సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మూడవ సంపుటము/ఖరోష్ఠిలిపి
ఖరోష్ఠిలిపి :
భారతదేశమున చాలా ప్రాచీనకాలమునందున్న లిపులలో బ్రాహ్మీ మొదటిది ; ఖరోష్ఠి రెండవది. బ్రహ్మీ లిపి ఎక్కువ ప్రచారములో నుండి దేశమునందంతటను వ్యాపించి నేడు అమలులోనున్న భారతీయ లిపు లన్నింటికిని ప్రాతిపదిక ఆయెను. ఖరోష్ఠి భారత దేశమున పశ్చిమ భాగములోను, వాయవ్య భాగములోను క్రీ. పూ. నాల్గవ శతాబ్దమునుండి క్రీ. వె. మూడవ శతాబ్దమువరకును సుమారు ఏడువందల సంవత్సరములు ప్రచారములో నుండి రూపుమాసి పోయెను. బ్రహ్మీ మామూలుగా మనము చదువునట్లు ఎడమవైపునుండి కుడివైపునకు వ్రాయబడుచుండెను. ఖరోష్ఠి అట్లుగాక ఉరుదూ, ఫారసీ, అరబ్బీ భాషలవలె కుడివైపునుండి ఎడమవైపునకు వ్రాయబడుచుండెను. బ్రహ్మీ లిపిలో నియమబద్ధమైన గీతలు, సుందరమైన రేఖలు, స్థిరపడిన రూపములు కనిపించును. ఖరోష్ఠి లిపిలో చాలవరకు నిలువుగీతలు, అడ్డగీతలు, వంకరగీతలు కన్పించుటవలన, పని తొందరలో నుండి హడావిడిగా వ్రాయు వ్యాపారస్తులును, గుమాస్తాలును మొదలగువారు వ్రాసినట్లుగా గాన్పించును. బ్రహ్మీలిపిలో గుణింతములు, గుర్తులు పరకలాటి చిన్నగుర్తుతో సూచింపబడును. సాధారణముగా అక్షరమునకు పైన కలిగే మార్పులుకొద్ది; అక్షరముయొక్క క్రిందిభాగములోనే మార్పులు చాలవరకు కనిపించి గుండ్రని ఆకారము అక్షరమునకు ఏర్పడుచున్నది. ఖరోష్ఠి అక్షరములకు గుణింతములు మొదలైనవి పైభాగము మీదనే ఏర్పడుట వలన గుండ్రటి అక్షరములు దాదాపు లేవనియే చెప్పవచ్చును. వర్ణముల ఆకారమును, ప్రమాణమును ఒకేరకముగా నుండవు.
ఈ లిపి పంజాబ్, సింధు, ఇండియా, ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దులు, తూర్పుగాంధారము, తూర్పుటర్కీస్థాన్ ప్రాంతములలో ఎక్కువ వ్యాప్తిలో ఉండెను. క్రీ. పూ. రెండు, మూడు దశాబ్దములనాటి భారతీయ - యవనరాజుల నాణెములపైనను, కఱ్ఱలపైనను, కాగితములపైనను, చర్మములపైనను వ్రాసిన శాసనములు ఖరోష్ఠి లిపిలో గాన్పించుచున్నవి. తూర్పు టర్కీస్థాన్ లోని బౌద్ధుల గోసంగి విహారశిథిలాలలో బౌద్ధగ్రంథము లెన్నియో ఈ ఖరోష్ఠి లిపిలో వ్రాయబడినవి దొరికినవి. ఇవి సుమారు క్రీ. వె. రెండవ శతాబ్దము నాటివి. కాని ఎక్కువభాగము ఖరోష్ఠీ శాసనములు భారతదేశములోనే, పంజాబ్‌లోను, ప్రాచీన గాంధారములోను దొరకినవి. ఈ శాసనములు చాలవరకు ఇప్పటికి సుమారు రెండువేల సంవత్సరముల నాటివి.
కాని ప్రాచీన ఖరోష్ఠిలిపి సింధునదికి తూర్పున ఉన్న తక్షశిలా (షాదేరి) ప్రాంతమందును, అదేనదికి పడమట నున్న పుష్కలావతి (చర్సాధా లేక హష్టీనగర్ ) జిల్లా ప్రాంతమందును కాన్పించుచున్నవి. ఒకటి రెండు శాసనములు ఇచ్చటికి నైరుతిభాగమున ముల్టాన్ వద్ద భావల్ పూరునందును, దక్షిణమున మధురయందును, ఆగ్నేయమున కాంగ్రాయందును, ఒకటి రెండు అక్షరములును, పదములును, బార్హూత్ నందును, ఉజ్జయిని యందును, మైసూరునందలి సిద్ధాపురమునందును కాన్పించుచున్నవి.
ఒక్క శిలాశాసనముల యందేగాక లోహపు రేకులమీదను. పాత్రలమీదను, బరిణెలమీదను, నాణెములమీదను, ఆభాసశిల్పము(cameos)నందును, ఆఫ్ఘనిస్థాన్ లో ఒక స్తూపమున దొరకిన చెట్టు బెరడు పైనను, మధ్యఆసియా
చిత్రము - 60
పటము - 1 ఖరోష్ఠీలిపి అక్షరములు
చిత్రము - 61
పటము - 2 ఖరోష్ఠిలిపి అక్షరములు
చిత్రము - 62
పటము - 3 ఆశోకచక్రవర్తి షాహబాజ్‌గర్హి శాసనభాగము ( క్రీ. పూ. 3వ శతాబ్దము)
చిత్రము - 63
పటము - 4 పశ్చిమోత్తర భారతమును పాలించిన యవనరాజుల నాణెముల శాసనపంక్తి (క్రీ. పూ. 2 వ శ. నుండి క్రీ. శ. 1 వ శ. వరకు)
చిత్రము - 64
పటము - 5 కనిష్కుని సుయెవిహర తామ్రశాసనభాగము (క్రీ. శ. 1వ శతాబ్దము)
చిత్రము - 65
పటము - 6 తక్షశిలాశాసనములో మొదటిపంక్తి (క్రీ. శ. 2 వ శతాబ్దము)
నది. అన్నిటికన్న ప్రసిద్ధమైనఖరోష్ఠి శాసనములు అశోకుడు, షాబాజ్‌గర్హి, మాన్సేరా అను పంజాబులోని రెండు ప్రదేశములలో వేయించిన శిలాశాసనములు ఏ ఒకటి రెండు సంయుక్తాక్షరములో తప్ప ఆశోకుని ఈ రెండు శాసనములును సులభముగా చదువుటకు వీలున్నది. శకుల శాసనములును, ఖోటానువద్ద దొరకిన ధమ్మపదమును చాలవరకు సులభముగనే చదువవచ్చును. కాని పార్థియన్ రాజు గుడుఫరుని శాసనములును, కుషాను చక్రవర్తులగు కనిష్క, హవిష్కుల శాసనములును ఇప్పటికిని చదువుట చాల కష్టము.
ఖరోష్ఠియను పేరు ఈ లిపికెట్లు వచ్చెనో తెలియరాదు. సంస్కృతభాషలో ఖరమనగా గాడిన, ఓష్ఠ మనగా పెదవి. ఈ అర్థములనుబట్టి ఊహచేసి, ఇది ప్రచారములో నున్న ప్రాంతమువారు వట్టి అనాగరికులు కాబట్టి వారి పెదవుల నుండివచ్చిన వాక్కులకు రూపముకట్టిన లిపి ఖరోష్ఠీలిపి యాయెనని కొందరు నుడివిరి. గాడిదచర్మముమీద తొలు దొల్త ఈ లిపిలో వ్రాతలు సాగించిరి. కాన ఖర్ వోస్తుమీద వ్రాసిన లిపి ఖరోష్ఠిలిపి యాయెనని మరికొందరు వక్కాణించిరి. ఖరోత్థ అనే అరమీన్ భాషాపదమే కాలక్రమమున ఖరోష్ఠీగా మారెనని ఇంకను కొందరు వాదించు చున్నారు. ఈ ఖరోష్ఠీ లిపిని చదువుటకు సాధించిన విచిత్రగాథను వివరించుటకు ఇచట సాధ్యముగాదు. భారతీయ - యవన, భారతీయ -స్కిథియన్ రాజుల నాణెములపైన యవన, ప్రాకృత భాషలలో రెండింటిలోను శాసనములు వ్రాసి యున్నందున ఈ ఖరోష్ఠి లిపిలోనున్న యక్షరములను గుర్తించుటకు మొట్టమొదట ఒక చిన్న యాధారము దొరకెను. రాజుల పేర్లును, బిరుదములును ఏ భాషలోనై నను, ఏ లిపిలోనై నను మార్పుచెందక ఒక్కరీతిగ నుండవలెను. కాబట్టి తెలిసిన యవనలిపిలో చదివిన పిమ్మట ఈ పేర్లును, బిరుదములును ఖరోష్ఠీలిపిలో ఫలానా అక్షరములలో వ్రాయబడి ఉండవలెనని ఊహించుట ఏమంత కష్టమైనపనిగాదు. ఈ రీతిగనే ఆంటెలికిడెస్, మెనెండర్ అను ఇరువురి నాణెములపై నున్న అక్షరములను కూడ (ఖరోష్ఠీ అక్షరములను) "అంతిలకిదతస తదతసమహరజస" అనియును “మిళిందసమహరజసత్రదతస", అనియును ప్రప్రథమమున చదువకలిగిరి. తరువాత అశోకుని "షాబాజ్‌గర్హి" శాసనము కనబడగా, ఖరోష్ఠిలిపిలోనున్న ఈ శాసనమును, బ్రహ్మీలిపిలో నున్న ఇతని ఇతర శాసనముల ఆధారముచే చదివి ఒక్కొక్క అక్షరమును గుర్తించి, తాము ఇదివరకు నాణెములపైన గుర్తించిన అక్షరములు సరిగనున్న వా, లేవాఅనిపరీక్షించి, చివరకు ఇంచుమించుగా ఖరోష్ఠి అక్షరముల నన్నింటిని గుర్తింపగలిగిరి. ఈ ప్రయత్నమునందు ఇ. సి. బెయిలీగారి కాంగ్రాశాసనము బ్రహ్మీ, ఖరోష్ఠీ రెండు లిపులయందును వ్రాయబడినందున, చాలసహాయకారి యాయెను. ఐనను మేస్సన్, ప్రిన్సేప్, లాన్సెన్, నారిస్, కన్నింగ్ హామ్ మొదలైనవా రెందరో శ్రమపడిన పిమ్మటగాని ఖరోష్ఠీలిపి చదువుటకు సాధ్యముగాలేదు .
'ఖరోష్ఠీలిపిని పండితులకన్న పామరులే ఎక్కువగా ఉపయోగించిరి' అనుటకు దానికున్న ప్రత్యేక లక్షణములను కొన్నిటిని నిర్వచించవచ్చును. అక్షరములు చాలవరకు అచ్చు అక్షరములవలెగాక తొందరగా వ్రాయుటకు అనుకూలముగనుండు కత్తు లిపివలె నున్నవి. దీర్ఘములైన యచ్చులు చాలవరకు దైనందిన వ్యవహారమునందు అవసర ముండవు; కాబట్టి ఈ లిపిలో కానరావు. అల్ప ప్రాణ ద్విత్వాక్షరములు (అనగా ఒత్తు లేని ద్విత్వాక్షరములు) ద్విత్వము లేక నే వ్రాయుట (అనగా క్క, గ్గ, ట్ట మున్నగు ద్విత్వాక్షరములు క, గ, ట అని వ్రాయుట) ఖరోష్ఠీలో మామూలు. ఈ విధముగనే అల్పప్రాణ, మహాప్రాణములు రెండును కలిసిన ద్విత్వాక్షరములను ద్విత్వములేక ఒకటే మహాప్రాణాక్షరముగా వ్రాయుచుండిరి. అనగా క్ఖ, గ్ఘ, డ్డ మున్నగు ద్విత్వాక్షరములును, ఖ, ఘ, ఢ అని వ్రాయుచుండిరి. ఇక పదమధ్యమమున అచ్చుసంయోగములేని అనునాసికాక్షరము లన్నింటికిని అనుస్వారము వ్రాయుచుండిరి.
ఈ లిపి సిమెటిక్ వారి నుండి గ్రహింపబడినదనియు, ఆరామిక్ లిపిలో సంధికాలమునాటి న, బ, ర, మ, వ అక్షరములకును ఖరోష్ఠీ అక్షరములకును చాల ఎక్కువపోలిక కనబడుచున్నదనియు, ఇ. థామస్ అను దొర నిశ్చయించెను. ఇ. టెయిలర్, ఎ. కన్నింగ్ హామ్ అనువారలు ఈ అభిప్రాయమునే అనుసరించుచు బహుశః మొదటి అకెమినియన్ రాజుల కాలములో ఈలిపి భారతదేశములో ప్రవేశపెట్టబడెనని తీర్మానించిరి. ఇందునకు చూపిన కారణము లివి : (1) అశోకుని శిలా శాసనములలో పశ్చిమ పంజాబ్ నందు కలవానిలో రాజశాసనము, వ్రాత అను అర్థమునందు “దిపి” అను పదము ఉపయోగింపబడు చున్నది. ఈ పదము ప్రాచీన ఇరాన్ భాషా పదము. (2) ఖరోష్ఠీలిపి ప్రచారములోనుండిన ప్రాంతము క్రీ. పూ. 500 నుండి క్రీ. పూ. 331 వరకు ఇరాన్ పాలనక్రింద నుండెను అప్పుడప్పుడు ఆ పాలనకు అంతరాయము కలిగినను, ఇరాన్ ప్రభావముమాత్రము తగ్గిపోలేదు. (3) ఇరాన్ సామ్రాజ్యము విశాలముగ వ్యాపించగా, అదివరకే ప్రభుత్వ నిర్వహణాదక్షులైన ఆరామియన్ ఉద్యోగస్తులును, వ్రాయసకాండ్రును, ఇతరులును రాజకార్యములందు ఎక్కువగా నియమింపబడిరి ; కాబట్టి నానా ప్రాంతములందును ఆరామిక్ లిపి వ్యాపించెను. అందువలన భారతదేశములో పశ్చిమోత్తర దిగ్భాగము ఇరాను సామ్రాజ్యమునకు వశమైన వెంటనే ఈ ఆరామిక్ లిపి. ఇచ్చటికి గూడ వ్యాపించెను. (4) ఖరోష్ఠి గుర్తులకును సక్కారా, తైమాశాసనములలో గాన్పించు అరామిక్ లిపి విశేషములకును ఎక్కువ పోలికలు గాన్పించున్నవి. ఈ శాసనములు క్రీ. పూ. అయిదవ శతాబ్దము నాటివి. కొన్ని కొన్ని ఖరోష్ఠి గుర్తులు ఇంకను ప్రాచీనమైన అస్సీరియా తూనిక రాళ్లపైని వ్రాతలకును, బాబిలోనియా ముద్రికలపైన వ్రాతలకును నడుమగల పోలికను వ్యక్తము చేయుచున్నవి.
ఆరామిక్ లిపిలో 22 అక్షరములు మాత్రమే కలవు. కాబట్టి భారతీయభాషలకు అవసరమగు, భ, ఘ, ద వంటి మహాప్రాణాక్షరములును, ఇతర అక్షరములును కూడ బ్రాహ్మీలిపి నుండి గ్రహింపబడినవి. ఆ విధముగనే ఒక్కొక్క అక్షరమునకును గుణింతములు (గుణింతములు ఆరమీనులిపిలో గాని, మరి ఏ ఇతర పాశ్చాత్యలిపిలో గాని లేవు కాబట్టి) బ్రాహ్మీనుండియే గ్రహింపబడియుండును.
ఖరోష్ఠీలిపి నాలుగురకములు గాన్పించుచున్నది. (1) ప్రాచీనతమ పద్ధతి. అశోకుని షాబాజ్‌గర్హి, మాన్సేరా శాసనములయందున్న లిపియు, అశోకుని సిద్దాపుర శాసనము చివరనుండు లేఖకుని నామమును, ప్రాచీనతమ నాణెములపైన గల అక్షరములును, పర్షియా దేశమున దొరకిన సిగ్లాయ్‌పైన కన్పడు అక్షరములును ఈ ప్రాచీన తమ పద్ధతికి చెందిన ఖరోష్ఠీలిపి (2) రెండవ పద్ధతి క్రీ. పూ. మొదటి రెండు శతాబ్దములందు భారతీయ - యవనరాజుల నాణెములపైన గాన్పించు ఖరోష్ఠీలిపి. ఈ లిపిని తర్వాతకాలమునాటి రాజులు కూడ అనుకరించిరి. (3) మూడవపద్ధతి క్రీ. శ. మొదటి శతాబ్దమువరకును అమలులోనుండెను. పటికుని తక్షశిలా తామ్రశాసనము నందును, మధురసుదస (సొడాస) సింహస్తంభ చూళికపైనను, కొన్ని గాంధార శిల్పముల పైనను, కల్దావా రాతిమీదను, కొందరు శక, కుషాణ రాజుల నాణెములపైనను ఈ పద్ధతి గాన్పించుచున్నది. (4) నాలుగవపద్ధతి లిపి క్రీ. శ. మొదటి రెండు శతాబ్దములందు గాన్పించుచున్నది. గాండో ఫెర్నిస్ యొక్క తఖ్త్-ఇ-బాహి శాసనమునందును, కనిష్క, హవిష్కుల శాసనములందును, ఖోటానువద్ద దొరకిన ధమ్మపద వ్రాత గ్రంథమునందును ఈ పద్ధతి లిపి గాన్పించుచున్నది.
పు. శ్రీ.