సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మూడవ సంపుటము/గుజరాతీ భాషాసాహిత్యములు
గుజరాతీ భాషాసాహిత్యములు :
భాష : గుజరాతీ భాష మనదేశములోని మహాగుజరాతు రాష్ట్రవాసుల మాతృభాషయై యున్నది. “గుర్జ రత్ర" అను శబ్దమునుండి గుజరాతు అనుమాట ఏర్పడినది. ఘూర్జరులు విదేశమునుండి ఏతెంచిన ఒక తెగవారనియు, వారు వాయవ్యదిశనుండి మనదేశమునకు క్రీ. శ. 400-600 నడుమవచ్చి పశ్చిమమున గుజరాతు ప్రాంతమున స్థిరపడిరనియు చరిత్రకారులు నిర్ణయించిరి.
గుజరాతీ భాష ఇండో-ఆర్యన్ భాషాకుటుంబమునకు చెందినది. అది సంస్కృతము నుండి జనించినది. సంస్కృతమునుండి ప్రాకృతమును, శౌరసేనీ ప్రాకృతమునుండి నాగర అపభ్రంశమును, దానినుండి గుజరాతీ భాషయు క్రమముగ రూపొందినవి. క్రీ. శ. 12 వ శతాబ్దమునందు హేమచంద్రుడను ప్రసిద్ధజైనపండితుడు నాగర అపభ్రంశములో ఒక వ్యాకరణమును రచించెను. అప్పుడు గుజరాతు దేశము నేలుచున్న జయసింహ సిద్ధరాజు అను చాళుక్య ప్రభువు ఆ వ్యాకరణ గ్రంథమును ఏనుగుపై నూరేగించి, గౌరవించుటయే గాక, దాని ప్రతులను భారతదేశములోని ఇతరరాజాస్థానములకుకూడ పంపెను. ఆ గ్రంథమునుబట్టి నాటి భాషాస్వరూపమును తెలిసికొనుటకు సాధ్యమగుచున్నది. తరువాత కొంత కాలమునకు గుజరాతీభాషకు ప్రత్యేక రూపమేర్పడినది. ఆ భాష లోని తొలి గ్రంథములలో ఒకటి యగు "ముగ్దావబోధ మౌక్తికము" క్రీ. శ. 1394 నాటిదై యున్నది. అది గుజరాతీ భాషలో రచింపబడిన సంస్కృత వ్యాకరణము. మరి యేబది ఏండ్ల తరువాత నరసింహమెహతా భక్తిగీతములతో గుజరాతీ కాల్పనిక సాహిత్య మవతరించెను. గుజరాతీ భాషకు పశ్చిమ హిందీ, రాజస్థానీ భాషలతో అత్యంత సన్నిహిత సంబంధము కలదు. అది మన దేశమునందేగాక ఆసియా, ఆఫ్రికా ఖండములలోని మరి కొన్ని ప్రాంతములలోకూడ వాడుకలో నున్నది.
సాహిత్యము : గుజరాతీ భాషలో మొదట శృంగార గేయములును, వీరరసప్రధానమైన జాతీయ గాథలును, రాస, నృత్యగీతములును, ప్రశ్నోత్తర రూపమున ప్రకృతిలోని వింతలను, విశేషములను చమత్కారముగ వర్ణించు పొడుపుకథలును, పల్లెపట్టుల యందు మౌఖిక ప్రచారము నందుచుండెను. ఈ జానపద సాహిత్యము అచ్చటి గ్రామీణ జీవన మాధుర్యమును మనోహరముగ ప్రతి ఫలింప జేయుచున్నది. మొదట శిష్ట సాహిత్యమునకు రూపురేఖలు దిద్దినవారు జైనభిక్షువులు. వారు తర్క వ్యాకరణాది శాస్త్రములను, ధార్మిక - ఆధ్యాత్మిక గ్రంథములను, నీతి కావ్యములను పెక్కింటిని రచించిరి. క్రీ. శ. 15 వ శతాబ్దమున గుజరాతీ సాహిత్యరంగమున జైనపండితుల ప్రాముఖ్యము అంతరించెను.
అది దేశము కృష్ణకథా సుధారస తరంగములలో ఓలలాడుచుండిన కాలము. నాడు ఏ వంక జూచినను కవులు గోకులమునందలి గోగోపికాగణమును, యమునా తటమున విరియబూచిన కదంబవృక్ష పంక్తులను, బృందావనమున శారద రాత్రులలో రాధికా శ్యామ సుందరుల మహారాసోత్సవమును కోరికోరి వర్ణించుచుండిరి. అప్పుడే మహాభక్తురాలైన మీరాబాయి ' గిరిధర' గోపాలునిపై తన అనురాగాతిశయమును వెల్లడించు ప్రేమభక్తి గీతములను రచించెను. మీరాబాయి రాజపుత్ర స్థానమునందలి చిత్తోడులో నివసించెను. ఆమె గీతములు గౌర్జరీ అపభ్రంశములో రచింపబడినవి. గౌర్జరీ అపభ్రంశము నుండి గుజరాతీ, మేవాడీ, మార్వాడీ బాష లేర్పడినవి. మీరాబాయి గోపికా భావముతో కృష్ణమందిరములో నాట్యముచేయుచు అప్రయత్నముగ ఆలపించిన గీతము లవి. ఆమె కవిత మధురభక్తికి నిధానము. మీరాబాయి భజన గీతములు ఉత్తర హిందూస్థానమున మిక్కిలి ప్రచారములో నున్నవి.
నాటి భక్త కవులలో అగ్రగణ్యుడు నర్సీ (నరసింహ) మెహతా అనునాతడు. అతడు సౌరాష్ట్రములోని జునాగడ్ లో వసించెను. అతడు భక్తిపూరితములైన పద్యములను, గీతములను పెక్కింటిని రచించెను. పరుల బాధను తెలిసికొనగలవానినే వైష్ణవుడందురనుఅర్థముగల" వైష్ణవ జనతో తేనే కహియే జో పీడ పరాయా జాణేరే" అను సుప్రసిద్ధ భజనగీతము గాంధీమహాత్మునకు అత్యంత ప్రియమైనది. ఇది నర్సీ మెహతా రచించినదే. అతని గీతములు అక్షర రమ్యతకును, మధురభావనకును మిక్కిలి ప్రశస్తి గాంచినవి. నర్సీ మెహతా వర్ణ విభేదములను పాటింపక 'అస్పృశ్యుల' తో చేరి దైవము నారాధించుచున్నాడని సాటివారు అతనిని కులమునుండి వెలివేసిరి. కాని ఆ మహనీయుడు అందులకు చలింపక తాను చిత్తశుద్ధితో నమ్మిన విశ్వాసములను జనులకు బోధించుటకు కవిత్వము నొక సాధనముగ జేసికొనెను.
గుణాఢ్యుని బృహత్కథలోని కథలవంటి శృంగార వీరరస సమంచితములయిన కల్పనాకథలు గుజరాతు రాష్ట్రములో చాల కాలముగ ప్రచారములో నుండెను. వాటిలో ప్రణయపథమున తటస్థించు చిక్కులును, కథానాయకు లొనర్చు వివిధ వీరోచిత సాహస కృత్యములును, నాయికా నాయకుల చతుర సరసా లాపములును మనోరంజకముగా వర్ణింపబడినవి. సామల్ భట్టు అను కవి 17 వ శతాబ్దములో ఇట్టి కథలను ఒక్కచో జేర్చి వాటికి కావ్యరూపమును కల్పించెను. చదువు, చక్కదనము, జాణతనము, సంస్కారముగలిగి, జీవితయాత్రలో ఎదురగు చిక్కులను అతిక్రమించుటలో నాయకులను మించిన లోకజ్ఞానమును ప్రదర్శించు కథానాయికలను ఆతడు తన కావ్యములో వర్ణించెను.
నాటి కవులలో ప్రేమానంద్ అను కవి ముఖ్యుడు. అతడు రామాయణ భారతములందలి సన్నివేశములతో గూడిన రసవంతమైన ఆఖ్యానములను, ప్రసిద్ధ భక్తుడైన నర్సీ మెహతా జీవిత విశేషములను చిత్రించు ఒక కావ్యమును రచించెను. కథన శిల్పమునం దతడు సిద్ధహస్తుడు. ప్రాచీన పౌరాణిక కథలకు అతని లేఖిని క్రొత్త సొగసులను చేకూర్చెను. అతని కృతులలో సమకాలిక సాంఘిక జీవితము చక్కగా చిత్రింపబడినది. ఆభో అను కవి నాడు సమాజములో వ్యాపించిన వంచనను, దుర్నీతిని వ్యంగ్య, హాస్యధోరణిలో అతి నిశితముగ విమర్శించెను. మతముపేర అమాయికులైన పామర జనులను పలు విధములు వంచించు కపటగురువుల రహస్యములను అతడు ప్రజలకు చాటిచెప్పెను. కావ్య రచనకు కావలసిన ప్రతిభా వ్యుత్పత్తులులేని కారణమున శ్రమపడి ఎట్లో నీరసపు మాటలను జోడించి కవిత్వమును చెప్పెడి కుకవులు రోహిణీకార్తెలోని ఉరుములవలె వ్యర్థముగా ధ్వనిచేయుచుందురని అతడు నిరసించెను.
అటుపిమ్మట 18 వ శతాబ్దములో మొగల్ సామ్రాజ్యము విచ్ఛిన్నమయిన తరువాత మహారాష్ట్రుల దండయాత్రల మూలమున గుజరాతు ప్రాంతమున ప్రజలలో శాంతిభద్రతలు లేకుండెను. ఆ అనిశ్చితస్థితిలో ప్రజలు మనశ్శాంతి సంపాదనమునకై ఆధ్యాత్మిక గ్రంథముల నాశ్రయించిరి. నాటి గుజరాతీ కాల్పనిక సాహిత్యములో నవ్యతయు, రమ్యతయు లోపించెను. కొంతకాలమునకు ఈ యరాజకస్థితిపోయి దేశములో పరిస్థితులు చక్కబడెను. రాజకీయాధికారము బ్రిటీష్ ప్రభుత్వమువారి హస్తగతమయ్యెను. ఆనాటి కవులలో దయారామ్ అను కవి చాల ప్రతిభావంతుడు. అతడు 1760 లో జన్మించెను. దయారామ్ గొప్ప విద్వాంసుడగుటచే వ్రజ భాషలో గూడ కవిత్వము చెప్పగలిగి యుండెను. ధ్యేయకవితా రచనయందు అతడు అందెవేసినచేయి అయ్యెను. "గర్భీ" అను నృత్యగీతములను అతడు అతిరసవంతముగ రచించెను. భావోచితమును, లలితమధురమును అగు పదావళిని కూర్చుటయందు అతడు అసమాన నైపుణ్యమును ప్రదర్శించెను. అతడు వల్లభాచార్య సంప్రదాయమునకు చెందిన రాగాత్మక భక్తిని అనేక మధుర గీతములలో వర్ణించెను. శ్రీకృష్ణుని అధరామృతము నాస్వాధించు వేణువును సంబోధించుచు అతడు రచించిన భావగీతము అత్యంత మనోహరమైనది. దయారామ్ 1852 లో మరణించెను. నాటితో గుజరాతీ సాహిత్యమునందలి ప్రాచీన యుగము సమాప్త మయ్యెనని చెప్పవచ్చును.
దేశములో బ్రిటిషు ప్రభుత్వము నెలకొన్న తరువాత సాంఘిక – సాంస్కృతిక రంగములలో పెక్కు మార్పులు కలిగెను. తమ మతమును విద్యను బోధించుటకు క్రైస్తవ మిషనరీలు మన దేశములో క్రొత్తగా విద్యాలయములను స్థాపించిరి. వారి కృషి మూలమున పాశ్చాత్య సభ్యతా సంస్కృతుల ప్రభావము నానాటికి విస్తరింప నారంభించెను. ఆ ప్రభావమునకు లోనైన యువకులలో సంఘ సంస్కరణాభిలాష హెచ్చెను. నిరక్షరాస్యతను, మూఢ విశ్వాసములను, బాల్యవివాహమువంటి దురాచారములను నిర్మూలించి, విధవా పునర్వివాహము మున్నగు నూతన సంస్కరణములను వ్యాప్తిలోనికి తెచ్చుటకై వారు పట్టుదలతో పనిచేసిరి. సామాజిక వ్యవస్థలో కలిగిన ఈ సంచలనము నాటి సాహిత్య క్షేత్రమును సైతము ఆవరించెను. అపుడే నర్మదా శంకర్, దల్పత్ రామ్ అను యువనాయకులు గుజరాతీ సాహిత్యములో నవయుగో దయ నాందీ గీతమును ఆలపించిరి.
నాటి సాంఘిక దురాచారములను గూర్చి ప్రజలలో ప్రబోధము గావించుటయే ముఖ్య లక్ష్యముగా జేసికొని దల్పత్ రామ్ పెక్కు లఘు కావ్యములను రచించెను. గుజరాతీ కవితారచనకు అతడు సంస్కృత వృత్తములను ఉపయోగించి, ఛందో వైవిధ్యమును ప్రదర్శించెను. అతని కావ్యములలో అడుగడుగునను సరసహాస్యము తొంగిచూచుచుండును. దల్పత్ రామ్ గుజరాతీ వచన వాఙ్మయ వికాసమునకు గూడ ప్రశంసనీయమైన సేవ చేసెను. క్లిష్టాన్వయమును, శబ్ద కాఠిన్యమును లేని సరళమైన వచనశైలిని అతడు రూపొందించి ఇతరులకు మార్గ దర్శకుడయ్యెను.
నర్మదాశంకర్ స్వాతంత్ర్యసిద్ధిని అభిలషించు జాతీయ గీతములను, ప్రణయమును, ప్రకృతి సౌందర్యమును వర్ణించు భావగీతములను వ్రాసెను. పాశ్చాత్య సభ్యతలో మానవుని వ్యక్తిత్వమున కొసగబడు ప్రాధాన్యము అతనిని విశేషముగా ఆకర్షించెను. అతని రచనలలో నవ చైతన్యముతో నిండిన వచన గ్రంథములు ముఖ్యముగా ఎన్నదగినవి. ఇతరుల తోడ్పాటులేక యే గుజరాతీభాషకు అతడు తొలి నిఘంటువును గూర్చెను. నర్మదాశంకర్ గుజరాతీ సాహిత్యమునందు ఒక యుగకర్తగా పరిగణింప బడుచున్నాడు. ఆకాలమున గుజరాతీ భాషలో ఆత్మాశ్రయ కవిత్వమునకు ప్రాముఖ్యము హెచ్చెను. ప్రహసనములు, చారిత్రక నవలలు, వ్యాసములు, స్వీయచరితములు మొదలైన నూతన సాహిత్యప్రక్రియ లేర్పడెను.
క్రమముగా మన దేశస్థులకు మొదట పాశ్చాత్య సభ్యతపై ఏర్పడిన వ్యామోహము గళితమయ్యెను. వారి దృష్టి భారతీయ సంస్కృతి మీదికి మరలెను. బొంబాయి విశ్వవిద్యాలయము 1857 లో స్థాపింపబడెను. అచ్చటి పట్టభద్రులలో కొందరు ప్రాచ్య, పాశ్చాత్య సంస్కృతులలోని మేలి గుణములను గ్రహించి సాహిత్యములో క్రొత్త విలువలను కల్పించిరి. యూరప్ ఖండమును 19 వ శతాబ్దములో ఆవరించిన మానవత్వవాదము వారి నాకర్షించెను. షెల్లీ, కీట్సు వంటి ధ్యేయ కవుల ప్రభావమునకు వారు లోనైరి. నరసింహారావు దివేటియా చేసిన కృషి మూలమున గుజరాతీలో అపుడు భావగీతరచనకు ప్రాముఖ్య మేర్పడెను. ప్రకృతితో మానవునకుగల సన్నిహిత సంబంధమును చిత్రించుటలో “కలాపి" అను కవి వర్డ్స్‌వర్త్ మార్గము ననుసరించెను. బాలశంకర్, మణిలాల్ ప్రభృతులు పర్షియన్ భాషలోని “ఘజల్" వంటి గేయములను గుజరాతీలో అతి నిపుణతతో రచించిరి.
నాటి రచయితల యందు అగ్రగణ్యుడై వరలినవాడు గోవర్ధనరామ్ త్రిపాఠీ అను నతడు. అతడు భారతీయ సాంస్కృతిక పునరుజ్జీవన విశేషములను విపులముగ చిత్రించు “సరస్వతీ చంద్ర" అను పెద్ద నవలను నాలుగు భాగములుగా రచించెను. అది గుజరాతీ భాషలో సర్వోత్కృష్టమైన గ్రంథమని విమర్శకుల అభిప్రాయము. జీవకళ తొణకాడు పాత్రలను సృష్టించుటలో అతడు అద్వితీయుడు. ఆతడు సృజించిన కుసుమ, కుముద, గుణ సుందరి, చంద్రావతి ఇత్యాది పాత్రలు సాహిత్యప్రపంచమున కలకాలము నిలచియుందురు. అసహజము, క్లిష్టము నగు కృతకభాషలో ఆ గ్రంథము రచింపబడుట మాత్ర మొక లోపమని చెప్పవలెను.
డాక్టర్ ఆనందశంకర్ ధ్రువ ప్రాచీన భారతీయ సంస్కృతిని గూర్చి లలితమయిన శైలిలో వ్రాసిన గ్రంథములు విశేషముగా పాఠకుల మెప్పును పొందినవి. ప్రార్థన సమాజమునకు చెందిన రమణభాయ్ నీలకాంత్ అను రచయిత ఆ సమయముననే “భద్రం భద్ర" అను తనహాస్య విలసితమయిన నవలలో, సనాతనాచారపరా యణతను పరిహసించెను. ఆ కాలపు కవులలో ప్రముఖుడైన నానాలాల్ అనునతడు పద్య రచనా విషయమున సంస్కృత వృత్తములను వాడుటను మాని శ్రావ్యమైన వచనమును ఉపయోగించి క్రొత్తదారి త్రొక్కెను. అతడే పెక్కు గేయనాటికలనుగూడ వ్రాసెను. సుకుమారమైన భావన అతని సొత్తు. అపుడే గుజరాతు దేశచరిత్రమునందలి విశిష్ట ఘట్టములను ఆధారముగచేసికొని కే. యం. మున్షీ సుహాశయుడు “పృథ్వీవల్లభ్" వంటి చార్రితక నవలలను వ్రాసెను. మున్షీ పండితుని నవలలకు అమితముగా ప్రజాదరణము లభించినది. ఆతని హాస్యనాటికలుగూడ జన రంజకత్వమునకు పేరు వడసినవి.
గాంధీ మహాత్ముడు 1914 లో భారతదేశమునకు మరలివచ్చెను. వచ్చిన కొలదికాలమునకే తన ప్రభావ పూర్ణమైన వాక్కుచే దేశమును ఉత్తేజితమొనర్చెను. ఆత్మకథ, హింద్ స్వరాజ్ మొదలైన గాంధీజీ గ్రంథములన్నియు మొదట గుజరాతీ భాషలో రచింపబడినవే. ఆయన వచన శైలి చాలా సరళమైనది. గాంధీజీ స్థాపించిన గుజరాతు విద్యాపీఠము అచటి ప్రజల సాంస్కృతిక జీవనమునకు నూతన చైతన్యము నొసగెను. గాంధీజీ అనుచరులలో కాకా కాలేల్కర్, కిశోరీలాల్ మష్రూ వాలా, మహాదేవదేశాయ్ మున్నగువారుకూడ చారిత్రక ప్రాముఖ్యము, ప్రబోధాత్మకత గల రచనలతో గుజరాతీ సాహిత్యమును సుసంపన్నము గావించిరి.
"ధూమ కేతు”, “రామనారాయణ్ పాఠక్"అనురచయితలు రసవంతమైన కథానికలను సృష్టించుటలో అనితరసాధ్యమైన నేర్పును ప్రదర్శించిరి. ధూమకేతు అనుకవి సృష్టించిన చిన్న కథలలో గ్రామీణ జీవితము, అనామకులును, నిర్భాగ్యులు నగు వారి దీనస్థితి సహజముగా చిత్రింపబడినది. నాడు దేశమంతటను వ్యాపించిన స్వాతంత్ర్య పిపాస గుజరాతీ భాషయందు అనేక కావ్యముల యందు ఇతివృత్తముగా గ్రహింపబడెను. ఆచార్య ఠాకూర్ పాశ్చాత్య భాషా చ్ఛందోరీతులతో గుజరాతీ భాష యందలి నూతన పద ప్రయోగములతో కవిత్వ మున కొక క్రొత్త వింతదనమును కూర్చెను. 'అభ్యుదయ' పథగాములైన కవులు సూర్యచంద్రులను, తారకాపంక్తులను, వసంతఋతువును, పుంస్కోకిలాలాపములను తమకావ్య ప్రపంచము నుండి బహిష్కరించి, కాగితపు పువ్వులను, చీకి పారవేయబడిన మామిడి టెంకలను, మిల్లు కార్మికులను, పడుపువృత్తి నాశ్రయించిన పేద యువతులను తమ కావ్యవస్తువు జేసికొనిరి. కాని 1940 నాటికి ఈ నూతనోద్యమపు వేడి చల్లారగా, కవులు తిరిగి ప్రాచీనుల సౌందర్యాన్వేషణ మార్గమును అనుసరింప నారంభించిరి.
తరువాత గుజరాతీలో పలువురు సాహిత్యారాధకులు వివిధ సాహిత్య ప్రక్రియలలో చక్కని రచనలను కావించిరి. రమణలాల్ దేశాయి. చునీలాల్‌షా, గుణవంతరాయ్, మేఘానీ, పన్నాలాల్, దర్శక్ అనువారు రచించిన నవలలును ; బ్రోకర్, పన్నాలాల్, పెట్లీకర్, ఉమాశంకర్ జోషీ అనువారు వ్రాసిన చిన్నకథలును ; చంద్రవదన్ రచించిన నాటకములును; జ్యోతీంద్ర అనుకవివ్రాసిన వినోద వ్యాసములును; రామనారాయణ్ పాఠక్, విజయరాయ్ వైద్య, విశ్వనాథ భట్, విష్ణుప్రసాద్ త్రివేదీ, అనంత రాయ్ రావల్ ప్రభృతులు కావించిన సాహిత్య విమర్శలును ప్రసిద్ధికెక్కినవి. కవులలో చంద్రవదన్, సుందరమ్, మన్‌శుక్ లాల్, స్నేహరశ్మి, పూజాలాల్, రాజేంద్రషా, నిరంజన్‌భగత్, బాలముకుంద్ దావే, వేణీభాయ్ పురోహిత్, బేటాయ్ అనువారు ప్రముఖులై శోభిల్లిరి. కబర్దార్‌వంటి ఫార్సీ మతస్థులు కొందరు గుజరాతీభాషలో చక్కని సాహిత్యమును సృష్టించిరి. వినోదిని నీలకాంత్, లభుబెన్ మెహతా కుందనికా కపాడియా, ధీరూబెన్ పటేల్, గీతాపారిఖ్ మొదలైన రచయిత్రులు తమ మేలిరచనలతో సాహిత్యమునకు క్రొత్త సొగసులను సమకూర్చిరి.
నేడు అణ్వస్త్రయుగమున జీవించుచున్న మానవులకు సుందరోజ్జ్వలమైన భవిష్యత్తును గూర్చిన సుఖస్వప్నములు చెదరిపోయినవి. అంతటను నిరాశయు, నిస్పృహయు ఆవరించినవి. మానవుని భవితవ్యమును గూర్చి జిజ్ఞాసువులు తర్కించుచున్నారు. ప్రపంచమంతటను అలముకొన్న ఈ అనిశ్చిత స్థితి నేటి గుజరాతీ సాహిత్యములో గూడ ప్రతిఫలించుచున్నది.
అ. రా.