ్వికులు ఆసియాఖండములో జరిగిన యుద్ధములలోను, పదాతులు ఐరోపా యుద్ధములలోను పాల్గొనిరి.

దక్షిణ ఐరోపా ఖండములో యుద్ధాశ్వముల పెంపకము చాల తక్కువ స్థాయియం దుండెడిది. అందువలన రోమక గ్రీసు దేశములయొక్క ఆశ్వికదళములు బలహీనములై యుండెను. ఆ కాలమున యుద్ధఫలితములు సైనికుల సంఖ్యాబలమును బట్టిగాని, అస్త్రశస్త్రముల పాటవమును బట్టిగాని, సుశిక్షణమును బట్టిగాని నిర్ణయింప బడెడివి. కాగా, ఒక ఆశ్వికదళము శత్రువుయొక్క ఆశ్వికదళమును ఢీకొన్నపుడు ఫలితము ఇదమిత్థమని నిర్ణయించుట అసాధ్య మయ్యెడిది. గ్రీసుదేశములోని పర్వత ప్రాంత మందలి ఆశ్వికదళము పదాతిదళము ఉక్కడచుటకు శక్తి చాలక యుండెడిది. క్రీ. పూ. 490-479 నడుమ జరిగిన గ్రీసు - పర్ష్యా యుద్ధమందు ఈ విషయము ప్రత్యక్షముగ రుజువయ్యెను. కాని ఆసియా మైనరులోని మైదాన ప్రాంతములందు అశ్వికదళములు పదాతిదళములను మట్టు పెట్ట గలుగుచుండెను. ఈ రెండు యుద్ధాంగములకు స్వతస్సిద్ధమైన ప్రత్యేక లక్షణములు కలవు. అందువలన యుద్ధరంగమందు ఒక సేనాంగమందు గల లోపమును మరియొకటి సరిదిద్దగలిగి అవి రెండు అన్యోన్య సహకారముతో శత్రుసైన్యములతో తలపడ గలిగెడివి.

ఋగ్వేదమందు యుద్ధాశ్వముల యొక్కయు, అశ్వములు పూన్చిన యుద్ధరథముల యొక్కయు ప్రస్తావన గలదు. కాని ఆశ్వికదళముల ఏర్పాటు, వాటి శిక్షణము కొరకు అశ్వశాలల నిర్మాణము వేదకాలమునకు తరువాతనే జరిగియుండునని పలువురు పండితులు అభిప్రాయ పడుచున్నారు. చారిత్రకముగా మనకు తెలిసినంతవరకు సశాస్త్రీయమైన ఆశ్వికదళముల నిర్మాణము క్రీ. పూ. 12 వ శతాబ్దిలో తొలిసారిగా అస్సీరియాలో జరిగిన దనుట వాస్తవముగ కన్పట్టుచున్నది. క్రీ. పూ. 20 వ శతాబ్దములో యుద్ధరథములున్నట్లు ప్రమాణము లున్నవి. కాని అశ్వములు లాగెడి యుద్ధరథములు వేదకాలమందున్నపుడు, ఆశ్విక శిక్షణశాలలుగూడ ఆ కాలమందుండి యుండవలయును.

కనుక, ఆశ్వికశిక్షణ, ఆకారణముగా అశ్వశాలలు వేదకాలపు భారతీయులకు తెలిసియుండుటకు తగిన కారణము లున్నవి. “మిటన్నీ” అను నొక తెగలో భారతీయుల ప్రసక్తి వచ్చియుండెను. “కిక్కులీ" అను పేరుగల ఒక "మిటన్నీ" తెగకుచెందిన యాతడు "హిట్టైట్" ప్రభువుల ప్రయోజనార్థము అశ్వికశిక్షణమును గురించి యొక గ్రంథమును రచించెను. ఇతని మాతృభాష “హుర్రైట్”. ఇది 1938 లో ప్రప్రథమముగ ప్రచురింప బడెను. ఇది క్రీ. పూ. 14 వ శతాబ్దిలో విరచితమయి యుండునని పండితులు అభిప్రాయ పడుచున్నారు. ఈ గ్రంథములో ఐకవర్తన్న - తేరవర్తన్న - పంజవర్తన్న- సత్తవర్తన్న—నావర్తన్న అనెడి పదములు (సెమెటిక్ భాషకు సంబంధించనివి) కనిపించుచున్నవి. ఇవి అశ్వక్రీడలను తెలిపెడు ఏకవర్తనము, త్రివర్తనము, పంచవర్తనము, సప్తవర్తనము, నవవర్తనము అను సంస్కృత పదముల యొక్క అపభ్రష్టరూపములు. అనగా వేదకాలపు భారతీయులు గుఱ్ఱములకు శిక్షణనిచ్చుట మాత్రమే గాక, అశ్వక్రీడలనుగూడ అభివృద్ధి పరచియున్నారని తెలియుచున్నది. ఈ క్రీడలను తెలిపెడి పారిభాషిక పదములను ఇతర దేశములు సహితము గ్రహించినవనినచో, వాటి వ్యాప్తి ఎంతటిదో గ్రహింపవచ్చును. వేదకాలమందు అశ్వశాల లున్నవని మాత్రము అంగీకరింపవలసి యున్నది.


"వాయుశ్చ మనుశ్చ పంచవింశతి సంఖ్యాకాః
 గంధర్వా శ్చేతిమిలిత్వా సప్తవింశతి సంఖ్యాకాః
 మేపురుషాః తేసర్వే అగ్రే అస్మత్తః పూర్వం
 రద్గే సంయోజితవంతః తేపునస్సర్వే పృష్ఠ సమ్మా
 ర్జనాద్యుపచారేణ అశ్మిన్న శ్వేవేగం సంపాదితవంతః"
 (కృ. య. బ్రాహ్మణము అష్టకము 3 వ ప్రశ్నము 5 వ అనువాకము).

పైన ఉదాహరించిన శ్లోకమంత్రము వలన వేదకాలమున గుఱ్ఱములకు 'మాలీషు' చేయు విధానము కలదనియు, ఇట్లు మాలీషు చేయుటవలన గుఱ్ఱమునకు నూతనశక్తియును, నవ్యోత్సాహమును సమకూడు ననియు స్పష్టమగుచున్నది. ఇంకను, ఇరువదిఏడుమంది ఆశ్వికులకు తక్కువగాని ఆశ్వికదళములానాడు ఉపయోగింప బడెననియు ధ్రువపడుచున్నది. ఈ ఆశ్వికులు 'ఆజిందావనము' నకును (గుఱ్ఱపు పందెములకు), రాక్షసులపై యుద్ధమునకు వెడలుటకును ఉపయోగపడు చుండిరని పై మంత్రార్థమును బట్టి ఊహించుకొన వచ్చును.

భారతయుద్ధమందు చతురంగబలములలో ఒకటిగా ఆశ్వికదళమునకు ప్రాముఖ్యమున్నట్లు భారత ఇతిహాసము వలన బోధపడగలదు. ఒక అక్షౌహిణీ సైన్యములో 65,610 గుఱ్ఱములుండెను. నకులుడు అశ్వశిషయందు కుశలుడై యుండెను. అయితే రథ, గజ, పదాతి బలములతో పాటుగా, ఆశ్వికదళములకు సమాన ప్రతిపత్తి యున్నట్లు తోచదు. ఈనాడు వ్యూహరచనయందు, శత్రువును తునుమాడుటలో కౌశల్యమును ప్రదర్శించుట యందు, క్లిష్టమైన పెక్కు ఇతర బాధ్యతలను నిర్వర్తించుట యందు, సుశిక్షణము అలవరచు కొనుటయందు ఉన్నతమైన ప్రజ్ఞావిశేషమును, అభివృద్ధిని ఆశ్వికులు సాధించినంతగా, ఆనాటి కౌరవ పాండవుల ఆశ్వికులు సాధించియుండలేదేమో! ఈ విషయమందు ఇంతకంటె అధికముగా సమాచారమును సేకరించుటకు చారిత్రకాధారములు కానరావు.

క్రీ. పూ. 4 వ శతాబ్దిలో కౌటిల్యునిచే రచింపబడిన "అర్థశాస్త్రము" అను గ్రంథమందు అశ్వికదళమును గూర్చిన ప్రశంసకలదు. అశ్వములలోగల అనేకరకములను గూర్చియు, వాటి స్వరూప స్వభావాది లక్షణములను గూర్చియు, ఆహార విహారాది. నియమములను గూర్చియు, పెంపకమును గూర్చియు కౌటిల్యుడు వివరముగా పేర్కొని యున్నాడు. పలు తరగతులకు చెందిన అశ్వములు యుద్ధకలాపములకు అనుపయోగ కరములనియు, శౌర్య, పౌరుష, పరాక్రమములు, చలన శక్తి, నైపుణ్యము మొదలైన విశిష్ట లక్షణములతో అలరారు ఉత్తమాశ్వములే సమరమందు వాటి పాత్రను జయప్రదముగ నిర్వహింపగలవనియు కౌటిల్యుడు వాక్రుచ్చియున్నాడు. యుద్ధ ప్రక్రియలందు ఉపయోగ పడని అశ్వములను పౌర, జానపదుల కొరకు వినియోగింపవచ్చునని అతడు చెప్పియున్నాడు.

సమరోపయోగకరములగు అశ్వములలో కాంభోజ, సైంధవ, ఆరట్టజ, వనాయుజములు ఉత్తమములనియు, బాహ్లిక, పా పేయక, సౌవీరక, తైతలములు మధ్యమము లనియు కౌటిల్యుడు అభివర్ణించియున్నాడు. వీటియొక్క తీక్ష్ణ, భద్ర, మందగతుల ననుసరించి కొన్నిటిని సన్నాహ్యములుగను, మరికొన్నిటిని ఔపవాహ్యములుగను విభజించియున్నాడు. గుఱ్ఱములకు సంక్రమించు వ్యాధులను చికిత్సచేయుటకై కౌటిల్యుడు అమూల్యములగు ఔషధ విధానములను గూడ నిర్దేశించియున్నాడు.

కౌటిల్యుని కాలమున అమలునందున్న యుద్ధవ్యూహ రచన యందలి చతురంగ బలములలో ఆశ్వికదళము యొక్క ప్రాశస్త్యమును, దాని విశిష్టతను అతడు ఉదాహరణ పూర్వకముగా వివరించియున్నాడు. యుద్ధరంగ మందు పదాతులు నెచ్చట నిలుపవలెనో, రథముల నెచ్చట ఉంచవలెనో, ఏనుగుల నెచ్చట మోహరింపవలెనో, అశ్విక దళములు నెచ్చట, ఎట్లు ప్రయోగింపవలెనో, శత్రుసైన్యములపై చతురంగబలములను ఎట్లు సమైక్యముచేసి లంఘింపజేయవలెనో కౌటిల్యుడు కన్నుల కట్టినట్లు అద్భుతముగా చిత్రించియున్నాడు.

ఆనాటి యుద్ధాశ్వములు కవచములను ధరించెడివి. యుద్ధ కలాపములలో ఇట్టి ఉత్తమాశ్వములను నియోగించిన కారణముచే ప్రత్యేకమైన నేర్పుతో 'అశ్వ వ్యూహముల'ను పన్నుట ఆరోజులలో పరిపాటియైనది. పక్షముల యందు శుద్ధములగు పదాతులను, పార్శ్వముల యందు అశ్వములను, పృష్ఠభాగముల యందు ఏనుగులను, పురోభాగమున రథములను ఉంచవలెనని కౌటిల్యుడు నిర్దేశించెను.

ఆశ్వికదళ వ్యూహము : ఆశ్వికదళ ప్రవీణుల యుద్ధ వ్యూహము ప్రకారము ఆశ్వికదళములను పదాతిసైన్యముల వెనుక భాగమున సంపూర్ణమైన సంసిద్ధతలో నిలిపెదరు. ఇట్టి ప్రదేశము, ఆశ్వికదళములు స్వేచ్ఛగా కదలుటకు, మెదలుటకు అనువుగా ఉండవలెను. వాటిని శత్రువుపై ప్రయోగించుటకు ఇతర అంగములు వాటికి రక్షణ నియ్యవలెను. ఆత్మరక్షణకై నియోగింపబడు ఆశ్వికదళములు ఇతర అంగములను రక్షించుటలో అప్రమత్తతతో వ్యవహరించును. నిర్మాణమందు శత్రువర్గము బలహీనముగా నున్నప్పుడుగాని, సంధిగ్ధత, అనిశ్చితత్వము గోచరించినపుడుగాని, ఆశ్వికదళములు అదను చూచి శత్రువుపై లంఘించి విధ్వంస మొనర్చును.

శత్రువర్గముపై దాడిచేయు సందర్భములో రెండు శ్రేణులుగా ఏర్పడిన ఆశ్వికదళములు పదాతిదళముల సహకారమును పూర్తిగా పొందగలవు. వెనుకభాగమున సిద్ధముగా నుండు ఇతర ఆశ్వికదళములు ప్రమాద సమయములందు, తమకంటె పూర్వము శత్రువుపై దాడిచేసిన ఆశ్వికదళముల స్థానమును ఆక్రమించును. తమ పార్శ్వభాగములమీద శత్రువు ఆకస్మికముగా దాడి సల్పినపుడు నిలువ (Reserve) లో నున్న ఆశ్వికదళములు ప్రమాదమునకు లోనైన తమపక్షమువారికి సత్వరమే సహాయపడును. కాన, తమకు అండగా పృష్ఠభాగమున తగు సంఖ్యలో అశ్వికదళములు, ఇతర అంగములు సర్వసిద్ధమగు దనుక ప్రథమములో శత్రుసేనలమీద లంఘింప దలచిన ఆశ్వికదళములు అట్టి అవకాశము వచ్చువరకు వేచియుండవలెనుగాని, త్వరపడి సాహసముతో వ్యవహరింపరాదు. మెలకువ, సమయస్ఫూర్తి, చురుకుదనము ప్రదర్శించినగాని గుఱ్ఱపుదళములు శత్రుఘాతము నుండి తప్పించుకొనలేవు.

పృష్ఠభాగమునగల సైనిక దళములకు తగిన రక్షణలేనిదే పదాతి దళములు అగ్రభాగము నుండి శత్రువుపై దాడిచేయుట వ్యర్థమైనసాహసకార్యముగా భావింపబడు చున్నది. సాధింపబడిన కీలకస్థానములను సంరక్షించుకొననిదే, ఆశ్విక దళములు అగ్రభాగమున నుండుట అనర్థదాయకమగును. ఒక్కసారిగా పదాతిదళములు, ఆశ్విక దళములు ఏకమై యుద్ధచర్యకు ఉపక్రమించునపుడు, పదాతిదళములు స్వేచ్ఛగా సంచరించుటకై అవసరమైన స్థావరములను ఏర్పరచుకొనుటయు, ఆశ్విక దళములు దాడి వెడలుటకు అనువైన పాటవమును సమీకరించు కొనుటయు ప్రయోజనకరములుగా నుండును. వీటిలో పదాతి సైన్యమును ఫిరంగితోను, ఆశ్విక సైన్యమును గుండుతోను పోల్చవచ్చును. ఫిరంగి, గుండు ఈ రెండును అన్యోన్య సహాయముతో శత్రువునకు నష్టము ఘటిల్ల జేయునట్లు కాల్బలము, గుఱ్ఱపుదళము ఈ రెండును అన్యోన్య సహాయ సహకారములతో బలీయమైన విధ్వంసకశక్తిగా రూపొందగలవు.

అనాదినుండి ఈ నాటివరకుగల యుద్ధచరిత్రమును సమీక్షించిన యెడల, పార్శ్వరక్షణమందు ఆశ్విక దళము అతిముఖ్యమైన పాత్ర నిర్వహించినట్లు స్పష్టము కాగలదు. కాన యుద్ధములలో ఉభయపార్శ్వములనురక్షించు ఆశ్విక దళములను హతమొనర్చుట ముఖ్యమైన కర్తవ్యముగా పరిగణింపబడుచున్నది. ఆశ్విక దళములను నిర్మూలింపగనే, ఉభయపార్శ్వములపైననే గాక, వెనుకభాగముపై గూడ జయప్రదముగా దాడిచేయ సాధ్యమగును. ఆశ్విక దళములు శత్రువులపై దాడి సల్పుటకు అనువైన స్థావర ములను నిర్మించుట పదాతి దళముయొక్క లక్ష్యమని చెప్పనగును. శత్రువుయొక్క ఆశ్విక దళములను తెగటార్చుటగూడ స్వపక్షమునకు చెందిన ఆశ్విక దళముయొక్క ప్రధానలక్ష్యమై యుండవలెనని యుద్ధనిపుణుల అభిప్రాయము. శత్రు పదాతిదళములను కనుమరగి వంచించుట, అదనుచూచి ప్రతిఘటించుటకు శత్రువునకు అవకాశము నియ్యకుండ వెనుక భాగమును దునుమాడుటకు అవసరమైన వేగమును సంపాదించుకొనుట రెండవ బాధ్యతగా గుర్తెరుగవలెననిరి. శత్రువుయొక్క సైనిక వ్యూహ నిర్మాణము, యుద్ధపాటవము తమవాటికంటె మిన్నగా నున్నపుడు, పైన పేర్కొన్న చర్యక్లిష్టమైనదిగా నుండును. కాన నిర్మాణము, వ్యూహము, నాయకత్వము, సహకరించి శక్తిమంతములుగా నున్నపుడే, ఆశ్వికదళము యొక్క చతురత, చలనశక్తి, త్వరితగతి, అభివృద్ధియై ప్రచండమైన యుద్ధాంగముగా వ్యవహరింప గల్గును.

అలెగ్జాండరు కాలమునుండి ఆశ్వికదళము ప్రధానమైన యుద్ధాంగమాయెను. క్రీ. పూ. 218, 216 సం. లలో జరిగిన 'ట్రెబ్బియా' 'కాన్నా' యను యుద్ధములలో రోమనులకు ఆశ్వికదళములు లేనందువలన కార్తేజియన్ ఆశ్వికబలములు వారిని నుగ్గునూచము చేయగలిగెను. ఇదే విధముగ రోమకచక్రవర్తి యగు జూలియస్ సీజర్ కాలములో, పార్థియన్ సేనానివలన, రోమన్ సైన్యములు, ఘోరమైన ఓటమి చెందెను. ఆశ్విక పదాతిదళములను సంయోగము చేయుటకు మారుగా, రెండింటిని వేరుపరచి, ఒక్కదాని మీదనే ఆధారపడుటవలన ఈ ఓటమి సంభవించెనని చరిత్రకారులు వ్రాసియున్నారు.

క్రీ. శ. 378 లో జరిగిన 'ఏడ్రియా నోపిల్' యుద్ధముతో అశ్వికదళ శకము ప్రారంభమాయెను. సంగ్రామ చరిత్రలో ఇది నూతనాధ్యాయముగా చెప్పబడుచున్నది . మొట్టమొదటిసారిగా ఆశ్వికదళము జయాపజయములు నిర్ణయింపగల 'షాక్ ట్రూప్స్' (ఆకస్మికముగ అదురు దెబ్బ కొట్టగలది) గా పరిణామము చెందినది. పూర్వమువలె గాక, 'షాక్ ట్రూప్స్' స్వతంత్ర శక్తిగా శత్రువుతో తలపడి విజయము సాధించుటకు ప్రారంభించెను. అప్పటినుండి 1000 సంవత్సరముల వరకు యుద్ధ వ్యూహమునందు ఆశ్విక దళములదే పైచేయి యైనది. ఈ కాలమందు అత్యద్భుతమైన కౌశల్యము కలిగిన విలుకాండ్రతో మాత్రమే ఆశ్వికదళములను నిర్మించుటకు సైనికనిపుణులు నిశ్చయించిరి. అత్తిలుని అనంతరము అఖిలప్రపంచమును గడగడలాడించిన మంగోలియా నాయకుడు చెంఘిస్ ఖాన్ యొక్క నాయకత్వమున విలుకాండ్రతో ఆశ్వికదళముల నిర్మాణము సంపూర్ణముగా అభివృద్ధిచెందెను. అనుపమానమైన ఈ ఆశ్వికదళముల సహాయమున చెంఘిస్ ఖాన్ అసంఖ్యాకములైన విజయములను సాధింపగల్గెను. ఇతడు ప్రయోగించిన షాక్ ట్రూప్స్ యొక్క ప్రచండమైన శక్తి, పెక్కు భంగులలో జర్మన్ ఫాసిస్టులు గతయుద్ధమున ప్రయోగించిన “బ్లిట్జ్ క్రిగ్” విధానమును పోలియుండెనని ఆధునిక సైనిక వ్యాఖ్యాతలు అభిప్రాయపడిరి.

17 వ శతాబ్దిలో అశ్వికదళముల సంఖ్య ఇతర సేనాంగములకంటె అత్యధికముగా నుండెను. ఆ శతాబ్దములో ఇంగ్లండులో జరిగిన అంతర్యుద్ధములో ప్రజాప్రతినిధుల సైన్యములోకంటె రాజుపక్షపు (Royal) సైన్యములో, ఆశ్విక సైనికుల సంఖ్య అధికతరముగా నుండెను. ఈ యుద్ధమందును, పిదప ఐరోపాఖండములో జరిగిన అనేక యుద్ధములందును కత్తులు, కటారులు, బల్లెములు, ఈటెలు, తుపాకులు మొదలైన ఆయుధములు ధరించగల పెక్కు శ్రేణులకు చెందిన అశ్వికదళములు ఉపయోగపడినవి. అయితే శక్తిమంతములైన నూతనాయుధములు అవతరించినంతనే, ఆశ్వికుని ఖడ్గకుంతలాదులు ప్రాతపడి, ఆశ్వికదళముల ఉపయోగము నుండి దూరమయ్యెను.

వేయిసంవత్సరముల కాలము అప్రతిహతమైన శక్తిగా వెలుగొందిన ఆశ్వికదళము ఇపుడు తన ప్రత్యేకమైన ప్రాముఖ్యమును కోల్పోయి ఇతర యుద్ధాంగములలో ఒకటియైనది. శత్రుస్థావరములను కనిపెట్టుటకు, శత్రువునకు నష్టము కలుగజేయుటకు శత్రువుల రహదారులకు, సరఫరాలకు చీకాకు కల్గించి ధ్వంసముచేయుటకు ఆశ్వికదళములు అత్యావశ్యకములే కాని, శత్రువును నిర్మూలించుటకు ఆధునిక యాంత్రికయుగములో అశ్వికదళము స్వతంత్రమైన శక్తిగా వ్యవహరింపజాలదని పెక్కు యుద్ధశాస్త్రపారగులు నుడువుచున్నారు. "ఫ్రెడరిక్ ది గ్రేట్" అను ప్రష్యాప్రభువు కాలములో ఆశ్వికదళముల ప్రాధాన్యము మరల హెచ్చెను. అతడు చేసిన 22 యుద్ధములలో, 15 యుద్ధములందు తుపాకుల సహాయమును పొందిన, సుశిక్షితములైన ఆశ్వికదళముల యొక్క ప్రయోగమువలన విజయము సిద్ధించెను. 1775-81 లో జరిగిన అమెరికా విప్లవములోను, ఫ్రెంచి విప్లవములోను ఆశ్వికదళముల ప్రాముఖ్య మంతగా కనిపించదు. నెపోలియన్ తన దండయాత్రలందు అనేకములైన ఆశ్వికదళములను ఉపయోగించినను, వాటిని ప్రముఖముగా శత్రువుల జాడలను అరయుటయందును, రహదారుల యొక్క పరిశీలనమందును, ఆత్మరక్షణ మందును, శత్రువును తరుముటయందును మాత్రమే వినియోగించెను.

భారతదేశమందు 1857లో బ్రిటిషు ప్రభుత్వముపై జరిగిన ప్రథమ స్వాతంత్ర్య పోరాటములో భారతీయులును, బ్రిటిష్ సైనికులును భారీయెత్తున ఆశ్వికదళములను ఉపయోగించినట్లు లిఖితపూర్వకములైన ఆధారము లున్నవి. అంతకుపూర్వము హిందూ-ముస్లిమ్ ప్రభువుల నడుమ జరిగిన పెక్కు యుద్ధములలోను, మహారాష్ట్రులకు బ్రిటిష్ ప్రభుత్వమునకు మధ్య జరిగిన పోరాటములలోను, ఇరుపక్షములవారును ఆశ్వికదళములను విరివిగా ఉపయోగించినట్లు చారిత్ర కాధారము లున్నవి.

రైఫిల్‌యొక్క ప్రవేశముతో ఆశ్వికదళ వ్యూహములు అంతరించినవనియు, ప్రత్యేకమైన కీలక ప్రాముఖ్యముగల కొన్ని యుద్ధకలాపములలో మాత్రమే ఆశ్వికదళము లుపయోగపడగలవనియు ఆధునికులైన కొందరు యుద్ధతంత్రజ్ఞులు అభిప్రాయపడిరి. కాని 1914 వ ప్రపంచ సంగ్రామములో బహుళ సంఖ్యాకములైన ఆశ్విక దళములు పాల్గొనెను. బ్రిటిష్, ఫ్రెంచి, జర్మన్, రష్యను ప్రభుత్వములు ప్రత్యేకమైన పెక్కు ఆశ్విక దళములను నిర్మించెను. చరిత్రలో మున్నెన్నడును కనివిని ఎరుగని రీతిని మొదటి ప్రపంచ సంగ్రామమున 1916లో పదిలక్షల ఆశ్వికులు యుద్ధరంగములన్నిటిలో పాల్గొనిరి. వీరి పాత్ర అత్యంత ప్రాముఖ్యము వహించినదని పెక్కురు భావించి యున్నారు. ఈ యుద్ధమందు విమానదాడుల భీతి నుండి విముక్తమైన ఇరుపక్షముల యొక్క ఆశ్వికదళములు శత్రువర్గముయొక్క సైనిక నివహములపైగాక ప్రధాన సైనిక కార్యాలయములపై, సరఫరా కేంద్రములపై, రైలు మార్గములపై తమ దృష్టిని కేంద్రీకరించి వాటిని విశేష నష్టముల పాల్జేసెను.

ఆధునిక యుగములో అనుపమానమైన విధ్వంసకశక్తి గల మారణాయుధములు పెక్కులు కనుగొనబడినను, ఆశ్విక దళమునకు గల ప్రాధాన్యములో ఇప్పటికిని మార్పురాలేదు. దీనికి సంబంధించిన యుద్ధ వ్యూహమునకు భంగమువాటిల్లలేదు. ఆధునిక సైనికావసరములను పురస్కరించుకొని ఆశ్వికదళములు గూడ యాంత్రిక (Mechanised) మొనర్పబడినవి. తరగతుల వారిగా యాంత్రిక మొనర్పబడిన ఆశ్వికదళములు వాటి కర్తవ్యములను పూర్వము కంటె చురుకుగా, శక్తిమంతముగా నెరవేర్చుచున్నవి. వీటికి సహాయపడు ఇతర యుద్ధాంగములు కూడ తమ ప్రత్యేక బాధ్యతలను సౌలభ్యముతో నిర్వహించుచు, త్వరగా జయమును సాధింపగలుగుచున్నవి. మారణ యంత్రములందు కాలానుగుణములైన మార్పులు ప్రవేశపెట్టబడనిచో యుద్ధశాస్త్రము పరిణతి నొందదు. భౌతికావసరములను బట్టి మానవుని యొక్క సృజనాశక్తి ఇతర రంగములలో వలెనే సైనిక రంగమందును అతిశయించుచున్నది. ఈ శక్తిని వినియోగించుకొనుటలో నేటి యుద్ధశాస్త్ర ప్రవీణులు దూరదృష్టిని ప్రదర్శించుచున్నారు. ఆశ్విక దళములలోను, ఇతర యుద్ధాంగములలోను కలుగుచున్న అభివృద్ధులు, మార్పులు ఇందుకు తార్కాణములు. ఆశ్విక దళములు ఈ కాలపు యుద్ధప్రస్థానమునందు అత్యల్ప పాత్రను వహించుననియు, అందుచే నిరుపయోగకరములనియు కొందరు సిద్ధాంతీకరించియున్నారు. అమెరికా సైన్యములో ఆశ్వికదళశాఖ రద్దుచేసియున్నారు. కాని రష్యావారు ఈసిద్ధాంతము నంగీకరించలేదు. రష్యా జర్మనీయుద్ధములో యాంత్రికమొనర్పబడినసోవియట్ ఆశ్వికదళముల పాత్ర ప్రపంచమును చకితముగా నొనర్చినది. రష్యనులు మూడు డివిజనులలో 20,000 మంది ఆశ్వికులను వినియోగించుట నిరుపమానమైన అంశముగా సైనిక శాస్త్రవేత్తలు ప్రశంసించియున్నారు. జర్మనులు ఒక్క ఆశ్విక దళమును మాత్రమే యాంత్రిక మొనర్చినందులకు ఆనాటి జర్మన్ సైనికాధికారులు విచారపడిరట! రెండవ ప్రపంచ సంగ్రామానంతరము సోవియట్ ప్రభుత్వము తన ఆశ్వికులను 50,000 సంఖ్యాకులనుగా అభివృద్ధిచేసి, వారి పాటవ శక్తినిగూడ సమగ్రముగను, క్రమానుగతముగను పెంపుచేసినదని తెలియుచున్నది.

టాంకుదళములకును, ఇతర యాంత్రిక సైనిక నివహములకును ఆశ్వికదళములు బలీయములైన అనుబంధములుగా పరిగణింపబడుచున్నవి. ప్రాదేశిక, వాతావరణాది స్థితిగతులనుబట్టియు, లెక్కించి అంచనా కట్టుటకును (logistics) బట్టియు, ఇతర యాంత్రిక అంగములకు అసాధ్యమగు కార్యకలాపములయందు ఆశ్వికదళములు ఉపయోగింపబడుచున్నవి. టాంకులు అతిస్వల్ప సంఖ్యలో మాత్రమే ఉపయోగపడు వానకాలమందు ఆశ్వికదళములు ఎంతయు ప్రయోజనము చేకూర్చును.

పై అంశములనుబట్టి ఆశ్వికదళముల యుపయోగము ఈ యాంత్రిక యుగములోకూడ కలదని స్పష్టమగు చున్నది. ఆశ్విక యుద్ధనిబంధనములను ప్రస్తుతకాలమునకు అనుగుణముగా నిబంధించి, ఆశ్వికదళముల శక్తి సామర్థ్యములను పెంపుచేసినచో, అశ్వము, ఆశ్వికుడు, ఆశ్వికదళము యుద్ధశాస్త్రము నందును సమరాంగణము నందును ప్రముఖపాత్ర వహించు ననుటకు సందేహము లేదు.

ప్ర. రా. సు.