సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మూడవ సంపుటము/ఖమ్మము జిల్లా

ఖమ్మము జిల్లా :

నిర్మాణము : ఖమ్మముమెట్టుజిల్లా వేర్వేరు కాలములందు పెక్కు మార్పులు చెందుచు వచ్చినది. క్రీ. శ. 1299 సం. కు పూర్వమే ఖమ్మముమెట్టు నగరము జిల్లా ప్రధాన కేంద్రముగా నుండెను. గోలకొండ సుల్తాన్ అబుల్ హసన్ తానాషా కాలములో గోలకొండ రాజ్యమునందు 21 సర్కారులును, 355 పరగణాలును ఉండెను. తరువాత స్వాతంత్ర్యము వహించిన అసఫ్ జా నిజాముల్ ముల్కు (1724) రాష్ట్రము నంతను 40 సర్కారులుగా విభజించెను. ఈ 40 సర్కారులలో వరంగల్, ఖమ్మముమెట్టుజిల్లా లుండెను. సర్ సాలారుజంగు మహామంత్రిగా నున్నప్పుడు (1867), నిజాము రాష్ట్రము 5 డివిజనులు గను, 17 జిల్లాలుగను విభజింపబడియుండెను అప్పటి తూర్పుడివిజనులో ఖమ్మముమెట్టుజిల్లా ఒకటిగానుండెను. ఆనాటికే ఆ జిల్లా 9779చ. మై. వైశాల్యమును, 9 తాలూకాలను కలిగియుండెను. వరంగల్ జిల్లా ప్రసక్తి కానరాదు. అది ఖమ్మముమెట్టుజిల్లాలో చేరిపోయినది. 1905 లో జిల్లాల పునర్నిర్మాణముజరిగినది. అప్పుడు వరంగల్ సూబా నిర్మాణముచేసి, అందు వరంగల్, కరీంనగరు, ఆదిలాబాదు జిల్లాలు చేర్చబడెను. ఖమ్మముమెట్టు జిల్లాకే వరంగల్ జిల్లా అని నామకరణముచేసి, జిల్లా కార్యాలయములన్నియు ఖమ్మముమెట్టునుండి వరంగల్లునకుమార్చబడినవి. దానితో ఖమ్మముమెట్టు తాలూకాస్థాయినిచెందెను.

వరంగల్‌జిల్లా తిరిగి మార్పులకు లోనైనది. ఖమ్మముమెట్టు, మధిర, ఎల్లందు, పాల్వంచ, బూర్గుంపహడు అను అయిదు తాలూకాలను వరంగల్ జిల్లానుండి విడదీసి ఖమ్మముమెట్టు జిల్లాగా ఏర్పాటు చేయబడెను (1-10-1953). ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మేర్పడిన తరువాత తూర్పుగోదావరి జిల్లాలోని భద్రాచలము, నూగూరు తాలూకాలు ఖమ్మముమెట్టుజిల్లాలో చేర్చబడినవి (1960). ఈవిధముగా ఇప్పుడు ఖమ్మముమెట్టుజిల్లాలో ఖమ్మముమెట్టు, మధిర, ఎల్లందు, పాల్వంచ, బూర్గుంపహడు, భద్రాచలము, నూగూరు అను ఏడు తాలూకా లున్నవి.

ఎల్లలు : ఈ జిల్లాకు ఉత్తరమున వరంగల్ జిల్లా, దక్షిణమున కృష్ణాజిల్లా, తూర్పున తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలు, పశ్చిమమున నల్లగొండ జిల్లా ఎల్లలుగా నున్నవి. జిల్లా విస్తీర్ణము 5486.45 చ. మై. 1951 లెక్కలప్రకారము జనాభా 8,12,992 మంది. ఇందు పురుషులు 4,15,985 మంది; స్త్రీలు 3,97,007 మంది. ఈ జిల్లాలో 946 గ్రామములును, 6 పట్టణములును గలవు. జనసాంద్రత 148. తాలూకాలు : ఈ జిల్లాలో 7 తాలూకాలు కలవు.

1. ఖమ్మముమెట్టు తాలూకా

విస్తీర్ణము 591.36 చ. మై.
గ్రామములు 156
పట్టణములు 1
జనాభా 2,35,078
పురుషులు 1,19,882
స్త్రీలు 1,15,196
జనసాంద్రత 398

2 మధిర తాలూకా

విస్తీర్ణము 771.84 చ. మై.
గ్రామములు 157
పట్టణములు 2
జనాభా 1,70,661
పురుషులు 88,123
స్త్రీలు 82,538
జనసాంద్రత 227

3. ఎల్లందు తాలూకా

విస్తీర్ణము 754.93 చ. మై
గ్రామములు 49
పట్టణములు 3
జనాభా 1,19,367
పురుషులు 60,794
స్త్రీలు 58,573
జనసాంద్రత 158

4. పాల్వంచతాలూకా

విస్తీర్ణము 1,295.36 చ. మై.
గ్రామములు 69
జనాభా 1,31,310
పురుషులు 68,035
స్త్రీలు 63,275
జనసాంద్రత 101

5. బూర్గుంపహడు తాలూకా

విస్తీర్ణము 568.06 చ. మై.
గ్రామములు 42
పట్టణములు 1
జనాభా 43,590
పురుషులు 22,255
స్త్రీలు 21,335
జనసాంద్రత 77

6. భద్రాచలం తాలూకా

విస్తీర్ణము 911 చ. మై.
గ్రామములు 327
జనాభా 77,620
పురుషులు 39,016
స్త్రీలు 38,604
జనసాంద్రత 85

7. నూగూరు తాలూకా

విస్తీర్ణము 593. చ. మై
గ్రామములు 146
జనాభా 35,366
పురుషులు 17,880
స్త్రీలు 17,486
జనసాంద్రత 60

ఈ జిల్లా ప్రధాన స్థానము ఖమ్మము పురము. దీని ప్రాచీననామము కంబముమెట్టు. తరువాత ముస్లిముల నోటిలో ఖమ్మము మెట్టు అయినది. ఇప్పుడు సర్కారువారి ఆదేశానుసారము “ఖమ్మము" గా వ్యవహరింపబడుచున్నది. ఖమ్మము పురము సముద్ర మట్టమునకు 315 అడుగుల ఎత్తున నున్నది.

పర్వతములు : పాకాల - సింగరేణి నుండి చిన్నగుట్టల వరుస యొకటి బయలుదేరి ఆగ్నేయదిశ యందున్న అశ్వారావుపేట వరకు పోయి, దిగువ గోదావరిలోయకు సరిహద్దుగా నుండును. జిల్లా యంతటను చుక్కల వలె చిన్న చిన్న గుట్టలు చెదురుగా నున్నవి. తూర్పు కనుమల పర్వతములు సముద్రతీరము నుండి క్రమముగా పైకి లేచుచు నూగూరు, భద్రాచలము తాలూకాలలో వ్యాపించియుండును.

నదులు : ఈ జిల్లాలో ముఖ్యమైన నదులు మునేరు, పాలేరు, కిన్నెరసాని, వై రా అనునవి. మునేరు పాకాల

చెరువు నుండి బయలుదేరి వై రాతో కలిసి 96 మైళ్లు హిప్రంచి కృష్ణలో సంగమించును. పాలేరునది వరం

చిత్రము - 55

పటము - 1

గల్ తాలూకాలో ఉద్భవించి, మునేరుతో సమాంతరమున ప్రవహించుచు జగ్గయ్యపేటకు దక్షిణమున 7 మైళ్ల మీద కృష్ణలో పడును. కిన్నెరసాని నది పాకాల, ఎల్లందు, పాలవంచ తాలూకాలలో 55 మైళ్లు ప్రవహించి, భద్రాచలము వద్ద గోదావరిలో కలియును. వైరానది మునేరునకు ఉపనదిగా జల్పల్లి దగ్గరమునేరులో కలియును. నూగూరు, భద్రాచలం తాలూకాలకు గోదావరి నది తగులును.

అరణ్యములు : ఈజిల్లాలో 1518873 ఎకరములు అరణ్య ప్రాంతము. టేకు, ఇప్ప, నల్లమద్ది, చండ్ర, వెదురు మొదలగు వృక్షజాతులు కలవు. పులులు, చిరుత పులులు, దుప్పులు, జింకలు, తోడేళ్లు, నక్కలు మొదలగు వన్య మృగములు కలవు.

ఖనిజములు : ఈ జిల్లాలోని ఖనిజసంపత్తి పేర్కొనదగినది. నేలబొగ్గు, కెంపు రాయి, ఇనుము ముఖ్యములయినవి. నేలబొగ్గు సింగరేణిలోను, కొత్తగూడెములోను త్రవ్వబడుచున్నది. మధిర, ఖమ్మము తాలూకాలలో అభ్రకము లభించును. పాపటపల్లి రైలుస్టేషనుకు 8 మైళ్ళ దూరమున జస్తిపల్లిలో 1928 లో పాలరాళ్లు కనిపెట్టబడినవి. ఈ రాళ్ళ మునక అనుకూలముగా లేనందున, ఈ రాయి సున్నము చేయుటకు ఉపయోగింపబడుచున్నది. పాల్వంచ తాలూకాలో యల్ల బేలువద్ద పాత రాగిగను లున్నట్లు తెలియుచున్నది. ఎల్లందు తాలూకాలో బలపపురాయి విస్తారముగా నున్నది.

ఇండియా ప్రభుత్వ భూగర్భ శాస్త్రపరిశోధకుడగు డా. కింగ్ 1872లో ఎల్లందు సమీపమున సింగరేణిలో నేలబొగ్గు గనిని కనిపెట్టెను. 1886 లో ఈ గని త్రవ్వకము ప్రారంభ మయ్యెను. నేలబొగ్గుగనులలో లాభసాటిగానున్న గని యిది సింగరేణి క్షేత్రములో నాలుగు అంతరములు కనబడినవి. మొదటిది 30 నుండి 50 అడుగులలోతున నుండును. రెండవది మొదటిదానికి సుమారు 100 అడుగులక్రింద నుండును. మూడవది రెండవదానికి సుమారు 30, 40 అడుగులక్రింద నుండును. నాల్గవది మూడవ అంతరముక్రింద నున్నది. ఈ నాలుగు అంతరములలో బొగ్గుగుణము వేర్వేరుగా నుండును. నాల్గవ అంతరము నందుండు బొగ్గు అన్నింటిలోను శ్రేష్ఠమైనదని తెలియుచున్నది. ఈ శ్రేష్ఠమైనబొగ్గుకు "కింగ్" అని దానిని కనిపెట్టిన డాక్టరు కింగ్ పేరు పెట్టియున్నారు. దీని వైశాల్యము 9 చ. మైళ్లు. ఈ నాల్గవ గనిలో 4,75,00,000 టన్నులబొగ్గు కలదని లెక్క వేయబడినది.

1955 లో తీసిన నేలబొగ్గు 9,98,316 టన్నులు. ముడి యినుము 90,678 టన్నులు; గ్రాఫైటు 100 టన్నులు; క్రోమైటు 70 టన్నులు; ఇసుక 136995 టన్నులు.

శీతోష్ణస్థితి : ఖమ్మముజిల్లా అధికోష్ణమునకు ప్రసిద్ధిచెంది యున్నది. ఇచ్చట ఉష్ణముయొక్క తీవ్రత 120 డిగ్రీలవరకు నుండును.

వర్షపాతము : ఈజిల్లాలోని వర్షపాతము సగటున 39 అంగుళములు.

వృత్తులు :

1. వ్యవసాయము జీవనాధారముగా గలవారు 5,96,600
2. వ్యాపారము జీవనాధారముగా గలవారు 26,398
3. ఉద్యోగములలో నున్న వారు 74,542
4. ఇతర ఉత్పత్తికర వృత్తులు 1,15,452
మొత్తము 8,12,992

భూమి వివరములు : ఈ జిల్లాయందలి భూమి వివరము లీ క్రింది విధముగా నున్నవి :

ఎకరములు
1. మొత్తము భౌగోళిక విస్తీర్ణము 37,36,521
2. అరణ్యప్రాంతము 15,18,873
3. సాగుకు పనికిరాని బంజరుభూమి 1,34,729
4. వ్యవసాయమునకు పనికివచ్చు పడావా భూమి 1,01,372
5. బీడుభూమి 83,852
6. సేద్యమగుచున్న భూమి 9,33,507
7. పంటభూమి 8,63,053
8. మాగాణిభూమి 1,05,550

ష. రా : 3, 4, 5, 7 సంఖ్యలలో భద్రాచలము, నూగూరు అంకెలు చేరలేదు.

ఈ జిల్లాలో వరి సేద్యమునకు నీటికొరత లేకుండ వైరా, పాలేరు, బేతుపల్లి, సింగభూపాలెం ప్రాజెక్టులు నిర్మితమైనవి :

ప్రాజెక్టు వైశాల్యము ఆయకట్టు
పాలేరుప్రాజెక్టు (ఖమ్మం తా.) ఆరగాణి 651 చ. మై. 17.000 ఎ.
వై రాప్రాజెక్టు (మధిర తా.) 19,000 ఎ.
బేతుపల్లి ప్రాజెక్టు (మధిర తా.) ఆరగాణి 102 చ. మై. 4800
సింగభూపాలెంప్రాజెక్టు (ఎల్లందు తా.) 1,700 ఎ.

ఇవికాక 1568 నీటివనరులు జిల్లాలో కలవు. 64, 974 ఎకరముల భూమి సాగు అగుచున్నది. ఈ ఆయకట్టుకాక 36,600 ఎకరములు వివిధములైన ప్రాజెక్టులక్రింద మాగాణి వ్యవసాయము సాగుచున్నది.

పంటలు : ఈ జిల్లాలో వరి, పచ్చజొన్నలు, సజ్జ, మొక్కజొన్న, కందులు, పెసలు, సెనగలు, ఉలవలు, వేరుసెనగ, పొగాకు ముఖ్యమయిన పంటలు. ఇచ్చటి భూమి సామాన్యముగా ఇసుకమయము. నేల ఎగుడు దిగుడుగా నుండును. అయినను సారవంతములగు సమతల భూములు కలవు. పాల్వంచ ప్రాంతమందలి నేల ఇసుకమయ మయినను, గోదావరీనది యొడ్డులయందలి భూమి డెల్టాభూములను పోలియుండును. ఎల్లందుప్రాంతముగూడ అట్టిదియే. ఖమ్మముమెట్టు, మథిర, ఎల్లందు, పాల్వంచ తాలూకాలలో రేగడిభూమి విస్తారముగా గలదు.

పశుసంపద : ఖమ్మముమెట్టు, మధిర ప్రాంతములలోని పశుజాతి మైసూరుజాతిని ఎక్కువగా పోలియుండును. ఉత్తమతరగతికి చెందినవై ఇవి గొప్ప రూపములో నుండును. ఇవి ఎక్కువ విలువగలవి. మధిరతాలూకాలోని ఎఱ్ఱనిచాయ, పెద్ద ఆకారము కల గొఱ్ఱెజాతి దేశములోని సామాన్యపు నల్లగొఱ్ఱెలతో భిన్నించియుండును. గుఱ్ఱములు అంత శ్రేష్ఠమైనవి కావు.

రవాణా : ఈ జిల్లాలో 420 మైళ్ల పొడవుగల రోడ్లు కలవు. అన్ని తాలూకాలయొక్క ప్రధానపట్టణములతో జిల్లా కేంద్రమునకు రోడ్ల సంబంధము కలదు. కాజీపేట - బెజవాడ రైలుమార్గము ఈ జిల్లాగుండ ఉత్తర దక్షిణముగా సుమారు 50 మైళ్లు పోవును. డోర్నకల్లునుండి సింగ రేణికి 17 మైళ్లును. డోర్నకల్లునుండి భద్రాచలమునకు 44 మైళ్లును గల రెండు శాఖామార్గములు గలవు. ఎల్లందు, ఖమ్మము, మధిర, భద్రాచలమురోడ్డు - ఈ నాలుగును జిల్లాలో ముఖ్యమైన రైల్వే స్టేషనులు. భాషలు : ఇచ్చటి ముఖ్యమైన భాష తెలుగు. తెలుగుభాష మాటాడువారే అత్యధిక సంఖ్యాకులుగా నున్నారు. వరంగల్ జిల్లా లెక్కలలో వివరించిన 30,711 మంది కోయజాతివారు ఈ జిల్లా నివాసులే.

విద్య : ఈ జిల్లా విద్యావిషయములో పురోగామిగా నున్నది. విద్యాబోధక సంస్థలు 689 కలవు. వివరము లిట్లున్నవి :

1. ఆర్ట్స్ అండ్ సైన్సు కాలేజి 1
2. ఉన్నత పాఠశాలలు 25
3. మాధ్యమిక పాఠశాలలు 44
4. ప్రాథమిక పాఠశాలలు 573
5. బేసిక్ పాఠశాలలు 44
6. బేసిక్ ట్రెయినింగు పాఠశాలలు 2
మొత్తము 689

వైద్యశాలలు : ఈ జిల్లాప్రధానస్థానమగు ఖమ్మముపురములో సర్కారువారి గొప్ప ఆసుపత్రి కలదు. ఇచ్చట మండల ఆరోగ్యశాఖ కలదు. సంచార వైద్య సహాయక నిర్మాణము కలదు. తగు పరికరములతో, ఔషధాదులతో ఒక డాక్టరు గ్రామములలోని జనులకు వైద్యసౌకర్యము కూర్చుచుండును. జిల్లాయంతటను 7 జనరల్ ఆసుపత్రులు 4 వైద్యశాలలు కలవు.

పట్టణములు : ఈ జిల్లాలో 6 పట్టణములు కలవు. వాటి వివరములు :

జన సంఖ్య
1. కొత్తగూడెము 50,195
2. ఖమ్మంమెట్టు 28,251
3. ఎల్లందు 13,929
4. కల్లూరు 5,094
5. మధిర 4,835
6. బూర్గుంపహడు 3,758

పుణ్యక్షేత్రములు : కూడలి, లక్ష్మీపురం, నేలకొండపల్లి, నాగులవంచ, ఖమ్మముమెట్టు (లక్ష్మీనరసింహస్వామి), జమలాపురం గొప్పగా జాతరలు జరుగు పుణ్య క్షేత్రములు. ఈ జిల్లాలోనే గాక, ఆంధ్రదేశములోనే గాక, భారతభూమిలో ప్రఖ్యాతి వహించిన మహా పవిత్ర క్షేత్రము భద్రాచలము. ఇది గోదావరీతీరమున నున్నది. భద్రాచలములోని శ్రీ సీతారామచంద్రుల దర్శనార్థము భారతదేశపు పలుప్రాంతములనుండి భక్తులు విచ్చేయుదురు.

చిత్రము - 56

పటము - 2

శ్రీ భ్రమరాంబా సహిత శ్రీ రామలింగేశ్వరస్వామి దేవాలయము

(కోటగోడ దగ్గరనున్న పురాతన దేవాలయము)

చిత్రము - 57

పటము - 3

కొండమీది లక్ష్మీనరసింహస్వామి దేవాలయము

దుర్గము: ఖమ్మము పట్టణమునకు గల విశిష్టతలో ఇచ్చటి దుర్గ మొకటి. ఈ దుర్గము (ఖిల్లా) 300 అడుగుల యెత్తుగల యొక మహాప్రస్తరముమీద దీర్ఘ చతురస్రాకారమున నిర్మితమయినది. కోటవైశాల్యము 1/16 చ. మైళ్లుండును. కోట ప్రాకారము ప్రచండమైన బండరాళ్లతో నిర్మితమయినది. ఎడఎడముగా ఒక్కొక్కదిశ యందు రెండేసి, మూడేసి బురుజులు కలవు. వీటిపై ఫిరంగు లుండుచుండెను. ప్రాకారకుడ్యము 40 నుండి 80 అడుగుల యెత్తువరకు మారుచుండును. ప్రతి బురుజు యొక్క పై భాగము 14 అడుగులకుమించి వెడల్పుండును. లోపలి భాగములో పైకి పోవుటకు మెట్లు కలవు. ఒక్కొక్క బురుజుమీద రెండేసి ఫిరంగులు కలవు. ఒకటి 6 అడుగుల పొడవుకలది. రెండవది 4 అడుగుల పొడవు కలిగియున్నది. ప్రక్కగా ఒక నీటికుండి యున్నది. యుద్ధసమయములో ఈ కుండినిండ నీరు నింపి యుంచబడును. ఈ కోటకు రెండు ప్రవేశద్వారములు కలవు. లోపలి సింహద్వారము 30 అడుగుల ఎత్తుగలిగి నలుచదరముగా ప్రచండ శిలా స్తంభములతో నొప్పియున్నది. దీనికి సమీపమున 6 అడుగుల పొడవుగల ఘనమయిన ఫిరంగి గలదు. కోటలో నొక భాగమున కొన్ని యిండ్లు గలవు. ఆ యిండ్లలో జనులు నివసించు చున్నారు. అయితే ఈ ప్రాంతమంతయు శిధిలావస్థలో నున్నది.

ఈ కోటలో చక్కని మసీదు కలదు. ఒక నడబావిగూడ గలదు. ఈ బావి పొడవు 80 అడుగులు; వెడల్పు 20 అడుగులు. బావిలోనికి దిగుటకు విశాలమైన మెట్లు కలవు. ఒక మందుకొట్టుకూడ గలదు. ఈ బావి నుంచి స్థితిలో నిర్మల జలపూర్ణమైయున్నది. ఈ బావినీరే పురవాసులకు పానోదకముగా నుపకరించుచున్నది. శిఖరము చేరుటకు మార్గము కలదు. ఈ మార్గమున చిన్నచిన్న రాతిగోడలు గల ఆవరణములును, ప్రవేశ

చిత్రము - 58

పటము - 4

ఖమ్మముకోట - ముందుభాగము

చిత్రము - 59

పటము - 5

ఖమ్మముకోట - వెనుకభాగము

ద్వారములును కలవు. దీనిని "బాలాహిస్సారు" అనెదరు. శిఖరాగ్రమునుండి చూచినచో చుట్టుప్రక్కలయందు గల

ప్రదేశమంతయు వీక్షించనగును.

బాలాహిస్సారునందు చక్కగా నిర్మితమైన వేదిక యొకటికలదు. అచ్చట నాలుగు ఫిరంగులు పడియున్నవి. ఎంతో లోతుగల విశాలమయినబావి గలదు. ఈ బావికి ఒక వైపున రాతికుడ్యము కలదు. ఇచ్చటినుండి బావిలోని నీటిమట్టమునకు మెట్లు కలవు. వేదిక మీద నుండు ఫిరంగులపై ఒక శాసనము కలదు. ఆ శాసనమున "రఫీఖ్ నవాబు రుకునుద్దౌలా జఫరుద్దౌలా" అను లిఖితము కలదు. 1135 హిజ్రి ( క్రీ.శ. 1768) అని వ్రాయబడి యున్నది.

కోటలోని మశీదు, కోటప్రాకారకుడ్యములు జఫరుద్దౌలా నిర్మితములు. ఈ జఫరుద్దౌలా నిజాంఆలీఖాన్ నిజాం కాలములో అధికారము వహించి యుండెను. ఈ జఫరుద్దౌలా ప్రాకారకుడ్యములకు పిట్టగోడలు ఇటుకలతోను, సున్నముతోను కట్టబడినవి. ఇతడు కొన్ని తటాకములనుగూడ నిర్మించి యుండెను. ఈ తటాకములకు జఫరుద్దౌలా పేరే పెట్టబడినది. ఈతనికి "ధంసా" అను పేరు వీని క్రూరకృత్యములవలన లభించినది. ఈ ధంసా పేరిట ఖమ్మమునకు రెండు మూడు మైళ్ల దూరములో “ధంసలాపురము” అను గ్రామము ఇప్పటికిని గలదు. జఫరుద్దౌలాకు (ధంసాకు) నిర్మల, జగత్యాల. వేల్పు గొండలలో దుర్గము లుండెను.

చరిత్ర : ఖమ్మముజిల్లాకు ప్రధానపట్టణము ఖమ్మము నగరము. దీని మొట్టమొదటి పేరు కంబముమెట్టు. మెట్టు అనగా కొండ. కంబము సంబంధమయిన కొండ అని అర్థము. ఈ పట్టణమునకు ఈశాన్యభాగమున కొండమీద శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయము గలదు. ఇచ్చటనే శ్రీ నరసింహస్వామి కంబమునుండి వెడలివచ్చి హిరణ్యకశిపుని సంహరించినాడని స్థానిక గాథ. ఈ క్షేత్రమునకు భరద్వాజాశ్రమమని పేరు గలదు. 16వ శతాబ్దివాడగు హరిభట్టు అను కవిచంద్రుడు తన వరాహపురాణము నందు


వరుణదిగ్వీథి నే పురమునఁ బ్రవహించెఁ
         బావన సలిల సంపన్న మిన్న
దీపించె నేపురి గోపికామానసా
         స్పదవర్తి చెన్నగోపాలమూర్తి
భాసిల్లె నే వీట ప్రహ్లాదభక్తి వి
         శ్రాణి కొండ నృసింహశార్జపాణి
ఏ పట్టణంబున జూపట్టె హితపద్మ
         హేళి వీరేశ బాలేందుమౌళి

చతుర చతురంగ బలరత్న సౌధ యూధ
శాల గోపురతోరణ సకలవర్ణ
పౌర వారాంగనా జనప్రముఖ వస్తు
మేదురంబట్టి కంబము మెట్టుపురము .

అని వర్ణించినాడు. అంతేకాదు.

ఆంధ్రమండల గిరి దుర్గహారలతకు
విమలనాయక రత్న భావము భజించి
యున్నతోన్నత శైల సంపన్న మగుచు
సకలపుట భేదనముల నెన్నికకు నెక్కె.

అని కూడ కంబము మెట్టు పురమును వర్ణించియున్నాడు. కంబము మెట్టు పదమునకే సంస్కృతీకరణము చేసి, స్తంభాద్రి, స్తంభగిరి అని వాడినారు. కంబము మెట్టునకు అపభ్రంశ రూపమే ఖమ్మముమెట్టు ; సంగ్రహ రూపము ఖమ్మము. ఖమ్మము పట్టణ జనసంఖ్య 1951 లెక్కల ప్రకారము 28,251 ఇందు పురుషుల సంఖ్య 14,543, స్త్రీల సంఖ్య 13,708. ప్రస్తుత మీ పట్టణము విరివిగా నభివృద్ధిచెంది సకల వైభవములతో తనరారుచున్నది. ఇప్పుడు (1961) జనాభా సుమారు 35,000 లు ఉండ వచ్చును. ఖమ్మము అభివృద్ధి దశలో నున్న మ్యునిసిపాలిటీ పట్టణము.

కంబము మెట్టు అత్యంత ప్రాచీనమైనది. క్రీ. శ. 591 పూర్వము ఈ ప్రాంతము హిందూ రాజుల యధికారములో నుండెను. అప్పుడు మహదేవశర్మ అనునాతడు కంబము మెట్టుప్రాంతమునకు అధికారిగా నుండుచుండెను. మహదేవశర్మకు తొమ్మిదవ తరమువాడు మహదేవరాజు (క్రీ. శ. 950). ఈ మహదేవరాజు పరిపాలన కాలములో ఓరుగల్లు నుండి రంగారెడ్డి, లక్మారెడ్డి, వెల్మారెడ్డి అను సోదరులు తమకు దొరకిన గొప్ప గుప్తధనముతో వచ్చి కంబముమెట్టును ఆక్రమించిరి. వీరు ఒక దుర్గమును, ఒక తటాకమును నిర్మించినారట! ఈ దుర్గ నిర్మాణము నకు సుమారు పది సంవత్సరములు పట్టినదట ! దుర్గప్రవేశము క్రీ. శ. 1006 లో జరిగినట్లు తెలియుచున్నది. ఈ సమయముననే గజపతి రాజులు ఈ ప్రాంతముపై దండయాత్రలు సాగించినారు. రెడ్డిప్రభువుల వంశమువారు సుమారు 300 సంవత్సరములు అధికారము వహించిరి. అనంతరము నందపాణి, కాళ్లూరు, గుడ్లూరు అనెడి మూడు వంశములవారు రాజ్యాధిపత్యము వహించిరి (1424). 15 వ శతాబ్దములో షితాబుఖాన్ అను సీతాపతిరాజు పాలించెను. తరువాత 1512 లో గోలకొండ సుల్తానులు వశపరచుకొనిరి. పిమ్మట ఆసఫ్ జాహి నిజాములు ఈప్రాంతముపై ఆధిపత్యము వహించిరి. ఖమ్మము దుర్గమునకు అధికారిగా జాఫరుబేగ్ అనువానిని నిజాము నియమించెను. ఈ జాఫర్ బేగ్ 1761 నుండి 1808 వరకు పరిపాలించెను. వీని యనంతరము రెండవ జఫరుద్దౌలా అనువాడు అధికారము వహించెను. ఇతడు మహాశూరుడు; మహాక్రూరుడు. ఇతడు తెలంగాణ తూర్పు భాగము నంతయు అల్లకల్లోలము గావించెను అందుచే ఇతడు ధంసా (ధ్వంస) అను వెగటుమాటతో ప్రఖ్యాతిచెందెను. 1301 ఫసలీప్రాంతములో నిజాము ఈ ఖమ్మము దుర్గమును నవాబు షౌకత్ జంగు పూర్వీకులకు జాగీరుగా నొసగెను. హైద్రాబాదుపై ఇండియా గవర్నమెంటువారు పోలీసుచర్య జరిపి (1948) జాగీర్దారీ విధానమును రద్దుచేసేవరకు ఈ దుర్గము జాగీర్దారుల అధీనములో నుండెను. ఈ విధముగా ఖమ్మము పట్టణము హిందూ మహమ్మదీయ రాజుల పరిపాలనలో అనేక సంస్కృతీ, సభ్యతలతో విలసిల్లినది.

ఆ. వీ.