శ్రీ సుందరకాండ (రాయప్రోలు సుబ్బారావు)/సర్గ 31
శ్రీ
సుందరకాండ
సర్గ 31
1
ఆవిధమున కార్యాకార్యంబులు,
ఔగాములు బాగోగులును తలచి,
పలుకసాగె కపికులతిలకుడు వై
దేహి వినంగా తీయని యెలుగున.
2
ఉండెను రాజన్యుండు, దశరథుడు,
రథమాతంగతురంగ బలాతిశ
యుండు, సత్యసంధుండు, పుణ్యశీ
లుండు, యశోలోలుండు, ప్రసిద్ధుడు.
3
రాజఋషులలో ప్రథితచరితుడు, స
మానుడు ఋషుల కనూనతపస్యను,
చక్రవర్తి కులజాతుడు, దేవేం
ద్రసమానుడు విక్రమ బలదీప్తుల.
4
అక్రూరుడు, కరుణాత్మ, డుదాత్తుడు,
సత్యపరాక్రమశాలి; సమస్త సు
గుణనిధి, ఇక్ష్వాకు కులవతంసుడు,
శౌర్యమూర్తి, ఐశ్వర్యవర్ధనుడు.
5
రాజలక్షణ విరాజితుండు, ల
క్ష్మీనిలయుడు, నృపశేఖరుడు, చతు
స్సాగర చేలాంచల ధరాధిపతి,
సుఖి, సుఖదాత, యశోదిశాంబరుడు.
6
అతని పెద్దకొడు, కధిక ప్రియుడు, సు
ధాంశు సుందరశుభాస్యు, డగ్రగ
ణ్యుం డుదగ్ర కోదండధారులను,
రామమనోహరనామ ఖ్యాతుడు.
7
రక్షించు స్వధర్మము, రక్షించు స్వ
జనమును, రక్షించును సచరాచర
జీవలోకమును, శిక్షించు నధ
ర్మము, ధర్మము సంరక్షించును ధృతి.
8
సత్యసంధుడు దశరథుడు జనకుడు
చిన్నభార్య కిచ్చిన వరమును, శిర
సావహించి జాయాసోదర సహి
తముగా వనవాసమునకు తరలెను.
9
అతడు మహారణ్యమున తిరిగి వే
టాడుచు, ఒక్కడె హత మొనరించెను,
కామరూపులగు తామసులను రా
క్షసవీరుల పెక్కండ్రను పోరుల.
10
ఖరదూషణు లిద్దరిని జన
స్థాన రణంబున చంపె ననుచు, రా
వణుడు రోషదారుణమతియై, రా
ముని భార్యను సీత నపహరించెను.
సుందరకాండ
11
మాయలేడి నొక మాటుచేసి, వం
చించి రావణుడు సీతను కొనిపోన్,
అడవుల భార్యను తడవుచు రాముడు
సుగ్రీవుని గని సుహృదునిగాకొనె.
12
ఆవల నాతడు అరిపరంతపుడు
సుగ్రీవుని నిజసోదరుడగు వా
లిని వధించి, యేలికగా అభిషే
కించే నతని కిష్కింధానగరిని.
13
అంతట సుగ్రీవాజ్ఞను తలనిడి
ఇచ్చకువచ్చిన కృతకవేషముల
వేలు వానరులు వేవేగమె బయ
లెక్కిరి వైదేహిని వెతకు చెల్లెడల,
14
మాకు చెప్పె సంపాతి, యీమె మని
కా చొప్పున నూఱామడ కడలిని
దాటివచ్చితిని తడయక నేను, వి
శాలనేత్రముల జానకి నరయుచు.
15
రాముడు చెప్పగ ఏమి పోలికలు
వింటి నచట, అవి కంటిని యిచ్చట,
మేనిచాయ, అమ్లానశోభ, సౌ
మ్యాకృతి కనబడు నచ్చొత్తిన గురి.
16
ఇట్లు రామకథ ఇచ్చగింపుగా
పలికి యూరకొనె వానరసత్తము,
డాసుఖవాక్యము లాలకించె వి
స్మయము పల్లవింపగ వైదేహియు.
17
నల్లని వంపుకొనల ముంగురులు ము
ఖంబున ముసర నఖంబుల త్రోయుచు,
పిఱికితనంబును వెఱుపునొత్త, మొగ
మెత్తి శింశుపావృక్షము చూచెను.
18
కపి పలుకుల నాకర్ణించి, మదిన్
తొలకరింప సంతోష మొకించుక,
రామధ్యాన పరాయణ యై మై
థిలి వీక్షించెను దిక్కుల నెల్లెడ.
19
పైనను క్రిందను, ప్రక్కలు మూలలు
కనులు విప్పి పరకాయించుచు, అట
చూచె చెట్టుపయి సుగ్రీవసఖుని,
ఉదయాదిత్య సముజ్వలు వానరు.