సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మూడవ సంపుటము/గర్భధారణము-ప్రసవసమస్యలు

గర్భధారణము - ప్రసవసమస్యలు :

ఏ జాతియైనను వృద్ధి యగుటకు సంతానోత్పత్తి అవసరము. మానవులలో స్త్రీల యొక్క పాత్ర ప్రధానమైనది. స్త్రీ ప్రసవించుటకుముందు పిండము ఆమె గర్భములో తొమ్మిదినెలల కాలము పెరుగును.

గర్భధారణ చిహ్నములు: రెండురకములకు చెందిన స్త్రీలు కలరు. వీరి విషయమున ప్రత్యేక శ్రద్ధ అవసరము. (1) ఆలస్యముగా వివాహమైన స్త్రీలు, ముట్టు (రజస్సు) ఆగిపోవు సమయములో, తాము గర్భముధరించి యున్నట్లు తెలిపి వైద్యులను పెడత్రోవలో పెట్టుదురు. (2) అవివాహితలైన స్త్రీలు నీతివిరుద్ధముగా ప్రవర్తించి, గర్భమేర్పడునేమో యని భయపడి తెలిసియో తెలియకయో వైద్యులు పెడదారిపట్టు రీతిగా చెప్పుదురు.

గర్భధారణ చిహ్నములు కొన్ని ఈ క్రింద పేర్కొనబడినవి. వీటిలో ఒక్కొక్కటి వేర్వేరుగా కాక అన్నిటిని మొత్తముగా, సమగ్రముగా గ్రహించిన యెడల గర్భధారణమును గుర్తించుటకు అవి ఉపయోగపడగలవు.

1. ముట్టు ఆగిపోవును.

2. వేవిళ్ల చిహ్నములేర్పడును.

3. స్తనములు పెద్దవగును. చను మొనలు నలుపెక్కును. ఇది మొదటిసారిగా గర్భధారణము జరుగునప్పుడు గోచరించు చిహ్నము.

4. మూడవ మాసము మొదలుకొని గర్భాశయము (యుటిరస్) క్రమక్రమముగా పెద్దదియై 24 వ వారము నాటికి బొడ్డు ఎత్తునకు వచ్చును. 36 వ వారమునాటికి అది సుమారు కాలేయము (liver) తోను, క్రిందివైపున ప్రక్క ఎముకల (lower ribs) తోను సమానమైన మట్టమునకు వచ్చును. ఆఖరు 4 వారములలో దాని యెత్తు కొంచెము తగ్గును.

5. గర్భస్థమైన శిశువు చలించుట : గర్భధారణస్థితిలో స్త్రీ మధ్యకాలములో తన గర్భస్థపిండముయొక్క చలనమును తెలిసికొనగలదు.

6. తరచుగా మూత్రవిసర్జనము చేయవలెనను కోరిక కలుగును. ఇది తొలిదశలో కొన్నివారములలోను, చివర రెండు మూడు వారములలోను ఉండును.

7. వివిధములయిన వస్తువులు తినవలెనను కోరికయు, మానసిక స్వభావములో మార్పును, నిరాశయు, చిరాకును మొదలగు మానసిక లక్షణములు కనబడుచుండును. వీటితోపాటు ఆ కారములో వైకల్యము గోచరించును.

8. గర్భాశయముయొక్క ముఖద్వారము (cervix) మెత్తబడును.

9. భగ రంధ్రము నీలివర్ణముగా మారును.

10. గర్భస్థపిండముయొక్క భాగములను కడుపుమీద తడిమి గుర్తించవచ్చును.

11. గర్భాశయమునందుగల పిండముయొక్క గుండెధ్వని వినబడును.

12. యక్స్ రే ద్వారా గర్భస్థమైన పిండముయొక్క ఎముకలు గోచరించును.

గర్భధారణ పరీక్ష (అషిమ్ జొండల్ రియాక్షన్) :

ఈ పరీక్ష నూటికి 98 కేసులలో ఫలవంతము కాగలదు. గర్భధారణమైన తరువాత 15 రోజుల స్వల్ప కాలములోనే ఈ పరీక్ష సత్ఫలితము నొసగగలదు. ఉదయమున విసర్జించు మూత్రములో కొన్ని ఔన్సుల మూత్రమును తీసికొని, మూడు రోజులపాటు కొద్ది పరిమాణములో పరిపూర్ణావస్థ చెందని ఆడ చిట్టెలుకకు సూది ద్వారా ఎక్కింతురు. ఆ స్త్రీ గర్భవతి యైనచో ఆ చిట్టెలుక యొక్క అండకోశములు (ఓవరీస్) పెద్దవి యగును. అందు ఎర్రని చుక్కలు గోచరించును.

గర్భధారణ కాలము : గర్భోత్పత్తికిని ప్రసవమునకును గల మధ్యకాలము 265 రోజులకంటె హెచ్చుగను, 273 రోజులకంటె తక్కువగను ఉండును.

ప్రసవమునకు ముందు తీసికొనవలసిన శ్రద్ధ; గర్భధారణ సమయములో ఆచరించవలసిన ఆరోగ్య విధులు : ప్రసవమునకు ముందు తీసికొను చర్యలవలన కలిగినంతటి సత్ఫలితములు ఏ ఇతర వైద్యశాఖకు చెందిన చికిత్స వలనను కలుగలేదు. క్షయ, గుండెజబ్బు, అతిమూత్రము, రక్తక్షయరోగము మొదలగు ఎట్టి తీవ్రవ్యాధులకైనను అవకాశము లేకుండ మొదటనే రోగిని పరీక్షింప వలయును. గర్భధారణము జరిగిన తొలి నెలలలోనే పై వ్యాధులను కనుగొనిన యెడల వాటిని నయము చేసి ప్రసవకాలములో గర్భవతికి సాధ్యమైనంత ఎక్కువ ఆరోగ్యస్థితి కలుగునట్లు చేయవచ్చును.

రక్త వర్గీకరణము (Blood grouping) జరుపవలెను. రక్తము, వాసర్ మన్ రియాక్షన్ ప్రకారము రోగ పరిస్థితిని సూచించిన యెడల, అనగా సాంకేతిక పరిభాషలో 'పాజిటివ్ ' అయినచో, అందుకు తగిన చికిత్స చేయవలెను. రక్తపుపోటు యొక్క కొలతలు తీసికొనవలెను. మూత్రము పరీక్షింపవలెను. వ్యాధి తొలిచిహ్నములు గోచరించినయెడల వాటిని వారించు విషయమున శ్రద్ధ వహించవలెను. ప్రసవమునకు ముందుగా ఈ క్రింది విషయములను కనుగొనినయెడల ప్రసూతి సమయములో తీసికొనవలసిన చర్యలను ముందుగా నిర్ధారణ చేసికొన వచ్చును. అవి పెల్విస్ (కూపకము) యొక్క కొలతలు, గర్భస్థమైన పిండపు తలయొక్క పరిమాణము, శిశువు లోపలి భాగము క్రిందికి ఉన్నదా అను విషయములు.

గర్భవతియైన స్త్రీ యొక్క ఆహారము : ఇందు మాంస కృత్తులు, విటమినులు (శరీరపోషక పదార్థములు) సమృద్ధిగా నుండవలెను. దీనిచే గర్భములోని పిండము యొక్క పెరుగుదలకు అవకాశమేర్పడును. పాలు, మాంసకృత్తులు సమృద్ధిగాగల ఆహారము మంచిది. స్తనములను గూర్చియు, చను మొనలను గూర్చియు తగినంత శ్రద్ధ తీసికొనవలెను. చను మొనలకు చివరి వారములలో వేసిలైను పట్టించి మర్దన చేయవలెను. అందువలన అవి చిట్లుటకు అవకాశముండదు.

గుండెలలో మంట ఉన్న యెడల క్షారపుపొడుల (అల్కలైన్ పౌడర్స్)తో దానిని నయముచేయవచ్చును.

గర్భవతి యొక్క మనస్తత్వమును గ్రహించి ఆమెకు ధైర్యము, ప్రోత్సాహము కల్గించవలెను. ప్రసవసమయములో చిక్కు పరిస్థితులు కల్గునని అనుమానము కలిగిన యెడల గర్భవతిని ముందుగా వైద్యశాలలో ప్రవేశపెట్టుటకై ఏర్పాటు చేయవలెను. లేనిచో అనుకూలమైన, పరిశుభ్రమైన ఒక గదిని ప్రసవము కొరకు కేటాయించ వలెను. క్రిమిసంహారక వస్తువులు మొదలగు వాటిని సిద్ధముగా పెట్టి ఉంచవలయును.

సాధారణ ప్రసవము : సాధారణముగా ప్రసవము సమీపించుననగా, చివరి రోజులలో దాని సూచనలు గోచరించును. గర్భాశయములోనుండి రసము ఎక్కువగా స్రవించును. ఆ స్రవము కేవలము లాంఛనమాత్రముగా గాక ఎక్కువగా ఉండును.

ప్రథమ దశ : గర్భాశయము ఎక్కువగా సంకోచము చెంది నొప్పులు కొంతకాలమున కొకసారి వచ్చును. క్రమముగా తరచుగావచ్చుటకు మొదలుపెట్టును. గర్భాశయ ముఖద్వారము (cervix) సడలిపోవును. నెత్తురు మరకలు చిందిన గుర్తులతో స్రవించుట జరుగును. ఈ పరిస్థితి 12-18 గంటలవరకు ఉండును. ఈ దశ ముగియగానే గర్భాశయ ముఖద్వారము పూర్తిగా సడలి, సంచి పగిలి, గర్భాశయద్రవము వెలుపలికి వచ్చును.

రెండవ దశ : నొప్పులు ఆగిన కొన్ని నిముషముల తరువాత రెండవసారి అంతకన్న పెద్ద నొప్పులు ప్రారంభమగును. ఈసారి వచ్చిన నొప్పులు పై నుండి క్రిందికి వ్యాపించును. ఈనొప్పుల ఫలితముగా పిండము పెల్విస్ ద్వార క్రిందకు త్రోయబడుట ప్రారంభమగును. యోని తెరచుకొనుట ప్రారంభమగును. పెరీనియం (గుదద్వారమునకును యోనికిని గల మధ్యప్రదేశము) ముందునకు త్రోసికొనివచ్చును. పిండము యొక్క నెత్తిమీది వెండ్రుకలు కనబడును. నొప్పులు ఎక్కువైనకొలదియు, తలయొక్క ఎక్కువభాగము వచ్చి యోని ద్వారముపై ఆనినకొలదియు, ఆ ద్వారము గుండ్రని ద్వారముగా మారును. సాధారణ పరిస్థితులలో తల ముందుగా బయటకు వచ్చును. అది క్రిందికి వంగియుండును. తీవ్రమైన నొప్పులచే యోని ద్వారమున తల వెలుపలికి బలవంతముగా రప్పింపబడును. మెడ వెనుకకు చాపుటవలన తల త్వరగా బయటికివచ్చును. తల వెలుపలికి వచ్చినతరువాత కొంచెము కాలవ్యవధి యుండును. నొప్పులు మరల ప్రారంభించును. సామాన్యముగా శిశువు యొక్క తల తల్లియొక్క కుడివైపునకు తిరుగును. దాదాపు వెంటనే శిశువు యొక్క మొండెము, క్రింది అవయవములు వెలుపలకు వచ్చును. ఆ పిమ్మట ఒక్కసారిగా లోన మిగిలిన ద్రవము బయటకు వచ్చును. ఇది యంతయు జరుగుటకు 2-3 గంటల కాలము పట్టును. ఎక్కువ కాన్పులు అయిన వారికి ఇది త్వరితముగానే జరుగును.

మూడవ దశ : ఇది కొలది నిమిషములనుండి ఒక గంట వరకు ఉండును. కొలదికాలము తర్వాత నొప్పులు ఆగగానే గర్భాశయము (యుటిరస్) మరల సంకోచము చెంద నారంభించును. లోపలనున్న మావి వేరుకాగానే కొద్దిగా రక్తము చిమ్మును. తర్వాత మావి బయటకు వచ్చును.

ప్రసవించుచున్న స్త్రీల విషయమున వహించవలసిన జాగ్రత : స్త్రీ నొప్పులుపడునపుడు క్రిమిరహితములైన తువాళ్ళు, గాజుగుడ్డ మొదలగునవి వాడవలెను. శిశువుయొక్క బొడ్డును శుభ్రపరచి, క్రిమిరహితముగా చేయబడిన కత్తెరతో దానిని కోయవలెను. అట్లు చేయని యెడల క్రిమిజన్య విషదోషమే గాక ధనుర్వాయువు (titanus) అను వ్యాధికూడ వచ్చు ప్రమాదముకలదు . యోనిస్థానమును సాధ్యమైనంతవరకు పరిశీలించకూడదు. పరిశీలనము అవసరమైనచో ముందుగా చేతులు శుభ్రము చేసికొని, వాటికి డెట్టాల్ వంటి క్రిమిసంహారకద్రవమును పట్టించుకొన వలెను. ప్రసవించు స్త్రీ యొక్క పెరీనియము పగులకుండుటకు దూదిమడతను పెరీనియమువద్ద నొక్కవలెను. పగులుట అనివార్యమని తోచినయెడల దానిని సుస్పష్టముగా క త్తెరతో కత్తిరించి, ప్రసవము జారిన తరువాత దానిని తిరిగి కుట్టవలెను. మావి పడిపోయిన తరువాత అది పూర్తిగా పడినదో, పడలేదో యని పరీక్షింపవలెను. మావియొక్క ముక్కలు ఇంకను లోపల మిగిలిపోయి యున్న యెడల అవి స్వయముగానే బయటకురావచ్చును. లేక అవి విస్తరించియున్న యెడల వాటిని తీసివేయవలసిన అవసరము కలుగవచ్చును. బాలెంతను ప్రసవానంతరము శుభ్రపరచి, నడికట్టుతో మంచముమీద పరుండ పెట్టవలెను. కొందరు స్త్రీలకు ప్రసవానంతరము నొప్పులు ఎక్కువగానుండును. ఆ నొప్పులకు చికిత్స చేయవలయును. స్రవించుట సాధారణముగా 7 వ లేక 8 వ రోజున ఆగిపోవును.

పుట్టిన బిడ్డను గూర్చి తీసికొనవలసిన జాగ్రత్త : శిశువునకు ఆలివ్ నూనె పట్టించి, నులి వెచ్చని నీటితో శుభ్రముగా కడుగవలెను. ఒడలు తుడిచిన పిమ్మట మల ద్వారము లేకుండుట, తొఱ్ఱ యుండుట మొదలగు అవలక్షణములను జాగ్రత్తగా పరిశీలించవలెను. ఉన్నచో వాటి విషయములో తగుచర్యలు తీసికొనుట అవసరము కావచ్చును. 1/2% సిల్వరు నైట్రేటు చుక్కలను గాని, సల్ఫసెటమైడ్ చుక్కలనుగాని శిశువు కండ్లలో వేయవలెను. మొదటిరోజున తల్లి స్తన్యమిచ్చు స్థితి వచ్చువరకు శిశువునకు గ్లూకోసు నీళ్ళు పోయవలెను. పుట్టగానే సరిగా శ్వాసపీల్చలేని నీలివర్ణముగల పిల్లలకు వారి నోటిని శుభ్రపరచి ప్రాణవాయువును ఎక్కించవలెను. ప్రాణవాయువు లభ్యముకానిచో, నోటితో గాలిని ఊది శిశువునకు తెలివిని కల్పించవలెను.

ప్రసవకాలమున బాధలు లేకుండ చేయుట : ఈరోజులలో అనేకమంది స్త్రీలు సుఖముగా ప్రసవించవలెనని కోరు చున్నారు. టైవీన్ లేక నైట్రస్ ఆక్సయిడ్‌లో ప్రాణవాయువును (oxygen) కలిపిగాని, లేక తిడిన్‌తో స్కోఫలమైన్ కలిపిగాని ఇయ్యవచ్చును ఇట్టి పనులను వైద్యుల పర్యవేక్షణక్రింద జరుపవలెను. మోతాదుకు మించి ఇచ్చిన ఎడల శిశువునకు ప్రమాదము కలుగవచ్చును. ప్రసవానంతరము శిశువు బ్రతుకుట కష్ట సాధ్యమగును.

శిశువు అసహజస్థితిలో వెలుపలికి వచ్చుట: సహజస్థితిలో జన్మించిన శిశువుయొక్క తల ముందునకు వంగివచ్చును. ఆసహజస్థితిలో ముఖము వెలుపలికి వచ్చుటయో, లేక కాలు వచ్చుటయో, లేదా పిరుదులు, భుజము లేక చేయి బయటకు వచ్చుటయో జరుగవచ్చును. చేయి ముందుగా వెలుపలకు వచ్చుటనుబట్టి శిశువు అడ్డముగా ఉన్నట్లు

చిత్రము - 94

పటము - 1

శిశువుయొక్క సహజమగు ఉనికి.

1. గర్భాశయపు గోడ 2. ద్రవముతో నిండిన తిత్తి. 3. పిండము. 4. బొడ్డుత్రాడు 5. మావి. 6. గర్భాశయపు మార్గము.

ప్రసవమందు ద్వితీయదశను సూచించు పటము. గర్భాశయ మార్గము విస్తరించి యున్నది. మరియు ద్రవముతో నిండిన తిత్తి ముందరకు చొచ్చుకొని యున్నది.

తెలియును. తల అసహజస్థితిలో ఉన్న యెడల తలను కొంచెముగా నొక్కుటవలన సహజమగు ప్రసవము కలుగ గలదు. ప్రసవమునకు ముందుగా లోపమును నిర్ధారణ చేసినయెడల శిశువు సరియగు స్థితిలో బయటికి వచ్చు నట్లు సవరింపవచ్చును. పిండము అడ్డముగా నున్న యెడల సహజమగు ప్రసవము కలుగదు. ఈ చికిత్సయందు రెండు ప్రధాన సూత్రములు కలవు. గర్భస్థపిండము సజీవముగా నున్నదా యనునది మొదటి విషయము ; గర్భాశయ ముఖద్వారము (cervix) పూర్తిగా పెద్దదైనదా యనునది రెండవ విషయము.

గర్భాశయములోనిపిండము సజీవముగా నున్న యెడల మత్తుమందు నిచ్చి, గర్భాశయము లోనికి చేతినిపోనిచ్చి, శిశువును వ్రేళ్ళతో పట్టుకొని బయటికిలాగ వచ్చును. లేదా కడుపుమీద ఆపరేషన్ చేసి కడుపు నుండి బిడ్డను తీయవచ్చును. దీనినే 'సిజేరియన్ ఆపరేషన్‌' అందురు. చరిత్ర ప్రసిద్ధుడైన జూలియస్‌సీజరు శిశువుగా గర్భమునం దున్నప్పుడు అట్లుతీయబడుటవలన ఇట్టి ఆపరేషనుకు ఆ పేరు కలిగెను. గర్భములో శిశువు చనిపోయిన ఎడల దాని తలను చిదుకకొట్టి ముక్కలను వెలుపలికి తీసివేయవచ్చును. ఒక్కొక్కప్పుడు శిశువు తల మిగులపెద్దదిగా ఉండుటచేత సహజముగా ప్రసవము జరుగకపోవచ్చును. అప్పుడా పిండమును చిదుగగొట్టి బయటికి తీయవలసి యుండును.

చిత్రము - 95

పటము - 2

శిశువు అసహజస్థితిలో బయటికివచ్చుట.

1. తొంట్లు ముందుగా బయటికి వచ్చుట

2. ముఖము ముందుగా వచ్చుట

3. చెయ్యి ముందుగా వచ్చుట

కూపకము ( పెల్విస్) సంకోచమునొందుట : కటిప్రదేశమందలి ఎముకలు తరచుగా సంకోచమొందుచున్న యెడల అనుసరింపవలసినమార్గము ఒక్కటే. పిండమును పూర్తిగా పెరుగనిచ్చి, ఎదిగిన తర్వాత సిజేరియన్ ఆపరేషన్ చేయవలెను. అటూఇటూ కానిపరిస్థితిలో నున్న స్త్రీ విషయములో, ఆమె నొప్పులుపడువరకు ఊరకుండి అప్పుడు పరిస్థితిని గమనించవలెను. శిశువు తల సక్రమ రూపములో నుండినచో సహజమగు ప్రసవము జరుగ వచ్చును. పురోగమనము సంతృప్తికరముగా లేనిచో సిజేరియన్ సెక్షను ననుసరించుట అనివార్యమగును.

మావి (ప్లెజంటా ప్రీవియా) : మావి గర్భాశయము యొక్క అంతర్భాగమును అంటిఉండుటకు బదులుగా, క్రింది భాగమును అంటియుండి, పిండము బయటికివచ్చు ద్వారమును అడ్డగింపవచ్చును. మావి కొనయందున్న

చిత్రము - 96

పటము - 3

"ప్లెజంటా ప్రీవియా"

మావి గర్భాశయద్వారమును అడ్డుకొనియున్నది.

యెడల, సహజమగు ప్రసవము కలుగును. అది మధ్య భాగమునం దున్నయెడల, సహజముగా ప్రసవమునకు ముందే వేరుకాగలదు. అందువలన రక్తస్రావము, గర్భమునందలి పిండము చనిపోవుట సంభవింపగలదు. దానిని త్వరగా కనుగొని రక్తము ఎక్కించి, సిజేరియన్ శస్త్రచికిత్సచేయుటయే ఈ విషయమున అనుసరించవలసిన మార్గము.

ఫోర్ సెప్స్ : శిశువును మెల్లగా బయటికి లాగుటకు

చిత్రము - 97

పటము - 4

ఫోర్ సెప్స్

ఈ పరికరమును ఉపయోగింతురు. ఇది ఒకవిధమైన అనుబంధము. దీనిని ఉపయోగించుటకు వీలయిన పరిస్థితులు రెండు. (1) మార్గము పెద్దదియైయుండుట. (2) ముందుకు వచ్చు శిశువు యొక్క శరీరావయవములు క్రమమైన రీతిలో ఉండుట; నొప్పులు తక్కువగా నుండుట.

బహుళసంఖ్యలో జననములు : కవలలు జన్మించుట సాధారణవిషయమే. కాని ముగ్గురు, నలుగురు, అయిదు గురు శిశువులు జన్మించుటకూడ జరుగవచ్చును. అయిదుగురు జన్మించుట ఇప్పుడు ప్రసిద్ధ విషయము. వీరు బ్రతుకుట కూడ జరుగుచున్నది. వారు సమరూపులు కాని అసమరూపులు కాని కావచ్చును. ఒక్క మావి కాని రెండు మావులు కాని ఉండవచ్చును. సహజముగ ప్రతి శిశువు కొంత బరువును కోల్పోవును. కాబట్టి సమయము రాకముందే (అకాలమున) పుట్టిన శిశువుల విషయములో ఎక్కువ జాగ్ర త్త అవసరము. శిశువు యొక్క శరీరము నందలి ప్రతిభాగమును తాకిచూచి గాని, ఎక్స్ రేద్వారా గాని లోపములను కనుగొనవచ్చును. ఒకప్పుడు శిశువు గర్భములోనే మృతిచెంది ఎండిపోవచ్చును. అట్టి తీరున శిశు రూపమును "పేపి రేషియస్ పిండము" అందురు.

ఒక్కొక్కసారి “సయామీస్" కవలలోవలె రెండు పిండములు శరీరములందలి ఏదో ఒక భాగము నొద్ద - కటి ప్రదేశమువద్దనో, మొండెమువద్దనో - అతుకుకొనిపోయి యుండును. ఆ కవలలను వేరు చేయుటవలన వారు మరణించునట్టి అవకాశము ఎక్కువకలదు. ముందుగా సక్రమ రీతిని విచారణ జరిపియే అట్టి పనికి పూనుకొనవలెను.

ప్రసవానంతర "ప్యూర్ పీరియం" : గర్భాశయము ఆరు వారములలో సహజమగు పరిమాణమును పొందును. ప్రసవించిన స్త్రీకి 10 రోజులవరకు పూర్తి విశ్రాంతి కావలయును. రెండు మాసముల తర్వాత ఆమె తన గృహకృత్యములు నిర్వర్తించుకొనవచ్చును. ప్రసవానంతరము ఆమె పరీక్ష చేయించుకొనుట అవసరము. అందు వలన గర్భాశయము స్వస్థానమున లేకుండుట మొదలగు లోపములకు చికిత్స చేయించుకొనుటకు వీలుకలుగును.

ప్రసవసంబంధమైన క్రిమిజన్య విషదోషము ఈ క్రింది పరిస్థితులలో కలుగవచ్చును. మావిలో కొన్ని భాగములు మిగిలిపోయి అవి రక్తగత విషదోషమునకు దారితీయ వచ్చును. ప్రసవకాలములో వాడిన పనిముట్లవలన విషదోషము గర్భాశయ రంధ్రములోనికి ప్రవేశింపవచ్చును. ముక్కలు ఏవేని ఉండిపోయిన యెడల వాటిని తీసివేయవలయును. ఈ వ్యాధివలన మరణము జరుగవచ్చును. ఈ వ్యాధి నేడు మిగుల అరుదుగా నున్నది. ఇందులకు రెండు ప్రధాన కారణములు గలవు :

(i) నేడు ప్రసవము క్రిమి వ్యతిరేక పరిస్థితులలో జరుగుట.

(ii) క్రిమిసంహారక ఔషధములు వ్యాప్తిలోనికి వచ్చుట.

అయినప్పటికిని క్రిములవలన గర్భాశయ అవయవములలో వాపులు కలిగి జ్వరము వచ్చుట, ఒక కాలు వాచుట, ఎక్కువ నెత్తురు పోవుటవలన రక్తలోపము కలుగుట మున్నగు చిక్కులకు అవకాశము కలదు. అప్పుడు సక్రమముగా రోగనిరూపణము చేసి, సరియగు చికిత్స చేయవలసియుండును.

ప్రసవానంతరము రక్తము కారిపోవుట : మావి పడునప్పుడు గాని, లేక పడిన తరువాత గాని అధికముగా రక్త స్రావము అయిన ఎడల ఒక చేతితో గర్భాశయమును పట్టుకొని మర్దనచేసి, రెండవ చేతిని గర్భాశయములోనికి పోనిచ్చి ముక్క లున్న యెడల వాటిని తీసివేయ వలయును. 'ఆర్గోమెట్రిన్'ను, 'పిట్ విటర్ ఎక్‌స్ట్రాక్టును' ఇంజక్ష ను చేయవలయును. ప్రమాదకరమైన కేసులలో గర్భాశయములోనికి 1:1000 ఎడినలిన్ ద్రావకములో ముంచిన గాజు గుడ్డను పూర్తిగా లోనికి త్రోయవలెను. ద్వారములో ఎక్కడ నైనను పగుళ్ళవలన వచ్చిన నెత్తురును పగిలినచోట కుట్టి ఆపవచ్చును. ప్రసూతి కాలములో కాళ్ళు, చేతులు చల్లబడుట ప్రసవకాలము దీర్ఘముగానుండి, అంతర్గతముగా రక్తస్రావము కలిగినపుడు సంభవించును. ఇది చాల ప్రమాదకరమైన పరిస్థితి. ఈ పరిస్థితి సర్దుకొనువరకు మరి ఎట్టి చికిత్సయు చేయరాదు. మార్ఫియా ఇంజక్ష ను ఇచ్చుట, నెత్తురుఎక్కించుట, రక్తపుపోటు పైకి పోవునట్లు చేయుట ఇందుకు జరుగ వలసిన చికిత్సలు.

గర్భాశయము పగులుట : ప్రసవమునకు ఆటంకము కలిగినపుడు గర్భాశయము పగులుట సంభవించును. ఇట్టి స్థితిలో కాళ్ళు, చేతులు చల్లబడును. దీనికి ముందుగా చికిత్సచేసి, ఆ పిమ్మట శస్త్రచికిత్స చేయవలెను. బిడ్డను తీసివేసి గర్భాశయమును కుట్టవలసియుండును. ఇది చాలా అవసరమగుటచే, వెంటనే చేయవలెను.

గొట్టపు గర్భధారణ : అండము గొట్టమునందే ఫలించి అందే పెరుగును. గొట్టము అతి పలుచగా నుండును. కాబట్టి పిండము 8-10 వారములకు మించి పెరుగ

చిత్రము - 98

పటము - 5

గొట్టపు గర్భదారణము

1. గర్భాశయము. 2. గొట్టము. 3. పిండము.

జాలదు. అందుచే అది పగిలి అంతర్గత రక్త స్రావము, కాళ్ళు, చేతులు చల్లబడుట సంభవించును. కొందరు స్త్రీలకు, వెలుపల నున్నప్పుడు క్రింది కడుపులో తీవ్రమగు నొప్పియు, రక్త స్రావమును ఏర్పడును. అట్టి పరిస్థితిలో వెంటనే చికిత్స చేయవలయును. నెత్తురు ఎక్కించి, క్రింది కడుపును కోసి, గొట్టమును తీసివైచి రక్త స్రావమును ఆపవలెను.

ఉదర కుహరములో గర్భధారణ : సిద్ధాంతరీత్యా అండము గర్భ కుహరములో పడి పెరుగవచ్చును. ఇది చాలా అరుదుగా సంభవించును. ఇట్టి ఉదాహరణములు 30 మాత్రము వర్ణింపబడినవి.

అండసంబంధమైన గర్భధారణ : అండము అండకోశములో పడి పెరుగ నారంభించును. ఇదికూడ పగులును. గొట్టపు గర్భధారణవిషయములో వలెనే ఇందును శస్త్రచికిత్స అవసరమగును. "హైడెటి ఫారం మోల్": మావి గుత్తుల సమూహముగా మార్పుచెందును. అది గర్భాశయమంతయు ఆక్రమింపవచ్చును. అది గర్భాశయపు గోడను తలక్రిందులు

చిత్రము - 99

పటము - 6

హైడేటిఫారంమోలు

ఇందు పింపము ద్రాక్షగుత్తిలాగున మారి ఉన్నది.

చేసి రక్తప్రవాహముద్వార ఇతరప్రాంతములకు ప్రాకుట అరుదుగా సంభవించును. అట్లు జరిగిన యెడల అది చాల ప్రమాదకరము. గర్భస్థమైన పిండపు భాగములు స్పర్శకు గోచరింపవు. యోనినుండి వచ్చిన స్రవములో చిన్న గుత్తులవంటివి కనబడును. గర్భాశయములోని తిత్తులను తీసి వేయుటయే ఇందులకు జరుపవలసిన చికిత్స.

హైడ్రోమియాస్ (గర్భాశయములో ఎక్కువ నీరు పట్టుట) : గర్భాశయములోని పిండము 'యేమ్నియాటిక్ ద్రవము' అనుదానిచే కప్పివేయబడును. అది 3000 C.C. కంటె ఎక్కువగా ఉండరాదు. హైడ్రోమియాస్‌లో అది చాలా ఎక్కువగా ఉండును. గర్భాశయము మిక్కిలి పెద్దదియగును. శరీరావయవములపై ఒత్తిడి కలుగుటచే ఊపిరి ఆడకపోవుట, గుండె కొట్టుకొనుట జరుగును. కొద్ది తరహాలో వచ్చినచో, సవ్యమగు ప్రసవము జరుగవచ్చును. కాని తీవ్రముగా వచ్చినయెడల తల్లి ఆరోగ్యమును రక్షించుటకై సకాలమునకు చాలా ముందుగనే ప్రసవము కలిగింపవలసి యుండును.

ఆలిగో హైడ్రామ్నియాస్ : ఇందులో నీరు తక్కువగా నుండును. కావున శిశువు యెమ్నియాటిక్ పొరకు అంటుకొని ఉండుటచే, పిండము చనిపోవుటకు ఎక్కువ అవకాశము కలదు.

గర్భాశయపు త్రాడు : ఇందు నిజమైనవి కాని కృత్రిమమైనవి కాని ముడు లుండవచ్చును. ఈ త్రాడు 4-5 అడుగుల ఎక్కువ పొడవునుగాని, 2-3 అంగుళముల తక్కువ పొడవునుగాని కలిగియుండవచ్చును. ఈ రెండు పరిస్థితులలోను ప్రసవ సమయమున ఎక్కువ కష్టము కలుగును. ప్రసవ సమయమునం దీ త్రాడు శిశువునకు పూర్వమే ముందునకు వచ్చును. దీనిని తిరిగి స్వస్థానములో చేర్చవలెను. గర్భమందలి పిండమునకు ఆహారమైన ప్రాణవాయువు ఈ త్రాడు గుండానే పోవును. కనుక అట్లు దీనిని స్వస్థానమున చేర్చినయెడల బిడ్డ బ్రతుకును.

మావి (బీజబంధము) : గర్భస్థ పిండమునకు ఈ అవయవము వలన మిక్కిలి మేలు కలుగుచున్నది. వ్రేళ్ళ వలె ముందునకు వచ్చు దీని భాగములు గర్భాశయము యొక్క గోడలోనికి చొచ్చుకొని యుండును. ఈ విధముగా గర్భస్థ పిండము తల్లి యొక్క రక్తము దగ్గరకు వచ్చును. కాని ఈ రెండును కలియవు. ఎందుచేతననగా ఈ రెంటికి మధ్య సన్నని పొర యొకటి ఉండును. దీని ద్వార శిశువు వాయువును, ఆహారపదార్థములను గ్రహించును. కొన్ని మావులు రెండు మూడుగా విభజింపబడి యుండును. లేదా మరొక చిన్న మావు వేరుగా ఉండ వచ్చును. ఇది ఒక్కొక్కసారి వాచుట లేక గట్టిపడుట జరుగవచ్చును. లేదా దానికి క్షయ మొదలగు రోగములు అంటవచ్చును.

గర్భస్రావము: దీనిని గర్భ విచ్ఛిత్తి అని కూడ అందురు. అనగా గర్భధారణ కాలమునందు మధ్యలో గర్భములోని పిండమునకు పూర్తిగా శక్తి సంపన్నత కలుగకపూర్వమే, అనగా 28 వారములకు ముందుగనే అది బయటకు వచ్చుట అని అర్థము. తల్లి యొక్క అనారోగ్యము, సెగవ్యాధి, రసాయనిక టాక్సినులు తమ 'పని నెరవేర్చుటలో ఆటంకములు కలుగుట, ఎండోక్ట్రెన్ కల్లోలములు ఇందులకుగల కారణములు. గర్భస్రావము సహజముగా కలుగవచ్చును; లేదా కృత్రిమముగా వైద్య కారణములచే తల్లి ప్రాణమును కాపాడుటకై కల్పింప బడవచ్చును. లేక చట్టవిరుద్ధముగా తెచ్చిపెట్టుకొన్నది కావచ్చును. ఒక్కొక్కప్పుడు గర్భస్రావము కలుగునను భయమును కల్గించు సూచనలు - అనగా నొప్పి, కొద్దిగా రక్తస్రావము—కలుగును. సరియైన విశ్రాంతిని, చికిత్సను ఏర్పాటు చేసినయెడల అట్టి పరిస్థితిలో గర్భస్రావమును నిరోధింపవచ్చును. గర్భాంతర్గత భాగములు యోని యొక్క ముఖము గుండ ముందునకు వచ్చినచో గర్భస్రావము అనివార్యము. గర్భాశయమునందలి భాగము లన్నియు స్వచ్ఛందముగా వెలుపలికి వచ్చిన యెడల, అపుడు దానిని పూర్తి గర్భస్రావమందురు. అసంపూర్ణమైన గర్భస్రావ విషయమున ఆ భాగములలో కొన్ని స్వచ్ఛందముగా బయటకు వచ్చును. కొన్ని లోపలనే ఉండును వాటిని లోపల ఉండనిచ్చినయెడల రక్తస్రావము కుళ్లి చీముపట్టుట కూడ జరుగవచ్చును. వాటిని సాధ్యమైనంత త్వరలో బయటికి తీసివేయవలెను. తప్పిపోయిన గర్భస్రావమనగా, గర్భస్రావపు చిహ్నములు గోచరించి ఏమియు బయటకు రాకుండ తప్పిపోవుట. ఇది ఒకటి రెండుసార్లు జరుగవచ్చును. కొన్ని వారముల తర్వాత శుష్కించిన పిండము గర్భమునుండి బయటికి వచ్చును. ఆపిండ మిదివరకే మొదటిదెబ్బలోనే చనిపోయి యుండుట వాస్తవము. పిండము ఎండిపోవుట, బొమ్మవలె అగుట సంభవించును.

గర్భధారణ కాలములో కలుగు రక్తజన్య విషదోషము: తేలికయైన కేసులో గర్భవతి ఏమియు చెప్పకుండును. పరీక్షించిన యెడల హెచ్చుస్థాయిలో రక్తపుపోటు, మూత్రములో ఆల్బుమిన్ చిహ్నములు లేక కొద్ది పాటి కాళ్ళవాపు కూడ ఉండవచ్చును. కాని తీవ్రమైన కేసులలో రక్తపుపోటు మిక్కిలి ఎక్కు వయగును. తలనొప్పి, శరీరమందంతటను వాపు, కన్నులు తిరుగుట, వాంతులు, మూత్రములో హెచ్చుగా ఆల్బుమిన్ ఉండుట, మూర్ఛలు వరుసగా వచ్చి పడిపోవుట సంభవించును. గర్భాశయములోని శిశువునకు హానికలుగు అవకాశము కలదు. శిశువు కూడ చనిపోవచ్చును. ఈ పరిస్థితిని ఎంత ఎక్కువకాలము నిర్లక్ష్యము చేయుదుమో, మూత్ర పిండములు అంత ఎక్కువగా చెడిపోవుటకు అవకాశము కలదు. దానిని త్వరగా గుర్తించి సాధ్యమైనంత త్వరితముగా చికిత్స చేయుట అవసరము. కాలేయముకూడ చెడిపోవు అవకాశము కలదు. వ్యాధి చిహ్నములు తీవ్రముగా నున్న యెడల గర్భాశయమును కాళీచేయించవలెను. అట్టి పరిస్థితి కలుగకుండుటకై తల్లి మరల గర్భధారణ చేయకుండ హెచ్చరింపబడవలెను. తలిదండ్రులలో నొకరు గర్భనిరోధక చికిత్స పొందవలెను.

విపరీతాకారముగల శిశుజననము : హెనన్ కఫాలిక్ - విపరీతాకారముగల శిశువు, అనగా చిన్న తల కలిగి, మెదడులేని శిశువు ; నాలుగు తలలు గల శిశువు; ఒకే కన్నుగల శిశువు పుట్టుట జరుగును. ఇట్టి శిశువు పుట్టిన వెంటనే మరణించును.

ఏ. యస్. ఆర్.