శ్రీ సాయిసచ్చరిత్రము /ఎనిమిదవ అధ్యాయము
←ఏడవ అధ్యాయము | 'శ్రీ సాయిసచ్చరిత్రము' (ఎనిమిదవ అధ్యాయము ) | తోమ్మిదవ అధ్యాయము → |
శ్రీ సాయిసచ్చరిత్రము రెండవ రోజూ పారాయణము శుక్రవారము ఎనిమిదవ అధ్యాయము మానవజన్మ ప్రాముఖ్యము సాయిబాబా భిక్షాటనము;బాయజాబాయి సేవ; సాయిబాబా పడక జాగా; కుశాల్‌చంద్‌పై వారి ప్రేమ మానవజన్మ యొక్క ప్రాముఖ్యము
ఈ యద్భుత విశ్వమందు భగవంతుడు కోటానుకోట్ల జీవులను సృష్టించి యున్నాడు. దేవయక్షగంధర్వాదులు, జంతుకీటకాదులు మనుష్యులు మొదలగువానిని సృష్టించెను. స్వర్గము, నరకము, భూమి, మహసముద్రము, అకాశమునందు నివసించు జీవకోటి యంతయు సృష్టించెను. వీరిలో నెవరి పుణ్యమెక్కువగునో వారు స్వర్గమునకు పోయి వారి పుణ్యఫలము ననుభవించిన పిమ్మట త్రోసి చేయబడుదురు. ఎవరి పాప మెక్కువగునో వారు నరకమునకు పోదురు. అచ్చట వారు పాపములకు తగినట్లు బాధలను పొందెదరు. పాపపుణ్యములు సమానమగునప్పుడు భుమిపై మానవులుగా జన్మించి మోక్షసాధనమునకై యవకాశము గాంచెదరు. వారి పాపపుణ్యములు నిష్ర్కమించునప్పుడు వారికి మోక్షము కలుగును. వేయేల మోక్షముగాని, పుట్టుకగాని వారువారు చేసికొనిన కర్మపై అధారపడి యుండును.
మానవశరీరము యొక్క ప్రత్యేక విలువ
జీవకోటి యంతటికి అహరము, నిద్ర, భయము, సంభోగము సామాన్యము. మానవునికివిగాక మరొక్క ప్రజ్ఞ గలదు. అదియే జ్ఞానము. దీని సహయముననే మానవుడు భగవత్ సాక్షాత్కారమును పొందగలడు. ఇంకే జన్మయందును దీని కవకాశము లేదు. ఈ కారణముచేతనే దేవతలు సైతము మానవజన్మను ఈర్ష్యతో చూచెదరు. వారు కూడ భూమిపై మానవజన్మమైతి మోక్షమును సాధించవలెనని కోరెదరు.
కొంతమంది మానవజన్మము చాల నీచమైనదనియు; చీము, రక్తము మలములతో నిండియుండు ననియు, తుదకు శిథిలమై రోగమునకు మరణమునకు కారణమగుననియునందురు. కొంతవర కదికూడ నిజమే. ఇన్ని లో పములుఉన్నప్పటికి మానవునకు జ్ఞానము సంపాదించు శక్తి కలదు. శరీరముండుట చేతనే మానవుడు తన దేహము యెక్క, జగత్తు యొక్క అనిత్యత్వమును గ్రహించి, ఇంద్రియముసుఖముల పట్ల విరక్తి పొంది, నిత్యానిత్యవివేకముతో కడకు భగవత్సాక్షాత్కారము బొందుచున్నాడు. శరీరము మలభూయిష్టమైనదని నిరాకరించినచో మోక్షమును సంపాదించు అవకాశమును పోగొట్టుకొనెదము, దేహమును ముద్దుగా పెంచి విషయసుఖములకు మరిగినచో నరకమున బడెదము. ఊచితమార్గమేమన, దేహము నశ్రద్ధ చేయకూడదు; దానిని లోలత్వముతో పోషింపనూగూడదు. తగు జాగ్రత్త మాత్రమే తీసికొనవలెను. గుఱ్ఱపురౌతు తన గమ్యస్థానము చేరువరకు గుఱ్ఱమును ఎంత జాత్రత్తతో చూచుకొనునో యంతజాగ్రత్త మాత్రమే తీసికొనవలెను. ఈ శరీరమును మోక్షసాధన, లేక యాత్మసాక్షాత్కరము కొరకు వినియోగించవలెను. ఇదియే జీవుని పరమావధియై యుండవలెను.
భగవంతు డనేకజీవులను సృష్టించినప్పటికి అతనికి సంతుష్టీ కలుగలేదట. ఎందుకనగా భగవంతుని శక్తిని యవేవియు గ్రహించలేక పోయినవి. అందుచేత భగవంతుడు ప్రత్యేకముగా మనవుని సృష్టించెను. వానికి జ్ఞానమనే ప్రత్యేక శక్తి నిచ్చెను. మానవుడు భగవంతుని లీలలను, అద్భుతకార్యములను, శేముషివిజ్ఞానములను జూచి పరవశమొందినప్పుడు భగవంతుడు మిక్కిలి సంతుష్టిజెంది యానందించును. అందుచే మానవజన్మ లభించుట గొప్ప యదృష్టము. బ్రాహ్మణజన్మ పొందుట అందులోను శ్రేష్టము. అన్నిటికంటె గొప్పది సాయిబాబా చరణారవిందములపై సర్వస్యశరణాగతి చేయునవకాశము కలుగుట.
మానవుని విద్యుక్త ధర్శము
మానవజన్మ విలువైనదనియు, దానికెప్పటికైననూ మరణము అనివార్యమనియు గ్రహించి మానవుడెల్లప్పుడు జాగరుకుడై యుండి జీవిత పరమావధిని సాధించుటకై యత్నించవలయును. ఏ మాత్రమును అశ్రద్దకాని, ఆలస్యముగాని చేయరాదు. త్వరలో దానిని సంపాదించుటకు యత్నించవలెను. భార్య చనిపోయిన వాడు రెండవ భార్య కొఱకెంత అతురపడునో, తప్పిపోయిన యువరాజుకై చక్రవర్తి యెంతగా వెదకయత్నించునో యటులనే, విసుగు విరామములేక రాత్రింబవళ్ళు కృషి చేసి యాత్మసాక్షాత్కారమును సంపాదించవలెను. బద్దకమును, అలసతను, కునుకుపాట్లను దూరమొనర్చి అహోరాత్రములు అత్మయందే ధ్యానము నిలుపవలెను. ఈ మాత్రము చేయలేనిచో మనము పశుప్రాయుల మగుదుము.
తక్షణ కర్తవ్యము
మన ధ్యేయము సత్వరము ఫలించు మార్గమేదన, వెంటనే భగవత్సాక్షాత్కారము పొందిన సద్గురువు వద్దకేగుట. అధ్యాత్మికోపన్యాసములెన్ని వినినప్పటికి పొందనట్టిదియు, అధ్యాత్మికగ్రంథములెన్ని చదివినను తెలియనట్టిదియునగు అత్మసాక్షాత్కారము సద్గురువుల సాంత్యముచే నులభముగా పొందవచ్చును. నక్షాత్రములన్నియు కలసి యివ్వలేని వెలుతురును నూర్యుడెట్లు ఇవ్వగలుగుచున్నడో యట్లనే అధ్యాత్మికోపన్యాసములు, గ్రంథములు ఇవ్వలేని జ్ఞానము సద్గురువు విప్పి చెప్పగలడు. వారి చర్యలు, సామాన్య సంభాషణలే మనకు మౌనప్రబోధములు. శాంతి, క్షమ, వైరాగ్యము, దానము, ధర్మము, మనోదేహములను స్వాదీన మందుంచుకొనుట, అహంకారము లేకుండుట మొదలగు శుభలక్షణములను -వారి అచరణలో చూచి, భక్తులు నేర్చుకొందురు. వారి పావనచరితములు భక్తుల మనములకు ప్రబోధము కలుగజేసి వారిని పారమార్ధికముగా ఉద్దరించును. సాయిబాబా యట్టి మహపురుషుడు సద్గురువు.
బాబా సామాన్య ఫకీరువలె సంచరించుచున్నప్పటికి వారెప్పుడు అత్మానుసంధానము నందే నిమగ్నులగుచుండిరి. దైవభక్తిగల పవిత్ర హృదయములు వారికి సదా ప్రీతిపాత్రులు. వారు సుఖములకు ఉప్పొంగువారు కారు, కష్టముల వలన క్రుంగిపోవువారు కారు. రాజైననూ, నిరుపేదైననూ వారికి సమానమే. తమద్రష్టి మాత్రమున ముష్టివానిని చక్రవర్తిని చేయగలశక్తి యున్నప్పటికి బాబా ఇంటింటికి తిరిగి భిక్ష నెత్తెడివారు! వారి భిక్ష యెట్టిదో చూతము.
బాబా యొక్క భిక్షాటనము
శిరిడీజనులు పుణ్యాత్ములు. ఎందుకనగా, వారి యిండ్ల యెదుటనేగదా బాబా భిక్షుకునివలె నిలచి ’అమ్మా! రొట్టెముక్క పెట్టు" డనుచు, దానిని అందుకొనుటకు చేయి చాచెడివారు! చేత ఒక రేకుడబ్బా పట్టుకొని, భుజానికి ఒక గుడ్డజోలె తగిలించుకొని భిక్షాటనకు పోయెడివారు. బాబా కొన్ని యిండ్లకు మాత్రమే భిక్షకు పోయెడివారు. పులుసు, మజ్జిగ వంటి ద్రవ పదార్దములు, కూరలు మొదలగునవి రేకుడబ్బాలో పోసికొనెడివారు. బాబాకు రుచి యనునది లేదు. వారు జిహ్వను స్వాధీనమందుంచుకొనిరి. కాన అన్ని పదార్ధములను రేకు డబ్బాలోను, జోలెలోను వేసికొనెడివారు. అన్ని పద్దారదములను ఒకేసారి కలిపివేది భుజించి సంతుష్టిచెందేవారు. పదార్దముల రుచిని పాటించేవారుకాదు. వారి నాలుకకు రుచి యనునది లేనట్లే కాన్పించుచుండెను. బాబా భిక్షకు యొక పద్దతి, కాలనియమము లేకుండేను. ఒక్కొక్కదినము కొన్ని యిండ్లవద్ద మాత్రమే భిక్షచేసెడివారు. ఒక్కొక్కసారి 12సార్లు కూడ భిక్షకువెళ్ళెడివారు. భిక్షలో దొరికిన పదార్దముల నన్నింటిని ఒక ప్రాతలో వేసేవారు. దానిని కుక్కలు, పిల్లులు, కాకులు విచ్చలవిడిగా తినుచుండెడివి. వాటిని తరుమే వారుకారు. మసీదు తుడిచి శుభ్రము చేయు స్త్రీ 10-12 రోట్టెముక్కలను నిరాటంకముగా తీసికొనుచుండెడిది. కుక్కలు, పిల్లులనుగూడ కలలో సైతము అడ్డు పెట్టనివారు, అకలితోనున్న పేదల అహరమునకు అడ్డుచెప్పుదురా? "ఫకీరు పదవియే నిజమైన మహరాజపదవియనీ, అదియే శాశ్వతమనీ, మామూలు సిరిసంపదలు క్షణభంగురాలనీ:, బాబా యను చుండెడివారు. అ పావనచరితుని జీవితము వంటి జీవితమేగదా మిగుల ధన్యమైనది!
మొదటి శిరిడీ ప్రజలు బాబానొక పిచ్చిఫకీరని భావించి, అటులనే పిలిచెడివారు. భోజనోపాధికై రోట్టెముక్కలకై గ్రామములో భిక్షనెత్తి పొట్టపోసికొనెడు పేదఫకీరన్న ఎవరికి గౌరవ మేమియుం డును? కాని యీ ఫకీరు పరమవిశాలహృదయుడు, ఉదారుడు, ధనాపేక్ష లేశమాత్రము లేని నిరాసక్తుడు. బాహ్యదృష్టికి వారు చంచలునిగును. స్థిరత్వము లేనివారుగను గాన్పించినను, లోన వారు స్థిరచిత్తులు. వారి చర్యలు అంతుబట్టనివి. అ కుగ్రామములో కూడ బాబాను ఒక గొప్ప మహత్మునిగ గుర్తించి, సేవించిన ధన్యజీవులు కొద్దిమంది గలరు. అట్టివారిలో నొకరి వృత్తాంతమిక్కడ చెప్పబోవుచున్నాను.
బాయాజాబాయి యొక్క ఎనలేని సేవ
తాత్యాకోతే పాటీలు తల్లి పేరు బాయజాబాయి. అమె ప్రతిరోజు మధ్యాహ్నము తలపై ఒక గంపలో రొట్టె కూర పెట్టుకొని, సమీపముననున్న చిట్టడవిలో ముండ్లు పొదలు లెక్కచేయక క్రోసుములకొద్ది దూరమునడిచి, అత్మధ్యానములో నిశ్చలముగ యెక్కడో కూర్చునియున్న బాబాను వెదకి పట్టుకొని, భోజనము పెట్టుచుండెను. బాబాకు సాష్టాంగనమస్కారముచేసి, వారి యెదుట విస్తరొకటి వేసి తాను తెచ్చిన రొట్టె కూర మొదలగు భోజన పదార్ధములను వడ్డించి, కొసరికొసరి వాటిని బాబాచే తినిపించుచుండెను. అమె భక్తివిశ్వాసములు అద్భుతమైనవి. ఎనలేని అమె సేవను బాబా చివరి వరకు మరువలేదు. అమె సేవకు తగినట్లు అమె పుత్రుడగు తాత్యాపాటిలును యెంతో అదరించి ఉద్దరించెను. అ తల్లి కొడుకులకు బాబా సాక్షత్ భవంతుడనే విశ్వాసముండెను. కొన్ని సంవత్సరముల తదుపరి బాబా యడవులకు బోవుట మాని మసీదులోనే కూర్చుండి భోజనము చేయసాగిరి. అప్పటినుంచి పొలములో తిరిగి బాబా వెతకిపట్టుకొను శ్రమ బాయిజాబాయికి తప్పినది.
ముగ్గురి పడక స్థలము
ఎవరి హృదయమందు సదా వాసుదేవుడు వసించుచుండునో అట్టి మహత్ములు ధన్యులు; అట్టి మహత్ముల సాంగత్యము లభించిన భక్తులు గొప్ప యదృష్టవంతులు. తాత్యాకోతే పాటీలు, మహల్సాపతి ఇద్దరు అట్టి అదృష్టశాలురు. బాబా వారిరువురిని సమానముగా ప్రేమించెడివారు. బాబా వీరిరువురితో కలసి, మసీదులో తమ తలలను తూర్పు, పడమర, ఉత్తరముల వైపు చేసి, మధ్యలో ఒకరి కాళ్ళు ఒకరికి తగులునట్లు పండుకొనెడివారు. ప్రక్కలు పరచుకొని, వానిపై చతికిలపడి సగము రేయివరకు ఏవేవో సంగతులు ముచ్చటించుకొనెడివారు. అందులో నెవరికైన నిద్రవచ్చుచున్నటుల గాన్పించిన తక్కిన వారి వారిని మేల్గొలుపుచుండిరి. తాత్యా పండుగొని గుఱ్ఱుపెట్టినచో బాబా వానిని యటునిటు ఊపి, వాని శిరస్సును గట్టిగా నొక్కుచుండెను. బాబా ఒక్కొకసారి మహల్సాపతిని అక్కునజేర్చుకొని, అతని కాళ్ళూ నొక్కి వీపు తోమెడివారు. ఈ విధముగ 14 సంవత్సరములు తాత్యా తన తల్లిదండ్రులను విడచి బాబాపై ప్రేమచే మసీదులోనే పండుకొనెను. అవి మరుపురాని మధురదినములు. బాబా ప్రేమనురాగములు కొలువరానివి; వారి అనుగ్రహము ఇంతయని చెప్పుటకు అలవికానిది. తండ్రి మరణించిన పిమ్మట తాత్యా గృహబాధ్యతను స్వీకరించి ఇంటిలోనే నిద్రించుటకు ప్రారంభించెను.
రహతా నివాసి కుశాల్‌చంద్
శిరిడీ (తాత్యా తండ్రిగారైన) గణపతిరావుకోతేపాటీలును బాబా ఎంత ప్రేమాభిమానములతో జూచెడివారో, అంతటి ప్రేమాదరములతోనే రహతా నివాసియగు చంద్రభాను శేట్ మార్వాడీని జూచుచుండిరి. అ శేట మరణించిన పిమ్మట అతని యన్న కొడుకగు కుశాల్‌చందును గూడ మిక్కిలి ప్రేమతో జూచుచు అహర్నిశలు వాని యోగక్షేమమరయుచుండిరి. ఒక్కొక్కప్పుడు టాంగాలోను, మరొక్కప్పుడెద్దులబండి మీదను బాబా తన సన్నిహిత భక్తులతో కలసి రహతా పోవువారు. రహతా ప్రజలు బాజాభజంత్రీలతో యెదురేగి, బాబాను గ్రామసరిహద్దు ద్వారము వద్ద దర్శించి, సాష్టాంగనమస్కారములు చేసెడివారు. తరువాత మహ వైభవముగా బాబాను గ్రామములోనికి సాదరముగ తీసికొని వెళ్ళెడివారు. కుశాల్‌చంద బాబాను తన యింటికి తీసికొనిపొయి తగిన యాసనమునందు కూర్చుండజేసి భోజనము పెట్టెడివాడు. ఇరువురు కొంతసేపు ప్రేమోల్లాసముతో ముచ్చటించుకొనెడివారు. తదుపరి బాబా వారిని అశీర్వదించి శిరిడీ చేరుచుండెడివారు.
శిరిడీ గ్రామమునకు సమాన దూరములో ఒకవైపు (దక్షిణమున) రహతా, మరోవైపు (ఉత్తరదిశయందు) నీమ్‌గాం ఉన్నవి. ఈ రెండు గ్రామములు దాటి బాబ యెన్నడు ఎచ్చటికి పోయి యుండలేదు. వారెన్నడూ రైలుబండిని కనీసము చూచికూడ యుండలేదు. కాని సర్వజ్ఞుడైన బాబాకు బండ్ల రాకపోకలు ఖచ్చితముగ తెలియుచుండెడివి. బాబా వద్ద సెలవు పుచ్చుకొని వారి యాజ్ఞానుసారము ప్రయాణము చేయువారల కేకష్టములుండెడివి కావు. బాబా యాదేశమునకు వ్యతిరేకముగా పోవువారనేకకష్టముల పాలగుచుండిరి. అటువంటి కొన్ని సంఘటనలను, మరికొన్ని ఇతరవిషయములను రాబోవు యధ్యాయములో చెప్పెదను. శ్రీ సాయినాథాయ నమః ఎనిమిదవ అధ్యాయము సంపూర్ణము
సమర్ద సద్గురు శ్రీసాయినాథార్పణమస్తు శుభం భవతు