సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మూడవ సంపుటము/గురుమూర్తిశాస్త్రి

గురుమూర్తిశాస్త్రి :


శ్రీపైడాల గురుమూర్తిశాస్త్రి క్రీ. శ. 18 వ శతాబ్దము వాడు. ఆంధ్రుడు. ములికినాటి బ్రాహ్మణుడు. తమిళ దేశమునందుగల తిరునల్వేలిమండలమునందలి కయత్తార్ అను గ్రామమున నివసించినవాడు. అనేక శాస్త్రముల యందు సంపూర్ణ పాండిత్యము కలవాడు. సంగీతశాస్త్ర లక్ష్యలక్షణముల నెరిగినవాడు. గానముచేయుచు వాగ్గేయ కారుడై కీర్తి నార్జించిన ఘనుడు. గీతము, లక్షణగీతము, ప్రబంధము, దరువు, స్వరజతి, తానవర్ణము, పదవర్ణము, పదము, కృతి, కీర్తన, తిల్లానము, జావళి మొదలైన సంగీత రచనా భేదము లతని కాలమునకే ప్రచారమునకు వచ్చియుండెను. ఐనను సమకాలికు లెల్లరును గీత, ప్రబంధ రచనల యందే మిక్కుటముగ ఆసక్తి గలవారలై ఆ రచనలనే చేయుచుండిరి.

క్రీ. శ. 16 వ శ తాబ్దమునందు పురందర విఠలదాసు, 17 వ శతాబ్దములో వేంకటమఖి, 18 వ శతాబ్దమునందు కవి మాతృభూతయ్య మొదలగువారు గీత, ప్రబంధ రచనా విశేషముల నధికముగా చేసియుండిరి. పురందర విఠలదాసు సంగీత క్రమశిక్షా విధానములతో పిళ్ళారి గీతములు మొదలైనవాటిని రచించియుండెను. క్రీ. శ. 1577 మొదలు 1614 వరకు చోళమండలము నేలిన అచ్యుతప్ప మహారాజును, ఆతని మంత్రియగు గోవింద దీక్షితులును కలిసి అనేక సంగీత గ్రంథములను రచించి యుండిరి.


"త్రినా మాద్యంత నామానౌ మహీక్షి ద్దీక్షితావిభౌ
 శస్త్రే, శాస్త్రేచ కుశలా వాహవేషు హవేషుచ.

సంప్రదాయముగా వ్యవహారములో నుండిన అచ్యుత, అనంత, గోవింద అను మూడు నామములలో మొదటి నామము అచ్యుతప్ప మహారాజు శస్త్రము నందును, యుద్ధమునందును, అంత్యనామము గల గోవిందదీక్షితులు శాస్త్రము నందును, యజ్ఞకర్మ యందును కుశలురని వారి గ్రంథములందు శపథముచేసియుండిరి. అట్టి గోవింద దీక్షితుల ద్వితీయ పుత్రుడును. చతుర్దండి ప్రకాశిక అను మహా గ్రంథమును రచించినవాడును నగు వేంకటమఖి యొక్క గీత, లక్షణాగీత రచనల ననుసరించి గురుమూర్తిశాస్త్రి స్వనామాంకితముగ వేయి గీతములను రచించియుండెను. అందువలన నితనికి "వేయిగీత" అను బిరుదముగూడ లభించినది.

సంగీత సాహిత్యము లందును, ఆంగ్ల భాషాద్యనేక భాషలయందును విచక్షణుడై సంగీతభోజుడని బిరుదము వహించిన శ్రీ మణలి చిన్నయ ముదలియారు, శ్రీ గురుమూర్తిశాస్త్రిని రావించి వారి పాండిత్యమును, గీత రచనా చాతుర్యమును తెలిసికొని ముగ్ధుడై అనేక విధముల వారిని బహూకరించెను.

ముత్తుస్వామి దీక్షితులవారి జనకుడును, సంగీత సాహిత్య విశారదుడును నగు శ్రీ రామస్వామి దీక్షితునకు గురుమూర్తిశాస్త్రి, తన రచనలను వినిపించి వారి మన్ననల నందినట్లును తెలియుచున్నది. ఈ గీత రచనా చాతుర్యమును గూర్చి విన్న సమకాలికులగు విద్వాంసులును, సంగీత విద్యాసక్తులును ఈ గీతముల నభ్యసించి అనేక విధముల ప్రచారము చేయదొడగిరి.

సంగీత రచనా విధానములలో అనేక మార్గముల నవలంబించి రచనలను చేసి సంగీతప్రపంచమున అపూర్వ సృష్టికర్తలుగా విఖ్యాతి నొందిన త్యాగరాజు, ముత్తుస్వామి దీక్షితుడు, శ్యామశాస్త్రి అనువారల రచనా విధానములలో ఇప్పటి సంగీత ప్రపంచము ఊయల లూగుచున్నప్పటికిని శ్రీ గురుమూర్తిశాస్త్రి విరచితము లయిన గీత రచనలను అభ్యసించని సంగీత విద్వాంసు డుండుట చాల అరుదు.

సంగీత విశారదులగు తర్చూరు సింగరాచార్యులవారు రచించిన గ్రంథములలో “గాయక గాయనీయ పారిజాతము" అనుదానియందును, తదితర గ్రంథములయందును గురుమూర్తిశాస్త్రి, విరచితములయిన గీతములను కొన్నింటిని ముద్రించి యున్నారు. అవి ప్రస్తుత కాలమునందు మిక్కిలి ప్రచారములో నున్నవి. గురుమూర్తిశాస్త్రి గీతములే గాక కీర్తనలు గూడ రచించినట్లు తెలియుచున్నది. శ్రీ గురుమూర్తిశాస్త్రివర్యులు రచించిన కొన్ని గీతారంభము లీ దిగువ జూపబడుచున్నవి:

గీతారంభము (రాగము) (తాళము)
1. జయకరుణాసింధో ధన్యాసి ధ్రువ
2. గానవిద్యాధురంధర నాట ధ్రువ
3. కంసాసుర ఖండన శహన మఠ్య
4. ఆరేయానక దుందుభి నాట ధ్రువ
5. ఆరభి రాగలక్షణం ఆరభి జంపె
6. పాహీ శ్రీరామచంద్ర ఆనందభైరవి ధ్రువ
7. పాలయనాగేశ్వర బిలహరి మఠ్య
8. భువనత్రయ మోహన కాంభోజి ధ్రువ
9. జానకీరమణ తే నమోనమో నీలాంబరి త్రిపుట

ఇట్లనేక రాగతాళములలో గీత - లక్షణ గీతలను రచించి వాసిగాంచి విద్వజ్జన శ్లాఘనీయుడయిన మహా వాగ్గేయకారుడు గురుమూర్తిశాస్త్రి. ఇతడు అజరామర కీర్తివిరాజితుడు.

తి. న. చ. వేం. నా.