సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మూడవ సంపుటము/గుంప్లొవిజ్ లుడ్విగ్ (1848-1909)

గుంప్లొవిజ్ లుడ్విగ్ (1848-1909) :

గుంప్లొవిజ్ లుడ్విగ్ అను నతడు పోలెండు దేశములో క్రాకోయను నగరమునందు 1838 లో ఒక పోలిష్ - యూదు కుటుంబములో జన్మించెను. క్రాకో, వియన్నా విశ్వవిద్యాలయములలో విద్యను పరిపూర్తి చేసికొనిన పిమ్మట అతడు అధ్యాపకవృత్తిలో ప్రవేశించి, 1882 లో గ్రాజ్ విశ్వవిద్యాలయములో న్యాయశాస్త్ర బోధన మందు ప్రొఫెసరుగా నియమితుడయ్యెను. ఈ ఉద్యోగమును నిర్వహించుచున్న కాలమునందే, 1875 వ సంవత్సరము తర్వాత లుడ్విగ్ సాంఘికముగా బహిష్కృతుడయ్యెను. వియన్నా విశ్వవిద్యాలయమునందు ఉండగా దేశభక్త్యాత్మకమయిన "ది కంట్రీ" (దేశము) అను తన సొంత పత్రికకు సంపాదకత్వము వహించెను. అంతేకాక 1863 లో జరిగిన పోలిష్ జాతీయ పోరాటమునందు కూడ పాల్గొనెను. అనంతరము 1909 లో ఆతడును, ఆతని భార్యయును ఆత్మహత్య గావించుకొనిరి. వైద్యవృత్తియందు పేరు ప్రతిష్ఠలు ఆర్జించిన వీరి కుమారుడు కూడ 1894 లో ఆత్మహత్య చేసికొనెను.

రచనలు : ఇతడు జాతి - ప్రభుత్వము (1975), జాతి-వైషమ్యము (1883), సంక్షిప్త సాంఘిక శాస్త్రము అను గ్రంథములను రచించెను.

ఇతని ప్రధాన సాంఘిక సిద్ధాంతములు: సాంఘిక జీవితములో సంఘర్షణ ప్రధాన లక్షణమనియు, ఈ సంఘర్షణములో జయించి తుదకు బయట పడగల బలాఢ్యుడే జీవించగలడనియు లుడ్విగ్‌యొక్క నమ్మకము. పరస్పరము ఒండొరులతో పోరాడుకొను ఆదిమ మానవ జాతుల ముఠాలు మానవసమాజమునకు ప్రప్రథమమైన మూల పురుషులని లుడ్విగ్ ఉద్ఘాటించెను. ఆహారోత్పత్తి వీరి అవసరములకు చాలని కారణమున ముఠాల మధ్య పరస్పరము సంఘర్షణ, పోరాటము జనించి బలహీన వర్గములు నశించుటయో, లేక బానిసలగుటయో జరుగుచుండెడిది. బానిసజాతి ఏర్పడుటవలన ఈ ముఠాల నడుమ అసమానత్వము ఉత్పన్నముకాగా, అన్యాయము మొదలైన అవలక్షణములతోకూడిన పెక్కు సమస్యలు పొటమరించెను. ఎడతెగని ముఠాపోరాటముల వలన బలాబలముల సంఖ్య తరచుగా మారుచుండెను. ఓటమిచెందిన వ్యక్తులను విజేతలైన ముఠాలు, వ్యక్తులు తమలో విలీన మొనర్చుకొనెడివారు. ఈ ముఠాల యొక్క గాఢమైన స్వప్రయోజనమును సంరక్షించుకొనుట యందే సాంఘికాభివృద్ధి ద్యోతక మగుచుండెను. అధిక సంఖ్యాకులయును అల్ప సంఖ్యాకులయును మధ్య జరుగు సంఘర్షణము సాధారణముగా అల్ప సంఖ్యాక వర్గములవారికే ప్రయోజనకారి యయ్యెడిది. కారణ మేమన అధిక సంఖ్యాకవర్గములు నిర్మాణము నందును, పాటవము నందును బలహీనముగా నుండెడివి. ఒకసారి ప్రారంభమైన ఈ ముఠా పోరాటములు నిర్దాక్షిణ్యముగా, క్రూరముగా అంతిమదశ వరకు కొనసాగుచుండెడివి. వ్యక్తుల వలెనే సమాజము కూడ వృద్దిక్షయము లందు పయనించుటచేతను, నిర్వికారమైన ప్రకృతి, సామాజిక సిద్ధాంతములకు ఈ వ్యక్తులు, సమాజములు బద్ధులై యుండుట చేతను సాంఘిక విధానములో వ్యక్తులు జోక్యము కలిగించుకొని దానిని మార్చ ప్రయత్నించుట అసమర్థనీయమని లుడ్విగ్ నమ్మకము. ఆతని సిద్ధాంతములు జీవిత ప్రయోజనమునందు ఆతని నమ్మకమును సడలించి, చివరకు నిరాశావాదిగా చేసివైచెను.

ప్ర. రా. సు.