శ్రీ సుందరకాండ (రాయప్రోలు సుబ్బారావు)/సర్గ 7

శ్రీ

సుందరకాండ

సర్గ 7

                   1
వైడూర్యమణుల వరుసలు పొదివిన
మేలి పసిడి కిటికీల మేడలను,
చూచె హనుమ పక్షులు తారాడగ
మెఱుపులు మెలిగొను మేఘమాల వలె.
                 2
శంఖశాలలును, చంద్రశాలలును,
చాపాయుధ కోశంబుల శాలలు,
గిరి శిఖర మనోహరశాలలు, వివి
ధ విశాల వినోద ప్రియశాలలు,
                3
అన్నియు హేమమయంబులై మెఱయ,
దేవాసురు లర్ధిని పూజింపగ,
దోసము లంటక దోర్బలార్జితము
లయిన రావణు గృహంబులు కనె హరి.
                4
సకల సులక్షణ సంపూర్ణంబయి,
సర్వోత్తమముగ ఉర్విలో వెలయ,
దేవశిల్పి యత్నించి స్వయముగా
తీరిచి కట్టిన దివ్యభవన మది.


           5
మేఘము మాదిరి మిక్కిలి యెత్తుగ
పుత్తడి బొమ్మనుబోలి, రావణే
శ్వరుని బలమునకు ప్రతిబింబంబగు
స్వీయ సౌధమీక్షించె మహాకపి.
           6
లచ్చి నిల్చిన కళాభవనంబయి,
పువ్వుల చెట్లకు పుట్టిల్లయి పు
ప్పొడి నిండిన గిరిపోలి భూతల
స్వర్గమగుచు అది భాసిలుచుండెను.
           7
మెఱుపులు చిమ్మెడి మేఘమువలె నా
రీ భూషలతో శోభిల్లుచు, హం
సములు మోయ నర్హమయి విలసిలెను,
సుకృతార్జిత మయిన 'విమానము'.
           8
ఎగయు ధాతువుల నగచిత్రమువలె,
గగన చందిరగ్రహ చిత్రమువలె,
సమకూర్చిన మేఘము చిత్రమువలె
కానపచ్చెను విమానరత్న మట.
           9
భూములు భూధరములతో నిండగ,
భూధరములు తరువులతో నిండగ,
తరులు విరుల పూతలతో నిండగ,
పువ్వులు కేసరములతో నిండెను.
           10
పున్నమ సున్నము పూసిన మేడలు,
పువ్వులు విచ్చిన పూర్ణ సరస్సులు, `
కేసరములతో కెరలు పద్మములు
ధన్యము లావ నధామచిత్రములు.
                          

                  11
వాసికెక్కి 'పుష్పక 'మను పేరిట,
నవరత్న ప్రభ లవఘళింప, లం
కా సౌధంబుల కన్న ఉన్నతం
బయిన 'విమానము' నారసె మారుతి.
                  12
వైడూర్యంబుల వన్నెల పులుగులు,
వెండి పగడములు పెనచిన పులుగులు,
చిత్ర కాంతులను చెలగు భుజగములు,
జయ చిహ్నంబుల జాతి తురగములు.
                  13
బంగరు రంగుల పగడపు వన్నెల
ఱెక్కలల్ల సవరించుచు లీలగ,
వంచి ముక్కులను పంచాస్త్రుని పం
పునవలె గుమికొను పులుగుల జంటలు.
                  14
చెదరని ఱేకుల చెంగల్వలు తొం
డముల నున్న దంతావళముల; హ
స్తముల పద్మములు తాల్చియున్న ల
క్ష్మీ విగ్రహములు చెక్కిరి శిల్పులు.
                 15
చలికాలము కడచన సుగంధములు
నిండిన లోయల కొండవలె, మనో
హరమగు రావణు నంతిపురంబును
చొచ్చి చూచి కడు చోద్యమందె కపి.
                  16
ఆరాధింపగ నసురులు, రావణు
డేలెడి లంకను గాలించి వెతకి,
పతి గుణనిష్ఠకు బలియై వెతపడు
సీతను కానక చింతలో మునిగె.

                    17
అంత, హనుమ, సుకృతాత్ముడు, సత్పథ
చరితు, డవేక్షాచక్షు, డంతటను
తిరిగి తిరిగి మైథిలిని, సుపక్ష్మను,
కనుగొనజాలక కటకటపడె మది.

20-12-1966