శ్రీ సుందరకాండ (రాయప్రోలు సుబ్బారావు)/సర్గ 8
శ్రీ
సుందరకాండ
సర్గ 8
1
ఆ భవనము మధ్యను చూచెను హరి
రత్నంబులు దోరలుగా చెక్కిన
కనకపు కిటికీ కమ్ముల పట్టెల
సంస్థానము పుష్పక విమానమును.
2
గగనమున కెగసి, గాలిలో నిలిచి,
సూర్యమార్గమున శుభ చిహ్నముగా
వెలయజాలునది; విశ్వకర్మ స్వయ
ముగ నిర్మించె నపూర్వ ప్రతిమల.
3
పనివడి సాధింపనిది లేదెదియు,
తచ్చుజాతి రత్నాలు లేవచట
సురలకు సైతము దొరకని మణులవి,
మంచిది కానిది యించుక లేదట.
4
బలమున తపమున పడసిన యర్థము,
మనసు వచ్చిన ట్లనుగమించు సఖి,
బహువిశేషరూపముల కలాపము,
సురకులముల కాపురమువంటి దది.
5
ప్రభువు మన సెఱగి పఱచు వాహనము,
అనిలజవమున నిరంకుశముగ చను,
పుణ్యులు, మహితాత్ములు, యశస్కులగు
అమృతాంధసులకు అభిజనాలయము.
6
ఉత్తమముల నత్యుత్తమాఢ్యమై
అందంబుల చక్కందనమై , శర
దిందు విమలమై, ఇంపితమై, బహు
శిఖర మకుటముల శిఖరివంటి దది.
7
కుండలధారులు, తిండిపోతులు, ని
శాచరు, లాకాశచరులు, వంకర
కన్నులు త్రిప్పుచు కావడింతురు, మ
హాజనులు శతసహస్రము లర్థిని.
8
మధుమాసకుసుమ మాంగల్యంబయి,
నవవసంత వైభవమును మించి, ని
తాంతశోభనపదమగు, పుష్పక ల
లామవిమానము లక్షించెను కపి.
22-12-1986