సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మూడవ సంపుటము/కోటప్పకొండ

కోటప్పకొండ :

ఆంధ్రదేశమున గల ప్రసిద్ధపురాతన శైవ క్షేత్రములలో కోటప్పకొండ ఒకటి. ఇది గుంటూరుజిల్లాలోని నరసరావుపేట తాలూకాలో, నరసరావుపేట పట్టణమునకు దక్షిణపు దిక్కున 7 మైళ్ళ దూరములో ఎల్లమంద, కొండకావూరు అను గ్రామములకు మధ్యనగల ఒక పర్వతముపై నున్న పుణ్యక్షేత్రము ఇది యీ జిల్లాకు నడిబొడ్డులో నున్నది. ఈ పర్వత మెటు చూచినను మూడు కూటములు (బోళ్ళు) గా కన్పడుటచే, దీనిని త్రికూట పర్వత మనియు, ఇందు వెలసిన స్వామిని త్రికూటేశ్వరు డనియు పిలుచుచున్నారు. ఈ స్వామినే ఎల్లమంద కోటిశ్వరు డనియు, కావూరి త్రికోటీశ్వరు డనియు భక్తులు పిలుచుచుందురు.

ఈ పర్వతము చుట్టుకొలత అడుగు తక్కువ ఆమడ. దీని వైశాల్యము రమారమి 15 లేక 16 యెకరములుండును. దీని ఎత్తుగూడ సుమారు 1600 అడుగులు. ప్రస్తుతము ప్రజలందరును పూజించుచుండు కొత్త కోటీశ్వరస్వామి దేవాలయము ఆరువందల అడుగుల ఎత్తున నున్నది. దీనికి అనతిదూరములో పాతకోటీశ్వర స్వామి దేవాలయమున్నది. ఈపర్వతము పైన పెద్దఅడవియున్నది. అనేక గుహ లున్నవి. వీనిలో పూర్వకాలము నుండియు అనేకమంది ఋషులును, జంగములును తపస్సు చేసికొని ముక్తిని బొందినట్లు ప్రతీతిగలదు. ఈ పర్వతము పైన ప్రకృతిసిద్ధమైన అనేక నీటిదొన లున్నవి. అవన్నియు నిర్మల జలపూరితములు .

మ్రొక్కుబడులు గల భక్తులు ఈ పర్వతము చుట్టును ప్రదక్షిణము చేసి, దక్షిణభాగ మందున్న 'ఓంకార' లేక ఓగేరు అను నదియందు స్నానమాడి, తీర్థ శ్రాద్ధములు చేసికొని కొండపైకి పోయి మ్రొక్కుబడులు చెల్లించి స్వామిని సేవించి తరింతురు.

కొండపైకి పోవుటకు మార్గములు : ఈస్వామి సన్నిధికి పోవుటకు మూడు మార్గములు కలవు. (1) ఎల్ల మంద సోపానమార్గము (2) మధ్యేమార్గము. దీనినే నూరుసంవత్సరముల క్రింద నరసరావుపేట రాజావారగు శ్రీరాజా మల్రాజునరసింహరాజుగారు కట్టించిరి. యాత్రికులందరును ప్రస్తుతము స్వామి సన్నిధికి ఈ మార్గముననే పోవుచుందురు. (3) రాధాకృష్ణ సోపానమార్గము.

స్థల పురాణము : ఈ పవిత్ర స్థలము యుగాంతరముల నుండి గొప్పమహిమగలదై యున్నట్లు పెద్దలుఅ నేక కథలు చెప్పుదురు. ఈ కోటప్పకొండపైన రుద్రశిఖరము, విష్ణుశిఖరము, బ్రహ్మశిఖరము అను మూడు బోళ్ళున్నవి. వానికి సంబంధించిన స్థలపురాణము లీ క్రిందివిధముగానున్నవి.

రుద్రశిఖరము : పూర్వము సతీదేవి తన తండ్రి చేయు యజ్ఞమునకు అనాహూయయైపోయి తన తండ్రిచే అవమానింపబడి యజ్ఞ గుండమున దూకి ప్రాణములను విడిచినది. తరువాత శివుడు దివ్యదృష్టిచే సంగతి నంతయు గ్రహించి కోపముతో తనజడ పెరికి శిలపై గొట్టగా వీరభద్రుడు అందు జన్మించి, తండ్రి యాజ్ఞప్రకారము ప్రళయరౌద్ర రూపము దాల్చి యాగస్థలమునకు బోయి దానిని ద్వంసముచేసి దక్షుని శిరమును త్రుంచెను. అంతట దక్షుని భార్య పతిభిక్ష వేడగా వీరభద్రుడు కరుణించి దక్షుని బ్రతికించి శివునియొద్దకురాగా స్వామి శాంతించి, దక్షిణామూర్తి రూపమున కైలాస శిఖరమున సమాధినిష్ఠుడై యుండగా, బ్రహ్మ, విష్ణువు, సమస్త దేవతలు ఋషులును పోయి తమకు బ్రహ్మోపదేశము చేయవలసినదని వేడిరి. స్వామివారు వారికోరికలను మన్నించి ఆ త్రికూటాచలమునకు వచ్చి రుద్రశిఖరముపయిన అనగా పాత కోటీశ్వరస్వామి దేవాలయమున్న స్థలమున బ్రహ్మాసనాసీనుడై యుండి, యోగనిష్ఠతో మౌనముద్రచే వారందరికిని బ్రహ్మోపదేశము చేసెను. ఈ దక్షిణామూర్తి యే గురుమూర్తియను పేరుతో ఇచ్చట వెలసి యున్నాడు. దక్షిణామూర్తి బ్రహ్మాదులకు బ్రహ్మోప దేశముచేసిన గురువుగదా!

విష్ణుశిఖరము : ఇది రుద్రశిఖరమునకు ప్రక్కననున్నది. దీనిని పాపవినాశనస్థల శిఖరమనియు పిలుతురు.

విష్ణుమూర్తి యీ శిఖరమున శివుని గూర్చి తపస్సు చేయగా, అతనికి పరమశివుడు ప్రత్యక్షమాయెను. ఇంద్రాదిదేవతలు వచ్చి దక్షయజ్ఞమున తాము స్వీకరించిన హవిర్భాగమువలన వచ్చిన పాపమును పోగొట్టి తమకెల్లప్పుడును లింగరూపమున దర్శన మీయవలసినదని వేడగా, వారల కోరికప్రకారము, స్వామి తన త్రిశూలముతో ఒక రాతిని పొడిచెను. అందుండి ఉదకము వచ్చెను. స్వామి వారినందరిని అందు స్నానమాడ వలసినదిగా తెలిపి తాను లింగరూపమును దాల్చెను. వారందరును అందు స్నానమాడి తమ పాపములను పోగొట్టుకొనిరి. ఆనాటినుండి ఈ లింగము పాపవినాశన లింగమనియు, ఈ క్షేత్రమునకు పాపవినాశన క్షేత్రమనియు వ్యవహారమునకు వచ్చినది. యాత్రికులు మొట్టమొదట ఇచ్చట స్నానమాడి తరువాత కోటీశ్వరుని దర్శింతురు. విష్ణుమూర్తి యీ శిఖరముపైన తపస్సు చేయుటచే ఈ శిఖరమునకు విష్ణుశిఖర మని పేరువచ్చినది.

బ్రహ్మశిఖరము : రుద్రశిఖరమునకు నైఋతి భాగమున దిగువగా నీ బ్రహ్మశిఖరమున్నది. దీనిపైననే నూతన కోటీశ్వరస్వామి దేవాలయమున్నది. ఈ లింగమును సాలంకయ్య అనుభక్తుడు ప్రతిష్ఠించినట్లు అతని చరిత్రవలన తెలియుచున్నది. రుద్ర, విష్ణుశిఖరముల పై జ్యోతిర్లింగము లుండినను ఈ శిఖరముపై లేనందున బ్రహ్మ శివునిగూర్చి తపస్సుచేయగా, అతడు ప్రత్యక్షమగుటయు, బ్రహ్మకోరిక ననుసరించి లింగరూపమును దాల్చుటయు జరిగెను. బ్రహ్మ యిచ్చట తపస్సు చేయుటచే నీ శిఖరమునకు బ్రహ్మశిఖర మని పేరువచ్చెను.

ఎల్లమందక్షేత్ర మని పిలుచుటకు గల కారణము : ఈ ప్రదేశమున బ్రహ్మాది దేవఋషులు గుంపుగా గూడి యుండుటచే ఈ క్షేత్రమునకు 'ఎల్లమంద' క్షేత్రమనియు, మునిమంద అనియు, ఈ కొండకు నుత్తరభాగముననున్న గ్రామమునకు ‘ఎల్లమంద' అనియు పేర్లు వచ్చినవి.

ఇట్లు రుద్ర, విష్ణు, బ్రహ్మ మొదలగు మూడు శిఖరములపైనను దేవపూజితములగు జ్యోతిర్మయలింగము లుండి అవి నరులకు అగోచరము లగుటచే మనుజులు శిలాలింగముల నేర్పరచి పూజించుచున్నారు.

నూతన కోటీశ్వరస్వామి ప్రతిష్ఠకు సంబంధించిన కథలు :

సాలంకయ్య కథ : కోరె సాలంకయ్య యను లింగ బలిజ భ క్తుడు పూర్వము ఎల్లమంద గ్రామమునందు తన నలుగురు తమ్ములతో నివసించుచు ప్రతినిత్యము కొండకుబోయి కట్టెలు తెచ్చి అమ్ముకొనుచు, తనకు లభించిన ధనముతో నిత్యము జంగమారాధనచేయుచు భక్తిమార్గమున జీవించుచుండెడివాడు. ఒకనాడు ఆతనికి ఒక ధనపు బిందె దొరికెను. దానితో విరివిగా దానధర్మములు చేయుచు, పుణ్యకథాశ్రవణములతో కాలము గడుపుచుండెను. ఒకనాడు రుద్రశిఖరమునకు బోయి శివుని పూజించుచుండగా ఆతని కొక జంగమమూర్తి ప్రత్యక్షమయ్యెను. సాలంకయ్య ఆతనిని తన యింటికి రావలసినదని ఆహ్వానించెను. దాని కాత డంగీకరించి సాలంకయ్య యింటికి వెడలి, క్షీరమును మాత్రము స్వీకరించువాడు. అపు డాజంగమదేవరను సాలంకయ్య భక్తితో పూజించుచుండువాడు. ఒకనాడు ఆ జంగమయ్య హఠాత్తుగా ఇంటినుండి అదృశ్యుడై పోయెను. సాలంకయ్య ఆతనికొరకు వెతకివెతకి వేసారి చివరకు దిగులుతో నిద్రాహారములు మాని కాలము వెళ్ళబుచ్చుచుండెను.

గొల్లభామకథ : కొండకు దక్షిణభాగమునగల ‘కొండ కావూరు' గ్రామమునందు 'సునందుడను' గొల్లవానికి 'కుందరి' యను భార్యయందు 'ఆనందవల్లి' అను కూతురు జన్మించినది. ఆ బాలిక బాల్యమునుండియు శివభక్తురాలై, ఎల్లవేళలయందు ఆ పరమశివుని ధ్యానించుచు విభూతి, రుద్రాక్షమాలికలను ధరించుచు, రుద్ర శిఖరమునకుబోయి త్రికోటీశ్వరుని ధ్యానించుచు వై రాగ్య శీలయై యుండగా, తల్లిదండ్రులు మిక్కిలి చింతించి తమ కుమారితను వైరాగ్య మార్గమునుండి మరల్చుటకు వేయి విధములుగా ప్రయత్నించిరి. కాని ఆ పరమసాధ్వి వారి మాటల నాలకించక యథాప్రకారము తన పూజాదికములను నిర్వర్తించుచు యోగినియై సంచరించు చుండెను. ఆమె ఒక శివరాత్రినాడు ఓగేటియందు స్నానమాడి రుద్రశిఖరమున కేగి నిమీలిత నేత్రయై తపోనిష్ఠతో స్వామిని పూజించెను. అప్పుడు ఆమెకు స్వామి జంగమ రూపమున ప్రత్యక్షమాయెను. ఆమె మిక్కిలి సంతోషించి ప్రతి నిత్యము పాపనాశన తీర్థముతో అభిషేకము చేయుచు, క్షీరములను నైవేద్యమిడుచుండెను. ఈ సంగతి తెలిసిన సాలంకయ్య ఆమె యొద్దకుబోయి తన సంగతిని ఆ జంగమయ్యకు తెలుపవలసినదిగా ఆమెను వేడెను. ఆమె దాని కంగీకరించినది. కాని జంగమయ్య మౌనముద్రతో నుండుటచే ఈ సంగతి చెప్పుటకు ఆమెకు వీలు కలుగలేదు.

ప్రతినిత్యము శ్రద్ధగా గొల్లభామ సేవలు చేయుచుండగా జంగమయ్య ఆమెతో "నీవిచ్చటికి ప్రతినిత్యము వచ్చి నన్ను పూజించుటవలన పొందు లాభమేమియులే”దని తెలిపెను. అయినను, ఆమె ఆమాటలను సరకు గొనక పూర్వముకంటె అధికముగా స్వామిని సేవింప సాగెను. స్వామి ఆమె శ్రమను మాన్పుటకై తన యోగ మాయచే బ్రహ్మచారిణి యగు నా కన్యకకు మాయా గర్భమును కల్పించెను. అయినను ఆమె లెక్క చేయక స్వామిని పూర్వము వలెనే సేవించుచుండెను. క్రమముగా ఆమెకు నవమాసములునిండి, కొండ యెక్కుట కష్టముకాగా స్వామి కరుణించి ఆమెతో “నీవు ఇంత దూరము శ్రమపడి రానేల? నేనే నీయింటికి వచ్చెదను గనుక నీవు వెనుదిరిగి చూడకుండ కొండ దిగిపోవలసినది. ఎచ్చట నీవు వెనుదిరిగి చూచెదవో నేనచ్చటనే ఆగి పోయెదను సుమా" అని తెలిపెను. అందుకు ఆమె అంగీకరించి క్రిందికి దిగసాగినది. స్వామి ఆమె వెనుక ప్రళయధ్వనులు చేయుచు వచ్చుచుండెను. కొంత దూరము నడచిన తరువాత చిత్తచాపల్యముచేత ఆమె వెనుదిరిగి చూచెను. స్వామి అచ్చటనే నిలిచిపోయెను. అంతలో గొల్లభామ ప్రసవించెను. మగపిల్లవాడు పుట్టెను. తవవెంట స్వామి రాకుండుటయు, తనకు పిల్లవాడు కలుగుటయు చూచిన గొల్లభామ మిక్కిలి విచారముతో కనులు మూసికొని కొద్దిసేపటి తరువాత కనులు తెరిచి చూడగా పిల్లవాడు లేకుండుటయు, తాను వెనుకటి వలె కన్యాత్వమును వహించియుండుటయు కనుగొని ఆమె అచట సమాధిబూని శివైక్యమందినది.

సాలంకయ్య దేవాలయములను ప్రతిష్ఠించుట : గొల్లభామ రాకకై ప్రతినిత్యమువలె క్రింద వేచియుండిన సాలంకయ్య ఆమె యెంత సేపటికిని తిరిగి రాకుండుట వలన ఆమెను వెదకుచు కొండపైకి పోయెను, అచ్చట, తనకు పూర్వము గనుపించిన యతీంద్రుడు కనుపించగా నమస్కరించెను. ఆ యతీంద్రుడు సాలంకయ్యతో “తాను శివుడ ననియు, నీ యింటినుండి అదృశ్యుడనై వచ్చిన తరువాత రుద్రశిఖరమున నివసించుచు, గొల్లభామకు మోక్షమిచ్చితి ననియు, ప్రస్తుతము తానున్నచోటనే నివసింప నెంచితిననియు అచ్చట తనకొక దేవాలయము గట్టింపవలసినదనియు, అట్లే గొల్లభామ సిద్ధిపొందినచోట గూడ ఒక దేవాలయము గట్టింపవలసినదనియు, శివరాత్రినాడుభక్తులందరును ఉపవాస, జాగరణాదులుచేసి ముందు తన భక్తురాలైన గొల్లభామను పూజించి ఆ తరువాత తనను పూజింపవలసినదనియు తెలిపి అదృశ్యుడాయెను.

సాలంకయ్య స్వామి ఆజ్ఞ ననుసరించి గొల్లభామకును, స్వామికిని దేవాలయములు కట్టించి మోక్షమును పొందెను. ఇదియే నూతన కోటీశ్వర దేవాలయము. ఇది తూర్పు ముఖముగా నుండును. ఇది బ్రహ్మచారియగు దక్షిణామూర్తి క్షేత్రము. ఇచ్చట స్వామికి కల్యాణోత్సవములు జరుగవు. ధ్వజ స్తంభము లేదు.

కొండపైనున్న దేవాలయములు :

పాతకోటప్పగుడి : రుద్రశిఖరముపైన నీ పాతకోటప్ప గుడి యున్నది. అందులో ఒక లింగము, దానికెదురుగా ఒక శిథిలావస్థలోనున్న స్తంభమును ఉన్నవి. దీని నిర్మాణ కాలము తెలియదు.

కొత్త కోటప్పగుడి ! ఇది బ్రహ్మశిఖరముపై నున్నది. దీనినే నూతన కోటీశ్వరస్వామి దేవాలయమని పిలుతురు. ఈ దేవాలయమునే సాలంకయ్య నిర్మించినట్లు అతని కథ వలన మనకు తెలియుచున్నది. ఈతనికాలము మనకు తెలియదు కాని యిచ్చటనున్న శాసనములనుబట్టి యిది దాదాపు తొమ్మిదివందల సంవత్సరములక్రిందగూడ వర్ధిల్లి యున్నట్లు ఆధారములు లభించుచున్నని. దక్షిణఇండియా శాసనములలోను, వెలనాటి గొంకరాజు మొదలైన వారి దీపదాన శాసనముల (మెకంజి మాన్యూస్క్రిప్టు) వాల్యుం XVIII పుట 256 వలనను మనకు తెలియుచున్నది. అంతేగాక ఈ దేవాలయమును పల్లవరాజుల తరువాతవచ్చిన చాళుక్యరాజులు నిర్మించినట్లు గుంటూరు జిల్లా భూగోళము తెలుపుచున్నది. ఈ భూగోళము 1929 సంవత్సరమున ప్రకటితమయినది.

పాపవినాశనస్వామి దేవాలయమ : ఈ దేవాలయము విష్ణుశిఖరముపైన నున్నది. దేవాలయమునకు దగ్గరలో ఒక నీటిదొన యున్నది. యాత్రికు లా దొనయందు స్నాన మాడుదురు. ఇచ్చట కా ర్తీక మాఘమాసములలో స్నాన మాడిన గొప్ప పుణ్యమువచ్చునని భక్తులు తలంతురు.

గణనాథుని దేవాలయము: ఇది నూతన కోటీశ్వర దేవాలయమునకు దక్షిణమున నున్నది.

సాలంకేశ్వర దేవాలయము : ఇది నూతనకోటీశ్వర దేవాలయమునకు పశ్చిమభాగమున నున్నది.

సంతాన కోటీశ్వరదేవాలయము: ఇది నూతనకోటీశ్వర దేవాలయమునకు ఉత్తరభాగమున నున్నది. సంతానార్థు లీ లింగమును పూజింతురు. వారు కొండ నెక్కుచు;


“చేదుకో కోటయ్య చేదుకోవయ్యా-
ఈయేటి కిద్దరం నీసేవ కొచ్చాము -
ముందునాటికి మేము ముగ్గురము కావాలి...”

అని భక్త్యావేశములతో పాడుచుందురు.

బొచ్చుకోటీశ్వరస్వామి దేవాలయము : ఈదేవాలయము మధ్యసోపానమార్గమునకు ప్రక్కన నున్నది. మ్రొక్కు బడులున్న భక్తులు ఈ స్వామి సన్నిధిని తిరుపతికొండలో వలె తల నీలాలు సమర్పించెదరు.

గొల్లభామగుడి : నూతన కోటీశ్వరస్వామి దేవాలయమునకు పోవు మార్గమున దక్షిణదిశయందు ఈ గుడి గలదు. కోటప్పకొండ క్షేత్రమునకు బోవు భక్తులందరును, ముందు గొల్ల భామను పూజించి, తరువాత కోటీశ్వరుని పూజించెదరు.

కొండ దిగువలోనున్న దేవాలయములు :

కొండపై మాత్రమే గాక కొండక్రింద గూడ ఇటీవల కొందరు భ క్తులు కొన్ని దేవాలయములను గట్టించినారు.

ప్రసన్న కోటీశ్వర దేవాలయము: ఈ దేవాలయమును గుడిపల్ల అయ్యంభొట్లుగా రను భక్తుడు కట్టించి ప్రసన్న కోటీశ్వరస్వామిని, భువనేశ్వరీ అమ్మవారిని 1924 సంవత్సరము ఫిబ్రవరి 29 వ తేదీన ప్రతిష్ఠించెను.

నీలకంఠేశ్వరస్వామి దేవాలయము : ఈ దేవాలయమును ప్రసన్న కోటీశ్వరస్వామి ఆలయమునకు సమీపమున బెజవాడ వాస్తవ్యులు, అప్పన రామమ్మగారు, వారి కుమారుడు సూర్యనారాయణమూర్తి గార్లు 1929 వ సంవత్సరము మార్చి 7 వ తేదీన నిర్మించి నీలకంఠేశ్వరస్వామిని ప్రతిష్ఠచేయించిరి.
జనాకర్షణ యంత్రము - అష్టదిగ్బంధనములు : ఈ కోటప్పకొండదేవాలయము తదితర దేవాలయములవలె మిక్కిలి ప్రశస్తముగా నుండకపోవుటచే శాలివాహన శకము 1681 ప్రమాదినామ సంవత్సర మాఘ శు ౧౫ వ తేదీనాడు శ్రీ రాజా మల్రాజు గుండరాయనింగారి అనుజ్ఞచే బ్రహ్మశ్రీ పినపాటి యేలేశ్వరం అయ్యంగారనువారు ఈ జనాకర్షణయంత్రమును స్థాపనచేసి యీ స్థలరక్షణార్థమై అష్టదిగ్బంధనములను చేసినట్లు తెలుపు శాసనములు మనకు గాన్పించుచున్నవి. అప్పటినుం డియీ క్షేత్రమును వేలకువేలు జనులు దర్శించుచున్నారు.

ధర్మసత్రములు : కొండపైనను, క్రిందను బ్రాహ్మణులు, విశ్వబ్రాహ్మణులు, పద్మశాలీలు, ఆర్యవైశ్యులు మొదలైన కులములవారికి వేరువేరుగా ధర్మసత్రములున్నవి. వీనిలో యాత్రికులకు ఉత్సవసమయములో ఫలహారములు, భోజనములు పెట్టుచుందురు.

బసవమందిరములు, మఠములు : యాత్రికుల సౌకర్యార్థమై నిర్మింపబడిన బసవమందిరములు, మఠములు ఇక్కడ నున్నవి. చెఱువులు - కుంటలు - బావులు మొదలైన నీటివసతులను యాత్రికుల సౌకర్యార్థమై చాలమంది భక్తులు నిర్మించినారు.

దానధర్మములు : స్వామికి అనేకమంది భక్తులు నిత్య ధూపదీప నై వేద్యములకొరకు అనేకభూములను దానము చేసియున్నారు. వీటివలన ప్రతిసంవత్సరము స్వామికి చాలా ఆదాయము వచ్చుచున్నది. దానితో స్వామికి నిత్యసేవలు, ఉత్సవములు, నిరంతరము అఖండదీపము, అభిషేక పూజాదులు జరుగుచుండును.

దేవాలయ పరిపాలన: ఈ దేవాలయ పరిసాలనము 1935 సంవత్సరము వరకు నరసరావుపేట జమీందారుల పాలనక్రింద నుండెను. కాని ఆ తరువాత దీనిని ప్రభుత్వపు ఎండోమెంటుబోర్డువారు తమస్వాధీనములోనికి తీసికొని ఒక మేనేజరును ఏర్పాటుచేసినారు. తద్వారా దేవాలయ నిర్వహణము సాగుచున్నది.

తిరునాళ్ళ : ఆంధ్రదేశమున జరుగు ముఖ్యమైన పెద్ద తిరునాళ్ళలో కోటప్పకొండ తిరునాళ్ళ యొకటి. ప్రతి సంవత్సరము శివరాత్రికి ఇచ్చట బ్రహ్మాండమైన జాతర జరుగును. దాదాపు రెండుమూడు లక్షలమంది యాత్రికులు వత్తురు. పల్లెగ్రామములనుండి యీ ఉత్సవములను తిలకించుటకును, మ్రొక్కుబడులు తీర్చుకొనుటకును, పెద్ద పెద్ద ప్రభలను గట్టుకొని వత్తురు. ఆ ప్రభలు ఆకాశమునంటుచున్నవో యన్నట్లుండును. అవి చిత్రవిచిత్రపు అలంకారములతో, రంగులతో చూచుటకు కనుల పండువుగా నుండును. వీరంగములు, కోలాటములు, హరి కథలు, పురాణములు మొదలైన కాలక్షేపములు జరుగును. తిరుణాళ్ళసమయమున దాదాపు రెండు మూడు మైళ్ళవరకు జనులు కొండక్రింది భాగమునంతయు ఆక్రమింతురు.

తిరునాళ్ళసమయమున ఇచ్చట బ్రహ్మాండమైన కలప వ్యాపారము, పశువుల సంత జరుగును. భక్తులు స్వామిని సేవించి గృహనిర్మాణమునకును, వ్యవసాయమునకును, పనికివచ్చు సామానులను, పశువులను, క్రయముచేసి తీసికొని పోవుచుందురు.

ఉత్సవ సమయములలో కలపసామానులు మిఠాయి దుకాణములు, బట్టలదుకాణములు, పండ్లదుకాణములు, బొమ్మల అంగళ్ళు, వినోదశాలలు, కాఫీక్లబ్బులు మొదలైన వానితో ఈ ప్రదేశమంతయు ఎంతో కోలాహలముగా నుండును. ఆ సమయమున ఈ ప్రాంతమున మత్తు పదార్థముల విక్రయము నిషేధింపబడును. మంచి పోలీసు బందోబస్తు ఉండును. “కోటప్పకొండ” ప్రసిద్ధ పుణ్యస్థలములలో నొక్కటి.

పు. వెం.