శ్రీ సుందరకాండ (రాయప్రోలు సుబ్బారావు)/సర్గ 51

శ్రీ

సుందరకాండ

సర్గ 51

                 1
అతి సత్వాఢ్యుం, డమిత పశుబలుడు,
దశకంఠుని స్తిమితముగా చూచుచు,
పలికె నంత తడబడక మహాకపి,
అర్థవంతమయినట్టి వాక్యములు.
                2
హరి కులేశ్వరుం డగు సుగ్రీవుని
సందేశంబును అందిచ్చుటక యి
వచ్చితి నీదు నివాసము వెతకుచు,
అడిగెను నీ కుశలార్థము లాతడు.
                     3
ధర్మార్థాభిమతంబయి, ఇహ పర
భవితవ్యంబగు భ్రాతృనిదేశము
కొని వచ్చితి, ఇదె వినిపించెద, నీ
వవధరింపుము మహాసురనాయక !
                    4
రాజన్యుడు దశరథుడు రాజిలును
రథ మాతంగ తురంగ బలయుతుడు,
తండ్రి వంటి బాంధవుడు లోకులకు,
దేవేంద్రునకును దీటు ప్రకాస్తిని.

                 5
అతని పుత్రుడు, ప్రియంకరు, డగ్రజు
డాజాను భుజా భ్రాజితగాత్రుడు,
తండ్రిమాట జవదాటక, గృహమును
వదలి, దండకావనమున కరిగెను.
                  6
భ్రాతలక్ష్మణుడు, భార్య సీతయును,
తోడనె వచ్చిరి తోడునీడలుగ,
రాముడు ధర్మపరాయణుడు, మహా
తేజోధాముడు ధీరోదాత్తుడు.
                 7
ఆతని భార్య, ప్రియానువ్రత, సుచ
రిత, విదేహ నృపసుత, సీత, పరమ
పూత, మాయమయిపోయె నడవిలో;
ఆమెను వెతకుచు అన్నాదమ్ములు.
                8-9
ఋశ్యమూకగిరి యెడతల వచ్చిరీ,
సుగ్రీవుని కపిసోముని కలసిరి,
సీతను వెతకించెదననెను ప్రభువు,
రాముడతనికి స్వరాజ్య మిత్తుననె.
                10
ఆవల రాఘవు డని మొన వాలిని
గీటడంచి సుగ్రీవస్వామికి
పట్టము కట్టెను వానరభల్లుక
రాజ్యంబును సర్వము కిష్కింధను.
                 11
ఇంతకు పూర్వమె యెఱుగుదు వీవది;
వాలిని బహుబలశాలి నాలమున
ఒక్క వాలమున చక్కడంచెనని
రాజకుమారుడు రాముం డొక్కడె.

                 12
సీతను వెతకగ ఆతురుడై సు
గ్రీవుడు పంపెను కిష్కింధా వి
ఖ్యాతుల, వానరజాత యోధులను,
పలువుర పది దిక్కులకు ఒక్కపఱి .
                 13
శతసహస్ర లక్షల గణములు వా
నరులు, దిగ్దిగంతరము లంతటను,
మీదను క్రిందను మెలకువతో శో
ధించుచు సీతను తిరుగుదు రెల్లెడ.
                    14
గరుడ వేగమున గడతురు కొందఱు,
వాయు జవంబున పఱతులు కొందఱు,
నింగి నేల లంటీయంటని వే
గిర పాటున త్రిమ్మరుదు రందఱును.
                   15
హనుమ పేర విఖ్యాతుడ జగముల,
అనిల దేవునకు ఔరస పుత్రుడ,
సీతను వెతకుచు ఆతురుండనై
నూఱామడ పొడవారు సముద్రము.
                16
దాటి వచ్చి, నీ ధామంబున భ్రమి
యించుచు చూచితి, ఇక్ష్వాకుల కో
డలిని, జనకు బిడ్డను, సీతను, నా
రాకయెల్ల సార్థకమయినట్టుల.
                 17
తపము చేసితివి, ధర్మార్థంబుల
అరసినట్టి పుణ్యజనేశ్వరుడవు,
పరుల భార్యలను పట్టితెచ్చి ని
ర్బంధించుట, అర్హంబు కానిపని.

                  18
నిన్ను బోలిన మనీషివరేణ్యులు,
చేయరానివి, అపాయజుష్టములు,
మూల వినాశకములు, ధర్మవిరు
ద్ధములు చేయగా తగునె యెపుడయిన.
                  19
రాముకోపమున రగిలిన లక్ష్మణు
సాయకంబులకు సై చి నిలువగల
వాడెవండు దేవాసురగణముల
లోన నీవె ఆలోచింపందగు.
                 20
రాముని కపకారము చేసిన వా
డెవడు బ్రతికి సుఖియింపగలిగె, నీ
ధాత్రి మీద, పాతాళములోపల,
స్వర్గలోక వాసమ్ముల యందును.
                   21
సర్వకాల హితసంగతమై, ధ
ర్మార్థానుగుణంబయిన నా పలుకు
విని సీతాదేవిని పంపించుము,
రాముని దండకు రాక్షస వల్లభ !
              22
అగపడ దంచును ఆశలు వదలిన
జానకి ముఖ దర్శనమైనది; ఇక
మిగిలిన దెల్ల నిమిత్త మాత్ర, మది
పూర్ణంబగు రామునిచే స్వయముగ.
                23
చూచితి సీతను శోక పరీతను;
పరమ సువ్రతను; బట్టి తెచ్చితివి,
ఎఱుగవయితి వపు డది, ఐదు తలల
కాల సర్పమని, కామాతురమతి.

                 24
గరళము కలిసిన కలమాన్నము నా
కొని తిన జీర్ణించునె ? దేవాసురు
లేని ఈమెను గ్రహించి, భుజింపగ
చాలరు , లంకేశ్వర తెలియందగు.
               25
తపముచేసి సంతప్తుండవయి స
మార్జించిన ధర్మార్ధ సంగ్రహము
నిను నాశము కానీక నిలిపినది,
ఆత్మ రక్షకంబయి ఇందాకను.
                26
అమరులచేతను అసురులచేతను
చావని వరములు సాధించితిని త
పోదీక్షల నని పొంగెదు రావణ !
కలవందును సందులు మృత్యువునకు.
              27
భావింపుము సుగ్రీవుండు సురా
సురులను చేరడు, చూడ, యక్ష ప
న్నగ దానవ గంధర్వుల చేరడు,
అతనిచేత నీ ఆయువు తీరును.
             28
ధర్మఫలమును అధర్మ సంచితము
ఏకముగా సంహితముకా వెపుడు ;
దేని ఫలితములు దానితోనె చను,
మాసిపోవు ధర్మము నధర్మమును.
               29
నిస్సంశయముగ నీ వార్జించిన
ధర్మఫలము నంతయు భుజించితివి,
అనుభవింతు విక నట్లె, అధర్మ వి
పర్యయఫల పరిపాకము సైతము.

                  30
దానవుల జనస్థాన మారణము,
వాలి వధంబును, వానర పతితో
రాజకుమారుని ప్రాణస్నేహము,
మతి భావింపుము హిత మాశింపుము.
              31
రథమాతంగ తురంగతుముల మగు
సేనలతో లంకానగరము నా
శనము చేయ నే చాలుదు నొకడనె;
కాని రాము సంకల్పము కాదది.
              32
సీత నపహరించిన ద్రోహిని, తా
నె వధింతు ననుచు నిష్ఠించెను రఘు
నందనుండు వానరుల మ్రోల; ఆ
తడు తన శపథము తప్పడు తథ్యము.
            33
రామున కపకారము కావించిన
సాక్షా దమరస్వామి యేనియు సు
ఖంపబోడు, తర్కింప నేల నీ
వంటి నిశాచర పాంసను సంగతి.
            34
సీతపేర యే సీమంతిని నీ
వశమై యిచ్చట కృశియించెడి, ఆ
దేవి కాళ రాత్రినిగా నెఱుగుము,
లంకాపుర నాశంకరి ఆ సతి.
             35
సీతరూపు కయిసేసిన కాలాం
తకుని పాశబంధంబని తెలియక,
పట్టి నీ మెడను చుట్టుకొంటి, విక
ఆలోచింపుము ఆత్మక్షేమము.

                36
రాముని కోపాగ్రహతాప నిదా
ఘమున రగిలి, జనకజ తేజస్సున
కమలుచున్న లంకాపురి, తోరణ
మంటపములతో మండి మసియగును.
                 37
జ్ఞాతులు, విహితులు, భ్రాతలు, సచివులు,
పుత్రమిత్ర సకళత్ర బాంధవులు,
అఖిల భోగభాగ్యములు సమూలము
నాశము చేసికొనకు మసురేశ్వర !
               38
రామదాసుడను రాయబారమున
పంపవచ్చితిని, వానరజాతుడ,
సత్యము ! చెప్పితి సామవాక్యమును
మనసిడి వినదగు దనుజ కులాధిప !
               39
ఆ మహామహుడు రాముడు, విమల య
శస్వి భూతపంచకముతో చరా
చరలోకములను సంహరించి సృజి
యింప శక్తుడు సుమీ ! యెఱుగందగు.
               40-41
అమరులలోపల అసురులలోపల
నరకిన్నర పన్నగులలోన గం
ధర్వ సిద్ధవిద్యాధరులందును,
సర్వభూత సంజాతమునందును.
               42
కానరాడు రాఘవుతో రణమున
పోరంగల ప్రతివీరు డొక్కడను,
నాడుగాని యీనాడుగాని;
విష్ణు పరాక్రమ విక్రము డాతడు.

                 43
ఏడులోకముల కీశ్వరుడగు రఘు
రామున కిట్టి దురాకృతంబు చే
సేతల చేసిన పాతకుడవు, నీ
జీవిత మిక ముగిసినదని తెలియుము.
               44
దైత్యదేవ గంధర్వ యక్ష వి
ద్యాధర పన్నగు లందఱు కూడిన,
ముల్లోకములకు వల్లభుడగు రా
ముని యుద్ధంబున మునుకొన చాలరు.
              45
తనయంతన పుట్టిన పరమేష్ఠియు,
త్రిపురంబుల నేర్చిన ఫాలాక్షుడు,
అమరుల కధినాయకుడగు వజ్రియు,
రాముని బలికి శరణ మీ నోపరు.
            46
అదరక బెదరక అప్రియంబులను
ఒప్పిదంబుగా చెప్పినట్టి వా
నరుని చూచి గ్రుడ్లురుముచు, వీని వ
ధింపు డనుచు శాసించె రావణుడు.

26-6-1967