సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మూడవ సంపుటము/గయానా (భూగోళము)
గయానా (భూగోళము) :
దక్షిణ అమెరికాయొక్క ఉత్తరభాగమునందుగల విశాలమగు పీఠభూమిని, ఇరుకైన సముద్రతీర మైదానమును గయానా దేశము ఆక్రమించియున్నది. ఈ దేశము భూమధ్యరేఖకు 10 డిగ్రీలలోపల భూమధ్యరేఖకు ఉత్తరముగా 3° 30' N నుండి 8° 40' N ల వరకు వ్యాపించి యున్నది. రేఖాంశము (longitude) నందు గయానా దేశము గ్రీన్‌విచ్ నగరమునకు పశ్చిమముగా 53° W - 62° W డిగ్రీల నడుమనున్నది. రాజకీయముగా గయానా ఈ క్రింద ఉదాహరించిన మూడుభాగములుగా విభజింప బడియున్నది.
1. పశ్చిమ ప్రాంతమున 'జార్జిటౌను' రాజధానిగా బ్రిటిష్ గయానా.
2. కేంద్రప్రాంతమున 'పారమారిబో' రాజధానిగా డచ్ గయానా.
3. తూర్పు ప్రాంతమున 'కేయన' రాజధానిగా ఫ్రెంచి గయానా.
దక్షిణ అమెరికా భూభాగమునగల యూరపియనుల వలస ప్రాంతములు ఈ మూడు మాత్రమే. స్వాతంత్ర్య సముపార్జనము కొరకై బలీయమయిన పోరాటములు సాగించుచున్నను, పై ఉదహరించిన మూడుప్రాంతముల గయానా ప్రజలు ఇప్పటివరకును పరాధీన దశయందే ఉన్నారు.
పొగాకును ఉత్పత్తిచేసి సరఫరా చేయుట మూలముగా గయానా దేశమునకు ప్రారంభమునందే ప్రాముఖ్యము అబ్బినది. తర్వాతి దశలో ఆఫ్రికాఖండమునుండి బానిస కూలీలను నియోగించుటవలనను, భారతదేశముతో ఏర్పరచుకున్న ఒడంబడిక మూలముగా కార్మికులను సేకరించుటవలనను, గయానా దేశమునందు చెరకుతోటలు స్థాపింపబడి సాగు చేయబడినవి. ఈ చెరకుతోటలలో పనిచేసిన కార్మికుల యొక్క సంతతివారే నేటి గయానాదేశము నందలి ప్రజలలో ముఖ్యమైనవారు, ఐరోపియనులును, అమెరికన్ ఇండియనులు అని పిలువబడువారును స్వల్ప సంఖ్యాకులుగా నున్నారు. 25-30 మైళ్ళ వెడల్పుగల సముద్రతీర ప్రాంతమునుండి నిలువ ఉన్న నీటిని తొలగించినచో, ఆ ప్రదేశము సారవంతమైన భూమిగా రూపొంది అనేకములైన ఉష్ణమండలపు పైరులు, తోటలు (tropical plantations) పండగలవు. దేశాంతర్భాగముననున్న పీఠభూమిలో రవానా, రాకపోకల సౌకర్యములు లేకుండుట ఒక ఇబ్బందిగా నున్నది. పీఠభూమి యొక్క అంచువద్ద ప్రవహించు నదులయొక్క వొడ్డులు తరచుగా విరిగి నదులలో పడుచుండుట మరియొక ఇబ్బంది.
గయానా దేశముయొక్క శీతోష్ణస్థితి అత్యుష్ణముగాను, మిక్కిలి తేమగాను ఉండుటవలన, తెల్లజాతులవారు విరివిగా తమ వలసలను అచ్చట ఏర్పాటు చేసుకొనుటకు వీలులేకున్నది. ఎల్లప్పుడును ఉష్ణోగ్రత తీవ్రముగా నుండును. ఆ ఉష్ణోగ్రత 70°F అధమోష్ణత మొదలుకుని 95°F పరమోష్ణత వరకు మారుచుండును. సగటున ఉష్ణోగ్రత 80°F నుండి 84°F వరకు కొంచెము భేదించు చుండును. సంవత్సరములో అత్యధిక కాలము సముద్రపు గాలులు ఉష్ణ వాతావరణమును శీతలపరచుచున్నవి. వర్షపాతము గాఢముగా నున్నది. బ్రిటిష్ వారి అధీనమందున్న గయానాలోను, డచ్చివారి అధీనమందున్న గయా
చిత్రము - 93
వరకు పెరుగును. ఉద్భిదజాలము (vegetation) అసాధారణమైన సమృద్ధి గలదిగాను, ఫలవంత మైనదిగాను ఉండును. అసంఖ్యాకములైన వృక్షములు లభించును. వాటి కలప గృహ నిర్మాణమునకు, నౌకా నిర్మాణమునకు, ఇండ్ల కప్పులకు, బీరువాల నిర్మాణమునకు పనికివచ్చును. అచటి శీతోష్ణస్థితిని బట్టి ఉష్ణమండలానుగుణములైన ఫల పుష్పములు తప్పక ఎడతెగక లభించును. గయానా దేశమునందు సాంబ్రాణి, లక్క, చెట్టుపట్ట (bark). నారపీచు, నూనె, పోకచెక్కలు, ఇండియా రబ్బరు, బలాటా (Balata), సింకోనా, కొ పెయి బాబల్ సామ్ (మందుగా నుపయోగించు సాంబ్రాణి వంటి జిగురు పదార్థము), కరప అను గింజల నూనె. సుగంధిపాలవ్రేళ్లు. చిక్కుడు, ప్రత్తి, పొగాకు మొదలగునవి పండును. అన్నిటికంటె అత్యుత్తమములైన ఈ క్రింది ఆహారపు పంటలు గయానాలో పండుచున్నవి. 'కాసరా' అను దుంపజాతి, చిలగడము, కేప్సికమ్ అను స్పానిష్ జాతికి చెందిన మిరియములు, టుమాటో ఫలములు, గావా, చెర్రీ ఫలములు, అరటి ఫలములు, ఖర్బూజా ఫలములు, అనాస ఫలములు మున్నగునవి గూడా లభించును. ఇవి కాక పలురకముల తీగెలు, అడవి మొక్కలు, పుష్ప వృక్షములు మొదలగునవియు కలవు. గయానాలోని జంతువర్గములో (fauna) స్టింక్ బైరల్, రాబందులు, గుడ్లగూబలు, 'ఆసకప్పెరగాడు' (right jars), బెల్స్, బాతులు, నీటిలో లోతునకు మునుగగల పక్షులు ముఖ్యములైనవి. సస్తనజాతి జంతువుల (Mammals) లో ఒక రకపు చిరుతపులులు, టైగర్ కాట్స్, టాపిక్స్, దేవాంగి పిల్లులు (sloths), చీమలను తిను జంతువులు (ant-eaters), కేపి బారాస్, రక్కూన్స్, కోటీస్, ఉడుతలు, కోతులు, ముంగిసలు మొదలగునవి ముఖ్యమైనవి. జలచరములలో మొసళ్ళు, షార్క్ అను చేపలు, ఎండ్రకాయలు, కప్పలు మొదలగునవి ముఖ్యములైనవి.
బ్రిటిష్‌వారి అధీనమందున్న గయానాలో ఆసియా జాతులవారికి చెందిన ప్రజలుండుట గమనించదగిన అంశము. వీరిలో కొందరు చైనా కార్మికుల సంతతివారును, కొందరు హిందువుల సంతతికి చెందినవారును కలరు. అచ్చటి హిందువులందరు పూర్వము ఉత్తర హిందూదేశమునుండి గయానాకు వలస వెళ్ళినవారి యొక్క సంతతివారు. వీరు తమ మాతృదేశములో ఉష్ణాధిక్యమగు వాతావరణమునకు అలవాటుపడినవారుకారు. దాదాపు ఒకశతాబ్దమువరకు ఉష్ణాధిక్యముగల గయానాలో నివసించుచున్నందున అచ్చటి వాతావరణము ఫలితముగా కలుగు రోగముల వాతబడి హిందువులు శారీరకముగను, మానసికముగను దుర్బలులయిరి. 'అమెరికన్ ఇండియనుల' సంఖ్య గూడా క్రమముగా క్షీణించుచున్నది. కొలదివేల మంది మాత్రమే దేశాంతర్భాగమున జీవనము చేయుచున్నారు.
బ్రిటిష్ గయానా, అననుకూలమగు శీతోష్ణస్థితి కారణముగా, దేశాభివృద్ధికి వలయు పెట్టుబడులను ఆకర్షించ లేక పోవుచున్నది. సాగుబడి క్రిందకు వచ్చిన భూభాగములో మూడవవంతు ప్రదేశమునందు చెరకుపంట ప్రధానమైనది. బ్రిటిష్ గయానాలో ఏడాదికి 2 లక్షల టన్నుల పంచదార ఉత్పత్తి యగుచున్నది. బియ్యము ఉత్పత్తి రెండవస్థానము నాక్రమించియున్నది. హిందువులకు బియ్యము ప్రధానమగుటయే ఇందుకు కారణము. కొలది మాత్రముగ బంగారమును, ఎక్కువగా వజ్రములును ఈ దేశమునందు ఉత్పత్తి అగుచున్నవి. అల్యూమినియం పరిశ్రమకు అనువైన బాక్సైట్ ఆను ముడి లోహము జార్జిటౌన్ నుండి విదేశములకు ఎగుమతి చేయబడుచున్నది. జార్జిటౌన్ యొక్క జనాభా 66,000.
డచ్ గయానా భూభాగము 'సూరినమ్' అని గూడ వ్యవహరింపబడుచున్నది. దీని వైశాల్యము 58,000 చ. మైళ్ళు. అనగా ఆంధ్రదేశముయొక్క వైశాల్యములో ఇది సగము కలదు. ఇక్కడి జనసంఖ్యలో, ఒక లక్ష అరవై వేలమంది ముఖ్యముగా నీగ్రోలు, అసియా జాతులవారు, సంకరజాతులవారు అయియున్నారు. 2000 మందికి లోపుగా శ్వేతజాతీయు లున్నారు. నదులకు చేరువగా సముద్రప్రాంతమునందు మాత్రమే నూతనముగా సాగులోనికి తీసికొని రాబడిన ప్రదేశమునందు వ్యవసాయము చేయబడుచున్నది. పంచదార, కాఫీ, కోకో ప్రధానములైన పంటలు. కొలది ప్రమాణములో, బంగారము దొరకు గనులు కలవు. ఆమెరికాయందు గల అల్యూమినియం కంపెనీ ఉపయోగముకొరకై బాక్సైట్ ఉత్పత్తి కాబడుచున్నది. దీనియొక్క రాజధానియైన 'పరమారిబో' యందు 50,000 మంది ప్రజలు నివసించు చున్నారు.
గయానాయందు గల మూడు వలసప్రాంతములలో ఫ్రెంచి ప్రాంతము మిక్కిలి తక్కువ ప్రాముఖ్యము కలది. దీని వైశాల్యము ఆంధ్రప్రదేశము యొక్క వైశాల్యములో మూడవవంతు మాత్రమే. కాని సాగుచేయబడుచున్న భూమి 12 నుండి 14 చ. మైళ్ళకంటె అధికముగా లేదు. రాజధానియైన 'కేయన్న' యందు మిశ్రమజాతులకు చెందిన 14,000 మంది ప్రజలు నివసించుచున్నారు. ఫ్రాన్సుదేశమునుండి పంపబడు నేరస్థుల నివాసమునకై కొంత ప్రాంతము ప్రత్యేకింపబడియున్నది.
కె. వి.