శ్రీ సుందరకాండ (రాయప్రోలు సుబ్బారావు)/సర్గ 3

శ్రీ

సుందరకాండ

సర్గ 3

                1
కదలి కులుకు శృంగములతోడ జీ
రాడు ఘనాఘనమట్టులొప్పు లం
బాచలమున తఱి వేచుచుండె మే
ధావి హనుమ భవితవ్య తితీక్షను.
               2
పువ్వులతోటల పూర్ణ సరస్సుల
రమ్యధామమయి రావణుడేలెడి
లంకాపురమును జంకులేని ధృతి
చీకటిపడ చొచ్చెను మహాబలుడు.
              3
తెల్లని సంక్రాంతి మొగుళ్ళవలెన్
ధౌత సౌధ సంజాతము మెఱయగ,
ఏటి నీటి పయ్యెరలు విసరు ము
న్నీటి కెరటముల పాటలు వినబడ.
              4
అలకాపురి శోభలదై వారును
రావణేశ్వరుని రాజధాని, తిని
త్రాగి మదించిన రాక్షస రక్షకు
లెత్తిన కత్తుల నెడప రెన్నడును.

                5
మేఘ మాలికలు మెఱుపులు చిమ్మగ,
జ్యోతిర్గణములు చుట్టి చరింపగ,
ఝంఝానిలఘోషము లెలుగింపగ,
అతిశయించు లం కమరావతి వలె.
                6-7
బంగరు బురుజుల ప్రహరీగోడల,
జెండాలను గజ్జెలు గలగలమన,
ప్రాకార సమీపంబు చేరి కపి
వేడుక చెందెను విస్మయమందెను.
                8
ముత్యములు, స్పటికములు, మణిపలకలు
తాపించిన నిద్దపు ముంగిళ్లును,
పటిక కుందనము వైడూర్యములను
కలిపి సోగగా కట్టిన మెట్లును.
              9-10
కరగబోసి వడకట్టి తేర్చిన ప
సిండి వెండి జిగిజిలుగు వన్నియల
అంగణములు సోయగములు కాన్ , పురీ
గగనమున కెగుయు కరణి కనంబడె.
               11
అంచలసందడి, క్రౌంచముల పలుకు,
నెమళుల కేకలు, నెలతుకల నగల
చప్పుడు, వాద్యస్వరములు, పురమున
బోరుకలగు నలవోక యెల్లపుడు.
               12
అలకానగరపు అందచందములు
కసరి కొసరి ఆకసమున కరుగుచు
నున్న భంగి చెలువొందు లంకగని
వేడుకపడి కొనియాడెను మారుతి.

                  13
సాటిలేని సిరిసంపదలెల్ల స
మృద్ధముగా వర్ధిల్లుచున్న రా
క్షసనాయకు లంకానగరము కని
వేడుకతో కొనియాడెను మారుతి.
                   14
ఎత్తినకత్తుల నెడపక దైత్యులు
రావణుబలములు రక్షింపగ నిది
బలిమిని పట్టగ వశముకాదు, లా
తుల కెవ్వరికిని అలవికానిపని.
                    15
ఇట్టి ఖ్యాతిగలదేని, చాలుదురు
కుముదాంగద ముఖ్యులును, సుషేణుడు,
మైందవద్వివిదు; లంద ఱొక్కమొగి
దీక్షించిన సాధింపనోపుదురు.
                   16
లంకాపురమును లగ్గపట్టుటకు,
సూర్యపుత్రుడగు సుగ్రీవుండును,
కుశపర్వుడు, నలఘుండు కేతుమా
లియు, నేనును చాలిన సమర్థులము.
                   17
ఇంకను మది నూహించిచూడ, రా
ఘవు బాహావిక్రమమును, లక్ష్మణు
ధనురస్త్ర దురంత పరాక్రమమును
ఎదురులేనివని ముదమందెను హరి.
                  18
రత్నభవనములు రంగుచీరెలుగ,
ఆవులచావళ్ళవతంసములుగ,
యంత్రశాలలు ప్రియస్తనంబులుగ
లంకయొప్పె సాలంకృత సతివలె.

                    19
వెలుగుచున్న దీపికల వెలుతురున
చీకటి నిలువగలేక వై తొలగ,
కళకళలాడెడి కనకభవనముల
రావణేశు నగరమును చూచె హరి.
                   20
చొరవ చేసికొని చొరబడుచున్న మ
హా బలవంతుని హనుమంతుని గనె
రావణేంద్రు పురదేవత లంక; ని
జాకృతి నంతట నప్రమత్తయై.
                   21
రావణు నధికారమున మెలగునది
కాన, కపీంద్రునికాంచి, లేచి, అతి
వికృతముఖముతో విచ్చేసెను వడి
స్వయముగ నగరద్వారము చెంతకు.
                   22
కపిసింహంబునుకదిసి, కట్టెదుట
నిట్టనిలువుగా నిలబడి, బొబ్బలు
పెట్టుచు అరచెను గట్టిగ నిట్లు జ
గత్ప్రాణసుతుని కలవరపెట్టగ.
                     23
వనచరుడా ! ఎవ్వడ ? వీ విచటికి,
ఎందుకువచ్చితి విట్టుల నొంటిగ?
చెప్పుము నిజమును శ్రీఘ్రంబుగ, నీ
ఉసురులు బొందిని మెసలుచుండగనె.
                   24
శక్యము కాదేచందమునను నీ
కింక ప్రవేశము లంక లోపలికి;
అతిగూఢముగా అన్నిమూలలను
కాపున్నవి రాక్షసగణబలములు.

                25
తన సమక్షమున తడయక నిలిచిన
దానితోడ కపితల్లజు, డిట్లనె,
అడిగితికాన యథార్థము చెప్పెద
వినుమీ యావద్వృత్తాంతంబును.
                 26
ఎవ్వతవీవు వివృత వికృతేక్షణ !
నగరివాకిటను నిలుతువెందులకు ?
భయపెట్టుచు నను ప్రతిరోధించితి
దారుణముగ, ఏ కారణార్థమయి ?
                 27
హనుమద్వచనములను విని లంకా
కామరూపిణి అఖండకోపమున,
మండిపడుచు హనుమంతునితో నిటు
దురుసులాడె నిష్ఠురకంఠంబున.
                 28
నేనిక్కడ లంకానగరమునకు
రక్షకురాలను; రాక్షసరాజగు
రావణు నాజ్ఞను కావలియుందును
ఎవరికిలొంగక దివమును రాత్రియు.
                 29
కాలిడ శక్యముకాదు లంకలో
గంతకట్టి నా కనులకు వానర ! ;
అడచితినేని యిపుడె నీ ప్రాణము
లెడలు; నిద్రపోయెదవిక లేవక .
                  30
నేనెసుమీ ! లంకానగరాధి
ష్ఠాన దేవతను సర్వంబును ర
క్షింతును స్వయముగ; చెప్పితి, నీవిక
తెలిసికొని ప్రవర్తింపుము వానర !

                  31
అట్టుల లంక అహంకారముతో
బింకములాడగ వినుచుండెను పవ
మానసుతుడు హనుమంతుడు కదలక;
కొండపై మఱొక కొండవలె నిలిచి.
                  32
వికృతరూపమున వెలసిన లంకా
స్త్రీభూతము నీక్షించి, మతి విచా
రించి, వానరవరేణ్యుడు, మారుతి,
మేధావి పలికె మెత్తని గొంతున.
                 33
లంకానగరి కలంకారములగు,
తోరణముల శృంగారంబును, ప్రా
కారంబుల గంభీరాకృతి, కను
లార చూడ మనసాయె వచ్చితిని.
                  34
పేరుమ్రోగె నీ ద్వీపమునందలి
పచ్చని పువ్వుల పండ్లతోటలును
చిక్కని వనములు చక్కని గృహములు,
వానిని చూడగ వచ్చితి వేడ్కసు.
                 35
పవమానసుతుడు పలికిన పలుకుల
నాలకించి, వెనకాడక, యీసున
కామరూపిణి వికారవేషిణి, స
మీరసుతునితో మారుపలికె నిటు.
                36
నను జయింపకున్నను దుర్బుద్ధీ !
రావణు డేలెడి రాజ్యములో నీ
పురముచూడ నీ తరము కాదిపుడు
చెప్పిన మాటల నొప్పరికించకు.

              37
ఆ మాటలు విని హరి శార్దూలము,
మఱల నా నిశాచరితో నిట్లనె,
ఒక్కసారి యీ పక్కణమారసి,
వచ్చినదారినిపట్టి పోయెదను.
               38
అంతట లంక దురాగ్రహమెత్త భ
యంకరంబుగా అఱచుచు తడయక,
చెంపదెబ్బ తీసెను క్రూరంబుగ,
హనుమంతుని దాంతుని బలవంతుని.
               39
గొంతు పగులమ్రోగుచు రాక్షసి బె
ట్టిదముగ నటు తాడించగ మారుతి,
నిబ్బరం బెడల బొబ్బలు పెట్టెను
భూనభోంతరంబులు మార్మ్రోయగ.
                 40
అంతబోక పవనాత్మజుండు, ప్రళ
యాగ్రహంబుతో నుగ్రుండయి, కుడి
చేతి వ్రేళ్ళు ముష్టిని బిట్టు బిగయ
ముడిచి, పొడిచె ఱొమ్ములలో దానిని.
                41-42
పిడుగువంటి కపి పిడికిటి పోటుకు
ఊపిరాడకది ఒఱగి విఱిగిబడె;
స్త్రీయని తలచి అతిక్రోధం బిం
చుక జాఱగ, చంపక విడిచెను హరి.
                 43
ముష్టి ఘాతమున మూర్ఛితయై పడి
విలవిలలాడెడి వికృతాస్యను రా
క్షసిని చూడ కపి సత్తమున కపుడు
కనికారము తొణకెను కటాక్షముల.

              44
అట్లు నేలబడి అపరయాతనన్
తన్నుకొను చసురి; తన్ను జాలితో
చూచుచున్న కపిసోమునితో ననె
గర్వమడచి గద్గద కంఠంబున.
               45
రక్షించుము వీరకపిసత్తమ! ప్ర
సన్నుడవైనను మన్నించుము ! బల
వంతులు సత్వనితాంతులు నగు ధీ
మంతులు కరుణామయులుగారె హరి.
                46-47
నేనె స్వయము లంకానగరిని కపి
కంఠీరవ ! నీ కరతలఘాతను
హతమై పడితి; స్వయంభువు నా కి
చ్చిన వరమున్నది, చెప్పెద వినుమది.
                 48
ఎపుడు వీరుడొక కపికుల ముఖ్యుడు,
చెనకి నిన్ను నిర్జించునో, అప్పుడె
దైత్యుల లోకోత్తర మహోన్నతికి,
నాశకాలమని నమ్ముము ధ్రువముగ.
                49
నీ యాగమనము నాయపజయమును
భావింపగ, ఆ భయకాల మిపుడు
దాపరించెనని తలతు హరీశ్వర !
మిథ్యయగునె పరమేష్ఠి, భవిష్యము.
                50
సీత నిమిత్తము చేసిన పాపము
ప్రభువు దురాత్ముడు రావణున, కతని
పౌరులు లంకావాసాసురులకు
సర్వమునకు నాశనము తెచ్చినది.

               51
రావణుడేలెడి రాజధానిని ప్ర
వేశించు, మభీప్సితములయిన కా
ర్యములను కావించుము, యథేచ్ఛగా;
వచ్చిన కార్య మవశ్య సిద్ధియగు.
             52
రాక్షసరాజగు రావణేశ్వరుం
డేలగ, శుభములకిల్ల యి, శాపము
తిన్నపురము చొ త్తెంచి, జానకిని
వెతకుమంతటను వీరకపీశ్వర !