సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మూడవ సంపుటము/కొండవీడు
కొండవీడు :
కొండవీడు, గుంటూరు జిల్లాలో చేరిన నరసరావుపేట తాలూకాయందలి యొక దుర్గారణ్యస్థలము. రెడ్డిరాజుల కాలములో అష్టైశ్వర్యముల ననుభవించిన ఈ కొండవీడు పట్టణము ఈనాడు పాడుపడిన పల్లెగా నున్నది. ఈ పర్వతమునందు దాదాపు 40 బోడులును (శిఖరములు), ఆరు గుహలును కలవు. ఈ పర్వత శిఖరములకు పశ్చిమమున పర్వతముపైననే మూడు మైళ్ళ చదును ప్రదేశమును, అందు మూడు చెరువులును కలవు.
వీటిలో ఒకటైన వెదుళ్ళ చెరువుకు పడమటి దిశగా 15 అడుగుల వెడల్పును, 60 అడుగుల పొడవును. 36 స్తంభములును గల మండప మొకటి కలదు. దీనిని రెడ్ల భోజనశాల యందురు.
మిగిలిన రెండు చెరువులు ముత్యాలమ్మ చెరువు (కూనలమ్మ చెరువు) అనియు, పుట్టలమ్మ చెరువు అనియు పిలువబడుచున్నవి. ఇచట మామిడి తోటలు, పెక్కు రాజమందిరములు కలవు. ఈ రాజ మందిరములు శిథిలములై యున్నవి. వీటిలో ఒక దానిని మాత్రము ప్రభుత్వమువారు బాగుచేయించి ఉపయోగించుచున్నారు. పుట్టలమ్మ చెరువు గట్టుమీద రెండు దిగుడుబావులు గలవు. ఈ చెరువునకు ఈశాన్యమున ఒక శివాలయము గలదు. ఇందు 15 శాసనములును, రెండు మండపములును గలవు.
ఇం దొక నేతికొట్టు కలదు. పూర్వపు రాజులు దీనిలో నేతిని నిలువ చేయుచుండిరని చెప్పుదురు. కాని ఇది మందుగుండు సామానులు దాచుకొను కొట్టు అయి యుండవచ్చును. కొండ నెత్తముపై నున్న శివాలయమునకు తూర్పుగా గణపతి గుడియు, సుబ్రహ్మణ్యేశ్వరుని యొక్కయు, నాగకన్యల యొక్కయు విగ్రహములును గలవు. వాటిని ఆనుకొనియున్న కొండగుహయందు లింగము, పానవట్టము గలవు. పై పేర్కొన్న చతురపు స్థలమునకు చుట్టును గల పర్వత శిఖరములపై కోటలు కట్టబడియున్నవి. కొండపైకి పోవు సోపానమార్గములకు ప్రక్కగా ఒక శిథిలనృసింహాలయము కనిపించును. ఇందలి నృసింహ విగ్రహము శిథిలమై కొండక్రిందకు జారిపడి యున్నది. ఈ నృసింహాలయమునందు పెక్కు శాసనములు కనిపించుచున్నవి.
ప్రజల సౌకర్యార్థము నిర్మింపబడిన బంగళాకు ఆగ్నేయమున నొక శిథిల దేవాలయమును, పశ్చిమమున నొక మండపమును గలవు. బంగళానుండి దిగువకువచ్చు మార్గమున మరొక మండపమును, రెండంతస్తుల ద్వారమును గలవు. బంగళాను ఆనుకొని తూర్పున రెండువరుసలలో 16 స్తంభములు గల మండప మొకటి కలదు. ఇది వేమన యోగిదని చెప్పుదురు. దీనికి తూర్పున అంబగుడి కలదు.
పర్వత మార్గమునకు దక్షిణమున గంజి కాలువయు, ఆ కాలువదగ్గర గంగాధర రామేశ్వరాలయమును కలవు. ఈ గుడి యొద్దనున్న స్తంభముమీద శ్రీరంగరాయల వారి శాసన మొకటి కనిపించుచున్నది. కొండపై రాజమందిరము (ఫారెస్టు బంగళా) నుండి చెరువులకు బోవు మార్గమునకు తూర్పున నొక విష్ణ్వాలయమును, ఒక శివాలయమును శిథిలములై కనిపించుచున్నవి. కొండలమధ్య భాగమున ఒక గుహయందు 'కొండ సింగరయ్య' అను పేరుగల నృసింహస్వామి విగ్రహము కలదు. కొండపై రెండు మసీదులు కలవు. ఇవి ఇప్పటికిని మంచిదశలో నున్నవి. పుట్టుకోటకు వెలుపల నవులూరి పోతరాజు గుడియు, నాగవరమ్మ గుడియు ఉన్నట్లు ఒక శాసనము వలన తెలియవచ్చుచున్నది.
కొండ దిగువభాగమున ఇపుడు 'కోట' యని పిలువబడు గ్రామమునకు దక్షిణమున గోపీనాథస్వామి గుడి కలదు. ఇది మిక్కిలి రమణీయమైన పని తనముగల స్తంభములచేతను, చిత్తరువులచేతను అలంకృతమై యున్నది. దీనిప్రక్క శిథిలమైన వేయికాళ్ల మండప మొకటి కలదు. ఈ దేవాలయము ప్రస్తుతము మహమ్మదీయులచే ప్రార్థనా మందిరముగా ఉపయోగింప బడుచున్నది. దీని మ్రోల ఇరువది గజముల ఎత్తుగల శిలాధ్వజస్తంభ మొకటి గలదు. దీనిపై ఒక శాసనమును, గుడియొక్క ఉత్తర ద్వార శాఖలకు ఇరుప్రక్కల శా.శ. 1487 లకు సరియగు రక్తాక్షి సం. ఆషాఢ శుద్ధ ఏకాదశి నాటి సదాశివరాయల శాసనములును గలవు. ఈ గుడి నాలుగు అంతరాళములు గలదై విశాలముగా నున్నది. దీని వెలుపలి గోడలు విచిత్రమైన తీగెలు, చిత్తరువులు తీర్చిన రాళ్ళతో అమర్చబడిన జవకట్లతో నొప్పుచున్నవి. గోపీనాథస్వామి గుడికి దక్షిణమున (నాదెండ్లగవనికి పడమర దిశయందు) ఒక శివాలయము శిథిలమైపోయినది. అచ్చోటగల నంది ఇప్పటికిని ప్రాచీన దేవాలయము లందలి శిల్పకౌశలమును జ్ఞప్తికి తెచ్చుచున్నది. ఆ నంది గర్భమున వరహా లుండెనని తెలిసికొని, చోరులు కొందరు దాని పృష్ఠభాగమును పగులగొట్టి, వాటిని తీసికొనిరని ప్రతీతి. ఇచట 'లంకెల బావి' యు, 'వసంతఘర్' అను రాజమందిర సముదాయమును ఉండెడివని తెలియుచున్నది. ఇప్పు డవి నామమాత్రావశిష్టములైనవి.
(పుట్టకోట) కొండకు ఉత్తర భాగమున దిగువగా శ్రీనాథ ప్రేరిత మగు 'గృహరాజ మేడ' అను రాజమందిర ముండెనట. నేడీ ప్రదేశమున కొన్ని మంటి దిబ్బలు తప్ప అన్యవిశేషము లేవియును కానరావు. ఇచట 1898 లో పుట్టకోట కాపురస్తు డగు కుడుముల బొల్లయ్య అనునాతని పొలమునందు వీరభద్రుని యొక్కయు, కాళికాదేవి యొక్కయు విగ్రహములు దొరకె ననియు, ఆరు మాసములు మహోత్సవములు జరుపబడెననియు, అనంతరము అవి ఆలయమునందు ప్రతిష్ఠితములయ్యె ననియు తెలియుచున్నది. అవి నేటికిని మంచి స్థితియం దున్నవి. ఈ ఆలయమునకు సమీపమున పూర్వము రెడ్లు కట్టించిన రంగనాయకాలయ మున్నది. ఇందలి నాగేంద్రుని ప్రతిమ ఇప్పటికిని కనిపించుచున్నది. ఇచటనే యొక కోనేరు గలదు. దీనిని కర్ణాట ప్రభువుల కాలమున ‘దుర్గాధిపతి' (ఖిల్లేదారు) గా నుండిన మాణిక్యారావు కట్టించెనని చెప్పుదురు. దీనికి తూర్పున మాణిక్యారావు గుండములు గలవు. యుద్ధమున మాణిక్యా రావు వధింపబడగా, అతని స్త్రీలు సహగమనము చేసి మానమును కాపాడుకొనిన గుండములట ఇవి! ఈ గుండములకు దక్షిణమున రెడ్డి రాజుల గృహములు లుండెనని చెప్పుదురు. 'గృహరాజమేడ' దిబ్బల యొద్ద జడ్డిగల బావి యొకటి కలదు. ఇది 'గృహారాజమేడ' యందు ప్రతిష్ఠింపబడిన శ్రీ ఆదిలక్ష్మి కామేశ్వరి అమ్మవారి జలక్రీడార్థము నిర్మింపబడినదని తెలియుచున్నది.
దీనికి దక్షిణమున కొండ అడుగు భాగము నంటి ఒక చెరువు గలదు. దీనిలోతట్టు కొండల మధ్య భాగమున పెదదాసరయ్య', 'చినదాసరయ్య' అను వారలు రెండుతోటలు నాటించిరి. కొండల క్రింది భాగమున 'తిరుమల లక్ష్మీనృసింహస్వామి' గుడియు, దీనికి పశ్చిమమున శ్రీ రామేశ్వరస్వామి గుడియు కలవు. ఇందలి శాసనము వలన ఈ రామేశ్వరస్వామి గుడిని శ్రీ కొలచలమల అచ్చన్న ప్రతిష్ఠించిరని తెలియుచున్నది. దీనికి పడమట 'సీతాపతి' యను రాతి తూము గల చెరువొకటి కలదు. ఇప్పటి కొండవీటికి ఉత్తర భాగమున శ్రీ వీరభద్రాలయమును, దీనికి ఉత్తరమున 'బొదిలెరహణా సాహెబు దరగా' యను మూడు గోరీ మండపములును గలవు. వీటికి ఉత్తరమున 'ఫత్తేఖాను మసీదు'ను, 'భోజరా' ఆను అత్తారు చౌదరీ మసీదును, దీనికి దాపున 'సురుఖానా' అను మసీదును, దీనికి దక్షిణమున 'నల్లమసీదు'ను దీనికి పడమరగా 'గుమ్మల్ మసీదు', 'జమత్ఖానా మసీదు'లును గలవు. వీటికి దక్షిణమున 'చిన్న మసీదు'ను రెండు దరగాలును కలవు.
ఇప్పటి కొండవీటికి దక్షిణమున రెండు మైళ్ళ దూరములో “శిఖవస్‌ఖాను పేట" (శింగిస్కాను పేట) యను గ్రామము కలదు. ఇందు వెన్నముద్ద కృష్ణస్వామి గుడి కలదు. ఇందు గల కృష్ణ విగ్రహము పూర్వము కొండవీటి రాజులచే ప్రతిష్ఠింపబడినది. కాలక్రమమున గుడి శిథిలము కాగా, కృష్ణ విగ్రహము మట్టిలో పూడిపోయినది. ఇప్పటికి దాదాపు 100 సంవత్సరముల క్రిందట గోపీనాథపురముదగ్గర త్రవ్వుచుండగా, ఈ విగ్రహము బయటపడినది. దానిని చిలకలూరిపేటలో ప్రతిష్ఠించుటకు తీసికొనిపోవుచుండగా, శింగిస్కాను పేటకు చేరగానే బండి విరిగిపోయినది. ఆ రాత్రి కలలో వారలకు స్వామి దర్శనమిచ్చి తా నందే యుండెదనని చెప్పగా, వారు ఆయనకు అచ్చటనే గుడి కట్టించి, పూజా పురస్కారములకొరకు పెక్కు భూదానములు చేసిరట. ఎన్నియో ఆలయములు శిథిలములై రూపుమాసి పోయినవి. సుందర లతాపుష్ప చిత్రితములగు రాళ్ళు పెక్కులు అన్యగ్రామములకు కొంపోబడినవి.
కొండపై ఎటు చూచినను గొప్ప కోటగోడలు శిథిలములై కన్పించుచుండును. కొండవీటి దండకవిలెయందు ప్రప్రథమున 800 సంవత్సరముల క్రిందట “విశ్వంభరదేవుడ" ను రాజు కట్టించెనని కలదు. కొండపై ఉత్తర దిశయందు ఒక చోట ఐదు కోటలు కలిసియున్నవి. ఈ కోటలకు పెక్కు రహస్య ద్వారములు కలవు. క్రిందినుండి ఈ కోటలగుండా పైకి పోవు మార్గమున "ఖిల్లే దర్వాజా" యను మందిర మొకటి కలదు.
కొండక్రింద పడమటి దిశగా ఒకటిన్నర మైలు చుట్టుకొలత గల ఒక కోట కలదు. దీని చుట్టు 50 గజముల వెడల్పు 10 గజముల లోతు గల అగడ్తయు, కోటకు నాలుగు కోణములయందు, మధ్య మధ్య బురుజులును గలవు. ఈ కోటను రామయ భాస్కరుడు కట్టించె ననియు, అందొక పురమును, గోపీనాథుని గుడిని నిర్మించి, ఆ పురమునకు గోపీనాథపుర మను పేరు పెట్టె ననియు చెప్పుదురు. దీనికి ఉత్తర భాగమున నున్న సింహద్వారము చెడక, ఇప్పటికిని కన్పించుచున్నది. దీనికి పడమర భాగమున ఒక రాతిమీద రామయ భాస్కరుని గూర్చిన పద్య మొకటి కలదు. ఈ గవనుకు కొండపల్లి గవను అని పేరు. దక్షిణ ద్వారము శిథిల మైనది. దీనికి నాదెండ్ల గవను అని పేరు. కొండకు ఉత్తర దిశలో కొండల మధ్యభాగమునందు పుట్టకోట గలదు. దీనిని ప్రోలయ వేమా రెడ్డి కట్టించెను. కొండపై నుండు బురుజులు శిథిలము లై నవి. బురుజుల సంఖ్య దాదాపు 23 వరకు ఉండును.
కొండవీటిపురము రమారమి 4, 5 మైళ్ళ వైశ్యాలమును, ఏడు వాడలును కలదై యుండినట్లు తెలియుచున్నది. శాసనములనుబట్టి కొండవీటిరాష్ట్రము 24 దుర్గములను, పదునాలుగు సీమలను, 2048 గ్రామములను కలిగి యున్నట్లు గూడ తెలియుచున్నది. మహమ్మదీయ ప్రభుత్వము ఏర్పడిన తరువాత అప్పటి పాలకులు తమ తమ పేర్లతో పేటలను కట్టించిరి. ఉదా : మహమ్మద్ షా పురము (కుతుబ్ షా పేట), నవాబ్ పేట, ముర్తజా నగర్ (గోపీనాథ పురము) మొదలగునవి.
పూర్వము కొండవీటికి కుండిననగరము అని పేరుండె ననియు, అది విదర్భ దేశమునకు ముఖ్యపట్టణముగా నుండె ననియు, ఇచటనే దమయంతి, రుక్మిణి జన్మించిరనియు, ఇప్పటి అమీనాబాదువద్ద గల కొండపై నున్న 'ముల్ల గూరమ్మ' యే రుక్మిణి పూజించిన పార్వతి యనియు, ఇచటివారు చెప్పుదురు. ఇదియే కుండిననగరమని 'దండకవిలె' యందు గూడ వ్రాయబడి యున్నది. దండకవిలె యందలి వ్రాతలను ఈ క్రింది శాసనములు సమర్థించుచున్నవి :
1. మంచాళ్ళ శాసనము : "శా. శ. ౧౨౬౨ (1262) విక్రమ సం. మార్గశిర శు. ౧౫ లు సోమవారమునందు శ్రీ వల్లభశిష్ట నామధేయ ద్విజాయ కుండిన నామ నగర ప్రాద్దిగ్భాగే, భద్రానది పశ్చిమ తీరప్రాంత దేశే శ్రీకృష్ణానదీ పశ్చిమయామ్య దిక్సంధిస్థ జనపదేషు ప్రసిద్ధ మంచాళ్ళగ్రామ మతి ముఖ్యాగ్రహార దానం కర్తుమిచ్ఛన్" అని గలదు.
2. కొండవీటి గోపీనాథుని గుడివెనుక (పడమట) రెండవ ఆలయ స్తంభమున గల శా. శ. 1326 విభవ సంవత్సర మాఘ శుద్ధ ౧౨ శాసనమున ఇట్లున్నది: "శ్రీ రామేశ్వరాయ నమః కుండిననామ ప్రసిద్ధేషుభవతి విభవ వత్సరే మాఘ శుద్ధ ద్వాదశ్యాం, జీవవాసరే సవితరి మకర సాహిని లగ్నే సిద్ధ శ్రీనామ భక్త్యా జగతి రఘునాధ్యా శ్రీమాభ్యా పహ్యకల్పం కొండవీట్యామ దగిరి కృతవా నామ లింగ ప్రతిష్ఠా."
3. దండెకవిలెలోని రెడ్డిదత్త అగ్రహారములను గుఱించిన శోకములలో :
తస్యపాద భవేద్రస్య కుండినక్షోణి శాసితః
వేమాఖ్యశ్చతురః పుత్రాః నిత్యధర్మ పరాయణాః:
కొండవీటి దండెకవిలెను బట్టి, కొండవీడు అనాదిగ భీమరాజు, భీష్మకుడు మొదలగువారి కాలములనుండి రాచనివాసమై యుండెననియు, గజపతివంశ క్షత్రియుడగు 'విశ్వంభర దేవుడు' అచట కోటలు కట్టించెననియు తెలియుచున్నది. ఏదిఎటులున్నను, కొండవీడు రెడ్డిరాజుల నాటినుండియు రాజధానిగా నుండెననుటకు సందియము లేదు.
ప్రోలయవేముని రాజధాని అద్దంకి యని బహు శాసనములు వాకొనుచున్నవి. ప్రోలయవేముని తరువాత అతని కుమారుడగు అనపోతారెడ్డి తన రాజధానిని అద్దంకినుండి కొండవీటికి మార్పించినటులు శాసనములవలన తెలియుచున్నది. కొండవీటి రాష్ట్రము కృష్ణా, గోదావరి, గుంటూరు, నెల్లూరు, కర్నూలు మండలములకు వ్యాప్తమై యున్నట్లు రెడ్డిరాజులనాటి శాసనములవలన, బిరుదములవలన తెలియుచున్నది.
ఈ కొండవీడు రాజ్యము క్రింద వివరించిన పెక్కు మంది రాజుల పరిపాలనము క్రిందకు మారుచు వచ్చినది :
ప్రోలయవేమా రెడ్డి 1326 - 1350
అనపోతా రెడ్డి 1350 - 1370
అనవేమా రెడ్డి 1370 - 1385
కొమరగిరిరెడ్డి 1385 - 1407
పెదకోమటి వేమారెడ్డి 1407 - 1420
రాచ వేమా రెడ్డి 1420 - 1423
కటకపురాధీశ్వరుల పాలన 1423 - 1431
కర్ణాటక సామ్రాజ్యాధిపతులు 1431 - 1454
కటకపురాధీశ్వరుల కాలము 1455 - 1496
కర్ణాటక సామ్రాజ్యకాలము 1515 - 1530
గోల్కొండవారు కొండవీటిని 1530 లో జయించిరి. మరల కర్ణాట సామ్రాజ్యాధిపతులు 1530 లో దీనిని జయించి 1579 వరకు తమ ఏలుబడిలో నుంచుకొనిరి. తిరిగి ఈ కొండవీటి రాజ్యము 1579 లో గోల్కొండ రాజుల ఆక్రమణము క్రిందకు వచ్చెను. అనంతరము ఈ సామ్రాజ్యము ఈ క్రింది విధముగా మరల చేతులు మారెను :
చారాముత్సబీల ఏలుబడి 1582 - 1590
గోల్కొండ నవాబు పరిపాలన 1599 - 1749
ఫ్రెంచి పరిపాలన కాలము 1750 - 1757
గోల్కొండ నవాబుల కాలము 1758 - 1786
ఇంగ్లీషువారి పరిపాలన కాలము 1788 - 1947
స్వతంత్ర భారత పరిపాలనము 1947
రాజ్యనిర్వహణమున అనపోతారెడ్డికి రాజనీతికోవిదులు, ప్రచండ సేనానులు తోడ్పాటు కావించిరి. సముద్ర వ్యాపారము విరివిగా జరుగుచుండెను. అనపోతారెడ్డి దుర్గమునకు బలమైన ప్రాకారము నిర్మించెను.
అనవేముని కాలమున కొండవీటినగరమున ధనధాన్యములును, పాడిపంటలును హెచ్చెను. విదేశ బేహారము వలన ధనకనక వస్తు వాహన మాణిక్యములతో బొక్కసము సర్వసమృద్ధమయ్యెను. కస్తూరి, కుంకుమ ఘనసారసంకు మద హిమాంబు కాలాగరు గంధసారాది సుగంధ ద్రవ్యములతో కొండవీడు ఘుమఘుమ లాడుచుండెను. రాజును 'వసంత రాయ'డని ప్రజలు పిలుచుచుండిరి. కొండవీడు వసంతోత్సవములకు రాజధాని. నానా దేశములనుండి రసికులు వసంతోత్సవమును వీక్షించుటకు వచ్చెడివారు. గొప్ప విద్వాంసు డగు బాల సరస్వతి విద్యాధికారిగను, శారదా వల్లభుడను త్రిలోచనాచార్యుడు ఆస్థాన పండితుడుగను ఉండిరి.
కొమరగిరి రెడ్డికాలమున కొండవీడు మూడు పూవులు ఆరు కాయలు కాచినదని చెప్పవచ్చును. నౌకా వ్యాపారమున దిట్టయగు అవచి తిప్పయ శెట్టి కొండవీటిని సుగంధద్రవ్యములలో ముంచి తేల్చు చుండెను. ఆనాడు కొండవీడు నౌకావ్యాపారస్థులకు ఆటపట్టు. కాటయ వేమారెడ్డి కొండవీటికి పెట్టని కోటగా నుండెను. పెదకోమటి వేముని కాలము కొండవీటికి స్వర్ణయుగము. వామనభట్టబాణుడు, కవిసార్వభౌము డగు శ్రీనాథుడు మొదలగు విద్వత్కవులతోను, మామిడి సింగనామాత్యుడు, వేమనామాత్యుడు, ప్రగడామాత్యుడు మొదలగు అమాత్య శేఖరులతోను, సరససంగీత సాహిత్య గోష్ఠి వినోద ప్రసంగములతోను, కొండవీడు కళకళలాడు చుండెను. కొండవీడును శ్రీనాథ కవిసార్వభౌముడు ఈ క్రింది విధముగా వర్ణించెను.
సీ. పరరాజ పరదుర్గ పరవైభవశ్రీల
గొనకొని విడనాడు కొండవీడు
పరిపంధి రాజన్య బలముల బంధించు
గురుతై న యురిత్రాడు కొండవీడు
ముగురు రాజులకును మోహంబు బుట్టించు
కొమరు మీరిన వీడు కొండవీడు
చటుల విక్రమకళా సాహసం బొనరించు
కుటిలాత్ములకు సూడు కొండవీడు
తే. సాధు సైంధవ భామినీ సరసవీర
భటరటానేక హాటక ప్రకట గంథ
సింధురాద్భుత మోహన శ్రీలదనరు
కూర్మి నమరావతికి జోడు కొండవీడు.
శాసనములవలన 1515 జూను 23వ తేదీన కొండవీడు శ్రీకృష్ణదేవరాయలచే జయింపబడినట్లు తెలియుచున్నది. సాళువ తిమ్మరుసుమంత్రి మేనల్లుడగు నాదెండ్ల గోపయమంత్రి 1515 నుండి 1533 వరకు కొండవీటి పాలకుడుగా నుండెను. ఇతడు ఒక వైష్ణవాలయమును కట్టించి అందు సపరివార పట్టాభిరామ విగ్రహములను ప్రతిష్ఠించెను. రాయల అనంతరము అచ్యుతరాయల పరిపాలనములో రాయసం అయ్యపరుసయ్య, రామయ భాస్కరయ్య, బయకార రామప్పయ్య అనువారలు వరుసగా కొండవీటికి పాలకులైరి. రామయ భాస్కరయ్య కొండక్రింద ఒక రాతికోటను కట్టించి, దానియందు గోపీనాథపురమను పేర నొక పేటను కట్టించి, అందు గోపీనాథస్వామి ఆలయమునుగూడ నిర్మించెను. రామయ మంత్రి 'కత్తుల బావి కథ' ఈనాటివరకు ప్రజలలో కథగానే మిగిలి పోయినది. దీనిని చరిత్రకారులు నమ్ముటలేదు.
సదాశివరాయల అనంతరము కొండవీడు తురుష్కుల వశమయ్యెను. ముర్తజాఖాను అనువాడు కొండవీటి పాలకు డయ్యెను. ఆత డచ్చట దేవాలయములను ధ్వంసము గావించి, విగ్రహములను ఛిన్నాభిన్నము చేసి, గోపీనాథపురమునకు 'ముర్తజానగరము' అని పేరిడెను. ఇదియే ఆంధ్రదేశము గోల్కొండ రాజ్యమున కలిసిన కాలము. ఇంగ్లీషువారు నిజాముతో సంధి చేసికొని తీసికొనువరకు ఆంధ్రదేశము గోల్కొండ రాజ్యపాలనము క్రిందనే యుండెను. గోల్కొండనవాబు ఈస్టిండియా కంపెనీవారికి కొండవీడును 1788 సెప్టెంబరులో అప్పగించెను. అప్పటినుండి కొండవీడు గుంటూరుజిల్లాలో చేర్చబడి, కొండవీటినుండి కార్యస్థానము గుంటూరునకు మార్చబడినది. కొండవీడొక తాలూకా కేంద్రముగా నుండినది. 1197వ ఫసలీలో ప్రభుత్వమువారు జమీందారులకు జమీలు పంపిణీ చేసిరి. అపుడు కొండవీడు చిలకలూరుపేటలో చేరిన శ్రీ రాజా మానూరి నరసన్నారావుగారికి సంక్రమించి, 1812 వరకు వారి వంశ్యుల స్వాధీనములో ఉండినది. జమీనుదారులకు అలవెన్సులు ఏర్పడినపుడు కొండవీడు రాష్ట్రదొరతనము వారి పాలనముక్రిందకు వచ్చినది. కాలక్రమమున కొండవీడు తాలూకా స్థానమును గూడ కోల్పోయి, ఒక గ్రామమై, తుదకు క్షీణించిపోయి, ఒక పల్లెగా మారినది.