శ్రీ సుందరకాండ (రాయప్రోలు సుబ్బారావు)/సర్గ 20

శ్రీ

సుందరకాండ

సర్గ 20

                  1
అపుడు దశానను డా పతివ్రతను
దీనవదనను, నిరానంద, నిటల
పలుకరించె నర్మిలి చేష్టల, తీ
యని మాటల, తన మనసు మెఱయగా.
                   2
నన్ను చూచి, యెలనాగరొ! భయమున
దాచుకొందు, ఉదరము నురోజము
లిందుముఖీ! నీ సుందరాంగములు
అన్యుల కెవరికి నగపడరాదో !
                  3
నినుకామించితి నను ప్రేమింపుము,
సర్వాంగ గుణాశ్రయ సంపన్నవు,
మనసారగ బహుమానింపుము, నా
ప్రియ సహచరివై , త్రిభువన సుందరి !
                4
మానవమాత్రులుగాని, కామరూ
పులగు రాక్షస జనులుగాని, మఱె
వ్వరును లేరిచట, వరవర్ణిని ! నా
వలని భయంబును వదలుము నీ విక.

                 5
పిరికి దానవు విభీతమృగేక్షణ!
పరదారహరణ, వరణ, విహారము
లసురులకు స్వధర్మాచారంబులు,
ఇది నిస్సంశయ మేడు లోకముల .
                   6
అయినను నాపయి అనురాగము నీ
కంకురించనిది అంటబోను నిను,
వేచుగాక పూవిలుతు, డా సెగల
ఉడుకనిమ్ము నా యొడలులోపలనె.
                   7
భయమొందకు మీపట్ల దేవి ! యిది
విశ్వసించి ననుప్రేమింపుము మన
సారగ, తీఱని వ్యధలన్ కుములుచు
శోకలాలసవుగాకు మీ వికను.
                   8
నేలమీద శయనింతువు, మాసిన
కోక కట్టుదువు, కురులు దువ్వ, వుప
వాసధ్యాన వ్యసన ప్రయాసలు
పనికిరాని వప్రస్తుతములు సుమి.
                  9
చాయ చాయ పూసరము, లగరు చం
దన సుగంధలేపనములు, తెల్లని
పట్టు చీరలును, స్వర్ణ ఖచిత ర
త్నాభరణములును అడుగక యున్నవి.
                   10
పలువిధముల మధుపాన రసంబులు,
అంచల ఱెక్కలు నించిన పాన్పులు,
నృత్తగీతములు స్వేచ్ఛాక్రీడలు,
అందిపొంది ఆనందింపుమి, యిక .

                   11
మదవతులకు తలమానిక మీ, విటు
లుండు, టశోభన; మొడలినిండ సొ
మ్ములు ధరియింపుము ముదితరొ! నను పొం
దియు ననర్హవైతి వెటు సంపదకు.
                   12
మిసమిసలాడుచు మేన మెఱయు నీ
పచ్చి జవ్వనము పరుగిడుచున్నది ;
సెలయేటిని తళతళమని పాఱెడి
తియ్యని తోయము తిరిగిరాదు సుమి.
                    13
రూపకర్తయగు ఆ పరమేష్టియు,
నిన్ను తీర్చి మానెను తనపనియని
తలతు ; కానరా దిలలో సుందరి !
నీకు సాటియగు నెలత మఱొక్కతె.
                    14
రూపంబును, తారుణ్యము, గుణ సౌ
శీల్యములును పూచిన నినుచూచి, పి
తామహుడై నను తమకించు నిజము,
ఇతరుల సంగతి, నేల తలంచగ.
                    15
ఎందు నెందునీ సుందరాంగములు
సోకి తగిలె నా చూపులు రమణి
అందందే అవి హత్తి బందెవడి
కదలవు మెదలవు కట్టకట్టుకొని.
                     16
ఇతరవిమోహము నెడలించి, ప్రియా !
ప్రాణేశ్వరివయి పాలింపుము, నా
అంతఃపురమున కగ్రమహిషివై
ఊడిగములు కొను ముత్తమాంగనల.

                    17
ఈ లోకము నలుమూలలనుండియు
బలిమి నొడిచి కొనివచ్చిన నానా
రత్న రాసులును, రాజ్యము, నేనును
నీ యధీనములు నీరదవేణీ !
                    18
పృథివినంతయు జయించి, మించి, బా
హా విక్రమమున నాక్రమించి, స్వా
ధీనమయిన నానానగరీమా
లిక నర్పింతు జనకునకు నీకయి.
                    19
ముల్లోకంబుల నెల్ల వెతకియును
చూడలేవు నాతోడి బలాఢ్యుని,
చూడగలవు నీ వీడులేని నా
శౌర్యవీర్యములు సమరము వచ్చిన.
                 20-23
ఎన్నిసారులో మున్ను యుద్ధముల
నన్నెదిర్చి, భగ్నధ్వజ రథులయి,
దిక్కులు పట్టిన దేవదానవు, ల
శక్తు, లిపుడు రిపుసంరంభమునకు.
                    ?
అందగించుకొను మాభరణంబులు
సుందరమగు నీ సుభగాంగకముల,
ధగధగలాడుచు ధన్యములగు, నవి,
నీ గాత్రము నంటిన సుకృతంబున.
                   ?
సాలంకృతమై సంపూర్ణముగా
ననిచిన నీ సౌందర్యపర్వ మీ
క్షించ నెంతో కాంక్షింతును దేవీ !
దాక్షిణ్యమున కటాక్షించుమి యిక .

                   24
చవిచూడుము భక్ష్యములు భోజ్యములు,
చెఱుకుపాలు దోసిళ్ళను త్రాగుము,
అనుభవించుము సమస్త భోగములు,
దానము చేయుము ధనమును భూములు.

క్రీడించుము నాతోడ యథేచ్చగ,
ఆజ్ఞాపించుము అధికారముతో,
ప్రియసతివై విహరింపగ నాతో
అభినందింతురు ఆప్తులు బంధులు.
                      25
చూడుమీవు మంజులగాత్రీ ! మా
మకసమృద్ధ సంపదను యశస్సును,
నారలు కట్టి వనంబుల త్రిమ్మరు
రామునితో నీకేమి కార్యమిక.
                    26
సిరిసంపదలు త్యజింపగ , జయకాం
క్షలు కడముట్టగ, కానల జటియై
కటికనేల పడకల పవళించుచు,
ఉన్నాడో లేడో అతడిప్పుడు.
                  27
ముందల కొంగలు క్రందుకొనగ, న
ల్లని మబ్బులు కప్పిన పున్నమ వె
న్నెల చందంబున నిన్ను చూడలే
డెందును రాముడు కుందసుగంధీ !
               28
నా కైవసమయిన నిను రాఘవుడు
కై కొనజాలడు క్రమ్మఱ కామిని !
మును పింద్రుని కరముల చిక్కిన హి
రణ్యకశిపుని అగణ్య కీర్తివలె.

                 29
నీ చిఱునవ్వులు, నీ పలు మొగ్గలు,
కర్ణములంటెడు కాటుక కన్నులు,
నాచికొనెను సుందరి! నా మనసును,
పాము కన్నెకను పక్షి రాజువలె.
                30
అనలంకృతవైనను, మాసి నలిగి
పోయినట్టి కౌశేయము కట్టిన
నిన్ను చూచి రమణీ ! మన సొగ్గదు
స్వకళత్రంబుల సాంగత్యమునకు.
                31
అంతఃపురి నా యనుగు చెలియలగు
కోమలాంగులకు స్వామినివై , పరి
పాలించుము, నా వైభవమ్ము స
ర్వస్వమ్మును నీ వశము కృశోదరి !
                 32
త్రిభువన రూపవతీ లలామ లెం
దఱొ, అసితాలక ! అరసి నన్ వలచి
వచ్చిరి, వారలు పరిచరింతు, ర
ప్సరసలు పరమేశ్వరి లక్ష్మినివలె.
               33
ధనదు నొడిచి తెచ్చిన ధనకనకని
ధానరత్న సంతతులను, నన్నును,
స్వీకరించి, ఆలవోక సుఖముగా
అనుభవింపుము సమస్తము సుందరి !
                 34
తపమున, బలమున, ధనవిక్రమముల,
నాతో పోలడు శాతోదరి ! నీ
రాముడు; సాటికిరాడు నాకు తే
జో యశః ప్రశస్తుల నేనిప్రియా !

                   35
తుమ్మెద గుంపులు చిమ్మి రేగ పూ
చిన తోటలలో, సింధు తీరమున,
స్వర్ణ మౌక్తి కాభరణగాత్రివయి,
నా దండను సుందరి! విహరింపుము.