శ్రీ సుందరకాండ (రాయప్రోలు సుబ్బారావు)/సర్గ 52
శ్రీ
సుందరకాండ
సర్గ 52
1
హనుమ భాషితము లాలకించి, కో
పోద్రేకంబున ఒడలు మఱచి, వడి
నాజ్ఞాపించె మహాకపి వధమును
నిండుకొలువులోనుండి రాక్షసుడు.
2
రావణు డటు లా గ్రహమున వానర
వధ విధింపకని, భావించె విభీ
షణుడు, దౌత్యమును జరుపగవచ్చిన
వానిని చంపుట కాని కార్యమని.
3
క్రుద్ధుడయిన రక్షోవిభు నారసి,
సంఘటిలిన దుస్సంకటము తరచి,
అపుడు తానవశ్యము కార్యార్థము
చేయవలసినది చింతించెను ధృతి.
4
కృతనిశ్చయుడై , కినుకనున్న అ
న్నను, పూజ్యుని, రిపుజన జేతను కని,
పలికె, సార్థకము, భవితవ్యము నగు
పలుకు, మాట నేర్పరి విభీషణుడు.
5
క్షమియింపుము రాక్షస రా జేంద్ర! ప్ర
సన్నుడవై రోషము నడచి వినుము,
మన్నింపుము నా మాటను, దూతను
చంపరాదు రాజన్యసత్తములు.
6
రాజధర్మశాస్త్ర విరుద్ధము, లో
కము గర్హించును; కపివధ వీరుడ
వగు నీ పేరుకు తగినది కాదు, ప
రావరజ్ఞుడవు భావింపుము మది.
7
ధర్మజ్ఞుడవు కృతజ్ఞుడవు, సకల
రాజనీతిపారగుడ, వఖిల భూ
తప్రపంచ తత్వజ్ఞుండవు, పర
మార్థవిదుడ వీ వసదృశుండ విల.
8
నీవంటి నిఖిల నీతివేత్తలును,
సులభరోష వివశులయి తొడిబడిన,
శాస్త్రాభ్యాసశ్రమము కేవలము
బండమోత కావలె నసు రేశ్వర !
9
కావున, శత్రుఘ్న ! దురాసదుడవు,
నీవు సుంత శాంతించి, విచారిం
పుము యుక్తాయుక్తములు, విధింపుము
దూతదండన యధోచిత విధమున .
10
రాక్షసేశ్వరుడు రావణుండును వి
భీషణు పలుకులు విని, దుర్భరమగు
రోషవేగమున రుధిరాక్షుండయి
ప్రత్యుత్తరమును పలికె నీ పగిది.
11
శాత్రవ భీషణ ! శాస్త్రవిభూషణ!
పాపకర్ములను వధియించుట పా
పముకా, దీతడు పాపియె కావున
వధియించెద నీ వానరు నిప్పుడు.
12
అన్నమాట, లన్యాయపక్షము, ల
నార్యజుష్టములు నయి వినిపింపగ,
పరమార్థంబుల నెఱగిన బుద్ధి మ
దగ్రణి యిట్టుల ననె విభీషణుడు.
13
శాంతింపుము రాక్షసరాజేశ్వర !
చంపరాదు రాజన్యులు దూతల
ననుచు పలుకుదురు ప్రాజ్ఞులు, కావున
న్యాయమైన వాక్యము నాలింపుము.
14
లేదు సందియం బీ దుష్టుడు శా
త్రవుడు, చేసె నపరాధము లయినను,
చంపరాదు రాజన్యులు దూతల;
పలుదండనములు కలవు దూతలకు.
15
వికలాంగుని కావించుట, కొరడా
చేఱులతో మెయిచిట్లగ కొట్టుట,
శిరసు ముండనముచేయుట, శిక్షలు;
దూతవధం బెందును వినబడ దిల.
16
వెనుకముందుల వివేచనగల ధ
ర్మార్థ వినీతుడ వయిన నీవె కో
పావిష్టుడవయి తకట ! సత్వవం
తులు ప్రతిరోధింతురు కోపంబును.
17
ధర్మశాస్త్రవాదముల, లోకవృ
త్తముల, తారతమ్యములను తెలిసిన
వారు లేరు నీవలె దేవాసురు
లందు, నీ వొకడ వగ్రగణ్యుడవు.
18
శూరుడవు, మహావీరుడవు, సురా
సుర దుర్జయుడవు, పొరిపొరి నీతో
పోరి యోటుపడిపోయెను మును దే
వాసుర నరనాయక సంఘంబులు.
19
దేవాసురుల నతికరించిన నీ
లా వరయక మును చావుతప్పి బ్రతి
కిన పగవారు తెగించి యిప్పు డిటు
వేసరింత్రు నిను వెకలిచేష్టలను.
20
దూతగ వచ్చిన కోతిని చంపిన
మన కెట్టి ప్రయోజనము కనబడదు,
కుడిచి కూరుచుని కోతిని పంపిన
వారిని శాసింపగ తగు మగటిమి.
21
సుజనుడుకానీ కుజనుడుకానీ,
దూత అస్వతంత్రుడు, పరు లుపదే
శించిన దానినె చెప్పను, కావున
చంపకూడదను శాస్త్రము దూతను
22
ఇతని నిప్పుడిట, హత మొనరించిన
కనరా డెవడును కడలిదాటి లం
కకు రాగల ఆకాశచారి అట,
నిష్ఫలకృత మిది నిందయె మిగులును.
23
కావున నీవీ కపివధ కార్యము
కట్టిపెట్టు; మీ ఘన సన్నాహము
దేవేంద్రునితో దేవతలను
అరిగొను తఱిచేయగ దగును ప్రభూ !
24
అదిగా, కితడిట అంతమై న దూ
రముననున్న ఆ రాజపుత్రులను
యుద్ధప్రియ దుర్బుద్దుల నిచటికి
దో తెచ్చు సమర్థుడు కానబడడు.
25
శౌర్యవిక్రమోత్సాహ ధుర్యులగు
దేవాసురులకు నీ వజేయుడవు,
ఆపనేల యోధానందన రణ
దీక్షారంభము రాక్షసరంజక !
26
వీరకులీనులు శూరాగ్రేసరు
లస్త్రశస్త్రధరు లయిన యోధు లు
న్నారు నీకు ముందఱనె యెందఱో !
పోరాటమునకు ఆరాటించుచు.
27
కావున భవదగ్రచమూ నాయకు
లందు కొందఱు ప్రయాణమై విడిసి,
మూఢులయిన నృపపుత్రకులకు చూ
పింత్రుగాక నీ వీరవిక్రమము.
28
అమరద్వేషి, మహాబలవంతుడు,
రాత్రించరకుల రాజరాజు, గ్రహి
యించె విభీషణు మంచిమాటలను,
తమ్మునిపై గల నెమ్మి నమ్మికల.
29
మండు క్రోధమును మణచి పెట్టి మది,
శస్త్రశాస్త్ర భూషణు విభీషణుని
మేలుపలుకులను ఆలకించి, బదు
లాడే రావణుడు అనుజునితో నిటు.