శ్రీ సుందరకాండ (రాయప్రోలు సుబ్బారావు)/సర్గ 4

శ్రీ

సుందరకాండ

సర్గ 4

               1
అటుల హనుమ మహాతేజస్వి, బ
లాఢ్యుడు, లేచి పరాక్రమించి, స్వే
చ్ఛా రూపిణి, లంకా రక్షికను ని
కారించి పురద్వారమున్ గడచి.
                2
అపర రాత్రి సమయంబుచూచి, తల
వాకిలి విడి, పెడవాకిలి పట్టున
ప్రాకారంబును దూకి, ప్రవేశిం
చెను లంకాపురమును హనుమంతుడు.
                 3
సుగ్రీవునకున్ శుభదాయకముగ,
లంక చొచ్చువేళ తన యెడమకా
లిడెను శాత్రవుల నడినె త్తిన బలె
రాజనీతి పారగుడు మహాకపి.
                 4
రాత్రివేళ నగరంబును చొచ్చిన
హనుమ పోవుచుండెను లంకాపుర
రాజ వీధులను; రాలిన పువ్వులు
చల్లి నట్లు రాజిల్ల నెల్లెడల.

                5
జంత్ర వాద్యముల సన్నని పాటలు,
నవ్వుటాల సందళ్ళు సరసములు,
రమ్యమయిన నగరంబున నెల్లెడ
వినబడుచుండెను వీనుల విందుగ.
                6
మంచి వజ్రముల మాలలు చుట్టిన
తెల్ల యేనుగుల తీరున భాసిలు
భాగ్యభవనముల పంక్తులతో పురి;
శుభ్రపయోధర సుందర దివివలె.
                7
రేకులు విప్పారిన పద్మములను
బోలు రూపముల, పాలమబ్బుల సొ
బంగుల, స్వస్తిక మంగళాంకముల,
దీపించును లంకాపుర గృహములు.
                8
చిత్రముగ రచించిన మాలలు, నా
భరణములు వెలయ, 'వర్థమాన' మను
పేరులపలకలతో రమణీయము
లయిన గృహములను ప్రియముగ కనె కపి.
               9
పలుచందంబుల బహురూపంబుల,
తీరుతీరుగా తీరిచి కట్టిన ,
ఒక భవంతియందుండి దూకి, మఱి
యొక భవనముమీది కెగరసాగెను.
              10
అమరలోకమున అప్సరసలవలె,
దానవయువతులు త్రాగిపాడు త్రి
స్థాన స్వరగీతా తరంగములు
వినబడె మారుతి వీనులకింపుగ.

                 11
మేలిమి మేడల మెట్లమీదుగా
ఎక్కిదిగుచు భ్రమియించు భామినుల
మొలనూళ్ళందెలు మొరయు రవళి విన
నయ్యెను గలగలమంచువాడలను.
                 12
అచటనచట ఉదయ వ్యాయామా
స్ఫోటనములు, ఆర్భాటారవములు ,
మంత్రతంత్ర పరతంత్రుల కంఠ
శ్రుతులును వెడలె అసురుల నట్టిండ్లను.
                13
స్వాధ్యాయ సునిష్ఠాపరులగు ఛాం
దస పుణ్యజనుల దర్శించెను కపి,
రాక్షసేశ్వర ప్రస్తుత గీతా
పాఠకులును కనబడిరి వీధులను.
               14
రాజవీధి కిరుప్రక్కల నిలిచిరి
కత్తులతో రాజసభటు లెడనెడ,
చాటుమాటుగా సైనిక శిబిరాం
తికముల వేగులు తిరుగుచునుండిరి.
              15
ఎద్దుతోళ్ళు ధరియించిన నిష్ఠులు,
జడదారులు, దీక్షాముండితులును,
పిడికిట దర్భలు ముడిచినవారును,
అగ్నిహోత్రులును యాతుధానులును.
               16
కూటముద్గర క్రూరహస్తులును,
కండలుబలిసిన దండధారులును,
ఏకేక్షణులును, ఏకకర్ణులును,
లంబోదరులును లంబస్తనులును.

                17
వంకరమూతులు, వామనమూర్తులు,
పీలమొగాల కరాళదర్శనులు,
ఖడ్గశతఘ్నులు కార్ముకముసలము
లెత్తి తిరుగుదురు మత్తిలి దైత్యులు.
                18
కరములం దినుపకట్ల గుదియలును,
మేనకవచములు మెఱయనెగడుదురు
బలుపెక్కక, మిక్కిలి బక్కటిలక
గిటకపాఱక, మిగిలి పొడుగెదుగక.
                19
కారునలుపును చొకారుపు తెలుపును
కాని రాక్షసులు కానబడిరి, వి
రూపులు, నధికసురూపులున్ కలసి;
కొందఱు గిడ్డలు కొందఱు పొడుగులు.
                20-21
విజయపతాకలు వివిధాయుధములు
తాల్చి, కావిగందము నలందుకొని
వజ్రాయుధములు వాడి శూలములు
వెలయ భ్రమింతురు విచ్చలవిడిగా.
               22
పూలదండలను భూషణంబులను
తాల్చి, కావి గందము నలందుకొని,
బహువేషంబుల పలువాలకముల
వారినిగనె హరి స్వైరవిహారుల.
              23
వజ్రాయుధములవంటి ముమ్మెనల
వాలములను మెయితాలిచి, వందలు
వేలు రాక్షసులు వాలి తిరుగుదురు
రావణు నంతిపురంబు చుట్టుకొని.

                 24
కొండనెత్తిన అఖండశోభతో,
చారు హిరణ్మయ తోరణములతో,
ప్రఖ్యాతంబగు రావణు రాజాం
తఃపురమును సందర్శించెను కపి.
               25
తెలితామరపువ్వులతో నిండిన
కోటకందకము దాటకుండ, ప్రా
కారచక్రము గభీరముగా, వెలి
చుట్టు తిరిగివచ్చుట చూచెను హరి.
                26
ఇంద్రుని నగరికి ఈడగు లంకను,
దివ్యనాదములు దివ్యాభరణ ని
నాదంబులు ప్రతినాదములీనగ,
హయముల హేషలు ప్రియముగ నుండెను.
                 27
రథములు, హస్తి తురగ విమాన వా
హనములు నగరమునందు సందడిల ,
తెల్లనిమబ్బుల తీరున నాలుగు
కోరల యేనుంగులు విహరించును.
                28-29
గుమికొనియాడగ గువ్వలు జింకలు
సాలంకృతమై, వేలురక్షకులు
కావలికాచెడి రావణేశ్వరుని
రాణివాసము చొరంబడె మారుతి.
               30
వ్రేలు కాడ ముత్యాల కుచ్చులు క
డాని చుట్టుగోడపయి చూరులను,
అగరు చందనము లలికిన రావణు
శోభన భవనముచొచ్చె మహాకపి.
12-12-1966