శ్రీ సుందరకాండ (రాయప్రోలు సుబ్బారావు)/సర్గ 32

శ్రీ

సుందరకాండ

సర్గ 32


                    1
పెనచి చుట్టి తెల్లనివస్త్రము సిగ,
కొత్తకారు మెఱుగుల కుచ్చెలవలె
కొమ్మల నడుమన కుదిసి కదిసి కూ
ర్చున్న కపినిగని ఉలికెను మైథిలి.
                   2
ప్రియవాక్యముల అభయములు పలుకుచు
బంగారపు కన్నుంగవ మెఱయగ,
రక్తాశోక ప్రసవరాశివలె
మెఱయుచుండె వానరకేసరి యట.
                   3
ఆతని చూచుచు సీత చకితయై
విస్తు వోయి భావించె నిట్లు మది;
చూడరానిదీ పీడాభూతము,
వానరమంచు నపస్మారంబున.
                   4
దుర్నిరీక్ష్య మీ దుష్టజంతువని,
తెలిసి, క్రమ్మఱన్ దిమ్మువోయి, విల
పింపసాగె కంపించి తీవ్రముగ
వైదేహి భయభ్రాంతు లాముకొన.


                     5
రామరామయని వేమఱు పలవును,
హా ! లక్ష్మణయని అంగలార్చు, దుః
ఖార్తి మిగుల హా ! యని రోదించును,
మందమందమయి మ్రాన్పడ కంఠము.
                    6
అటు లేడ్చుచు తన అంతికమందున,
వృక్షము కొమ్మల వినయముగ నణగి
మణగియున్న హనుమంతుని తలచెను
జానకి, అదియొక స్వప్నం బగునని.
                    7
వానరనాథుని ఆనల నడచెడి
సూరివరేణ్యుడు, సుగ్రీవ సఖుడు
నిడుమోమును చప్పిడిముక్కును పొలు
పారు వానరుం డగపడె నప్పుడు.
                    8
కళవళపాటున కాళ్ళుచేతు లా
డక, ప్రాణములు తడబడ సొమ్మసిలి,
ఇంచుక స్పృహకొనలెత్తగ, క్రమ్మఱ
తలపోసెను మైథిలి లోలోపల.
                    9
ఈ కలలోన వికృతరూపంబగు
కోతి కానబడె, కూడదందు రిది;
స్వస్తి ! రామలక్ష్మణుల, కాప్తులకు,
స్వస్తి ! రాజఋషి జనకునకు, పితకు.
                   10
పూర్ణ చంద్ర శుభముఖుడగు రాముని
స్మరియింపుచు సుఖమెఱుగక , కన్నులు
మూతపడక, వాపోవుదు, నీ జా
గరములలో ఇది కలగాదు నిజము.


                    11
రామరామయని బ్రాతిని పలుకుచు,
మనసులోన ఆతని భావించుచు,
తన్మయనైతిని, తదనురూపమును
కనుచుంటిని మఱి వినుచుంటి. నిటుల.
                    12
మనసిజాత పీడను ప్రాణంబులు
ప్రియునెడ లగ్నములయి నందున, నే
దేని నెపుడు చింతించుచుంటినో
ఆ ప్రతిరూపము లగపడు వినబడు.
                    13
ఇది కలయేని' అభీష్టసిద్ధి యగు
నని తలతును, కాదని తర్కింతును,
ఏమన రూపవిహీన మభీష్టము,
కలరూపున ఇది పలుకుచు నున్నది.
                   14
బ్రహ్మదేవునకు, వైశ్వానరునకు,
వాచస్పతికిని వాసవునకును న
మస్కరింతు, కపిమాటలు తథ్యము
లన్యంబులు మిథ్య లగును గావుత !