సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మూడవ సంపుటము/గద్వాల సంస్థాన చరిత్ర
గద్వాలసంస్థాన చరిత్ర :
గద్వాల ప్రస్తుతము మహబూబునగరంజిల్లాలో చేరిఉన్నది. ఈ సంస్థానము పూర్వము రాయచూరుజిల్లాలో నుండియుండెను.
ఇది సికింద్రాబాదు-కర్నూలు రైలుమార్గమున కృష్ణా, తుంగభద్రానదుల నడుమ నడిగడ్డగా నున్నది. ఈ సంస్థానము అతిప్రాచీనమైనది. హైద్రాబాదులోని ఇతర సంస్థానముల కంటె అన్నిటను ఇది ప్రత్యేక ప్రతిపత్తి కలిగియుండినట్లు అనేక ఆధారము లున్నవి.
గద్వాలసంస్థానము దాదాపు 600 సంవత్సరముల వయస్సు కలది. పశ్చిమ చాళుక్యులు, ఆంధ్రచోళులు, కాకతీయ, విజయనగర రాజులు, మొగల్, బహమనీ, బిజాపురం నవాబుల క్రింద ఈ సంస్థానము సామంతరాజ్యముగా నుండి, అనంతరము నైజాముపాలన క్రిందకు వచ్చినది. భారత రాజ్యాంగశాసనము ప్రకారము నిజామురాజ్యము విచ్ఛిన్నమైనప్పుడు గద్వాలసంస్థానము ప్రతిపత్తిని గోల్పోయి, ఆంధ్రప్రదేశ రాష్ట్రములో విలీనమైనది (1956). గద్వాలసంస్థానమునకు బుడ్డారెడ్డి (పోలని రెడ్డి యని నామాంతరము) మూలపురుషుడని తెలియుచున్నది. క్రీ. శ. 1290 సంవత్సర ప్రాంతములో మానలీ, బెళుదోణీ, రాయచూరు, మోసలకల్లు, అలంపురము, ఆద వేని, అయిజ అను ఏడు పరగణాలపై కాకతి ప్రతాపరుద్రునిచే బుడ్డారెడ్డికి 'నాడ గౌడరికము' ఇవ్వబడినది. 1686-1687 సంవత్సర ప్రాంతమున బనగానిపల్లె. శిరివెళ్ల, నంద్యాల, శిరిగుప్ప, సిద్ధాపురము, బండాత్మకూరు అహోబిలమువరకును గద్వాలసంస్థానాధిపతులు జయించి తమ రాజ్యమును విస్తరించుకొనిరి. అనంతరము కర్నూలు నవాబును గెలిచి, విజయచిహ్నముగ ఆ నవాబుయొక్క పతాకమును తెచ్చి గద్వాలయం దుంచుకొనిరి.
దాదాపు 300 సంవత్సరముల క్రిందటివరకు 'నాడగౌడు', 'సర్ నాడ గౌడు' లాంఛనములతోడను, తరువాత సర్వరాజరిక లాంఛనాధికారములతోడను ఈ సంస్థానాధీశులు వెలసినారు. వీరు ముష్టిపల్లివంశమునకు చెందిన పాకనాటి రెడ్లు. ఆదినుండి వీరు వైష్ణవభక్తులు. క్రీ. శ. 1663 - 1713 నడుమ ఇప్పటి గద్వాల నగర ప్రదేశముననే దుర్గ నిర్మాణము జరిగినది. ఈ స్థలనిర్ణయమునకు అనేకములగు కథలు, గాథలు చెప్పుదురు. మొదటి నుండియు ఈ రాజ వంశమునకు అచటికి సమీపమున గల పూడూరు చెన్న కేశవస్వామి ఇలవేలుపు. అందుచే ఆ సంస్థానపు రికార్డులలో దానికి కేశవనగరము అనునామము లిఖితమై యున్నది. ఐనను గద, వాలు అను రెంటిచే ఈ సంస్థానపు రాజులు ఇతరులను జయించి, రాజ్యవిస్తీర్ణము గావించుకొనిన కారణముగా, దానికి 'గదవాల' అను పేరు వచ్చి ప్రజల నోట నాని క్రమముగ గద్వాల అయినదందురు. గద్వాల సంస్థానమును ఈ దిగువ వివరించిన పదకొండుగురు పురుషులును, ఎనిమిదిమంది స్త్రీలును పాలించినట్లు ఆధారములున్నవి.
1. రాజ శోభనాద్రి : ఇతడు కర్నూలు జిల్లా కొంతలపాడు గ్రామ మునసబైన వీరారెడ్డి కుమారుడు. తాను పూడూరు నాడ గౌళ్ళ పక్షమున వారసుడనని చెప్పుకొనెను. శా. శ. 1585 సం. లో ఇతడు బక్కమ్మ అనునామె పోషణలో నుండి శా. శ. 1310 నుండి 1619 వరకు యుద్ధము చేసి, అయిజపరగణాను గెలిచి స్వాధీన మొనర్చుకొనెను. బక్కమ్మ పేర అయిజలో ఒక బావిత్రవ్వించి, శా. శ. 1620 నుండి శా. శ. 1627 వరకు కోట నిర్మాణమందు నిమగ్నుడై యుండెను. పిమ్మట శా. శ. 1628నుండి శా. శ. 1634 వరకు ఇతడు కాశీలో రామలింగ ప్రతిష్ఠ ఇత్యాదులు చేసి శా. శ. 1634 వరకు జీవించియుండెను.
2. శోభనాద్రి అనంతరము శా. శ. 1641 సం. వరకు కల్లా వెంకటన్న యను నాతడు రాజకార్య పర్యవేక్షకుడుగా నుండెను.
3. కల్లా వెంకటన్న అనంతరము శోభనాద్రి భార్యలు (రాణులు) రాచకార్య నిర్వహణమునకై రమణయ్య అను నొక వైదిక బ్రాహ్మణుని నియమించుకొనిరి. ఈ రమణయ్య శా. శ. 1641 నుండి 1646 వరకు తన బాధ్యతను నిర్వహించెను.
4. రాణి అమ్మక్కమ్మ : ఈమె శోభనాద్రి మొదటి భార్య. రమణయ్య అనంతరము శా. శ. 1646-1647 వరకు ఈమె స్వయముగా రాజ్యభారము వహించెను. 5. రాణి లింగమ్మ : (శోభనాద్రి రెండవభార్య) శా. శ. 1647 నుండి 1660 వరకు సంస్థానమును పాలించెను. ఈమె సంస్థానమునందలి ముండ్లదిన్నె గ్రామవాసి నాగన్న కొడుకగు తిరుమలరాయుని దత్తుచేసికొనెను. ఈమె బీచుపల్లి వద్ద నిజాంకొండ కోటయొక్క నిర్మాణ మారంభించెను. సంగాల చెరువును, తాండ్రపాటి చెరువును, గద్వాలలో లింగమ్మ బావియును నిర్మించెను.
6. రాజా తిరుమలరావు: ఇతడు శా. శ. 1660 నుండి 1664 వరకు సంస్థానము నేలెను. ఇతనికి ఇద్దరు కుమారు లుండియుండిరి. బీచుపల్లివద్ద ప్రారంభింపబడిన నిజాంకోట నిర్మాణమును ఇతడు పూర్తిచేసెను.
7. రాణి మంగమ్మ : ఈమె రాజా తిరుమలరాయుని మొదటి భార్య. తనభార్య అనంతరము ఈమె శా. శ. 1664 న కొన్ని మాసములు రాజ్యభారము వహించినది.
8. రాణి చొక్కమ్మ : రాణి మంగమ్మ తరువాత, తిరుమలరావు రెండవ భార్యయగు చొక్కమ్మ శా. శ. 1664–1669 వరకు సంస్థానమును పాలించెను. బీచుపల్లి వద్ద నిజాంకోటలో ఆంజనేయ ప్రతిష్ఠగూడ గావించినది. ఈమె తన మరదియు, బోరవెల్లి గిరెమ్మ దత్తపుత్రుడును అగు రామారాయుని పిలిపించి తన ఇద్దరు కుమారులతో పాటు, అతనికిగూడ రాజ్యము స్వాధీనముచేసి, రామారాయుని తన కుమారులపై పర్యవేక్షకునిగా నియమించెను.
9. రాజా రామారావు: ఇతడు శా. శ. 1668 నుండి 1683 వరకు గద్వాల సంస్థానమును పాలించెను. తనకు సంతానము లేనందున చొక్కమ్మ అనుమతితో ఆమె ఇద్దరు కుమారులను స్వపుత్రులుగా భావించి, తనదగు బోరవెల్లి సీమయందలి గ్రామములను గూడ గద్వాల సంస్థానములో చేర్చి పాలించెను. రాజప్రోలు జమీందారులతో యుద్ధముచేసి, అతని జమీలోని 8 గ్రామములను సంస్థానములో చేర్చెను. కర్నూలు నవాబును గెల్చి అచ్చటి పసుపు జెండా, ఢంకా, నగారా మొదలగు వాటిని స్వాధీనపరచుకొనెను. అంతేగాక ఇతడు ఆవుక్ తాలూకా వరకు జయించి, బేతండ్ల గ్రామములో చెన్న కేశవ ప్రతిష్ఠ చేసెను.
10. రాజా చిన్నసోమ భూపాలుడు : రాజా రామారావు అనంతరము రాజా చిన్నసోమ భూపాలుడు శా. శ. 1684 నుండి 1715 వరకు గంగనపల్లె దొరలు, ఉప్పేరు నవాబుల (గంగనపల్లె, ఉప్పేరు గద్వాల తాలూకాలో ఇప్పటికిని గల గ్రామములు; సంస్థానము కాలములోను ఇవి అందులోనివే) గెల్చి, దరూరు (నేటి గద్వాల తాలూకాలోని గ్రామము) పరగణా గ్రామాలను సంస్థానములో చేర్చుకొని భూపాలు బిరుదమందెను. శా. శ. 1692 లో భార్యపేర కోటలోని కేశవాలయ విమాన (శిఖర) ప్రతిష్ఠయు, 1701 లో రామాలయ నిర్మాణమును, 1710 లో భూదేవి ఆలయ ప్రతిష్ఠయు ఇతడు చేయించెను.
11. రాజా చిన్నరామ భూపాలుడు: ఇతడు తన అన్న యగు చిన్నసోమ భూపాలుని అనంతరము శా. శ. 1716 నుండి 1728 వరకు గద్వాల సంస్థానమును పాలించెను. ఇతడు రాయచూరు దేశాయి హనుమంతరావు, నర్సింగ రావులతో దోరణాల శివారు విషయములో (దోరణాల గ్రామము గద్వాల తాలూకాలోనిది) కలహించి, నిజాం నవాబు పక్షమున సుబహనుల్లాఖాన్ అనువానిని రప్పించి తగాదాను పరిష్కారము చేయించెను. ఇతడు తన ఏకైక పుత్రికయగు లింగమ్మను జోళాపుర వాస్తవ్యుడైన నల్లారెడ్డి కుమారుని కిచ్చి వివాహముచేసి అల్లుని ఇల్లరిక ముంచుకొనెను. అల్లుని పేరును సీతారాం భూపాలుగా మార్చి అతనికి రాజ్యపాలనాధికారమును దత్త మొనర్చెను.
12. రాజా సీతారాంభూపాలుడు: ఇతడు శా. శ. 1728 నుండి 1761 వరకు సంస్థానమును పాలించెను. ఇతనికి అనంతమ్మ, లింగమ్మ, వెంకటలక్ష్మమ్మ అను మువ్వురు భార్యలుండిరి. ఇతడు నిస్సంతువు.
13. రాణిలింగమ్మ : సీతారాంభూపాలుని మరణానంతరము శా. శ. 1761 నుండి 1763 వరకు రాణి లింగమ్మ రాజ్యపాలన మొనర్చెను. (సీతారాం భూపాలుడు తన మొదటి భార్యయగు అనంతమ్మ మరణింపగా, లింగమ్మను వివాహమాడి యుండవచ్చును. లింగమ్మ జీవించియున్నను సంతానార్థము ఆతడు వెంకటలక్ష్మమ్మను గూడ పెండ్లాడి యుండవచ్చును.)
14. రాజా సోమ భూపాలుడు : రాణి లింగమ్మ, వెంకటలక్ష్మమ్మలు సంతానహీనలైనందున, వారు వడ్డెపల్లి యల్లారెడ్డి కుమారుడు రామన్న అను నతనిని దత్తుగొని, ఆతనికి సోమ భూపాలుడని నూతననామ మిడిరి. సోమ భూపాలుడు శా. శ. 1763 నుండి 1766 వరకు సంస్థానమును పాలించెను.
15. రాణి వెంకటలక్ష్మమ్మ: దత్తపుత్రుని అనంతరము రాణి వెంకటలక్ష్మమ్మ జనానా నిబంధనలను తొలగించుకొని శా. శ. 1766 నుండి 1787 వరకు స్వయముగా రాజ్యమును పాలించెను. ఆమె పాలనలో శా. శ. 1771 సం.న రాచనగళ్ళలో కేశవాలయ మహాద్వారమును, గోపురము వగైరాలను నిర్మించెను. అనంతరము వేంకటాపురమునకు చెందిన గోమం కృష్ణారెడ్డి కుమారుడు రామన్న అను నతనిని దత్తుగొని, నైజాం నవాబుచే దత్తును మంజూరు చేయించుకొనెను. ఈ దత్తు కుమారుని పేరు రాజారాం భూపాలుడు.
16. రాజారాం భూపాలుడు: ఇతడు శా. శ. 1765 న జననమందెను. శా. శ. 1768 లో రాణి వెంకటలక్ష్మమ్మకు దత్తుబోయెను. శా. శ. 1787 నుండి రాజ్యభారము వహించెను. ఇతని సోదరుడు, వెంకటాపురవాసియైన భీమి రెడ్డి కుమారుడు వేంకట రామిరెడ్డిని దత్తుకొనెను. సీతారాం భూపాలుడు అని దత్తునామము. రాజారాం భూపాలుడు శా. శ. 1823 వరకు రాజ్యభారము వహించెను.
17. రాణి లక్ష్మీదేవమ్మ : రాజారాం భూపాలుని దత్తపుత్రుడు మహారాజా సీతారాం భూపాలుడును, రాణి లక్ష్మీదేవమ్మయు కలిసి శా. శ. 1823 నుండి 1835 వరకు నైజాం నవాబు పర్యవేక్షణ క్రింద గద్వాల సంస్థానమును పాలించిరి. 1835 నుండి 1846 వరకు సీతారాం భూపాలుడు స్వతంత్రముగా రాజ్యము నేలెను. ఆ కాలమున లక్ష్మీదేవమ్మ జీవించియే యుండెను. 1835 న మహారాణి ఆదిలక్ష్మీదేవమ్మ వివాహితయై, వరలక్ష్మీదేవమ్మ, శ్రీ లక్ష్మీదేవమ్మ అను నిద్దరు కుమార్తెలను కనెను. వీరి దాతృత్వమును ప్రశంసించుచు వీరికి 'మహారాజా' బిరుదు ఒసగబడెను.
18. మహారాణి ఆదిలక్ష్మీదేవమ్మ : శా. శ. 1816 లో ఈమె జననము. 1835 లో మహారాజా సీతారాం భూపాలుని వివాహమాడెను. భర్త అనంతరము శా. శ. 1846 నుండి నైజాం నవాబు 'నిగ్రాని' (పర్యవేక్షణము) నుండి సంస్థానమును వదలించుకొని స్వతంత్రించి పాలించెను. గత విజయనామ సంవత్సర శ్రావణ శుద్ధ విదియనాడు ఈమె కాలధర్మము నొందెను. ఈమె హయాములోనే గద్వాల సంస్థానము ఆంధ్రప్రదేశలో విలీనమయ్యెను (17 వ సెప్టెంబరు 1949). ఈమె పెద్ద కుమార్తె వరలక్ష్మీ దేవమ్మ యొక్క జ్యేష్ఠ పుత్రుడగు రాజా కృష్ణరాం భూపాలును విక్రమ సంవత్సర కార్తీక బ. పంచమి బుధవారమునాడు దత్తస్వీకారము చేసికొనెను.
గద్వాల దుర్గ నిర్మాణ సందర్భములో నొక విచిత్రమైన గాథ ప్రజలు చెప్పికొందురు. దుర్గమును కట్టినవెంటనే అది కూలిపడుచుండెడిదనియు, నిర్మాతలకు స్వప్నమున నొక వ్యక్తి సాక్షాత్కరించి ఒక పుణిక బ్రాహ్మణుని బలియిచ్చినచో దుర్గము నిల్చునని చెప్పెననియు, అంతట కేశవాచార్యులు అను నాతనిని బలియిచ్చి, అచ్చటనే అతనికి సమాధి నిర్మించిన ఫలితముగా దుర్గము నిలిచిన దనియు, తత్పాప పరిహారమునకై అచ్చోట కేశవాంకితముగ దేవాలయము నిర్మింపబడినదనియు చెప్పుదురు.
ఈ సంస్థానము క్రింద 103 పెద్దగ్రామములు, 26 జాగీరులు ఉండియుండెను. ఒక్కొక్క గ్రామము క్రింద కొన్ని కుగ్రామములు గలవు. అన్నియు కలిసి సంస్థానములో 360 గ్రామము లుండెను. ఈ సంస్థానమునకు తూర్పున అలంపురము తాలూకాయును, దక్షిణమున తుంగభద్రా నదియు (ఆదవేని సరిహద్దు), పడమర రాయచూరు తాలూకాయును, ఉత్తరమున కృష్ణానదియు గలవు. ఈ సంస్థానము కొంతకాలము బీజపురపు రాజులకు సామంత రాజ్యముగా నుండినందుననేమో, తెనుగు రాజ్యమైనను, తెనుగు తేటదనమునకు కన్నడపు కస్తురి గుబాళింపు కలిగినది.
సంస్థానపాలకులు వైష్ణవమతానుయాయు లగుటచే విశిష్టాద్వైతులు తిరునక్షత్రము వగైరా పర్వదినములకు విశేషప్రాధాన్య మేర్పడినది. అయినను సంస్థానమందంతటను, గద్వాల నగరములోను గల పెక్కు వీరభద్ర, శివాలయములు రాజాదరమును పొందియున్నవి. స్మార్తు లనేకులు ఆస్థాన కవిపండితులుగను శ్రౌతస్మార్తాధికారులు గను ఆదరింపబడిరి. పండితులు, పౌరాణికులైన మాధ్వ లును (ద్వైతులు) కొంద రున్నారు. వివిధ ప్రభుత్వ శాఖలలో గ్రామకరణములే అధికారులుగ నున్నారు. ద్వైత, అద్వైత, విశిష్టాద్వైతులకును, దేవాగారములకును, మహమ్మదీయులకును, వారి మసీదులకును సంస్థానముయొక్క ఆదరాభిమానములు లభించెను.
ఈ సంస్థానము దాదాపు 880 చ. మైళ్ళ వైశాల్యము గలది. రాయచూరు జిల్లాలోని దాదాపు 25 గ్రామములు సంస్థానమునకు సంబంధించిన తెలుగు గ్రామములే. పరిపాలనా సౌలభ్యమునకై గద్వాల తాలూకాలో తూర్పుననున్న దాదాపు 50 గ్రామములు అలంపురము తాలూకాలో చేర్చబడి గద్వాల, అలంపురము తాలూకాలు గ్రామముల సంఖ్యలో సరిసమానములుగా చేయబడినవి.
ఈ సంస్థానము సముద్రమట్టమునకు 1068 అడుగుల ఎత్తున నున్నది. 1345, 1347 ఫసలీల ప్రభుత్వపు లెక్కల నివేదిక ప్రకారము ఈ తాలూకాలో సగటు వర్షము 35 అంగుళములు. ఇందు 30,300 గృహములు దాదాపు 61,600 పురుషులు, 57,600 స్త్రీలును కలరు. ఇచ్చటి ముఖ్యమైన ఆహారపంటలు జొన్న, సజ్జ, కొఱ్ఱ. ముఖ్యమైన వాణిజ్యపు పంటలు పత్తి, వేరుసెనగ, కంది, పెసర వంటి కాయధాన్యములుగూడ ఇచ్చట పండును. పూర్వ మొక కవి నుడివినట్లు, "కలిగియు గృష్ణనెత్తిన జగజ్జన కల్మష నాశన క్రియామలగుణ పుష్టదర్శన విమర్దిత లౌకిక తృష్ణక్రిందనే ! పొలిచియు తుంగభద్ర నిజ భూరి తరంగసముద్ర గద్దువాల్ తలగలవ్రాలదేమొ వరిధాన్యము సేద్యము శూన్య మెప్పుడున్". సంస్థానములో నాటికిని, నేటికిని కేవలము బావులక్రింద పండించుకొనిననేగాని వరియన్నము లభ్యముకాదు.
సంస్థానముయొక్క రెవెన్యూ ఆదాయము 1,97,413 రూపాయలు. (26 జాగీర్లు కాక 102 గ్రామములవి మాత్రమే) జాగీర్ల ఆదాయమును కలుపుకొనినచో రు. 25204 ల వరకుండగలదు. అటవీశాఖ నుండి రు. 8,0484 లు; ఆబ్కారినుండి రు. 3,48, 962 లు; ప్రెస్ నుండి రు. 18,175 లు; రిజిస్ట్రేషను నుండి రు. 1,792 లు; న్యాయశాఖనుండి రు.2,719 లు. ఇవికాక భూమి రెవెన్యూశిస్తుపై రూపాయకు 0-1-3 వంతున వసూలయ్యే విరాళమునుండి రు. 46,576 లు. ఇవికాక ఇతర ఆదాయము కలిసి లెక్కలలోమాత్రము రు. 7,31,745 లు కనిపించును. కాని ఆస్తులు వారివారి వారసుల పేర పట్టాలు చేయుట వలన, నజరానాలు, కానుకలు పుచ్చుకొనుట వలన, సంస్థానమునకు సం. 1కి దాదాపు పదిలక్షల రూపాయల ఆదాయము లభించెను. ఈ విరాళ మనునది సంస్థానములో కార్తీక, మాఘ మాసములలో జరుగు పండిత, కవి, గాయక సన్మానముల నిమిత్తము వసూలు చేయబడెడిది. దీనికితోడు సంస్థానాధీశుల కళాభిరుచికి, దాతృత్వమునకు అభినందన పూర్వకముగా నైజాం నవాబు ప్రతి సంవత్సరము రు. 50.000 లు గ్రాంటు రూపమున ఇచ్చుచువచ్చిరి. ప్రభుత్వ నివేదికప్రకారము సంస్థానముయొక్క సాంవత్సరిక ఖర్చు రు. 7,31,308 లు. ఇప్పటి ఆదాయము రెవెన్యూనుండి దాదాపు రు. 3 లక్షలు, ఆబ్కారినుండి రు. 5 లక్షలు. తదితరము లన్నియు కలిపిన ఇంచుమించు పది లక్షల వరకున్నది.
ఈ సంస్థానమునకు సివిల్, క్రిమినల్, జుడిషియల్ అధికారములుండినవి. ఇచ్చట కోర్టు మునసబు, సెషన్స్ జడ్జి, పోలీసు సూపరింటెండెంటు, కలెక్టరు (తాలూకా దారు) హోదాలకొరకు అధికారులు, ప్రభుత్వశాఖలవారు ఉండిరి. రాజలాంఛనములైన గుర్రములు, ఏనుగులు, ఒంటెలు, పదాతిసైన్యము, గుఱ్ఱపు సవారులు, అరబ్బులు, ఫిరంగులు, తోపులు మున్నగునవి కలవు. ఈ సంస్థానమున శ్రీ చెన్న కేశవ ముద్రణాలయము సీతారాం భూపాలు కాలమునను, వైద్యశాలలు, రహదారులు, విద్యుచ్ఛక్తి, పార్కులు, అనాథ శరణాలయములు, పాఠశాలలు మొదలైనవి రాణి ఆదిలక్ష్మీదేవమ్మ (తుట్టతుద పాలకురాలు) కాలమునను నెలకొన్నవి.
చారిత్రక స్థలములు, క్షేత్రములు : గద్వాలకు దాదాపు 7 మైళ్ళలో పూడూరు అను గ్రామము కలదు. ఈ గ్రామము 9 వ శతాబ్దమున అత్యున్నతదశ యందుండినట్లు తెలియుచున్నది. ఇచ్చట గమనార్హమైన దుర్గ మొకటి కలదు. ఈ గ్రామము గద్వాల రాజులకు మొదటి నివాసస్థానము. పూర్వము ఈ నగరము జైనమత కేంద్రముగా నున్నట్లు చిహ్నములు కలవు. దీని పూర్వనామము "పుండ్ర పురము." వల్లూరు: ఈ పురము కాకతి గణపతిదేవుని సామంతుడగు గంగయ సాహిణికి రాజధానిగా నుండెను. రుద్రమాంబా ప్రతాపరుద్రుల సామంతుడగు త్రిపురాంతకుడు ఈ వల్లూరు నుండియే రాచరికము నెరపినాడు. గద్వాలకు 15 మైళ్ళలో తుంగభద్రానదీ తీరమున నున్న వేణీ సోంపురమునందు శ్రీవ్యాస తత్వజ్ఞులచే నొక చెరువు నిర్మింపబడుచుండగా, అచ్చట భూమిలో దొరకిన రెండు వేణుగోపాలస్వామి విగ్రహములలో నొకటి వల్లూరులో ప్రతిష్ఠింపబడినది.
రాజవోలు : ఇచ్చట నొకకోట, అగడ్తయు, గద్వాల నగరములోవలెనే ఒక సభామంటపము (ఏడు అంగణముల సోఫాదర్బారు హాలు) ను కలవు. రాజవోలు (రాజప్రోలు) రాజులకు నిలయము.
ఐజ : గద్వాల సంస్థానపు మూలపురుషుడగు బుడ్డారెడ్డియొక్క జన్మస్థానము. ఈ గ్రామనామమునుబట్టి రాజరికమువారు “ఐజ గౌడులు" అని పేర్కొనబడినారు.
మొదలుకల్లు : ఈ గ్రామము బ్రహ్మాండపురాణమున 'ఆది శిలాక్షేత్రము'గా పేర్కొనబడినది. 'ఆదిశిల' అను పదమునకు ' మొదలుకల్లు' తెలుగు రూపము. ఇది యొక పుణ్యస్థలము.
చాగదొన : ఇచ్చట ఒక పెద్ద పరుపుబండ కలదు. దాని మీద నీటి దొన యొకటి కలదు. దాని ప్రక్కనే రామలింగేశ్వరాలయ మున్నది. ఈస్వామి అభిషేకార్థము, చ్యవనుని కోరికపై ఈ నీటి దొన ఏర్పడినదట. చ్యవనక దొన 'చాగ దొన' గా మారినట్లు తెలియుచున్నది.
బీచుపల్లి : ఇచ్చటి దేవాలయము గద్వాల సంస్థానము కంటె ప్రాచీనము. పూర్వమిది కణ్వాశ్రమమని చెప్పుదురు. ఆంజనేయక్షేత్రము ; అడవిప్రాంతము విరాగులకు, కళోపాసకులకు వసించుటకును, విహరించుటకును, ఏకాంతమైన ప్రశస్త ప్రదేశము. గద్వాల సంస్థానాధీశులు ఇచ్చట వేదోక్తముగా పూజాదికములు జరుగుటకై మాధ్వబ్రాహ్మణులను ఈనాము లిచ్చి నియమించినారు. కాని దేవుడు వెలసిననాటినుండి వాల్మీకులే (బోయవారు) అర్చన విధానాదులను జరుపుట సంప్రదాయసిద్ధముగా వచ్చుచున్నది.
శ్రీరామ అవధూత అగ్రహారము : ఇది గద్వాల నగరమునకు రెండు మైళ్ల దూరములో నున్న కృష్ణానదీ తీరమున గల యొక మఠము. రామావధూత అను కశ్చిత్ రాష్ట్రీయుడు కృష్ణానదిలోని ఎర్రగుండు మీద యోగసమాధిలో కూర్చుండి యున్నట్లు గద్వాల రాజా చిన సోమనాద్రి తెలిసికొని, అవధూతను దర్శించి, వారికోరిక ననుసరించి, ఈ మఠమును నిర్మాణము చేసెను. ఇచ్చట పెక్కు దేవాలయములు నిర్మింపబడినవి. అవధూత యొక్క మహిమలచే పునీతమైన క్షేత్ర మిది. ఇచ్చటి మఠ, దేవాలయాదుల నిర్వహణమునకై గద్వాల రాజులు బాధ్యత వహించి, సౌకర్యములు కల్పించి యున్నారు. ఇది యాతాయాతజనమునకు భోజనాది సౌకర్యములు కలిగించు మంచి మజిలీ. శ్రాద్ధాది అపర కర్మలు జరుపుటకు అనుకూలమైన ప్రశాంత ప్రదేశము.
సాహితీవికాసము : హైదరాబాదు రాష్ట్రమునందలి సంస్థానము లన్నిటిలో గద్వాలయందు సాహితీపోషణము అత్యధికముగా జరుగుచుండెడిది. ఈ సంస్థానాధీశులు బ్రాహ్మణ భక్తియు, వైష్ణవ గురుత్వమును కలిగియుండినను, వైష్ణవేతర, బ్రాహ్మణేతర, హైందవేతరులగు విద్యావేత్తల యెడలను, కళావేత్తల యెడలను నిష్పాక్షికముగ ఆదరమును ప్రకటించి, వారిని సన్మానించిరి. ఈ సంస్థానము కవులకును, కళావేత్తలకును, పండితులకును విహారరంగమై వర్ధిల్లినది. ఇచటికి వచ్చి తమ కౌశల్యమును ప్రదర్శించి సంస్థానాధీశుని వలన సన్మానమును పొందని కవి, పండితుడు, తాత్వికుడు, గాయకుడు, శాస్త్రజ్ఞుడు లేడు. 'అష్టదిగ్గజముల' కు తిక్కనవంటి కాణాదం పెద్దన సోమయాజులకు ఇది నివాసభూమి.
ఈ సంస్థానమునకు పూర్వము బోరవెల్లి రాజధానిగా ఉన్నప్పుడు దాదాపు 400 సంవత్సరముల క్రిందట ఆస్థానపండితుడుగా నుండిన అయలూరి కందాళాచార్యు లను వారు సంస్కృతమున 'అలంకార శిరోభూషణము' అను అలంకార శాస్త్రమును రచించిరి. క్రీ. శ. 1620 వ సం. న రెంటూరి రంగరాజుచే వ్రాయబడిన 'భానుమతీ పరిణయము' అను తెలుగు పద్యకావ్యమును 1929 లో రాణి లక్ష్మీదేవమ్మ తన ఆస్థానపండితుడగు యామునా చార్యునిచే పరిష్కరింపించి ముద్రణ చేయించెను. ‘దేవకీ నందన శతక 'మను తాళపత్ర ప్రతిని విక్రాల వెంకటా చార్యులను మరొక విద్వాంసునిచే పరిష్కరింపించి ప్రచు రించెను. ఈ దేవకీనందన శతకకర్తకు సంబంధించిన వివరములు అలభ్యములు. కాని ఇతడు అప్పకవికంటె ప్రాచీనుడని ఊహించుటకు ఆధారములు కలవు. ఈ కవి 'దేవకీ నందనా !' అను మకుటముతో సుమారు కొన్ని వేల పద్యములు రచించినట్లు తెలియుచున్నది.
పెదసోమభూపాలుని ఆస్థానమున (క్రీ. శ. 1650) నున్న బుచ్చివేంకటాచార్యు లనువారు అభినవ శృంగార రసమంజరీ భాణము, కల్యాణ పురంజనము, శృంగార సర్వస్వము, వేదాంతకారికావళి అను సంస్కృత గ్రంథములను రచించిరి. ఈతని ఆస్థానముననే కొటికలపూడి వీరరాఘవకవి అను వైష్ణవ పండితుడు రాజాశ్రయమున నుండి 'యథా శ్లోకతాత్పర్య భారత' మను సంస్కృత భారతము నందలి ఉద్యోగ పర్వమును పద్యములలో ఎనిమిది ఆశ్వాసముల గ్రంథముగా తెనిగించి, రాజుల ఇంటి ఇలవేలుపైన చెన్నకేశవస్వామికి అంకిత మిచ్చెను. ఈ కవికి 'అభినవ తిక్కన' యని రాజుచే బిరుద మియ్యబడినది.
ఈ పెదసోమభూపాలుడు స్వయముగాకూడ సంస్కృతాంధ్రముల సమగ్రాభినివేశమును, నిరర్గళ కవితా ధారయు కలవాడు. ఇతడు జయదేవుని 'గీతగోవిందము' నుండి ప్రతిశ్లోకమును తెలుగుపద్యముగను, ప్రతి అష్టపదిని ఒక చూర్ణికగను తెనిగించెను.
క్రీ. శ. 1761 నుండి 1794 వరకు పాలించిన చినసోమ భూపాలుడును కవి పండిత పోషకుడే కాక, స్వయముగ సంస్కృతాంధ్ర పాండితీ కవితా విధేయుడు. ఇతని ఆస్థానమున 'అష్టదిగ్గజము' లను పేరందిన ఎనమండుగురు కవులుండినట్లు తెలియుచున్నది. ఇతనికి 'సారస్వత వైభవాభినవభోజరాజు' అను బిరుదము కలదు. ఇతడు సంస్కృతమున హరిహరభట్టు వ్రాసిన 'రతిరహస్యము'ను తెనుగు పద్యకావ్యముగ అనువదించెను. ఈ చిన సోమ భూపాలుని ఆస్థానపండితులలో కాణాదం పెద్దన సోమయాజి ముఖ్యుడు. ఆశు, బంధ, చిత్ర, గర్భ అను 'చతుర్విధ కవితానవద్య' బిరుదాంకితుడు. ఇంకను కొత్తపల్లి రామాచార్యులు, గార్గేయపుర సుబ్బాశాస్త్రి, కామసముద్రం అప్పలాచార్యులు, తిరుమల కృష్ణమాచార్యులు, శేషకవి, సోమనాథశాస్త్రి, ధర్మవరం రామకవి మున్నగు సాహితీ ధురీణులు, విద్వత్కవి కుంజరులు, అష్టభాషా కవితా వైభవ దురంధరులు సంస్థానాశ్రయమున నుండి భగవతి భారతీదేవి నారాధించుచుండిరి.
క్రీ. శ. 1840 - 1900 వరకు పాలించిన రాజారామ భూపాలుడు తమ విద్యాగురువులగు పురాణం దీక్షా చార్యులవారి 'సంస్కృత ఛందోముకుర'మను అలంకార గ్రంథమును తెనిగించిరి. ఈ దీక్షాచార్యులు సంస్కృతమున పెక్కు గ్రంథములు వ్రాసిరి. వీరు రామచంపువు, ఛందోముకురము, రామనృప కర్ణామృతము, కేశవ సుప్రభాతము, కావ్యోత్కర్షలు అను గ్రంథములను రచించిరి. హొసదుర్గం కృష్ణమాచార్యులనువారు 'కార్తీకోత్సవ దీపిక' అను గ్రంథమును రచించినారు. ఇందు సంస్కృత శ్లోకరూపమున గద్వాలలో జరుగు కార్తీక సభలు మొదలగునవి వర్ణితములు.
క్రీ. శ. 1901 నుండి 1924 వరకు ఏలిన సీతారామ భూపాలుని కాలము గద్వాలకు ఒక విధముగ స్వర్ణయుగమని చెప్పవచ్చును. వీరి కాలముననే తిరుపతి కవులకు గజోత్సవములు జరిగినవి. వీరి పండితకవి సన్మానములకే సంస్థానము దాదాపు 40 లక్షలవరకు (సాలీనా 12 లక్షల ఆదాయము కాక) ఋణముచేసెను. వితరణమున ఈ మహారాజుది ఎముకలేని హస్తమని ప్రతీతి. వీరి కాలమున జీవించిన బైరంపల్లి తిరుమలరాయకవి యను నతడు సంస్కృతాంధ్రముల యందు ఆశుకవితా చక్రవర్తి. ఈరాజు కాలమునను, ఇతని అనంతరమును, ఇతని భార్య ఆదిలక్ష్మీదేవమ్మ కాలమునను, కడపజిల్లా పర్లపాడు గ్రామస్థుడు చెమికల చెన్నారెడ్డి అను పండితుడు సంస్థానముచే సత్కరింపబడెను. ఇతడు రచించిన 'సంగీత హరిశ్చంధ్ర', 'గద్వాల కేశవశతకము', 'మదన మోహన శతకము' మొదలగునవి ప్రశస్తికెక్కినవి. ఇతని కవిత ద్రాక్షా పాకము. వీరుకాక ఆస్థానపండితులు అనేకులు కలరు. కీ. శే. హొసదుర్గం వేదాంతాచార్యులు గద్వాల సంస్థాన ధర్మాధికారులు. వీరి ముద్రితరచన "శ్రీకృష్ణ బ్రహ్మతంత్రార్య వేదస్తవము.” అముద్రిత రచనలు గూడ పెక్కులు కలవు. కీ. శే. పుల్ల గుమ్మి వేంకటాచార్యులు వైయాకరణి; ఆస్థానపండితుడు. 'ఆదిలక్ష్మీ కర్ణపూరము' అను అలంకార గ్రంథమును ప్రతాపరుద్రీ యము, నరస భూపాలీయముల శైలిలో ఇతడు గద్వాల రాణిపేర విరచించెను. వీరి కుమారుడగు శ్రీనివాసాచార్యులు కూడ వ్యాకరణపండితులు. సంస్కృతమున 'వేదపాదస్తవము' 'సంస్కృత భాషా బోధిని' మొదలగునవి వీరిరచనలు. పోకూరి కాశీపతియను పల్నాటి వాస్తవ్యుడు గద్వాల ఆస్థానముననుండి శుద్ధాంధ్ర నిరోష్ఠ్య, నిర్వచన హరిశ్చంద్రోపాఖ్యానమును, సారంగధరీయమను త్ర్యర్థికావ్యమును రచించి గద్వాలప్రభువులకు అంకితము చేసెను. గాడేపల్లి వీరరాఘవశాస్త్రియను నతడొక శతావధాని; గద్వాల ఆస్థానపండితుడుగా ఇతడు ప్రసిద్ధి కెక్కినవాడు. కవిత్వమున ఇతడు పోని పోకడలులేవు. భూమ్యాకాశములంత పొడవుగల సమాసములైనను, అత్యాశువున చెప్పగలశక్తి వీరికి పుట్టువిద్య. ఇతడు బహుకావ్య నిర్మాత.
గొ. కృ.