శ్రీ సుందరకాండ (రాయప్రోలు సుబ్బారావు)/సర్గ 42


6
ఎవడు వీ ? డిచట యెవ్వరి చుట్టము ?
ఎచటనుండి ఇట కెందుకు వచ్చెను?
ఏమని నీతో ఏకాంతంబున
సంభాషింపగ సాహసించె నెటు ?
7
ఇంతలు కన్నుల యెలనాగా ! నీ
కెట్టి భయము లేదిపు డిచ్చట, ఆ
తోకవాడు నీతో ఏమంచును
ముచ్చటించె చెప్పుము మా కిప్పుడు.
8
అంత సీత సర్వాంగసుందరి, ని
శాచరాంగనల చూచుచు ఇట్లనె,
పెడరూపులతో వెడలి తిరుగు, రా
క్షసుల చర్య లేగతి నే నెఱుగుదు?
9
ఈతం డెవడో, ఎందుకు వచ్చెనొ,
ఏమి కార్యమో యెఱుగ నే నెదియు,
దాని నెఱుగ మీరే నేర్తురు, పా
ముల పదములు పాములకే తెలియును.
10
ఇతని చూచి భయ మెత్తెను నాకును,
ఎఱుగను నే నిత డెవరికి చుట్టమొ,
మాయదారియై మసలు పుణ్యజను
డెవడొ వచ్చెనని యెంచితి మదిలో,
11
మైథిలి పలికినమాట లెల్ల విని,
దిక్కులు పట్టిరి రక్కసు లదవద,
కొందఱు పొంతల గొంకిరి, కొండలు
పరుగెత్తిరి రావణునకు చెప్పగ.


12
దానవేశ్వరుని దగ్గరిబెగ్గిలి
దీనవదనలై దేవురించుచున్,
వికృతరూపియగు భీమవానరుని
చేష్టితంబులను చెప్పదొడంగిరి.
13
మన అశోకవన మధ్యభాగమున
సీతతోడ భాషించుచు రాజ ! మ
హాకపి యొక్కడు భీకరరూపుడు,
తిష్ఠవేసెను బలిష్ఠుడు కదలక .
14
లేడికన్ను వాలికచూపుల మై
థిలిని మేమడిగితిమి పలుతీరుల,
కపి యెవడని, పలుక దతని సంగతి,
ఎంత వేడినను ఇయ్యకొనదు ప్రభు !
15
ఆతడు ఇంద్రునిదూత కావలెను,
లేక కుబేరుని లెంక కావలెను,
కాదే, నడవుల వై దేహిని వెత
కగ వచ్చిన రాఘవుల చారుడగు.
16
అద్భుతకాయుం డయిన వానరుడు
పెక్కుజీవులకు చక్కదనాలకు
పట్టయి, నీ కాప్యాయనమైన, అ
శోకవనంబును శూన్యము చేసెను.
17
ఆమనోహరోద్యానములో కపి
ధ్వంసము చేయని తావులె కనబడ,
వెచట సీత వసియించు నిచ్చలును
అచ్చట మాత్రము పచ్చగ నున్నది.


18
జానకికోసము చల్లనిప్రాంతము
విడిచెనో ! అలసి విడిచెనో ప్రభూ !
ఆ భూతమునకు అలత యెక్కడిది ?
జానకి కోసమె చదునుచేయ డది.
19
నిగనిగ లాడెడి చిగురాకులతో
విచ్చిన పువ్వుల కుచ్చులతో, ఏ
మాత్రము చెదరక మంచిగ నున్నది,
సీత వసించెడి శింశుపాతరువు..
20
సీతతోడ భాషించుచు, ఆమె వ
సించు వనంబును ఛేదించిన ఆ
ఉగ్రరూపునకు ఉగ్రదండనము వి
ధింపతగును దై తేయ కులాధిప !
21
మనసారగ నీ వనురక్తుడవై
తెచ్చుకొన్న వైదేహితో ఎవడు
మాటలాడెనా మత్తు డవశ్యము
బ్రదికియుండ కూడదు మహాప్రభూ ?
22
ఆ మాటలు విని అసురవల్లభుడు,
నేయిపడ్డ వహ్నివలె మండిపడె,
ప్రళయకోపసంరంభంబున కను
గ్రుడ్లు రెండును విఘూర్ణి లె భయముగ..
23
క్రుద్ధుడైన రక్షోగణనాథుని
వాడి కనుల బాష్పంబులు రాలెను,
వెలుగుచున్న దీపికలనుండి, కా
గిన నూనెలు చినికిన చందంబున.


24
కోపమెక్క ఆజ్ఞాపించెను, శూ
రులు, తనకు సమానులునగు కింకరు
లను దశకంఠుడు, వన విధ్వంసకు
వానరు పై కొని పట్టికట్టుడని.
25
వెంటనె, యెనుబదివేలు కాల కిం
కరులు, బలిష్ఠులు, గదలు గూటములు
కరముల త్రిప్పుచు కదనకాంక్షతో,
బిట్టుబిళ్ళుగా వెడలిరి గృహములు.
26
బలిసిన పొట్టలు, బరుసు కోరలును,
భీకరములుగా వీగుచు నడచిరి,
మనసులు పోరికి మచ్చరింపగా,
హనుమద్గ్రహణ వ్యసనాతురులయి,
27
ఆత్రము మీఱ, మదాంధులు దైత్యులు
తోటవాకిటను తోరణంబుపయి
కూరుచున్న కపికుంజరుమీద దు
మికి రగ్నిపయిన్ మిడుతల కైవడి,
28
పసిడి పురులుగల పరిఘలతో, చి
త్రంబులగు పెనుగదలతో, భానుశి
ఖలు పోలిన విశిఖంబులతో, దం
దడి బాదిరి వానర సింహంబును.
29
గుదియలు గదలును కోలకత్తులును
బల్లెము లీటెలు బరిసెలు మున్నగు
ఆయుధములతో అడరి యెడాపెడ
కొట్టిరి హనుమను క్రూరకింకరులు.


30-31
కొండబోలె నెలకొని కదలని కపి,
అపుడు తోక పొడవార నిగిడ్చి, వి
దిర్చి, బిట్టఱచి, పేర్చి, బొబ్బలిడె,
లంకాపుర మెల్లను దద్దరిలగ.
32
ప్రళయమైన కపిభయదాస్ఫోటన
ఘోషకు కొండలు కోయనె గుహలను,
ఆకాశంబున అరిగెడి పక్షులు
తల్ల క్రిందులై డుల్లి నేలబడె.
33
జయము ! భూరి బలశాలి రామునకు,
జయము లక్ష్మణస్వామికి, రాఘవ
పాలితుండయిన వానరపతి సు
గ్రీవునకున్ దిగ్విజయాభ్యుదయము.
34
ధర్మకర్మ పరతంత్ర చరితుడగు,
కోసలేంద్రునకు దాసదాసుడను,
వైరి హంతకుడ, వాయుసంభవుడ ,
హనుమంతుడ, విఖ్యాతనాముడను.
35
పదివందల రావణులు రణంబున
మొనకొన్నను పడమొత్తెద మెత్తగ,
పిడుగురాళ్ళతో సుడివడ కొట్టెద,
కండలు చీల్చెద కాళ్ళగోళ్ళతో
36
లంకగడ్డ మూలము లగల్చి, సీ
తకెఱుగి, అభివాదములు సలిపి, రా
క్షసకుల క్షయము సలిపి యేగెదను, .
ఇష్టార్ధము ఫలియింప సమృద్ధిగ.


37
ఉబ్బి, హనుమ యటు బొబ్బలు పెట్టగ,
కింకర వీరులు గిలికొని శంకితు
లయి చూచిరి, సంధ్యా మేఘమువలె
ఉన్నతు డగు కపి యోధాగ్రేసరు.
38
అపుడు రావణుని ఆజ్ఞ తలపుకొన,
కింకర వీరులు శంకలు విడిచి, శ
రసహస్రంబుల ప్రహరించిరి వడి,
శాఖాచర మదశార్దూలంబును .
39
ఆయుధములతో అన్ని వైపులను
ముట్టి మార్కొనెడి పోతుమగల గని,
తట్టి పెకల్చెను ద్వారబంధమున
ఇనుపదూలమును హనుమ లీలగా.
40
గరుడి పాములను కసరివిసరు గతి,
ఆ మహాయసాయత పరిఘను, గిర
గిర త్రిప్పుచు కింకర సైన్యములను
మోదెను, చావగబాదెను బలముగ.
41
దానితోనె కపి తారాపథమున
కొంతసేపు తిరుగుచు, కింకరవధ
చవిగొలుప జిఘాంసారతి, క్రమ్మఱ
ద్వారతోరణము నారోహించెను.
42
పవననందనుని బాఱంబడి చా
వక మిగిలిన సైనికు లొక కొందఱు,
దశముఖుని దరిసి దాచక చెప్పిరి,
కింకర వాహిని ఇంకిపోయెనని.



         43
కింకర బలములు కీడ్వడి కెడసిన
వార్తలు విని రావణుడు కినిసి, క
న్నులు తిరుగుడు పడ, పిలిపించెను రణ
దుర్జయుని ప్రహస్తుని పుత్రుని వెస.