శ్రీ సుందరకాండ (రాయప్రోలు సుబ్బారావు)/సర్గ 19

శ్రీ

సుందరకాండ

సర్గ 19

                  1
ఆవాలకము, అట్లువచ్చు, యౌ
వన సురూప మోహన భూషణు, రా
వణు చూచెను, నిరవద్య చరిత్ర, ప
విత్ర, రాజకుల పుత్రి, క్రీగనుల .
                  2
చూచి రావణాసురుని వైఖరిని,
భయ విభ్రాంతుల భ్రమగొని, మైథిలి,
కంపించెను సాంగముగా; ఉప్పెన
గాడుపు కొట్టిన కన్నెకదళివలె.
                 3
ఉదరంబును తొడలొత్తి మూసుకొని,
కరములతో కుచభరము కప్పుకొని,
చతికిలపడె శ్రీమతి జానకి వెత,
దిక్కుమాలి రోదించుచు బిమ్మిటి.
                 4
అపుడు రావణుడు, అసురీగణములు
కాపుండగ దుష్కర దుఃఖార్తి ని
మగ్నయై తెరలు. మైథిలి నరసెను;
మున్నీట మునుగుచున్న నావగతి.

                   5
స్వజన మెవ్వరును ప్రక్కనలేక , అ
నావృతయై, నిత్యవ్రత నిష్ఠను,
ఒంటరిగా కూర్చుండె నేలపయి;
విఱిగి పడ్డ ఫలవృక్షశాఖవలె.
                  6
నగలు పెట్టుకొన తగినవి పెట్టక,
తరుణాంగంబుల మురికి పాముకొన;
బురదపడిన తామరతీగెవలె, ప్ర
భావతియయ్యును భాసించదు సతి.
                   7
అపు డాయమ హృదయాశయములు, గు
ఱ్ఱములట్లు మనోరథమును లాగగ,
విదితాత్ముని రఘువీరుని రాముని
సన్నిధికేగుచు ఉన్నట్లాయెను.
                   8
శోకతాపమున శుష్కించియు, శ్రీ
రామ ధ్యాన పరాయణ బలమున,
అంత మగపడని అగచాట్లు పడుచు
ఒంటిగ యాతన నోర్చును జానకి.
                    9
కట్టుమంత్రమున చుట్టలు తిరిగెడి
పాముపడతివలె, ధూమకేతువు గ్ర
సింప చెన్ను మాసిన రోహిణి చం
దమున, ఆమె యందములు మఱుగుపడె.
                  10
మంచి కులమున జనించి, సదాచా
రములు వృత్తశీలములు కఱచియు,
దుష్కుల సంగతదోషంబున సం
స్కారము వలసిన కన్యక చాడ్పున.

               11
ఖిలమైన మహాకీర్తిభంగి, పా
లించని శ్రద్ధవలెన్ , క్షీణించిన
ప్రజ్ఞ చందమున, భగ్నమయిన ఇ
ష్టార్థముకైవడి అగపడె జానకి.
                12
ప్రతిరోధించిన ప్రభువు నాజ్ఞవలె,
వికలమైన భావి శుభార్ధమువలె,
కాని కాలమున కాలుదిక్కువలె,
భగ్నమయిన భగవత్పూజన్ బలె.
                13
ధ్వంసమయిన పద్మలత విధంబున,
శూరులు తెగిన చమూరంగమువలె,
నీటిధార యెండిన నది పగిదిని,
తిమిరము మ్రింగిన దివసప్రభవలె.
                14
ముగియ క్రతువు కడిగిన వేదికవలె,
చల్లారిన వైశ్వానరు శిఖవలె,
రాహువు మ్రింగిన రాకాశశితో
కన్నుల వ్రేగగు పున్నమ నిశివలె.
                15
పచ్చనిరేకులు వన్నెలు వాడగ,
తుమ్మెదలు భయముతోడ లేచిపోన్,
ఏనుగుతొండముతో విదిలించిన
తామరతూడు విధాన భిన్నయై.
               16
పతివియోగతాపమున సన్నగిలె
నీరు తీసిన వినిర్మల నదివలె,
స్నానపానములు మానగ కాంతివి
హీనమై మిగిలె కృష్ణరాత్రివలె.

                 17
మంగళాంగి సుకుమారి, రత్నగృహ
ముల నుండదగిన ముదిత, తాపమున
వడబడి సొగసె; నపుడపుడు పెరికిన
నళినీనాళము నడియెండనువలె.
                 18
చిక్కి, పట్టుబడి, చెట్టుకు కట్టగ.
గజపతి కెడమయి గహనము నడుమను;
ఉత్తలమున నిట్టూర్పులు విడుచుచు
దిగులొందిన యేనుగు రాణింబలె.
                 19
అప్రయత్నముగ ఆమె కుంతలము
లొంటి పాయజడ యోజ రాజిలెను;
మేఘము విడిచిన మేదినిపయి రం
జిల్లెడి నల్లని చెట్లచాలువలె.
                  20
భయముచేత, ఉపవాసంబులచే,
అల్పాహార ధ్యాననిష్ఠల, కృ
శించియు కనుపించెను, తపస్సులో
సన్నగిలియు, వర్చస్వినియై సతి.
                  21
అర్తయయ్యును దురంత దుఃఖమున,
భావనలో రఘువల్లభుని నిలిపి,
అంజలిపట్టి, దశాస్యుపరిభవము
ప్రార్థించెడి దేవతవలె నుండెను.
                 22
శుక్లారుణ చక్షూపక్ష్మంబులు
వాయనేడ్చు కులపత్ని , ననింద్యను,
వేధించును పాపిష్ఠి రావణుడు
కామలుబ్ధుడయి రామతన్మయిని.
27-2-1967