శ్రీ సుందరకాండ (రాయప్రోలు సుబ్బారావు)/సర్గ 41

శ్రీ

సుందరకాండ

సర్గ 41


                  1
మైథిలి పనికిన మంచిమాటలు ప్ర
సన్నముగా తనస్వాంతము తనుపగ,
పయనించిన హనుమయు ఆచోటును
విడిచిపోయి భావింపసాగె నిటు.
                  2
వచ్చిన కార్యము పాటునబడె, వై
దేహి అడపొడలు తెలిసె, నింక మిగి
లిన దల్పము, మొదలిటి మూటిని విడి
చతు రుపాయమే సరిపడు నిచ్చట.
                  3
సౌమము సాగదు తామసు లసురులు,
దానము చెల్లదు ధనికుల పట్టున,
పాఱదు భేదము బలవంతుల యెడ ,
దండ మొకటె యుక్తమయి రుచించును.
                    4
బలపరాక్రమ ప్రక్రియ తప్ప, మ
ఱే ప్రయోగమును ఇచ్చట పొసగదు,
అనిలో కొందఱు హతమార్చిన, మె
త్త పడుదు రావల దానవ ధూర్తులు.


5
కలవు పెక్కు మార్గములు కార్యమును
నిర్వహించుటకు; నేర్పున పూర్వో
త్తరములకు విరోధము రాకుండగ,
సాధించుటె ప్రజ్ఞావిశేష మగు.
6
అల్పకార్యముల కచ్చివచ్చిన ప్ర
యోగ మొక్కటే ఉత్తమమన తగ,
దొక్క దానితో పెక్కు ఫలితములు
సంఘటించుటే సామర్థ్యంబగు.
7
ఇచ్చటనే యిపు డితరుల బలమును
స్వబలంబును సాక్షాత్తుగా తఱచి,
నిశ్చయించుకొని నే కిష్కింధకు
అరిగిన సార్థకమగు ప్రభు నానతి.
8
నాకును రక్కసిమూకలకును సం
గరము ఘటిల్లినగాని రావణుడు,
తెలిసికొన డతని బలముల సారము,
నాదు భుజాదండ ప్రభావమును.
9
సచివ సైన్యబల సన్నాహముతో
రావణు డెదిరిన రణములో నడచి,
అతని మతియు సైన్యముల చేవయును,
ఎఱిగి తిరిగిపోయెదను సుఖంబుగ.
10
ఇదె, ఆ దుష్టుని కిష్టమయిన ఉ
ద్యానవనము, నందనమును పోలుచు
కనుల కందమయి, మనసున కింపయి,
తనరారు బహులతాతరు వీథుల.


11
ధ్వంసము చేసెద పచ్చని తోటను,
ఎండిన అడవిని ఇంగాలమువలె,
అది విని, రావణు డాగ్రహ మెక్కగ,
నన్ను పట్ట సైన్యములను పంపును.
12
గుఱ్ఱంబుల ఏన్గులను రథంబులను,
ఎక్కి శూలములు ఉక్కు గుదెలుకొని,
దశకంఠుని మదదర్ప సై నికులు
దుముకుదు, రంతట తుముల సమరమగు.
13
దుర్జయులగు దైత్యులతో నేనును
చండ విక్రమము గండరింపగా,
రావణు బలముల ఱంకె లడచి, సు
ఖంబుగ పోవుదు కపినగరమునకు.
14
అనుచు క్రుద్ధుడయి హనుమ, ఉద్దవిడి
తొడలబలిమి రాపడ కుప్పించుచు,
విఱుచుచు చెట్లను, పెరుకుచు తీగెలు,
ప్రారంభించెను వన వినాశమును.
15
కొమ్మల మత్త శకుంతము లాడగ,
పాదులలోపల పచ్చగ పెరిగిన
నానాజాతుల మ్రానుల తీగెల
విటతాటనముగ విఱిచి విదిర్చెను.
16
కుదిసి పెల్లగిలి కూలె సాలములు,
సుళ్ళు తిరిగి కోనేళ్ళ నీ ళ్ళుబికె,
కొండ నెత్తములు పిండిపిండిగాన్ ,
చూపుల వెగటై తోపు పాడువడె.


17
కాసారంబుల గట్లుతెగెను, వా
డెను మాకుల యెఱ్ఱని చిగురాకులు,
పక్షులు మూల్గెను బాధాస్వరముల,
నేలవాలిపడె పూలతీవియలు.
18
కాఱుచిచ్చు కాకలు సోకినగతి,
పొగసి శోభ లుడిపోయెను వనమును,
పచ్చనితీగెలు ముచ్చ ముడుచుకొని,
వెలవెల బాఱెను బిత్తరిపాటున.
19
ఛిన్నము లాయెను చిత్రసౌధములు,
బెగడి బయటపడె మృగములు పాములు,
భగ్నంబాయెను పాలఱాల భవ
నములు, రూపఱె వనంబు భ్రష్టమై .
20
దశకంఠుని నిత్యప్రమదోత్సవ
శోభనమైన అశోకవనము, శో
కము తీగెలు సాగగ పాడుపడెను,
హనుమద్బల భీషణ తాడనమున.
21
రావణు ధనదర్ప మనఃస్ఫూర్తి కి
మాన్పరాని అవమానంబును దా
కొలిపి మహాకపి కూర్చుండెను, తో
రణమున రాక్షస రణకౌతుకమున.

31 - 5 - 1967

342 పుట మళ్ళీ ప్రచురించబడినది.కనుక దిద్దనవసరం లేదు .